వాగ్ధాన దేశములనుండి దృశ్యములు
బైబిలు సంఘటనల కేంద్రము యెరూషలేము
చాలా దేశములు ప్రభుత్వ సాధనమునకు నిలయమైన ఒక పెద్ద పట్టణమును ఒక రాజధానిగ కలిగియున్నను, బైబిలు విద్యార్థులు యెరూషలేమును మానవాళికి రాజధానిగ తలంచుదురు. ఇది ఎందుకనగా, అక్కడ జరిగిన గగుర్పాటు సంఘటనలు మనందరికి చాల ప్రాముఖ్యమైనవి.
యెరూషలేమునకు దక్షిణమున ఎత్తైన నేలపై నిలబడి నీవు చూడగలుగు దృశ్యమును, పైన నీవు చూడగలుగు చున్నావు.a నల్లని పచ్చని చెట్లున్న ప్రాంతము వద్ద రెండు లోయలు కలియుచున్నవి. కుడివైపునుండి కిద్రోను లోయ క్రిందికి వచ్చుచున్నది. పడమర అనగా ఎడమవైపు హిన్నోము లోయ ఉన్నది. ఇదే గిహెన్నా అను బైబిలు నామమునకు దారితీసినది. (మత్తయి 10:28; 23:23) మధ్యలో (ఇప్పుడున్న గోడల ముందున్న ఎండభాగము) ప్రాచీన దావీదు పట్టణము నిర్మించబడెను. గోడల లోపల చరిత్రాత్మక స్థలముపై రెండు ప్రత్యేక ముస్లిం భవనములున్నవి. గోడకు సమీపమున తెల్లని నీల కాంత వర్ణముగల బురుజు ఆకారములో మసీదున్నది. దాని వెనుక గోళాకారములో చాల పెద్దదైన సువర్ణరాతి బురుజు ఉన్నది.
కాని యెరూషలేము, మరి ముఖ్యముగా చదును భూమిపై బురుజుకారమున ఇప్పుడున్న ఆ రెండు కట్టడములు మీకెందుకు ప్రాముఖ్యమైయున్నవి? ఆలాగే, చెట్టు పొదలో కొమ్ములు తగులు కొనియున్న పొట్టెలు చిత్రము నీ మనస్సునకు ఏ బైబిలు కధనమును జ్ఞప్తికి తెచ్చుచున్నది?
అబ్రాహామును గూర్చినది కావచ్చును. అవును, అతడే తన కుమారుడగు ఇస్సాకుతో మోరియా కొండకు అనగా నీవు చూచుచున్న ఆ రెండు బురుజుల సమీపమున నున్న రాతి ప్రదేశమునకు ప్రయాణమై వెళ్లెనని స్పష్టమగుచున్నది. తాను మిక్కిలిగా ప్రేమించిన కుమారుని బలియర్పించుటకు విశ్వాసముతో అబ్రాహాము ఇష్టపడుచుండెను. కాని ఒక దూత అతని చేతినాపెను. అప్పుడు అబ్రాహాము “ఒక పొదలో కొమ్ములు చిక్కుకు పోయిన పోట్టెలును చూచి” “తన కుమారునికి బదులుగ” దానిని బలి యిచ్చెను. కావున యెరూషలేమును చూచుట ఈ నాటకీయ సంఘటన జ్ఞప్తికి తెచ్చును. ఆదికాండము 22:1-13. ఇప్పుడున్న బురుజు కట్టడము లెక్కడున్నవో, ఆ చదును ప్రదేశములో సొలొమోను గొప్ప దేవాలయమును యెహోవాకు నిర్మించినప్పుడు మిగిలిన బలులు ముందుకు వచ్చెను. (2 దిన. 3:1) దేశము నలుమూలల నుండి ఇశ్రాయేలీయులీ ప్రాంతమునకు తమ జంతుబలులతో సాంవత్సర పండుగలకు వచ్చుటను ఊహించుకొనుము. వీటిలో మిక్కిలి పరిశుద్ధమైనది “ప్రాయశ్చిత్తదినము” ఆ దినమున ఒక మేకను ఎన్నుకొని, ఎడారిలోనికి పాపములను మోసికొని పోవునట్లు (అజుజెల్) అది విడువవబడెడిది. ఇది బహుశ కిద్రోను లోయలో నుండి, తదుపరి నైరృతి దిశనగల యూదా ఎడారి కావచ్చును. వేరొక మేకను, కోడెను వధించి యాజకుల యొక్కయు, ప్రజల యొక్కయు పాపపరిహారార్ధము వాటి రక్తము నుపయోగించెడివారు. దేవాలయమునకు తెరవెనుకగల అతి పరిశుద్ధ స్థలములోనికి కూడ కొంత రక్తము తీసికొని పోబడెడిది. దానిని మనసు నందుంచుకుని పట్టణ చిత్రమును చూడవచ్చును.—లేవీ. 16:1-34.
యెరూషలేములోని యీ బలులన్ని యేసు క్రీస్తు పరిపూర్ణ బలిని సూచించెడివి. భూమిపై ఆయన చివరి రాత్రి, పున్నమి రాత్రి చివరి పస్కాను ఆచరించుటకు యేసు తన ఆపొస్తలులతో సమకూడెను. ఇది దేవాలయమునకు ఎడమవైపు (పడమర)న ఎత్తుగావున్న పట్టణ ప్రాంతములో ఉన్నట్లు భావించబడుచున్న ఒక మేడగది. ప్రభు రాత్రి భోజనము నాచరించిన పిదప దేవాలయమునకు తూర్పు (కుడివైపు)న గల కిద్రోను లోయకు అడ్డముగా నున్న ఒలీవ కొండకు యేసు తన అపొస్తులలతో వెళ్లెను.—లూకా 22:14-39.
దీనినూహించుకొనుట కాధారముగా, క్రిందనున్న చిత్రమును చూడుము. యెరూషలేములో తూర్పువైపు తిరిగి బహుశ యేసు ప్రభు రాత్రి భోజనమునాచరించిన ప్రదేశము నుండి తీసిన చిత్రమిది. ఈ గ్రహింపుతో క్రింది ఎడమవైపున దేవాలయపు కొండ ప్రాంతముపై నున్న బురుజాకారపు (పున్నమి వెన్నెల నీలపుభాగము) మసీదును చూడుము దానికి చాల తూర్పున కిద్రోను లోయ (కనుపించుచున్న గీత క్రింద) తర్వాత గెత్నెమను తోట చెట్లు ఉన్నవి. కుడివైపు పైభాగమున బలీవ కొండ ఉన్నది.
1990, ఏప్రిల్ 10వ తేది, పున్నమి రోజు ప్రపంచములోని యెహోవాసాక్షుల సంఘములన్ని (సూర్యాస్తమయము తదుపరి) సమకూడుదురు. యేసు యొక్క పాపపరిహారార్ధ మరణమును ప్రచురము చేయుటకై ప్రభు రాత్రి భోజనము ఆచరించుటకు సమకూడుదురు.b దయచేసి అక్కడ ఉండుటకు ప్రయత్నించుము. ఆ రోజు నీవును, యేసు తన ఆత్మను మరణమున ధారపోసిన సందర్భములో యెరూషలేము కేంద్రముగా దాని చుట్టు జరిగిన కొన్ని పాత సంఘటనలను ధ్యానించవచ్చును. అట్లు యేసు యెహోవా నీతిని ఘనపరచి విశ్వసించు మానవులకు పాపమరణముల నుండి విమోచన దయచేసెను.—1 కొరిం. 11:23-26; హెబ్రీ. 9:11-28.
[అధస్సూచీలు]
a దీని పెద్ద సైజు చిత్రము యెహోవాసాక్షుల 1989 క్యాలండరు నందు ఉన్నది.
b ప్రభురాత్రి భోజనము నాచరించు సమయమున లెక్కించుటకు కావలసిన మరిన్ని వివరములకొరకు ది వాచ్‌టవర్, 1977 జూన్ 15, పుట. 383ను చూడుము.
[26వ పేజీలోని చిత్రసౌజన్యం]
Pictorial Archive (Near Eastern History) Est.
Pictorial Archive (Near Eastern History) Est.