నూతనలోకమగు పరదైసు తిరిగి సంపాదించబడింది!
క్రొత్తగా పెళ్లయిన దంపతులకు చాలాఅందమైన గృహమొకటి ఉన్నది—ఒక పెద్దతోట దానినిండా పువ్వులు చెట్లు, పక్షులు, మరియు జంతువులు ఉన్నవి. అది ఒక పరదైసు, తమప్రేమగల తండ్రినుండి పొందిన ఒక బహుమతి! “అటుపిమ్మట వారు సంతోషంగా జీవించ”గల్గిరా? లేదు. ఎంతోకాలం గడవకముందే వారుతమ యింటిని పోగొట్టుకొన్నారు. కాని ఎందుకు?
తమ తండ్రి తమకొరకు చేసినవాటిని ఆ దంపతులు మెచ్చుకొనకపోయినందున ఆ పరదైసు గృహమును కోల్పోయారు. అంతకంటె నీచంగా వారు అవిధేయులై పోయారు. వారి యథార్థతను పరీక్షించుటకు, తమతండ్రి ఒక్కదానిని తప్ప తోటలోని ప్రతి ఒక్కచెట్టు ఫలమును వారు తినవచ్చునని వారికి చెప్పాడు, కానివారు తిరుగుబాటు ధోరణిలో అవిధేయులై దానిని తిన్నారు.—ఆదికాండము 2:15-17; 3:6, 7.
అతిచిన్న నేరంగా కన్పించుచున్నదానికి ఎందుకంతటి శిక్ష? ఆ ప్రశ్నకు సమాధానమిచ్చుటకు బహుశ ఒక ఉపమానము తోడ్పడవచ్చు. అవసరమైన అధికారములన్నింటిని యిచ్చి ఒక షాపుయజమాని ఒక మేనేజరును పెట్టుకున్నాడు. ఈ క్రొత్త ఉద్యోగి నమ్మతగినవాడా కాదా అని తెలిసికొనుటకు యజమాని తాళపుచెవులను అతనికిచ్చి ఒక ప్రత్యేకసొరుగును ఎట్టిపరిస్థితిలోను తీయకూడదని చెప్పాడు. ఆ ఉద్యోగి గనుక దానినితీస్తే తొలగించబడుతాడు. స్వబుద్ధితో, పరిశోధించాలనే తపన అతనిలో కల్గి ఆ సొరుగును తెరుస్తాడు. ఆ యజమాని అతడు ఆ పనిచేస్తున్నప్పుడు పట్టుకొని ఉద్యోగమునుండి తొలగిస్తాడు.
పరదైసు కోల్పోబడింది
ఆయౌవన దంపతులకు ఇది ఎలా వర్తించగలదు? నిషేధించబడిన పండును తిన్నారు కనుక, వారితండ్రి తమ అందమైన గృహమునుండి వారిని వెళ్ళగొట్టాడు. ఆ వివాహిత దంపతులైన ఆదాము హవ్వకు పరదైసుయైన ఏదెను వెలుపల ముండ్లతుప్పలు ఎదురైనాయి. పరిపూర్ణులుగా ఉండుటకు బదులు వారిప్పుడు అపరిపూర్ణులైరి. నిరంతరం జీవించియుండే బదులు ఇప్పుడు చనిపోవుటకు ప్రారంభించారు. వారి అపరిపూర్ణతను, పాపమును, మరణమును, తమపిల్లలు స్వాస్థ్యముగా పొందారు.—రోమా. 5:12.
తుదకు, “నరుని చెడుతనము బహుగొప్పదాయెనని యెహోవా చూచెను.” అందుచేత, భూమిని శుభ్రపరచుటకు దేవుడు నోవహు దినములలో జలప్రళయమును ఉపయోగించెను. తప్పించుకొన్న మానవులెవరైనా ఉన్నారా? కేవలం ఎనిమిది మందే—నోవహు అతని ముగ్గురు కుమారులు తమ నల్గురు భార్యలు. వేరొక లోకమునకు పయనముసాగించుటకు సిద్ధపడుచున్నారన్నట్లుగా, వారు దేవుని ఉపదేశములకు లోబడి, తమ్మును, అనేకరకములైన జంతువులను, సమృద్ధియైన ఆహారమును మోయగల్గేంత పెద్ద ఓడను నిర్మించారు. (ఆదికాండము 6:5-7, 13-22) ఆదాము హవ్వ ఒకానొకప్పుడు అనుభవించిన తోట జలప్రళయముచే తుడిచి పెట్టబడింది. ఆవిధంగా పరదైసు కోల్పోబడింది—కాని శాశ్వతంగా కాదు!
పరదైసు తిరిగి సంపాదించబడింది
శతాబ్దముల తరువాత, మానవులను పాపమరణములనుండి విమోచించుటకు దేవుడు తన ఏకైక కుమారుని భూమిమీదకు పంపెను. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసముంచెదరో వారంతా నిత్యజీవము పొందుటకు యిది సాధ్యపరచింది. (యోహాను 3:16) పరదైసు తిరిగి సంపాదించబడునని యేసుకూడా ప్రవచించెను. నిజమే, హింసాకొయ్యపై యేసు మరణించుచుండగా, తనప్రక్కన వ్రేలాడదీయబడిన నేరస్థునితో ఆయన యిలా అనెను: “నీవు నాతో కూడ పరదైసులో ఉందువు.”—లూకా 23:43.
“నీ రాకడకును ఈ యుగసమాప్తికిని సూచనలేమిటి?” అని యేసు శిష్యులు అడిగినప్పుడు ఆయన ప్రవచించిన లోకాంతము వచ్చిన తరువాత పరదైసు తిరిగి సంపాదించబడడం జరుగుతుంది. దానికి సమాధానమిస్తూ, యుద్ధములు, కరవులు, భూకంపములు, తెగుళ్లు, అక్రమము విస్తరించుట, మరియు ప్రపంచవ్యాప్తముగా రాజ్యప్రచార దండయాత్ర జరుగునని యేసు సూచించెను. ఇవి మరి యితర సూచన భాగములన్నియు 1914 నుండి సాక్ష్యాధారముగా కన్పించుచున్నవి. (మత్తయి 24:3-14) అవన్నియు ఈ యుగ సమాప్తికిని భూమిమీద పరదైసు పునరుద్ధరణకును పురో సూచకములు.
అదేప్రవచనములో, యేసు యిలా చెప్పెను: “అంజూరపు చెట్టునుచూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి: అంజూరపు కొమ్మ లేతదై చిగిరించునప్పుడు వసంతకాలము యింక సమీపముగా ఉన్నదని మీకు తెలియును. ఆ ప్రకారమే మీరీసంగతులన్నియు జరుగుట చూచునప్పుడు ఆయన సమీపముననే, ద్వారము దగ్గరనేయున్నాడని తెలిసికొనుడి. ఇవన్నియు జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను.” (మత్తయి 24:32-35.) పరదైసు తిరిగి సంపాదించబడటం లేక పునరుద్ధరించడం చాలా సమీపంగా ఉందని, ఒక నూతనలోకము కనుచూపుమేరలో ఉన్నట్లుకూడ సూచించుచున్నవి. అయితే అది ఎలా ఉంటుంది?
నూతనలోకం నిజంగా—భిన్నమైంది!
ప్రస్తుత ప్రభుత్వముల స్థానే దేవుని రాజ్యముండును. (దానియేలు 2:44) “సమాధానకర్తయగు అధిపతి”యైన యేసుక్రీస్తు రాజ్యపాలనక్రింద నూతనలోకంలో ఉండువారందరికి న్యాయము, శాశ్వతసమాధానము ఉంటుంది. (యెషయా 9:6, 7) ప్రస్తుతము మానవులను పీడిస్తున్న దుష్టులను, అవినీతికర శక్తులను ఆయన నాశనముచేయును గనుక కేవలము సమాధానమును ప్రేమించు “లోపములేనివారు” మాత్రమే నిలిచియుంటారు. (సామెతలు 2:21, 22; ప్రకటన 19:11-21; 16:14-16) అవును, దీనులు సమాధానమును ప్రేమించు ప్రజలే తప్పించుకొంటారు. అది ఎంత ఉపశమనకరమైంది!
నూతనలోకంలో జాతి మరి యితర విధములైన ద్వేషభావములు అదృశ్యమై పోవును. వాస్తవానికి, అట్టివాటిని జయించిన ఒక పెద్దసమూహము యిప్పటికే కొనసాగుచున్నది. వారెవరు?యెహోవాసాక్షులు. వాళ్ళెందుకంత ప్రత్యేకంగా ఉన్నారు? ఎందుకంటె వాళ్ళు బైబిలును పరిశీలనగా పఠించి జీవితములో దానిని అన్వయించిరి, మరియు వారిమధ్య ప్రేమను కల్గియున్నారు. (యోహాను 13:34, 35; అపొ.కార్యములు 10:34, 35) ప్రపంచవ్యాప్తముగా నేడు ఈ సాక్షులు లక్షలలో ఉన్నారు, కాని భూమిపై యెహోవాను ఆరాధించువారు “ప్రతి దేశము, జాతి, గోత్రము, మరియుభాషలలో నుండి లెక్కించుటకు అసాధ్యమైన గొప్పసంఖ్యలో” ఉంటారని బైబిలు ప్రవచిస్తున్నది.—ప్రకటన 7:9. జెరుసలేము బైబిల్.
యుద్ధము మానవ ప్రాణాలను మరెన్నటికి బలిగొనదు. పరమాణు ఆయుధాలు, మరియితర యుద్ధపరికరాలు, మిలిటరీ దళములపై కోట్లను ఖర్చుచేయవలసిన పని ఉండదు. తిరుగు బాట్లు, కులపోరాటములు, యితరవిధములైన హింసాకాండ యిక ఉండదు. (యెషయా 2:4) సైనికశిక్షణ, సిపాయిలను చేర్చుకొనడం యిక అనవసరం కనుక తీసివేయబడుతుంది. యుద్ధాలను దేవుడు అంతంచేసినప్పుడు అది ఎంత శుభదినం!—కీర్తన 46:8, 9.
నిజమైన శాంతి నిలిచి యుండును. కీర్తనలరచయిత యిలా అన్నాడు “ఇకకొంతకాలమునకు భక్తిహీనులు లేకపోవుదురు. . . .కాని దీనులు భూమిని స్వతంత్రించుకొందురు బహు సమృద్ధియైన శాంతిని అనుభవిస్తు సుఖంగా జీవిస్తారు.”—కీర్తన 37:10, 11, N.W.
ఆహారకొరతకు బదులు సమృద్ధియైన ఆహారముండును. అనేక ప్రదేశములలో పేదరైతులు, ముండ్లతుప్పలు, పొదలతోను, చౌడుభూమి, వ్యాపిస్తున్న ఎడారులు, అనావృష్టి, నాశనముచేస్తున్న మిడతల దాడులతో పోరాడుచున్నారు. ఇదంతా పూర్తిగా మార్చి వేయబడుతుంది. (యెషయా 35:1, 6, 7) ఫలితం? ఉత్పత్తిలో ఎంత వృద్ధి! (కీర్తన 72:16) ఆహారపానీయాల కొరతను నివృత్తిచేయుటకు యెహోవా “విందు” ఏర్పాటుచేయును!—యెషయా 25:6.
ప్రతిఫలాత్మకమైన పనిని అందరు అనుభవిస్తారు. గృహములను నిర్మించడం, పండ్లచెట్లను నాటడం, తోటలనుకాపాడడం ఎంత సంతృప్తికరం! మీసొంత అంజూరపు చెట్టు నీడలో కూర్చుండి దాని మధురమైన పండ్లను తినుట ఎంత ఉల్లాసంగా ఉంటుంది!—మీకా 4:4.
శ్రేష్ఠమైన ఇండ్లు ప్రతి ఒక్కరికి ఇవ్వబడతాయి. లక్షలాది మంది నేడు మురికి వాడలలోను లేక క్రిక్కిరిసిన పట్టణాలలోను నివసిస్తున్నారు. ఎంతటి అసంతోషమైన జీవితం! ఉదాహరణకు లక్షలాది నల్లజాతి ప్రజలు గ్రామాలను విడిచిపోతున్నారు, కాని వారు తరచు మట్టితో నిర్మించి యినుపరేకులతో కప్పబడిన గృహాలలో ఏ కొద్దిపాటి మరుగును కల్గి అనారోగ్యకర పరిసరములందు జీవిస్తున్నారు. అయితే, నూతన లోకములో మాత్రము ప్రజలు మంచి ఇండ్లుకట్టుకొని దానిలో కాపురముంటారు.—యెషయా 65:21, 22.
అనారోగ్యము ప్రాణాంతకవైన ఎయిడ్స్‌స్థానే సంపూర్ణ ఆరోగ్యమువృద్ధియగును. “నేను రోగినని” ఎవ్వరు చెప్పరని ప్రేరేపిత ప్రవక్తతెల్పెను. అంతేకాక, సమీపంగా ఉన్న నూతనలోకములో, “గ్రుడ్డివారి కన్నులు తెరువబడును, చెవిటివారి చెవులు విప్పబడును. కుంటివాడు దుప్పివలె గంతులు వేయును మూగవాని నాలుక పాడును అరణ్యములో నీళ్లు ఉబుకును.”—యెషయా 33:24; 35:5, 6
మరణము, కన్నీళ్లు, అంత్యక్రియలు అదృశ్యమగును. (ప్రకటన 21:4) అయితే యిప్పటికే చనిపోయిన కోట్లమంది సంగతేమిటి? భూమిమీద మానవునిగా ఉన్నప్పుడు, యేసు అనేకులను పునరుత్థానముచేసెను. దృష్టాంతమునకు, నాయీను పట్టణములో అప్పుడే చనిపోయిన యౌవనుని పాడెను మోయుచున్నవారిని ఆయన ఎదుర్కొనెను. విధవరాలైన అతని తల్లితో ఒక ఓదార్పు మాటనుపల్కి, యేసు యిట్లనెను: “చిన్నవాడా, లెమ్మని నీతో చెప్పుచున్నాను!” అతడు లేచాడు! (లూకా 7:11-17) మరొక సందర్భములో యేసు యిట్టి అభయమిచ్చెను: “సమాధులలో నున్నవారందరు బయటకు వచ్చేకాలము వచ్చుచున్నది.” (యోహాను 5:28, 29) కోటానుకోట్ల నక్షత్రములను ఆకాశమండలమందున్న మరి యితరమైన వాటిని దేవుడు సృజించి వాటిని “పేర్లతో సహితము” పిలుచుచున్నాడు కనుక, చనిపోయిన కోట్లమంది మానవులను పునరుత్థానులనుచేయుట నిశ్చయంగా సమస్యకాదు.—యెషయా 40:26.
అది నీకొరకేనా?
మానవుడు ఎన్నటికి చనిపోకూడదని తాను ప్రేమతో చేసిన మంచి వస్తువులన్నింటిని నిత్యము అనుభవించాలని యెహోవా దేవుడు ఆదిలో సంకల్పించెను. కనుక సంతోషదాయకమైన కుటుంబాలతో నూతనలోకములోని జీవిత ఆశీర్వాదములను గూర్చి ఊహించుము! ఇప్పుడు ప్రమాదకరంగా ఉన్న జంతువులతో చిన్నపిల్లలు సురక్షితంగా ఆడుకొనుటను తలంచుము. (యెషయా 11:6-9) శాంతియుతమైన దీవెనలు, మంచి గృహములు, ప్రతిఫలమైన పని, సమృద్ధియైన ఆహారమును గూర్చి ఆలోచించుము. అవును, భూపరదైసులో నిత్యము జీవించుటనుగూర్చి ఆలోచించుము.
అందు నీవుండగలవా? దేవుని వాక్యమునందు ఖచ్ఛితమైన జ్ఞానమును తీసికొని దాని ప్రకారము నడచినట్లయితే నిశ్చయంగా ఉండగలవు. నిష్పలముకాని దేవుని సంకల్పములందు విశ్వాసమును పెంపొందించుటకు నీకు సహాయపడుటలో యెహోవాసాక్షులు సిద్ధముగా ఉన్నారు. పరదైసు త్వరలో తిరిగి సంపాదించబడునని, నూతనలోకం సమీపంగా ఉందని నీవు నిశ్చయముకల్గియుండవచ్చును! (w88 11/15)