యేసుయొక్క జీవితము పరిచర్య
ఇంకను ఇవ్వబడిన దిద్దుబాటు ఉపదేశము
యేసు ఆయన అపొస్తలులు ఇంకను కపెర్నహూముగృహములోనే ఉండగా, ఎవరు గొప్ప అని అపొస్తలుల వాదించుకొనిన అంశముతోపాటు మరొకటికూడా చర్చించబడెను. ఇదికూడా వారు కపెర్నహూముకు తిరిగివచ్చుచుండగా జరిగియుండవచ్చును, అప్పుడు యేసు వారిమధ్యయుండక పోవచ్చును. అపొస్తలుడైన యోహాను దానిని ఇట్లు చెప్పెను: “బోధకుడా, ఒకడు నీ పేరట దయ్యములను వెళ్లగొట్టుట చూచితిమి; వాడు మనలను వెంబడించువాడు కాడు గనుక వానిని ఆటంకపరచుటకు” ప్రయత్నించితిమి.
స్పష్టముగా యోహాను కేవలము అపొస్తలులు మాత్రమే స్వస్థపరచు బృందమని దృష్టించెను. కాబట్టి ఆ మనుష్యుడు తమలోనివాడు కానందున సరికాని రీతిలో సూచక క్రియలు చేయుచున్నాడని ఆయన భావించెను.
అయితే, యేసువారికి ఇలా ఉపదేశించెను: “వానిని ఆటంకపరచకుడి; నాపేరట అద్భుతముచేసి నన్ను చులకనగా నిందింపగల వాడెవడును లేడు; మనకు విరోధికానివాడు మన పక్షముగా నున్నవాడే. మీరు క్రీస్తువారని నాపేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు, తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.”
యేసు పక్షముగా నుండుటకు ఈ మనుష్యుడు ఆయనతో కూడవుండి ఆయనను వెంబడించనవసరము లేదు. క్రైస్తవ సంఘము ఇంకను స్థాపించబడలేదు గనుక, వారితోకూడ ఉండకపోవుట అతడు సంఘమునుండి వేరుగా ఉన్నాడని భావము కాదు. ఆ మనుష్యుడు నిజముగా యేసు నామమందు విశ్వాసముంచి ఆ విధముగా దయ్యములను వెళ్లగొట్టగలిగెను. ఫలము పొందుటకు అరక్షమైనదని యేసు చెప్పినదానికి అనుగ్రహపూర్వకముగా పోల్చదగిన దానిని అతడు చేయుచుండెను. దీనిని చేసినందుకు, అతడు తన ఫలమును పోగొట్టుకొనడని యేసు చూపించుచున్నాడు.
అయితే అపొస్తలుల మాటలచే మరియు చర్యలచే ఆ మనుష్యుడు అభ్యంతరపడినట్లయిన అప్పుడేమి? ఇది ఎంతో గంభీరమై యుండును! యేసు ఇట్లనెను: “నాయందు విశ్వాసముంచు ఈ చిన్నవారిలోనొకని అభ్యంతరపరచువాడెవడో, వాడు మెడకు గాడిద తిప్పునంత పెద్ద తిరుగటిరాయి కట్టబడి సముద్రములో పడవేయబడుట వానికి మేలు.”—NW.
తమకు అభ్యంతరము కలుగజేయు చెయ్యి, పాదము, లేక కన్నువంటి తమకు ప్రియమైన దేనినైనను తమజీవితములలోనుండి తీసివేయవలెనని యేసు తన అనుచరులకు చెప్పుచున్నాడు. వీటిని మనస్సులో ఉంచుకొని, నిత్యనాశనమునకు సూచనగాయున్న, గెహెన్నాలో (యెరూషలేముకు సమీపములో కాలుచుండు కసువు దిబ్బ) పడవేయబడుటకంటె అవి లేకుండా దేవుని రాజ్యములో ప్రవేశించుట మేలు.
యేసు ఇంకను ఇట్లు హెచ్చరించెను: “ఈ చిన్నవారిలో ఒకనినైనను తృణీకరింపకుండ చూచుకొనుడి. వీరి దూతలు, పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడు పరలోకమందు చూచుచుందురని మీతో చెప్పుచున్నాను.” ఆ పిమ్మట నూరు గొర్రెలు కలిగియుండి ఒకటి తప్పిపోయినప్పుడు 99 గొర్రెలను విడిచి పోయినదానిని వెదకుటకు వెళ్లిన ఒక మనుష్యుని ఉపమానము చెప్పుచు ఆయన ఈ “చిన్నవారి” అమూల్యతను ఉదహరించెను. ఆ మనుష్యుడు పోయిన గొర్రెను కనుగొనినప్పుడు 99 గొర్రెలనుగూర్చి సంతోషించునంతకంటె దానినిగూర్చి ఎక్కువగా సంతోషించునని యేసు వివరించెను. “ఆలాగుననే, ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తముకాదు,” అని యేసు తనమాటలను ముగించెను.
తన అపొస్తలుల మధ్యయున్న వాదమును బహుశ మదిలో పెట్టుకొని, యేసు వారికిట్లు ఉద్భోదించెను: “మీలోమీరు ఉప్పుసారము గలవారైయుండి యొకరితో ఒకరు సమాధానముగా ఉండుడి.” రుచికరముగాని ఆహారపదార్దములు ఉప్పుచే మరింత రుచికరము చేయబడును. ఆ విధముగా, అలంకారార్థమైన ఉప్పు వేరొకరు చెప్పినదానిని సులభముగా అంగీకరించునట్లు చేయును. అటువంటి ఉప్పు సమాధానమును కాపాడును.
అయితే మానవ అసంపూర్ణము కారణముగా, కొన్నిసార్లు గంభీరమైన వివాదములు కలుగును. వాటితో వ్యవహరించుటకుకూడ యేసు నడిపింపునిచ్చెను. “నీ సహోదరుడు నీయెడల తప్పిదముచేసిన యెడల నీవుపోయి, నీవును అతడును ఒంటరిగానున్నప్పుడు అతనిని గద్దించుము; అతడు నీ మాట వినినయెడల నీ సహోదరుని సంపాదించుకొంటివి,” అని యేసు చెప్పెను. అతడు విననట్లయిన, యేసు ఇచ్చినసలహా ఏమనగా, “ఇద్దరు ముగ్గురు సాక్షులనోట ప్రతిమాట స్థిరపరచబడునట్లు నీవు ఒకరిద్దరిని వెంటబెట్టుకొని అతని యొద్దకుపొమ్ము.”
అతడింకను విననొల్లనియెడల చివరి ప్రయత్నముగా, విషయమును “సంఘమునకు తెలియజేయుమని” యేసు చెప్పెను, అనగా సంఘములోని బాధ్యతగల విచారణకర్తలు అతనికి న్యాయవిచారణ జరుపుదురు. ఆ పాపి సంఘము మాటయు విననియెడల, “అతనిని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము” అని యేసు తెలియజేసెను.
అటువంటి నిర్ణయము చేయునప్పుడు, విచారణకర్తలు యెహోవా వాక్యమందలి ఉపదేశములకు హత్తుకొనియుండవలెను. ఆ విధముగా, తనలో దోషము కనుగొనబడి ఒకడు శిక్షకు పాత్రుడైనట్లయిన, తీర్పు ‘పరలోకమందు అప్పటికే బంధింపబడియుండును.’ వారు దానిని “భూమిమీద విప్పినప్పుడు,” అనగా వారు అతని నిర్దోషియని కనుగొనినప్పుడు, అది అప్పటికే “పరలోకమందును విప్పబడును.” అటువంటి న్యాయనిర్ణయ పరిశీలనలలో, “ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడియుందురో అక్కడ నేను వారి మధ్యన ఉందునని” యేసు చెప్పెను. మత్తయి 18:6-20; మార్కు 9:38-50; లూకా 9:49, 50.
◆ యేసు దినములలో ఆయన వెన్నంటివుండుట ఎందుకు అవసరము లేకుండెను?
◆ చిన్నవారిని అభ్యంతరపరచుట ఎంత గంభీరమైయున్నది, అటువంటి చిన్నవారి ప్రాముఖ్యతను యేసు ఎట్లు దృష్టాంతపరచెను?
◆ అపొస్తలులు తమలోతాము ఉప్పు కలిగియుండవలెనని ప్రోత్సహించునట్లు యేసును ఏది పురికొల్పెను?
◆ ‘బంధింపబడుట’ మరియు ‘విప్పుటకు’ ఏ ప్రాముఖ్యత కలదు? (w88 2/15)