యేసుయొక్క జీవితము పరిచర్య
మనుష్యుని ఏది అపవిత్రపరచును?
యేసు యెడల వ్యతిరేకత ఎక్కువగుచున్నది. శిష్యులలో అనేకులు ఆయనను వెంబడించుటను మానుకొనుటయేగాక యూదయలోని యూదులు ఆయనను చంపుటకు యత్నించుచుండిరి. ఆయన యెరూషలేములో నున్నప్పుడు సా.శ. 31 పస్కా సమయములోను వారట్లు ప్రయత్నించిరి.
ఇప్పుడు సా.శ. 32 పస్కా సమయము. హాజరుకావలెనన్న దేవుని నియమమునుబట్టియే, బహుశ యేసు పస్కా నాచరించుటకు యెరూషలేముకు వెళ్లును. అయినను ఆయన ప్రాణాపాయమునుబట్టి తగు జాగరూకతతోనే వెళ్లును. తదుపరి గలిలయకు తిరిగివచ్చును.
శాస్త్రులు, పరిసయ్యులు యెరూషలేము నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు యేసు కపెర్నహూములో ఉండియుండవచ్చును. మత శాసనము నుల్లంఘించు చున్నాడను నేరము ఆయనపై మోపుటకు ఆధారమును వెదకుచు, “నీ శిష్యులు పెద్దల పారంపర్యాచారము నెందుకు అతిక్రమించుచున్నారు? వారు చేతులు కడుగుకొనకుండ భోజనము చేయుచున్నారే?” అని అడిగిరి. ఇది దేవునిచే కోరబడినది కాదు. అయినను వారి పారంపర్యాచారముగా మోచేతులవరకు కడుగుకొనుటను పాటించక పోవుటను పరిసయ్యులు తీవ్రమైన తప్పుగా భావించుదురు.
వారి నేరారోపణకు జవాబు చెప్పుటకు బదులు, దుష్టత్వముతోను మరియు ఉద్దేశ్యపూర్వకముగ వారెట్లు దేవుని శాసనమును ఉల్లంఘించుచున్నారో యేసు చూపెను. ఆయనిట్లు తెలుసుకొనగోరెను: “మీరును మీపారంపర్యాచారము, నిమిత్తమై దేవుని ఆజ్ఞను ఎందుకు అతిక్రమించుచున్నారు?” ఉదాహరణకు “తలిదండ్రులను ఘనపరచుమనియు, తండ్రినైనను, తల్లినైనను దూషించువాడు తప్పక మరణము పొందవలెననియు దేవుడు సెలవిచ్చెను. కాని మీరైతే ఒకడు తన తండ్రినైనను, తల్లినైనను చూచి నావలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన యెడల అతడు తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారేల?”
పరిసయ్యులు నిజంగా డబ్బు, ఆస్తి లేక దేవునికి అర్పించినదేదైనా దేవాలయమునకు చెందినదేనని, మరిదేనికైనను దాని నుపయోగించరాదని బోధించుదురు. అయినను వాస్తవమునకాయర్పణ దానినర్పించిన వ్యక్తితోనే ఉంచుకొనబడెడిది. ఈ విధంగా ఒక కుమారుడు తన డబ్బు లేక ఆస్తి “కొర్బాను” అనగా దేవునికి లేక దేవాలయమునకు అర్పించబడినదని చెప్పుటతోనే, వృద్ధులైన తన తల్లిదండ్రులెంత అవసరములోనున్నను, వారి నాదుకొను బాధ్యత నుండి తప్పించుకొనును.
దేవుని శాసనమును పరిసయ్యులు దుష్టత్వముతో వక్రీకరించుచున్నందున, యేసు వారిపై సరిగానే కోపగించుకొని: “మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని వాక్యమును నిరర్ధకము చేయుచున్నారు. వేషధారులారా—ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురుగాని వారిహృదయము నాకు దూరముగా ఉన్నది; మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు, అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే” ననును.
బహుశ పరిసయ్యులు యేసును ప్రశ్నించుటకుగాను జనసమూహము వెనకే ఉండిపోయెను. ఇప్పుడైతే తమను గట్టిగా మందలించిన యేసుకు పరిసయ్యులు జవాబివ్వలేక పోయిరి. ఆయన జనసమూహములను పిలిచి “మీరు విని గ్రహించుడి; నోటపడునది మనుష్యుని అపవిత్రపరచదుగాని నోటనుండి వచ్చునదే మనుష్యుని అపవిత్రపరచు”నని వారితో అనును.
తరువాత వారు ఒక ఇంటిలో ప్రవేశించినప్పుడు “పరిసయ్యులు ఆమాట విని అభ్యంతరపడిరని నీకు తెలియునా” అని ఆయన శిష్యులడుగును.
ఆయన యిలా సమాధానమిచ్చును. “పరలోకమందున్న నాతండ్రి నాటని ప్రతిమొక్కయు పెల్లగింపబడును. వారి జోలికి పోకుడి; వారు గ్రుడ్డివారైయుండి గ్రుడ్డివారికి త్రోవచూపువారు గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి త్రోవచూపినయెడల వారిద్దరు గుంటలో పడుదురు.”
మనుష్యుని ఏది అపవిత్రపరచునో వివరించుమని శిష్యుల తరపున పేతురు కోరగా, యేసు ఆశ్చర్యపడినట్లుండెను. “మీరును ఇంతవరకు అవివేకులైయున్నారా” అని ప్రతిస్పందించును. “నోటిలోనికి పోవునదంతయు కడుపులోపడి బహిర్భూమిలో విడువబడును. గాని నోటనుండి బయటికి వచ్చునవి హృదయములోనుండి వచ్చును. ఇవే మనుష్యుని అపవిత్రపరచునవని మీరు గ్రహింపరా? ఉదాహరణకు, దురాలోచనలు నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు అబద్ధసాక్ష్యములు దేవదూషణలు హృదయములోనుండియే వచ్చును; ఇవే మనుష్యుని అపవిత్రపరచునుగాని చేతులు కడుగుకొనక భోజనముచేయుట మనుష్యుని అపవిత్రపర్చదని” చెప్పును.
ఇక్కడ యేసు మామూలు పరిశుభ్రత అవసరము లేదనుటలేదు. ఆహారము సిద్ధపర్చుటకు లేక భోజనమును చేయుటకు ముందు ఒకవ్యక్తి చేతులు కడుగుకొన అవసరము లేదని ఆయన వాదించుటలేదు. దానికి బదులు, విచక్షణలేని పారంపర్యాచారములను బలవంతముచేయుచు దేవుని నీతిశాసనములను దారి మళ్ళించు వంచనచేయు మతనాయకుల వేషధారణను ఖండించుచున్నాడు. అవును, మనుష్యుని అపవిత్రపర్చునవి దుష్టక్రియలే. ఇవి ఒకని హృదయము నుండి బయలుదేరునని యేసు చూపును.—యోహాను 7:1; ద్వితీయోపదేశకాండము 16:16; మత్తయి 15:1-20; మార్కు 7:1-23; నిర్గమకాండము 20:12; 21:17; యెషయా 29:13.
◆ యేసు ఇప్పుడు ఏ వ్యతిరేకతను ఎదుర్కొనును?
◆ పరిసయ్యులు ఏ నేరారోపణను చేయుదురు?, కాని యేసు చెప్పిన దానినిబట్టి పరిసయ్యులు ఉద్దేశ్యపూర్వకముగా దేవుని శాసనమునెట్లు ఉల్లంఘించుదురు?
◆ మనుష్యుని ఏది అపవిత్రపరచునని యేసు తెలియజేయును? (w87 11/1)