యేసుయొక్క జీవితము పరిచర్య
యేసు—“పరలోకమునుండి వచ్చిన నిజమైన ఆహారము”
ఆ దినము నిజముగా చెప్పుకోదగినది. యేసు అద్భుతరీతిగా వేలాది మందికి ఆహారము పంచి, తనను రాజుగా చేయదలచిన జనుల ప్రయత్నములనుండి తప్పించుకొనిపోయెను. ఆ రాత్రి సుడిగాలులతో నిండిన గలిలయ సముద్రముపై ఆయన నడచి వచ్చెను; సుడిగాలి-అలలతో నిండిన గలిలయ సముద్రముపై నడచి మునుగుతూ ఉన్న పేతురును కాపాడెను; మరియు తనశిష్యులు పడవ పగిలి మునిగి పోకుండ అలలను నిమ్మళింపజేసెను.
గలిలయ సముద్రమునకు ఈశాన్య దిశలో యేసుచేత అద్భుతరీతిలో ఆహారము భుజించిన ప్రజలు, మరునాడు కపెర్నహూములో ఆయనను కనుగొనిరి. యేసు వారిని గద్దించుచు, మరియొకసారి ఉచితముగా రొట్టెలు భుజించుటకే వారు తనను వెదకుచున్నారని చెప్పెను. క్షయమైన ఆహారము కొరకుకాదుగాని నిత్యజీవమునిచ్చు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడని ఆయన వారితో చెప్పెను. అందుకు వారు—“మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమిచేయవలెనని అడిగిరి.”
అత్యంత విలువైన ఒక్కపనిని మాత్రమే యేసు వారికితెల్పెను. “దేవునిక్రియ ఏదనగా ఆయన పంపిన వానియందు విశ్వాసముంచుటయే” అని వారికి వివరించెను.
యేసు అనేక అద్భుతములు చేసినను ప్రజలు ఆయనయందు విశ్వాసముంచరైరి. అంతకుముందు రోజే ఆయన 5,000 మంది పురుషులు, స్త్రీలు, మరియు పిల్లలకు అద్భుతరీతిగ ఆహారము పెట్టెను. అయినను, ఇప్పుడు అవిశ్వాసముతో వారిట్లడుగుచుండిరి: “మేము చూచి నిన్ను విశ్వసించుటకు ఏ సూచకక్రియను నీవు చేయుచున్నావు? ఏమి జరిగించుచున్నావు? భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్లు మనపితరులు అరణ్యములో మన్నాను భుజించి” రనిరి.
ఒక సూచకక్రియ నడిగినందుకు జవాబుగా, అట్టి అద్భుతములకు మూలమెవరో స్పష్టపర్చుచూ యేసు ఇట్లనెను: “పరలోకమునుండివచ్చు ఆహారము మోషే మీకియ్యలేదు. నాతండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చునది దేవుడనుగ్రహించు ఆహారమైయున్నది.”
“ప్రభువా, యీ ఆహారమును ఎల్లప్పుడును మాకనుగ్రహించుము” అని ప్రజలనిరి.
యేసు వివరించినదేమనగా “జీవాహారము నేనే. నాయొద్దకు వచ్చువాడు ఏమాత్రమును ఆకలిగొనడు, నాయందు విశ్వాసముంచువాడు ఎల్లప్పుడును దప్పిగొనడు. మీరు నన్ను చూచియుండియు విశ్వసింపకయున్నారని మీతోచెప్పితిని. తండ్రినాకనుగ్రహించు వారందరును నాయొద్దకు వత్తురు; నాయొద్దకు వచ్చువానిని నేనెంత మాత్రమును బయటికి త్రోసివేయను; నాయిష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు; నన్ను పంపిన వానిచిత్తము నెరవేర్చుటకే పరలోకమునుండి దిగివచ్చితిని. ఆయన నాకనుగ్రహించిన దానియంతటిలో నేనేమియు పోగొట్టుకొనక, అంత్యదినమున దాని లేపుటయే నన్ను పంపిన వాని చిత్తమైయున్నది. కుమారుని చూచి ఆయనయందు విశ్వాసముంచు ప్రతివాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తము.”
“నేను పరలోకమునుండి దిగివచ్చిన ఆహారమని” యేసు చెప్పినందున యూదులు ఆయనపై సణుగుకొనసాగిరి. మానవ తలిదండ్రుల కుమారుని తప్ప ఆయనయందేమియు వారుచూడలేకపోయిరి. కావున నజరేతు ప్రజలవలె వారును తిరస్కారము చూపిరి: “ఈయన యోసేపు కుమారుడైన యేసుకాడా? ఈయన తలిదండ్రులను మనమెరుగుదుముగదా?—‘నేను పరలోకమునుండి దిగివచ్చియున్నానని’ ఈయన ఏలాగు చెప్పుచున్నాడనిరి.”
అందుకు యేసు “మీలో మీరు సణుగుకొనకుడి; నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనేగాని ఎవడును నాయొద్దకురాలేడు. అంత్యదినమున నేనువానిని లేపుదును. ‘వారందరు యెహోవాచే బోధింపబడుదురని, ప్రవక్తల లేఖనములలో వ్రాయబడియున్నది. గనుక తండ్రివలన వినినేర్చుకొనిన ప్రతివాడును నా యొద్దకు వచ్చును. దేవునియొద్దనుండి వచ్చినవాడు తప్పమరియెవడును తండ్రిని చూచియుండలేదు; ఈయనే తండ్రినిచూచియున్నాడు. విశ్వసించువాడు నిత్యజీవము గలవాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాననెను.”
యేసు ఇంకను ఇట్లు పునరుద్ఘాటించెను: “జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడును జీవించును.” అవును దేవుడు పంపిన యేసునందు విశ్వాసముంచుటద్వారా, జనులు నిత్యజీవముగలవారగుదురు. మన్నాకాదు, లేక మరి ఏ రొట్టెయు దాని నేర్పరచలేదు!
కపెర్నహూము నొద్ద జనులు యేసును కనుగొనిన పిదప పరలోకమునుండి వచ్చిన ఆహారమును గూర్చిన చర్చ ప్రారంభమైనట్లున్నది. కాని అది కొనసాగి, తదుపరి కపెర్నహూములో సమాజమందిరములో యేసు బోధించుచుండగా తారాస్థాయికి చేరినది. యోహాను 6:26-51, 59; కీర్తన 78:24; యెషయా 54:13; మత్తయి 13:55-57.
◆ పరలోకము నుండి వచ్చిన ఆహారమును గురించి యేసు చర్చించుటకు ముందు ఏ సంఘటనలు జరిగెను?
◆ యేసు అప్పుడే చేసిన దాని దృష్ట్యా, సూచనను గూర్చిన అభ్యర్ధన ఎందుకు సరైనదికాదు?
◆ తాను పరలోకము నుండివచ్చిన నిజమైన ఆహారమని యేసు చెప్పుకొనినందున, యూదులెందుకు సణుగుకొనిరి?
◆ పరలోకమునుండి వచ్చిన ఆహారమును గూర్చిన చర్చ ఎక్కడ జరిగెను? (w87 10/1)