34 హిజ్కియా
“యెహోవాను హత్తుకొని ఉన్నాడు”
యెహోవాను నిజంగా ప్రేమించిన కొంతమంది యూదా రాజుల్లో హిజ్కియా ఒకడు. హిజ్కియా బురదలో నుండి వచ్చిన తామర పువ్వు లాంటివాడు. ఎందుకంటే ఆయన ఎంత మంచి రాజో, వాళ్ల నాన్న ఆహాజు అంత చెడ్డ రాజు. ఆహాజు అబద్ధ దేవుళ్లను ఆరాధించాడు; ప్రజలు కూడా అలా ఆరాధించేలా చేశాడు. ఆఖరికి తన సొంత కొడుకుల్లో కొంతమందిని ఆ క్రూరమైన దేవుళ్లకు బలిచ్చాడు. (2 రాజు. 16:2-4; 2 దిన. 28:1, 3) అలాంటి తండ్రి ఉండడం వల్ల, హిజ్కియా చిన్నతనమంతా ఒక పీడకలలా గడిచి ఉంటుంది. ఏదేమైనా, హిజ్కియా పెరిగి పెద్దవాడైనప్పుడు వాళ్ల నాన్నలా ఉండాలనుకోలేదు. హిజ్కియాకు 25 ఏళ్లు ఉన్నప్పుడు ఆహాజు చనిపోయాడు. ఆయన రాజైన వెంటనే, దేశంలో అబద్ధ ఆరాధనే లేకుండా చేయడానికి ధైర్యంగా నడుం బిగించాడు.
హిజ్కియా మూతబడిన యెరూషలేము ఆలయాన్ని తెరిపించి, మరమ్మతులు చేయించాడు. అక్కడున్న విగ్రహాల్ని తొలగించాడు. యాజకులతో, లేవీయులతో వాళ్లవాళ్ల పనుల్ని తిరిగి మొదలుపెట్టమని చెప్పాడు. ఆ తర్వాత, యెరూషలేములో పెద్ద ఎత్తున పస్కా పండుగ కోసం ఏర్పాట్లు చేశాడు. దాన్ని ఆచరించడానికి రమ్మని యూదా ప్రజలకే కాదు, ఉత్తరాన ఉన్న పది గోత్రాల ఇశ్రాయేలు ప్రజలకు కూడా కబురు పంపించాడు. అది విని కొంతమంది ఎగతాళి చేశారు, కానీ మిగతావాళ్లు వచ్చారు. హిజ్కియాను చూసి రెండు రాజ్యాల ప్రజలు కూడా ధైర్యంగా విగ్రహాల్ని తొలగించారు, ఉన్నత స్థలాల్ని పడగొట్టారు. అంతకుముందు వరకు దేవుని ప్రజలు ఎంతకు దిగజారారంటే, యెహోవా వందల ఏళ్ల క్రితం మోషేతో చేయించిన రాగి సర్పాన్ని కూడా ఆరాధించారు. కానీ ప్రజలు మళ్లీ దాన్ని ఆరాధించకుండా హిజ్కియా ఆ రాగి సర్పాన్ని ముక్కలుముక్కలు చేశాడు.
అయితే, పది గోత్రాల ఇశ్రాయేలు రాజ్యం మీదికి నాశనం వస్తుందని యెహోవా ఎప్పటినుండో చెప్తూ వచ్చాడు. హిజ్కియా యూదా రాజ్యాన్ని పరిపాలించడం మొదలుపెట్టిన కొన్నేళ్లకే అది నిజమైంది. దయా దాక్ష్యిణ్యాలు లేని అష్షూరు సైన్యం ఇశ్రాయేలు రాజ్యం మీద తుఫానులా దాడి చేసింది. దాన్ని నాశనం చేసి, ప్రజల్ని బందీలుగా తీసుకెళ్లింది. మరి యూదా ప్రజల సంగతేంటి? వాళ్లు కూడా ఇశ్రాయేలు రాజ్యంలోని ప్రజల్లాగే చెడ్డపనులు చేశారు. చెప్పాలంటే, వాళ్లను మించిపోయారు. కాబట్టి యెహోవా తన ప్రవక్తల్ని పంపించి యూదా ప్రజల్ని మారమని, లేదంటే శిక్ష తప్పదని హెచ్చరిస్తూ వచ్చాడు. యెహోవా చెప్పాడంటే అది జరిగి తీరుతుంది! అష్షూరు సైన్యం ఒక్కొక్క రాజ్యాన్ని జయిస్తూ యూదా వరకు వచ్చింది. తర్వాత దాడి జరిగేది తన రాజ్యం మీదే అని అర్థమైనప్పుడు హిజ్కియాకు గుండెల్లో గాబరా మొదలైంది. చివరికి హిజ్కియా భయపడినట్టే జరిగింది.
అష్షూరు రాజైన సన్హెరీబు, అతని సైన్యాలు యూదాను చుట్టుముట్టాయి. ఆ రాజ్యంలోని ఒక్కో నగరాన్ని వాళ్లు తమ గుప్పిట్లో పెట్టుకుంటూ వస్తున్నారు. అయితే, ఉన్న సమస్య చాలదన్నట్టు హిజ్కియాకు కొత్త కష్టం వచ్చిపడింది. ఆయనకు పెద్ద జబ్బు చేసి, చనిపోయే పరిస్థితి వచ్చింది. అయితే, హిజ్కియాకు ఇంకా కొడుకులు పుట్టలేదు. కాబట్టి దావీదు వంశం నుండి పరిపాలించడానికి ఇక ఎవరూ ఉండరని హిజ్కియా బాధపడ్డాడు; సహాయం చేయమని యెహోవాను వేడుకున్నాడు. అప్పుడు యెహోవా ప్రేమతో హిజ్కియా ఆయుష్షును మరో 15 ఏళ్లు పొడిగించాడు. అయితే, అసలు సమస్య ఇంకా పోలేదు.
అష్షూరు సైన్యాలు రోజురోజుకూ యెరూషలేము నగరానికి దగ్గరౌతున్నాయి. ఎలాగైనా సరే, పవిత్ర నగరమైన యెరూషలేమును కాపాడాలని హిజ్కియా అనుకున్నాడు. అందుకే, సన్హెరీబు అడిగినంత వెండి బంగారాల్ని పంపించాడు. కానీ సన్హెరీబు వాటిని తీసుకొని కూడా దాడి చేయాలనుకున్నాడు. ఈలోపు హిజ్కియా నగరాన్ని పటిష్ఠం చేసి ఇంకో కొత్త ప్రాకారాన్ని కట్టించాడు. అలాగే, నగరం బయట ఉన్న ఊట నీళ్లు నగరం లోపలికి వచ్చేలా ఒక కాలువను లేదా సొరంగాన్ని తవ్వించాడు. దానివల్ల శత్రువులు ముట్టడించినా నీటికి కొదువ ఉండదు. అంతేకాదు, యెహోవా ముందు ఏ మానవ సైన్యం పనికిరాదని చెప్తూ హిజ్కియా ప్రజల్లో ధైర్యం నింపాడు.
శత్రువు బెదిరింపులకు భయపడిన ప్రజల్లో హిజ్కియా ధైర్యం నింపాడు
యెరూషలేమును ఆక్రమించుకోవాలనే కసి సన్హెరీబులో పెరుగుతూ వచ్చింది. యూదా ప్రజల్ని భయపెట్టడానికి తన ఉన్నతాధికారైన రబ్షాకేను యెరూషలేముకు పంపించాడు. ఈ రబ్షాకే యూదా రాజును, వాళ్ల దేవుడైన యెహోవాను అవమానిస్తూ అనరాని మాటలు అన్నాడు. కానీ హిజ్కియాకు యెహోవా మీద నమ్మకం ఏమాత్రం తగ్గలేదు; ప్రజల్లో కూడా ఆయన ధైర్యాన్ని నింపుతూ వచ్చాడు. తర్వాత, హిజ్కియా ధైర్యాన్ని నీరుగార్చడానికి సన్హెరీబు ఆయన్ని బెదిరిస్తూ కొన్ని ఉత్తరాల్ని పంపించాడు. హిజ్కియా యెహోవా మందిరానికి వెళ్లి, ఆ ఉత్తరాల్ని అక్కడ పరిచాడు. అలా ఆ సమస్యను సర్వశక్తిమంతుడైన యెహోవా పాదాల ముందు ఉంచినట్టు చూపించాడు. యెహోవా దానికి జవాబిస్తూ యెషయా ప్రవక్త ద్వారా హిజ్కియాకు ఈ తీపి కబురు పంపించాడు: సన్హెరీబు, అతని మనుషులు యెరూషలేములో అడుగుపెట్టడం గానీ, నగరం మీద ఒక బాణం వేయడం గానీ జరగదు.
అదేరోజు రాత్రి యెహోవా తన దూతను అష్షూరీయుల శిబిరానికి పంపించాడు. ఆ ఒక్క దూత క్షణాల్లో 1,85,000 మందిని చంపేశాడు. అలా యెహోవా హిజ్కియాకు తిరుగులేని విజయాన్ని ఇచ్చాడు! తర్వాతి రోజు ఉదయం, సన్హెరీబు నిద్రలేచి చూసేసరికి తన సైనికులందరూ చచ్చిపడి ఉన్నారు. అప్పుడు అతనికి ఎలా అనిపించి ఉంటుందో ఊహించుకోండి! ఓడిపోయాను అనే తలవంపుతో అతను తిరిగి తన దేశానికి వెళ్లిపోయాడు. కొంతకాలం తర్వాత, అతను నిస్రోకు గుడిలో ఉన్నప్పుడు అతని కొడుకులే అతన్ని చంపేశారు.
హిజ్కియా యెహోవా నుండి ఎన్నో దీవెనలు పొందాడు. అష్షూరీయుల నుండి ముప్పు తప్పింది, ఆయనకు జబ్బు నయమైంది, ఒక వారసుడు కూడా పుట్టాడు. అయితే కొంతకాలానికి హిజ్కియా గర్వం చూపించాడు. కానీ యెహోవా సరిదిద్దినప్పుడు ఆయన దాన్ని వినయంగా తీసుకున్నాడు. హిజ్కియా చివరివరకూ యెహోవాకే నమ్మకంగా ఉన్నాడు, కష్టాల్లో ధైర్యం చూపిస్తూ ఆయన్నే హత్తుకున్నాడు. యెహోవా ప్రజల్ని పరిపాలించిన గొప్ప రాజుల్లో ఒకడిగా హిజ్కియా చరిత్రలో నిలిచిపోయాడు.
ఈ వచనాలు చదవండి:
ప్రశ్న:
హిజ్కియా ఎలా ధైర్యం చూపించాడు?
ఎక్కువ తెలుసుకోండి
1. బైబిలు హిజ్కియా గురించి చెప్తున్నవి నిజమని చెప్పే ఏ పురావస్తు ఆధారాలు దొరికాయి? (w11 5/1 15 ¶1-3-wcgr) చిత్రం 1
Zev Radovan/Alamy Stock Photo
చిత్రం 1: బంకమట్టితో చేసిన హిజ్కియా కాలం నాటి రాజ ముద్ర. దాని మీద ఇలా రాసి ఉంది: “ఆహాజు కుమారుడు, యూదా రాజైన హిజ్కియాది”
2. “మంటపుట్టించే విషమున్న ఎగిరే సర్పం” గురించి యెషయా చెప్పిన ప్రవచనాన్ని హిజ్కియా ఎలా నెరవేర్చాడు? (యెష. 14:28, 29; ip-1 190-191 ¶4-6)
3. నీనెవెలో పురావస్తు శాస్త్రజ్ఞులకు దొరికిన మట్టి స్థూపం మీద సన్హెరీబు మాటలు ఉన్నాయి. అసలు అతను ఏం చెప్పాడు? ఏం చెప్పకుండా దాచాడు? (g 12/10 27 ¶3-5-wcgr) చిత్రం 2
© The Trustees of the British Museum. Licensed under CC BY-NC-SA 4.0. Source
చిత్రం 2: బంకమట్టితో చేసిన ఈ స్థూపం (టేలర్ ప్రిసమ్) మీద సన్హెరీబు సాధించిన విజయాల గురించి రాసుంది
4. హిజ్కియా కాలువ నిజంగా హిజ్కియా కాలంలో తవ్విందేనా అని 2003లో కొంతమంది శాస్త్రవేత్తలు తెలుసుకోవాలనుకున్నారు. చివరికి వాళ్లు ఏ ముగింపుకు వచ్చారు? (w09 5/1 27 ¶3-5-wcgr)
మనం నేర్చుకునే పాఠాలు
ఎవరికైనా యెహోవాను ఆరాధించని అమ్మ గానీ, నాన్న గానీ ఉంటే హిజ్కియా ఉదాహరణ వాళ్లకెలా సహాయం చేస్తుంది? చిత్రం 3
చిత్రం 3
యెరూషలేమును నాశనం చేస్తానని సన్హెరీబు ఉత్తరాలు పంపించినప్పుడు, హిజ్కియా దేని గురించి ఎక్కువ ఆలోచించాడు? (2 రాజు. 19:15-19) మీరు హిజ్కియాలా ఎలా ఉండవచ్చు?
హిజ్కియా చూపించినట్టే మీరు ఎలా ధైర్యం చూపించవచ్చు?
మనసుపెట్టి ఆలోచించండి
ఈ కథ నుండి యెహోవా గురించి నేను ఏం నేర్చుకున్నాను?
ఈ కథకు, యెహోవా సంకల్పానికి సంబంధం ఏంటి?
కొత్త లోకంలో హిజ్కియాను కలిసినప్పుడు ఆయన్ని నేను ఏం అడగాలనుకుంటున్నాను?
ఇవి కూడా చూడండి
2 రాజులు 19:14-36 లో ఉన్న ఆసక్తికరమైన సంఘటనల్ని ఈ వీడియోలో చూడండి.
మీకా 5:5 లో ఉన్న ప్రవచనం హిజ్కియా రోజుల్లో ఎలా నెరవేరింది? ఇప్పుడు ఎలా నెరవేరుతోంది?
“నేడు ఏడుగురు కాపరులు, ఎనిమిదిమంది ప్రధానులు ఎవరు?” (w13 11/15 18-20 ¶9-18)