అదనపు సమాచారం
1 యెహోవా
దేవుని పేరు యెహోవా. ఆ పేరుకు “ఆయన అయ్యేలా (జరిగేలా) చేస్తాడు” అని అర్థం. యెహోవా సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన అన్నిటినీ సృష్టించాడు. ఆయన చేయాలని నిర్ణయించుకున్న దేన్నైనా చేసే శక్తి ఆయనకు ఉంది.
హెబ్రీ భాషలో దేవుని పేరును నాలుగు అక్షరాలతో రాసేవాళ్లు. ఇంగ్లీష్‌లో వాటిని YHWH అని లేదా JHVH అని రాస్తారు. ఆదిమ హెబ్రీ భాషలో రాయబడిన పాత నిబంధనలో దేవుని పేరు దాదాపు 7,000 సార్లు కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు యెహోవా అనే పేరును వేర్వేరు రూపాల్లో ఉపయోగిస్తారు, వాళ్ల భాషలో సాధారణంగా పలికే విధానాన్ని బట్టి పలుకుతారు.
2 బైబిల్ని “దేవుడు ప్రేరేపించాడు”
బైబిలుకి మూలం దేవుడే, కాని ఆయన మనుషుల్ని ఉపయోగించి బైబిల్ని రాయించాడు. ఇది ఒక వ్యాపారవేత్త తాను అనుకున్న విషయాలను తన సెక్రెటరీతో ఉత్తరం రాయించడం లాంటిది. దేవుడు తన పవిత్రశక్తిని ఉపయోగించి బైబిల్ని రాసేవాళ్లతో తన ఆలోచనలను రాయించాడు. దేవుని పవిత్రశక్తి వాళ్లను వేర్వేరు విధాలుగా నడిపించింది, ఆ శక్తి వాళ్లు కొన్నిసార్లు దర్శనాలు చూసేలా లేదా కలలు కనేలా చేసింది. ఆ కలల్లో లేదా దర్శనాల్లో చూసిన విషయాలను వాళ్లు రాశారు.
3 సూత్రాలు
ఇవి ప్రాథమిక సత్యాలను వివరించే బైబిలు బోధలు. ఉదాహరణకు “చెడు సహవాసాలు మంచి అలవాట్లను పాడుచేస్తాయి” అనే సూత్రం, మన స్నేహితుల వల్ల మనపై చెడు ప్రభావం గానీ మంచి ప్రభావం గానీ పడుతుందని నేర్పిస్తుంది. (1 కొరింథీయులు 15:33) “మనిషి ఏమి విత్తుతాడో అదే పంట కోస్తాడు” అనే సూత్రం, మనం చేసే పనుల వల్ల వచ్చే ఫలితాలను మనం తప్పించుకోలేమని నేర్పిస్తుంది.—గలతీయులు 6:7.
4 ప్రవచనం
ఇది దేవుని నుండి వచ్చే సందేశం. ప్రవచనం దేవుని ఇష్టాన్ని, ఒక నైతిక పాఠాన్ని లేదా నీతి సూత్రాన్ని, ఒక ఆజ్ఞని లేదా తీర్పుని వివరించవచ్చు. అది భవిష్యత్తులో జరగబోయేదాని గురించిన సందేశం కూడా కావచ్చు. బైబిల్లో ఇప్పటికే నెరవేరిన ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి.
5 మెస్సీయ గురించిన ప్రవచనాలు
బైబిల్లో మెస్సీయ గురించి ఉన్న ఎన్నో ప్రవచనాలను నెరవేర్చింది యేసే. “మెస్సీయ గురించిన ప్రవచనాలు” అనే బాక్సు చూడండి.
▸ 2వ అధ్యా., 17వ పేరా, అధస్సూచి
6 భూమి గురించి యెహోవా ఉద్దేశం
యెహోవా తనను ప్రేమించే మనుషుల కోసం భూమిని అందమైన ఇల్లుగా చేశాడు. ఆయన ఉద్దేశం మారలేదు. త్వరలో దేవుడు చెడుతనాన్ని తీసేసి ఆయన ప్రజలకు శాశ్వత జీవితాన్ని ఇస్తాడు.
7 అపవాదియైన సాతాను
సాతాను దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు మొదలుపెట్టిన దేవదూత. అతన్ని సాతాను అని పిలిచారు, అంటే “ఎదిరించేవాడు” అని అర్థం. ఎందుకంటే అతను యెహోవాకు వ్యతిరేకంగా పోరాడతాడు. అతన్ని అపవాది అని కూడా పిలిచారు. అంటే “నిందలు వేసేవాడు” అని అర్థం. అతను దేవుని గురించి అబద్ధాలు చెప్తూ మనుషుల్ని మోసం చేస్తాడు కాబట్టి ఆ పేరు వచ్చింది.
8 దేవదూతలు
యెహోవా భూమిని చేయడానికి చాలాకాలం ముందే దేవదూతల్ని చేశాడు. వాళ్లు పరలోకంలో నివసించడానికి సృష్టించబడ్డారు. కోట్లమంది దేవదూతలు ఉన్నారు. (దానియేలు 7:10) వాళ్లకు వేర్వేరు పేర్లు, వేర్వేరు వ్యక్తిత్వాలు ఉన్నాయి. నమ్మకమైన దేవదూతలు మనుషులు తమను ఆరాధించడానికి వినయంగా ఒప్పుకోరు. వాళ్లకు వేర్వేరు స్థానాలు ఉన్నాయి, వాళ్లు రకరకాల పనులు చేస్తారు. వాళ్లు యెహోవా సింహాసనం ఎదుట సేవచేయడం, ఆయన సందేశాలను తెలియజేయడం, భూమి మీద ఉన్న ఆయన సేవకులను కాపాడుతూ నడిపించడం, ఆయన తీర్పుల్ని అమలు చేయడం, ప్రకటనా పనికి మద్దతు ఇవ్వడం లాంటి పనులు చేస్తారు. (కీర్తన 34:7; ప్రకటన 14:6; 22:8, 9) భవిష్యత్తులో వాళ్లు అర్మగిద్దోను యుద్ధంలో యేసుతోపాటు యుద్ధం చేస్తారు.—ప్రకటన 16:14, 16; 19:14, 15.
▸ 3వ అధ్యా., 5వ పేరా; 10వ అధ్యా., 1వ పేరా
9 పాపం
యెహోవాకు లేదా ఆయన ఇష్టానికి వ్యతిరేకంగా మనం అనుకునేది, ఆలోచించేది లేదా చేసేది ఏదైనా పాపమే. పాపం దేవునితో మన సంబంధాన్ని పాడు చేస్తుంది. కాబట్టి మనం కావాలని పాపం చేయకుండా దేవుడు నియమాలను, సూత్రాలను ఇచ్చాడు. మొదట్లో, యెహోవా అన్నిటినీ ఏ లోపం లేకుండా పరిపూర్ణంగా చేశాడు. కానీ ఆదాముహవ్వలు దేవునికి ఎదురుతిరగాలని నిర్ణయించుకున్నప్పుడు వాళ్లు పాపం చేశారు. వాళ్లు ఇంక పరిపూర్ణులుగా లేరు అంటే వాళ్లలో లోపాలు వచ్చేశాయి, వాళ్లు ముసలివాళ్లై చనిపోయారు. మనం ఆదాము నుండి పాపాన్ని వారసత్వంగా పొందాం కాబట్టి, మనం కూడా ముసలివాళ్లమై చనిపోతాం.
▸ 3వ అధ్యా., 7వ పేరా; 5వ అధ్యా., 3వ పేరా
10 అర్మగిద్దోను
ఇది సాతాను లోకాన్ని, చెడుతనమంతటినీ నాశనం చేసే దేవుని యుద్ధం.
▸ 3వ అధ్యా., 13వ పేరా; 8వ అధ్యా., 18వ పేరా
11 దేవుని రాజ్యం
దేవుని రాజ్యం అంటే యెహోవా పరలోకంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వం. యేసుక్రీస్తు దానికి రాజుగా పరిపాలిస్తున్నాడు. భవిష్యత్తులో, యెహోవా ఈ రాజ్యాన్ని ఉపయోగించి చెడుతనం అంతటినీ తీసేస్తాడు. దేవుని రాజ్యం భూమిని పరిపాలిస్తుంది.
12 యేసుక్రీస్తు
దేవుడు అన్నిటికన్నా ముందు యేసును సృష్టించాడు. మనుషులందరి కోసం చనిపోవడానికి యెహోవా యేసును భూమి మీదకు పంపించాడు. యేసును చంపేశారు, కాని యెహోవా ఆయన్ను బ్రతికించాడు. యేసు ఇప్పుడు పరలోకంలో దేవుని రాజ్యానికి రాజుగా పరిపాలిస్తున్నాడు.
13 70 వారాల ప్రవచనం
మెస్సీయ ఎప్పుడు వస్తాడో బైబిలు ముందే చెప్పింది. 69 వారాలు అనే కాలం ముగింపులో ఇది జరుగుతుంది. ఈ 69 వారాలు, క్రీస్తు పూర్వం 455వ సంవత్సరంలో మొదలై క్రీస్తు శకం 29వ సంవత్సరంలో ముగిశాయి.
ఈ కాలం క్రీస్తు శకం 29లో ముగిసిందని మనకు ఎలా తెలుసు? 69 వారాలు, క్రీస్తు పూర్వం 455లో నెహెమ్యా యెరూషలేముకు వచ్చి పట్టణాన్ని తిరిగి కట్టడం ప్రారంభించినప్పుడు మొదలయ్యాయి. (దానియేలు 9:25; నెహెమ్యా 2:1, 5-8) “డజను” అనగానే మనకు 12 అనే నంబరు గుర్తుకు వచ్చినట్లు, “వారం” అనగానే మనకు 7 అనే నంబరు గుర్తుకు వస్తుంది. అయితే ఈ ప్రవచనంలో ఉన్న వారాలు, ఏడు రోజులు ఉండే వారాలు కాదు గానీ ఏడు సంవత్సరాలు ఉండే వారాలు. ప్రవచనాల్లో ఉన్న నియమం ప్రకారం “ఒక్కో రోజుకి ఒక్కో సంవత్సరం” లెక్కపెట్టాలి. (సంఖ్యాకాండం 14:34; యెహెజ్కేలు 4:6) అంటే వారం ఏడు సంవత్సరాల కాలం అయినప్పుడు 69 వారాలు 483 సంవత్సరాలు అవుతాయి (69 x 7). మనం క్రీస్తు పూర్వం 455 నుండి 483 సంవత్సరాలు లెక్కపెడితే క్రీస్తు శకం 29వ సంవత్సరానికి వస్తాం. యేసు బాప్తిస్మం తీసుకుని మెస్సీయ అయింది కూడా ఈ సంవత్సరంలోనే.—లూకా 3:1, 2, 21, 22.
ఈ ప్రవచనంలో ఇంకో వారం గురించి కూడా ఉంది, అంటే మరో ఏడు సంవత్సరాలు కూడా ఉన్నాయి. ఈ వారంలో మెస్సీయ చంపబడతాడు, అది క్రీస్తు శకం 33వ సంవత్సరంలో జరిగింది. అలాగే క్రీస్తు శకం 36వ సంవత్సరం నుండి మొదలై, దేవుని రాజ్యం గురించిన మంచివార్త యూదులకు మాత్రమే కాకుండా అన్ని దేశాలకు ప్రకటించబడుతుంది.—దానియేలు 9:24-27.
14 త్రిత్వం అనే అబద్ధ బోధ
యెహోవా దేవుడు సృష్టికర్త అని, ఆయన అన్నిటికన్నా ముందు యేసును సృష్టించాడని బైబిలు నేర్పిస్తుంది. (కొలొస్సయులు 1:15, 16) యేసు సర్వశక్తిమంతుడైన దేవుడు కాదు. ఆయన దేవునితో సమానమని ఎప్పుడూ చెప్పుకోలేదు. నిజానికి ఆయన “తండ్రి నాకన్నా గొప్పవాడు” అని చెప్పాడు. (యోహాను 14:28; 1 కొరింథీయులు 15:28) కానీ కొన్ని క్రైస్తవమత శాఖలు త్రిత్వాన్ని బోధిస్తాయి. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే ముగ్గురు ఉన్న ఒకే వ్యక్తి అని వాళ్లు చెప్తారు. “త్రిత్వం” అనే పదం బైబిల్లో లేదు. ఇది ఒక అబద్ధ బోధ.
పవిత్రశక్తి దేవుని చురుకైన శక్తి, ఆయన ఇష్టాన్ని జరిగించడానికి ఆయన అదృశ్యంగా ఉపయోగించే శక్తి. అది వ్యక్తి కాదు. ఉదాహరణకు తొలి క్రైస్తవులు “పవిత్రశక్తితో నిండిపోయారు,” అంతేకాదు యెహోవా ఇలా చెప్పాడు: “అన్నిరకాల ప్రజల మీద నా పవిత్రశక్తిని కుమ్మరిస్తాను.”—అపొస్తలుల కార్యాలు 2:1-4, 17.
▸ 4వ అధ్యా., 12వ పేరా; 15వ అధ్యా., 17వ పేరా
15 సిలువ
నిజక్రైస్తవులు దేవున్ని ఆరాధించేటప్పుడు సిలువను ఉపయోగించరు. ఎందుకు?
అబద్ధ మతంలో సిలువను చాలాకాలంగా ఉపయోగిస్తున్నారు. ప్రాచీన కాలాల్లో సిలువను ప్రకృతి ఆరాధనలో, అన్యమత లైంగిక ఆచారాల్లో వాడారు. యేసు మరణించాక మొదటి 300 సంవత్సరాల్లో క్రైస్తవులు ఆరాధనలో సిలువను ఉపయోగించలేదు. కానీ చాలా కాలం తర్వాత రోమా చక్రవర్తి అయిన కాన్‌స్టంటైన్ సిలువను క్రైస్తవత్వానికి గుర్తుగా చేశాడు. క్రైస్తవత్వాన్ని బాగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఆ గుర్తును ఉపయోగించారు. కానీ యేసుక్రీస్తుకు సిలువకు ఎలాంటి సంబంధం లేదు. న్యూ క్యాథలిక్ ఎన్‌సైక్లోపీడియా ఇలా వివరిస్తుంది: “సిలువ క్రైస్తవపూర్వ సంస్కృతుల్లో, క్రైస్తవేతర సంస్కృతుల్లో ఉంది.”
యేసు సిలువ మీద చనిపోలేదు. “సిలువ” అనే పదాన్ని అనువదించిన గ్రీకు పదాలకు “నిలువైన కొయ్య,” “పెద్ద చెక్క,” లేదా “ఒక చెట్టు” అనే అర్థాలు వస్తాయి. ద కంపేనియన్ బైబిల్ ఇలా వివరిస్తుంది: “[నూతన నిబంధన] వ్రాయబడిన గ్రీకులో రెండు ముక్కల కలపను సూచించే పదమే లేదు.” యేసు నిలువుగా ఉన్న ఒక దూలం లేదా కొయ్య మీద చనిపోయాడు.
యెహోవాను ఆరాధించడానికి విగ్రహాలను లేదా గుర్తులను ఉపయోగించడం ఆయనకు ఇష్టం లేదు.—నిర్గమకాండం 20:4, 5; 1 కొరింథీయులు 10:14.
16 జ్ఞాపకార్థ ఆచరణ
తన మరణాన్ని జ్ఞాపకం చేసుకోవాలని యేసు తన శిష్యులకు ఆజ్ఞాపించాడు. వాళ్లు ప్రతీ సంవత్సరం నీసాను 14న యేసు మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు, అదే రోజున ఇశ్రాయేలీయులు పస్కా పండుగను చేసుకున్నారు. యేసు శరీరానికి, రక్తానికి గుర్తుగా ఉన్న రొట్టెను, ద్రాక్షారసాన్ని జ్ఞాపకార్థ ఆచరణలో ప్రతీ ఒక్కరికి అందిస్తారు. యేసుతో పాటు పరలోకంలో పరిపాలించేవాళ్లు మాత్రమే ఆ రొట్టెను తిని, ఆ ద్రాక్షారసాన్ని తాగుతారు. భూమి మీద శాశ్వతంగా జీవించే నిరీక్షణ ఉన్నవాళ్లంతా గౌరవంతో జ్ఞాపకార్థ ఆచరణకు హాజరౌతారు, కానీ ఆ రొట్టెను తినరు లేదా ఆ ద్రాక్షారసాన్ని తాగరు.
17 ప్రాణం
నెఫెష్ అనే హీబ్రూ పదాన్ని, అలాగే సైఖే అనే గ్రీకు పదాన్ని చాలా తెలుగు బైబిళ్లు ఆత్మ అని అనువదించాయి. అయితే అది సరైన అనువాదం కాదు, ఎందుకంటే అది ఆత్మ చావదు అనే తప్పుడు సిద్ధాంతానికి మద్దతిస్తుంది. ఆ రెండు పదాలు ముఖ్యంగా (1) మనుషుల్ని, (2) జంతువుల్ని, (3) మనిషిలో లేదా జంతువులో ఉండే ప్రాణాన్ని సూచిస్తాయి. (ఆదికాండం 1:20; 2:7; 1 పేతురు 3:20) ఆ పదాలు చనిపోయిన శరీరాన్ని కూడా సూచిస్తాయి.—సంఖ్యాకాండం 6:6; హగ్గయి 2:13.
▸ 6వ అధ్యా., 5వ పేరా; 15వ అధ్యా., 17వ పేరా
18 స్పిరిట్ (ఆత్మ)
రూ-ఆహ్ అనే హీబ్రూ పదాన్ని, న్యూమా అనే గ్రీకు పదాన్ని చాలా తెలుగు బైబిళ్లు ఆత్మ అని అనువదించాయి. అయితే అది సరైన అనువాదం కాదు, ఎందుకంటే అది ఆత్మ చావదు అనే తప్పుడు సిద్ధాంతానికి మద్దతిస్తుంది. ఆ రెండు పదాల ప్రాథమిక అర్థం “ఊపిరి.” ఆ పదాలకు (1) గాలి, (2) భూమ్మీది ప్రాణుల్లో చురుగ్గా ఉండే జీవశక్తి, (3) ఒక వ్యక్తి అలంకారార్థ హృదయంలో పుట్టి ఫలానా విధంగా మాట్లాడేలా లేదా పనిచేసేలా ప్రేరేపించే శక్తి, (4) అదృశ్య మూలం నుండి వచ్చే ప్రేరేపిత సందేశాలు, (5) పరలోక ప్రాణులు, (6) దేవుని చురుకైన శక్తి లేదా పవిత్రశక్తి అనే అర్థాలు కూడా ఉన్నాయి.
▸ 6వ అధ్యా., 5వ పేరా; 15వ అధ్యా., 17వ పేరా;
19 గెహెన్నా
యెరూషలేముకు దగ్గర్లో ఉన్న ఒక లోయ పేరు గెహెన్నా. అక్కడ చెత్తను కాల్చి, ధ్వంసం చేసేవాళ్లు. యేసు కాలంలో ఈ లోయలో జంతువుల్ని గానీ, మనుషుల్ని గానీ హింసించినట్లు లేదా బ్రతికి ఉండగానే కాల్చేసినట్లు ఏ ఆధారాలు లేవు. కాబట్టి గెహెన్నా అంటే చనిపోయిన మనుషుల్ని ఎప్పటికీ హింసించడానికి, కాలుస్తూ ఉండడానికి వాడే అదృశ్యమైన స్థలం కాదు. గెహెన్నాలోకి పడవేయబడిన వాళ్ల గురించి యేసు చెప్పినప్పుడు ఆయన సమూల నాశనం గురించి మాట్లాడుతున్నాడు.—మత్తయి 5:22; 10:28.
20 ప్రభువు ప్రార్థన
యేసు తన శిష్యులకు ఎలా ప్రార్థించాలో నేర్పిస్తూ చెప్పిన ప్రార్థనే ప్రభువు ప్రార్థన. దీనిని పరలోక ప్రార్థన అని లేదా మాదిరి ప్రార్థన అని కూడా అంటారు. ఉదాహరణకు యేసు ఇలా ప్రార్థన చేయమని మనకు నేర్పించాడు:
“నీ పేరు పవిత్రపర్చబడాలి”
యెహోవా పేరు మీదకు, ఆయన గొప్పతనం మీదకు వచ్చిన ప్రతి అబద్ధాన్ని ఆయన తీసివేయాలని మనం ప్రార్థిస్తాం. అప్పుడు పరలోకంలో, భూమి మీద ఉన్న అందరూ దేవుని పేరును గౌరవిస్తారు.
“నీ రాజ్యం రావాలి”
దేవుని ప్రభుత్వం సాతాను దుష్టలోకాన్ని నాశనం చేయాలని, భూమిని పరిపాలించాలని, భూమిని అందమైన పరదైసులా చేయాలని మనం ప్రార్థిస్తాం.
‘నీ ఇష్టం భూమ్మీద నెరవేరాలి’
విధేయులైన, పరిపూర్ణ మనుషులతో భూమి నిండిపోయి, వాళ్లు పరదైసులో నిరంతరం జీవించాలనే దేవుని ఇష్టం నెరవేరాలని మనం ప్రార్థిస్తాం. యెహోవా మనుషుల్ని చేసినప్పుడు వాళ్లు అలా ఉండాలనే ఆయన కోరుకున్నాడు.
21 విమోచన క్రయధనం
మనుషుల్ని పాపమరణాల నుండి విడిపించడానికి యెహోవా విమోచన క్రయధనాన్ని ఏర్పాటు చేశాడు. విమోచన క్రయధనం అంటే మొదటి మానవుడైన ఆదాము పోగొట్టుకున్న పరిపూర్ణ మానవ జీవితాన్ని తిరిగి కొనడానికి, మనిషికి యెహోవాకు మధ్య పాడైన సంబంధాన్ని బాగుచేయడానికి ఇచ్చిన వెల. దేవుడు యేసును పాపులందరి కోసం చనిపోవడానికి భూమి మీదకు పంపించాడు. యేసు మరణం వల్ల, మనుషులందరూ పరిపూర్ణులై శాశ్వతంగా జీవించే అవకాశాన్ని పొందారు.
▸ 8వ అధ్యా., 21వ పేరా; 9వ అధ్యా., 13వ పేరా
22 1914 ఎందుకు చాలా ముఖ్యమైన సంవత్సరం?
దేవుడు 1914లో తన రాజ్యాన్ని స్థాపిస్తాడని దానియేలు 4వ అధ్యాయంలో ఉన్న ప్రవచనం నేర్పిస్తుంది.
ప్రవచనం: రాజైన నెబుకద్నెజరుకి కలలో, నరికి వేయబడిన ఒక పెద్ద చెట్టు గురించిన ప్రవచనాన్ని యెహోవా చూపించాడు. ఆ కలలో, “ఏడు కాలాలు” గడిచేవరకు ఆ చెట్టు పెరగకుండా దాని మొద్దు చుట్టూ ఇనుము, రాగితో చేసిన కట్టు కట్టారు. ఆ తర్వాత ఆ చెట్టు మళ్లీ పెరుగుతుంది.—దానియేలు 4:1, 10-16.
ఆ ప్రవచనం గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి?: ఆ చెట్టు దేవుని పరిపాలనకు గుర్తుగా ఉంది. చాలా సంవత్సరాల పాటు యెహోవా, ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలించడానికి యెరూషలేములో రాజుల్ని ఉపయోగించాడు. (1 దినవృత్తాంతాలు 29:23) కానీ ఆ రాజులు నమ్మకంగా లేనందుకు వాళ్ల పరిపాలన ఆగిపోయింది. యెరూషలేము క్రీస్తు పూర్వం 607 లో నాశనం చేయబడింది. అప్పుడు “ఏడు కాలాలు” మొదలు అయ్యాయి. (2 రాజులు 25:1, 8-10; యెహెజ్కేలు 21:25-27) “అన్యజనులకు నిర్ణయించిన కాలాలు పూర్తయ్యేవరకు యెరూషలేము అన్యజనుల చేత తొక్కబడుతుంది” అని యేసు చెప్పినప్పుడు ఆయన ఈ “ఏడు కాలాలు” గురించి మాట్లాడాడు. (లూకా 21:24) కాబట్టి ఆ “ఏడు కాలాలు” యేసు భూమి మీద ఉన్నప్పుడు అయిపోలేదు. యెహోవా “ఏడు కాలాలు” చివర్లో ఒక రాజును నియమిస్తానని మాట ఇచ్చాడు. ఆ కొత్త రాజైన యేసు పరిపాలన భూమి మీదున్న ప్రజలందరికీ శాశ్వతంగా ఉండే గొప్ప ఆశీర్వాదాలను తెస్తుంది.—లూకా 1:30-33.
“ఏడు కాలాలు” అంటే ఎంత కాలం?: “ఏడు కాలాలు” అంటే 2,520 సంవత్సరాలు. క్రీస్తు పూర్వం 607వ సంవత్సరం నుండి 2,520 సంవత్సరాలు లెక్కపెడితే మనం 1914కు చేరుకుంటాం. అప్పుడే యెహోవా మెస్సీయ అయిన యేసును పరలోకంలో దేవుని రాజ్యానికి రాజుగా చేశాడు.
కానీ “ఏడు కాలాలు” అంటే 2,520 సంవత్సరాలు అని మనకెలా తెలుసు? మూడున్నర కాలాలు 1,260 రోజులతో సమానం అని బైబిల్లో ఉంది. (ప్రకటన 12:6, 14) కాబట్టి ఆ సంఖ్యను రెట్టింపు చేస్తే వచ్చేది “ఏడు కాలాలు” లేదా 2,520 రోజులు. ప్రవచనాల నియమం ప్రకారం “సంవత్సరానికి ఒక రోజు” కాబట్టి 2,520 రోజులు అంటే 2,520 సంవత్సరాలతో సమానం.—సంఖ్యాకాండం 14:34; యెహెజ్కేలు 4:6.
23 ప్రధానదూత మిఖాయేలు
“ప్రధానదూత” అంటే “దూతలకు అధిపతి” అని అర్థం. బైబిలు ఒకే ఒక్క ప్రధానదూత గురించి చెప్తుంది. అతని పేరే మిఖాయేలు.—దానియేలు 12:1; యూదా 9.
మిఖాయేలు దేవుని నమ్మకమైన దూతల సైన్యానికి నాయకుడు. “మిఖాయేలు, ఆయన దూతలు మహాసర్పంతో,” దాని దూతలతో యుద్ధం చేశారని ప్రకటన 12:7 చెప్తుంది. యేసు, దేవుని సైన్యానికి నాయకుడు అని ప్రకటన పుస్తకం చెప్తుంది కాబట్టి మిఖాయేలు యేసుకున్న ఇంకొక పేరు.—ప్రకటన 19:14-16.
24 చివరి రోజులు
దేవుని రాజ్యం సాతాను లోకాన్ని నాశనం చేయబోయే కాస్తముందు భూమి మీద గొప్ప సంఘటనలు జరుగుతాయి. ఆ సంఘటనలు జరిగే కాలాన్నే చివరి రోజులు అంటాం. బైబిలు ప్రవచనంలో ప్రస్తావించబడిన ‘ఈ వ్యవస్థ ముగింపు,’ “మానవ కుమారుడి ప్రత్యక్షత” లాంటి పదాలు కూడా ఆ కాలాన్నే సూచిస్తున్నాయి. (మత్తయి 24:3, 27, 37) చివరి రోజులు 1914లో దేవుని రాజ్యం పరలోకంలో పరిపాలించడం మొదలుపెట్టాక ఆరంభం అయ్యాయి. సాతాను లోకం అర్మగిద్దోనులో నాశనం అవడంతో చివరి రోజులు ముగుస్తాయి.—2 తిమోతి 3:1; 2 పేతురు 3:3.
25 పునరుత్థానం
చనిపోయిన మనిషిని దేవుడు మళ్లీ ప్రాణాలతో బ్రతికిస్తే, దాన్ని పునరుత్థానం అంటారు. బైబిల్లో తొమ్మిది పునరుత్థానాల గురించి ఉంది. ఏలీయా, ఎలీషా, యేసు, పేతురు, పౌలు అందరూ పునరుత్థానాలు చేశారు. ఈ అద్భుతాలు కేవలం దేవుని శక్తి వల్ల సాధ్యం అయ్యాయి. యెహోవా “నీతిమంతుల్ని, అనీతిమంతుల్ని” భూమి మీద పునరుత్థానం చేస్తానని మాట ఇస్తున్నాడు. (అపొస్తలుల కార్యాలు 24:15) బైబిలు పరలోకానికి పునరుత్థానం అవడం గురించి కూడా చెప్తుంది. దేవుడు ఎన్నుకున్నవాళ్లు లేదా అభిషిక్తులు పరలోకంలో యేసుతో పాటు నివసించడానికి తిరిగి బ్రతికించబడినప్పుడు ఇది జరుగుతుంది.—యోహాను 5:28, 29; 11:25; ఫిలిప్పీయులు 3:11; ప్రకటన 20:5, 6.
26 మంత్రతంత్రాలు (అభిచారం)
మంత్రతంత్రాలు లేదా అభిచారం అంటే దయ్యాలు లేదా చెడ్డదూతలతో నేరుగా లేదా మాంత్రికులు, దయ్యం పట్టినవాళ్లు, భూతవైద్యులు లాంటి వాళ్ల ద్వారా మాట్లాడడానికి లేదా సంప్రదించడానికి ప్రయత్నించడం. మంత్రతంత్రాలు చేసేవాళ్లు మనుషులు చనిపోయాక వాళ్ల ఆత్మలు బ్రతికే ఉండి శక్తివంతమైన భూతాలుగా మారతాయనే అబద్ధ బోధను నమ్ముతారు కాబట్టి అలా చేస్తారు. ఆ చెడ్డదూతలు దేవుని మాట వినకుండా ఉండేలా మనుషుల్ని ప్రభావితం చేస్తాయి. జ్యోతిష్యం, భవిష్యవాణి లేదా సోదె చెప్పడం, మ్యాజిక్ లేదా ఇంద్రజాలం, మంత్రవిద్య, మూఢనమ్మకాలు, క్షుద్రవిద్య, లేదా మాయమంత్రాలన్నీ దయ్యాలకు సంబంధించినవే. చాలా పుస్తకాలు, పత్రికలు, రాశి ఫలాలు, సినిమాలు, పోస్టర్లు, పాటలు కూడా దయ్యాలను, మ్యాజిక్‌ని, లేదా మానవాతీత శక్తుల్ని హానికరం కాదన్నట్లు, సరదాగా ఉన్నట్లు చూపిస్తాయి. చనిపోయిన వాళ్లకు బలులు ఇవ్వడం, కర్మలు, దినాలు, సంవత్సరికాలు, వితంతు ఆచారాలు, శవ జాగారాలు లాంటి చాలా ఆచారాలు చెడ్డదూతలతో సంబంధాలు పెట్టుకునేవే. చెడ్డదూతల శక్తిని ఉపయోగించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు చాలామంది మాదకద్రవ్యాలు ఎక్కువగా వాడతారు.—గలతీయులు 5:20; ప్రకటన 21:8.
▸ 10వ అధ్యా., 10వ పేరా; 16వ అధ్యా., 4వ పేరా
27 యెహోవా సర్వాధిపత్యం
యెహోవా సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆయన విశ్వమంతటినీ సృష్టించాడు. (ప్రకటన 15:3) అందుకే అన్నిటికీ యజమాని ఆయనే, ఆయనకే తన సృష్టి అంతటినీ పరిపాలించే సర్వాధిపత్యం లేదా పూర్తి అధికారం ఉంది. (కీర్తన 24:1; యెషయా 40:21-23; ప్రకటన 4:11) ఆయన సృష్టించిన వాటన్నిటికీ ఆయన నియమాలు పెట్టాడు. ఇతరులను పరిపాలకులుగా నియమించే అధికారం కూడా యెహోవాకు ఉంది. మనం దేవున్ని ప్రేమించి ఆయనకు లోబడినప్పుడు ఆయన సర్వాధిపత్యానికి మద్దతు ఇస్తాం.—1 దినవృత్తాంతాలు 29:11.
28 అబార్షన్ లేదా కడుపులో బిడ్డను చంపడం
కడుపులో ఉన్న బిడ్డను కావాలని చనిపోయేలా చేయడమే అబార్షన్. అది ఒక ప్రమాదం కాదు లేదా శరీరంలో సహజంగా జరిగే ప్రక్రియల ఫలితం కాదు. బిడ్డ కడుపులో పడ్డప్పటి నుండి, ఆ బిడ్డ తల్లి శరీరంలో ఒక భాగం మాత్రమే కాదు. ఆ బిడ్డ ఒక వేరే ప్రాణం.
29 రక్త మార్పిడి
ఈ వైద్య ప్రక్రియ ద్వారా పూర్తి రక్తాన్ని, లేదా రక్తంలో ఉన్న నాలుగు ప్రధాన భాగాల్లో ఒక భాగాన్ని ఒకరి శరీరం నుండి మరొకరి శరీరంలోకి పంపిస్తారు లేదా నిలువ చేసిన రక్తాన్ని ఎక్కిస్తారు. రక్తంలో నాలుగు ప్రధాన భాగాలు ప్లాస్మా, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్‌లెట్లు.
30 క్రమశిక్షణ
బైబిల్లో “క్రమశిక్షణ” అంటే శిక్షించడానికి వాడే పదం మాత్రమే కాదు. మనకు క్రమశిక్షణ ఇచ్చినప్పుడు మనకు నిర్దేశం ఇవ్వబడుతుంది, జ్ఞానం వస్తుంది, తప్పు సరిదిద్దబడుతుంది. యెహోవా క్రమశిక్షణ ఇస్తున్నప్పుడు, ఆయన అస్సలు దూషించడు లేదా క్రూరంగా ఉండడు. (సామెతలు 4:1, 2) యెహోవా తల్లిదండ్రులకు చాలా మంచి ఆదర్శం ఉంచాడు. ఆయన ఇచ్చే క్రమశిక్షణ ఎంత బాగా పనిచేస్తుందంటే దాన్ని పొందినవాళ్లు ఆ క్రమశిక్షణను ప్రేమించడం మొదలుపెడతారు. (సామెతలు 12:1) యెహోవా తన ప్రజలను ప్రేమిస్తాడు, వాళ్లకు శిక్షణ ఇస్తాడు. ఆయన వాళ్లకు నిర్దేశాలు ఇచ్చి వాళ్ల తప్పుడు అభిప్రాయాలను సరిచేస్తాడు, దానివల్ల వాళ్లు ఆయనకు ఇష్టమైన విధంగా ఎలా ఆలోచించాలో ఎలా ప్రవర్తించాలో నేర్చుకుంటారు. తల్లిదండ్రులు పిల్లలకు క్రమశిక్షణ ఇస్తున్నప్పుడు పిల్లలు ఎందుకు వాళ్ల మాట వినాలో అర్థం చేసుకోవడానికి సహాయం చేయాలి. అంతేకాదు క్రమశిక్షణ అంటే యెహోవాను ప్రేమించేలా వాళ్లకు నేర్పించడం, దానితోపాటు ఆయన వాక్యమైన బైబిల్ని ప్రేమించేలా, అందులో ఉన్న సూత్రాలను అర్థం చేసుకునేలా వాళ్లకు నేర్పించడం.
31 దయ్యాలు లేదా చెడ్డదూతలు
వాళ్లు మానవాతీత శక్తులున్న అదృశ్యమైన చెడ్డ ఆత్మ ప్రాణులు. దయ్యాలు అంటే చెడ్డ దూతలు. వాళ్లు దేవుని మాట వినకపోవడం వల్ల తమనుతాము ఆయనకు శత్రువులుగా చేసుకుని చెడ్డవాళ్లుగా మారారు. (ఆదికాండం 6:2; యూదా 6) వాళ్లు యెహోవాకు వ్యతిరేకంగా సాతాను చేసే తిరుగుబాటులో చేతులు కలిపారు.—ద్వితీయోపదేశకాండం 32:17; లూకా 8:30; అపొస్తలుల కార్యాలు 16:16; యాకోబు 2:19.