కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • bhs అధ్యా. 13 పేజీలు 135-144
  • ప్రాణం అనే బహుమానాన్ని గౌరవించండి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రాణం అనే బహుమానాన్ని గౌరవించండి
  • బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
  • బైబిలు బోధిస్తోందిలో చదవండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • దేవుడు ప్రాణాన్ని ఎలా చూస్తాడు?
  • జీవానికున్న పవిత్రతను గౌరవించాలి
  • రక్తం విషయంలో యెహోవా అనుమతించిన ఒకేఒక్క పద్ధతి
  • దేవునిలా ప్రాణాన్ని విలువైనదిగా చూడండి
    దేవుని ప్రేమలో ఎప్పటికీ నిలిచివుండండి
  • మీ జీవవరాన్ని అత్యంత విలువైనదిగా పరిగణించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • దేవునిలాగే మీరూ ప్రాణాన్ని విలువైనదిగా ఎంచుతారా?
    ‘దేవుని ప్రేమలో నిలిచి ఉండండి’
  • రక్తముతో జీవమును రక్షించుకొనుట—ఎట్లు?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1992
మరిన్ని
బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?
bhs అధ్యా. 13 పేజీలు 135-144

13వ అధ్యాయం

ప్రాణం అనే బహుమానాన్ని గౌరవించండి

1. మనకు ప్రాణం ఎవరు ఇచ్చారు?

యెహోవా “జీవంగల దేవుడు.” (యిర్మీయా 10:10) ఆయన మన సృష్టికర్త, మనకు ప్రాణాన్ని ఇచ్చాడు. బైబిలు ఇలా చెప్తుంది: “నువ్వు అన్నిటినీ సృష్టించావు; నీ ఇష్టాన్ని బట్టే అవి ఉనికిలోకి వచ్చాయి, సృష్టించబడ్డాయి.” (ప్రకటన 4:11) అవును మనం జీవించి ఉండాలని యెహోవా కోరుకున్నాడు. ప్రాణం ఆయన నుండి వచ్చిన విలువైన బహుమానం.—కీర్తన 36:9 చదవండి.

2. మన జీవితాన్ని ఎలా విజయవంతం చేసుకోవచ్చు?

2 మనం బ్రతికి ఉండడానికి కావాల్సిన ఆహారం, నీళ్లు లాంటి వాటన్నిటిని యెహోవా మనకు ఇస్తున్నాడు. (అపొస్తలుల కార్యాలు 17:28) అంతేకాదు, మనం జీవితాన్ని ఆనందించాలని ఆయన కోరుకుంటున్నాడు. (అపొస్తలుల కార్యాలు 14:15-17) జీవితం విజయవంతంగా ఉండాలంటే మనం దేవుని నియమాలకు లోబడాలి.—యెషయా 48:17, 18.

దేవుడు ప్రాణాన్ని ఎలా చూస్తాడు?

3. కయీను హేబెలును చంపినప్పుడు యెహోవా ఏమి చేశాడు?

3 మన ప్రాణం, ఇతరుల ప్రాణం యెహోవాకు చాలా అమూల్యం అని బైబిలు నేర్పిస్తుంది. ఉదాహరణకు ఆదాముహవ్వల కొడుకైన కయీను తన తమ్ముడైన హేబెలు మీద తీవ్రంగా కోపపడినప్పుడు, ఆ కోపాన్ని తగ్గించుకోమని యెహోవా కయీనుని హెచ్చరించాడు. కానీ కయీను వినలేదు, అతను చాలా కోపంతో “తన తమ్ముడు హేబెలు మీద దాడిచేసి అతన్ని చంపేశాడు.” (ఆదికాండం 4:3-8) హేబెలును చంపినందుకు యెహోవా కయీనుని శిక్షించాడు. (ఆదికాండం 4:9-11) కాబట్టి కోపం, ద్వేషం చాలా ప్రమాదకరమైనవి, ఎందుకంటే అవి మనల్ని హింసాత్మకంగా, క్రూరంగా మారుస్తాయి. అలాంటివాళ్లకు శాశ్వత జీవితం ఉండదు. (1 యోహాను 3:15 చదవండి.) యెహోవాను సంతోషపెట్టాలంటే మనం అందర్నీ ప్రేమించడం నేర్చుకోవాలి.—1 యోహాను 3:11, 12.

4. దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ఒక ఆజ్ఞ నుండి ప్రాణం ఎంత విలువైనదో మనం ఎలా తెలుసుకోవచ్చు?

4 వేల సంవత్సరాల తర్వాత కూడా యెహోవా, ప్రాణాన్ని అంతే విలువైనదిగా చూస్తున్నాడని మోషేకు పది ఆజ్ఞలు ఇచ్చినప్పుడు చూపించాడు. వాటిలో ఒక ఆజ్ఞ ఏమిటంటే, “నువ్వు హత్య చేయకూడదు.” (ద్వితీయోపదేశకాండం 5:17) ఎవరైనా వేరేవాళ్లను కావాలని చంపితే, చంపిన అతనికి లేదా ఆమెకు మరణ శిక్ష పడుతుంది.

5. అబార్షన్‌ చేయించుకోవడం గురించి దేవుడు ఎలా భావిస్తాడు?

5 అబార్షన్‌ లేదా కడుపులో ఉన్న బిడ్డను చంపడం గురించి దేవుడు ఎలా భావిస్తాడు? ఇంకా పుట్టని బిడ్డ ప్రాణం కూడా యెహోవాకు చాలా విలువైనది. యెహోవా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రం ప్రకారం, ఎవరైనా ఒక గర్భిణీ స్త్రీని గాయపర్చినప్పుడు ఆమె బిడ్డ చనిపోతే ఆ గాయపర్చిన వాళ్లను చంపేయాలి. (నిర్గమకాండం 21:22-25 చదవండి; కీర్తన 127:3.) దీన్నిబట్టి కడుపులో ఉన్న బిడ్డను చంపడం తప్పని మనం నేర్చుకోవచ్చు.—అదనపు సమాచారంలో 28వ పాయింట్‌ చూడండి.

6, 7. మనం ప్రాణానికి విలువిస్తున్నామని యెహోవాకు ఎలా చూపిస్తాం?

6 మనం మన ప్రాణాన్ని, ఇతరుల ప్రాణాల్ని విలువైనవిగా చూస్తున్నామని యెహోవాకు ఎలా చూపించవచ్చు? మన ప్రాణాన్ని లేదా ఇతరుల ప్రాణాల్ని ప్రమాదంలో పడేసే పనులేవీ చేయకుండా ఉండడం ద్వారా చూపించవచ్చు. అందుకే మనం పొగాకు తీసుకోం, వక్క తినం, మాదకద్రవ్యాలు తీసుకోం. ఎందుకంటే అవి మనకు హాని చేస్తాయి, చంపేయవచ్చు కూడా.

7 దేవుడు మనకు ప్రాణాన్ని, శరీరాన్ని ఇచ్చాడు. మనం వాటిని ఆయన కోరుకున్న విధంగా ఉపయోగించాలి. కాబట్టి మనం మన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. లేకపోతే మనం దేవుని దృష్టిలో అపవిత్రులం అవుతాం. (రోమీయులు 6:19; 12:1; 2 కొరింథీయులు 7:1) మనం ప్రాణాన్ని విలువైనదిగా చూడకపోతే మనకు ప్రాణాన్ని ఇచ్చిన యెహోవాను ఆరాధించలేం. చెడు అలవాట్లను మానుకోవడం చాలా కష్టం కావచ్చు. అయితే మనం ప్రాణాన్ని ఎంతో విలువైనదిగా చూస్తున్నాం కాబట్టి చెడు అలవాట్లను మానుకోవడానికి ప్రయత్నిస్తుంటే యెహోవా మనకు సహాయం చేస్తాడు.

8. మన ప్రాణాన్ని లేదా ఇతరుల ప్రాణాల్ని ప్రమాదంలో పడేయకుండా ఉండడానికి మనం ఏమి చేస్తాం?

8 ప్రాణం ఒక విలువైన బహుమానం అని మనం తెలుసుకున్నాం. మన ప్రాణాన్ని, ఇతరుల ప్రాణాల్ని ప్రమాదంలో పడేయకుండా ఉండడానికి మనం చేయగలిగినదంతా చేస్తామని యెహోవా నమ్ముతున్నాడు. అందుకే మనం మన కారుని, బైకుని లేదా ఇతర వాహనాల్ని జాగ్రత్తగా నడుపుతాం. ప్రమాదకరంగా, హింసాత్మకంగా ఉన్న ఆటలకు దూరంగా ఉంటాం. (కీర్తన 11:5) మన ఇల్లు కూడా సురక్షితంగా ఉండేలా చూసుకుంటాం. యెహోవా ఇశ్రాయేలీయులకు ఇలా ఆజ్ఞ ఇచ్చాడు: “నువ్వు ఒక కొత్త ఇల్లు కట్టుకున్నప్పుడు, ఎవరైనా దాని మీద నుండి కిందపడి నీ ఇంటిమీదికి రక్తాపరాధం రాకుండా ఉండేలా నీ ఇంటి పైకప్పుకు పిట్టగోడ కట్టాలి.”—ద్వితీయోపదేశకాండం 22:8.

9. మనం జంతువుల్ని ఎలా చూడాలి?

9 మనం జంతువుల్ని ఎలా చూస్తామనేది కూడా యెహోవాకు ముఖ్యం. ఆహారం కోసం, బట్టల కోసం, లేదా మనమీద దాడిచేసినప్పుడు జంతువుల్ని చంపడానికి ఆయన అనుమతిస్తాడు. (ఆదికాండం 3:21; 9:3; నిర్గమకాండం 21:28) కానీ మనం జంతువులతో క్రూరంగా ఉండకూడదు లేదా ఆటల కోసం వాటిని చంపకూడదు.—సామెతలు 12:10.

జీవం విలువైనది

  • ఇంకా పుట్టని బిడ్డను మనం చంపం

  • మనం ఇతరులను ద్వేషించం

  • మనం పొగాకు, వక్క, మాదకద్రవ్యాలు తీసుకోం

1. ఇంకా పుట్టని బిడ్డ; 2. ఒక అతను సిగరెట్‌ ప్యాకెట్‌ని నలిపేస్తున్నాడు; 3. వేర్వేరు జాతులకు చెందిన ఇద్దరు స్నేహితులు

జీవానికున్న పవిత్రతను గౌరవించాలి

10. రక్తం జీవానికి గుర్తుగా ఉందని మనకు ఎలా తెలుసు?

10 రక్తం యెహోవాకు పవిత్రం ఎందుకంటే రక్తం జీవానికి గుర్తు. కయీను హేబెలును చంపిన తర్వాత యెహోవా కయీనుతో ఇలా అన్నాడు: “నీ తమ్ముడి రక్తం నేల నుండి నాకు మొరపెడుతోంది.” (ఆదికాండం 4:10) హేబెలు రక్తం అతని ప్రాణానికి గుర్తుగా ఉంది. హేబెలును చంపినందుకు యెహోవా కయీనుని శిక్షించాడు. నోవహు కాలంలో జలప్రళయం తర్వాత కూడా, రక్తం జీవానికి గుర్తు అని యెహోవా చూపించాడు. యెహోవా నోవహుకు అతని కుటుంబానికి జంతువుల మాంసం తినడానికి అనుమతి ఇచ్చాడు. ఆయన ఇలా చెప్పాడు: “ప్రాణంతో కదిలే ప్రతీ జంతువు మీకు ఆహారంగా ఉంటుంది. పచ్చని కూరమొక్కల్ని ఇచ్చినట్టు వాటన్నిటినీ మీకు ఇస్తున్నాను.” కానీ యెహోవా ఒకటి మాత్రం తినవద్దని ఆజ్ఞ ఇచ్చాడు: “మాంసాన్ని దాని రక్తంతో తినకూడదు, ఎందుకంటే రక్తమే దాని ప్రాణం.”—ఆదికాండం 1:29; 9:3, 4.

11. దేవుడు ఇశ్రాయేలీయులకు రక్తం గురించి ఏ ఆజ్ఞ ఇచ్చాడు?

11 నోవహుకు చెప్పిన 800 సంవత్సరాల తర్వాత, రక్తాన్ని తినవద్దని యెహోవా మళ్లీ తన ప్రజలకు ఇలా ఆజ్ఞ ఇచ్చాడు: “ఇశ్రాయేలీయుల్లో లేదా మీ మధ్య నివసించే పరదేశుల్లో ఎవరైనా వేటాడి, తినదగిన జంతువును గానీ పక్షిని గానీ పట్టుకుంటే, అతను దాని రక్తాన్ని పారబోసి, మట్టితో కప్పేయాలి.” ఆ తర్వాత ఆయన ఇలా చెప్పాడు: ‘మీరు . . . రక్తాన్ని తినకూడదు.’ (లేవీయకాండం 17:13, 14) ఇశ్రాయేలీయులు కూడా రక్తాన్ని పవిత్రంగా చూడాలని యెహోవా కోరుకున్నాడు. వాళ్లు మాంసం తినవచ్చు కానీ రక్తాన్ని తినకూడదు. వాళ్లు ఆహారం కోసం జంతువును చంపినప్పుడు దాని రక్తాన్ని నేల మీద పోయాలి.

12. క్రైస్తవులు రక్తాన్ని ఎలా చూస్తారు?

12 యేసు చనిపోయిన కొన్ని సంవత్సరాల తర్వాత, యెరూషలేములోని క్రైస్తవ సంఘంలో ఉన్న అపొస్తలులు, పెద్దలు ధర్మశాస్త్రంలో ఏ విషయాల్ని క్రైస్తవులు ఇంకా పాటించాలో నిర్ణయించడానికి కలుసుకున్నారు. (అపొస్తలుల కార్యాలు 15:28, 29 చదవండి; 21:25.) యెహోవాకు రక్తం ఇంకా విలువైనదని, వాళ్లు ఇంకా రక్తాన్ని పవిత్రంగానే చూడాలని అర్థం చేసుకోవడానికి యెహోవా వాళ్లకు సహాయం చేశాడు. తొలి క్రైస్తవులు రక్తాన్ని తినకూడదు, తాగకూడదు లేదా రక్తం సరిగ్గా ఒలికించని మాంసాన్ని కూడా తినకూడదు. వాళ్లు అలా చేస్తే అది విగ్రహాలను ఆరాధించడం, లేదా లైంగిక పాపాలు చేయడం అంత పెద్ద తప్పు అవుతుంది. అప్పటి నుండి నిజ క్రైస్తవులు రక్తాన్ని తినడాన్ని తాగడాన్ని నిరాకరించారు. మరి ఈరోజు పరిస్థితి ఏంటి? మనం కూడా రక్తాన్ని పవిత్రంగా చూడాలని యెహోవా కోరుకుంటున్నాడు.

13. క్రైస్తవులు ఎందుకు రక్తమార్పిడులు చేసుకోరు?

13 అంటే క్రైస్తవులు రక్తాన్ని ఎక్కించుకోవడం లేదా ఇవ్వడం చేయకూడదని దాని అర్థమా? అవును, చేయకూడదు. యెహోవా మనకు రక్తాన్ని తినకూడదు, తాగకూడదు అని ఆజ్ఞ ఇచ్చాడు. డాక్టరు మీకు మద్యం తాగకూడదని చెప్తే మీరు దాన్ని మీ శరీరంలోకి ఎక్కించుకుంటారా? లేదు కదా! అలాగే రక్తాన్ని తినకూడదు, తాగకూడదు అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంటే, మనం రక్తమార్పిడి కూడా చేసుకోమని అర్థం.—అదనపు సమాచారంలో 29వ పాయింట్‌ చూడండి.

14, 15. ప్రాణాన్ని గౌరవిస్తూనే యెహోవాకు లోబడడం ఒక క్రైస్తవుడికి ఎంత ముఖ్యం?

14 ఒకవేళ రక్తం ఎక్కించుకోకపోతే మనం చనిపోతామని డాక్టరు చెప్తే అప్పుడేంటి? రక్తం విషయంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు లోబడాలా వద్దా అని ప్రతీ ఒక్కరు వాళ్లకు వాళ్లే నిర్ణయించుకోవాలి. క్రైస్తవులు దేవుడిచ్చిన ప్రాణం అనే బహుమానాన్ని ఎంతో గౌరవిస్తారు. మనం బ్రతికి ఉండడానికి వేరే చికిత్సా పద్ధతులు ఉన్నాయేమో చూస్తాం, కానీ రక్తం మాత్రం ఎక్కించుకోం.

15 మనం ఆరోగ్యంగా ఉండడానికి చాలా కష్టపడతాం, కానీ ప్రాణం దేవుని దృష్టిలో చాలా విలువైంది కాబట్టి మనం రక్తం ఎక్కించుకోవడానికి ఒప్పుకోం. దేవుని మాటకు లోబడకుండా మన జీవితాన్ని పొడిగించుకోవడం కన్నా యెహోవాకు లోబడడమే చాలా ముఖ్యం. యేసు ఇలా చెప్పాడు: “తన ప్రాణాన్ని కాపాడుకోవాలనుకునే వ్యక్తి దాన్ని పోగొట్టుకుంటాడు. కానీ నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకునే వ్యక్తి దాన్ని కాపాడుకుంటాడు.” (మత్తయి 16:25) మనం యెహోవాను ప్రేమిస్తాం కాబట్టి ఆయనకు లోబడాలని అనుకుంటాం. మనకు ఏది మంచిదో ఆయనకు తెలుసు. యెహోవా ప్రాణాన్ని ఎంత అమూల్యంగా, ఎంత పవిత్రంగా చూస్తున్నాడో మనమూ అలానే చూస్తాం.—హెబ్రీయులు 11:6.

16. దేవుని సేవకులు ఆయనకు ఎందుకు లోబడతారు?

16 దేవుని నమ్మకమైన సేవకులు రక్తం విషయంలో ఆయన నియమాలకు లోబడాలని నిశ్చయించుకున్నారు. వాళ్లు రక్తాన్ని తినరు లేదా తాగరు, వైద్య కారణాల వల్ల రక్తాన్ని ఎక్కించుకోరు.a కానీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి వాళ్లు వేరే చికిత్సలను తీసుకుంటారు. వాళ్లకు అన్నిటికన్నా ఏది మంచిదో జీవాన్ని, రక్తాన్ని సృష్టించిన దేవునికే తెలుసని వాళ్ల పూర్తి నమ్మకం. మీకు అన్నిటికన్నా ఏది మంచిదో దేవునికి తెలుసని మీరు నమ్ముతున్నారా?

రక్తం విషయంలో యెహోవా అనుమతించిన ఒకేఒక్క పద్ధతి

17. ఇశ్రాయేలులో ఏ ఒక్క విషయంలో మాత్రమే రక్తాన్ని ఉపయోగించడానికి యెహోవా అనుమతించాడు?

17 దేవుడు మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రంలో యెహోవా ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పాడు: “ఒక జీవి ప్రాణం దాని రక్తంలో ఉంటుంది; మీరు బలిపీఠం మీద ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి [క్షమాపణ అడగడానికి] దాన్ని మీకు ఇచ్చాను. ఎందుకంటే రక్తం . . . ప్రాయశ్చిత్తం చేస్తుంది.” (లేవీయకాండం 17:11) ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు, ఒక జంతువును బలిగా ఇచ్చి, దాని రక్తాన్ని కొంచెం ఆలయ బలిపీఠం మీద పోయమని యాజకున్ని అడగడం ద్వారా వాళ్లు యెహోవా క్షమాపణను కోరేవారు. ఆ ఒక్క విషయంలో మాత్రమే రక్తాన్ని ఉపయోగించడానికి యెహోవా ఇశ్రాయేలీయులను అనుమతించాడు.

18. యేసు ప్రాణాన్ని బలిగా ఇవ్వడం ద్వారా మనకు ఏమి సాధ్యం అయింది?

18 యేసు భూమి మీదకు వచ్చినప్పుడు మన పాప క్షమాపణ కోసం తన ప్రాణాన్ని లేదా రక్తాన్ని ఇవ్వడం ద్వారా, జంతువులను బలిగా అర్పించే నియమాన్ని మార్చాడు. (మత్తయి 20:28; హెబ్రీయులు 10:1) యేసు ప్రాణం ఎంతో విలువైంది కాబట్టి ఆయనను పరలోకానికి పునరుత్థానం చేసిన తర్వాత యెహోవా, యేసు బలి ఆధారంగా మనుషులందరికీ శాశ్వతంగా జీవించే అవకాశాన్ని ఇవ్వగలడు.—యోహాను 3:16; హెబ్రీయులు 9:11, 12; 1 పేతురు 1:18, 19.

ఒక క్రైస్తవురాలు రక్తం విషయంలో బైబిలు ఆధారంగా ఉన్న తన నమ్మకాలను డాక్టర్‌కి వివరిస్తుంది

జీవానికి, రక్తానికి మీరు ఎలా గౌరవాన్ని చూపించవచ్చు?

19. ఎవరి రక్తం విషయంలోనూ దోషులు కాకుండా ఉండాలంటే మనం ఏమి చేయాలి?

19 జీవం అనే అద్భుతమైన బహుమానాన్ని ఇచ్చినందుకు మనం యెహోవాకు ఎంతో కృతజ్ఞులై ఉన్నాం. యేసు మీద విశ్వాసం ఉంచితే ప్రజలు శాశ్వతంగా జీవించవచ్చని మనం వాళ్లకు చెప్పాలనుకుంటాం. మనం ప్రజల్ని ప్రేమిస్తాం, ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఏమి చేయాలో వాళ్లకు నేర్పించడానికి మనం చేయగలిగినదంతా చేస్తాం. (యెహెజ్కేలు 3:17-21) అప్పుడు అపొస్తలుడైన పౌలులా మనం కూడా ఇలా చెప్పగలుగుతాం: “ఎవరి రక్తం విషయంలోనూ నేను దోషిని కాను . . . నేను దేవుని ఇష్టమంతటినీ మీకు చెప్పకుండా ఉండలేదు.” (అపొస్తలుల కార్యాలు 20:26, 27) అవును, ఇతరులకు యెహోవా గురించి చెప్పినప్పుడు, జీవం ఆయనకు ఎంత విలువైనదో చెప్పినప్పుడు మనం ప్రాణాన్ని, రక్తాన్ని ఎంతో గౌరవిస్తున్నామని చూపిస్తాం.

a రక్త మార్పిడుల గురించి ఎక్కువ సమాచారం కోసం యెహోవాసాక్షులు ప్రచురించిన “దేవుని ప్రేమలో నిలిచి ఉండండి” అనే పుస్తకంలో 87-89 పేజీలు చూడండి.

వీటిని గుర్తుపెట్టుకుందాం

1వ సత్యం: ప్రాణం అనే బహుమానాన్ని గౌరవించండి

“నీ దగ్గర జీవపు ఊట ఉంది.”—కీర్తన 36:9

ప్రాణం పట్ల మనం గౌరవాన్ని ఎలా చూపిస్తాం?

  • అపొస్తలుల కార్యాలు 17:28; ప్రకటన 4:11

    ప్రాణం యెహోవా నుండి వచ్చిన బహుమానం, మనం ప్రాణం పట్ల గౌరవం చూపించాలి.

  • నిర్గమకాండం 21:22, 23; ద్వితీయోపదేశకాండం 5:17

    హత్యలు, కడుపులో ఉన్న బిడ్డను చంపడం తప్పు.

  • 1 యోహాను 3:11, 12, 15

    ద్వేషం తప్పు.

  • 2 కొరింథీయులు 7:1

    పొగ తాగడం, మాదక ద్రవ్యాలు తీసుకోవడం లాంటి అపరిశుభ్రమైన అలవాట్లకు దూరంగా ఉండాలి.

  • కీర్తన 11:5

    ప్రమాదకరమైన వినోదానికి, ఆటలకు దూరంగా ఉండాలి.

2వ సత్యం: ప్రాణం, రక్తం

“ప్రతీ జీవికి దాని రక్తమే ప్రాణం, ఎందుకంటే రక్తంలోనే ప్రాణం ఉంటుంది.”—లేవీయకాండం 17:14

ప్రాణం, రక్తం విషయంలో దేవుని అభిప్రాయం ఏంటి?

  • ఆదికాండం 4:10; ద్వితీయోపదేశకాండం 12:23

    రక్తం ప్రాణానికి గుర్తు.

  • ఆదికాండం 9:3, 4

    మనం మాంసాన్ని తినవచ్చు కానీ రక్తాన్ని కాదు.

  • అపొస్తలుల కార్యాలు 15:28, 29; 21:25

    రక్తానికి దూరంగా ఉండండి అనే దేవుని ఆజ్ఞ ప్రకారం చికిత్స కోసం కూడా రక్తాన్ని వాడకూడదు.

  • హెబ్రీయులు 11:6

    యెహోవాతో మన సంబంధం మన జీవితంలో అన్నిటికన్నా ముఖ్యమైనది.

3వ సత్యం: రక్తాన్ని ఉపయోగించే విషయంలో యెహోవా అనుమతించిన పద్ధతులు

“యేసు రక్తం మన పాపాలన్నిటి నుండి మనల్ని పవిత్రుల్ని చేస్తుంది.”—1 యోహాను 1:7

యేసు ప్రాణాన్ని బలిగా ఇవ్వడం ద్వారా మనకు ఏమి సాధ్యం అయింది?

  • లేవీయకాండం 17:11

    బైబిలు కాలాల్లో ఇశ్రాయేలీయులు పాపం చేసినప్పుడు, వాళ్లు ఒక జంతువును బలిగా ఇచ్చి, దాని రక్తాన్ని కొంచెం బలిపీఠం మీద పోయమని యాజకున్ని అడగడం ద్వారా యెహోవా క్షమాపణను కోరేవాళ్లు.

  • మత్తయి 20:28; హెబ్రీయులు 9:11-14

    యేసు భూమి మీదకు వచ్చినప్పుడు మన పాపాల క్షమాపణ కోసం తన ప్రాణాన్ని లేదా రక్తాన్ని ఇవ్వడం ద్వారా జంతువులను బలిగా ఇచ్చే నియమాన్ని మార్చాడు.

  • యోహాను 3:16

    యేసు ప్రాణం ఎంతో విలువైనది కాబట్టి ఆయనను పరలోకానికి పునరుత్థానం చేసిన తర్వాత, యేసు మీద విశ్వాసం ఉంచే మనుషులందరికీ యెహోవా శాశ్వతంగా జీవించే అవకాశాన్ని ఇచ్చాడు.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి