12వ అధ్యాయం
మీరు ఎలా దేవునికి స్నేహితులు అవ్వవచ్చు?
1, 2. యెహోవా స్నేహితులు కొంతమంది ఎవరు?
ఎలాంటి వాళ్లు మీకు స్నేహితులుగా ఉండాలని మీరు కోరుకుంటారు? మీకు ఇష్టమైన వాళ్లను, మీరు చక్కగా కలిసిపోయే వాళ్లను లేదా మీతో చక్కగా కలిసిపోయే వాళ్లను, దయగా ఉండేవాళ్లను, మీకు నచ్చిన లక్షణాలు ఉన్నవాళ్లను మీ స్నేహితులుగా చేసుకోవాలని అనుకుంటారు.
2 యెహోవా దేవుడు కొంతమంది మనుషుల్ని తన స్నేహితులుగా చేసుకుంటాడు. ఉదాహరణకు, అబ్రాహాము దేవుని స్నేహితుల్లో ఒకడు. (యెషయా 41:8; యాకోబు 2:23) దావీదు అంటే కూడా యెహోవాకు ఇష్టం. దావీదు “నా హృదయానికి నచ్చిన వ్యక్తి” అని ఆయన అన్నాడు. (అపొస్తలుల కార్యాలు 13:22) దానియేలు ప్రవక్త కూడా యెహోవాకు “ఎంతో అమూల్యమైనవాడు.”—దానియేలు 9:23.
3. అబ్రాహాము, దావీదు, దానియేలు ఎందుకు యెహోవాకు స్నేహితులు అయ్యారు?
3 అబ్రాహాము, దావీదు, దానియేలు ఎలా యెహోవాకు స్నేహితులు అయ్యారు? యెహోవా అబ్రాహాముతో ఇలా అన్నాడు: “నువ్వు నా మాట విన్నావు.” (ఆదికాండం 22:18) తన మాటను వినయంగా వినేవాళ్లకు యెహోవా స్నేహితుడు అవుతాడు. ఒక దేశమంతా కూడా యెహోవాకు స్నేహితులు అవ్వగలిగారు. ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా ఇలా చెప్పాడు: “నా మాటకు లోబడండి, అప్పుడు నేను మీకు దేవునిగా ఉంటాను, మీరు నాకు ప్రజలుగా ఉంటారు.” (యిర్మీయా 7:23) కాబట్టి మీరు నిజంగా యెహోవా స్నేహితులు అవ్వాలనుకుంటే మీరు కూడా ఆయనకు లోబడాలి.
యెహోవా తన స్నేహితులను కాపాడతాడు
4, 5. యెహోవా తన స్నేహితులను ఎలా కాపాడతాడు?
4 “ఎవరి హృదయమైతే తన పట్ల సంపూర్ణంగా ఉంటుందో వాళ్ల తరఫున తన బలం చూపించే” అవకాశాల కోసం యెహోవా వెదుకుతున్నాడని బైబిలు చెప్తుంది. (2 దినవృత్తాంతాలు 16:9) అంతేకాదు, కీర్తన 32:8 లో యెహోవా తన స్నేహితులకు ఇలా మాటిస్తున్నాడు: “నేను నీకు లోతైన అవగాహనను ఇస్తాను, నువ్వు నడవాల్సిన మార్గాన్ని నీకు ఉపదేశిస్తాను. నీ మీద దృష్టి ఉంచి నీకు సలహా చెప్తాను.”
5 శక్తిమంతుడైన ఒక శత్రువు మనం దేవునికి స్నేహితులు కాకుండా ఆపాలని ప్రయత్నిస్తున్నాడు. కానీ యెహోవా మనల్ని కాపాడాలని కోరుకుంటున్నాడు. (కీర్తన 55:22 చదవండి.) యెహోవా స్నేహితులుగా, మనం హృదయపూర్వకంగా ఆయనను సేవిస్తాం. కష్ట పరిస్థితుల్లో కూడా మనం ఆయనకు నమ్మకంగా ఉంటాం. కీర్తన రచయితకు ఉన్నలాంటి నమ్మకమే మనకూ ఉంది. ఆయన యెహోవా గురించి ఇలా రాశాడు: “ఆయన నా కుడిపక్కన ఉన్నాడు కాబట్టి నేను ఎప్పటికీ కదిలించబడను.” (కీర్తన 16:8; 63:8) మనం దేవుని స్నేహితులుగా ఉండకుండా చేయడానికి సాతాను ఎలా ప్రయత్నిస్తాడు?
సాతాను వేసిన నింద
6. మనుషుల గురించి సాతాను ఏమని చెప్తున్నాడు?
6 మనం 11వ అధ్యాయంలో సాతాను యెహోవాను సవాలు చేసినట్లు, దేవుడు అబద్ధం చెప్పాడని, మంచి ఏదో చెడు ఏదో నిర్ణయించుకునే హక్కు ఆదాముహవ్వలకు ఇవ్వకుండా అన్యాయం చేశాడని నిందించినట్లు చూశాం. సాతాను దేవునికి స్నేహితులుగా ఉండాలని కోరుకునే వాళ్లను కూడా నిందిస్తాడని బైబిల్లో యోబు పుస్తకం చెప్తుంది. దేవుని నుండి ఏదో ఆశించే ఆయన్ని ఆరాధిస్తున్నారు కానీ ఆయన మీద ప్రేమతో కాదని సాతాను అంటున్నాడు. తాను ఎవరినైనా దేవునికి వ్యతిరేకంగా చేయగలనని కూడా సాతాను చెప్తున్నాడు. యోబు నుండి మనం ఏమి నేర్చుకోవచ్చో, యెహోవా ఆయనను ఎలా కాపాడాడో ఇప్పుడు చూద్దాం.
7, 8. (ఎ) యోబు గురించి యెహోవా ఏమని భావించాడు? (బి) యోబు గురించి సాతాను ఏమన్నాడు?
7 యోబు ఎవరు? ఆయన దాదాపు 3,600 సంవత్సరాల క్రితం జీవించిన ఒక మంచి మనిషి. ఆ రోజుల్లో భూమ్మీద యోబు లాంటి వాళ్లు ఎవరూ లేరని యెహోవా చెప్పాడు. యోబుకు దేవుడంటే ఎంతో గౌరవం, ఆయన చెడును అసహ్యించుకున్నాడు. (యోబు 1:8) అవును, యోబు యెహోవాకు నిజమైన స్నేహితుడు.
8 కానీ యోబు స్వార్థంతోనే దేవున్ని ఆరాధిస్తున్నాడని సాతాను అన్నాడు. సాతాను యెహోవాతో ఇలా అన్నాడు: “నువ్వు అతని చుట్టూ, అతని ఇంటివాళ్ల చుట్టూ, అతనికున్న వాటన్నిటి చుట్టూ కంచె వేశావు కదా. నువ్వు అతని చేతుల కష్టాన్ని దీవించావు, దానివల్ల అతని పశుసంపద దేశంలో ఎంతగానో విస్తరించింది. అయితే, ఇప్పుడు నువ్వు నీ చెయ్యి చాపి అతనికున్న వాటన్నిటినీ తీసేయి, అతను ఖచ్చితంగా నీ ముఖం మీదే నిన్ను దూషిస్తాడు.”—యోబు 1:10, 11.
9. సాతాను ఏమి చేయడానికి యెహోవా అనుమతించాడు?
9 యెహోవాను ఆరాధిస్తే తనకు ఏదో వస్తుందనే యోబు యెహోవాను ఆరాధిస్తున్నాడని సాతాను నిందించాడు. యెహోవాను ఆరాధించకుండా యోబును ఆపగలనని కూడా సాతాను అన్నాడు. సాతాను అన్న మాటను యెహోవా ఒప్పుకోలేదు, కానీ యెహోవా మీద ప్రేమతోనే యోబు ఆయనకు స్నేహితుడిగా ఉన్నాడో లేదో పరీక్షించేలా యెహోవా సాతానును అనుమతించాడు.
సాతాను యోబు మీద దాడి చేశాడు
10. సాతాను యోబుకు ఎలా కష్టాలు తీసుకొచ్చాడు? యోబు ఎలా స్పందించాడు?
10 మొదట సాతాను, యోబుకున్న జంతువులన్నీ దొంగిలించబడేలా లేదా చనిపోయేలా చేశాడు. తర్వాత సాతాను యోబు పనివాళ్లలో చాలామందిని చంపేశాడు. యోబు అన్నీ కోల్పోయాడు. చివరి దాడిగా సాతాను యోబు 10 మంది పిల్లల్ని గాలి తుఫానుతో చంపేశాడు. కానీ యోబు యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు. “ఈ విషయాలన్నిటిలో యోబు ఏ పాపం చేయలేదు, దేవుడు తప్పు చేశాడని నిందించలేదు.”—యోబు 1:12-19, 22.
యోబు తనకు నమ్మకమైన స్నేహితుడిగా ఉన్నందుకు యెహోవా ఆయనను దీవించాడు
11. (ఎ) సాతాను యోబుకు ఇంకా ఏమి చేశాడు? (బి) యోబు ఎలా స్పందించాడు?
11 సాతాను వెనక్కి తగ్గలేదు. సాతాను దేవునితో ఇలా అన్నాడు: “అతని శరీరాన్ని బాధిస్తే, అతను ఖచ్చితంగా నీ ముఖం మీదే నిన్ను దూషిస్తాడు.” కాబట్టి సాతాను యోబుకు చాలా బాధకలిగించే వ్యాధి వచ్చేలా చేశాడు. (యోబు 2:5, 7) అయినా, యోబు యెహోవాకు నమ్మకంగానే ఉన్నాడు. యోబు ఇలా అన్నాడు: “చనిపోయేంతవరకు నా యథార్థతను విడిచిపెట్టను!”—యోబు 27:5.
12. సాతాను అబద్ధికుడని యోబు ఎలా నిరూపించాడు?
12 యోబుకు సాతాను వేసిన నిందలేవీ తెలీదు, తనకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయో కూడా తెలీదు. తనకు వచ్చే కష్టాలకు కారణం యెహోవాయే అని యోబు అనుకున్నాడు. (యోబు 6:4; 16:11-14) అయినా కూడా, యోబు యెహోవాకు నమ్మకంగా ఉన్నాడు. ఇంక ఏ సందేహం లేదు. యోబు స్వార్థపరుడు కాదని రుజువైంది. ఆయన దేవున్ని ప్రేమించాడు కాబట్టే ఆయనకు స్నేహితుడు అయ్యాడు. సాతాను వేసిన నిందలన్నీ అబద్ధాలే!
13. యోబు నమ్మకంగా ఉండడం వల్ల ఎలాంటి ఫలితం వచ్చింది?
13 పరలోకంలో ఏమి జరుగుతుందో యోబుకు తెలియకపోయినా ఆయన దేవునికి నమ్మకంగా ఉన్నాడు, సాతాను దుష్టుడని నిరూపించాడు. యోబు తనకు నమ్మకమైన స్నేహితుడిగా ఉన్నందుకు యెహోవా ఆయన్ని దీవించాడు.—యోబు 42:12-17.
సాతాను మీ మీద ఎలాంటి నిందలు వేస్తున్నాడు?
14, 15. స్త్రీ, పురుషులందరి మీద సాతాను ఏ నింద వేశాడు?
14 యోబుకు జరిగినదాని నుండి మీరు కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్చుకోవచ్చు. ఇప్పుడు కూడా, మనం యెహోవా నుండి ఏదో ఆశించే ఆయనను ఆరాధిస్తున్నామని సాతాను మన మీద నిందలు వేస్తున్నాడు. యోబు 2:4 లో సాతాను ఇలా అన్నాడు: “తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి తనకున్నవన్నీ మనిషి ఇచ్చేస్తాడు.” కాబట్టి సాతాను యోబునే కాదు స్త్రీలు, పురుషులు అందర్నీ స్వార్థపరులని నిందిస్తున్నాడు. యోబు చనిపోయిన వందల సంవత్సరాల తర్వాత కూడా సాతాను యెహోవాను ఇంకా అవమానిస్తూ, ఆయన సేవకులను నిందిస్తూ ఉన్నాడు. సామెతలు 27:11 లో మనం ఇలా చదువుతాం: “నా కుమారుడా, తెలివిని సంపాదించి నా హృదయాన్ని సంతోషపెట్టు, అప్పుడు నన్ను నిందించేవాడికి [లేదా, అవమానించేవాడికి] నేను జవాబివ్వగలుగుతాను.”
15 యెహోవాకు లోబడి ఆయనకు నమ్మకమైన స్నేహితునిగా ఉండాలని నిర్ణయించుకోవడం ద్వారా మీరు సాతానుని అబద్ధికుడిగా నిరూపించవచ్చు. అయితే, దేవునికి స్నేహితులు అవ్వడానికి మీ జీవితంలో పెద్దపెద్ద మార్పులు చేసుకోవాల్సి వచ్చినా అది మీరు జీవితంలో తీసుకునే మంచి నిర్ణయం అవుతుంది. ఈ నిర్ణయం చాలా ముఖ్యమైంది. సమస్యలు వచ్చినప్పుడు మీరు దేవునికి నమ్మకంగా ఉండరని సాతాను అంటున్నాడు. మనం దేవునికి నమ్మకంగా ఉండకుండా మనల్ని మోసం చేయడానికి సాతాను ప్రయత్నిస్తున్నాడు. ఎలా?
16. (ఎ) ప్రజలు యెహోవాను ఆరాధించకుండా చేయడానికి సాతాను ఏ పద్ధతులు ఉపయోగిస్తాడు? (బి) యెహోవా సేవ చేయకుండా మిమ్మల్ని ఆపడానికి సాతాను ఇంకా ఎలా ప్రయత్నిస్తాడు?
16 దేవునితో మనకున్న స్నేహాన్ని పాడు చేయడానికి సాతాను వేర్వేరు పద్ధతులను ఉపయోగిస్తాడు. సాతాను “గర్జించే సింహంలా ఎవరిని మింగాలా అని వెతుకుతూ” దాడి చేస్తాడు. (1 పేతురు 5:8) మీరు బైబిలు స్టడీ తీసుకోకుండా, సరైనది చేయకుండా మీ స్నేహితులు, కుటుంబ సభ్యులు, లేదా ఇతరులు ప్రయత్నించినప్పుడు ఆశ్చర్యపడకండి. మీ మీద దాడి జరుగుతున్నట్లు మీకు అనిపించవచ్చు.a (యోహాను 15:19, 20) అంతేకాదు సాతాను “వెలుగు దూత” వేషం కూడా వేసుకుంటాడు. కాబట్టి దేవుని మాట వినకుండా ఉండేలా సాతాను మనల్ని మోసం చేయవచ్చు. (2 కొరింథీయులు 11:14) మనల్ని దేవుని సేవ చేయకుండా ఆపేందుకు సాతాను ఉపయోగించే మరో పద్ధతి, మనం దేవుని సేవ చేయడానికి సరిపోమనే ఆలోచనను మనలో కలిగించడం.—సామెతలు 24:10.
యెహోవా మాటలకు లోబడండి
17. మనం యెహోవాకు ఎందుకు లోబడతాం?
17 మనం యెహోవాకు లోబడినప్పుడు, సాతానును అబద్ధికుడని నిరూపిస్తాం. మనం లోబడి ఉండడానికి ఏది సహాయం చేస్తుంది? బైబిలు ఇలా చెప్తుంది: “నువ్వు నీ దేవుడైన యెహోవాను నీ నిండు హృదయంతో, నీ నిండు ప్రాణంతో, నీ పూర్తి బలంతో ప్రేమించాలి.” (ద్వితీయోపదేశకాండం 6:5) మనం యెహోవాను ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయనకు లోబడతాం. యెహోవా మీద మన ప్రేమ పెరుగుతున్న కొద్దీ, ఆయన చెప్పేవన్నీ చేయాలని మనం కోరుకుంటాం. అపొస్తలుడైన యోహాను ఇలా రాశాడు: “దేవుణ్ణి ప్రేమించడమంటే ఆయన ఆజ్ఞల్ని పాటించడమే; ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు.”—1 యోహాను 5:3.
18, 19. (ఎ) యెహోవా చెడ్డవని చెప్తున్న కొన్ని విషయాలు ఏంటి? (బి) మనం చేయలేనిది చేయమని యెహోవా మనల్ని అడగట్లేదని మనకెలా తెలుసు?
18 యెహోవా చెడ్డవని చెప్పే కొన్ని విషయాలు ఏంటి? కొన్ని ఉదాహరణలు “యెహోవా అసహ్యించుకునే వాటిని అసహ్యించుకోండి” అనే బాక్సులో ఉన్నాయి. వీటిలో కొన్ని మరీ అంత చెడ్డవి కాదని మొదట్లో మీరు అనుకోవచ్చు. కానీ మీరు అక్కడున్న బైబిలు వచనాలు చదివి, వాటి గురించి జాగ్రత్తగా ఆలోచించినప్పుడు, యెహోవా ప్రమాణాలు పాటించడం ఎంత తెలివైన పనో మీరు గ్రహిస్తారు. ఇంకా మీ జీవితంలో కొన్ని మార్పులు చేసుకోవాల్సి ఉందని కూడా మీకు అనిపించవచ్చు. కొన్నిసార్లు అలాంటి మార్పులు చేసుకోవడం కష్టమైనా వాటిని చేసుకుంటే, దేవుని నమ్మకమైన స్నేహితుడిగా ఉండడం వల్ల వచ్చే ఆనందాన్ని, ప్రశాంతతను మీరు అనుభవిస్తారు. (యెషయా 48:17, 18) ఇలాంటి మార్పులు చేసుకోవడం సాధ్యమేనని మనకు ఎలా తెలుసు?
19 మనం చేయలేని దాన్ని చేయమని యెహోవా మనల్ని ఎప్పుడూ అడగడు. (ద్వితీయోపదేశకాండం 30:11-14) నిజమైన స్నేహితుడిగా మన గురించి మనకన్నా బాగా ఆయనకే తెలుసు. మన బలాలు, బలహీనతలు ఆయనకు తెలుసు. (కీర్తన 103:14) అపొస్తలుడైన పౌలు ఇలా ప్రోత్సహిస్తున్నాడు: “దేవుడు నమ్మకమైనవాడు, మీరు తట్టుకోగలిగే దానికన్నా ఎక్కువగా మిమ్మల్ని పరీక్షకు గురికానివ్వడు; ఏదైనా పరీక్ష వచ్చినప్పుడు, దాన్నుండి తప్పించుకునే మార్గం కలగజేస్తాడు, సహించడానికి సహాయం చేస్తాడు.” (1 కొరింథీయులు 10:13) మనం సరైనది చేసేలా యెహోవా మనకు ఎప్పుడూ బలాన్ని ఇస్తాడని మనం నమ్మకంతో ఉండవచ్చు. కష్టాలను తట్టుకోవడానికి ఆయన మీకు “అసాధారణ శక్తి” ఇస్తాడు. (2 కొరింథీయులు 4:7) అలాంటి సమయాల్లో యెహోవా సహాయాన్ని పొందిన తర్వాత పౌలు ఇలా అన్నాడు: “నాకు శక్తిని ఇచ్చే దేవుని ద్వారా నేను ఏదైనా చేయగలను.”—ఫిలిప్పీయులు 4:13.
యెహోవా ప్రేమించేవాటిని ప్రేమించడం నేర్చుకోండి
20. మీరు ఏ లక్షణాలను అనుకరించాలి? ఎందుకు?
20 మనం యెహోవా స్నేహితులుగా ఉండాలంటే, యెహోవా చెడ్డవని చెప్తున్న వాటిని చేయడం ఆపేయాలి, అంతేకాదు అంతకన్నా ఎక్కువే చేయాలి. (రోమీయులు 12:9) దేవుని స్నేహితులు ఆయన ప్రేమించేవాటిని ప్రేమిస్తారు. వాళ్ల గురించి కీర్తన 15:1-5 వివరిస్తుంది. (చదవండి.) యెహోవా స్నేహితులు ఆయన లక్షణాలను అనుకరిస్తూ “ప్రేమ, సంతోషం, శాంతి, ఓర్పు, దయ, మంచితనం, విశ్వాసం, సౌమ్యత, ఆత్మనిగ్రహం” చూపిస్తారు.—గలతీయులు 5:22, 23.
21. మీరు దేవునికి ఇష్టమైన లక్షణాలను చూపించడం ఎలా నేర్చుకోవచ్చు?
21 మీరు ఆ చక్కని లక్షణాలను చూపించడం ఎలా నేర్చుకోవచ్చు? బైబిల్ని రోజూ చదవడం, అధ్యయనం చేయడం ద్వారా మీరు యెహోవాకు ఏది ఇష్టమో తెలుసుకోవాలి. (యెషయా 30:20, 21) మీరు ఇలా చేస్తుండగా యెహోవా మీద మీకున్న ప్రేమ పెరుగుతుంది, ఆయన మీద మీకున్న ప్రేమ పెరుగుతుండగా మీరు ఆయన మాట వినాలని కోరుకుంటారు.
22. మీరు యెహోవా మాట వింటే ఏమి జరుగుతుంది?
22 మీ జీవితంలో మీరు చేసుకోవాల్సిన మార్పుల్ని, పాత బట్టలు తీసేసి కొత్త బట్టలు వేసుకోవడంతో పోల్చవచ్చు. మీరు “పాత వ్యక్తిత్వాన్ని” తీసేసి “కొత్త వ్యక్తిత్వాన్ని” ధరించాలని బైబిలు చెప్తుంది. (కొలొస్సయులు 3:9, 10) అది అంత తేలిక కాకపోయినా, ఈ మార్పులు చేసుకుని మనం యెహోవాకు లోబడినప్పుడు, ఆయన మనకు “గొప్ప ప్రతిఫలం” ఇస్తానని చెప్తున్నాడు. (కీర్తన 19:11) అవును, యెహోవాకు లోబడాలని నిర్ణయించుకుని సాతానును అబద్ధికుడని నిరూపించండి. భవిష్యత్తు దీవెనల గురించి కాకుండా నిస్వార్థమైన ప్రేమను బట్టి యెహోవా సేవ చేయండి. అప్పుడు మీరు దేవునికి నిజమైన స్నేహితులు అవుతారు!
a మీరు బైబిలు స్టడీ చేయకుండా ఆపాలని చూసేవాళ్లు సాతాను చెప్పుచేతల్లో ఉన్నారని కాదు. కానీ సాతాను “ఈ లోక దేవుడు,” అంతేకాదు ఈ “లోకమంతా దుష్టుని [అతని] గుప్పిట్లో ఉంది.” కాబట్టి కొంతమంది మనల్ని యెహోవా సేవ చేయకుండా ఆపడానికి ప్రయత్నిస్తే మనం ఆశ్చర్యపోకూడదు.—2 కొరింథీయులు 4:4; 1 యోహాను 5:19.