బాప్తిస్మం తీసుకోవాలనుకునే వాళ్లకోసం ప్రశ్నలు
బాప్తిస్మం తీసుకోబోయే వాళ్లతో చేసే ముగింపు చర్చ
సాధారణంగా, యెహోవాసాక్షుల ప్రాంతీయ సమావేశాల్లో, ప్రాదేశిక సమావేశాల్లో బాప్తిస్మం ఇచ్చే ఏర్పాటు ఉంటుంది. బాప్తిస్మ ప్రసంగం చివర్లో, బాప్తిస్మ అభ్యర్థులను లేచి నిలబడి, ఈ రెండు ప్రశ్నలకు బిగ్గరగా జవాబు చెప్పమని ప్రసంగీకుడు అడుగుతాడు:
1. మీ పాపాల విషయంలో పశ్చాత్తాపపడి, యెహోవాకు సమర్పించుకుని, ఆయన యేసుక్రీస్తు ద్వారా చేసిన రక్షణ ఏర్పాటును మీరు అంగీకరించారా?
2. మీ బాప్తిస్మం ద్వారా మీరు యెహోవాసాక్షుల్లో ఒకరిగా గుర్తించబడతారని, యెహోవా సంస్థలో భాగమౌతారని అర్థం చేసుకున్నారా?
ఆ ప్రశ్నలకు అవునని ఇచ్చే జవాబులు, బాప్తిస్మ అభ్యర్థులు తమకు విమోచన క్రయధనం మీద విశ్వాసం ఉందని, యెహోవాకు హృదయపూర్వకంగా సమర్పించుకున్నామని అందరిముందు ఒక “బహిరంగ” ప్రకటనగా ఉంటాయి. (రోమా. 10:9, 10) బాప్తిస్మ అభ్యర్థులు ఈ ప్రశ్నల గురించి ముందే ప్రార్థనాపూర్వకంగా ఆలోచిస్తే, తాము దృఢంగా తీర్మానించుకున్న దానికి అనుగుణంగా జవాబులు చెప్పగలుగుతారు.
మీరు ప్రార్థనలో యెహోవాకు సమర్పించుకుని, ఆయన్ని మాత్రమే ఆరాధిస్తారని, మీ జీవితంలో ఆయన ఇష్టం చేయడానికే అన్నిటికన్నా ముఖ్యమైన స్థానం ఇస్తారని మాటిచ్చారా?
బాప్తిస్మం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని ఇప్పుడు మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తుందా?
బాప్తిస్మం తీసుకునేటప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలి? (1 తిమో. 2:9, 10; యోహా. 15:19; ఫిలి. 1:10)
మనం “దైవభక్తి” చూపిస్తూ “అణకువ, మంచి వివేచన ఉట్టిపడే” బట్టల్ని వేసుకోవాలి. కాబట్టి బాప్తిస్మం తీసుకునేవాళ్లు ఈత కొట్టేటప్పుడు వేసుకునే లాంటి ఒళ్లు కనిపించే బట్టల్ని (అసభ్యంగా ఉండే స్విమ్ సూట్లు) వేసుకోరు. అంతేకాదు స్లోగన్లు, రాతలు, లేదా బొమ్మలు ఉన్న బట్టలు వేసుకోరు. వాళ్లు పద్ధతిగా, శుభ్రంగా, సందర్భానికి తగ్గట్టుగా ఉన్న మంచి బట్టల్ని వేసుకోవాలి.
బాప్తిస్మం తీసుకునే సమయంలో ఒక వ్యక్తి ప్రవర్తన ఎలా ఉండాలి? (లూకా 3:21, 22)
యేసు తీసుకున్న బాప్తిస్మం నేటి క్రైస్తవులకు ఓ మంచి ఉదాహరణగా ఉంది. బాప్తిస్మం ఒక గంభీరమైన చర్య అని యేసు అర్థంచేసుకున్నాడు. అది ఆయన వైఖరిలో, ప్రవర్తనలో కనబడింది. కాబట్టి, బాప్తిస్మం తీసుకునే స్థలంలో తమాషాలు చేయడం, ఆటలాడడం, ఈతకొట్టడం చేయకూడదు. అలాగే, ఆ సందర్భానికి ఉన్న గంభీరతను తగ్గించే ఎలాంటి పనీ చేయకూడదు. అంతేకాదు, బాప్తిస్మం తీసుకొని వస్తున్న వ్యక్తి ఓ గొప్ప విజయం సాధించినట్లు హడావిడి చేయకూడదు. బాప్తిస్మం తీసుకోవడం సంతోషించాల్సిన సందర్భమే అయినప్పటికీ ఆ సంతోషాన్ని గౌరవపూర్వకంగా వ్యక్తం చేయాలి.
క్రమంగా కూటాలకు హాజరవ్వడం, సంఘంతో సహవసించడం యెహోవాకు మీరు చేసుకున్న సమర్పణకు తగ్గట్టు జీవించడానికి ఎలా సహాయం చేస్తుంది?
బాప్తిస్మం తీసుకున్న తర్వాత, మీరు క్రమంగా వ్యక్తిగత అధ్యయనం చేయడం, పరిచర్యలో పాల్గొనడం ఎందుకు ప్రాముఖ్యం?
సంఘ పెద్దలకు సూచనలు
బాప్తిస్మం తీసుకొనని ఓ ప్రచారకుడు తాను బాప్తిస్మం తీసుకోవడానికి ఇష్టపడుతున్నానని చెప్పినప్పుడు, ఈ పుస్తకంలోని 185-207 పేజీల్లో ఉన్న “బాప్తిస్మం తీసుకోవాలనుకునే వాళ్లకోసం ప్రశ్నలు” అనే భాగాన్ని జాగ్రత్తగా చదవమని ఆ ప్రచారకునికి చెప్పాలి. అలాగే, 182వ పేజీ ఆరంభంలో ఉన్న “బాప్తిస్మం తీసుకొనని ప్రచారకులకు ఒక సందేశం” అనే అంశాన్ని కూడా పరిశీలించమని అతనికి చెప్పాలి. పెద్దలు తనతో చర్చించబోయే విషయాల కోసం ఎలా సిద్ధపడాలో అందులో ఉంటుంది. ఇంకా అందులో పేర్కొన్నట్లుగా, పెద్దలు తనతో చర్చిస్తున్నప్పుడు, తాను రాసుకున్న నోట్సును ఉపయోగించవచ్చు అలాగే ఈ పుస్తకాన్ని కూడా తెరిచి పెట్టుకోవచ్చు. అయితే, ఆ ప్రశ్నల్ని పెద్దలు అతనితో చర్చించడానికి ముందు, వేరేవాళ్లు ఆ ప్రశ్నల్ని అతనితో చర్చించాల్సిన అవసరం లేదు.
బాప్తిస్మం తీసుకోవాలని కోరుకునే ప్రతీఒక్కరు ఆ విషయాన్ని పెద్దల సభ సమన్వయకర్తకు తెలియజేయాలి. బాప్తిస్మం తీసుకోవాలని అనుకునే వ్యక్తి “బాప్తిస్మం తీసుకోవాలనుకునే వాళ్లకోసం ప్రశ్నలు” చదువుకునేంత సమయం ఇచ్చిన తర్వాత, అతను యెహోవా ఇష్టం చేస్తానని ప్రార్థనలో వ్యక్తిగతంగా సమర్పించుకున్నాడో లేదో అని పెద్దల సభ సమన్వయకర్త అడుగుతాడు. ఒకవేళ అతను సమర్పించుకుంటే, “బాప్తిస్మం తీసుకోవాలనుకునే వాళ్లకోసం ప్రశ్నలు” అనే భాగాన్ని ఇద్దరు పెద్దలు అతనితో చర్చించడానికి పెద్దల సభ సమన్వయకర్త ఏర్పాట్లు చేస్తాడు. రెండు భాగాల్లో ఒక్కో భాగాన్ని ఒక్కో సంఘ పెద్ద చర్చించాలి. అలా చర్చించడానికి, రానున్న ప్రాంతీయ సమావేశం లేదా ప్రాదేశిక సమావేశం గురించిన ప్రకటన చేసేంతవరకు ఆగాల్సిన అవసరం లేదు.
సాధారణంగా, రెండు భాగాల్ని రెండు విడతల్లో దాదాపు ఓ గంట వ్యవధిలో చర్చించవచ్చు. అవసరం అనుకుంటే, అంతకన్నా ఎక్కువ సమయం కూడా తీసుకోవచ్చు. ప్రతీ చర్చ భాగం ప్రార్థనతో మొదలుపెట్టి, ప్రార్థనతో ముగించాలి. ప్రశ్నల్ని చర్చిస్తున్నప్పుడు బాప్తిస్మ అభ్యర్థి గానీ, సంఘ పెద్ద గానీ ఆ ప్రశ్నల్ని హడావిడిగా ముగించకూడదు. ఆ ప్రశ్నల్ని చర్చించాల్సిన పెద్దలు, తమ పనుల గురించి వేసుకునే పట్టికలో దీనికి ప్రాధాన్యతను ఇవ్వాలి.
సాధారణంగా, బాప్తిస్మం తీసుకునే వాళ్లందరితో ఒకేసారి గుంపుగా చర్చించడం కన్నా, ఒక్కొక్కరితో విడివిడిగా చర్చించడం మంచిది. ప్రతీ ప్రశ్నపై అభ్యర్థిని మాట్లాడనిస్తే, అతనికి బైబిలు సత్యం ఎంత బాగా తెలుసో పెద్దలకు స్పష్టంగా అర్థమౌతుంది. అప్పుడు అతను బాప్తిస్మానికి అర్హుడో కాదో అనే అనుమానం ఇక ఉండదు. అంతేకాదు ఒక్కొక్కరితో చర్చించడంవల్ల, బాప్తిస్మ అభ్యర్థి తన అభిప్రాయాల్ని మరింత స్వేచ్ఛగా చెప్పగలుగుతాడు. ఒకవేళ బాప్తిస్మ అభ్యర్థులు భార్యాభర్తలైతే, వాళ్లిద్దరితో కలిపి వాటిని చర్చించవచ్చు.
ఒకవేళ బాప్తిస్మ అభ్యర్థి ఒక సహోదరి అయితే, వాళ్లు ఇతరులకు కనిపించే చోట కూర్చొని చర్చించాలి, కానీ వాళ్ల మాటలు ఇతరులకు వినిపించకూడదు. ఒకవేళ మీతోపాటు మరో వ్యక్తిని తీసుకువెళ్లాల్సి వస్తే, ఆ వ్యక్తి ఒక సంఘ పెద్ద గానీ సంఘ పరిచారకుడు గానీ అయ్యుండాలి. అయితే తర్వాతి పేరాలో చెప్పినట్టుగా, ఎవర్ని తీసుకువెళ్లాలనేది చర్చిస్తున్న భాగాన్ని బట్టి ఉంటుంది.
చాలా తక్కువమంది పెద్దలు ఉన్న సంఘాల్లో, విషయాల్ని సరిగ్గా అంచనా వేయగలరని, మంచి వివేచనాపరులని నిరూపించుకున్న సమర్థులైన సంఘ పరిచారకులు, “1వ భాగం: క్రైస్తవ నమ్మకాలు” అనే భాగంలో ఉన్న బాప్తిస్మ ప్రశ్నల్ని సమీక్షించవచ్చు. అయితే, “2వ భాగం: క్రైస్తవ జీవితం” అనే భాగాన్ని మాత్రం సంఘ పెద్దలే చర్చించాలి. అయితే, సంఘంలో అర్హులైన సహోదరులు సరిపడా లేకపోతే, దగ్గర్లోని సంఘ పెద్దలు సహాయం చేయగలరేమో తెలుసుకోవడానికి ప్రాంతీయ పర్యవేక్షకుణ్ణి సంప్రదించాలి.
బాప్తిస్మ అభ్యర్థి మైనరు పిల్లవాడైతే, అతనితో చర్చిస్తున్నప్పుడు సత్యంలో ఉన్న తల్లిదండ్రుల్లో ఒక్కరు లేదా ఇద్దరు పక్కనే ఉండాలి. ఒకవేళ వాళ్లు ఉండడం వీలవ్వకపోతే, ప్రతీ భాగంలో ఇద్దరు పెద్దలు (లేదా చర్చించబోయే భాగాన్ని బట్టి ఒక సంఘ పెద్ద అలాగే ఒక సంఘ పరిచారకుడు) ఉండాలి.
బాప్తిస్మం తీసుకోవాలనుకునే వ్యక్తి ప్రాథమిక బైబిలు బోధల గురించి అవసరమైన మేరకు అవగాహన సంపాదించాడో లేదో పెద్దలు నిర్ధారిస్తారు. అంతేకాదు, ప్రచారకుడవ్వబోయే ఆ వ్యక్తి సత్యంపట్ల లోతైన మెప్పుదల చూపిస్తూ, యెహోవా సంస్థపట్ల సరైన గౌరవం చూపిస్తున్నాడో లేదో తెలుసుకోవడానికి పెద్దలు ప్రయత్నిస్తారు. ఒకవేళ అతను ప్రాథమిక బైబిలు బోధల్ని అర్థం చేసుకోకపోతే, కొంతకాలానికి అతను బాప్తిస్మానికి అర్హుడయ్యేలా, అతనికి వ్యక్తిగత సహాయం అందించడానికి పెద్దలు ఏర్పాటు చేస్తారు. ఇంకొంతమందికి పరిచర్యకున్న ప్రాముఖ్యతను లేదా సంస్థ చేసిన ఏర్పాట్లకు లోబడడానికి ఉన్న ప్రాముఖ్యతను ఇంకా బాగా అర్థం చేసుకునేలా వాళ్లకు కొంత సమయం ఇవ్వాల్సిరావచ్చు. అయితే, ఆ వ్యక్తి బాప్తిస్మానికి సిద్ధంగా ఉన్నాడా లేదా అని పూర్తిగా గ్రహించేలా, ప్రతీ భాగానికి కేటాయించబడిన దాదాపు గంట సమయాన్ని ఎలా ఉపయోగించాలో పెద్దలకే వదిలేయబడింది. కొన్ని ప్రశ్నలకు ఎక్కువ సమయం తీసుకున్నా, మరి కొన్నిటికి తక్కువ సమయం తీసుకున్నా, అన్ని ప్రశ్నల్ని చర్చించాలి.
ఈ ప్రశ్నల్ని చర్చించడానికి నియమించబడిన పెద్దలు రెండో భాగం తర్వాత కలుసుకొని, ఆ వ్యక్తి బాప్తిస్మం తీసుకోవడానికి అర్హుడో కాదో నిర్ణయిస్తారు. వాళ్లు ప్రతీ వ్యక్తి నేపథ్యాన్ని, సామర్థ్యాన్ని, ఇతర పరిస్థితుల్ని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, ఒక వ్యక్తి యెహోవాతో మంచి సంబంధాన్ని ఏర్పర్చుకున్నాడో లేదో, బైబిల్లోని ప్రాథమిక సత్యాలను అతను అర్థం చేసుకున్నాడో లేదో పెద్దలు తెలుసుకోవాలనుకుంటారు. మీరు ప్రేమతో అందించే సహాయంతో, బాప్తిస్మం తీసుకోబోయేవాళ్లు, మంచివార్త ప్రచారకులుగా తమ ముఖ్యమైన బాధ్యతను నెరవేర్చడానికి తగ్గట్టు సిద్ధంగా ఉండగలుగుతారు.
ఆ తర్వాత, నియమిత పెద్దల్లో ఒకరు లేదా ఇద్దరు అతణ్ణి కలిసి, అతను బాప్తిస్మానికి అర్హుడయ్యాడో లేదో తెలియజేయాలి. ఒకవేళ అతను బాప్తిస్మానికి అర్హుడైతే, పెద్దలు 206-207 పేజీల్లో ఉన్న “బాప్తిస్మం తీసుకోబోయే వాళ్లతో చేసే ముగింపు చర్చ” అనే భాగాన్ని అతనితో చర్చించాలి. ఒకవేళ అతనికి ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకం నుండి ఇంకా అధ్యయనం పూర్తవ్వకపోతే, బాప్తిస్మం తర్వాత దాన్ని పూర్తిచేయమని పెద్దలు అతణ్ణి ప్రోత్సహించాలి. అతని పేరుతో రాయబడిన సంఘ ప్రచారకుల రికార్డులో అతని బాప్తిస్మం తేదీ ఎక్కించబడుతుందని అతనికి తెలియజేయండి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యెహోవాసాక్షుల మతపరమైన కార్యక్రమాల్ని సంస్థ చూసుకోగలిగేలా పెద్దలు అతని వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తారని అతనికి గుర్తుచేయవచ్చు. దానివల్ల అతను సంఘం ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతాడు అలాగే పెద్దలు ఇచ్చే ప్రోత్సాహాన్ని, నిర్దేశాన్ని పొందగలుగుతాడు. అంతేకాదు, ఏ వ్యక్తిగత సమాచారమైనా jw.orgలో ఉన్న యెహోవాసాక్షుల గ్లోబల్ డేటా ప్రొటెక్షన్ పాలసీకి అనుగుణంగా ఉపయోగించబడుతుందని పెద్దలు కొత్త ప్రచారకులకు గుర్తుచేయవచ్చు. ఈ చర్చకు కేవలం పది నిమిషాలు లేదా అంతకన్నా తక్కువ సమయం తీసుకోవాలి.
బాప్తిస్మం తీసుకున్న ఒక సంవత్సరం తర్వాత, ఇద్దరు పెద్దలు ఆ ప్రచారకుణ్ణి ప్రోత్సహించడానికి, అవసరమైన సలహాలు ఇవ్వడానికి అతన్ని కలవాలి. ఆ పెద్దల్లో ఒకరు ఆ ప్రచారకుని గుంపు పర్యవేక్షకుడై ఉండాలి. ఒకవేళ ఆ ప్రచారకుడు మైనరు పిల్లవాడైతే, అతనితో సత్యంలో ఉన్న అతని తల్లిదండ్రులు ఉండాలి. ఆ చర్చ చాలా స్నేహపూర్వకంగా, ప్రోత్సాహకరంగా ఉండాలి. పెద్దలు అతని ఆధ్యాత్మిక ప్రగతి గురించి అతనితో చర్చిస్తూ, క్రమంగా వ్యక్తిగత అధ్యయనం చేయడం, రోజూ బైబిలు చదవడం, ప్రతీవారం కుటుంబ ఆరాధన చేసుకోవడం, కూటాలకు నమ్మకంగా హాజరై వాటిలో భాగం వహించడం, ప్రతీవారం పరిచర్యలో పాల్గొనడం వంటివాటికి సంబంధించి అతనికి కొన్ని సలహాలు ఇస్తారు. (ఎఫె. 5:15, 16) ఒకవేళ అతనికి ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకం నుండి అధ్యయనం ఇంకా పూర్తవ్వకపోతే, దాన్ని పూర్తిచేసేలా పెద్దలు ఒకరిని ఏర్పాటు చేయాలి. పెద్దలు అతణ్ణి ప్రేమగా మెచ్చుకోవాలి. సాధారణంగా, అతనికి ఒకట్రెండు విషయాల్లో ఉపదేశాన్ని, సలహాల్ని ఇస్తే సరిపోతుంది.