105వ అధ్యాయం
అంజూర చెట్టు ద్వారా విశ్వాసం గురించి పాఠం నేర్పించాడు
మత్తయి 21:19-27 మార్కు 11:19-33 లూకా 20:1-8
ఎండిపోయిన అంజూర చెట్టు ద్వారా పాఠం
యేసుకున్న అధికారాన్ని ప్రశ్నించారు
సోమవారం మధ్యాహ్నం యేసు యెరూషలేము నుండి బేతనియకు వచ్చాడు. అది ఒలీవల కొండ మీద తూర్పున ఉంది. బహుశా ఆ రాత్రి ఆయన తన స్నేహితులైన లాజరు, మార్త, మరియల ఇంట్లో ఉండివుంటాడు.
నీసాను 11 ఉదయం యేసు, ఆయన శిష్యులు మళ్లీ యెరూషలేముకు ప్రయాణమయ్యారు. యేసు యెరూషలేము ఆలయానికి వెళ్లడం అదే చివరిసారి. అంతేకాదు, బహిరంగంగా పరిచర్య చేయడం కూడా అదే చివరిసారి. తర్వాత ఆయన పస్కా ఆచరించి, తన మరణ జ్ఞాపకార్థ ఆచరణ ప్రారంభించి, చివరికి శ్రమలు అనుభవించి చనిపోతాడు.
యేసు, ఆయన శిష్యులు బేతనియ నుండి ఒలీవల కొండ మీదుగా యెరూషలేముకు వెళ్తున్నారు. అప్పుడు పేతురు, ముందు రోజు ఉదయం యేసు శపించిన అంజూర చెట్టును చూసి ఆశ్చర్యంతో ఇలా అన్నాడు: “రబ్బీ, చూడు! నువ్వు శపించిన అంజూర చెట్టు ఎండిపోయింది.”—మార్కు 11:21.
యేసు ఎందుకు ఆ చెట్టును ఎండిపోయేలా చేశాడు? దానికి గల కారణాన్ని ఆయనే తెలియజేశాడు: “నేను నిజంగా మీతో చెప్తున్నాను, మీకు విశ్వాసం ఉంటే, మీరు సందేహపడకపోతే ఆ అంజూర చెట్టుకు నేను చేసినదాన్ని మీరు కూడా చేయగలుగుతారు; అంతేకాదు మీరు ఈ కొండతో, ‘నువ్వు లేచి సముద్రంలో పడిపో’ అని చెప్పినా అది జరుగుతుంది. విశ్వాసంతో మీరు వేటికోసం ప్రార్థిస్తారో అవన్నీ పొందుతారు.” (మత్తయి 21:21, 22) ఆవగింజంత విశ్వాసం కొండను సైతం కదిలించగలదని అంతకుముందు చెప్పిన మాటల్నే యేసు మళ్లీ చెప్పాడు.—మత్తయి 17:20.
కాబట్టి ఆ చెట్టును ఎండిపోయేలా చేయడం ద్వారా, దేవుని మీద విశ్వాసం ఉంచడం గురించి యేసు పాఠం నేర్పిస్తున్నాడు. ఆయన ఇలా అన్నాడు: “మీరు ప్రార్థనలో అడిగేవన్నీ మీరు అప్పటికే పొందేశారని విశ్వసించండి, అప్పుడు మీరు వాటిని తప్పకుండా పొందుతారు.” (మార్కు 11:24) యేసు అనుచరులందరికీ అది ఎంత ముఖ్యమైన పాఠమో కదా! త్వరలో కష్టాలు ఎదుర్కోబోతున్న అపొస్తలులకు ఆ పాఠం మరింత అవసరం. అయితే, ఎండిపోయిన అంజూర చెట్టు ద్వారా విశ్వాసం గురించి యేసు మరో పాఠం నేర్పిస్తున్నాడు.
ఈ అంజూర చెట్టులాగే, ఇశ్రాయేలు జనాంగం కూడా పైకి బాగానే ఉన్నట్లు కనిపించింది. దేవునితో ఒప్పందం చేసుకున్న ప్రజలుగా వాళ్లు పైకి ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నట్లు కనిపించవచ్చు. కానీ, ఒక జనాంగంగా వాళ్లు విశ్వాసం చూపించలేదు, మంచి ఫలాలు ఫలించలేదు. వాళ్లు ఏకంగా దేవుని సొంత కుమారుణ్ణే తిరస్కరించారు! అంజూర చెట్టును ఎండిపోయేలా చేయడం ద్వారా, ఏమాత్రం ఫలించని, విశ్వాసంలేని ఆ జనాంగానికి ఏం జరుగుతుందో యేసు చూపించాడు.
కాసేపటి తర్వాత యేసు, ఆయన శిష్యులు యెరూషలేముకు చేరుకున్నారు. అలవాటు ప్రకారం యేసు ఆలయంలోకి వెళ్లి, బోధించడం మొదలుపెట్టాడు. ముఖ్య యాజకులు, ప్రజల పెద్దలు వచ్చి ఆయన్ని ఇలా ప్రశ్నించారు: “నువ్వు ఏ అధికారంతో ఇవి చేస్తున్నావు? ఇవి చేసే అధికారం నీకు ఎవరు ఇచ్చారు?” ముందు రోజు డబ్బులు మార్చేవాళ్లను ఆయన వెళ్లగొట్టిన సంగతి మనసులో ఉంచుకొని వాళ్లు అలా అడిగివుంటారు.—మార్కు 11:28.
అప్పుడు యేసు ఇలా అన్నాడు: “నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. దానికి మీరు సమాధానం చెప్తే, నేను ఏ అధికారంతో ఇవి చేస్తున్నానో మీకు చెప్తాను. బాప్తిస్మమిచ్చే అధికారం యోహానుకు ఎవరు ఇచ్చారు? దేవుడా, మనుషులా?” అప్పుడు యాజకులు, పెద్దలు వాళ్లలోవాళ్లు ఇలా అనుకున్నారు: “మనం ‘దేవుడు ఇచ్చాడు’ అని చెప్తే, ‘మరి మీరు అతన్ని ఎందుకు నమ్మలేదు?’ అంటాడు. పోనీ తెగించి, ‘మనుషులు ఇచ్చారు’ అని చెప్పేద్దామా?” వాళ్లు ప్రజలకు భయపడి అలా మాట్లాడుకున్నారు. ఎందుకంటే, “యోహాను నిజంగా ఒక ప్రవక్త అని ప్రజలంతా నమ్మారు.”—మార్కు 11:29-32.
యేసును వ్యతిరేకిస్తున్నవాళ్లు జవాబు చెప్పలేక, “మాకు తెలీదు” అన్నారు. అప్పుడు యేసు, “ఏ అధికారంతో ఇవి చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను” అన్నాడు.—మార్కు 11:33.