104వ అధ్యాయం
యూదులు దేవుని స్వరం విన్నారు—మరి విశ్వాసం ఉంచారా?
చాలామంది దేవుని స్వరం విన్నారు
యేసు దేని ఆధారంగా తీర్పు తీరుస్తాడు?
నీసాను 10 సోమవారం రోజున యేసు ఆలయంలో ఉన్నప్పుడు తాను త్వరలో చనిపోతానని చెప్పాడు. కానీ ఆయన ఆందోళనంతా దేవుని పేరు గురించే. అందుకే ఆయన “తండ్రీ, నీ పేరును మహిమపర్చు” అన్నాడు. అప్పుడు ఆకాశం నుండి వచ్చిన ఒక గంభీరమైన స్వరం ఇలా చెప్పింది: “నేను దాన్ని మహిమపర్చాను, మళ్లీ మహిమపరుస్తాను.”—యోహాను 12:27, 28.
అప్పుడు అక్కడున్న ప్రజలు భయపడ్డారు. కొంతమందైతే అది ఉరుముల శబ్దం అనుకున్నారు. ఇంకొంతమంది, “దేవదూత ఆయనతో మాట్లాడాడు” అని అన్నారు. (యోహాను 12:29) నిజానికి వాళ్లు విన్నది యెహోవా స్వరం! యేసు గురించి స్వయంగా దేవుడే మాట్లాడుతుండగా మనుషులు వినడం ఇది మొదటిసారి కాదు.
మూడున్నర సంవత్సరాల క్రితం యేసు బాప్తిస్మం తీసుకున్నప్పుడు, దేవుడు ఇలా చెప్పడం బాప్తిస్మమిచ్చే యోహాను విన్నాడు: “ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను.” అలాగే, సా.శ. 32 పస్కా తర్వాత యాకోబు, యోహాను, పేతురుల ముందు యేసు రూపం మారిపోయింది. అప్పుడు దేవుడు ఇలా చెప్పడం ఆ ముగ్గురు విన్నారు: “ఈయన నా ప్రియ కుమారుడు. ఈయన్ని చూసి నేను సంతోషిస్తున్నాను. ఈయన మాట వినండి.” (మత్తయి 3:17; 17:5) అయితే ఈసారి మాత్రం, చాలామందికి వినిపించేలా యెహోవా మాట్లాడాడు!
యేసు ఇలా అన్నాడు: “ఈ స్వరం వచ్చింది నా కోసం కాదు, మీ కోసమే.” (యోహాను 12:30) యేసు నిజంగా దేవుని కుమారుడని, ప్రవచించబడిన మెస్సీయ అని అది నిరూపించింది.
యేసు భూమ్మీద ఉన్నంతకాలం దేవునికి నమ్మకంగా జీవించాడు. ఆ విధంగా, మనుషులు ఎలా జీవించాలో చూపించాడు, ఈ లోక పరిపాలకుడైన సాతాను ఎందుకు నాశనానికి తగినవాడో నిరూపించాడు. యేసు ఇలా చెప్పాడు: “ఇప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుతోంది. ఈ లోక పరిపాలకుడు బయటికి తోసేయబడతాడు. అయితే నేను భూమి నుండి పైకి ఎత్తబడినప్పుడు అన్నిరకాల ప్రజల్ని నావైపుకు ఆకర్షించుకుంటాను.” (యోహాను 12:31, 32) యేసు కొయ్యమీద చనిపోవడం ద్వారా ఇతరుల్ని తనవైపుకు ఆకర్షించుకొని, వాళ్లు శాశ్వత జీవితం పొందే మార్గాన్ని తెరుస్తాడు. ఆ విధంగా, యేసు మరణం ఒక గెలుపే కానీ ఓటమి కాదు.
యేసు ‘పైకి ఎత్తబడడం’ గురించి చెప్పగానే, ప్రజలు ఇలా అన్నారు: “క్రీస్తు ఎప్పటికీ ఉంటాడని మేము ధర్మశాస్త్రం నుండి విన్నాం. అలాంటప్పుడు మానవ కుమారుడు పైకి ఎత్తబడాలని నువ్వెలా చెప్తున్నావు? ఇంతకీ ఈ మానవ కుమారుడు ఎవరు?” (యోహాను 12:34) ఎన్ని రుజువులున్నా, ఆఖరికి దేవుడే స్వయంగా మాట్లాడినా, చాలామంది ప్రజలు యేసు నిజంగా మానవ కుమారుడని, వాగ్దానం చేయబడిన మెస్సీయ అని అంగీకరించట్లేదు.
అంతకుముందు చెప్పినట్లే, యేసు ఇప్పుడు కూడా తాను లోకానికి వెలుగునని చెప్పాడు. (యోహాను 8:12; 9:5) ఆయన ప్రజలతో ఇలా అన్నాడు: “ఇంక కొంతకాలమే వెలుగు మీ మధ్య ఉంటుంది. చీకటి మిమ్మల్ని కమ్ముకోకుండా ఉండేలా వెలుగు ఉండగానే దానిలో నడవండి . . . మీరు వెలుగు పుత్రులు అయ్యేలా వెలుగు ఉండగానే వెలుగు మీద విశ్వాసం చూపించండి.” (యోహాను 12:35, 36) తర్వాత యేసు అక్కడినుండి వెళ్లిపోయాడు. ఎందుకంటే, ఆయన ‘కొయ్యకు వేలాడదీయబడి’ చనిపోవాల్సింది నీసాను 14 పస్కా రోజున కానీ, నీసాను 10న కాదు.—గలతీయులు 3:13.
యేసు చేసిన పరిచర్య అంతటిలో, యూదులు ఆయన మీద విశ్వాసం ఉంచలేదు. ఆ విధంగా యెషయా చెప్పిన ప్రవచనం నెరవేరింది. ప్రజలు క్రీస్తు వైపు తిరిగి ఆయన చేత బాగుచేయబడకుండా ఉండేలా దేవుడు వాళ్ల కళ్లకు గుడ్డితనం కలిగించి, వాళ్ల హృదయాల్ని కఠినం చేస్తాడని యెషయా ప్రవచించాడు. (యెషయా 6:10; యోహాను 12:40) అవును, యేసే వాగ్దానం చేయబడిన విమోచకుడని, జీవానికి నడిపించే మార్గమని చూపించే రుజువుల్ని చాలామంది యూదులు మొండిగా నిరాకరించారు.
నీకొదేము, అరిమతయియ యోసేపు, ఇంకా ఎంతోమంది నాయకులు యేసు మీద “విశ్వాసముంచారు.” మరి వాళ్లు ఆ విశ్వాసానికి తగ్గట్లు చర్య తీసుకుంటారా? లేక సమాజమందిరం నుండి వెలివేస్తారనే భయంతోనో, ‘మనుషుల ఆమోదం’ పొందాలనే కోరికతోనో వెనకడుగు వేస్తారా?—యోహాను 12:42, 43.
తనమీద విశ్వాసం ఉంచడం గురించి వివరిస్తూ యేసే స్వయంగా ఇలా అన్నాడు: “నామీద విశ్వాసముంచే వ్యక్తి నామీదే కాదు, నన్ను పంపించిన వ్యక్తి మీద కూడా విశ్వాసం ఉంచుతున్నాడు; నన్ను చూసే వ్యక్తి నన్ను పంపించిన వ్యక్తిని కూడా చూస్తున్నాడు.” దేవుడు బోధించమని చెప్పిన సత్యాల్ని యేసు బోధిస్తున్నాడు. అవి ఎంతో ప్రాముఖ్యమైనవి. ఎందుకంటే, “నన్ను గౌరవించని, నా మాటలు స్వీకరించని వాళ్లకు తీర్పు తీర్చేది ఒకటి ఉంది. నేను మాట్లాడిన మాటే చివరి రోజున వాళ్లకు తీర్పు తీరుస్తుంది” అని యేసు అన్నాడు.—యోహాను 12:44, 45, 48.
యేసు ఇలా ముగించాడు: “నేను ఏదీ నా సొంతగా మాట్లాడలేదు. నేను ఏం చెప్పాలో, ఏం మాట్లాడాలో నన్ను పంపించిన తండ్రే నాకు ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞ శాశ్వత జీవితానికి నడిపిస్తుందని నాకు తెలుసు.” (యోహాను 12:49, 50) తనమీద విశ్వాసం ఉంచే వాళ్లందరి కోసం ఇంకొన్ని రోజుల్లో తన రక్తం చిందించబోతున్నానని యేసుకు తెలుసు.—రోమీయులు 5:8, 9.