93వ అధ్యాయం
మానవ కుమారుడు బయల్పర్చబడే రోజు
రాజ్యం వాళ్ల మధ్యే ఉండడం
యేసు బయల్పర్చబడే రోజున ఏం జరుగుతుంది?
యేసు ఇంకా సమరయ లేదా గలిలయలోనే ఉండివుంటాడు. పరిసయ్యులు ఆయన్ని రాజ్యం గురించి అడిగారు. ఎందుకంటే అది అందరికీ కనబడేలా ఆర్భాటంగా వస్తుందని వాళ్లు అనుకుంటున్నారు. అయితే యేసు ఇలా అన్నాడు: “దేవుని రాజ్యం అందరికీ కనిపించేలా రాదు. అలాగే ప్రజలు, ‘ఇదిగో ఇక్కడుంది!’ ‘అదిగో అక్కడుంది!’ అని అనరు. ఎందుకంటే, ఇదిగో! దేవుని రాజ్యం మీ మధ్యే ఉంది.”—లూకా 17:20, 21.
రాజ్యం, దేవుని సేవకుల హృదయాల్లో ఏలుతుందని కొంతమంది అనుకోవచ్చు. కానీ యేసు మాట్లాడుతున్నది పరిసయ్యులతో. కాబట్టి రాజ్యం వాళ్ల హృదయాల్లో ఉండడం అసాధ్యం. మరి, రాజ్యం వాళ్ల మధ్య ఉంది అని యేసు ఎందుకు అన్నాడు? ఎందుకంటే, దేవుని రాజ్యానికి రాజుగా నియమించబడిన యేసు వాళ్ల మధ్య ఉన్నాడు.—మత్తయి 21:5.
బహుశా పరిసయ్యులు వెళ్లిపోయాక, రాజ్యం రావడం గురించి మరిన్ని వివరాలు యేసు తన శిష్యులకు చెప్పాడు. తాను రాజ్యాధికారంతో ప్రత్యక్షమయ్యే సమయం గురించి చెప్తూ, యేసు మొదట ఇలా హెచ్చరించాడు: “మానవ కుమారుడి రోజుల్లో ఒకరోజును చూడాలని మీరు కోరుకునే సమయం రాబోతుంది; కానీ మీరు దాన్ని చూడరు.” (లూకా 17:22) మానవ కుమారుని రాజ్యపాలన భవిష్యత్తులో మొదలౌతుందని యేసు చెప్తున్నాడు. అయితే ఆ సమయం రాకముందే, కొంతమంది శిష్యులు దానికోసం ఆత్రుతతో ఎదురుచూస్తారు. కానీ దేవుడు నిర్ణయించిన సమయంలోనే మానవ కుమారుడు వస్తాడు. అప్పటివరకు వాళ్లు ఎదురుచూస్తూనే ఉండాలి.
యేసు ఇంకా ఇలా చెప్పాడు: “ప్రజలు మీతో, ‘అదిగో అక్కడ!’ ‘ఇదిగో ఇక్కడ!’ అని అంటారు. అప్పుడు మీరు వెళ్లకండి, వాళ్ల వెనక పరుగెత్తకండి. మెరుపు ఆకాశంలో ఒక చోట మొదలై ఆకాశంలో ఇంకో చోటి వరకు మెరుస్తుంది; మానవ కుమారుడి రోజుల్లో కూడా అలాగే ఉంటుంది.” (లూకా 17:23, 24) యేసు శిష్యులు అబద్ధ మెస్సీయల వెనక పరుగెత్తకుండా ఎలా ఉండవచ్చు? ఆకాశంలో మెరుపు ఆ చివర నుండి ఈ చివర వరకు కనిపించినట్లే, నిజమైన మెస్సీయ వచ్చినప్పుడు అందరికీ తెలుస్తుందని యేసు చెప్పాడు. అంటే ఆయన రాజ్యాధికారంతో ప్రత్యక్షమైనప్పుడు, అప్రమత్తంగా ఉన్నవాళ్లందరూ ఆ రుజువుల్ని స్పష్టంగా చూడగలుగుతారు.
భవిష్యత్తులో మానవ కుమారుడు వచ్చినప్పుడు ప్రజల వైఖరి ఎలా ఉంటుందో చెప్పడానికి, గతంలో జరిగిన సంఘటనల్ని యేసు గుర్తుచేశాడు. ఆయన ఇలా అన్నాడు: “నోవహు రోజుల్లో జరిగినట్టే మానవ కుమారుడి రోజుల్లో కూడా ఉంటుంది . . . అలాగే అప్పుడు పరిస్థితి లోతు రోజుల్లో ఉన్నట్టే ఉంటుంది: ప్రజలు తింటూ, తాగుతూ, కొంటూ, అమ్ముతూ, నాటుతూ, ఇళ్లు కట్టుకుంటూ ఉన్నారు. కానీ లోతు సొదొమ నుండి బయటికి వచ్చిన రోజున ఆకాశం నుండి అగ్నిగంధకాలు కురిసి వాళ్లందర్నీ నాశనం చేశాయి. మానవ కుమారుడు బయల్పర్చబడే రోజున పరిస్థితి అలాగే ఉంటుంది.”—లూకా 17:26-30.
నోవహు రోజుల్లో, లోతు రోజుల్లో జీవించిన ప్రజలు తినడం, తాగడం, అమ్మడం, కొనడం, పంటలు పండించడం, ఇళ్లు కట్టుకోవడం వంటి రోజువారీ పనుల్ని చేసినందుకు నాశనమయ్యారని యేసు చెప్పట్లేదు. నోవహు, లోతు, వాళ్ల కుటుంబ సభ్యులు కూడా అలాంటి కొన్ని పనులు చేశారు. కానీ మిగతా ప్రజలు దేవుని ఇష్టాన్ని పక్కనపెట్టేసి, వాళ్లున్న సమయం ఎంత ప్రాముఖ్యమైనదో మర్చిపోయేంతగా ఆ పనుల్లో మునిగిపోయారు. అందుకే దేవుని ఇష్టం చేయడానికి ప్రాముఖ్యత ఇవ్వమని, ఆ పనిలో చురుగ్గా ఉండమని యేసు తన శిష్యుల్ని ప్రోత్సహిస్తున్నాడు. అలా చేస్తే, భవిష్యత్తులో దేవుడు తీసుకొచ్చే నాశనాన్ని తప్పించుకుని నిరంతరం జీవించవచ్చని ఆయన చెప్తున్నాడు.
శిష్యులు లోకంలోని విషయాల మీదికి దృష్టి మళ్లకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది. యేసు ఇలా చెప్పాడు: “ఆ రోజున, డాబా మీదున్న వ్యక్తి ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకోవడానికి కిందికి దిగకూడదు. అలాగే, పొలంలో ఉన్న వ్యక్తి తన వస్తువులు తీసుకోవడానికి వెనక్కి రాకూడదు. లోతు భార్యను గుర్తుచేసుకోండి.” (లూకా 17:31, 32) ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది.
మానవ కుమారుడు రాజుగా పరిపాలించే సమయంలో ఉండే పరిస్థితి గురించి వివరిస్తూ, యేసు ఇలా కొనసాగించాడు: “ఆ రాత్రి ఇద్దరు ఒక మంచంలో పడుకొని ఉంటారు; వాళ్లలో ఒకరు తీసుకెళ్లబడతారు, ఇంకొకరు వదిలేయబడతారు.” (లూకా 17:34) కొంతమంది రక్షణ పొందుతారు, మరికొంతమంది వదిలేయబడతారు అంటే ప్రాణాలు కోల్పోతారు.
శిష్యులు “ప్రభువా, ఇది ఎక్కడ జరుగుతుంది?” అని అడిగారు. అప్పుడు ఆయన ఇలా అన్నాడు: “శవం ఎక్కడ ఉంటే గద్దలు అక్కడ పోగౌతాయి.” (లూకా 17:37) అవును, కొంతమంది శిష్యులు గద్దల్లా దూరదృష్టి కలిగివుంటారు. అలాంటివాళ్లు నిజమైన క్రీస్తు దగ్గరికి అంటే మానవ కుమారుని దగ్గరికి పోగౌతారు. ఆ భవిష్యత్ సమయంలో, యేసు విశ్వాసంగల తన శిష్యుల్ని సత్యంతో పోషిస్తాడు. అది వాళ్ల ప్రాణాల్ని కాపాడుతుంది.