92వ అధ్యాయం
పదిమంది కుష్ఠురోగుల్లో ఒక్కరే కృతజ్ఞత చూపించారు
యేసు పదిమంది కుష్ఠురోగుల్ని బాగుచేశాడు
మహాసభ తనను చంపాలని చూస్తోంది కాబట్టి, యేసు ఎఫ్రాయిము అనే నగరానికి వెళ్లిపోయాడు. అది యెరూషలేముకు కాస్త ఈశాన్యంలో ఉంది. అక్కడ ఆయన తన శత్రువులకు దూరంగా శిష్యులతో ఉన్నాడు. (యోహాను 11:54) సా.శ. 33 పస్కా పండుగ దగ్గరపడుతోంది కాబట్టి యేసు త్వరలోనే తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. ఆయన ఉత్తరం వైపుగా ప్రయాణిస్తూ సమరయ గుండా గలిలయ చేరుకున్నాడు. ఆయన చనిపోకముందు అక్కడికి వెళ్లడం అదే చివరిసారి.
యేసు తన ప్రయాణం ఆరంభంలో, ఒక గ్రామం నుండి మరో గ్రామానికి వెళ్తునప్పుడు, పదిమంది కుష్ఠురోగులు ఆయనకు ఎదురయ్యారు. కొన్ని రకాల కుష్ఠువ్యాధులు క్రమక్రమంగా శరీర భాగాల్ని అంటే చేతివేళ్లను, కాలివేళ్లను, లేదా చెవులను తినేస్తాయి. (సంఖ్యాకాండం 12:10-12) ధర్మశాస్త్రం ప్రకారం కుష్ఠురోగి అందరికి దూరంగా జీవించాలి, “అపవిత్రుణ్ణి! అపవిత్రుణ్ణి!” అని అరవాలి.—లేవీయకాండం 13:45, 46.
కాబట్టి ఆ పదిమంది కుష్ఠురోగులు దూరంగా నిలబడి, “యేసూ, బోధకుడా, మమ్మల్ని కరుణించు!” అని కేకలు వేశారు. అప్పుడు యేసు వాళ్లను చూసి, “వెళ్లి యాజకులకు కనిపించండి” అన్నాడు. (లూకా 17:13, 14) అలా చెప్పడం ద్వారా ఆయన ధర్మశాస్త్రం పట్ల గౌరవం చూపించాడు. ఎందుకంటే ధర్మశాస్త్రం ప్రకారం కుష్ఠురోగులు ఎవరైనా బాగైతే, వాళ్లు బాగయ్యారని యాజకులు మాత్రమే ప్రకటించాలి. అప్పుడు వాళ్లు మళ్లీ ప్రజల మధ్య జీవించవచ్చు.—లేవీయకాండం 13:9-17.
యేసు తమను అద్భుతరీతిగా బాగుచేయగలడని ఆ పదిమంది కుష్ఠురోగులు నమ్మారు. ఇంకా బాగవ్వకముందే, వాళ్లు యేసు మీద విశ్వాసంతో యాజకుల దగ్గరికి బయల్దేరారు. వాళ్లు దారిలో ఉండగానే తమ విశ్వాసానికి తగిన ప్రతిఫలం పొందారు. తాము బాగయ్యామని వాళ్లకు అర్థమైంది!
బాగైన కుష్ఠురోగుల్లో తొమ్మిదిమందేమో యాజకుల దగ్గరికి వెళ్లారు, సమరయుడైన ఒక్క వ్యక్తి మాత్రం యేసును వెతుక్కుంటూ తిరిగొచ్చాడు. ఎందుకు? తనను బాగుచేసిన యేసు పట్ల అపారమైన కృతజ్ఞతతో అతను తిరిగొచ్చాడు. తాను దేవుని శక్తివల్లే బాగయ్యానని గ్రహించి, అతను “దేవుణ్ణి బిగ్గరగా” మహిమపర్చాడు. (లూకా 17:15) యేసు కనబడగానే అతను సాష్టాంగపడి ఆయనకు కృతజ్ఞతలు చెప్పాడు.
తన చుట్టూ ఉన్నవాళ్లతో యేసు ఇలా అన్నాడు: “పదిమందీ శుద్ధులయ్యారు కదా? మరి మిగతా తొమ్మిదిమంది ఎక్కడ? అన్యజనుడైన ఇతను తప్ప దేవుణ్ణి మహిమపర్చడానికి ఇంకెవ్వరూ తిరిగి రాలేదా?” తర్వాత ఆయన సమరయునితో ఇలా అన్నాడు: “లేచి నీ దారిన వెళ్లు, నీ విశ్వాసం నిన్ను బాగుచేసింది.”—లూకా 17:17-19.
యేసు పదిమంది కుష్ఠురోగుల్ని బాగుచేయడం ద్వారా తనకు యెహోవా దేవుని సహాయం ఉందని చూపించాడు. ఆ పదిమందిలో ఒకతనికి మాత్రం జీవమార్గంలో ప్రవేశించే అవకాశం కూడా దొరికి ఉంటుంది. అయితే మన కాలంలో దేవుడు అలాంటి స్వస్థతలు చేయట్లేదు. కానీ మనం యేసుమీద విశ్వాసం ఉంచితే జీవమార్గంలో ప్రవేశించగలుగుతాం, అంటే శాశ్వత జీవితం పొందగలుగుతాం. మరి, ఆ సమరయునిలాగే మనం కూడా కృతజ్ఞత చూపిస్తున్నామా?