61వ అధ్యాయం
చెడ్డదూత పట్టిన అబ్బాయిని యేసు బాగుచేశాడు
మత్తయి 17:14-20 మార్కు 9:14-29 లూకా 9:37-43
చెడ్డదూత పట్టిన అబ్బాయిని బాగుచేయడానికి బలమైన విశ్వాసం అవసరమైంది
యేసు, పేతురు, యాకోబు, యోహాను కొండ మీద నుండి దిగివచ్చినప్పుడు వాళ్లకు ఒక పెద్ద గుంపు కనిపించింది. అక్కడ ఏం జరుగుతోంది? శాస్త్రులు శిష్యుల చుట్టూ చేరి వాళ్లతో వాదిస్తున్నారు. ప్రజలు యేసును చూసి ఆశ్చర్యపోయి, ఆయన దగ్గరికి పరుగెత్తుకుంటూ వచ్చి నమస్కారం చేశారు. అప్పుడు యేసు ఆ ప్రజల్ని, “మీరు దేని గురించి వాళ్లతో వాదిస్తున్నారు?” అని అడిగాడు.—మార్కు 9:16.
ఆ గుంపులోని ఒక వ్యక్తి యేసు ముందు మోకాళ్లూని ఇలా చెప్పాడు: “బోధకుడా, మా అబ్బాయికి మూగ దూత పట్టాడు. అందుకే అతన్ని నీ దగ్గరికి తీసుకొచ్చాను. ఆ చెడ్డదూత పట్టినప్పుడల్లా అతను కింద పడిపోతాడు, అతని నోట్లో నుండి నురగ వస్తుంది, పళ్లు కొరుక్కుంటాడు, నీరసించిపోతాడు. ఆ చెడ్డదూతను వెళ్లగొట్టమని నీ శిష్యుల్ని అడిగాను కానీ వాళ్ల వల్ల కాలేదు.”—మార్కు 9:17, 18.
శిష్యులు ఆ అబ్బాయిని బాగుచేయలేక పోయినందుకు శాస్త్రులు బహుశా వాళ్లను విమర్శిస్తూ, ఎగతాళి చేస్తున్నారు. కాబట్టి యేసు, నిరుత్సాహంలో ఉన్న ఆ అబ్బాయి తండ్రితో మాట్లాడే బదులు ప్రజలతో ఇలా అన్నాడు: “విశ్వాసంలేని చెడ్డ తరమా, ఎంతకాలం నేను మీతో ఉండాలి? ఎంతకాలం మిమ్మల్ని సహించాలి?” తాను లేనప్పుడు తన శిష్యుల్ని ఇబ్బందిపెట్టిన శాస్త్రుల్ని ఉద్దేశించే యేసు ఆ మాట అన్నాడు. తర్వాత, బాధపడుతున్న ఆ తండ్రి వైపు తిరిగి, “ఆ అబ్బాయిని నా దగ్గరికి తీసుకురండి” అన్నాడు.—మత్తయి 17:17.
ఆ అబ్బాయిని యేసు దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు, చెడ్డదూత అతన్ని కింద పడేసి, గిలగిల కొట్టుకునేలా చేశాడు. ఆ అబ్బాయి అటుఇటు దొర్లుతూ, నురగలు కక్కుతూ ఉన్నాడు. అప్పుడు యేసు, “అతనికి ఎంతకాలంగా ఇలా జరుగుతోంది?” అని ఆ తండ్రిని అడిగాడు. అందుకు అతను “చిన్నప్పటి నుండీ ఇలాగే జరుగుతోంది. చెడ్డదూత అతన్ని చంపేయాలని తరచూ మంటల్లోకి, నీళ్లలోకి తోసేస్తాడు” అని చెప్పి, “నువ్వు ఏమైనా చేయగలిగితే, మామీద జాలి చూపించి మాకు సహాయం చేయి” అని వేడుకున్నాడు.—మార్కు 9:21, 22.
యేసు శిష్యులు కూడా ఏమీ చేయలేకపోవడంతో ఆ తండ్రి చాలా నిరాశగా ఉన్నాడు. కాబట్టి నిస్సహాయ స్థితిలో తనను వేడుకున్న ఆ తండ్రిని ఓదారుస్తూ యేసు ఇలా ధైర్యం చెప్పాడు: “‘చేయగలిగితే’ అనే మాట ఎందుకు? విశ్వాసం ఉన్న వ్యక్తికి అన్నీ సాధ్యమే.” వెంటనే అతను, “నాకు విశ్వాసం ఉంది! ఒకవేళ విశ్వాసం తక్కువగా ఉంటే సహాయం చేయి” అని బిగ్గరగా అన్నాడు.—మార్కు 9:23, 24.
ప్రజలు తనవైపు పరుగెత్తుకుంటూ రావడం యేసు గమనించాడు. అందరూ చూస్తుండగా యేసు ఆ చెడ్డదూతను ఇలా గద్దించాడు: “చెవుడున్న మూగ దూతా, నీకు ఆజ్ఞాపిస్తున్నాను, బయటికి రా. ఇంకెప్పుడూ అతనిలోకి ప్రవేశించకు!” అప్పుడు చెడ్డదూత ఆ అబ్బాయిని గట్టిగా అరిచేలా, గిలగిల కొట్టుకునేలా చేసి బయటికి వచ్చాడు. తర్వాత ఆ అబ్బాయి చలనం లేకుండా పడివున్నాడు. చాలామంది అది చూసి, “ఈ అబ్బాయి చనిపోయాడు!” అన్నారు. (మార్కు 9:25, 26) అయితే యేసు ఆ అబ్బాయి చేయి పట్టుకున్నప్పుడు అతను లేచాడు, “వెంటనే బాగయ్యాడు.” (మత్తయి 17:18) యేసు చేసింది చూసి ప్రజలు ఎంతో ఆశ్చర్యపోయారు.
యేసు ఇంతకుముందు తన శిష్యుల్ని ప్రకటించడానికి పంపినప్పుడు వాళ్లు చెడ్డదూతల్ని వెళ్లగొట్టగలిగారు. కాబట్టి ఒక ఇంట్లో ఏకాంతంగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన్ని ఇలా అడిగారు: “ఆ చెడ్డదూతను మేము ఎందుకు వెళ్లగొట్టలేకపోయాం?” వాళ్లలో విశ్వాసం తక్కువ అవడం వల్లేనని వివరిస్తూ యేసు ఇలా అన్నాడు: “ఇలాంటి చెడ్డదూతల్ని వెళ్లగొట్టడం ప్రార్థన వల్ల మాత్రమే సాధ్యమౌతుంది.” (మార్కు 9:28, 29) శక్తివంతమైన చెడ్డదూతల్ని వెళ్లగొట్టడానికి, బలమైన విశ్వాసంతో పాటు దేవుని సహాయం కోసం ప్రార్థించడం కూడా అవసరమని యేసు చెప్పాడు.
యేసు చివర్లో ఇలా అన్నాడు: “నేను మీతో నిజంగా చెప్తున్నాను, మీకు ఆవగింజంత విశ్వాసం ఉండి, ఈ కొండతో, ‘ఇక్కడి నుండి అక్కడికి వెళ్లు’ అని అంటే, అది వెళ్తుంది; మీకు ఏదీ అసాధ్యంగా ఉండదు.” (మత్తయి 17:20) విశ్వాసానికి ఎంత బలం ఉందో కదా!
యెహోవా సేవలో మనకు ఎదురయ్యే ఆటంకాలు, ఇబ్బందులు ఎత్తైన పర్వతంలా కనిపించవచ్చు, వాటిని అధిగమించడం అసాధ్యం అనిపించవచ్చు. కానీ మన విశ్వాసాన్ని బలపర్చుకుంటే అది సాధ్యమే.