38వ అధ్యాయం
యోహాను స్వయంగా యేసు నుండే వినాలనుకున్నాడు
యేసు పాత్ర గురించి బాప్తిస్మమిచ్చే యోహాను అడిగాడు
యేసు యోహాను గురించి గొప్పగా మాట్లాడాడు
బాప్తిస్మమిచ్చే యోహాను దాదాపు ఒక సంవత్సరం నుండి చెరసాలలోనే ఉన్నాడు. అయినప్పటికీ, యేసు చేసిన అద్భుతాల గురించి ఆయన వింటున్నాడు. యేసు నాయీనులో ఒక విధవరాలి కుమారుణ్ణి బ్రతికించాడని తన శిష్యులు చెప్పినప్పుడు, యోహానుకు ఎలా అనిపించి ఉంటుందో ఒకసారి ఊహించండి. అయితే, యేసు మెస్సీయ అనే విషయాన్ని యోహాను స్వయంగా యేసు నుండే వినాలనుకున్నాడు. అందుకే యోహాను తన శిష్యుల్లో ఇద్దరిని పిలిపించుకొని, “రాబోతున్న వ్యక్తివి నువ్వేనా? లేక ఇంకో వ్యక్తి కోసం మేము ఎదురుచూడాలా?” అని యేసును అడగమని పంపించాడు.—లూకా 7:19.
యోహాను అలా అడగడం వింతగా అనిపిస్తుందా? యోహాను దైవభక్తి గల వ్యక్తి. దాదాపు రెండు సంవత్సరాల క్రితం యేసుకు బాప్తిస్మం ఇస్తున్నప్పుడు పవిత్రశక్తి యేసు మీదికి దిగిరావడం అతను చూశాడు, దేవుడు యేసును ఆమోదిస్తున్నట్లు చెప్పడం అతను విన్నాడు. యోహాను విశ్వాసం బలహీనపడిందని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ బలహీనపడి ఉంటే, ఇప్పుడు మనం చూడబోతున్నట్లుగా యేసు యోహాను గురించి గొప్పగా మాట్లాడేవాడు కాదు. మరి యోహానుకు అనుమానాలు లేకపోతే, యేసును ఈ ప్రశ్న ఎందుకు అడిగినట్టు?
తానే మెస్సీయ అని యేసు స్వయంగా చెప్తే వినాలని యోహాను కోరుకొని ఉంటాడు. చెరసాలలో మగ్గుతున్న యోహానుకు ఆ మాట బలాన్నిస్తుంది. యోహాను మరో ఉద్దేశంతో కూడా ఆ ప్రశ్న అడిగివుంటాడు. దేవుడు అభిషేకించిన వ్యక్తి ఒక రాజు, విమోచకుడు అవుతాడని చెప్పే బైబిలు ప్రవచనాలు యోహానుకు తెలుసు. అయితే, యేసు బాప్తిస్మం తీసుకుని ఎన్నో నెలలు గడుస్తున్నా, యోహాను ఇంకా చెరసాలలోనే ఉన్నాడు. అందుకే, మెస్సీయ గురించిన ప్రవచనాలన్నిటినీ నెరవేర్చడానికి యేసు కాకుండా మరో వ్యక్తి రాబోతున్నాడా అని అతను అడుగుతున్నాడు.
యేసు యోహాను శిష్యులతో, ‘రాబోతున్న వ్యక్తిని నేనే’ అని సూటిగా చెప్పే బదులు, రకరకాల రోగాలతో, అంగవైకల్యాలతో బాధపడుతున్న చాలామందిని బాగుచేసి తనకు దేవుని సహాయం ఉందని రుజువు చేశాడు. తర్వాత ఆయన యోహాను శిష్యులతో ఇలా అన్నాడు: “మీరు వింటున్నవాటి గురించి, చూస్తున్నవాటి గురించి వెళ్లి యోహానుకు చెప్పండి: గుడ్డివాళ్లు ఇప్పుడు చూస్తున్నారు, కుంటివాళ్లు నడుస్తున్నారు, కుష్ఠురోగులు శుద్ధులౌతున్నారు, చెవిటివాళ్లు వింటున్నారు, చనిపోయినవాళ్లు బ్రతికించబడుతున్నారు, పేదవాళ్లకు మంచివార్త చెప్పబడుతోంది.”—మత్తయి 11:4, 5.
యోహాను అడిగిన ప్రశ్న చూస్తే, యేసు ఇప్పుడు చేస్తున్న వాటికన్నా ఎక్కువే చేస్తాడని, బహుశా తనను చెరసాల నుండి విడిపిస్తాడని అతను ఆశించినట్లు అనిపిస్తుంది. అయితే, తాను ఇప్పుడు చేస్తున్న అద్భుతాల కన్నా తన నుండి ఎక్కువ ఆశించవద్దని యేసు పరోక్షంగా యోహానుకు చెప్తున్నాడు.
యోహాను శిష్యులు వెళ్లిపోయిన తర్వాత, యోహాను కేవలం ప్రవక్త మాత్రమే కాదని యేసు అక్కడ ఉన్నవాళ్లతో అన్నాడు. మలాకీ 3:1లో ప్రవచించబడిన ‘సందేశకుడు,’ అలాగే మలాకీ 4:5, 6 లో ప్రవచించబడిన “ఏలీయా ప్రవక్త” యోహానే అని యేసు చెప్పాడు. యేసు ఇలా వివరించాడు: “నేను మీతో నిజంగా చెప్తున్నాను, స్త్రీలకు పుట్టినవాళ్లలో బాప్తిస్మమిచ్చే యోహాను కన్నా గొప్పవాడు లేడు. అయితే పరలోక రాజ్యంలో తక్కువవాడు అతని కన్నా గొప్పవాడు.”—మత్తయి 11:11.
పరలోక రాజ్యంలో తక్కువవాడు యోహాను కన్నా గొప్పవాడు అని చెప్పడం ద్వారా, యోహాను పరలోక రాజ్యంలోకి వెళ్లడని యేసు తెలియజేశాడు. యోహాను యేసు కోసం మార్గం సిద్ధం చేశాడు, కానీ క్రీస్తు పరలోకానికి మార్గం తెరిచే లోపే అతను చనిపోతాడు. (హెబ్రీయులు 10:19, 20) యోహాను దేవుని నమ్మకమైన ప్రవక్త కాబట్టి, అతను దేవుని రాజ్య పరిపాలనలో భూమ్మీద జీవిస్తాడు.