11వ అధ్యాయం
బాప్తిస్మమిచ్చే యోహాను మార్గాన్ని సిద్ధం చేశాడు
మత్తయి 3:1-12 మార్కు 1:1-8 లూకా 3:1-18 యోహాను 1:6-8, 15-28
యోహాను ప్రకటిస్తూ, బాప్తిస్మం ఇస్తూ ఉన్నాడు
చాలామంది బాప్తిస్మం తీసుకున్నారు, కానీ కొంతమంది తీసుకోలేదు
యేసు పన్నెండేళ్ల వయసులో ఆలయంలోని బోధకుల్ని ప్రశ్నలు అడిగాడు. దాదాపు 17 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు సా.శ. 29 వసంత కాలం. యేసు బంధువైన యోహాను, యొర్దాను నదికి పశ్చిమాన ఉన్న ప్రాంతమంతటా ప్రకటిస్తున్నాడు. అందరూ అతని గురించే మాట్లాడుకుంటున్నారు.
యోహాను మాటలు, వేసుకునే బట్టలు చాలా ప్రత్యేకంగా ఉండేవి. అతను ఒంటె వెంట్రుకలతో తయారుచేసిన బట్టలు వేసుకునేవాడు, నడుము చుట్టూ తోలుదట్టీ కట్టుకునేవాడు. అతను మిడతలు, అడవి తేనె తినేవాడు. అతను “పరలోక రాజ్యం దగ్గరపడింది కాబట్టి పశ్చాత్తాపపడండి” అనే సందేశం ప్రకటిస్తున్నాడు.—మత్తయి 3:2.
యోహాను చెప్పే సందేశం అతని దగ్గరికి వచ్చేవాళ్లలో ఆసక్తిని రేకెత్తించింది. చాలామంది తాము పశ్చాత్తాపపడాలని గుర్తించారు. అంటే, పాత జీవితాన్ని వదిలేసి తమ ఆలోచనల్లో, ప్రవర్తనలో మార్పులు చేసుకోవాలని గుర్తించారు. వాళ్లు “యెరూషలేము నుండి, యూదయ అంతటి నుండి, అలాగే యొర్దాను చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి నుండి” అతని దగ్గరికి వచ్చారు. (మత్తయి 3:5) అలా వచ్చినవాళ్లలో చాలామంది పశ్చాత్తాపపడేవాళ్లు, యోహాను వాళ్లను యొర్దాను నది నీళ్లలో ముంచి బాప్తిస్మం ఇచ్చేవాడు. ఎందుకు?
ధర్మశాస్త్ర ఒప్పందానికి వ్యతిరేకంగా చేసిన పాపాల విషయంలో ప్రజలు హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడినప్పుడు, దానికి గుర్తుగా అతను వాళ్లకు బాప్తిస్మం ఇచ్చేవాడు. (అపొస్తలుల కార్యాలు 19:4) కానీ, బాప్తిస్మం తీసుకోవడానికి అందరూ అర్హులు కాలేదు. కొంతమంది పరిసయ్యులు, సద్దూకయ్యులు యోహాను దగ్గరికి వచ్చినప్పుడు, అతను వాళ్లను ‘సర్పసంతానం’ అని పిలుస్తూ ఇలా అన్నాడు: “పశ్చాత్తాపపడ్డారని చూపించే పనులు చేయండి. ‘అబ్రాహాము మా తండ్రి’ అని అనుకోకండి. ఎందుకంటే నేను మీతో చెప్తున్నాను, దేవుడు ఈ రాళ్ల నుండి అబ్రాహాముకు పిల్లల్ని పుట్టించగలడు. చెట్లను వేళ్ల దగ్గర నుండి నరకడానికి గొడ్డలి సిద్ధంగా ఉంది. కాబట్టి మంచి ఫలాలు ఫలించని ప్రతీ చెట్టు నరకబడి, అగ్నిలో వేయబడుతుంది.”—మత్తయి 3:7-10.
యోహాను శక్తివంతమైన సందేశాన్ని ప్రకటిస్తున్నాడు, చాలామందికి బాప్తిస్మం ఇస్తున్నాడు. పైగా, అందరూ అతని గురించి మాట్లాడుకుంటున్నారు. దాంతో యూదులు యాజకుల్ని, లేవీయుల్ని అతని దగ్గరికి పంపించి “నువ్వు ఎవరు?” అని అడిగించారు.
“నేను క్రీస్తును కాను” అని యోహాను ఒప్పుకున్నాడు.
“మరైతే నువ్వు ఏలీయావా?” అని వాళ్లు అడిగారు.
“కాదు” అన్నాడు.
మోషే చెప్పిన గొప్ప ప్రవక్త అతనో కాదో తెలుసుకోవడానికి “మరి నువ్వు రావాల్సిన ఆ ప్రవక్తవా?” అని అడిగారు.—ద్వితీయోపదేశకాండం 18:15, 18.
యోహాను “కాదు” అని జవాబిచ్చాడు.
వాళ్లు పట్టువిడవకుండా, “ఇంతకీ నువ్వు ఎవరివి? మాతో చెప్పు, మమ్మల్ని పంపినవాళ్లకు మేము సమాధానం చెప్పాలి. నీ గురించి నువ్వు ఏమని చెప్పుకుంటున్నావు?” అని అడిగారు. అప్పుడు అతను, “యెషయా ప్రవక్త చెప్పినట్టు ‘యెహోవా మార్గాన్ని ఖాళీగా ఉంచండి’ అని ఎడారిలో బిగ్గరగా అరుస్తున్న వ్యక్తిని నేను” అని చెప్పాడు.—యోహాను 1:19-23.
“నువ్వు క్రీస్తువు, ఏలీయావు, ఆ ప్రవక్తవు కానప్పుడు బాప్తిస్మం ఎందుకు ఇస్తున్నావు?” అని వాళ్లు అడిగారు. అప్పుడు యోహాను వాళ్లకు అర్థమయ్యేలా ఇలా వివరించాడు: “నేను నీళ్లలో బాప్తిస్మం ఇస్తున్నాను. మీ మధ్య ఒకాయన ఉన్నాడు, ఆయన ఎవరో మీకు తెలీదు. ఆయన నా వెనక వస్తున్నాడు.”—యోహాను 1:25-27.
అవును, రాజుగా పరిపాలించబోయే మెస్సీయను అంగీకరించేలా ప్రజల హృదయాల్ని సిద్ధం చేయడమే తన పని అని యోహాను చెప్తున్నాడు. మెస్సీయ గురించి యోహాను ఇలా అన్నాడు: “నా తర్వాత వస్తున్న వ్యక్తి నాకన్నా బలవంతుడు; ఆయన చెప్పులు విప్పే అర్హత కూడా నాకు లేదు.” (మత్తయి 3:11) అతను ఇంకా ఇలా అన్నాడు: “నా వెనక వచ్చేవాడు ఇప్పుడు నాకంటే గొప్పవాడయ్యాడు, ఎందుకంటే ఆయన నాకన్నా ముందే ఉనికిలో ఉన్నాడు.”—యోహాను 1:15.
“పరలోక రాజ్యం దగ్గరపడింది కాబట్టి పశ్చాత్తాపపడండి” అనే సందేశాన్ని యోహాను ప్రకటించడం సరైనదే. (మత్తయి 3:2) యెహోవా రాజ్యానికి రాజైన యేసుక్రీస్తు పరిచర్య ఆరంభం కానుందని అది ప్రజలందరికీ తెలియజేసింది.