ఆయన మెస్సీయకు అగ్రగామి
ఎండకు కమిలిపోయిన అతని చర్మాన్ని పెద్ద తోలు దట్టీ, మరింత ఆకర్షణనిచ్చింది. ఒంటె రోమంతో చేసిన దుస్తులు ధరించుకున్న ఆ వ్యక్తి ఓ ప్రవక్తలా కనిపించాడు. యొర్దాను నది సమీపంలో ఆయన వద్దకు అనేకులు ఆకర్షితులయ్యారు. అక్కడ ఆకర్షణీయమైన ఈ వ్యక్తి, పశ్చాత్తాపం పొందిన పాపులకు బాప్తిస్మమిచ్చేందుకు తాను సంసిద్ధంగా ఉన్నానని ధైర్యంగా ప్రకటించాడు.
ప్రజలు ఆశ్చర్యపోయారు! ఈ మనిషి ఎవరు? అతని ఉద్దేశమేమిటి?
యేసుక్రీస్తు ఈ వ్యక్తిని గూర్చి ఇలా చెప్పాడు: “మరి ఏమి చూడ వెళ్లితిరి? ప్రవక్తనా? అవునుగాని ప్రవక్తకంటె గొప్పవానినని మీతో చెప్పుచున్నాను . . . స్త్రీలు కనినవారిలో బాప్తిస్మమిచ్చు యోహానుకంటే గొప్పవాడు పుట్టలేదు.” (మత్తయి 11:9-11) యెహాను ఎందుకు అంత విశేషమైన వ్యక్తి? ఎందుకంటే ఆయన మెస్సీయకు అగ్రగామి కనుక.
ఆయన పని ముందుగానే చెప్పబడింది
యోహాను జన్మించడానికి మునుపు 700 కంటే ఎక్కువ సంవత్సరాలకు ముందు, ఈ వ్యక్తి అరణ్యములో ఇలా పిలుపునిస్తుంటాడని యెహోవా ప్రకటించాడు: “ఆలకించుడి, . . . అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఎడారిలో మా దేవుని రాజమార్గము సరాళము చేయుడి.” (యెషయా 40:3; మత్తయి 3:3) యోహాను జన్మించడానికి 400 సంవత్సరాలకు పూర్వం, సర్వోన్నతుడైన దేవుడు ఇలా ప్రకటించాడు: “యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలీయాను మీయొద్దకు పంపుదును.” (మలాకీ 4:5) బాప్తిస్మమిచ్చు యోహాను యేసుకు ఆరు నెలల ముందు జన్మించాడన్న వాస్తవం ఎంతమాత్రమూ అకస్మాత్ పరిణామంకాదు, లేక ఇది సహజ పద్ధతి ద్వారా సంభవించింది కాదు. వాగ్దాన పుత్రుడైన ఇస్సాకు జననంలా, యోహాను జన్మించడం ఓ అద్భుతమే ఎందుకంటే ఆయన తలిదండ్రులైన జెకర్యా మరియు ఎలీసబెతులిరువురూ పిల్లలను కనే వయస్సు మించిపోయినవారే.—లూకా 1:18.
యోహానును గర్భమందు ధరించకముందే, అతని విధి, పని, జీవిత విధానం గబ్రియేలు దూత ద్వారా బహిరంగపర్చబడింది. ఏలీయా ఉత్సాహం మరియు స్ఫూర్తితో, యోహాను, మరణ మార్గాన ఉన్న అవిధేయులను త్రిప్పి, యేసును వారు మెస్సీయగా అంగీకరించేందుకు వారిని సంసిద్ధులను చేస్తాడు. జన్మించినప్పటినుండి యోహాను దేవునికి పూర్తిగా సమర్పించబడి ద్రాక్షారసాన్ని గానీ లేక మత్తుకలిగించే పానీయాలనేగానీ తీసుకోకుండ, నాజీరు అయిన వానిగా ఉన్నాడు. వాస్తవానికి ఎడారిలో అతని ఆహారం ‘అడవి తేనె మిడతలు.’ (మార్కు 1:6; సంఖ్యాకాండము 6:2, 3; లూకా 1:13-17) సమూయేలు వలె, యోహాను చిన్నతనంనుండే సర్వోన్నత దేవుని మహిమాన్విత సేవకొరకు ప్రత్యేకించబడ్డాడు.—1 సమూయేలు 1:11, 24-28.
యోహాను అనే పేరును సహితం దేవుడే ఎన్నుకున్నాడు. “యోహాను” అన్న హెబ్రీ పేరు భావం “యెహోవా అనుగ్రహం కనపర్చాడు; యెహోవా ఉదారతను కనపర్చాడు.”
ఎనిమిదవ దినమున ఆ బిడ్డకు సున్నతి చేసినప్పుడు, ఆయన తండ్రియైన జెకర్యా ఇలా ప్రకటించేందుకు ప్రేరేపించబడ్డాడు: “ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు మన దేవుని మహా వాత్సల్యమునుబట్టి వారి పాపములను క్షమించుటవలన తన ప్రజలకు రక్షణజ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. . . . ఆ మహా వాత్సల్యమునుబట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమనుగ్రహించెను.” (లూకా 1:76-78) యోహాను బహిరంగ పరిచర్య, అతని జీవితంలో ప్రాముఖ్యమైన భాగాన్ని వహించింది. దానితో పోల్చిచూస్తే, మిగిలినవన్నీ అల్ప ప్రాముఖ్యతగలవే. కనుక, యోహాను జీవితంలోని 30 సంవత్సరాలను ఒక్క వచనంలో లేఖనాలు ఇలా చెబుతున్నాయి: “శిశువు ఎదిగి, ఆత్మయందు బలము పొంది, ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినమువరకు అరణ్యములో నుండెను.”—యోహానులూకా 1:80.
అరణ్యములోని స్వరము
పొంతిపిలాతు యూదా అధికారిగా ఉన్నప్పటి తిబెరి కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరంలో ఈ ఆశ్చర్యకరమైన సమాచారంతో బాప్తిస్మమిచ్చు యోహాను అరణ్యంలో కనిపించాడు: “పరలోకరాజ్యము సమీపించియున్నది, మారుమనస్సు పొందుడి.” (మత్తయి 3:2; మార్కు 1:4; లూకా 3:1, 2) ఆ ప్రాంతంలోని ప్రజలందరూ మేలుకొల్పబడ్డారు. అలా ధైర్యంగా ప్రకటించడం, కచ్చితమైన నిరీక్షణ కొరకు ఎదురుచూస్తున్న ప్రజల హృదయాలను తాకింది. యోహాను ప్రకటన, హృదయపూర్వక పశ్చాత్తాపం అవసరమని గట్టిగా చెప్పింది కనుక ఆ వ్యక్తి వినయాన్ని కూడా అది సవాలు చేసింది. ఆయన యథార్థత మరియు విశ్వాసం, ఆయనను దేవుడు పంపిన వ్యక్తిగా దృష్టించేందుకు నిజాయితీపరులైన యథార్థవంతులైన అనేకమంది ప్రజలను కదిలించింది.
యోహాను ఖ్యాతి, నిండుపున్నమిలా వ్యాపించింది. అతని దుస్తులు మరియు భక్తిని బట్టి ఆయన యెహోవా ప్రవక్తని సులభంగా గుర్తించవచ్చు. (మార్కు 1:6) ఇంత ఆసక్తిని ఏది రేపుతున్నదన్న విషయాన్ని కనుగొనేందుకు యాజకులు మరియు లేవీయులు యెరూషలేమునుండి ప్రయాణమయ్యారు. పశ్చాత్తాపమా? ఎందుకు, దేనికొరకు? ఈ మనిషి ఎవరు? అని వారు తెలుసుకోవాలనుకున్నారు. యోహాను ఇలా వివరించాడు: “క్రీస్తును కాను . . . కాగా వారు—మరి నీవెవరవు, నీవు ఏలీయావా అని అడుగగా అతడు—కాననెను. —నీవు ఆ ప్రవక్తవా అని అడుగగా—కానని ఉత్తరమిచ్చెను. కాబట్టి వారు—నీవెవరవు? మమ్ము పంపినవారికి మేము ఉత్తరమియ్యవలెను గనుక నిన్ను గూర్చి నీవేమి చెప్పుకొనుచున్నావని అతనినడిగిరి, అందుకతడు—ప్రవక్తయైన యెషయా చెప్పినట్టు నేను ప్రభువు త్రోవ సరాళముచేయుడి అని అరణ్యములో ఎలుగెత్తి చెప్పు ఒకని శబ్దము అని చెప్పెను. పంపబడినవారు పరిసయ్యులకు చెందినవారు వారు. వారు—నీవు క్రీస్తువైనను ఏలీయావైనను ఆ ప్రవక్తవైనను కానియెడల ఎందుకు బాప్తిస్మమిచ్చుచున్నావని” అతనిని ప్రశ్నించారు.—యోహాను 1:20-25.
రాజ్యంలో ప్రవేశించేవారికి పశ్చాత్తాపం మరియు బాప్తిస్మాలు అవసరమైన మెట్లు. కనుక యోహాను ఇలా జవాబిచ్చాడు: “నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను; అయితే నాకంటె శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు; ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును ఆయన చేట ఆయన చేతిలోనున్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రముచేసి, తన కొట్టులో గోదుమలుపోసి, ఆరని అగ్నితో పొట్టు కాల్చివేయును.” (లూకా 3:15-17; అపొస్తలుల కార్యములు 1:5) వాస్తవానికి, పరిశుద్ధాత్మ మెస్సీయ అనుచరులకు అనుగ్రహించబడుతుంది, కానీ అతని శత్రువులు నాశన అగ్నిని అనుభవిస్తారు.
“అందరు” హెచ్చరించబడ్డారు
అనేకమంది యథార్థ హృదయులైన యూదులు, యోహాను మాటలకు ఎంతగానో చలించిపోయారు మరియు ధర్మశాస్త్రం ఎడల వారి అపనమ్మకపు పాపాలను బహిరంగంగా ఒప్పుకున్నారు. తమకు యొర్దాను నదివద్ద యోహాను బాప్తిస్మమిచ్చేందుకు అనుమతించడం ద్వారా వారు బహిరంగంగా తమ పశ్చాత్తాపాన్ని కనపర్చారు. (మత్తయి 3:5, 6) తత్ఫలితంగా, మెస్సీయాను అంగీకరించేందుకు వారి హృదయాలు సరైన స్థితిలో ఉన్నాయి. దేవుని నీతియుక్త అర్హతలను గూర్చి జ్ఞానం విషయంలో వారికిగల దాహాన్ని తీర్చేందుకు, యోహాను వారిని తన అనుచురులుగా బోధించి, ప్రార్థించే పద్ధతిని కూడా వారికి నేర్పించాడు.—లూకా 11:1.
మెస్సీయకు అగ్రగామియని ఈయనను గూర్చి అపొస్తలుడైన యోహాను ఇలా వ్రాశాడు: “అతని మూలముగా అందరు విశ్వసించునట్లు అతడు ఆ వెలుగునుగూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగావచ్చెను.” (యోహాను 1:7) కనుక బాప్తిస్మమిచ్చు యోహాను “ఇశ్రాయేలు ప్రజలకందరికి మారుమనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించు”చుండగా వినేందుకు అందరూ అన్ని రకాల ప్రజలు వచ్చారు. (అపొస్తలుల కార్యములు 13:24) సుంకరులు బలవంతంగా వసూలు చేయకూడదని ఆయన హెచ్చరించాడు. సైనికులు ఎవరినైనా బాధపెట్టకుండ లేక అబద్ధ ఆరోపణలను చేయకుండా ఉండాలని ఆయన హెచ్చరించాడు. మరియు ధర్మపరాయణ వేషధారణపూర్ణమైన పరిసయ్యులు మరియు సద్దూకయ్యులతో ఆయన ఇలా చెప్పాడు: “సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు? మారుమనస్సునకు తగిన ఫలములు ఫలించుడి.—అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరనుకొన మొదలు పెట్టుకొనవద్దు. దేవుడు ఈ రాళ్లవలన అబ్రాహామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను.”—మత్తయి 3:7-9; లూకా 3:7-14.
యోహాను కాలంలోని మతనాయకులందరూ ఒక గుంపుగా చేరి, ఆయనను విశ్వసించేందుకు నిరాకరించారు మరియు అతనికి దయ్యం పట్టిందని తప్పుడు ఆరోపణను చేశారు. నిత్య జీవానికి నడిపే నీతియుక్త మార్గాన్ని వారు తృణీకరించారు. మరో వైపు, పాపులైన సుంకరులూ వ్యభిచారిణులు యోహాను సాక్ష్యాన్ని నమ్మి పశ్చాత్తాపం పొంది బాప్తిస్మం తీసుకున్నారు. తగిన కాలానికి వారు యేసుక్రీస్తును మెస్సీయగా అంగీకరించారు.—మత్తయి 21:25-32; లూకా 7:31-33.
మెస్సీయా పరిచయం చేయబడ్డాడు
వసంతకాలం నుండి సా.శ. 29 వచ్చేంతవరకు అంటే ఆరు నెలల వరకు దేవుని నమ్మకమైన సాక్షియైన యోహాను, రాబోయే మెస్సీయాపై యూదుల దృష్టిని మరల్చాడు. అది మెస్సీయా రాజు కనిపించవలసిన సమయం. అయితే ఆయన కనిపించినప్పుడు, ఆయన అదే యొర్దాను నదివద్దకు వచ్చి, బాప్తిస్మమిమ్మని అడిగాడు. మొదట యోహాను నిరాకరించాడు, కానీ తర్వాత లోబడ్డాడు. యేసుపైన పరిశుద్ధాత్మ దిగినప్పుడు మరియు తన కుమారుని విషయంలో తన అంగీకారాన్ని వ్యక్తపర్చిన యెహోవా స్వరాన్ని విన్నప్పుడు అతను పొందిన ఆనందాన్ని ఊహించుకోండి.—మత్తయి 3:13-17; మార్కు 1:9-11.
యేసును మెస్సీయగా మొట్టమొదట గుర్తించింది యోహానే మరియు అతను తన శిష్యులను ఈ అభిషక్తునికి పరిచయం చేశాడు. “ఇదిగో లోకపాపమును మోసికొనిపోవు దేవుని గొఱ్ఱెపిల్ల” అని యోహాను అన్నాడు. ఆయన ఇలా కూడా ప్రకటించాడు: “నా వెనుక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు; ఆయన నాకంటె ప్రముఖుడు గనుక నాకంటె ముందటివాడాయెనని నేనెవరినిగూర్చి చెప్పితినో ఆయనే యీయన. నేను ఆయనను ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మమిచ్చుచూ వచ్చితిని.”—యోహాను 1:29-37.
సుమారు ఆరు నెలల పాటు యోహాను పని యేసు పరిచర్యతో సమాంతరంగా కొనసాగింది. ఒకరూ చేస్తున్న పనిని మరొకరు అర్థంచేసుకున్నారు. యోహాను తాను పెండ్లికుమారుని స్నేహితునిగా దృష్టించుకున్నాడు మరియు తన పని తగ్గుతూ రావడం క్రీస్తు పని అధికమవ్వడం చూసి ఆయన ఆనందించాడు.—యోహాను 3:22-30.
యోహానును యేసు ఏలీయాగా గుర్తిస్తూ, ఆయన తనకు అగ్రగామి గుర్తించాడు. (మత్తయి 11:12-15; 17:12) ఒక సందర్భంలో యేసు ఇలా చెప్పాడు: “యెహాను కాలమువరకు ధర్మశాస్త్రమును ప్రవక్తలును ఉండిరి; అప్పటినుండి దేవుని రాజ్య సువార్త ప్రకటింపబడుచున్నది; ప్రతివాడును ఆ రాజ్యములో బలవంతముగా జొరబడుచున్నాడు.”—లూకా 16:16.
అంతమువరకు నమ్మకంగా ఉండడం
ధైర్యంగా సత్యాన్ని ప్రకటించినందుకు యోహాను చెరపట్టబడి, ఖైదు చేయబడ్డాడు. రాజైన హేరోదు పాపమును బట్టబయలు చేయడంలోకూడా అతను తన బాధ్యతనుండి వెనుదీయలేదు. దేవుని ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించి, ఆ రాజు తన స్వంత సోదరుని భార్యయైన హేరోదియతో వ్యభిచరించాడు. ఆ వ్యక్తి పశ్చాత్తాపపడి దేవుని కనికరాన్ని పొందగలడన్న ఉద్దేశంతో యోహాను ధైర్యంగా మాట్లాడాడు.
విశ్వాస ప్రేమల విషయంలో యోహాను ఎంత చక్కని మాదిరోకదా! తన వ్యక్తిగత స్వేచ్ఛను పణంగా పెట్టి, యెహోవా దేవుని ఎడల తన యథార్థతనూ మరియు తోటి మానవుల ఎడల తన ప్రేమను అతను నిరూపించుకున్నాడు. ఒక సంవత్సరం కారాగారంలో ఉన్న తర్వాత, ఆయన మీద “పగపట్టిన” దుష్టురాలైన హేరోదియ పన్నిన దయ్యాల ప్రేరిత పన్నాగ ఫలితంగా యోహాను శిరచ్ఛేదంగావించబడ్డాడు. (మార్కు 6:16-19; మత్తయి 14:3-12) అయితే మెస్సీయాకు అగ్రగామి, యెహోవా ఎడల తన యథార్థతను కాపాడుకున్నాడు, దేవుని నీతియుక్త నూతన లోకంలో జీవితాన్ని అనుభవించేందుకు మృతుల లోకంనుండి లేపబడతాడు.—యోహాను 5:28, 29; 2 పేతురు 3:13.