కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • kr అధ్యా. 20 పేజీలు 209-219
  • సహాయక చర్యలు చేపట్టడం పవిత్రసేవలో ఒక భాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • సహాయక చర్యలు చేపట్టడం పవిత్రసేవలో ఒక భాగం
  • దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడం ‘పవిత్రసేవలో’ భాగం
  • సహాయక చర్యలు చేపట్టడానికి గల కారణాలు
  • విపత్తు సహాయక చర్యల వల్ల వచ్చే ప్రయోజనాలు
  • మీరూ భాగం వహించాలనుకుంటున్నారా?
  • విపత్తు వచ్చినప్పుడు ఎలా సహాయం చేయవచ్చు?
    మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2023
  • యెహోవాసాక్షులు విపత్తు సహాయక చర్యల్లో పాల్గొంటారా?
    తరచూ అడిగే ప్రశ్నలు
  • రాజ్యం ఇస్తున్న మద్దతు—ఆరాధనా స్థలాలను నిర్మించడం, సహాయక చర్యలు చేపట్టడం
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • మనం ఎలా సహాయం చేయవచ్చు?
    మన రాజ్య పరిచర్య—2005
మరిన్ని
దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
kr అధ్యా. 20 పేజీలు 209-219

20

సహాయక చర్యలు చేపట్టడం పవిత్రసేవలో ఒక భాగం

ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం

విపత్తుల సమయంలో క్రైస్తవ ప్రేమను చేతల్లో చూపించడం

1, 2. (ఎ) యూదయలోని క్రైస్తవులు ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నారు? (బి) వాళ్లు క్రైస్తవ ప్రేమను ఎలా రుచి చూశారు?

అది దాదాపు సా.శ. 46. యూదయ ప్రాంతం కరువు కోరల్లో చిక్కుకుంది. ధాన్యం సమృద్ధిగా లేకపోవడం వల్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అక్కడున్న యూదా క్రైస్తవులు (క్రైస్తవులుగా మారిన యూదులు), తినడానికి ఏమీ లేక ఆకలితో అలమటిస్తున్నారు. కానీ వాళ్లు ముందెన్నడూ చూడనంతగా యెహోవా కాపుదలను రుచి చూడబోతున్నారు. ఏ విధంగా?

2 కష్టాల్ని అనుభవిస్తున్న ఆ యూదా క్రైస్తవుల కోసం సిరియాలోని అంతియొకయలో ఉన్న యూదా క్రైస్తవులు, అన్య క్రైస్తవులు (క్రైస్తవులుగా మారిన అన్యులు) విరాళాలు సేకరించడం మొదలుపెట్టారు. అలా సేకరించిన విరాళాలను, బాధ్యతగల ఇద్దరు సహోదరుల ద్వారా అంటే బర్నబా, సౌలు ద్వారా యెరూషలేములోని సంఘ పెద్దలకు పంపించారు. (అపొస్తలుల కార్యములు 11:27-30; 12:25 చదవండి.) వాళ్లు చూపించిన ప్రేమకు యూదయలోని సహోదరులు ఎంత ముగ్ధులైవుంటారో కదా!

3. (ఎ) నేడున్న దేవుని ప్రజలు అంతియొకయలోని క్రైస్తవులను ఎలా ఆదర్శంగా తీసుకుంటున్నారు? ఒక ఉదాహరణ చెప్పండి. (“ఆధునిక కాలంలో, మొదటిసారిగా భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టడం” అనే బాక్సు కూడా చూడండి.) (బి) ఈ అధ్యాయంలో మనం ఏ ప్రశ్నలు పరిశీలిస్తాం?

3 దేవుని ప్రజలు తోటి సహోదరసహోదరీల కోసం సహాయక చర్యలు చేపట్టినట్లుగా నమోదైన సంఘటనల్లో అదే మొదటిది. అంతియొకయలోని క్రైస్తవుల్లాగే, నేడు కూడా మనం కష్టాల్ని లేదా విపత్తులను ఎదుర్కొంటున్న తోటి విశ్వాసులకు వెంటనే సహాయం చేస్తాం.a అలాంటి సహాయక చర్యలు చేపట్టడం కూడా ఒక రకమైన పరిచర్యేనని ఎందుకు చెప్పవచ్చు? మనం అలా చేయడానికి కారణాలు ఏమిటి? దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి? ఇప్పుడు మనం ఆ మూడు ప్రశ్నలకు జవాబులు తెలుసుకుందాం.

విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడం ‘పవిత్రసేవలో’ భాగం

4. పౌలు కొరింథీయులకు రాసిన ఉత్తరంలో పరిచర్య గురించి ఏమి చెప్పాడు?

4 పౌలు కొరింథీయులకు రాసిన రెండో ఉత్తరంలో, రెండు రకాల పరిచర్యల గురించి ప్రస్తావించాడు. ఆయన అభిషిక్తులను ఉద్దేశించి ఆ మాటలు రాసినప్పటికీ, అవి నేడున్న ‘వేరే గొర్రెలకు’ కూడా వర్తిస్తాయి. (యోహా. 10:16) ఒకటి, “శాంతిని తిరిగి నెలకొల్పే పరిచర్య.” దానిలో ప్రకటనా పని, బోధనా పని ఇమిడివున్నాయి. (2 కొరిం. 5:18-20; 1 తిమో. 2:3-6) మరొకటి, కష్టాలు లేదా విపత్తులు ఎదుర్కొంటున్న తోటి విశ్వాసుల కోసం చేసేది. దాన్నే పౌలు ‘పరిచారం చేయడం’ అని అన్నాడు. (2 కొరిం. 8:4, అధస్సూచి) ఆ రెండిటికీ, “పరిచర్య” అని అర్థమిచ్చే డీయాకోనీయ అనే గ్రీకు పదాన్ని పౌలు ఉపయోగించాడు.

5. విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడం కూడా ఒక రకమైన పరిచర్యేనని ఎందుకు చెప్పవచ్చు?

5 ఆ రెండు పనులకు పౌలు ఒకే గ్రీకు పదాన్ని ఉపయోగించడాన్ని బట్టి, కష్టాలు లేదా విపత్తులు ఎదుర్కొంటున్న తోటి విశ్వాసులకు సహాయం చేయడం కూడా ఒక రకమైన పరిచర్యేనని, సంఘంలో జరిగే వివిధ రకాల పరిచర్యల్లో అది కూడా ఒకటని అర్థమౌతుంది. పౌలు అంతకుముందు ఇలా రాశాడు: “పరిచర్యలు వివిధ రకాలు, కానీ ప్రభువు ఒక్కడే; కార్యకలాపాలు వివిధ రకాలు, . . . పవిత్రశక్తే అవన్నీ చేస్తోంది.” (1 కొరిం. 12:4-6, 11) సంఘంలో జరిగే వివిధ రకాల పరిచర్యలను పౌలు “పవిత్రసేవ” అని పిలిచాడు.b (రోమా. 12:1, 6-8) అందుకే, ఆయన “పవిత్రులకు సహాయం [పరిచారం, అధస్సూచి] చేయడానికి” సమయం వెచ్చించాడు.—రోమా. 15:25, 26.

6. (ఎ) విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడం, మన ఆరాధనలో భాగమని పౌలు ఎలా తర్కించాడు? (బి) మనం ప్రపంచవ్యాప్తంగా విపత్తు సహాయక చర్యలు ఎలా చేపడతామో వివరించండి. (214వ పేజీలో ఉన్న “విపత్తులు వచ్చినప్పుడు . . . ” అనే బాక్సు చూడండి.)

6 విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడం ఒక రకమైన పరిచర్య అని, యెహోవాకు చేసే ఆరాధనలో అదొక భాగమని పౌలు కొరింథీయులకు చెప్పాలనుకున్నాడు. ఆయన ఎలా తర్కించాడో గమనించండి: క్రైస్తవులు ‘క్రీస్తు గురించిన మంచివార్తకు లోబడి ఉంటున్నారు’ కాబట్టే విపత్తు సహాయక చర్యల్లో భాగం వహిస్తున్నారని పౌలు అన్నాడు. (2 కొరిం. 9:13) అంటే, వాళ్లు క్రీస్తు బోధల్ని పాటిస్తూ తోటి విశ్వాసులకు సహాయం చేస్తున్నారు. అంతేకాదు వాళ్లు దయతో చేసే అలాంటి పనులు, “దేవుడు చూపించే అపారదయకు” నిదర్శనాలని పౌలు చెప్పాడు. (2 కొరిం. 9:14; 1 పేతు. 4:10) కావలికోట డిసెంబరు 1, 1975 సంచిక, అవసరంలో ఉన్న సహోదరులకు సహాయం చేయడం గురించి సరిగ్గానే ఇలా చెప్పింది: “యెహోవా దేవుడు, ఆయన కొడుకైన యేసుక్రీస్తు ఇలాంటి సేవలకు ప్రాముఖ్యత ఇస్తారా ఇవ్వరా అనే సందేహం మనకు ఎప్పుడూ రాకూడదు.” అవును, విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడం పవిత్రసేవలో ఒక భాగం.—రోమా. 12:1, 7; 2 కొరిం. 8:7; హెబ్రీ. 13:16.

సహాయక చర్యలు చేపట్టడానికి గల కారణాలు

7, 8. విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడానికి గల మొదటి కారణం ఏమిటి? వివరించండి.

7 మనం విపత్తు సహాయక చర్యలు ఎందుకు చేపడతాం? దానికి సమాధానం, పౌలు కొరింథీయులకు రాసిన రెండో ఉత్తరంలో ఉంది. (2 కొరింథీయులు 9:11-15 చదవండి.) సహాయక చర్యలు చేపట్టడానికి గల మూడు ముఖ్యమైన కారణాల గురించి ఆయన తెలియజేశాడు. వాటిలో ఒక్కో కారణాన్ని ఇప్పుడు పరిశీలిద్దాం.

8 మొదటిగా, విపత్తు సహాయక చర్యలు యెహోవాను మహిమపరుస్తాయి. ఆ ఐదు వచనాల్లో పౌలు ఎన్నిసార్లు యెహోవా దేవుని గురించి ప్రస్తావించాడో గమనించండి. ‘దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం,’ ‘చాలామంది ప్రజలు దేవునికి ఎన్నో కృతజ్ఞతలు తెలపడం’ వంటి మాటల్ని పౌలు ఉపయోగించాడు. (11, 12 వచనాలు) విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడం వల్ల, క్రైస్తవులు “దేవుణ్ణి మహిమపరుస్తారు” అనీ, “దేవుని సాటిలేని అపారదయను” స్తుతిస్తారనీ ఆయన చెప్పాడు. (13, 14 వచనాలు) అంతేకాదు, ఆయన ఇలా ముగించాడు: ‘దేవునికి కృతజ్ఞతలు.’—15వ వచనం; 1 పేతు. 4:11.

9. మనం చేపట్టే విపత్తు సహాయక చర్యలు, ఇతరుల అపోహలను ఎలా తుడిచేస్తాయి? ఒక ఉదాహరణ చెప్పండి.

9 నేటి దేవుని సేవకులు కూడా పౌలులాగే భావిస్తారు. అంటే, విపత్తులు వచ్చినప్పుడు సహోదరసహోదరీలకు సహాయం చేయడం ద్వారా యెహోవాను మహిమపర్చవచ్చని, ఆయన బోధలకు వన్నె తీసుకురావచ్చని భావిస్తారు. (1 కొరిం. 10:31; తీతు 2:10) నిజానికి, అలా చేయడం ద్వారా యెహోవా మీద, ఆయన సాక్షుల మీద ఇతరులకు ఉన్న అపోహలను తుడిచేయవచ్చు. ఒక ఉదాహరణ గమనించండి. తుఫాను వల్ల అతలాకుతలమైన ఒక ప్రాంతంలో, ఒకామె తన ఇంటి తలుపు మీద “యెహోవాసాక్షులు మా తలుపు తట్టకూడదు” అని బోర్డు తగిలించుకుంది. అదే వీధిలో ఒక పాడైన ఇంటిని బాగుచేయడానికి కొంతమంది స్వచ్ఛంద సేవకులు వచ్చారు. ఆమె కొన్ని రోజులుగా వాళ్లను గమనిస్తూ ఉంది. అసలు వాళ్లెవరో కనుక్కోవడానికి వాళ్ల దగ్గరికి వెళ్లింది. వాళ్లు యెహోవాసాక్షులని తెలియగానే ఆమె ఆశ్చర్యపోయి, “నేను యెహోవాసాక్షుల్ని అపార్థం చేసుకున్నాను” అంది. ఆ తర్వాత ఏమి జరిగింది? ఆమె తన తలుపుకు తగిలించిన బోర్డును తీసిపారేసింది.

10, 11. (ఎ) విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడం వల్ల తోటి విశ్వాసుల అవసరాలు తీరతాయని ఏ ఉదాహరణలు చూపిస్తున్నాయి? (బి) విపత్తు సహాయక పనుల్లో పాల్గొనే స్వచ్ఛంద సేవకులకు ఉపయోగ పడే ఏ ప్రచురణ అందుబాటులో ఉంది? (“విపత్తు సహాయక పనుల్లో పాల్గొనేవాళ్లకు సహాయం చేసే ఒక కొత్త పరికరం” అనే బాక్సు చూడండి.)

10 రెండవదిగా, విపత్తు సహాయక చర్యల వల్ల తోటి విశ్వాసుల “అవసరాలు చక్కగా” తీరతాయి. (2 కొరిం. 9:12ఎ) మన సహోదరసహోదరీలు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్లను ఆదుకోవడానికి, వాళ్లకు సహాయం చేయడానికి మనం ముందుంటాం. ఎందుకు? ఎందుకంటే, క్రైస్తవ సంఘ సభ్యులుగా మనందరం ‘ఒకే శరీరం.’ శరీరంలో “ఒక అవయవం బాధపడితే, ఇతర అవయవాలన్నీ దానితో కలిసి బాధపడతాయి.” (1 కొరిం. 12:20, 26) మన సహోదరసహోదరీలెవరైనా విపత్తులు ఎదుర్కొంటున్నారని తెలిస్తే, ఆ క్షణంలోనే మన పనులన్నిటిని వదిలేసి, ప్రేమతో కనికరంతో వాళ్లకు సహాయం చేయడానికి వెళ్తాం. (యాకో. 2:15, 16) ఈ ఉదాహరణ గమనించండి. 2011లో, సునామీ జపాన్‌ను అతలాకుతలం చేసింది. అప్పుడు అమెరికా బ్రాంచి కార్యాలయం, అమెరికాలోని రీజనల్‌ బిల్డింగ్‌ కమిటీలకు ఉత్తరం పంపి, జపాన్‌లో రాజ్యమందిరాలను తిరిగి నిర్మించడానికి “కొంతమంది అర్హులైన సహోదరులు” కావాలని కోరింది. దానికి ఎలాంటి స్పందన వచ్చింది? కొన్ని వారాల్లోనే, దాదాపు 600 మంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి, తమ సొంత ఖర్చుతో జపాన్‌ వెళ్లడానికి సిద్ధమయ్యారు! దాని గురించి అమెరికా బ్రాంచి కార్యాలయం ఇలా చెప్పింది: “ఆ ప్రతిస్పందన చూసి మేము ఆశ్చర్యపోయాం.” జపాన్‌లోని ఒక సహోదరుడు, వేరే దేశం నుండి సహాయం చేయడానికి వచ్చిన ఒక సహోదరునితో మాట్లాడుతూ, ఎందుకంత శ్రమ తీసుకుని వచ్చారని అడిగాడు. దానికి అతను ఇలా జవాబిచ్చాడు: “మేమూ, జపాన్‌లో ఉన్న సహోదరులూ ‘ఒకే శరీరం’. కాబట్టి వాళ్లకు బాధ కలిగినా, నొప్పి కలిగినా మాకూ బాధేస్తుంది.” కొన్నిసార్లైతే, స్వచ్ఛంద సేవకులు తమ ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి, తోటి విశ్వాసులకు సహాయం చేశారు. ఆ విధంగా, వాళ్లు త్యాగపూరిత ప్రేమ చూపించారు.c—1 యోహా. 3:16.

1946లో, తోటి సహోదరులకు అవసరమైన వాటిని సర్దుతున్న స్విట్జర్లాండ్‌లోని ఒక యెహోవాసాక్షి

స్విట్జర్లాండ్‌, 1946

ఆధునిక కాలంలో, మొదటిసారిగా భారీ ఎత్తున సహాయక చర్యలు చేపట్టడం

యూరప్‌లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన కొన్ని నెలలకు అంటే, 1945 సెప్టెంబరులో, సెంట్రల్‌ యూరప్‌లో ఉన్న సహోదరులకు సహాయం చేయడానికి భారీ ఎత్తున ఏర్పాట్లు మొదలౌతున్నాయని సహోదరుడు నార్‌ ప్రకటన చేశాడు.

ఆ ప్రకటన చేసిన కొన్ని వారాలకే కెనడా, అమెరికా, ఇతర దేశాల సాక్షులు ఆహారాన్ని, బట్టల్ని సిద్ధం చేయడం మొదలుపెట్టారు. వాళ్లు 1946, జనవరి నుండి ఆస్ట్రియా, బెల్జియం, బల్గేరియా, చైనా, జెకస్లోవేకియా, డెన్మార్క్‌, ఇంగ్లాండ్‌, ఫిన్‌లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, గ్రీస్‌, హంగరీ, ఇటలీ, నెదర్లాండ్స్‌, నార్వే, ఫిలిప్పీన్స్‌, పోలండ్‌, రుమేనియాలో ఉన్న తోటి విశ్వాసులకు వాటిని పంపించడం మొదలుపెట్టారు.

అంతటితో సహాయక చర్యలు అయిపోలేదు. అవి 1948, ఆగస్టు వరకు అంటే రెండున్నర సంవత్సరాల పాటు భారీ ఎత్తున కొనసాగాయి! ఆ సమయంలో దాదాపు 85,000 మంది సహోదరసహోదరీలు 3,00,000 కేజీల కన్నా ఎక్కువ ఆహార పదార్థాల్ని, 4,50,000 కేజీల కన్నా ఎక్కువ బట్టల్ని, 1,24,000 కన్నా ఎక్కువ జతల చెప్పుల్ని యుద్ధం వల్ల ఛిన్నాభిన్నమైన ప్రాంతాల్లోని సహోదరసహోదరీల కోసం పంపించారు. దాని గురించి 1949 కావలికోట ఇలా చెప్పింది: “సహోదరులందరూ తమ ప్రేమను చేతల్లో చూపించారు. ప్రభువును మహిమపర్చడానికి, కష్టాల్లో ఉన్నవాళ్లు తిరిగి సత్యారాధనను పుంజుకునేలా చేయడానికి వాళ్లు ఎంతో ప్రయాసపడ్డారు. అలా సహాయం చేయడాన్ని వాళ్లు అమూల్యమైన అవకాశంగా భావించారు.” ఆ సహాయక చర్యల వల్ల యెహోవాకు ఘనత వచ్చింది, తోటి విశ్వాసుల అవసరాలు తీరాయి, ప్రపంచవ్యాప్త సహోదరుల ఐక్యత బలపడింది.

11 మనం అందించే సహాయాన్ని చూసి సాక్షులుకాని వాళ్లు కూడా ముగ్ధులౌతారు. ఉదాహరణకు, 2013లో అమెరికాలోని అర్కాన్సాస్‌ రాష్ట్రంలో విపత్తు సంభవించినప్పుడు, సాక్షులు వెంటనే చర్య తీసుకున్నారు. దాని గురించి ఒక వార్తాపత్రిక ఇలా రాసింది: “విపత్తు రాగానే యెహోవాసాక్షులు ఒక క్రమపద్ధతిలో సహాయక చర్యలు చేపట్టారు.” అవును, అపొస్తలుడైన పౌలు చెప్పినట్లు, సహోదరుల “అవసరాలు చక్కగా” తీరేలా మనం సహాయం చేస్తాం.

12-14. (ఎ) కష్టాల్లో ఉన్న సహోదరసహోదరీలు తమ ఆధ్యాత్మిక కార్యకలాపాలను తిరిగి మొదలుపెట్టడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) ఆధ్యాత్మిక కార్యకలాపాలను కొనసాగిస్తూ ఉండడం ప్రాముఖ్యమని ఏ అనుభవాలు చూపిస్తున్నాయి?

12 మూడవదిగా, విపత్తు సహాయక చర్యలు చేపట్టడం వల్ల, కష్టాల్లో ఉన్న సహోదరసహోదరీలు తమ ఆధ్యాత్మిక కార్యకలాపాలను తిరిగి మొదలుపెట్టగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యకలాపాలను తిరిగి మొదలుపెట్టడం ఎందుకు ప్రాముఖ్యం? సహాయం అందుకున్న వాళ్లు “దేవునికి ఎన్నో కృతజ్ఞతలు” తెలుపుతారు అని పౌలు అన్నాడు. (2 కొరిం. 9:12బి) అంటే, దానర్థం వాళ్లు సాధ్యమైనంత త్వరగా తమ ఆధ్యాత్మిక కార్యకలాపాలను తిరిగి మొదలుపెడతారు. (ఫిలి. 1:10) 1945 కావలికోట ఇలా చెప్పింది: “పౌలు . . . విరాళాలను సేకరించడానికి ఎందుకు ఒప్పుకున్నాడంటే, అది కష్టాల్లో ఉన్న సహోదరుల అవసరాలను తీరుస్తుంది. అంతేకాదు, వాళ్లు యెహోవాకు సాక్ష్యమిచ్చే పనిలో ఇంకా ఉత్సాహంగా పాల్గొనేలా . . . తోడ్పడుతుంది.” నేడు, మనం విపత్తు సహాయక చర్యలు చేపట్టడానికి కారణం కూడా అదే. సహోదరులు సాధ్యమైనంత త్వరగా ప్రకటనా పనిని తిరిగి మొదలుపెడితే, వాళ్లూ ఓదార్పు పొందుతారు, అలాగే నిరాశలో కూరుకుపోయిన ఇతరుల్ని కూడా ఓదార్చగలుగుతారు.—2 కొరింథీయులు 1:3, 4 చదవండి.

13 అలాంటి సహాయం వల్ల, కొంతమంది సహోదరసహోదరీలు ప్రకటనా పనిని తిరిగి ప్రారంభించి, ఓదార్పు పొందగలిగారు. వాళ్లు ఏమంటున్నారో గమనించండి. ఒక సహోదరుడు ఇలా చెప్పాడు: “క్షేత్ర పరిచర్యకు వెళ్లడం వల్ల మా కుటుంబం సంతోషంగా ఉంది. ఇతరుల్ని ఓదార్చడానికి ప్రయత్నించడం వల్ల, మా కష్టాల గురించి ఎక్కువగా ఆలోచించకుండా ఉండగలిగాం.” ఒక సహోదరి ఇలా చెప్పింది: “ఆధ్యాత్మిక కార్యకలాపాల్లో నిమగ్నం అవ్వడం వల్ల, నా చుట్టూ ఉన్న పరిస్థితుల మీద మనసు పెట్టకుండా ఉండగలిగాను. అప్పుడు నాకు చాలా ధైర్యంగా అనిపించింది.” మరో సహోదరి ఇలా అంది: “పరిస్థితులు పూర్తిగా మా చేయి దాటిపోయినప్పుడు, పరిచర్య మా కుటుంబానికి చాలా సహాయం చేసింది. కొత్తలోకం గురించి ఇతరులతో మాట్లాడడం వల్ల, అన్నీ కొత్తవిగా అవుతాయనే మా నమ్మకం బలపడింది.”

14 కష్టాల్లో ఉన్న సహోదరసహోదరీలు సాధ్యమైనంత త్వరగా మొదలుపెట్టాల్సిన మరో పని, కూటాలకు హాజరవడం. 50వ పడిలో ఉన్న కీయోకో అనే సహోదరి ఉదాహరణ గమనించండి. ఆమె సునామీలో సమస్తం కోల్పోయింది. కట్టుకున్న బట్టలు, వేసుకున్న చెప్పులు తప్ప ఆమెకు ఏమీ మిగల్లేదు. ఇక మిగతా జీవితాన్ని ఎలా గడపాలా అని ఆమె ఆలోచించింది. అప్పుడు ఒక సంఘ పెద్ద, తన కారులో జరుగుతున్న కూటానికి రమ్మని ఆమెను ఆహ్వానించాడు. దాని గురించి కీయోకో ఇలా చెప్తుంది: “ఆ కారులో సంఘ పెద్ద, ఆయన భార్య, నేనూ, ఇంకో సహోదరి ఉన్నాం. ఆ కూటం చాలా సరళంగా జరిగినప్పటికీ, అది నా మనసులో ఉన్న సునామీ జ్ఞాపకాలను అద్భుతరీతిలో తుడిచేసింది. అప్పుడు నా మనసు ప్రశాంతంగా అనిపించింది. క్రైస్తవ సహవాసం ఎంత శక్తివంతమైనదో ఆ కూటం నాకు నేర్పింది.” విపత్తులు వచ్చినప్పుడు కూటాలకు హాజరైన మరో సహోదరి ఇలా చెప్పింది: “అవి నా ప్రాణాన్ని నిలబెట్టాయి!”—రోమా. 1:11, 12; 12:12.

విపత్తు సహాయక చర్యల వల్ల వచ్చే ప్రయోజనాలు

15, 16. (ఎ) కష్టాల్లో ఉన్న సహోదరసహోదరీలకు సహాయం చేయడం వల్ల కొరింథులోని క్రైస్తవులు ఎలా ప్రయోజనం పొందారు? (బి) వాళ్లలాగే మనం కూడా ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చు?

15 సహాయక చర్యలు చేపట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో పౌలు కొరింథీయులకు తెలియజేశాడు. ఆయన ఇలా అన్నాడు: “మీమీద ఉన్న దేవుని సాటిలేని అపారదయను చూసి వాళ్లు [సహాయం అందుకున్న యెరూషలేములోని యూదా క్రైస్తవులు] మీ కోసం దేవుణ్ణి వేడుకుంటున్నారు, మీమీద తమ ప్రేమను వ్యక్తం చేస్తున్నారు.” (2 కొరిం. 9:14) అవును, సహాయం అందుకున్న యూదా క్రైస్తవులు, కొరింథులోని యూదా క్రైస్తవుల కోసమే కాక అన్య క్రైస్తవుల కోసం కూడా ప్రార్థించారు. అలా వాళ్ల మధ్య ప్రేమ బలపడింది.

16 పౌలు చెప్పిన మాటల్ని మన కాలానికి అన్వయిస్తూ 1945, డిసెంబరు 1 కావలికోట ఇలా చెప్పింది: “ఒక ప్రాంతంలో ఉన్న దేవుని ప్రజలు వేరే ప్రాంతంలోని వాళ్లకు సహాయం చేసినప్పుడు, వాళ్ల మధ్య ఐక్యత బలపడుతుంది!” విపత్తు సహాయక పనుల్లో భాగం వహిస్తున్న స్వచ్ఛంద సేవకుల విషయంలో అది నిజం. వరదలు వచ్చినప్పుడు సహాయం అందించడానికి వెళ్లిన ఒక సంఘ పెద్ద ఇలా అంటున్నాడు: “ఈ పని వల్ల, నా సహోదరులకు చాలా దగ్గరైనట్లు అనిపిస్తుంది.” అలాంటి సహాయాన్ని అందుకున్న ఒక సహోదరి కృతజ్ఞతతో ఇలా అంటుంది: “భూపరదైసులో మనకు అత్యంత సన్నిహితంగా ఉండేది కూడా మన సహోదరులే.”—సామెతలు 17:17 చదవండి.

17. (ఎ) విపత్తులు ఎదుర్కొంటున్న సహోదరసహోదరీలు, యెషయా 41:13 లో ఉన్న మాటల్ని ఎలా చవిచూస్తారు? (బి) విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడం వల్ల యెహోవా ఎలా మహిమపర్చబడతాడో, సహోదరుల ఐక్యత ఎలా బలపడుతుందో కొన్ని ఉదాహరణలు చెప్పండి. (“ప్రపంచవ్యాప్తంగా విపత్తు సహాయక పనుల్లో పాల్గొన్న సహోదరసహోదరీలు” అనే బాక్సు కూడా చూడండి.)

17 మన సహోదరులు సంఘటనా స్థలానికి వెళ్లినప్పుడు, అక్కడున్న సహోదరసహోదరీలు, దేవుడు చేసిన ఈ వాగ్దాన నెరవేర్పును ఒక ప్రత్యేకమైన రీతిలో చవిచూస్తారు: “నీ దేవుడనైన యెహోవానగు నేను—భయపడకుము నేను నీకు సహాయము చేసెదనని చెప్పుచు నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను.” (యెష. 41:13) విపత్తు నుండి బయటపడిన ఒక సహోదరి ఇలా చెప్పింది: “విపత్తు సృష్టించిన అల్లకల్లోలం చూసి నేను ఆశ వదులుకున్నాను, కానీ యెహోవా తన చేయి అందించాడు. సహోదరులు నాకు చేసిన సహాయాన్ని మాటల్లో వర్ణించలేను.” ఇద్దరు సంఘ పెద్దలు వాళ్లవాళ్ల సంఘాల తరఫున ఇలా ఉత్తరం రాశారు: “భూకంపం భారీ నష్టాన్ని కలిగించింది. కానీ సహోదరుల ద్వారా యెహోవా మాకు సహాయం చేశాడు. విపత్తు సహాయక చర్యల గురించి మేము ప్రచురణల్లో చదివాం, కానీ ఇప్పుడు కళ్లారా చూశాం.”

నిర్మాణ పనిలో సేవచేస్తున్న పీటర్‌ జాన్సన్‌

అది ఆయన జీవితాన్నే మార్చేసింది

విపత్తు సహాయక పనుల్లో పాల్గొనడం, యౌవనుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? సహోదరుడు పీటర్‌ జాన్సన్‌ ఉదాహరణ పరిశీలించండి. ఆయన 18 ఏళ్లున్నప్పుడు మొదటిసారిగా ఆ సహాయక పనుల్లో పాల్గొన్నాడు. ఆయన ఇలా గుర్తు చేసుకుంటున్నాడు: “సహోదరసహోదరీలు చూపించే మెప్పుదల, ఇవ్వడంలో ఉన్న ఆనందం నన్ను ఎంతగానో కదిలించాయి. దానివల్ల, నా జీవితాన్ని పూర్తిగా యెహోవా సేవలో ఉపయోగించాలనే కోరిక బలపడింది.” తర్వాత, ఆయన పయినీరు సేవ మొదలుపెట్టాడు, బెతెల్‌లో సేవ చేశాడు, ఆ తర్వాత రీజనల్‌ బిల్డింగ్‌ కమిటీలో సభ్యునిగా సేవ చేశాడు. ఆయన ఇలా అంటున్నాడు: “1974లో మొదటిసారిగా విపత్తు సహాయక పనుల్లో పాల్గొనడం, నా జీవితాన్నే మార్చేసింది.” మీరు యౌవనులైతే, మీరు కూడా ఆయనలాగే విపత్తు సహాయక పనుల్లో పాల్గొనవచ్చు. ఒకవేళ అది మీ జీవితాన్ని కూడా మార్చేస్తుందేమో ఎవరికి తెలుసు!

మీరూ భాగం వహించాలనుకుంటున్నారా?

18. విపత్తు సహాయక చర్యల్లో భాగం వహించాలనుకుంటే, మీరు ఏమి చేయవచ్చు? (“అది ఆయన జీవితాన్నే మార్చేసింది” అనే బాక్సు కూడా చూడండి.)

18 విపత్తు సహాయక చర్యల్లో భాగం వహించడం ఎలా ఉంటుందో రుచి చూడాలనుకుంటున్నారా? అయితే, ఒక్క విషయం. సాధారణంగా, రాజ్యమందిర నిర్మాణ పనుల్లో భాగం వహించేవాళ్లనే, విపత్తు సహాయక చర్యల్లో ఉపయోగించుకుంటారని గుర్తుంచుకోండి. కాబట్టి మీ సంఘ పెద్దలతో మాట్లాడి, దరఖాస్తు చేసుకోండి. విపత్తు సహాయక పనుల్లో ఎంతోకాలంగా సేవ చేస్తున్న ఒక సంఘ పెద్ద ఇలా చెప్తున్నాడు: “విపత్తు సహాయక కమిటీ నుండి మీకు అధికారికంగా ఆహ్వానం వస్తే తప్ప సంఘటనా స్థలానికి వెళ్లకండి.” అలా వెళ్లకుండా ఉండడం ద్వారా, ఆ సహాయక చర్యలు ఒక క్రమపద్ధతిలో జరిగేందుకు మనం తోడ్పడతాం.

19. విపత్తు సహాయక చర్యల్లో భాగం వహించడం ద్వారా మనం నిజంగా క్రీస్తు శిష్యులమని ఎలా రుజువు చేయవచ్చు?

19 విపత్తు సహాయక చర్యల్లో భాగం వహించడం ద్వారా, “ఒకరినొకరు ప్రేమించుకోవాలి” అని యేసు ఇచ్చిన ఆజ్ఞకు లోబడతాం. అలాంటి ప్రేమ చూపించినప్పుడు, మనం నిజంగా క్రీస్తు శిష్యులమని ఇతరులు గుర్తిస్తారు. (యోహా. 13:34, 35) ఎంతోమంది సహోదరసహోదరీలు తోటి విశ్వాసులకు సహాయం చేస్తూ, యెహోవాకు మహిమ తెస్తున్నారు. అలాంటివాళ్లు మన మధ్య ఉండడం ఎంత ఆశీర్వాదమో కదా!

a విపత్తులు వచ్చినప్పుడు తోటి విశ్వాసులకు సహాయం చేయడం గురించి ఈ అధ్యాయంలో పరిశీలిస్తాం. అయితే, చాలా సందర్భాల్లో సాక్షులుకాని వాళ్లు కూడా మనం చేపట్టే విపత్తు సహాయక చర్యల నుండి ప్రయోజనం పొందుతారు.—గల. 6:10.

b పౌలు ‘సంఘ పరిచారకుల’ గురించి మాట్లాడుతున్నప్పుడు డీయాకోనోస్‌ (పరిచారకులు) అనే పదాన్ని ఉపయోగించాడు.—1 తిమో. 3:12.

c కావలికోట 1994, నవంబరు 1 సంచికలోని 23-27 పేజీల్లో ఉన్న “బోస్నియాలోని మన విశ్వాసగృహమునకు చేరినవారికి సహాయాన్ని అందించడం” అనే ఆర్టికల్‌ చూడండి.

దేవుని రాజ్యం పరిపాలిస్తోందని మీరు ఎందుకు నమ్ముతున్నారు?

  • విపత్తులు వచ్చినప్పుడు సహాయం చేయడం, యెహోవాకు చేసే పవిత్రసేవలో భాగమని ఎందుకు చెప్పవచ్చు?

  • మనం విపత్తు సహాయక చర్యలు చేపట్టడానికి గల మూడు కారణాలు ఏమిటి?

  • సహాయక చర్యల వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి?

  • యోహాను 13:34 లో ఉన్న ఆజ్ఞకు, విపత్తు సహాయక చర్యల్లో భాగం వహించడానికి సంబంధం ఏమిటి?

ప్రపంచవ్యాప్తంగా విపత్తు సహాయక చర్యల్లో పాల్గొన్న సహోదరసహోదరీలు

సెంట్రల్‌ ఆఫ్రికా, పశ్చిమ ఆఫ్రికా

1994లో రువాండాలో జరిగిన జాతి నిర్మూలనలో దాదాపు 8,00,000 మంది ప్రజలు చంపబడ్డారు. ఆ మారణకాండ వల్ల, సెంట్రల్‌ ఆఫ్రికాలోని ఇతర దేశాల్లో కూడా ఉద్రిక్తత నెలకొంది. దాంతో శరణార్థ శిబిరాలు కిక్కిరిసిపోయాయి. కష్టాల్లో ఉన్న తోటి విశ్వాసుల కోసం బెల్జియం, ఫ్రాన్స్‌, స్విట్జర్లాండ్‌లోని యెహోవాసాక్షులు దాదాపు 30,000 కేజీల బట్టల్ని, వైద్య సహాయాన్ని, డేరాల్ని, ఆహారాన్ని, ఇతర వస్తువుల్ని విమానాల్లో సరఫరా చేశారు. కొన్ని వారాల్లోనే, అవి అవసరంలో ఉన్న మన సహోదరులకు చేరాయి.

ఆఫ్రికాలో యుద్ధం, కరువు, తెగుళ్ల వల్ల బాధపడుతున్న సహోదరులకు సహాయం చేయడానికి, ఫ్రాన్స్‌ నుండి పదిమంది సాక్షులు వెళ్లారు. వాళ్లందరు డాక్టర్లూ నర్సులే. వాళ్లు రెండు సంవత్సరాల్లోనే 10,000 కన్నా ఎక్కువమందికి వైద్య సహాయం అందించారు. వాళ్లు చేసిన పని యెహోవాకు, ఆయన సంస్థకు మహిమ తెచ్చింది. వాళ్లలో ఒక నర్సు ఇలా చెప్తుంది: “మేము ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్లినప్పుడు, అక్కడి ప్రజలు ‘వీళ్లు యెహోవాసాక్షులు. వీళ్లు తమ సహోదరులకు సహాయం చేయడానికి వచ్చారు’ అని మా గురించి గౌరవంగా మాట్లాడతారు.” ఒక నర్సు ద్వారా సహాయం పొందిన ఒక సహోదరి ఇలా అంది: “సిస్టర్‌ మీకు థ్యాంక్స్‌. యెహోవా, నీకు కూడా!”

కొన్నిసార్లు ఘోర ప్రమాదాలు జరిగినప్పుడు కూడా, సహాయక చర్యలు చేపట్టాల్సి వస్తుంది. 2012లో, నైజీరియాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది సాక్షులు చనిపోయారు, వాళ్లందరూ ఒకే సంఘానికి చెందినవాళ్లు. అంతేకాకుండా ఆ ప్రమాదంలో 54 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన సహోదరసహోదరీలను రాత్రింబగళ్లు కంటికిరెప్పలా చూసుకోవడానికి, సహాయక కమిటీ ఏర్పాట్లు చేసింది. యెహోవాసాక్షులు తమ సహోదరసహోదరీలకు చేస్తున్న సపర్యలు చూసి, ఒక పేషెంటు తన పాస్టరుకు ఫోన్‌ చేసి, ఇలా అంది: “మన చర్చి నుండి ఒక్కరు కూడా నన్ను పలకరించడానికి రాలేదు. ఇక్కడికి వచ్చి, యెహోవాసాక్షులు తమ ప్రేమను ఎలా చేతల్లో చూపిస్తున్నారో ఒకసారి చూడండి!”

ఆ చిన్న సంఘంలోని సహోదరులు తీవ్రమైన దుఃఖాన్ని అనుభవించినప్పటికీ, తోటి విశ్వాసులు చూపించిన ప్రేమ వల్ల ఊరట పొందారు. అంతేకాదు, తమ సహోదరులపై స్వచ్ఛంద సేవకులు చూపించిన శ్రద్ధను, ప్రేమను చూశాక, ఆ సంఘంలోని మిగతా సభ్యులు ఇంకా ఎక్కువగా పరిచర్య చేయాలనే ప్రోత్సాహాన్ని పొందారు. ఆ ప్రమాదం జరగకముందు ఆ సంఘంలో 35 మంది ప్రచారకులే ఉన్నారు. కానీ, ఒక్క సంవత్సరంలోనే ఆ సంఖ్య 60కు చేరింది.

ఆస్ట్రేలియా

2013లో, క్వీన్స్‌లాండ్‌ తీర ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. దాంతో 70 మంది సాక్షులు నిరాశ్రయులయ్యారు. ఇంటిని కోల్పోయిన మార్క్‌, రాండ అనే జంట తమ కూతురిని తీసుకుని విపత్తు సహాయక శిబిరానికి వెళ్లారు. ఆ శిబిరం అప్పటికే కిక్కిరిసి ఉంది. కనీసం కూర్చోవడానికి కూడా చోటు లేదు. పైగా, అక్కడికి వస్తూపోతూ ఉన్న విమానాల శబ్దానికి చెవులు చిల్లులు పడుతున్నాయి. ఆ శబ్దం వాళ్ల భయాన్ని ఇంకా పెంచుతుంది. “ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి?” అని రాండ తన భర్తను అడిగింది. దాంతో అతను సహాయం కోసం యెహోవాకు ప్రార్థించాడు. తర్వాత ఏమి జరిగింది? దాని గురించి రాండ ఇలా చెప్తుంది: “అరగంట తర్వాత ఆ శిబిరం దగ్గరికి ఒక కారు వచ్చి ఆగింది. దానిలోనుండి ముగ్గురు సహోదరులు దిగారు. వాళ్లు మా దగ్గరికి వచ్చి, ‘మిమ్మల్ని మాతోపాటు తీసుకెళ్లడానికే వచ్చాం. మీకు ఒక సహోదరుని ఇంట్లో వసతి ఏర్పాటు చేశాం’ అని చెప్పారు. యెహోవా సంస్థకు మా మీద ఎంత ప్రేమ, శ్రద్ధ ఉన్నాయో ఆ క్షణంలో రుచి చూశాం. ఆ సమయంలో మాకు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేం.”

250 కన్నా ఎక్కువమంది స్వచ్ఛంద సేవకులు, తమ సహోదరులకు సహాయం చేయడానికి హుటాహుటిన క్వీన్స్‌లాండ్‌కు చేరుకున్నారు. వయసుపైబడిన ఒక సహోదరుడు ఇలా అంటున్నాడు: “ఎక్కడినుండి వచ్చారో తెలీదు గానీ, సాక్షులు చీమల దండులా వచ్చి క్షణాల్లో మా ఇంటిని శుభ్రం చేసేశారు. వాళ్లు చేసిన సహాయాన్ని నేనూ, నా భార్య ఎప్పటికీ మర్చిపోలేం.”

బ్రెజిల్‌

2008లో, సాంటా కాటారీనా అనే ప్రాంతంలో వరదలు రావడం, మట్టిదిబ్బలు కూలడం వల్ల దాదాపు 80,000 మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. “అది బురద, మట్టి, చెట్లు కలగలసిన సునామీలా” ఉందని స్థానికుడు ఒకతను చెప్పాడు. ఆ సమయంలో, కొంతమంది సహోదరసహోదరీలు సమావేశ హాలులో ఆశ్రయం పొందారు. ఆ హాలును చూసుకుంటున్న మార్సూ అనే సహోదరుడు ఇలా చెప్తున్నాడు: “వాళ్లు కట్టుబట్టలతో బయటపడ్డారు. వాళ్ల బట్టలన్నీ బురదబురదగా ఉన్నాయి.” ఒక సహోదరి ఇలా చెప్తుంది: “మా ఇల్లు కూలిపోయి, నేను చూస్తుండగానే క్షణాల్లో మాయమైపోయింది. అప్పుడు నాకు చాలా బాధేసింది. కానీ మన సహోదరసహోదరీలు ఇచ్చిన ఓదార్పు, చూపించిన ప్రేమ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆధ్యాత్మిక సంపదలు కూడబెట్టుకోవడం ఎంత ప్రాముఖ్యమో ఆ అనుభవం నాకు నేర్పింది.”

బ్రెజిల్‌లోని సహోదరులకు కావాల్సిన వస్తువులను అందిస్తున్న యెహోవాసాక్షులు

2009లో, బ్రెజిల్‌లోని సాంటా కాటారీనాలో తాత్కాలిక విపత్తు సహాయక కేంద్రంగా మార్చిన సమావేశ హాలు. సహోదరసహోదరీలు పంపించిన వస్తువులతో ఆ హాలు నిండిపోయింది

రియో డీ జెనీరియో నగరానికి దగ్గర్లో ఉన్న పర్వత ప్రాంతంలో మట్టిదిబ్బలు విరుచుకుపడ్డాయి. ఆ ప్రాంతంలో తరచూ విపత్తులు జరుగుతుంటాయి కాబట్టి, అక్కడి సహోదరులు శాశ్వత విపత్తు సహాయక కమిటీని ఏర్పాటు చేశారు. మట్టిదిబ్బలు పడుతున్నప్పుడు, ఆ ప్రాంతంలోని నియమిత సహోదరులు వెంటనే ఆ సమాచారాన్ని కమిటీకి తెలియజేస్తారు. అప్పుడు, స్వచ్ఛంద సేవకులు “యెహోవాసాక్షుల సహాయక బృందం” అనే బోర్డు తగిలించివున్న ట్రక్కుల్లో హుటాహుటిన అక్కడికి చేరుకుంటారు. వాళ్లు యెహోవాసాక్షులని స్పష్టంగా గుర్తించగలిగే బట్టలు వేసుకుని పని చేస్తారు. ఆ బృందంలోని ప్రతీ వ్యక్తికి ముందుగానే వాళ్లవాళ్ల పనులు నియమించబడతాయి. వాళ్లలో కొంతమంది, ఆసుపత్రి అనుసంధాన కమిటీలోని సహోదరులతో కలిసి, గాయపడిన సహోదరసహోదరీలకు సహాయం అందిస్తారు. మరికొంతమంది ఆహారం, నీళ్లు, వైద్య సహాయం, బట్టలు, క్లీనింగ్‌ సామాగ్రి తీసుకొస్తారు. ఇక, ఇళ్లల్లో నుండి మట్టిని తొలగించడం మరో పెద్ద పని. ఈ మధ్యకాలంలో విరిగిపడిన మట్టిదిబ్బల వల్ల, ఒక ఇంట్లో నాలుగు ట్రక్కుల మట్టి పేరుకుపోయింది. ఆ ఒక్క ఇంట్లో మట్టిని తొలగించడానికి 60 మంది స్వచ్ఛంద సేవకులు అవసరమయ్యారు!

విపత్తులు రాకముందే సిద్ధపడడం

విపత్తులు రాకముందే ఎలా సిద్ధపడాలో, అవి వచ్చినప్పుడు ఏమి చేయాలో, సంఘ పెద్దలకు, ప్రయాణ పర్యవేక్షకులకు సూచనలు ఇవ్వమని పరిపాలక సభ ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని బ్రాంచీలను నిర్దేశించింది. ఉదాహరణకు విపత్తులు రాకముందే, పెద్దలు తమ సంఘంలో ప్రతీ సభ్యుని చిరునామా, ఫోన్‌ నంబరు లాంటి వివరాలను సేకరించి పెట్టుకోవాలి.

విపత్తులు వచ్చినప్పుడు . . .

  1. ప్రచారకుల కుటుంబంతో మాట్లాడుతున్న ఒక సంఘపెద్ద

    స్థానిక పెద్దలు ప్రతీ ప్రచారకునితో మాట్లాడతారు

  2. పెద్దలు, పెద్దల సభ సమన్వయకర్తకు సమాచారం అందిస్తారు

  3. పెద్దల సభ సమన్వయకర్తలు, ప్రయాణ పర్యవేక్షకులు, బాధ్యతగల క్రైస్తవ సహోదరులు, బ్రాంచి కార్యాలయంలోని సహోదరులు ఒకరితోఒకరు మాట్లాడుకుంటున్నారు

    పెద్దల సభ సమన్వయకర్తలు ప్రయాణ పర్యవేక్షకులతో, బ్రాంచి కార్యాలయానికి సంబంధించిన ఇతర బాధ్యతగల సహోదరులతో మాట్లాడతారు

  4. ఆహారం, నీళ్లు సరఫరా చేయడం

    వీలైనంత త్వరగా ఆహారం, నీళ్లు, వసతి, వైద్య సహాయం, భావోద్వేగ–ఆధ్యాత్మిక సహాయం అందేలా చూస్తారు

  5. విపత్తు నివేదికను పునఃసమీక్షించడం

    పరిస్థితి గురించి, సహోదరసహోదరీల అవసరాల గురించి బ్రాంచి కార్యాలయం, పరిపాలక సభలోని కో-ఆర్డినేటర్స్‌ కమిటీకి నివేదిక పంపిస్తుంది

  6. బాధితులకు కావాల్సినవాటిని పంచిపెట్టడం

    విపత్తు సహాయక కమిటీ, సహాయక చర్యలను ఏర్పాటు చేసి, సహోదరసహోదరీలు తిరిగి కోలుకునేలా సహాయం చేస్తుంది

  7. గాలిలో ఎగురుతున్న విమానం

    కో-ఆర్డినేటర్స్‌ కమిటీ ఆ నివేదికను పరిశీలించి, అవసరమైతే వేరే దేశాల నుండి కూడా స్వచ్ఛంద సేవకులు వచ్చి సహాయం చేసేందుకు అనుమతి ఇస్తుంది

విపత్తు సహాయక పనుల్లో పాల్గొనేవాళ్లకు సహాయం చేసే ఒక కొత్త పరికరం

జెహోవాస్‌ విట్నెసెస్‌ అండ్‌ డిసాస్టర్‌ రిలీఫ్‌ అనే బ్రోషురు కవరు పేజీ

2013, జూన్‌లో యెహోవాసాక్షులు—విపత్తు సహాయక చర్యలు (ఇంగ్లీషు) అనే బ్రోషురు అందుబాటులోకి వచ్చింది. దాన్ని ముఖ్యంగా, అమెరికాలోని విపత్తు సహాయక పనుల్ని పర్యవేక్షించే ప్రభుత్వ అధికారుల కోసం తయారు చేశారు. 1940ల మధ్యకాలం నుండి మనం చేపట్టిన కొన్ని విపత్తు సహాయక చర్యల గురించి ఆ బ్రోషురు వివరిస్తుంది. అంతేకాదు, మనం ప్రపంచవ్యాప్తంగా ఏయే దేశాల్లో సహాయక చర్యలు చేపడుతున్నామో తెలియజేసే మ్యాప్‌ కూడా దాంట్లో ఉంది. సహాయక పనుల్ని చూసుకుంటున్న ఒక సంఘ పెద్ద ఇలా చెప్తున్నాడు: “విపత్తు సహాయక కమిటీల్లో సేవ చేస్తున్న సహోదరులు, ఈ బ్రోషురును ఉపయోగించి, తరచూ విపత్తులు జరిగే ప్రాంతాల్లోని ముఖ్య అధికారులతో మాట్లాడతారు. మన పనుల గురించి ఆ అధికారులకు ముందే చెప్పడం వల్ల, విపత్తులు వచ్చినప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు సులువుగా అనుమతి దొరుకుతుంది.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి