కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • kr అధ్యా. 14 పేజీలు 148-156
  • దేవుని రాజ్యానికి మాత్రమే నమ్మకంగా మద్దతివ్వడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుని రాజ్యానికి మాత్రమే నమ్మకంగా మద్దతివ్వడం
  • దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఒక వివాదాంశం తలెత్తడం
  • “నది” లాంటి వ్యతిరేకతను ఎదుర్కోవడం
  • “భూమి” నోరు తెరిచి “నదిని” మింగేసింది
  • జాతీయ కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని నిరాకరించడం
  • తటస్థంగా ఉండడం ఐక్యతకు తోడ్పడింది
  • ఆరాధనా హక్కు కోసం పోరాడడం
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • రాజ్య ప్రచారకులు కోర్టును ఆశ్రయించడం
    దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
  • చట్టబద్ధంగా సువార్తను కాపాడటం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • “యుద్ధం యెహోవాది”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2025
దేవుని రాజ్యం పరిపాలిస్తోంది!
kr అధ్యా. 14 పేజీలు 148-156

14

దేవుని రాజ్యానికి మాత్రమే నమ్మకంగా మద్దతివ్వడం

ఈ అధ్యాయంలోని ముఖ్యాంశం

దేవుని ప్రజలు లోకసంబంధులుగా ఉండకుండా, రాజ్యానికి నమ్మకంగా మద్దతివ్వడం

1, 2. (ఎ) తన అనుచరులకు నేటికీ ఉపయోగపడే ఏ సూత్రాన్ని యేసు చెప్పాడు? (బి) శత్రువులు మనల్ని ఏమి చేయడానికి ప్రయత్నించారు? కానీ చివరికి ఏమి జరిగింది?

యేసుక్రీస్తు, యూదా జనాంగంలో అత్యంత శక్తివంతమైన న్యాయాధిపతియైన పిలాతు ముందు నిలబడి, నేటి అనుచరులకు కూడా వర్తించే ఒక సూత్రం చెప్పాడు. ఆయన ఇలా అన్నాడు: “నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు. నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినదైతే, నేను యూదులకు అప్పగించబడకుండా నా సేవకులు పోరాడి ఉండేవాళ్లు. కానీ నా రాజ్యం ఈ లోకానికి సంబంధించినది కాదు.” (యోహా. 18:36) తర్వాత పిలాతు యేసుకు మరణశిక్ష విధించాడు. అయినప్పటికీ ఆ విజయం ఎంతోకాలం నిలవలేదు. ఎందుకంటే, యేసు పునరుత్థానమయ్యాడు. అలాగే, క్రీస్తు అనుచరులను పూర్తిగా అణచివేయడానికి ఎంతో శక్తివంతమైన రోమా చక్రవర్తులు ప్రయత్నించారు. కానీ క్రీస్తు అనుచరులు మాత్రం రాజ్య సందేశాన్ని లోకమంతటా చాటిచెప్పారు.—కొలొ. 1:23.

2 1914లో రాజ్యం స్థాపించబడిన తర్వాత, చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన సైనిక బలగాలు, దేవుని ప్రజల్ని తుడిచిపెట్టేయడానికి ప్రయత్నించాయి. కానీ ఘోరంగా విఫలమయ్యాయి. అంతేకాదు చాలా ప్రభుత్వాలు, రాజకీయ వర్గాలు తమ పోరాటాల్లో పాల్గొనమని మనల్ని ఒత్తిడి చేశాయి. కానీ, మన ఐక్యతను ఏ మాత్రం పాడు చేయలేకపోయాయి. దేవుని రాజ్య పౌరులు ఏ దేశంలో నివసిస్తున్నప్పటికీ, వాళ్లు ప్రపంచవ్యాప్త సోదర బృందంలో ఐక్యంగా ఉంటూ, ఈ లోక రాజకీయ వ్యవహారాల్లో తటస్థంగా ఉంటున్నారు. మన మధ్య ఉన్న ఈ ఐక్యతే, దేవుని రాజ్యం పరిపాలిస్తోందనడానికి, రాజైన యేసు మనల్ని నిర్దేశిస్తూ, శుద్ధీకరిస్తూ, కాపాడుతున్నాడనడానికి గొప్ప రుజువు. మనం “లోకసంబంధులు” కాకుండా ఉండడానికి కృషి చేస్తుండగా, యేసు మనకు ఎన్నో చట్టపరమైన విజయాలు అనుగ్రహించాడు. వాటిలో కొన్నిటిని ఇప్పుడు పరిశీలిద్దాం. అలాగే, ఆయన ఏయే విధాలుగా మనల్ని నిర్దేశిస్తూ, శుద్ధీకరిస్తూ, కాపాడుతున్నాడో ఆలోచిద్దాం.—యోహా. 17:14.

ఒక వివాదాంశం తలెత్తడం

3, 4. (ఎ) రాజ్యం స్థాపించబడిన వెంటనే ఏ సంఘటనలు జరిగాయి? (బి) మొదట్లో, దేవుని ప్రజలు తటస్థత గురించి పూర్తిగా అర్థం చేసుకున్నారా? వివరించండి.

3 రాజ్యం స్థాపించబడిన వెంటనే పరలోకంలో ఒక యుద్ధం జరిగింది, సాతాను భూమ్మీదికి పడవేయబడ్డాడు. (ప్రకటన 12:7-10, 12 చదవండి.) అప్పుడు భూమ్మీద కూడా ఒక యుద్ధం జరిగింది. అదే మొదటి ప్రపంచ యుద్ధం. అది దేవుని ప్రజల విశ్వాసాన్ని పరీక్షించింది. ఆ సమయంలో, వాళ్లు యేసు అడుగుజాడల్లోనే నడవాలని, లోక సంబంధులుగా ఉండకూడదని నిర్ణయించుకున్నారు. అయితే, రాజకీయ వ్యవహారాలకు దూరంగా ఉండడంలో ఏమి ఇమిడివుందో అప్పట్లో వాళ్లకు పూర్తిగా తెలీదు.

4 ఉదాహరణకు, 1904లో ప్రచురించబడిన మిలీనియల్‌ డాన్‌ 6వ సంపుటి,a క్రైస్తవులు యుద్ధాల్లో పాల్గొనకూడదని చెప్పింది. అయితే ఒక క్రైస్తవుడు సైన్యంలో చేరాల్సివస్తే, అతను ఆయుధాలు ధరించకుండా చేసే పనుల్ని ఒప్పుకోవచ్చని, అలా కుదరక యుద్ధంలో పాల్గొనాల్సివస్తే అతను ఇతరుల్ని చంపకూడదని అది వివరించింది. బ్రిటన్‌లో, 1905లో బాప్తిస్మం తీసుకున్న హెర్బర్ట్‌ సీనియర్‌ అనే సహోదరుడు అప్పుడున్న పరిస్థితి గురించి ఇలా చెప్పాడు: “సైన్యంలో చేరి, ఆయుధాలు ధరించకుండా చేసే పనులు చేయవచ్చా, చేయకూడదా అనే విషయంలో సహోదరులకు చాలా గందరగోళం ఉండేది.”

5. 1915, సెప్టెంబరు 1 వాచ్‌ టవర్‌ పత్రికలో ఏ మెరుగైన అవగాహన వచ్చింది?

5 ఈ విషయంలో 1915లో మెరుగైన అవగాహన వచ్చింది. స్టడీస్‌ ఇన్‌ ద స్క్రిప్చర్స్‌ అనే పుస్తకం చెప్పిన విషయాన్ని సవరిస్తూ, 1915 సెప్టెంబరు 1 వాచ్‌ టవర్‌ పత్రిక ఇలా తెలియజేసింది: “ఒక క్రైస్తవుడు యుద్ధంలో ఆయుధాలు ధరించని పనిలో పాల్గొన్నా, అతను క్రైస్తవ సూత్రాలను మీరినట్లే.” ఒకవేళ సైన్యంలో చేరకపోయినా, యూనిఫాం వేసుకోకపోయినా కాల్చి చంపేస్తామని అధికారులు బెదిరిస్తే ఆ క్రైస్తవుడు ఏమి చేయాలి? దాని గురించి ఆ ఆర్టికల్‌ ఇలా వివరించింది: “శాంతికి అధిపతియైన మన పరలోక రాజుకు నమ్మకంగా ఉంటూ, ఆయన ఇచ్చిన ఆజ్ఞను పాటించినందుకు చనిపోవడం మంచిదా? లేక ఆయన ఆజ్ఞల విషయంలో రాజీపడిపోయి భూరాజులకు మద్దతిస్తూ, యుద్ధంలో చనిపోవడం మంచిదా? ఆ రెండిట్లో మనం మొదటిదే కోరుకుంటాం. అంటే మన పరలోక రాజుకు నమ్మకంగా ఉంటూ చనిపోవాలనే కోరుకుంటాం.” ఆ ఆర్టికల్‌ అంత సూటిగా నిర్దేశం ఇచ్చి, మళ్లీ చివరికి ఇలా చెప్పింది: “అలా చేయమని మిమ్మల్ని బలవంతం చేయట్లేదు. ఇది ఒక సలహా మాత్రమే.”

6. సహోదరుడు హెర్బర్ట్‌ సీనియర్‌ అనుభవం నుండి మీరేమి నేర్చుకున్నారు?

6 దాంతో కొంతమంది సహోదరులు, ఎట్టి పరిస్థితుల్లోనూ యుద్ధాల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు. ముందు పేరాలో ప్రస్తావించిన హెర్బర్ట్‌ సీనియర్‌ అనే సహోదరుడు ఇలా చెప్పాడు: “ఓడ నుండి మందుగుండ్లను దించడానికి [ఆయుధాలు ధరించకుండా చేసే పని], ఆ మందుగుండ్లను తుపాకీలో పెట్టి కాల్చడానికి పెద్ద తేడా లేదని నాకు అనిపిస్తుంది.” (లూకా 16:10) తమ మనస్సాక్షిని బట్టి సైన్యంలో చేరకూడదని నిర్ణయించుకున్నందుకు హెర్బర్ట్‌ను, మరో నలుగురు సహోదరుల్ని, వేరే మతాలకు చెందిన 11 మందిని జైల్లో వేశారు. ఆ 16 మందిని కొంతకాలంపాటు బ్రిటన్‌లోని రిచ్‌మండ్‌ జైల్లో ఉంచారు. ఒకరోజు, వాళ్లను ఫ్రాన్స్‌లో యుద్ధం జరుగుతున్న చోటుకు రహస్యంగా తరలించి, వాళ్లను కాల్చేయమని ఆదేశాలు ఇచ్చారు. కాల్చడానికి వాళ్లందర్నీ వరుసగా నిలబెట్టారు కానీ వాళ్లను చంపలేదు. బదులుగా వాళ్ల శిక్షను తగ్గించి, పది సంవత్సరాల జైలు శిక్షగా మార్చారు.

సీమన్‌ క్రాకర్‌

“యుద్ధాలు జరుగుతున్నా, దేవుని ప్రజలు మాత్రం ప్రతీఒక్కరితో సమాధానంగా ఉండాలని నేను గ్రహించాను.”—సీమన్‌ క్రాకర్‌ (7వ పేరా చూడండి)

7. రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యే సమయానికల్లా దేవుని ప్రజలు ఏమి అర్థం చేసుకున్నారు?

7 రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యే సమయానికల్లా, తటస్థంగా ఉండడం అంటే ఏమిటో, యేసు అడుగుజాడల్లో నడవడం అంటే ఏమిటో దేవుని ప్రజలు స్పష్టంగా అర్థం చేసుకున్నారు. (మత్త. 26:51-53; యోహా. 17:14-16; 1 పేతు. 2:21) ఉదాహరణకు, 1939 నవంబరు 1 కావలికోటలో “తటస్థత” అనే ఆర్టికల్‌ వచ్చింది. అది ఇలా చెప్పింది: “యెహోవాతో ఒప్పందం చేసుకున్న ప్రజలు, యుద్ధాల్లో పాల్గొంటున్న దేశాల్లో ఎవ్వరి పక్షం వహించకుండా తటస్థంగా ఉండాలి.” తర్వాత న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ ప్రధాన కార్యాలయంలో సేవచేసిన సీమెన్‌ క్రాకర్‌ అనే సహోదరుడు, ఆ ఆర్టికల్‌ గురించి ఇలా చెప్పాడు: “యుద్ధాలు జరుగుతున్నా, దేవుని ప్రజలు మాత్రం ప్రతీఒక్కరితో సమాధానంగా ఉండాలని నేను గ్రహించాను.” సరైన సమయంలో వచ్చిన ఆ ఆధ్యాత్మిక ఆహారం, ముందుముందు రాబోయే మరింత కఠినమైన పరీక్షలకు దేవుని ప్రజల్ని సిద్ధం చేసింది.

“నది” లాంటి వ్యతిరేకతను ఎదుర్కోవడం

8, 9. అపొస్తలుడైన యోహాను చెప్పిన ప్రవచనం ఎలా నెరవేరింది?

8 1914లో రాజ్యం స్థాపించబడిన తర్వాత, దేవుని రాజ్యానికి మద్దతిస్తున్న వాళ్లను తుడిచిపెట్టేయడానికి, మహాసర్పం తన నోటితో ఒక సూచనార్థకమైన నదిని వెళ్లగక్కుతుందని అపొస్తలుడైన యోహాను ప్రవచించాడు. (ప్రకటన 12:9, 15 చదవండి.)b ఆ ప్రవచనం ఎలా నెరవేరింది? 1920ల నుండి, తీవ్రమైన వ్యతిరేకత దేవుని ప్రజల్ని ముంచెత్తింది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో, సహోదరుడు క్రాకర్‌ అలాగే ఉత్తర అమెరికాలో ఉంటున్న చాలామంది సహోదరులు దేవుని రాజ్యానికి నమ్మకంగా ఉన్నందుకు జైల్లో వేయబడ్డారు. ఆ సమయంలో, అమెరికాలోని సెంట్రల్‌ జైళ్లలో, తమ మత నమ్మకాలను బట్టి యుద్ధంలో పాల్గొనడానికి నిరాకరించిన వాళ్లలో, దాదాపు డెబ్భై శాతం మంది యెహోవాసాక్షులే ఉన్నారు.

9 సాతాను, అతని మనుషులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేవుని ప్రజల యథార్థతను పాడు చేయడానికి ప్రయత్నించారు. ఆఫ్రికా, యూరప్‌, అమెరికా అంతటా దేవుని ప్రజల్ని కోర్టులకు ఈడ్చారు. అయినప్పటికీ వాళ్లు తటస్థంగా ఉండాలని నిశ్చయించుకోవడంతో, వాళ్లను జైల్లో వేశారు, కొట్టారు, వాళ్లను వికలాంగులుగా మార్చారు. జర్మనీలో, హిట్లర్‌కు జయం అని చెప్పనందుకు, అలాగే యుద్ధంలో పాల్గొనడాన్ని నిరాకరించినందుకు సాక్షుల్ని తీవ్రంగా హింసించారు. దాదాపు 6,000 మందిని నాజీ క్యాంపుల్లో నిర్బంధించారు. జర్మనీకి, ఇతర దేశాలకు చెందిన 1,600 కన్నా ఎక్కువమంది సాక్షుల్ని చిత్రవధ చేసి చంపారు. అయినప్పటికీ దేవుని ప్రజల్ని తుడిచిపెట్టేయడంలో సాతాను విజయం సాధించలేకపోయాడు.—మార్కు 8:34, 35.

“అతను దేవుని కోసం చనిపోయాడు”

గర్హాట్‌ స్టినాకర్‌

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో, నాజీ అధికారం కింద ఉన్న జర్మనీలో యెహోవాసాక్షులు కొద్దిమందే ఉన్నారు. వాళ్లు తమ మనస్సాక్షిని బట్టి యుద్ధంలో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు. అప్పుడున్న పరిస్థితి గురించి డెట్లెఫ్‌ గార్బె అనే చరిత్రకారుడు ఇలా రాశాడు: “సైన్యంలో చేరడాన్ని నిరాకరించిన వాళ్లలో . . . ఎక్కువశాతం మంది యెహోవాసాక్షులే ఉన్నారు. సైన్యంలో చేరనందుకు మిలిటరీ కోర్టులు వాళ్లను దోషులుగా తీర్పు తీర్చాయి.” వాళ్లలో ఆస్ట్రియాకు చెందిన 19 ఏళ్ల గర్హాట్‌ స్టినాకర్‌ అనే సహోదరుడు కూడా ఉన్నాడు. యుద్ధం మొదలైన కొన్ని రోజులకే నాజీ అధికారులు అతన్ని అరెస్ట్‌ చేశారు.

1939, నవంబరులో గర్హాట్‌కు మరణశిక్ష విధించారు. జైల్లో ఉన్నప్పుడు అతను ఇలా ఉత్తరం రాశాడు: “దేవుని ఆజ్ఞలు పాటిస్తూ ఆయన్ని ఘనపర్చాలనే కోరిక తప్ప, నాకు ఇంకే కోరికా లేదు. నిత్యజీవం, సమాధానం ఉండే తన రాజ్యంలోకి చేర్చుకోమని దేవుణ్ణి అడుగుతాను.”

అతను చనిపోయే ముందురోజు అంటే, 1940 మార్చి 29న తన తల్లిదండ్రులకు ఇలా వీడ్కోలు చెప్పాడు: “నేనింకా చిన్నవాణ్ణే. ప్రభువు సహాయం లేకపోతే నేను ఈ పరీక్షను తట్టుకోలేను, కాబట్టి సహాయం చేయమని ఆయనకు ప్రార్థిస్తున్నాను.” తర్వాతి రోజు ఉదయం దాదాపు 6 గంటలకు గర్హాట్‌కు శిరచ్ఛేదనం చేశారు. అతని సమాధి మీద ఇలా రాసివుంచారు: “అతను దేవుని కోసం చనిపోయాడు.”

“భూమి” నోరు తెరిచి “నదిని” మింగేసింది

10. “భూమి” ఎవర్ని సూచిస్తుంది? అది దేవుని ప్రజల పక్షాన ఎలా అండగా నిలబడింది?

10 “భూమి” మహాసర్పం వెళ్లగక్కిన “నదిని” మింగేస్తుందని అపొస్తలుడైన యోహాను రాశాడు. ఈ లోకంలో అధికారం, పలుకుబడి ఉన్న కొంతమంది వ్యక్తులను సూచిస్తున్న “భూమి” దేవుని ప్రజలకు అండగా నిలబడుతుందని యోహాను చెప్తున్నాడు. ఆ మాటలు ఎలా నెరవేరాయి? రెండో ప్రపంచ యుద్ధం తర్వాతి దశాబ్దాల్లో, మెస్సీయ ప్రభుత్వానికి నమ్మకంగా మద్దతిస్తున్నవాళ్ల పక్షాన “భూమి” ఎన్నోసార్లు అండగా నిలబడింది. (ప్రకటన 12:16 చదవండి.) ఉదాహరణకు యెహోవాసాక్షులు సైన్యంలో చేరడాన్ని, జాతీయ కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని నిరాకరిస్తూ కోర్టులకు వెళ్లినప్పుడు, ఎన్నో ప్రముఖ న్యాయస్థానాలు వాళ్లకు అనుకూలంగా తీర్పు ఇచ్చి వాళ్ల హక్కులను కాపాడాయి. ముందుగా, సైన్యంలో చేరడానికి సంబంధించి యెహోవా తన ప్రజలకు అనుగ్రహించిన కొన్ని విజయాల గురించి పరిశీలిద్దాం.—కీర్త. 68:20.

11, 12. ఆంటోని సికరెలా, యాకోవాస్‌ త్లిమినాస్‌ సహోదరులు ఎలాంటి పరీక్షలు ఎదుర్కొన్నారు? చివరికి ఏమి జరిగింది?

11 అమెరికా. సాక్షుల కుటుంబంలో పెరిగిన ఆంటోని సికరెలా 15వ ఏట బాప్తిస్మం తీసుకున్నాడు. అతనికి 21 సంవత్సరాలు వచ్చేసరికి, తాను ఒక మత పరిచారకుడు కాబట్టి సైన్యంలో చేరడాన్ని నిరాకరిస్తున్నట్లుగా డ్రాఫ్ట్‌ బోర్డులో (సైనిక సేవ కోసం యువకులను ఎంపిక చేసే బృందం) రిజిస్టర్‌ చేసుకున్నాడు. రెండు సంవత్సరాల తర్వాత, అంటే 1950లో తన మనస్సాక్షిని బట్టి సైన్యంలో చేరడాన్ని నిరాకరిస్తున్నట్లుగా రిజిస్టర్‌ చేయమని డ్రాఫ్ట్‌ బోర్డును కోరాడు. ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ (FBI) అతని గురించి మంచి నివేదిక ఇచ్చినా, న్యాయశాఖ అతని విన్నపాన్ని తోసిపుచ్చింది. సికరెలా కేసును కింది కోర్టు ఎన్నోసార్లు విచారించిన తర్వాత, చివరికి అమెరికా సుప్రీం కోర్టు దాన్ని పరిశీలించింది. అది కింది కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ, సికరెలాకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. తమ మనస్సాక్షిని బట్టి సైన్యంలో చేరకూడదని నిర్ణయించుకునే అమెరికా పౌరులందరికీ ఆ తీర్పు ఎంతో ఉపయోగపడింది.

12 గ్రీసు. 1983లో, మిలిటరీ యూనిఫాం వేసుకోవడాన్ని నిరాకరించినందుకు యాకోవాస్‌ త్లిమినాస్‌ అనే సహోదరుణ్ణి జైల్లో వేశారు. విడుదలైన తర్వాత, అతను అకౌంటెంట్‌ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. కానీ జైలుకు వెళ్లొచ్చిన కారణంగా అతని దరఖాస్తును తిరస్కరించారు. దాంతో అతను కోర్టుకెళ్లాడు. కానీ గ్రీసులోని కోర్టుల్లో కేసు గెలవకపోవడంతో, యూరోపియన్‌ మానవ హక్కుల కోర్టుకు (ECHR) అప్పీలు చేసుకున్నాడు. 2000లో, యూరోపియన్‌ మానవ హక్కుల కోర్టులో 17 మంది జడ్జీలతో ఏర్పడిన ప్రధాన మండలి (గ్రాండ్‌ ఛేంబర్‌) ఆ కేసును పరిశీలించి, అతనికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అలాంటి వివక్షనే ఎదుర్కొంటున్న ఇతరులకు కూడా ఆ తీర్పు సహాయం చేసింది. ఆ తీర్పు రాక ముందు, గ్రీసులో 3,500 కన్నా ఎక్కువమంది సహోదరులు తమ తటస్థత కారణంగా జైళ్లలో వేయబడి, నేరస్థులుగా పరిగణించబడ్డారు. కానీ ఈ తీర్పు వచ్చిన తర్వాత, వాళ్ల మీదున్న ఆరోపణలన్నిటిని కొట్టివేయమని గ్రీసు ప్రభుత్వం ఆదేశించింది. అంతేకాదు, సైనిక సేవకు బదులుగా పౌర సేవ చేసే హక్కును గ్రీసు పౌరులందరికీ కల్పిస్తూ, ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని రూపొందించింది. గ్రీసు రాజ్యాంగాన్ని సవరిస్తున్నప్పుడు ఆ చట్టాన్ని కూడా అందులో చేర్చారు.

ఇవైలో స్టెఫనాఫ్‌

“నేను కోర్టు గదిలోకి ప్రవేశించే ముందు, యెహోవాకు ప్రార్థన చేసుకున్నాను, అప్పుడు నాకు ప్రశాంతంగా అనిపించింది.”—ఇవైలో స్టెఫనాఫ్‌ (13వ పేరా చూడండి)

13, 14. ఇవైలో స్టెఫనాఫ్‌, వాహాన్‌ బయాట్యాన్‌ అనే సహోదరుల నుండి మీరేమి నేర్చుకున్నారు?

13 బల్గేరియా. 1994లో, 19 ఏళ్ల ఇవైలో స్టెఫనాఫ్‌ అనే సహోదరుణ్ణి సైన్యంలో చేరాల్సిందిగా ఆదేశించారు. అతను సైన్యంలో చేరడానికి నిరాకరించాడు, అంతేకాదు ఆయుధాలు ధరించకుండా చేసే పనుల్ని కూడా ఒప్పుకోలేదు. దాంతో, అతనికి 18 నెలల జైలు శిక్ష విధించారు. కానీ, తన మనస్సాక్షి ప్రకారం నడుచుకునే హక్కు తనకు ఉంది కాబట్టి అతను కోర్టులో కేసు పెట్టాడు. చివరికి ఆ కేసు యూరోపియన్‌ మానవ హక్కుల కోర్టుకు చేరింది. అయితే కేసు విచారణకు రాకముందే, 2001లో బల్గేరియా ప్రభుత్వం అతనితో రాజీకి వచ్చింది. సహోదరుడు స్టెఫనాఫ్‌కే కాకుండా, పౌర సేవ చేయాలని కోరుకునే బల్గేరియా పౌరులందరికీ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది.c

14 అర్మేనియా. 2001లో వాహాన్‌ బయాట్యాన్‌ అనే సహోదరుణ్ణి తప్పనిసరిగా సైన్యంలో చేరాల్సిందిగా ఆదేశించారు.d తన మనస్సాక్షిని బట్టి సైన్యంలో చేరడాన్ని నిరాకరిస్తున్నట్లుగా అతను స్థానిక కోర్టుల్లో అప్పీలు చేసుకున్నాడు. కానీ ప్రతీసారి ఓటమే ఎదురైంది. 2002 సెప్టెంబరులో అతనికి రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష విధించారు, కానీ పదిన్నర నెలలకే విడుదల చేశారు. ఆ సమయంలో అతను యూరోపియన్‌ మానవ హక్కుల కోర్టుకు అప్పీలు చేసుకున్నాడు. ఆ కోర్టు అతని కేసును విచారించి, 2009 అక్టోబరు 27న అతనికి వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. చివరికి ఆ కోర్టు కూడా వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో అర్మేనియాలోని సహోదరులు ఆశ వదులుకున్నారు. కానీ యూరోపియన్‌ మానవ హక్కుల కోర్టులోని ప్రధాన మండలి ఆ తీర్పును పునఃపరిశీలించి, 2011 జూలై 7న వాహాన్‌ బయాట్యాన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఒకరి మత నమ్మకాలను బట్టి, మనస్సాక్షిని బట్టి సైన్యంలో చేరడాన్ని నిరాకరించడం, ఆలోచన, మనస్సాక్షి, మత స్వాతంత్ర్యపు హక్కుల కిందకే వస్తుందని ఆ కోర్టు మొట్టమొదటిసారి గుర్తించింది. ఆ తీర్పు కేవలం యెహోవాసాక్షుల హక్కులనే కాదు, కౌన్సిల్‌ ఆఫ్‌ యూరప్‌లో సభ్యత్వం ఉన్న దేశాల్లోని కోట్ల మంది ప్రజల హక్కులను కాపాడింది.e

అర్మేనియాలో ఉన్న సహోదరులు జైలు నుండి విడుదలయ్యారు

యూరోపియన్‌ మానవ హక్కుల కోర్టు, సాక్షులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో అర్మేనియాలోని సహోదరులు జైలు నుండి విడుదలయ్యారు

జాతీయ కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని నిరాకరించడం

15. యెహోవా ప్రజలు జాతీయ కార్యక్రమాల్లో ఎందుకు పాల్గొనరు?

15 యెహోవా ప్రజలు సైన్యంలో చేరడాన్నే కాదు, జాతీయ కార్యక్రమాల్లో పాల్గొనడాన్ని కూడా నిరాకరిస్తారు. ఆ విధంగా మెస్సీయ రాజ్యానికి నమ్మకంగా మద్దతిస్తారు. అయితే, రెండో ప్రపంచ యుద్ధం మొదలైనప్పటి నుండి, భూవ్యాప్తంగా ప్రజల్లో జాతీయత భావం ఎక్కువైపోయింది. ప్రతిజ్ఞ చేయడం, జాతీయ గీతం పాడడం, లేదా జెండా వందనం చేయడం ద్వారా దేశభక్తిని చాటాలని ఎన్నో దేశాలు తమ పౌరుల్ని ఆదేశించాయి. కానీ, దేవుని ప్రజలు యెహోవాకు మాత్రమే సంపూర్ణ భక్తిని చూపించారు. (నిర్గ. 20:4, 5) దాంతో హింస వాళ్లను వరదలా ముంచెత్తింది. కానీ “భూమి” మరోసారి నోరు తెరిచి ఆ హింసల్లో కొన్నిటిని మింగేసేలా యెహోవా చేశాడు. జాతీయ కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంబంధించి, యెహోవా యేసు ద్వారా అనుగ్రహించిన గొప్ప విజయాల్ని ఇప్పుడు పరిశీలిద్దాం.—కీర్త. 3:8.

16, 17. లిల్యన్‌ గోబిటాస్‌, విలియమ్‌ గోబిటాస్‌ ఎలాంటి కష్టాలు ఎదుర్కొన్నారు? వాళ్ల అనుభవం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?

16 అమెరికా. 12 ఏళ్ల లిల్యన్‌ గోబిటాస్‌, ఆమె తమ్ముడు 10 ఏళ్ల విలియమ్‌ యెహోవాకు నమ్మకంగా ఉండడం కోసం, జెండా వందనం చేయకూడదని, ప్రతిజ్ఞ చెప్పకూడదని నిర్ణయించుకున్నారు. దాంతో వాళ్లను స్కూలు నుండి పంపించేశారు. 1940లో అమెరికా సుప్రీం కోర్టు వాళ్ల కేసును పరిశీలించింది. ఆ కేసు పేరు మినర్స్‌విల్‌ స్కూల్‌ డిస్ట్రిక్ట్‌ వర్సెస్‌ గోబైటిస్‌.f సుప్రీం కోర్టులోని 9 మంది జడ్జీల్లో 8 మంది, యెహోవాసాక్షులకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. స్కూలు యాజమాన్యం తీసుకున్న చర్య రాజ్యాంగానికి అనుగుణంగానే ఉందనీ, అది “దేశ ఐక్యత” కోసమేననీ కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు వల్ల సాక్షుల మీద హింస ఇంకా ఎక్కువైంది. సాక్షుల పిల్లల్ని స్కూళ్ల నుండి పంపించేశారు, సాక్షుల్ని ఉద్యోగాల నుండి తీసేశారు, చాలామంది సాక్షులమీద క్రూరంగా దాడి చేశారు. దాని గురించి ద లస్టర్‌ ఆఫ్‌ అవర్‌ కంట్రీ అనే పుస్తకం ఇలా చెప్పింది: “20వ శతాబ్దంలో అమెరికాలో మత వివక్ష కారణంగా జరిగిన దాడుల్లో, 1941 నుండి 1943 వరకు సాక్షుల మీద జరిగిన దాడే అత్యంత దారుణమైంది.”

17 కానీ శత్రువులు సాధించిన ఆ విజయం ఎంతోకాలం నిలవలేదు. 1943లో సుప్రీం కోర్టు, గోబైటిస్‌ కేసులాంటి మరో కేసును పరిశీలించింది. ఆ కేసు పేరు వెస్ట్‌ వర్జీనియా స్టేట్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ వర్సెస్‌ బార్నెట్‌. ఈసారి, కోర్టు యెహోవాసాక్షులకు అనుకూలంగా తీర్పు ఇచ్చి, మూడేళ్ల క్రితం గోబైటిస్‌ కేసులో ఇచ్చిన తీర్పును తిరగరాసింది. అంత తక్కువ సమయంలో సుప్రీం కోర్టు తన తీర్పును మార్చుకోవడం, అమెరికా చరిత్రలోనే మొదటిసారి. ఆ తీర్పు వెలువడిన తర్వాత, అమెరికాలో సాక్షుల మీద బహిరంగంగా జరుగుతున్న దాడులు చాలావరకు తగ్గిపోయాయి. అంతేకాదు, ఆ తీర్పు అమెరికా పౌరులందరి హక్కులను సంరక్షించింది.

18, 19. తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోవడానికి పాబ్లో బారోస్‌కు ఏది సహాయం చేసింది? యెహోవా సేవకులందరూ పాబ్లోను ఎలా ఆదర్శంగా తీసుకోవచ్చు?

18 అర్జెంటీనా. 1976లో ఎనిమిదేళ్ల పాబ్లో బారోస్‌ను, అతని తమ్ముడు ఏడేళ్ల యూగో బారోస్‌ను జెండా వందనం చేసే కార్యక్రమంలో పాల్గొననందుకు స్కూలు నుండి పంపించేశారు. ఒక సందర్భంలో అయితే, ప్రిన్సిపల్‌ పాబ్లోను తలమీద కొట్టి అతన్ని నెట్టింది. అంతేకాదు, స్కూలు అయిపోయిన తర్వాత, ఆమె ఆ అబ్బాయిలిద్దర్నీ ఒక గంటసేపు ఉంచి, దేశభక్తి కార్యక్రమాల్లో పాల్గొనమని బాగా ఒత్తిడిచేసింది. ఆ సంఘటనను గుర్తు చేసుకుంటూ పాబ్లో ఇలా చెప్పాడు: “యెహోవా సహాయం వల్లే ఆ ఒత్తిడిని తట్టుకుని ఆయనకు యథార్థంగా ఉండగలిగాను.”

19 కోర్టు ఆ కేసును పరిశీలిస్తున్నప్పుడు, స్కూలు యాజమాన్యం తీసుకున్న చర్యను జడ్జీ సమర్థించాడు. పాబ్లోను, యూగోను స్కూలు నుండి పంపించేయడం సరైనదేనని అతను తీర్పు ఇచ్చాడు. తర్వాత ఆ కేసు అర్జెంటీనా సుప్రీం కోర్టుకు చేరింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ, 1979లో సుప్రీం కోర్టు ఇలా తీర్పు చెప్పింది: “ఆ శిక్ష [పిల్లల్ని స్కూలు నుండి గెంటేయడం], విద్యను అభ్యసించేందుకు రాజ్యాంగం కల్పించిన హక్కుకు (14వ నిబంధన), అందరికీ ప్రాథమిక విద్య అందేలా చూడాల్సిన ప్రభుత్వ బాధ్యతకు (5వ నిబంధన) విరుద్ధంగా ఉంది.” ఆ తీర్పు వల్ల దాదాపు 1,000 మంది సాక్షుల పిల్లలు ప్రయోజనం పొందారు. సాక్షుల పిల్లల్ని పంపించేయడాన్ని స్కూళ్లు విరమించుకున్నాయి. అంతేకాదు పాబ్లో, యూగోలతోపాటు స్కూలు నుండి పంపించేసిన ఇతర పిల్లల్ని మళ్లీ చేర్చుకున్నారు.

ఒక క్రైస్తవ పిల్లవాడు స్కూల్లో తటస్థంగా ఉండడం

చాలామంది సాక్షుల పిల్లలు కఠినమైన పరీక్షలు ఎదురైనా నమ్మకంగా ఉన్నారు

20, 21. రోయెల్‌, ఎమలీల ఉదాహరణ మీ విశ్వాసాన్ని ఎలా బలపర్చింది?

20 ఫిలిప్పీన్స్‌. 1990లో పదేళ్ల ఎమలీని, ఆమె తమ్ముడు తొమ్మిదేళ్ల రోయెల్‌ ఎంబ్రలినాగ్‌ను,g మరో 66 మంది సాక్షుల పిల్లల్ని జెండా వందనం చేయని కారణంగా స్కూలు నుండి గెంటేశారు. అప్పుడు ఎమలీ వాళ్ల నాన్న లియోనార్డో, స్కూలు యాజమాన్యంతో మాట్లాడి వాళ్లకు నచ్చజెప్పడానికి ప్రయత్నించాడు. కానీ ఉపయోగం లేకపోయింది. పరిస్థితి ఇంకా విషమించడంతో, ఆయన సుప్రీం కోర్టులో కేసు పెట్టాడు. కానీ ఆయన దగ్గర డబ్బు లేదు, తన తరఫున వాదించడానికి లాయరు కూడా లేడు. అప్పుడు కుటుంబమంతా కలిసి నిర్దేశం కోసం యెహోవాకు ప్రార్థించారు. మరోవైపు పిల్లల మీద ఎగతాళి, దాడి కొనసాగుతూనే ఉన్నాయి. లియోనార్డోకి చట్టపరమైన విషయాల్లో అనుభవం లేదు కాబట్టి ఖచ్చితంగా కేసు ఓడిపోతానని అనుకున్నాడు.

21 చివరికి ఫెలినో గానల్‌ అనే న్యాయవాది ఆ కుటుంబం తరఫున వాదించాడు. ఇంతకుముందు ఆ దేశంలో పేరుగాంచిన ఒక కంపెనీకి న్యాయవాదిగా పనిచేసిన గానల్‌, లియోనార్డో కేసును వాదించే సమయానికి ఆ ఉద్యోగాన్ని వదిలేసి ఒక యెహోవాసాక్షి అయ్యాడు. సుప్రీం కోర్టు ఏకగ్రీవంగా యెహోవాసాక్షులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. అంతేకాదు, పిల్లల్ని స్కూల్లో నుండి పంపించేయడం తప్పని తేల్చిచెప్పింది. దేవుని ప్రజల యథార్థతను పాడుచేయడానికి ప్రయత్నించిన శత్రువులు మరోసారి విఫలమయ్యారు.

తటస్థంగా ఉండడం ఐక్యతకు తోడ్పడింది

22, 23. (ఎ) యెహోవా ప్రజలు అన్ని విజయాలు ఎలా సాధించగలిగారు? (బి) మన సహోదరుల మధ్య ఉన్న శాంతి, ఐక్యత దేన్ని రుజువు చేస్తున్నాయి?

22 యెహోవా ప్రజలు అన్ని చట్టపరమైన విజయాలు ఎలా సాధించగలిగారు? మనకు ఏ రాజకీయ పలుకుబడి లేదు. అయినప్పటికీ, ఒక దేశం తర్వాత ఇంకో దేశంలో, ఒక కోర్టు తర్వాత ఇంకో కోర్టులో, పక్షపాతంలేని జడ్జీలు మనకు సహాయం చేస్తూ వచ్చారు. ఆ క్రమంలో, రాజ్యాంగంలో కొత్త ప్రమాణాలు రూపుదిద్దుకున్నాయి. ఖచ్చితంగా, మనం సాధించిన విజయాల వెనక క్రీస్తు హస్తం ఉంది. (ప్రకటన 6:2 చదవండి.) అసలు, మనం ఎందుకు చట్టపరమైన పోరాటాలు చేస్తాం? మనం న్యాయ వ్యవస్థను మార్చాలని కాదు గానీ, ఎలాంటి ఆటంకాలూ లేకుండా మన రాజైన యేసుకు సేవ చేయాలన్న ఉద్దేశంతోనే అలాంటి పోరాటాలు చేస్తాం.—అపొ. 4:29.

23 రాజకీయ గొడవలతో, విద్వేషాలతో ఈ లోకం ముక్కలుచెక్కలు అవుతున్నా, తన అనుచరులు మాత్రం తటస్థంగా, ఐక్యంగా ఉండేలా రాజైన యేసు సహాయం చేశాడు. సాతాను ఈ లోకంలో ఉన్న ఐక్యతనే కాదు, మన ఐక్యతను కూడా దెబ్బతీయాలని చాలా ప్రయత్నించాడు, కానీ విఫలమయ్యాడు. ఇలాంటి లోకంలో, లక్షలమంది ప్రజలు ‘యుద్ధం చేయడం నేర్చుకోవడాన్ని’ కూడా నిరాకరిస్తూ శాంతి, ఐక్యత గల సోదర బృందంగా ఉంటున్నారంటే, అది నిజంగా ఒక అద్భుతం. దేవుని రాజ్యం పరిపాలిస్తోందనడానికి ఇదే ఒక గొప్ప రుజువు!—యెష. 2:4.

a ఈ సంపుటికి ద న్యూ క్రియేషన్‌ అనే పేరు కూడా ఉంది. మిలీనియల్‌ డాన్‌ సంపుటుల్ని ఆ తర్వాత స్టడీస్‌ ఇన్‌ ద స్క్రిప్చర్స్‌ అని పిలిచారు.

b ఈ ప్రవచనం గురించి మరింత సమాచారం కోసం, ప్రకటన—దాని దివ్యమైన ముగింపు సమీపించింది! అనే పుస్తకంలో, 27వ అధ్యాయంలో 184-186 పేజీలు చూడండి.

c మనస్సాక్షిని బట్టి సైన్యంలో చేరకూడదని నిర్ణయించుకున్న వాళ్లందరూ, సైనిక సేవకు బదులుగా పౌర సేవ చేసేలా బల్గేరియా ప్రభుత్వం అవకాశం కల్పించింది.

d పూర్తి వివరాల కోసం, కావలికోట (ఇంగ్లీషు) నవంబరు 1, 2012 సంచికలో 29-31 పేజీలు చూడండి.

e 20 సంవత్సరాల నిడివిలో, అర్మేనియా ప్రభుత్వం 450 కన్నా ఎక్కువమంది యౌవన సాక్షుల్ని జైల్లో వేసింది. వాళ్లలోని చివరి వ్యక్తి, 2013 నవంబరులో విడుదలయ్యాడు.

f కోర్టు రికార్డుల్లో ఆ కుటుంబం పేరు గోబైటిస్‌ అని తప్పుగా పడింది.

g కోర్టు రికార్డుల్లో ఆ కుటుంబం పేరు ఎబ్రలినాగ్‌ అని తప్పుగా పడింది.

దేవుని రాజ్యం పరిపాలిస్తోందని మీరు ఎందుకు నమ్ముతున్నారు?

  • యెహోవా ప్రజలు రాజకీయ వ్యవహారాల్లో ఎందుకు తటస్థంగా ఉంటారు?

  • మనం సాధించిన చట్టపరమైన విజయాలు ఏమి రుజువు చేస్తున్నాయి?

  • దేవుని రాజ్యానికే మద్దతిస్తున్నారని మీరు ఎలా చూపించవచ్చు?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి