13
రాజ్య ప్రచారకులు కోర్టును ఆశ్రయించడం
1, 2. (ఎ) ప్రకటనా పనిని ఆపడానికి మత నాయకులు ఎలా ప్రయత్నించారు? దానికి అపొస్తలులు ఎలా స్పందించారు? (బి) ప్రకటనా పని చేయవద్దని మహాసభ ఇచ్చిన ఆజ్ఞకు అపొస్తలులు ఎందుకు లోబడలేదు?
సా.శ. 33 పెంతెకొస్తు రోజున, యెరూషలేములో క్రైస్తవ సంఘం స్థాపించబడింది. అది స్థాపించబడిన కొన్ని వారాలకే సాతాను కన్ను దానిమీద పడింది. మొగ్గగా ఉన్నప్పుడే దాన్ని తుంచేయాలనుకున్నాడు. వెంటనే, క్రైస్తవ సంఘం చేస్తున్న ప్రకటనా పనిని మత నాయకులు నిషేధించేలా సాతాను పావులు కదిపాడు. కానీ అపొస్తలులు మాత్రం ధైర్యంగా ప్రకటనా పనిని కొనసాగించారు. దాంతో, “చాలామంది స్త్రీపురుషులు ప్రభువు మీద విశ్వాసముంచి శిష్యులయ్యారు.”—అపొ. 4:18, 33; 5:14.
“యేసు పేరు కోసం అవమానించబడే గొప్ప అవకాశం తమకు దక్కిందని” అపొస్తలులు సంతోషించారు
2 అప్పుడు వ్యతిరేకులు కోపంతో, అపొస్తలులందర్నీ చెరసాలలో వేశారు. కానీ ఆ రాత్రి యెహోవా దూత చెరసాల తలుపులు తెరవడంతో, వాళ్లు బయటికొచ్చి తెల్లవారే సరికల్లా ప్రకటనా పనిని మొదలుపెట్టారు! వ్యతిరేకులు వాళ్లను మళ్లీ బంధించి మహాసభ ముందు నిలబెట్టారు. ప్రకటనా పని చేయకూడదనే ఆజ్ఞను అతిక్రమించారని వాళ్లమీద నేరం ఆరోపించారు. కానీ అపొస్తలులు ధైర్యంగా ఇలా అన్నారు: “మేము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే కానీ మనుషులు కాదు.” అప్పుడు అధికారులకు ఎంత కోపం వచ్చిందంటే, వాళ్లు అపొస్తలులను చంపేయాలనుకున్నారు. ఆ క్లిష్ట సమయంలో, ప్రజలందరూ గౌరవించే ధర్మశాస్త్ర బోధకుడైన గమలీయేలు లేచి అధికారులతో ఇలా అన్నాడు: “జాగ్రత్తగా ఉండండి . . . ఈ మనుషుల జోలికి పోకండి, వాళ్ల దారిన వాళ్లను వదిలేయండి.” ఆశ్చర్యకరంగా, అధికారులు ఆయన సలహా మేరకు వాళ్లను వదిలేశారు. మరి, ఆ నమ్మకమైన అపొస్తలులు విడుదలైన తర్వాత ఏమి చేశారు? వాళ్లు “మానకుండా బోధిస్తూ, క్రీస్తు గురించిన అంటే యేసు గురించిన మంచివార్తను ప్రకటిస్తూ ఉన్నారు.”—అపొ. 5:17-21, 27-42; సామె. 21:1, 30.
3, 4. (ఎ) దేవుని ప్రజల మీద దాడి చేయడానికి సాతాను ఎవర్ని ఉపయోగించుకుంటున్నాడు? (బి) ఈ అధ్యాయంలో, తర్వాతి రెండు అధ్యాయాల్లో మనం ఏమి పరిశీలిస్తాం?
3 అధికారులు నిజ క్రైస్తవుల్ని వ్యతిరేకించి, వాళ్లను మహాసభకు అంటే కోర్టుకు తీసుకెళ్లడం అది మొదటిసారి. కానీ అదే చివరిసారి కాదు. (అపొ. 4:5-8; 16:20; 17:6, 7) సాతాను మన కాలంలో కూడా వ్యతిరేకుల్ని ఉసిగొల్పి, అధికారులు మన ప్రకటనా పనిని నిషేధించేలా చేస్తున్నాడు. దేవుని ప్రజలు శాంతిభద్రతలకు భంగం కలిగించేవాళ్లనీ; తిరుగుబాటును పురికొల్పేవాళ్లనీ; పుస్తకాలు అమ్ముకునేవాళ్లనీ వ్యతిరేకులు రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఆ ఆరోపణలు తప్పని నిరూపించడానికి మన సహోదరులు సముచితమైన సమయంలో కోర్టులను ఆశ్రయించారు. దానివల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి? ఎప్పుడో కోర్టులు ఇచ్చిన తీర్పుల నుండి, నేడు మనం ఎలా ప్రయోజనం పొందుతున్నాం? “మంచివార్త తరఫున వాదించడానికి, దాన్ని ప్రకటించేలా చట్టబద్ధమైన హక్కును సంపాదించడానికి” ఆ కోర్టు తీర్పులు సహాయం చేశాయి. దానికి సంబంధించి కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం.—ఫిలి. 1:7.
4 ఈ అధ్యాయంలో, ప్రకటించే హక్కును మనం ఎలా కాపాడుకున్నామో పరిశీలిస్తాం. లోకానికి దూరంగా ఉండడానికి, అలాగే దేవుని ప్రమాణాల ప్రకారం జీవించడానికి మనం చేసిన కొన్ని చట్టపరమైన పోరాటాల గురించి తర్వాతి రెండు అధ్యాయాల్లో చూస్తాం.
శాంతిభద్రతలకు భంగం కలిగించేవాళ్లా లేక దేవుని రాజ్యం గురించి నమ్మకంగా ప్రకటించేవాళ్లా?
5. 1930ల చివర్లో, అమెరికాలో రాజ్య ప్రచారకులు ఎందుకు అరెస్టయ్యారు? అప్పుడు సంస్థలో నాయకత్వం వహిస్తున్న సహోదరులు ఏమి చేశారు?
5 యెహోవాసాక్షులు పరిచర్యలో పాల్గొనాలంటే లైసెన్స్ లేదా పర్మిట్ తెచ్చుకోవాలని, 1930ల చివర్లో అమెరికాలోని నగరాలు, రాష్ట్రాలు ఒత్తిడి చేశాయి. కానీ మన సహోదరులు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఎందుకంటే, లైసెన్స్ తీసుకుంటే ఎవరైనా దాన్ని రద్దుచేసే ప్రమాదం ఉంది. అంతేకాదు, రాజ్య సందేశాన్ని ప్రకటించమని క్రైస్తవులకు ఆజ్ఞాపించింది యేసే కాబట్టి, ఆ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదని సహోదరులు భావించారు. (మార్కు 13:10) ఫలితంగా, వందలమంది ప్రచారకులు అరెస్టయ్యారు. దాంతో, కోర్టుకు వెళ్లడం మంచిదని సంస్థలో నాయకత్వం వహిస్తున్న సహోదరులు భావించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్యాయంగా ఆంక్షలు విధిస్తూ, యెహోవాసాక్షుల మత స్వేచ్ఛకు భంగం కలిగిస్తుందని వాళ్లు కోర్టుకు తెలియజేయాలనుకున్నారు. 1938లో జరిగిన ఒక సంఘటన పరిశీలించండి.
6, 7. కాంట్‌వెల్ కుటుంబానికి ఏమి జరిగింది?
6 60 ఏళ్ల న్యూటన్ కాంట్‌వెల్, ఆయన భార్య ఎస్టర్, వాళ్ల కొడుకులు హెన్రీ, రస్సెల్, జెస్సీ ప్రత్యేక పయినీర్లుగా సేవ చేస్తున్నారు. 1938, ఏప్రిల్ 26 మంగళవారం ఉదయం, వాళ్లందరూ కలిసి కనెక్టికట్‌లోని న్యూ హావెన్ అనే నగరంలో పరిచర్య చేయడానికి బయల్దేరారు. ఆ రోజు పరిచర్య నుండి ఇంటికి తిరిగివస్తామో రామో అని వాళ్లు అనుకున్నారు. ఎందుకంటే, అప్పటికే పోలీసులు వాళ్లను చాలాసార్లు అరెస్టు చేశారు. కాబట్టి ఈసారి కూడా అలా జరిగే అవకాశం ఉందని వాళ్లకు తెలుసు. అయినాసరే వాళ్లు పట్టు విడువకుండా న్యూ హావెన్‌కు బయల్దేరారు. బైబిలు సాహిత్యాన్ని, ఫోనోగ్రాఫ్‌లను పెట్టుకుని కాంట్‌వెల్ ఒక కారు నడుపుతున్నాడు. 22 ఏళ్ల హెన్రీ, సౌండ్ కారు (బైబిలు ప్రసంగాలను వినిపించడానికి స్పీకర్ బిగించివున్న కారు) నడుపుతున్నాడు. వాళ్లు అనుకున్నట్టే జరిగింది. ప్రయాణం మొదలుపెట్టిన కొన్ని గంటలకే పోలీసులు వాళ్లను ఆపారు.
7 పోలీసులు ముందుగా 18 ఏళ్ల రస్సెల్‌ను, ఆ తర్వాత న్యూటన్ కాంట్‌వెల్, ఎస్టర్‌లను అరెస్టు చేశారు. పోలీసులు తన తల్లిదండ్రుల్ని, అన్నయ్యను తీసుకెళ్తుంటే, 16 ఏళ్ల జెస్సీ దూరంగా నిలబడి చూస్తూ ఉండిపోయాడు. హెన్రీ ఆ నగరంలోనే వేరేచోట పరిచర్య చేస్తున్నాడు, కాబట్టి జెస్సీ ఒక్కడే మిగిలిపోయాడు. అయినప్పటికీ, జెస్సీ తన ఫోనోగ్రాఫ్ తీసుకుని పరిచర్య కొనసాగించాడు. జెస్సీ ఇద్దరు కాథలిక్‌లతో మాట్లాడి, సహోదరుడు రూథర్‌ఫర్డ్ ఇచ్చిన “శత్రువులు” అనే ప్రసంగాన్ని వినిపించాడు. అది వింటున్నప్పుడు, వాళ్లకు ఎంత కోపమొచ్చిందంటే వాళ్లు జెస్సీని కొట్టబోయారు. జెస్సీ మాత్రం మౌనంగా అక్కడినుండి వెళ్లిపోయాడు. కానీ కాసేపటికే పోలీసులు అతన్ని ఆపారు. అలా, చివరికి జెస్సీ కూడా అరెస్టయ్యాడు. పోలీసులు సహోదరి ఎస్టర్ మీద ఎలాంటి ఆరోపణలూ చేయలేదుగానీ సహోదరుడు కాంట్‌వెల్ మీద, ఆయన ఇద్దరి కొడుకుల మీద నేరం ఆరోపించారు. అయితే, వాళ్లు అదే రోజు బెయిల్ మీద విడుదలయ్యారు.
8. జెస్సీ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నాడని కోర్టు ఎందుకు తీర్పు ఇచ్చింది?
8 కొన్ని నెలల తర్వాత, 1938 సెప్టెంబరులో కాంట్‌వెల్ కుటుంబాన్ని న్యూ హావెన్‌లోని ట్రయల్ కోర్టులో హాజరుపర్చారు. లైసెన్స్ లేకుండా విరాళాలు సేకరిస్తున్నారనే కారణంతో న్యూటన్ కాంట్‌వెల్‌ను, రస్సెల్‌ను, జెస్సీని కోర్టు దోషులుగా తీర్పు తీర్చింది. తర్వాత, వాళ్లు కనెక్టికట్‌లోని సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకున్నారు. కానీ, పరిచర్యలో జెస్సీ కలిసిన ఇద్దరు కాథలిక్‌లు, రూథర్‌ఫర్డ్ ఇచ్చిన ప్రసంగం తమ మతాన్ని అవమానించేలా, తమను రెచ్చగొట్టేలా ఉందని సాక్ష్యం చెప్పారు. దాంతో జెస్సీ శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్నాడని ఆ కోర్టు తీర్పు ఇచ్చింది. అప్పుడు, సంస్థలో నాయకత్వం వహిస్తున్న సహోదరులు, ఆ దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన అమెరికా సుప్రీం కోర్టులో అప్పీలు చేశారు.
9, 10. (ఎ) కాంట్‌వెల్ కేసుకు సంబంధించి అమెరికా సుప్రీం కోర్టు ఏ తీర్పు ఇచ్చింది? (బి) ఆ తీర్పు వల్ల నేడు మనం ఎలా ప్రయోజనం పొందుతున్నాం?
9 1940, మార్చి 29న సుప్రీం కోర్టు ఆ కేసును విచారించడం మొదలుపెట్టింది. ప్రధాన న్యాయమూర్తి ఛార్లెస్ ఈ. హ్యూస్‌తోపాటు, మరో ఎనిమిది మంది జడ్జీలు ఆ కేసును విచారించారు. యెహోవాసాక్షుల న్యాయవాదియైన హేడెన్ కోవింగ్టన్ అనే సహోదరుడు, కాంట్‌వెల్ కుటుంబం తరఫున వాదించాడు.a కనెక్టికట్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాది, యెహోవాసాక్షులు శాంతిభద్రతలకు భంగం కలిగించేవాళ్లని ఆరోపించాడు. అప్పుడు ఒక జడ్జి, “యేసుక్రీస్తు రోజుల్లో కూడా ఆయన సందేశాన్ని చాలామంది ఇష్టపడలేదు కదా?” అని అడిగాడు. దానికి అతను ఇలా జవాబిచ్చాడు: “అవును. నాకు గుర్తున్నంతవరకు, ఆ సందేశాన్ని ప్రకటించినందుకు యేసుకు ఏమి జరిగిందో కూడా బైబిల్లో ఉంది.” అలా ఆ న్యాయవాది తనకు తెలియకుండానే సాక్షుల్ని యేసుక్రీస్తుతో, రాష్ట్ర ప్రభుత్వాన్ని యేసును వ్యతిరేకించినవాళ్లతో పోల్చాడు! చివరికి 1940, మే 20న సుప్రీం కోర్టు సాక్షులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.
కోర్టులో కేసు గెలిచి బయటికి వస్తున్న హేడెన్ కోవింగ్టన్ (ముందు వరుసలో, మధ్యలో), గ్లెన్ హో (ఎడమ), మరితరులు
10 ఆ తీర్పు ఎందుకు ప్రత్యేకమైనది? ఏ కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ, స్థానిక ప్రభుత్వం గానీ మత స్వేచ్ఛకు భంగం కలిగించకుండా అది రక్షణ కల్పించింది. అంతేకాదు, జెస్సీ ప్రవర్తన “శాంతిభద్రతలకు . . . ఏమాత్రం భంగం కలిగించేదిగా లేదని” కోర్టు గుర్తించింది. అలా, యెహోవాసాక్షులు శాంతిభద్రతలకు భంగం కలిగించేవాళ్లు కాదని స్పష్టమైంది. దేవుని ప్రజలకు అది నిజంగా గొప్ప విజయం! ఆ తీర్పు వల్ల నేడు మనమెలా ప్రయోజనం పొందుతున్నాం? న్యాయవాదిగా పనిచేస్తున్న ఒక యెహోవాసాక్షి ఇలా అంటున్నాడు: “అన్యాయంగా ఆంక్షలు విధించబడతాయనే భయం లేకుండా, మత స్వేచ్ఛతో మనం ఇతరులకు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నాం.”
తిరుగుబాటును పురికొల్పేవాళ్లా లేక సత్యాన్ని చాటిచెప్పేవాళ్లా?
దేవుని పట్ల, క్రీస్తు పట్ల, స్వాతంత్ర్యం పట్ల క్విబెక్‌కున్న రగులుతున్న ద్వేషం మొత్తం కెనడాకే సిగ్గుచేటు (ఇంగ్లీషు)
11. కెనడాలో మన సహోదరులు ఏ ప్రచార కార్యక్రమం మొదలుపెట్టారు? ఎందుకు?
11 1940లలో కెనడాలోని యెహోవాసాక్షులు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. 1946లో, దేవుని పట్ల, క్రీస్తు పట్ల, స్వాతంత్ర్యం పట్ల క్విబెక్‌కున్న రగులుతున్న ద్వేషం మొత్తం కెనడాకే సిగ్గుచేటు (ఇంగ్లీషు) అనే కరపత్రాన్ని మన సహోదరులు 16 రోజులపాటు పంచిపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం తమ ఆరాధనా స్వేచ్ఛకు ఎలా భంగం కలిగించిందో ప్రజలందరికీ తెలియజేయడం కోసం, సహోదరులు ఆ ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. మతనాయకుల వ్యతిరేకతను, పోలీసుల దౌర్జన్యాన్ని, అల్లరిమూక దాడుల్ని ఆ నాలుగు పేజీల కరపత్రం స్పష్టంగా వివరించింది. అందులో ఇలా ఉంది: “యెహోవాసాక్షుల్ని అన్యాయంగా అరెస్టు చేస్తున్నారు. అంతేకాదు గ్రేటర్ మాంట్రియల్‌లో సాక్షులపై దాదాపు 800 కేసులు పెట్టారు.”
12. (ఎ) వ్యతిరేకులు ఆ ప్రచార కార్యక్రమానికి ఎలా స్పందించారు? (బి) మన సహోదరుల మీద ఎలాంటి నేరారోపణ చేశారు? (అధస్సూచి కూడా చూడండి.)
12 క్విబెక్ ప్రధాన మంత్రి మోరీస్ డూప్లెసీ, రోమన్ కాథలిక్ చర్చి ఫాదర్ అయిన విలెన్యూతో చేతులు కలిపి యెహోవాసాక్షులపై “నిర్దయ యుద్ధం” ప్రకటించాడు. దాంతో, యెహోవాసాక్షులపై ఉన్న 800 కేసులు ఒక్కసారిగా 1,600కు చేరుకున్నాయి. పయినీరు సేవ చేస్తున్న ఒక సహోదరి ఇలా చెప్పింది: “పోలీసులు మమ్మల్ని ఎన్నిసార్లు అరెస్టు చేశారో లెక్కే లేదు.” కరపత్రం అందిస్తున్న సాక్షుల్ని, “తిరుగుబాటును పురికొల్పుతున్నారనే” నేరం మీద అరెస్టు చేశారు.b
13. తిరుగుబాటును పురికొల్పుతున్నారనే నేరం మీద మొదటిసారి కోర్టుకు వెళ్లింది ఎవరు? ట్రయల్ కోర్టు ఏమని తీర్పు ఇచ్చింది?
13 1947లో, తిరుగుబాటును పురికొల్పుతున్నారనే నేరం మీద సహోదరుడు ఈమా బ్యూషాను, అతని కూతుళ్లు 18 ఏళ్ల జీజెల్‌ను, 11 ఏళ్ల ల్యూసెల్‌ను కోర్టులో హాజరుపర్చారు. ఆ నేరం మీద మొదటిసారిగా కోర్టు మెట్లెక్కింది వాళ్లే. క్విబెక్‌కు దక్షిణాన ఉన్న కొండల్లో, తమ పొలం దగ్గర క్విబెక్‌కున్న రగులుతున్న ద్వేషం (ఇంగ్లీషు) అనే కరపత్రాన్ని పంచిపెట్టినందుకు వాళ్లను అరెస్టు చేశారు. సహోదరుడు బ్యూషా చాలా నెమ్మదస్థుడు. తనకున్న చిన్న పొలంలో పని చేసుకోవడం, అప్పుడప్పుడు గుర్రపుబండి మీద టౌనుకు వెళ్లిరావడం, ఇదే అతని ప్రపంచం. కానీ అతను, అతని కుటుంబ సభ్యులు ఆ కరపత్రంలో ప్రస్తావించబడిన ఎన్నో రకాల హింసల్ని అనుభవించాల్సి వచ్చింది. వాళ్ల కేసును విచారిస్తున్న ట్రయల్ కోర్టు జడ్జికి యెహోవాసాక్షులంటే ఇష్టం ఉండదు. అందుకే, బ్యూషా నిర్దోషని చెప్పడానికి సాక్ష్యాధారం ఉన్నా జడ్జి దాన్ని పట్టించుకోలేదు. ఆ కరపత్రంలోని సమాచారం తిరుగుబాటును పురికొల్పుతుంది కాబట్టి, బ్యూషాని దోషిగా పరిగణించాలని న్యాయవాది వాదించాడు. జడ్జి కూడా అతనితో ఏకీభవించి బ్యూషాను, జీజెల్‌ను దోషులుగా నిర్ధారించాడు. చిన్నపిల్ల అని కూడా చూడకుండా ల్యూసెల్‌ను రెండు రోజులపాటు జైల్లో ఉంచారు. అప్పుడు, మన సహోదరులు ఆ దేశంలోని అత్యున్నత న్యాయస్థానమైన కెనడా సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకున్నారు. ఆ కోర్టు బ్యూషా కేసును పరిశీలించడానికి ఒప్పుకుంది.
14. హింస చెలరేగుతున్న సమయంలో క్విబెక్‌లోని సహోదరులు ఏమి చేశారు?
14 మరోవైపు, క్విబెక్‌లోని సహోదరసహోదరీలు తీవ్రమైన హింస చెలరేగుతున్నా ధైర్యంగా ప్రకటనా పనిని కొనసాగించారు. 1946లో ప్రచార కార్యక్రమం మొదలైనప్పటినుండి తర్వాతి నాలుగు సంవత్సరాల్లో, క్విబెక్‌లోని సాక్షుల సంఖ్య 300 నుండి 1,000కి చేరుకుంది!c
15, 16.(ఎ) బ్యూషా కేసులో కెనడా సుప్రీం కోర్టు ఏమని తీర్పు ఇచ్చింది? (బి) ఆ తీర్పు వల్ల మన సహోదరులు, ఇతర పౌరులు ఎలా ప్రయోజనం పొందారు?
15 1950 జూన్‌లో, కెనడా సుప్రీం కోర్టులోని మొత్తం తొమ్మిదిమంది జడ్జీలు ఈమా బ్యూషా కేసును విచారించారు. ఆరు నెలల తర్వాత, 1950 డిసెంబరు 18న కోర్టు మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. యెహోవాసాక్షుల న్యాయవాదియైన గ్లెన్ హో అనే సహోదరుడు, బ్యూషా తరఫున వాదించాడు. ‘తిరుగుబాటును పురికొల్పడం అంటే హింసను రేపడం లేదా ప్రభుత్వానికి ఎదురు తిరిగేలా రెచ్చగొట్టడం. కానీ ఈ కరపత్రంలో అలాంటి రెచ్చగొట్టే మాటలేవీ లేవు కాబట్టి దానిలో ఉన్న సమాచారం, చట్టం కల్పించిన వాక్ స్వాతంత్ర్యం కిందకే వస్తుంది’ అని సహోదరుడు గ్లెన్ హో వాదించాడు. కోర్టు ఆయన వాదనను అంగీకరించింది. దాని గురించి ఆయన ఇలా అన్నాడు: “యెహోవా మమ్మల్ని ఎలా గెలిపించాడో నేను కళ్లారా చూశాను.”d
16 సుప్రీం కోర్టు ఇచ్చిన ఆ తీర్పు వల్ల, క్విబెక్‌లో తిరుగుబాటును పురికొల్పుతున్నారని ఆరోపిస్తూ యెహోవాసాక్షుల మీద భనాయించిన 122 కేసులకు ఆధారం లేకుండా పోయింది. అంతేకాదు కెనడా పౌరులకు, ఇతర కామన్వెల్త్ దేశాల పౌరులకు మరో స్వేచ్ఛ లభించింది. అదేంటంటే, ప్రభుత్వం తమతో వ్యవహరించే తీరులో ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్లు ధైర్యంగా చెప్పుకోవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా, క్విబెక్‌లోని చర్చి-ప్రభుత్వం కలిసి సాక్షుల మీద చేస్తున్న ఆగడాలకు ఆ తీర్పు అడ్డుకట్ట వేసింది.e
పుస్తకాలు అమ్ముకునేవాళ్లా లేక దేవుని రాజ్యం గురించి ఉత్సాహంగా ప్రకటించేవాళ్లా?
17. మన ప్రకటనా పనిని కట్టుదిట్టం చేయడానికి కొన్ని ప్రభుత్వాలు ఎలా ప్రయత్నించాయి?
17 తొలి క్రైస్తవులు, అలాగే నేడున్న యెహోవా సేవకులు ‘దేవుని వాక్యాన్ని అమ్ముకుంటూ తిరిగేవాళ్లు’ కాదు. (2 కొరింథీయులు 2:17 చదవండి.) అయినప్పటికీ, కొన్ని ప్రభుత్వాలు వాణిజ్యపరమైన చట్టాలతో మన పనిని కట్టుదిట్టం చేయడానికి ప్రయత్నించాయి. యెహోవాసాక్షులు దేవుని వాక్యాన్ని అమ్ముకుంటూ తిరిగేవాళ్లా లేక దేవుని వాక్య పరిచారకులా అనే విషయాన్ని తేల్చి చెప్పిన రెండు కోర్టు తీర్పులను ఇప్పుడు పరిశీలిద్దాం.
18, 19. డెన్మార్క్‌లోని అధికారులు ప్రకటనా పనికి ఎలా ఆటంకం కలిగించారు?
18 డెన్మార్క్. 1932 అక్టోబరు 1న, లైసెన్స్ లేకుండా ముద్రిత సమాచారాన్ని అమ్మకూడదనే ఒక చట్టం అమల్లోకి వచ్చింది. కానీ మన సహోదరులు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోలేదు. ఆ తర్వాతి రోజు, డెన్మార్క్ రాజధాని అయిన కోపెన్‌హాగన్‌కు పశ్చిమాన దాదాపు 30 కి.మీ దూరంలో ఉన్న రస్కిల అనే గ్రామంలో ప్రకటించడానికి ఐదుగురు ప్రచారకులు వెళ్లారు. కానీ నలుగురు మాత్రమే తిరిగొచ్చారు. వాళ్లలో ఒకరైన ఆగస్ట్ లేమాన్ అనే ప్రచారకుణ్ణి, లైసెన్స్ లేకుండా పుస్తకాలు అమ్ముతున్నాడనే నేరం మీద అరెస్టు చేశారు.
19 1932, డిసెంబరు 19న సహోదరుడు ఆగస్ట్ లేమాన్‌ని కోర్టులో హాజరుపర్చారు. తాను ప్రజలకు బైబిలు సాహిత్యాన్ని అందించడానికే వెళ్లానని, వాటితో వ్యాపారం చేయట్లేదని అతను చెప్పాడు. ట్రయల్ కోర్టు అతని వాదనను అంగీకరిస్తూ, ఇలా చెప్పింది: “ప్రతివాది . . . తనను తాను పోషించుకునే స్థితిలో ఉన్నాడు. ఈ పని చేస్తున్నందుకు అతను ఆర్థికంగా లాభం పొందట్లేదు, అలా పొందాలనే ఉద్దేశం కూడా అతనికి లేదు. నిజానికి, అతను తన సొంత డబ్బునే ఖర్చుపెట్టి ఈ పని చేస్తున్నాడు.” కాబట్టి అతను చేస్తున్నది “వ్యాపారం” కాదని నిర్ధారిస్తూ, కోర్టు యెహోవాసాక్షులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కానీ, శత్రువులు మాత్రం డెన్మార్క్ అంతటా ప్రకటనా పనిని ఆపాలని నిశ్చయించుకున్నారు. (కీర్త. 94:20) అందుకే, సాక్షులకు వ్యతిరేకంగా వాదిస్తున్న న్యాయవాది ఏకంగా ఆ దేశ సుప్రీం కోర్టులో అప్పీలు చేశాడు. మరి అప్పుడు సహోదరులు ఏమి చేశారు?
20. డెన్మార్క్ సుప్రీం కోర్టు ఏమని తీర్పు ఇచ్చింది? దానికి సహోదరులు ఎలా స్పందించారు?
20 సుప్రీం కోర్టు ఆ కేసును విచారించడానికి ఇంకా వారం రోజులు ఉందనగా, డెన్మార్క్‌లోని సాక్షులు తమ ప్రకటనా పనిని ముమ్మరం చేశారు. 1933, అక్టోబరు 3 మంగళవారం రోజున సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. ఆగస్ట్ లేమాన్ చట్టవిరుద్ధంగా ప్రవర్తించలేదని కింది కోర్టు ఇచ్చిన తీర్పుతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. సాక్షులు తమ ప్రకటనా పనిని స్వేచ్ఛగా కొనసాగించుకోవచ్చని అది చెప్పింది. దాంతో సహోదరులు, తమకు విజయం అనుగ్రహించిన యెహోవా పట్ల కృతజ్ఞత చూపిస్తూ, ప్రకటనా పనిని ఇంకా ఎక్కువగా చేశారు. తీర్పు వెలువడిన ఆ రోజు నుండి ఈ రోజు వరకు, డెన్మార్క్‌లోని యెహోవాసాక్షుల కార్యకలాపాలకు ప్రభుత్వం ఎప్పుడూ అడ్డురాలేదు.
1930లలో డెన్మార్క్‌లో ధైర్యంగా ప్రకటిస్తున్న సాక్షులు
21, 22. మర్డేక్ కేసులో అమెరికా సుప్రీం కోర్టు ఏ ముగింపుకు వచ్చింది?
21 అమెరికా. 1940, ఫిబ్రవరి 25 ఆదివారం రోజున పెన్సిల్వేనియాలో పిట్స్‌బర్గ్‌కు దగ్గర్లో ఉన్న జనట్ అనే నగరంలో, రాబర్ట్ మర్డేక్ అనే పయినీరు, మరో ఏడుగురు సాక్షులు పరిచర్య చేస్తున్నారు. లైసెన్స్ లేకుండా సాహిత్యాన్ని అందిస్తున్నారనే నేరం మీద వాళ్లు అరెస్టయ్యారు. దాంతో వాళ్లు అమెరికా సుప్రీం కోర్టుకు అప్పీలు చేసుకున్నారు. సంతోషకరంగా, కోర్టు వాళ్ల కేసును విచారించడానికి ఒప్పుకుంది.
22 1943, మే 3న సుప్రీం కోర్టు యెహోవాసాక్షులకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. లైసెన్స్ తీసుకోమని ఒత్తిడి చేయడం “రాజ్యాంగం కల్పించిన హక్కుకు” భంగం కలిగించడమేనని కోర్టు తేల్చి చెప్పింది. అంతేకాదు, కింది కోర్టు ఇచ్చిన తీర్పు “మత స్వేచ్ఛకు, ముద్రణా స్వేచ్ఛకు” భంగం కలిగించేదిగా ఉందని భావించి, సుప్రీం కోర్టు దాన్ని కొట్టిపారేసింది. దాని గురించి జస్టిస్ విలియమ్ ఓ. డగ్లస్ ఇలా చెప్పాడు: “[యెహోవాసాక్షులు] ప్రకటించడం, మతపరమైన పుస్తకాలు అందించడం కన్నా ఎక్కువే చేస్తున్నారు. చర్చీల్లో ఆరాధించడానికి, వేదిక మీద నుండి ప్రకటించడానికి ఎంత స్వేచ్ఛ ఇవ్వబడిందో . . . ఈ పనికి కూడా అంతే స్వేచ్ఛ ఇవ్వాలి.” సుప్రీం కోర్టులోని అధికశాతం మంది జడ్జీలు అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
23. 1943లో సాధించిన విజయాల వల్ల నేడు మనం ఎలా ప్రయోజనం పొందుతున్నాం?
23 సుప్రీం కోర్టు ఇచ్చిన ఆ తీర్పుతో, దేవుని ప్రజలు గొప్ప విజయం సాధించారు. యెహోవాసాక్షులు పుస్తకాలు అమ్ముకుంటూ తిరిగేవాళ్లు కాదు గానీ, క్రైస్తవ పరిచారకులని అది తేల్చి చెప్పింది. ఆ రోజు సుప్రీం కోర్టులో వాదించిన 13 కేసుల్లో, మర్డేక్ కేసుతో సహా 12 కేసులు గెలిచాం. ఈ మధ్యకాలంలో కూడా ఇంటింటా, బహిరంగంగా ప్రకటించే మన హక్కుకు భంగం కలిగిస్తూ వ్యతిరేకులు మనమీద కేసులు పెడుతున్నారు. కానీ ఆ రోజు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పులు, నేడు వ్యతిరేకులు మన మీద పెడుతున్న కేసుల్ని వాదించడంలో మనకు ఉపయోగపడుతున్నాయి.
“మేము లోబడాల్సిన పరిపాలకుడు దేవుడే కానీ మనుషులు కాదు”
24. ప్రభుత్వం మన ప్రకటనా పనిని నిషేధిస్తే మనం ఏమి చేస్తాం?
24 రాజ్య సందేశాన్ని స్వేచ్ఛగా ప్రకటించే హక్కును ప్రభుత్వం మనకు కల్పించినప్పుడు చాలా సంతోషిస్తాం. కానీ అదే ప్రభుత్వం మన ప్రకటనా పనిని నిషేధిస్తే, వేరే పద్ధతుల్లో ఆ పనిని కొనసాగిస్తాం. ఎందుకంటే, అపొస్తలులు చెప్పినట్లు మనం ‘దేవునికే లోబడాలి కానీ మనుషులకు కాదు.’ (అపొ. 5:29; మత్త. 28:19, 20) అలాగే, ప్రభుత్వం మన కార్యకలాపాలను నిషేధించినప్పుడు కోర్టులను ఆశ్రయిస్తాం. దీనికి సంబంధించి రెండు ఉదాహరణలు పరిశీలించండి.
25, 26. నికరాగ్వాలో జరిగిన ఏ సంఘటనల వల్ల మనం సుప్రీం కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది? దాని ఫలితం ఏమిటి?
25 నికరాగ్వా. డోనవన్ మన్‌స్టర్‌మాన్ అనే సహోదరుడు నికరాగ్వాలో మిషనరీగా, బ్రాంచి సేవకునిగా సేవ చేస్తున్నాడు. 1952 నవంబరు 19న, అతన్ని నికరాగ్వా రాజధాని అయిన మనాగ్వాలోని ఇమిగ్రేషన్ కార్యాలయానికి పిలిపించారు. సహోదరుడు, ఆ కార్యాలయానికి అధికారియైన కెప్టెన్ ఆర్నాల్డో గార్సియాను కలిశాడు. అప్పుడు ఆ కెప్టెన్, “యెహోవాసాక్షులు తమ సిద్ధాంతాలను ప్రకటించకూడదు, తమ మత కార్యకలాపాలను కొనసాగించకూడదు” అని మన సహోదరునికి చెప్పాడు. “ఎందుకు?” అని సహోదరుడు అడిగాడు. పరిచర్య చేయడానికి సాక్షులు ప్రభుత్వం నుండి అనుమతి తెచ్చుకోలేదనీ, వాళ్లు కమ్యూనిస్టులనీ కెప్టెన్ వివరించాడు. దీనంతటికీ ప్రధాన సూత్రధారులు ఎవరు? రోమన్ కాథలిక్ మత నాయకులే.
నికరాగ్వాలో నిషేధం ఉన్న సమయంలో సమావేశం జరుపుకుంటున్న సహోదరులు
26 వెంటనే సహోదరుడు మన్‌స్టర్‌మాన్, ప్రభుత్వానికి అలాగే ఆ దేశ ప్రెసిడెంట్ అయిన ఆనాస్టాస్యో సోమోజా గార్సియాకు అప్పీలు చేసుకున్నాడు. కానీ ఏమి ఉపయోగం లేకపోయింది. దాంతో సహోదరులు తమ పద్ధతుల్ని మార్చుకున్నారు. వాళ్లు రాజ్యమందిరాన్ని మూసేసి, చిన్నచిన్న గుంపులుగా కూటాలు జరుపుకున్నారు. వీధి సాక్ష్యాన్ని ఆపేసి మరో పద్ధతిలో రాజ్య సందేశాన్ని ప్రకటించారు. అదే సమయంలో, ఆ నిషేధాన్ని ఎత్తివేయమని కోరుతూ నికరాగ్వా సుప్రీం కోర్టుకు అర్జీ పెట్టుకున్నారు. ఆ నిషేధం గురించి, సాక్షులు పెట్టుకున్న అర్జీ గురించి వార్తాపత్రికలు విస్తృతంగా ప్రచారం చేయడం మొదలుపెట్టాయి. సుప్రీం కోర్టు మన కేసును విచారించడానికి అంగీకరించింది. చివరికి 1953, జూన్ 19న సుప్రీం కోర్టు ఏకగ్రీవంగా సాక్షుల పక్షాన తీర్పు ఇచ్చింది. భావప్రకటన, మనస్సాక్షి ప్రకారం నడుచుకోవడం, నమ్మకాలను తెలియజేయడం వంటివాటికి సంబంధించి రాజ్యాంగం కల్పించిన హక్కులకు ఆ నిషేధం భంగం కలిగిస్తుందని కోర్టు తెలియజేసింది. అంతేకాదు నికరాగ్వాలోని సాక్షులకు, ప్రభుత్వానికి మధ్య సత్సంబంధాలు తిరిగి నెలకొల్పాలని కోర్టు ఆదేశించింది.
27. నికరాగ్వా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు ప్రజలు ఎందుకు ఆశ్చర్యపోయారు? సహోదరులు ఏమి గుర్తించారు?
27 సుప్రీం కోర్టు సాక్షులకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం చూసి నికరాగ్వాలోని ప్రజలు చాలా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే, అప్పటివరకు కోర్టు మత నాయకుల జోలికి గానీ, ప్రభుత్వ అధికారుల జోలికి గానీ వెళ్లేది కాదు. పైగా వాళ్లకు వ్యతిరేకంగా తీర్పు చెప్పడానికి కూడా భయపడేది. కానీ ఇప్పుడు కోర్టు వాళ్లందర్నీ పక్కనపెట్టేసి సాక్షులకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందంటే, అది కేవలం రాజైన యేసుక్రీస్తు సహాయం వల్లే సాధ్యమైంది. సహోదరులు ఆ విషయాన్ని గుర్తించి, సంతోషంగా ప్రకటనా పనిని కొనసాగించారు.—అపొ. 1:8.
28, 29. 1980లలో, జైరేలో పరిస్థితులు ఉన్నట్టుండి ఎలా మలుపు తిరిగాయి?
28 జైరే. ప్రస్తుతం డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అని పిలువబడుతున్న జైరేలో, 1980లలో దాదాపు 35,000 మంది సాక్షులు ఉండేవాళ్లు. విస్తృతంగా జరుగుతున్న రాజ్య పనుల కోసం బ్రాంచి కార్యాలయం కొత్త భవనాలను నిర్మించడం మొదలుపెట్టింది. 1985 డిసెంబరులో, జైరే రాజధానియైన కిన్షాసాలో ఒక అంతర్జాతీయ సమావేశం కూడా జరిగింది. ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన 32,000 మంది సహోదరసహోదరీలతో ఆ నగరంలోని స్టేడియం కిక్కిరిసిపోయింది. కానీ, ఆ తర్వాత పరిస్థితులు ఎలా ఊహించని మలుపు తిరిగాయో గమనించండి.
29 కెనడాలోని క్విబెక్‌కు చెందిన మార్సెల్ ఫిల్టో అనే సహోదరుడు ఆ సమయంలో జైరేలో మిషనరీగా సేవ చేస్తున్నాడు. అతను అప్పటికే క్విబెక్‌లో డూప్లెసీ హయాంలో జరిగిన హింసను అనుభవించాడు. అయితే, జైరేలో ఏమి జరిగిందో తెలియజేస్తూ ఆయన ఇలా అన్నాడు: “1986, మార్చి 12న బాధ్యతగల సహోదరులకు ఒక ఉత్తరం అందింది. జైరేలోని యెహోవాసాక్షుల సంస్థను నిషేధిస్తున్నట్లు అందులో ఉంది.” ఆ నిషేధాన్ని ఆమోదిస్తూ, జైరే ప్రెసిడెంట్ మోబూటూ సీసీ సీకో సంతకం చేశాడు.
30. బ్రాంచి కమిటీ ఏ ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? మరి వాళ్లు ఏమి చేయాలని నిర్ణయించుకున్నారు?
30 తర్వాతి రోజు, దేశవ్యాప్తంగా రేడియోలో ఈ ప్రకటన వచ్చింది: “[జైరేలో] ఇక యెహోవాసాక్షులనే పేరు వినబడదు.” వెంటనే సాక్షులపై హింస చెలరేగింది. రాజ్యమందిరాలను ధ్వంసం చేశారు, సహోదరుల్ని దోచుకున్నారు, అరెస్టు చేశారు, బంధించారు, కొట్టారు. సాక్షుల పిల్లల్ని సైతం జైల్లో వేశారు. 1988, అక్టోబరు 12న ప్రభుత్వం మన సంస్థ ఆస్తుల్ని జప్తు చేసుకుంది, అలాగే సివిల్ గార్డు సైనిక దళం మన బ్రాంచి భవనాన్ని ఆక్రమించింది. అప్పుడు బాధ్యతగల సహోదరులు ప్రెసిడెంట్ మోబూటూకు అప్పీలు చేసుకున్నారు. కానీ ఆయన నుండి ఏ జవాబూ రాలేదు. దాంతో, “సుప్రీం కోర్టుకు వెళ్లడం మంచిదా లేక వేచి చూడడం మంచిదా?” అని బ్రాంచి కమిటీ సందిగ్ధంలో పడింది. ఆ సమయంలో మిషనరీగా, బ్రాంచి కమిటీ సమన్వయకర్తగా సేవ చేస్తున్న తిమోతి హోమ్స్ అనే సహోదరుడు ఇలా గుర్తు చేసుకుంటున్నాడు: “తెలివి కోసం, నిర్దేశం కోసం మేము యెహోవా వైపు చూశాం.” ప్రార్థనాపూర్వకంగా ఆలోచించిన తర్వాత, బ్రాంచి కమిటీ ఒక నిర్ణయానికి వచ్చింది. చట్టపరంగా ముందుకెళ్లడం ఈ సమయంలో మంచిది కాదని భావించి, సహోదరుల్ని కాపాడడంపై, ప్రకటనా పనిని కొనసాగించడంపై దృష్టిపెట్టింది.
“యెహోవాయే పరిస్థితుల్ని చక్కదిద్దాడని మాకు అనిపించింది”
31, 32. జైరే సుప్రీం కోర్టు ఏ తీర్పు ఇచ్చింది? అది మన సహోదరులపై ఎలాంటి ప్రభావం చూపించింది?
31 చాలా సంవత్సరాలు గడిచాయి. సాక్షుల మీద జరుగుతున్న దాడులు తగ్గుముఖం పట్టాయి. ఆ దేశం మానవ హక్కులకు ప్రాముఖ్యత ఇవ్వడం మొదలుపెట్టింది. దాంతో, జైరేలోని సుప్రీం కోర్టుకు అప్పీలు చేయడానికి ఇదే సరైన సమయమని బ్రాంచి కమిటీ నిర్ణయించింది. సంతోషకరంగా, సుప్రీం కోర్టు మన కేసును విచారించడానికి ఒప్పుకుంది. 1993 జనవరి 8న, అంటే సాక్షులపై నిషేధం విధించబడిన దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది. సాక్షుల మీద ప్రభుత్వం తీసుకున్న చర్య చట్టవిరుద్ధమని తెలియజేస్తూ కోర్టు ఆ నిషేధాన్ని ఎత్తివేసింది. ఒక్కసారి ఆలోచించండి! ఆ దేశ ప్రెసిడెంట్‌కు వ్యతిరేకంగా తీర్పు చెప్పడం జడ్జీలకు కత్తిమీద సాములాంటిదే. అయినప్పటికీ వాళ్లు ఆయనకు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు! దాని గురించి సహోదరుడు హోమ్స్ ఇలా అన్నాడు: “యెహోవాయే పరిస్థితుల్ని చక్కదిద్దాడని మాకు అనిపించింది.” (దాని. 2:21) ఆ విజయం చూసి మన సహోదరుల విశ్వాసం ఎంతో బలపడింది. అంతేకాదు, తన ప్రజలు సరైన సమయంలో, సరైన చర్య తీసుకునేలా రాజైన యేసే తమను నిర్దేశించాడని సహోదరులకు నమ్మకం కుదిరింది.
డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో, స్వేచ్ఛగా యెహోవాను ఆరాధించగలుగుతున్నందుకు సంతోషిస్తున్న సాక్షులు
32 నిషేధాన్ని ఎత్తి వేయడంతో, జైరేలో సేవ చేయడానికి మిషనరీలకు అనుమతి లభించింది, అలాగే కొత్త బ్రాంచి భవనాలు నిర్మించబడ్డాయి, వేరే దేశాల నుండి బైబిలు సాహిత్యాన్ని పొందే అవకాశం కూడా దొరికింది.f యెహోవా తన ప్రజల్ని ఎలా ఆధ్యాత్మికంగా సంరక్షిస్తాడో చూసినప్పుడు, మనకు ఎంత సంతోషంగా ఉంటుందో కదా!—యెష. 52:10.
“నాకు సహాయం చేసేది యెహోవాయే”
33. మనం గెలిచిన కోర్టు కేసులు ఏ విషయాన్ని రుజువు చేశాయి?
33 యేసు ఇలా మాటిచ్చాడు: “మీ వ్యతిరేకులందరు కలిసినా ఎదిరించలేని, తిప్పికొట్టలేని జ్ఞానాన్ని, మాటల్ని నేను మీకు ఇస్తాను.” ఆయన ఆ మాట నిలబెట్టుకున్నాడని, ఇప్పటివరకు చూసిన కోర్టు కేసులు రుజువు చేశాయి. (లూకా 21:12-15 చదవండి.) కొన్నిసార్లు, యెహోవా ఆధునిక కాల గమలీయేలులను ఉపయోగించుకుని తన ప్రజల్ని కాపాడాడు. మరికొన్నిసార్లు ధైర్యంగల జడ్జీలను, లాయర్లను ఉపయోగించి మనకు న్యాయం జరిగేలా చూశాడు. అవును, యెహోవా మన వ్యతిరేకుల ఆయుధాలను విరిచేశాడు. (యెషయా 54:17 చదవండి.) అంతేకాదు, తన పనిని ఎవ్వరూ అడ్డుకోలేరని రుజువు చేశాడు.
34. మనం సాధించిన విజయాలు ఎందుకు ప్రత్యేకమైనవి? అవి ఏమి నిరూపిస్తున్నాయి? (“అత్యున్నత న్యాయస్థానాల్లో మనం సాధించిన విజయాలు” అనే బాక్సు కూడా చూడండి.)
34 మనం సాధించిన చట్టపరమైన విజయాలు ఎందుకంత ప్రత్యేకమైనవి? యెహోవాసాక్షులమైన మనం పలుకుబడి ఉన్నవాళ్లమో, ప్రముఖ వ్యక్తులమో కాదు. పైగా మనం ఓటు వేయం, రాజకీయ ప్రచారాలకు మద్దతివ్వం, లేదా రాజకీయ నాయకులకు వంతపాడం. అంతేకాదు, కోర్టు మెట్లెక్కిన మనలో చాలామంది, ప్రజల దృష్టిలో ‘చదువులేని సామాన్యులే.’ (అపొ. 4:13) నిజానికి పలుకుబడి, అధికారం ఉన్న రాజకీయ నాయకులకు, మత నాయకులకు ఎదురునిలబడి మనల్ని రక్షిస్తే, కోర్టులకు వచ్చే లాభం ఏమీ లేదు. అయినా సరే, కోర్టులు పదేపదే మనకు అనుకూలంగా తీర్పు ఇచ్చాయి! మనం ‘దేవుడు పంపించిన వ్యక్తులమని, క్రీస్తు శిష్యులమని’ అవి రుజువు చేశాయి. (2 కొరిం. 2:17) కాబట్టి అపొస్తలుడైన పౌలులాగే మనం కూడా ఇలా అంటాం: “నాకు సహాయం చేసేది యెహోవాయే; నేను భయపడను.”—హెబ్రీ. 13:6.
a సహోదరుడు హేడెన్ కోవింగ్టన్, యెహోవాసాక్షుల తరఫున సుప్రీం కోర్టులో 43 కేసులు వాదించాడు. అందులో మొదటిది కాంట్‌వెల్ కుటుంబానికి సంబంధించిన కేసు. సహోదరుడు కోవింగ్టన్ 1978లో చనిపోయాడు. ఆయన భార్య డొరొతి యెహోవాను నమ్మకంగా సేవించి, 2015లో అంటే 92 ఏళ్ల వయసులో చనిపోయింది.
b 1606లో వచ్చిన ఒక కొత్త చట్టం ఆధారంగా వాళ్లను అరెస్టు చేశారు. ఆ చట్టం ప్రకారం, ఒక వ్యక్తి చెప్పేవి వాస్తవాలే అయినా, అవి తిరుగుబాటును రేపే విధంగా ఉన్నాయని న్యాయస్థానం భావిస్తే, అతన్ని దోషిగా తీర్పు తీర్చవచ్చు.
c 1950లో క్విబెక్‌లో 164 మంది పూర్తికాల సేవకులు ఉన్నారు. వాళ్లలో 63 మంది గిలియడ్ పట్టభద్రులు. క్విబెక్‌లో తీవ్రమైన వ్యతిరేకత ఉందని తెలిసినా వాళ్లు ఇష్టపూర్వకంగా అక్కడ సేవ చేయడానికి ఒప్పుకున్నారు.
d సహోదరుడు డబ్ల్యూ. గ్లెన్ హో ధైర్యం, ప్రావీణ్యం గల న్యాయవాది. ఆయన 1943 నుండి 2003 వరకు కెనడాలో, ఇతర దేశాల్లో యెహోవాసాక్షుల తరఫున వందల కేసులు వాదించాడు.
e ఈ కేసు గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తేజరిల్లు! (ఇంగ్లీషు) ఏప్రిల్ 22, 2000 సంచికలో 18-24 పేజీల్లో ఉన్న “ఈ యుద్ధం మీది కాదు దేవునిదే” అనే ఆర్టికల్ చూడండి.
f కొంతకాలానికి, సివిల్ గార్డు సైనికులు మన బ్రాంచి భవనాన్ని ఖాళీ చేసి వెళ్లిపోయారు; అయితే మరో స్థలంలో కొత్త బ్రాంచి భవనాలు నిర్మించబడ్డాయి.