కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • jd అధ్యా. 11 పేజీలు 139-151
  • ప్రజలు జీవం పొందాలని యెహోవా కోరుకుంటున్నాడు—మరి మీరు?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రజలు జీవం పొందాలని యెహోవా కోరుకుంటున్నాడు—మరి మీరు?
  • యెహోవా మహాదినాన్ని మనసులో ఉంచుకొని జీవించండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ప్రజల ప్రాణాల్ని కాపాడేందుకు న్యాయం, కనికరం
  • ప్రజలు జీవం పొందేందుకు సహాయం చేయండి
  • యెహోవా దగ్గరికి తిరిగి వచ్చేవాళ్లు జీవం పొందుతారు
  • “తండ్రిలేనివారి యెడల వాత్సల్యము”
  • ‘మీ తండ్రి కనికరముగలవాడు’
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • యెహోవాకు నచ్చినట్టు ఆరాధిస్తూ ఆయనను వెదకండి
    యెహోవా మహాదినాన్ని మనసులో ఉంచుకొని జీవించండి
  • మనం ఆరాధించే దేవుడు “అత్యంత కరుణామయుడు”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2021
  • దేవునితో నడవండి, మంచిని పంటగా కోయండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
మరిన్ని
యెహోవా మహాదినాన్ని మనసులో ఉంచుకొని జీవించండి
jd అధ్యా. 11 పేజీలు 139-151

11వ అధ్యాయం

ప్రజలు జీవం పొందాలని యెహోవా కోరుకుంటున్నాడు—మరి మీరు?

1, 2. (ఎ) నీనెవె విషయంలో యెహోవా తీసుకున్న నిర్ణయానికి యోనా స్పందించిన తీరు నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? (బి) దేవుని కనికరం గురించి, జీవం విషయంలో ఆయనకున్న అభిప్రాయం గురించి మనం ఎందుకు పరిశీలించాలి?

యెహోవా సంతోషంగా ఉన్నాడు. కానీ యోనా ముఖం మాడ్చుకున్నాడు. దేవుడు కనికరం చూపించి కొన్ని వేలమందిని నాశనం చేయకుండా వదిలేశాడు. అదే యోనా అయితే వాళ్లను నాశనం కానిచ్చివుండేవాడు! యెహోవా తన ప్రజల శత్రువులను క్షమించి, వాళ్లను కాపాడాడు.

143వ పేజీలోని చిత్రం

యెహోవా ఎంతమేరకు కనికరాన్ని చూపిస్తాడో కొన్నిసార్లు దేవుని సేవకులకు కూడా అర్థంకాకపోవచ్చు

2 యెహోవా ఎంతమేరకు సహిస్తాడో అర్థంచేసుకోవడం, ప్రజలు జీవం పొందాలని యెహోవాలా కోరుకోవడం మనుషులకు కొన్నిసార్లు కష్టమే అని యోనా ఉదాహరణ చూపిస్తోంది. నీనెవె వాసులను నాశనం చేయకూడదని యెహోవా నిర్ణయించుకున్నందుకు యోనా ‘బహు చింతాక్రాంతుడై కోపగించుకున్నాడు.’ యోనా కనికరం చూపించడం కన్నా, ప్రజల ప్రాణాల్ని కాపాడడం కన్నా తన సొంత భావాలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి ఉంటాడా? నీనెవె వాసులు నాశనం కాకపోతే, తన పరువు పోతుందని బహుశా యోనా అనుకొనివుంటాడు. (యోనా 4:1, 10, 11) యెహోవా తీర్పుదినం అతి వేగంగా సమీపిస్తున్న మన కాలం విషయమేమిటి? మీ మదిలో బహుశా ఈ ప్రశ్నలు మెదలవచ్చు: ‘దేవుని క్షమాగుణాన్ని అర్థంచేసుకోవడానికి, దానిపై నాకున్న మెప్పుదల పెరగడానికి నేను ఏమి చేయాలి? పశ్చాత్తాపపడిన పాపులు దేవుని వాత్సల్యం నుండి ఇంకా ఎక్కువగా ప్రయోజనం పొందడానికి వాళ్లకు సహాయం చేయాలంటే నేను ఏమి చేయాలి? ప్రజలు జీవం పొందాలని యెహోవాలా కోరుకోవాలంటే నేనేమి చేయాలి?’

ప్రజల ప్రాణాల్ని కాపాడేందుకు న్యాయం, కనికరం

3. దేవుని కనికరం, న్యాయం ఒకదానికొకటి విరుద్ధమైన లక్షణాలా? వివరించండి.

3 ఈ 12 ప్రవచన పుస్తకాలు ఎంతసేపూ దేవుడు ఆగ్రహం వ్యక్తం చేయడం, ప్రజల్ని శిక్షించడం, న్యాయ తీర్పులను అమలు చేయడం వంటివాటి గురించే మాట్లాడుతున్నాయని కొందరు అనుకుంటారు. వాళ్లకు ఇలాంటి ప్రశ్నలు తలెత్తవచ్చు: ‘యెహోవా కనికరం ఏమైంది? అసలు ప్రజల్ని రక్షించాలన్న ఆలోచన ఆయనకు ఉందా?’ నిజానికి దేవుని కనికరం, న్యాయం ఒకదానికొకటి విరుద్ధమైన లక్షణాలు కావు. అయితే, ఆయన ఆ రెండిటినీ సమపాళ్లలో చూపిస్తూ, ప్రజల ప్రాణాలు కాపాడతాడు. పరిపూర్ణ సమతూకం గల యెహోవా వ్యక్తిత్వానికి న్యాయం, కనికరం రెండు ముఖరూపాలు. (కీర్తన 103:6; 112:4; 116:5) దుష్టుల వల్ల కలిగిన హానిని తొలగించడం ద్వారా దేవుడు సరైన మనోవైఖరి గల ప్రజల పట్ల కనికరం చూపిస్తున్నాడు. అది ఆయన పరిపూర్ణ న్యాయానికి తార్కాణం. మరోవైపున, యెహోవా కనికరంతో అపరిపూర్ణ మనుషుల పరిమితుల్ని అర్థంచేసుకుంటాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, యెహోవా అవసరమైన చోట న్యాయాన్ని, సాధ్యమైన చోట కనికరాన్ని చూపిస్తాడు. ప్రవక్తల సందేశాల్లోని చాలా వాక్యాలు ఆ పరిపూర్ణ సమతుల్యతను రుజువుచేస్తున్నాయి. అలాగే, ప్రజలు జీవం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడని ఆ వాక్యాలు చూపిస్తున్నాయి. మనం ఇప్పుడు ఆ విషయాన్ని పరిశీలిస్తూ, తద్వారా నేర్చుకునే పాఠాల్ని నేడు ఏయే సందర్భాల్లో ఆచరణలో పెట్టవచ్చో చూద్దాం.

4. ప్రజలు జీవం పొందాలన్న కోరిక యెహోవాకు ఉందనేందుకు రుజువేంటి?

4 యోవేలు నాశన సందేశాన్నే ప్రకటించినా, ఈ భరోసాను కూడా ఇచ్చాడు: ‘మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృపగలవాడు.’ (యోవేలు 2:13) దాదాపు 100 ఏళ్ల తర్వాత, అంటే సా.శ.పూ. 8వ శతాబ్దంలో మీకా ప్రవక్త, యెహోవా క్షమాపణ మనకు ఎంత అవసరమో నొక్కిచెప్పాడు. “నీతో సముడైన దేవుడున్నాడా?” అని అడిగాక మీకా యెహోవా గురించి ఇలా వర్ణించాడు: “ఆయన కనికరము చూపుటయందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. ఆయన మరల మనయందు జాలిపడును.” (మీకా 7:18, 19) అవును, తన ఉగ్రతకు గురికావాల్సిన ప్రజలు ఒకవేళ పశ్చాత్తాపానికి తగ్గ పనులు చేస్తే యెహోవా తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి సుముఖంగా ఉంటాడు. నీనెవె వాసుల గురించిన యోనా వృత్తాంతాన్ని చూస్తే ఆ విషయం అర్థమౌతుంది.

5. దేవుని కనికరానికి, ప్రాణాలు కాపాడే విషయంలో ఆయనకున్న ఆసక్తికి సంబంధించి ఏది మిమ్మల్ని ఎక్కువగా ఆకట్టుకుంటోంది? (“వాళ్లు తమను అందుబాటులో ఉంచుకున్నారు” అనే బాక్సు చూడండి.)

5 మనం జీవిస్తున్నది ఆ 12 మంది ప్రవక్తల కాలాల్లో కాదు. అయినా, యెహోవా కనికరం గలవాడని, ప్రాణాలు కాపాడే విషయంలో ఆయనకు ఆసక్తి ఉందని చూపించే రుజువుల్ని పరిశీలించినప్పుడు మన హృదయం కృతజ్ఞతతో ఉప్పొంగుతుంది కదా. దానివల్ల దేవునితో మనకున్న అనుబంధం బలపడుతుంది, జీవం పొందేందుకు ఇతరులకు సహాయం చేయాలన్న మన ఆసక్తి పెరుగుతుంది. నేడు చాలామంది చెడు మార్గంలో నడుస్తున్నారు. కానీ, దేవునికి మాత్రం ‘ఎవ్వరూ నశించడం’ ఇష్టంలేదని, ‘అందరూ మారుమనస్సు పొందాలని కోరుకుంటున్నాడని’ బైబిలు అభయమిస్తోంది. (2 పేతురు 3:9) వ్యభిచారం చేసిన భార్యను మళ్లీ ఇంటికి తెచ్చుకున్నప్పుడు హోషేయ ఆప్యాయంగా పలికిన మాటల్లో యెహోవాకున్న ఆ అభిలాష కనిపిస్తోంది. యెహోవా తన ప్రజలతో ‘ప్రేమగా మాట్లాడాడు.’ నిజానికి, క్షమించాల్సిన అవసరం యెహోవాకు లేదు, అయినా ఆయన “మనస్ఫూర్తిగా” క్షమించడానికి సుముఖత చూపించాడు. (హోషేయ 1:2; 2:13, 14; 3:1-5; 14:4) క్షమించే విషయంలో యెహోవా వైఖరి, చర్యలు ఎందుకంత ప్రాముఖ్యమైనవో మీకు తెలుసా? ఎందుకంటే, ప్రాణాలు అపాయంలో ఉన్నాయి. దేవుడు కనికరం గలవాడని, ప్రజలు జీవం పొందాలన్న కోరిక ఆయనకుందని చూపించే మరిన్ని రుజువులు మీకు క్రైస్తవ సంఘంలో కనిపిస్తాయి. నేడు క్రైస్తవ సంఘం ఓ ముఖ్యమైన పని చేస్తోంది, ఆ పనిలో మీకు కూడా వంతు ఉంది.

వాళ్లు తమను అందుబాటులో ఉంచుకున్నారు

ప్రజల ప్రాణాల పట్ల శ్రద్ధ చూపించే విషయంలో ఆ 12 మంది ప్రవక్తలు ఎంతో చక్కని ఆదర్శాన్ని ఉంచారు. ఆ ప్రవక్తలు ఎన్ని ప్రమాదాలు, బెదిరింపులు ఎదురైనా, ఎన్నో త్యాగాలు చేయాల్సి వచ్చినా దేవుని ప్రజలు, మరితరులు ప్రయోజనం పొందేలా తమ సందేశాల్ని నమ్మకంగా ప్రకటించారు. దినదిన ప్రవర్ధమానం చెందుతున్న దేవుని సంస్థలోని భూభాగంలో ఉన్న ప్రపంచవ్యాప్త సంఘాల్లో సేవచేయడానికి ఇష్టపడే పెద్దల, పరిచర్య సేవకుల అవసరం నానాటికీ పెరుగుతోంది. చాలామంది పూర్తికాల ప్రచారకులు తక్షణమే కావాలి. సంఘం లోపల, బయట మీ శక్తియుక్తుల్ని ధారపోసి మిమ్మల్ని మీరు మనస్ఫూర్తిగా దేవుని పనికోసం అందుబాటులో ఉంచుకోవడం ద్వారా ఆ 12 మంది ప్రవక్తల ఆదర్శాన్ని పాటించగలరా? ప్రజలు జీవం పొందాలని కోరుకుంటున్న యెహోవాను అనుకరించడానికి అదొక అత్యుత్తమ మార్గం.

ప్రజలు జీవం పొందేందుకు సహాయం చేయండి

6. ప్రజలు జీవం పొందాలన్న కోరిక తనకుందని యెహోవా ముఖ్యంగా ఎలా చూపిస్తున్నాడు?

6 బహిరంగ పరిచర్యలో మీరు ఎందుకు పాల్గొంటారు? సత్యదేవుణ్ణి తెలుసుకోవడానికి ఇతరులకు సహాయం చేయాలన్నదే ఓ ముఖ్య కారణం. యెహోవా గురించి తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఒకటుంది: ఆయన ఎవరినైనా శిక్షించే ముందు స్పష్టమైన హెచ్చరికలు ఇస్తాడు. అది ప్రజలపై ఆయనకున్న కనికరంతో కూడిన ఆసక్తికి రుజువు. అది ప్రజలు నశించకూడదన్న ఆసక్తి ఒక్కటే కాదు, ప్రజలు జీవాన్ని పొందాలన్న ఆసక్తి కూడా. తప్పు చేసినవాళ్లు తమ నడవడిని మార్చుకొని, దేవుని నీతియుక్తమైన ఆగ్రహానికి గురవ్వకుండా ఉండడానికి ఆయన వాళ్లకు ఓ అవకాశం ఇస్తున్నాడనే విషయాన్ని ఆ 12 మంది ప్రవక్తలు తెలియజేశారు. ఇప్పుడు మనం కూడా అలాంటి పనే చేస్తున్నాం. రానున్న దేవుని ఉగ్రత దినం గురించి ప్రజల్ని హెచ్చరించే గొప్ప అవకాశం క్రైస్తవులమైన మనకుంది. అయితే మీరలా చేస్తుండగా, మీ సందేశాన్ని తిరస్కరించిన ప్రజలకు తగిన శాస్తి జరగాలనే కసిని అణచుకోండి. కొంతమందినైనా జీవమార్గంలో నడిపించాలన్న ముఖ్యోద్దేశంతోనే మీరు ప్రకటనా పని చేస్తున్నారని ఎన్నడూ మర్చిపోకండి.—యోవేలు 3:9-12; జెఫన్యా 2:3; మత్తయి 7:13, 14.

7. (ఎ) ప్రకటనా పని చేయడం ఎందుకు ప్రాముఖ్యం? (బి) మన సందేశాన్ని ప్రజలు పట్టించుకోనప్పుడు యెహోవా వైఖరిని గుర్తుచేసుకోవడం ఎందుకు మంచిది?

7 ఇంటింటి పరిచర్యలో, స్కూల్లో, పనిస్థలంలో అలా ఎక్కడైనా బైబిలు సత్యం పంచుకుంటున్న ప్రతీసారి మీరు దేవుని కనికరం, క్షమాపణ ఎక్కువగా అవసరమైన ప్రజలకు సహాయం చేస్తున్నట్టే. (హోషేయ 11:3, 4) అయితే మీరు ప్రకటించే వార్తను ప్రజలు పట్టించుకోకపోవచ్చు, మిమ్మల్ని వ్యతిరేకించవచ్చు. కానీ మీరు పట్టుదలగా ప్రకటిస్తే, కనికరంగల దేవుణ్ణి అనుకరించిన వాళ్లౌతారు. దారితప్పిన తన ప్రజలతో జెకర్యా ద్వారా దేవుడు ఇలా అన్నాడు: “మీ దుర్మార్గతను మీ దుష్‌క్రియలను మాని తిరుగుడి.” (జెకర్యా 1:4) మీరు దేవుని కనికరం గురించి చెబుతూ జీవమార్గానికి దారి చూపించినప్పుడు ఎంతమంది స్పందిస్తారో ఎవరికి తెలుసు? ప్రజలు జీవం పొందాలనే అభిలాష యెహోవాకు ఉంది. మీకు కూడా ఆ కోరిక ఉంది కాబట్టే మీరు ప్రకటనా పని చేస్తున్నారు. ఈ విషయాన్ని ఎప్పుడూ మనసులో ఉంచుకోవడానికి ప్రయత్నించండి.

8. దేవుని కనికరానికి కొంతమంది చక్కగా స్పందించారనే విషయాన్ని గుర్తుచేసుకోవడం మనకు ఎందుకు ఊరటనిస్తుంది?

8 దేవుని సందేశానికి చక్కగా స్పందించిన ప్రజలు దాదాపు అన్ని కాలాల్లో ఉన్నారనే నిజాన్ని గుర్తుచేసుకుంటే మనకు ఊరట కలుగుతుంది. అందుకే, “యెహోవా మార్గములు చక్కనివి” అని గుర్తించినవాళ్ల గురించి హోషేయ ప్రస్తావించగలిగాడు. ‘నీతిమంతులు వాటిని అనుసరించి నడచుకొందురు’ అని కూడా ఆయన అన్నాడు. (హోషేయ 14:9) యెహోవా ఇచ్చిన ఈ ఆహ్వానం శతాబ్దాలుగా ఎంతోమంది హృదయాల్ని తట్టింది: “మనఃపూర్వకముగా తిరిగి నాయొద్దకు రండి.” (యోవేలు 2:12) యెహోవా తన గురించి తెలిసిన ప్రజలతోనే ఆ మాటలన్నా, కొత్తగా తన గురించి నేర్చుకుంటున్న ప్రజల మీద కూడా ఆయనకున్న ఆసక్తి ఆ మాటల్లో కనిపిస్తోంది. అవును, చేసిన తప్పులకు బాధపడి, పశ్చాత్తాపపడి, పరివర్తన చెందే విషయంలో మనుషులకున్న సామర్థ్యం మీద యెహోవాకు నమ్మకం పోలేదు. అందువల్లే రక్షణ పొందే అవకాశం ప్రజలకు దొరుకుతోంది.—1 తిమోతి 4:16.

9. నీనెవె వాసుల ప్రతిస్పందనను బట్టి ఏది ప్రాముఖ్యమని అర్థమౌతోంది?

9 యెహోవా నీనెవె వాసులను క్షమించడానికి ఇంకో కారణం ఉంది. వాళ్లు దేవుని తీర్పు సందేశాన్ని గంభీరంగా తీసుకున్నారు, ‘దేవునియందు విశ్వాసం ఉంచారు.’ (యోనా 3:5) నాశనాన్ని తప్పించుకోవడానికి వాళ్లకు యెహోవా తీర్పు పట్ల భయం ఉంటే సరిపోదు, విశ్వాసం కూడా ఉండాలి. ప్రజలు పశ్చాత్తాపపడాలని, విశ్వాసంతో చర్య తీసుకోవాలని యెహోవా బలంగా కోరుకుంటున్నాడు. అందుకే, ప్రజలు సరైన నిర్ణయం తీసుకునేలా వాళ్లకు సహాయం చేయడానికి ఆయన మనల్ని సువార్తికులుగా ఉపయోగించుకుంటున్నాడు. అలా సహాయం చేస్తే ఏ ఫలితం వస్తుంది? నీనెవె వాసులకు సంబంధించి లేఖనాల్లో ఇలా ఉంది: “వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట యిచ్చిన కీడుచేయక మానెను.” (యోనా 3:10) యెహోవా ఏదో పైపై మాటలకు లేదా బూటకపు చర్యలకు మోసపోడు. నీనెవె వాసులు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసిన పద్ధతిలో ఖచ్చితంగా నిజాయితీ ఉండివుంటుంది. వాళ్లలో నిజమైన మార్పు యెహోవాకు కనిపించింది. వాళ్లు నిజమైన పశ్చాత్తాపాన్ని, విశ్వాసాన్ని చూపించారు.

10. యెహోవా రక్షణను అనుగ్రహించిన సందర్భాల్లో కొన్ని ఏమిటి?

10 ప్రాణాల్ని కాపాడే విషయంలో యెహోవాకున్న ఆసక్తి వల్ల నీనెవె వాసులు మాత్రమే ప్రయోజనం పొందారని మనం అనుకోకూడదు. ఓబద్యా, నహూము, హబక్కూకు ప్రవక్తల పరిచర్య కాలం తర్వాత ఏమి జరిగిందో చూడండి. సా.శ.పూ. 607 లో యెరూషలేము నాశనమప్పుడు యిర్మీయాను, అతని నమ్మకమైన కొందరు సహచరుల్ని యెహోవా రక్షించాడు. (యిర్మీయా 39:16-18) పశ్చాత్తాపం చూపించిన కొందరు యూదులు బబులోను చెర నుండి తిరిగి వచ్చి స్వచ్ఛారాధనను మళ్లీ మొదలుపెడతారని దేవుని ప్రవక్తలు ప్రవచించారు. (మీకా 7:8-10; జెఫన్యా 3:10-20) ఆ ప్రవచనాలు ఆధునిక కాలంలో ఇంకా భారీ స్థాయిలో నెరవేరాయి. మొదటి ప్రపంచ యుద్ధం సమయానికి అభిషిక్త క్రైస్తవుల్లో చాలామంది సత్యారాధనను అశ్రద్ధ చేశారు. అయితే యుద్ధం తర్వాత, ప్రజల ప్రాణాల్ని దృష్టిలో పెట్టుకొని అభిషిక్తులు మళ్లీ చురుగ్గా ఆధ్యాత్మిక పనులు మొదలుపెట్టారు, యెహోవా అనుగ్రహాన్ని పొందారు. ఇప్పుడు కూడా ‘అన్యజనులనేకులు యెహోవాను హత్తుకుంటున్నారు.’ (జెకర్యా 2:11) రానున్న అంతాన్ని తప్పించుకుంటామనే నిరీక్షణ వీళ్లకు ఉంది. కేవలం సువార్త ప్రకటించమనే ఆజ్ఞకు లోబడడానికో, ప్రవచనం నెరవేర్చడానికో మీరు ప్రకటనాపని చేస్తున్నారని అనుకోకండి. (మత్తయి 24:14; 28:19, 20) ప్రజలు యెహోవా గురించి తెలుసుకోవడానికి, విశ్వాసం చూపించడానికి, జీవం పొందడానికి వాళ్లకు సహాయం చేయడమే ప్రకటనా పని లక్ష్యం.

యెహోవా దగ్గరికి తిరిగి వచ్చేవాళ్లు జీవం పొందుతారు

11, 12. ఒకప్పుడు యెహోవా ఆరాధకులుగా ఉన్నవాళ్లు ఆయన కనికరం నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చు?

11 యెహోవాకు కొత్తవాళ్ల మీద శ్రద్ధ ఉంది, వాళ్లు జీవం పొందాలన్నదే ఆయన అభిలాష. అలాగని పాతవాళ్లను అంటే ఇప్పటికే తనను సేవిస్తున్న వాళ్లను ఆయన మర్చిపోడు. మనం కూడా ఆ సేవకుల మీద శ్రద్ధ చూపించాలి, వాళ్లు జీవమార్గాన్ని విడిచిపెట్టకూడదని కోరుకోవాలి. మరి మనం ఆ శ్రద్ధను ఎలా చూపించవచ్చు?

12 ఒకప్పుడు యెహోవా గురించి నేర్చుకొని, ఆయన మీద విశ్వాసం ఉంచి, సత్యారాధనలో చురుగ్గా పాల్గొని, ఇప్పుడు ఆయన సేవను మానుకున్న వాళ్లు బహుశా మీకు తెలిసివుంటారు. అలాంటివాళ్ల మీద కూడా కనికరం చూపించడానికి సిద్ధంగా ఉన్నానని ఆ 12 మంది ప్రవక్తల ద్వారా ఇచ్చిన సందేశాల్లో యెహోవా చూపించాడు. సత్యం నుండి ‘కొట్టుకునిపోయిన’ వాళ్ల మీద, యెహోవాను ‘విడిచిపెట్టిపోయిన’ వాళ్ల మీద లేదా చేసిన పాపానికి పశ్చాత్తాపం చూపించాల్సిన వాళ్ల మీద యెహోవా కనికరం చూపించడానికి నేడు కూడా సిద్ధంగా ఉన్నాడు. (హెబ్రీయులు 2:1; 3:12) యెహోవాకు దూరమై వాళ్లు సంతోషంగా లేకపోవచ్చు. కానీ ఆయన దగ్గరికి తిరిగిరావడం వాళ్లకు కష్టమనిపిస్తుండవచ్చు. ప్రవక్త రాసిన ఈ మాటల్లో యెహోవా చేస్తున్న మనవిని గమనించండి: “మీరు నాతట్టు తిరిగినయెడల నేను మీతట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.” (జెకర్యా 1:3) హోషేయ చెప్పిన ఈ మాటలు కూడా అభయాన్నిస్తున్నాయి: “ఇశ్రాయేలూ, నీవు పడిపోయి దేవునికి విరోధముగా పాపము చేశావు. కాబట్టి నీ దేవుడైన యెహోవా వద్దకు తిరిగిరమ్ము. నీవు చెప్పబోయే విషయాల గురించి ఆలోచించుము. యెహోవా వద్దకు తిరిగిరమ్ము. ఆయనతో ఇలాగున చెప్పుము, ‘మా పాపాన్ని తీసివేయుము. మా మంచి పనులను అంగీకరించుము.’” అవును, ఘోరమైన పాపాలు చేసినవాళ్లు కూడా మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడి దేవుని దగ్గరికి తిరిగి వస్తే ఆయన క్షమాపణను రుచిచూడవచ్చు, పాపభారం నుండి పూర్తిగా విముక్తులు కావచ్చు. (హోషేయ 6:1; హోషేయ 14:1, 2, పరిశుద్ధ బైబల్‌: తెలుగు ఈజీ-టు-రీడ్‌ వర్షన్‌; కీర్తన 103:8-10) ప్రవక్తల కాలాల్లో అలా జరిగింది, మన కాలంలో కూడా జరుగుతుంది.

146వ పేజీలోని చిత్రం

ఒకప్పుడు ఉత్సాహంగా సేవ చేసిన క్రైస్తవులు మళ్లీ యెహోవా దగ్గరికి తిరిగి రావడానికి మీరు ఎలా సహాయం చేయవచ్చు?

13. దేవుడు క్షమించిన వాళ్లపట్ల మనం కనికరం చూపించడానికి ఏ కారణాలు ఉన్నాయి?

13 యెహోవా దేవుడు తప్పిదస్థులను క్షమించి అంగీకరిస్తాడని మనం చూశాం. మరి జీవమార్గంలో నమ్మకంగా కొనసాగుతున్న క్రైస్తవులు ఆ విషయంలో ఎలాంటి వైఖరి చూపించాలి? ఇతరుల పట్ల యెహోవాకున్న అభిప్రాయమే మనకూ ఉందని మనమెలా చూపించవచ్చు? కొత్తవాళ్ల మీద, తన సేవను ఆపేసిన వాళ్ల మీద మనం కనికరం చూపించాలని యెహోవా కోరుతున్నాడు. మన నుండి తాను ఏమి ఆశిస్తున్నాడో చెబుతూ హోషేయ ద్వారా యెహోవా ఇలా తెలియజేశాడు: “నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను.” ఆ మాటల ఆధారంగానే యేసు ఇలా అన్నాడు: “కనికరమునే కోరుచున్నాను గాని బలిని కోరను అను వాక్యభావమేమిటో మీరు వెళ్లి నేర్చుకొనుడి.” (హోషేయ 6:6; మత్తయి 9:13) దేవునితో మనకున్న బంధాన్ని కాపాడుకోవాలంటే మనం అలాంటి కనికరం చూపించాల్సిందే. అపొస్తలుడైన పౌలు క్షమించడాన్ని, దేవుణ్ణి అనుకరించడంతో ఎలా ముడిపెట్టాడో గమనించండి: “ఒకని యెడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి . . . ప్రేమగలిగి నడుచుకొనుడి.” (ఎఫెసీయులు 4:32–5:2) ఈ విషయంలో మీరు దేవుణ్ణి ఎంత బాగా అనుకరిస్తున్నారు?

14, 15. ఎలాంటి పరిస్థితుల్లో, యెహోవా క్షమాగుణానికి సంబంధించి మన వైఖరికి పరీక్ష ఎదురుకావచ్చు?

14 ఘోరమైన పాపం చేసి పశ్చాత్తాపపడని ఓ సహోదరుణ్ణి సంఘం నుండి బహిష్కరించాల్సి వస్తే? మొదటి శతాబ్దంలో కూడా అలాంటి పరిస్థితి తలెత్తింది. పశ్చాత్తాపపడని పాపులను క్రైస్తవ సంఘం నుండి బహిష్కరించాల్సి వచ్చింది. అపొస్తలులు జీవించిన కాలంలోనే అలా జరిగిందంటే, మన కాలంలో అలా జరగడం పెద్ద ఆశ్చర్యం కాదు. అలాంటి సందర్భాల్లో, బహిష్కృతులైన వాళ్లతో సహవసించకూడదనే బైబిలు నిర్దేశాన్ని నమ్మకమైన క్రైస్తవులు పాటిస్తారు. సంఘ సభ్యులు అలా యెహోవాకు నమ్మకంగా ఉండడం వల్ల ఏ ఫలితం ఉంటుంది? తప్పిదస్థుడు తాను ఎంత ఘోరమైన పాపం చేశాడో గుర్తించి, పశ్చాత్తాపపడాలనే ప్రేరణను పొందే అవకాశం ఉంటుంది. అప్పట్లో కొరింథు సంఘం నుండి బహిష్కృతుడైన ఓ వ్యక్తి ఆ తర్వాత పశ్చాత్తాపపడి పరివర్తన చెందాడని, సంఘంలోకి తిరిగి చేర్చుకోబడ్డాడని బైబిలు చెబుతోంది. (1 కొరింథీయులు 5:11-13; 2 కొరింథీయులు 2:5-8) ఇప్పుడు అలాంటిది జరిగితే మీరు ఎలా భావిస్తారు? ఇతరులు జీవం పొందే విషయంలో మీకున్న శ్రద్ధను మీరు ఎలా చూపించవచ్చు?

15 పశ్చాత్తాపపడిన పాపి సిగ్గుతో, నిరాశతో కుమిలిపోతుండవచ్చు. యెహోవా దేవుడు, తోటి సహోదరులు తనను ప్రేమిస్తున్నారనే భరోసా, తాను జీవం పొందాలని కోరుకుంటున్నారనే అభయం అతనికి అవసరం. పశ్చాత్తాపపడడానికి సుముఖంగా ఉన్న తన ప్రజలకు పూర్వం యెహోవా ఎంత ఆప్యాయంగా అభయమిచ్చాడో గమనించండి: “నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమునుబట్టి నిన్ను ప్రధానము చేసికొందును.” (హోషేయ 2:20) యెహోవాది ఎంత పెద్ద మనసో ఆ మాటల్ని బట్టి తెలుస్తోంది. కాబట్టి ‘జాలిపడే దేవుడు’ అని జెకర్యా వర్ణించిన యెహోవాలాగే మనమూ ఉన్నామని చేతల్లో చూపించాలి.—జెకర్యా 10:6.

16. ఎవరైనా సంఘంలోకి తిరిగి చేర్చుకోబడినప్పుడు మనం ఎలా స్పందించాలి?

16 ప్రజలు జీవం పొందాలన్నది దేవుని ఆశ. అందుకే ఒక పాపి పశ్చాత్తాపపడినప్పుడు, ఓ నిష్క్రియుడు మళ్లీ సేవను మొదలుపెట్టినప్పుడు యెహోవా సంతోషిస్తాడు.a (లూకా 5:32) కొరింథు సంఘంలో పశ్చాత్తాపం చూపించిన వ్యక్తిని తిరిగి చేర్చుకున్నారని మనం పైన చూశాం కదా. అతణ్ణి క్షమించమని, ప్రోత్సహించమని, అతణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నట్టు భరోసా ఇవ్వమని చెబుతూ పౌలు ఆ సంఘంవాళ్లకు ఇలా ఉపదేశించాడు: “అట్టివానికి మీలో ఎక్కువమందివలన కలిగిన యీ శిక్షయే చాలును గనుక మీరిక వానిని . . . క్షమించి ఆదరించుట మంచిది. లేనియెడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును. కావున వాని యెడల మీ ప్రేమను స్థిరపరచవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.” (2 కొరింథీయులు 2:6-8) ఒకప్పుడు పాపులుగా ఉన్నవాళ్ల గురించి యెహోవా ఇలా అన్నాడని హోషేయ రాశాడు: “వారు విశ్వాసఘాతకులు కాకుండ నేను వారిని గుణపరచుదును . . . మనస్ఫూర్తిగా వారిని స్నేహింతును.” (హోషేయ 14:4) యెహోవా చేతిలో ఆధ్యాత్మిక స్వస్థత పొందే వ్యక్తి నిత్యజీవం పొందే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి స్వస్థతకు మనం సంతోషంగా తోడ్పడుతూ యెహోవాను అనుకరిస్తామా?

17, 18. యెహోవా దగ్గరికి తిరిగివచ్చిన వాళ్లకు, అలాగే బహిష్కృతులైన వాళ్ల కుటుంబ సభ్యులకు మనం ప్రేమగా ఎలా సహాయం చేయవచ్చు?

17 నమ్మకద్రోహం చేసిన భార్యను హోషేయ అక్కున చేర్చుకున్నట్టే, యెహోవా తన ప్రజలతో వ్యవహరిస్తాడు. ఆయన తన దగ్గరికి వచ్చేవాళ్ల మీద తన ప్రేమను అపారంగా చూపిస్తూ వాళ్లతో గౌరవంగా వ్యవహరిస్తానని స్పష్టం చేస్తున్నాడు. యెహోవా తన సేవకులతో వ్యవహరించిన తీరు గురించి ఇలా చెప్పాడు: “ఒకడు పశువులమీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి యెదుట భోజనము పెట్టితిని.” (హోషేయ 11:4) యెహోవా తన దగ్గరికి తిరిగివచ్చే వాళ్లను సున్నితంగా చేరదీసేటప్పుడు ఉట్టిపడే ఆప్యాయత మన మనసుల్ని ఎంతలా స్పృశిస్తుందో కదా! దేవుని దృష్టిలో సరైన దుఃఖాన్ని వ్యక్తం చేసి మనస్ఫూర్తిగా పశ్చాత్తాపపడిన వ్యక్తితో కఠినంగా, అంటీఅంటనట్టుగా మనం వ్యవహరించకూడదు. అలా ప్రవర్తిస్తే, మనం యెహోవాను అనుకరించినట్టు అవదు. ఆ వ్యక్తి ఒక్కసారి సంఘంలోకి తిరిగి చేర్చుకోబడ్డాడంటే, గతంలో అతను చేసిన తప్పుకు మనం ఇక ఎంతమాత్రం కోపాన్ని, అసంతృప్తిని చూపించకూడదు. అవసరమైనప్పుడల్లా అతనితో ఓదార్పునిచ్చే మాటలు మాట్లాడాలి.—1 థెస్సలొనీకయులు 5:14.

18 బహిష్కరణకు సంబంధించి మనం యెహోవాను ఇంకా ఎలా అనుకరించవచ్చో ఆలోచించండి. ఒక వ్యక్తి సంఘం నుండి బహిష్కరించబడితే, విశ్వాసంలో ఉన్న అతని కుటుంబ సభ్యులకు బహుశా అతని భార్యాపిల్లలకు ఏమైనా సహాయం చేయగలమా? వాళ్లు క్రమంగా కూటాలకు హాజరవ్వడానికి, పరిచర్యలో పాల్గొనడానికి ఎంతో ప్రయాసపడుతుండవచ్చు. వాళ్లకు అవసరమైన సహాయాన్ని మనం అందిస్తామా? వాళ్లమీద వాత్సల్యంతో కూడిన కనికరాన్ని మరోలా కూడా చూపించవచ్చు. అదేమిటంటే ‘ఆదరణను ఇచ్చే మధురమైన’ మాటలతో ప్రోత్సాహకరంగా వాళ్లతో సంభాషించాలి. (జెకర్యా 1:13) కూటాలకు ముందూ తర్వాతా మాట్లాడుతున్నప్పుడు, పరిచర్యలో కలిసి పని చేస్తున్నప్పుడు, ఇంకా ఇతర సందర్భాల్లో మనకు అలా ప్రోత్సహించే అవకాశాలు ఎన్నో తారసపడతాయి. వాళ్లు మన తోటి పనివాళ్లు, ప్రియ సంఘ సభ్యులు. కాబట్టి ఏ విధంగానూ వాళ్లను పక్కనబెడుతున్నట్టు గానీ, వేరుచేస్తున్నట్టు గానీ మనం ప్రవర్తించకూడదు. కొందరి విషయంలో చూస్తే, బహిష్కరించబడిన వ్యక్తి పిల్లలు యెహోవా సేవ చేయడానికి కృషిచేస్తుంటారు. వాళ్లు జీవం పొందాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి మనకు ఆ కోరిక ఉందని ఎలా చూపించవచ్చు?

“తండ్రిలేనివారి యెడల వాత్సల్యము”

19. “తండ్రిలేని” ఓ యువకునికి జెఫన్యా ఎలాంటి ఆధ్యాత్మిక సహాయాన్ని అందించాడు?

19 సా.శ.పూ. 7వ శతాబ్దంలో సేవచేసిన జెఫన్యా పరిచర్యను పరిశీలిస్తే, తండ్రిలేని వాళ్లకు సహాయం చేయాలన్న ఆసక్తి ఆయనకుందని మీరు తెలుసుకుంటారు. జెఫన్యా యూదా రాజ వంశానికి చెందినవాడై ఉంటాడు, బహుశా ఆయన యోషీయా రాజుకు దూరపు బంధువు కూడా. తండ్రి హతమవ్వడంతో యోషీయా ఎనిమిదేళ్ల వయసులోనే సింహాసనాన్ని అధిష్ఠించాల్సి వచ్చింది. అప్పటికి యూదా జనాంగం విగ్రాహారాధనలో, మరితర హేయకరమైన ఆచారాల్లో కూరుకుపోయివుంది. వాళ్లను మార్చే పెద్ద సవాలు ఆయన ముందుంది. (జెఫన్యా 3:1-7) దారితప్పిన ఆ జనాంగాన్ని పరిపాలించడానికి, తండ్రిలేని యువ యోషీయాకు నైపుణ్యంగల మార్గనిర్దేశం, చక్కని సలహా అవసరం. మనం ముందటి అధ్యాయాల్లో చూసినట్లు జెఫన్యా ద్వారా, మరితర ప్రవక్తల ద్వారా యెహోవా సరైన నిర్దేశం ఇచ్చాడు. గమనించదగిన విషయమేమిటంటే, జెఫన్యా ప్రవక్త ద్వారా యెహోవా యూదా “అధిపతులను” ఖండించినా, యోషీయా రాజును మాత్రం విమర్శించలేదు. (జెఫన్యా 1:8; 3:3) దాన్నిబట్టి చూస్తే, యోషీయా రాజు అప్పటికే స్వచ్ఛారాధన పక్షాన ఉన్నట్టు నిరూపించుకున్నాడని అర్థమౌతోంది. యూదాలో జరుగుతున్న అపవిత్ర ఆరాధనను నామరూపాల్లేకుండా చేయాలన్న యోషీయా తీర్మానం జెఫన్యా ప్రవక్త ఇచ్చిన ఉపదేశంతో తప్పక బలపడివుంటుంది.

20. ఆధ్యాత్మిక సలహాదారులు ఉండడం వల్ల సంఘంలోని “తండ్రిలేని” పిల్లలకు ఎలాంటి మేలు జరుగుతుంది?

20 యోషీయా విషయంలో జెఫన్యా చూపించిన శ్రద్ధను గమనిస్తే, మార్గనిర్దేశం అవసరం ఉన్న పిల్లల పట్ల, సులభంగా ప్రమాదంలో చిక్కుకునే అవకాశం ఉన్న పిల్లల పట్ల యెహోవాకున్న శ్రద్ధ ఉట్టిపడుతోంది. బహిష్కృతుల పిల్లలు దానికి ఓ ఉదాహరణ. దేవుని గురించి హోషేయ ఇలా అన్నాడు: “తండ్రిలేనివారి యెడల వాత్సల్యము చూపువాడవు నీవే.” (హోషేయ 14:3) ఆధ్యాత్మిక విషయాల్లో, మరితర విషయాల్లో సహాయం అవసరమైన “తండ్రిలేని” పిల్లలు ఎవరైనా మీకు తెలుసా? వాళ్లు ఆధ్యాత్మిక అనాథలు అయ్యుంటారు; తల్లిలేని పిల్లలో, తండ్రిలేని పిల్లలో అయ్యుంటారు; లేదా కుటుంబ సహకారం లేకుండా యెహోవాను సేవిస్తున్న పిల్లలు అయ్యుంటారు. అలాంటి వాళ్లు సంఘాన్ని హత్తుకొని ఉండాలంటే, ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలంటే వాళ్లకు ఆధ్యాత్మిక సలహాదారులు ఉండాలి. సంఘంలోని పరిణతిగల క్రైస్తవులు ప్రేమతో శ్రద్ధ చూపించడం వల్ల చాలామంది “తండ్రిలేని” పిల్లలు పెరిగి పెద్దయ్యాక సమతుల్యం గల ఆధ్యాత్మిక వ్యక్తులయ్యారు.—కీర్తన 82:3.

151వ పేజీలోని చిత్రం

“తండ్రిలేని” పిల్లలకు మీరు ప్రేమగల ఆధ్యాత్మిక సలహాదారులుగా ఉండగలరా?

21. పరిణతిగల క్రైస్తవులు యువతీయువకులకు ఎలాంటి సహాయాన్ని అందించవచ్చు?

21 ఉదాహరణకు, సంఘంలోని ఒంటరి తల్లి సంరక్షణలో పెరిగే పిల్లల మీద పరిణతిగల క్రైస్తవులు శ్రద్ధ చూపిస్తే ఆ తల్లికి ఎంతో సాయంగా ఉంటుంది. (యాకోబు 1:27) ఇంట్లో అన్ని బాధ్యతలూ చూసుకోవాల్సింది ఆవిడే కాబట్టి, ఆమెకు తగిన గౌరవాన్నిస్తూ, ఆమెతో మర్యాదగా, పద్ధతిగా వ్యవహరించాలనే విషయం మనసులో ఉంచుకుంటూ సంఘపెద్దలు, మరితరులు అలాంటి కుటుంబాలకు ఆధ్యాత్మిక సహకారాన్ని అందించవచ్చు. బహుశా మీరు మీ భార్యతో లేదా మీ కుటుంబంతో కలిసి తండ్రిలేని పిల్లలతో సమయం గడపవచ్చు. ఒంటరితనంతో బాధపడుతున్న యువతీయువకులకు కావాల్సిన సాయం అందించగలరా? తమ బాధను ఎవరైనా విని, అర్థంచేసుకుంటే బాగుంటుందని వాళ్లకు అనిపించవచ్చు. వాళ్లతో కలిసి పరిచర్య చేస్తున్నప్పుడు బహుశా ఆ విషయాల గురించి వాళ్లు మీతో మాట్లాడాలనుకోవచ్చు. మీరు శ్రద్ధగా వింటే వాళ్లకు సహాయం చేయగలుగుతారు. నిజమే, మీకు తీరిక దొరకడం కష్టమే. అయినా, అలాంటి వ్యక్తికి కొంతకాలంపాటు క్రమంగా సహాయాన్ని అందించడం అనేది “మీ ప్రేమ యెంత యథార్థమైనదో” తేల్చే ‘పరీక్షే.’ (2 కొరింథీయులు 8:8) ఇతరులు జీవం పొందాలన్న కోరిక మీలో ఏ మేరకు ఉందో మీ ప్రయత్నాల్లో కనబడుతుంది.

22. ప్రజలు జీవం పొందే విషయంలో యెహోవాకున్న శ్రద్ధ గురించి మీకు ఏమి అనిపిస్తోంది?

22 ప్రజల మీద దేవునికి ఎంత శ్రద్ధ ఉందో, ప్రజలు జీవం పొందాలని ఆయన ఎంతగా కోరుకుంటున్నాడో ధ్యానించడం మనలో ఎంతటి విశ్వాసాన్ని నింపిందో కదా! మారడానికి ఇష్టపడని వాళ్ల విషయంలో, నిత్యజీవానికి అర్హులుకాని వాళ్ల విషయంలో యెహోవా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ కూర్చోడు. ఆయన తనను ప్రేమించే నీతిమంతుల మీద ఆప్యాయత చూపించడానికి, వాళ్లకు జీవాన్ని ఇవ్వడానికే ఎక్కువగా ఇష్టపడతాడు. మనం యెహోవా దినం కోసం ఆశగా ఎదురుచూస్తుండగా, జీవమార్గంలో ప్రవేశించడానికి ప్రజలకు సహాయం చేసే విషయంలో ఆయనను ఆదర్శంగా తీసుకుందాం.

a దారితప్పిన ప్రజల విషయంలో యెహోవాకున్న అపారమైన శ్రద్ధ మన హృదయాల్ని స్పృశించే మూడు ఉపమానాల్లో కనిపిస్తుంది. అవి: తప్పిపోయిన గొర్రె, పోయిన నాణెం, తప్పిపోయిన కుమారుడు.—లూకా 15:2-32.

వీటికి జవాబులు చెప్పగలరా?

  • కనికరం విషయంలో మీ వైఖరి ఎలా ఉందో పరిశీలించుకోవడం ఎందుకు ప్రయోజనకరం?—యోనా 4:1, 10, 11.

  • యెహోవా కనికరాన్ని, న్యాయాన్ని సమపాళ్లలో చూపిస్తాడని ఎలా చెప్పవచ్చు?—హోషేయ 2:19; మీకా 7:9.

  • నీనెవె వాసులతో యెహోవా వ్యవహరించిన తీరులో ఆయన క్షమాగుణానికి సంబంధించిన ఏ అంశాలు కనిపించాయి?—యోనా 3:5, 9, 10; 4:2.

మీరు ఎలా ప్రయోజనం పొందవచ్చు?

  • ఘోరమైన పాపం చేసినవాళ్లు దేవుని కనికరం నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చు?—హోషేయ 3:3; 4:2; 14:4.

  • సంఘంలో మీరు ప్రేమపూర్వక దయను చూపించడానికి కొన్ని మార్గాలు ఏమిటి?—హోషేయ 11:4; జెకర్యా 1:13.

  • అవసరంలో ఉన్నవాళ్లను ఆదుకోవడానికి కనికరం ఎందుకు ప్రాముఖ్యం?—జెఫన్యా 3:16, 17.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి