కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • jd అధ్యా. 6 పేజీలు 70-82
  • దేవుణ్ణి తెలుసుకోవాలంటే న్యాయంగా నడుచుకోవాలి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • దేవుణ్ణి తెలుసుకోవాలంటే న్యాయంగా నడుచుకోవాలి
  • యెహోవా మహాదినాన్ని మనసులో ఉంచుకొని జీవించండి
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • వ్యాపార లావాదేవీల్లో, డబ్బు వ్యవహారాల్లో . . .
  • ‘న్యాయాన్ని బట్టి ఏలే అధికారులు’
  • యెహోవాను అనుకరించండి—నీతిన్యాయాలను జరిగించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • యెహోవా—నిజమైన నీతి న్యాయాలకు మూలం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
  • “ఆయన మార్గాలన్నీ న్యాయమైనవి”
    యెహోవాకు దగ్గరవ్వండి
  • “న్యాయంగా” ఉంటూ దేవునితో నడవండి
    యెహోవాకు దగ్గరవ్వండి
మరిన్ని
యెహోవా మహాదినాన్ని మనసులో ఉంచుకొని జీవించండి
jd అధ్యా. 6 పేజీలు 70-82

6వ అధ్యాయం

దేవుణ్ణి తెలుసుకోవాలంటే న్యాయంగా నడుచుకోవాలి

1. న్యాయంగా నడుచుకోవాలని మనం ఎందుకు కోరుకుంటాం?

న్యాయం కోసం ప్రజల పక్షాన పోరాడి ప్రసిద్ధికెక్కిన వాళ్లు చరిత్రలో ఎందరో ఉన్నారు. అయితే ఈ సత్యాన్ని మనం గమనించాలి: దేవుడు మనుషులను తన పోలికలో చేశాడు కాబట్టి వాళ్లు న్యాయాన్ని కోరుకుంటారు. యెహోవా న్యాయాన్ని బట్టి ‘ఆనందించే’ దేవుడు. మనం ఆయన పోలికలో ఉన్నందువల్లే న్యాయంగా నడుచుకోవాలనుకుంటాం, ఇతరుల నుండి కూడా అదే ఆశిస్తాం.—యిర్మీయా 9:24; ఆదికాండము 1:27; యెషయా 40:14.

2, 3. యెహోవా న్యాయాన్ని తెలుసుకోవాలంటే మనం ఆ 12 మంది ప్రవక్తల పుస్తకాల్ని ఎందుకు పరిశీలించాలి?

2 మీరు బైబిల్లోని ఆయా పుస్తకాలను చదువుతున్నప్పుడు, దేవుని న్యాయం గురించిన మీ అవగాహన రెట్టింపౌతుంది. అయితే ఆ 12 మంది ప్రవక్తల పుస్తకాలను పరిశీలిస్తే మీరు ప్రత్యేక ప్రయోజనాలు పొందుతారు. ఆ పుస్తకాలు న్యాయాన్ని ఎంతగా నొక్కిచెప్పాయంటే హోషేయ, ఆమోసు, మీకా పుస్తకాల ఆధారంగా ఒక బైబిలు సొసైటీ వాళ్లు ప్రచురించిన సంపుటికి జస్టిస్‌ నౌ! అనే పేరుపెట్టారు. ఉదాహరణకు ఆమోసు ఏమని అభ్యర్థించాడో చూడండి: “నీళ్లు పారినట్లుగా న్యాయము జరుగనియ్యుడి, గొప్ప ప్రవాహమువలె నీతిని ప్రవహింపనియ్యుడి.” మీకా కూడా, మనం విధిగా పాటించాల్సిన వాటిని పేర్కొంటున్నప్పుడు ముందుగా దేన్ని ప్రస్తావించాడో గమనించండి: “న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సు కలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.”—ఆమోసు 5:24; మీకా 6:8.

3 కాబట్టి, మనం యెహోవాను ఇంకా బాగా తెలుసుకొని ఆయనను అనుకరించాలంటే ఆయన న్యాయాన్ని అర్థంచేసుకోవడం ఎంతైనా అవసరం. న్యాయం యెహోవా దేవునిలో అంతర్లీనంగా ఉన్న ఓ లక్షణం గనుక దాన్ని అర్థంచేసుకోకుండా ఆయన మనకు తెలుసని అనలేం. “యెహోవా న్యాయమును ప్రేమించువాడు” అనే విషయం ఆనాటి దేవుని సేవకులకు కూడా తెలుసు.—కీర్తన 33:5; 37:28.

71వ పేజీలోని చిత్రం

హబక్కూకు

4. ఆ 12 మంది ప్రవక్తల పుస్తకాలు దేవుని న్యాయం మీద మనకున్న నమ్మకాన్ని రెట్టింపు చేస్తాయని ఎందుకు చెప్పవచ్చు?

4 యెరూషలేము మీద యెహోవా తన తీర్పును అమలుచేయడానికి కొంతకాలం ముందు, హబక్కూకు ప్రవక్త ఇలా అడిగాడు: “యెహోవా, నేను మొఱ్ఱపెట్టినను నీవెన్నాళ్లు ఆలకింపకుందువు? . . . ధర్మశాస్త్రము నిరర్థకమాయెను, న్యాయము ఎన్నడును జరుగకుండ మానిపోయెను, భక్తిహీనులు వచ్చి నీతిపరులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోవుచున్నది.” (హబక్కూకు 1:2, 4) నమ్మకస్థుడైన హబక్కూకు ఆనాడు అందుబాటులో ఉన్న లేఖనాల నుండి, సొంత అనుభవం నుండి యెహోవాను తెలుసుకున్నాడు. దీనివల్ల, యెహోవా న్యాయాన్ని సమర్థిస్తాడని, ప్రోత్సహిస్తాడని అతను బలంగా నమ్మాడు. కానీ, యెహోవా దేవుడు దుష్టత్వాన్ని ఎందుకు ఇంకా చూస్తూ ఊరుకుంటున్నాడో అతను తెలుసుకోవాలనుకున్నాడు. నమ్మకస్థులైన వ్యక్తులతో న్యాయంగా వ్యవహరిస్తానని యెహోవా అతనికి భరోసా ఇచ్చాడు. (హబక్కూకు 2:4) యెహోవా అలా వ్యవహరిస్తాడని ఆనాటి హబక్కూకు, మరితరులే నమ్మినప్పుడు మనం నమ్మలేమా? ఎందుకంటే అలా నమ్మడానికి మనకు ఇంకా గట్టి కారణం ఉంది. ఏమిటది? నేడు మన దగ్గర మొత్తం బైబిలు ఉంది. యెహోవా వ్యవహారాల గురించి అందులో మరింత వివరంగా తెలుసుకోవచ్చు. అంతేకాదు, తన వ్యక్తిత్వంలో అంతర్లీనంగా ఉన్న న్యాయాన్ని, మరితర లక్షణాల్ని ఆయన ఎలా చూపించాడో కూడా తెలుసుకోవచ్చు. అందుకే, యెహోవా గురించి మరింత బాగా తెలుసుకోవడానికి, ఆయన పరిపూర్ణ న్యాయం మీద బలమైన నమ్మకం కుదరడానికి మనకు ఇంకా ఎక్కువ వీలుంది.

5. న్యాయంగా నడుచుకోవడానికి సంబంధించి ప్రవక్తలు ఏ విషయాన్ని నొక్కిచెప్పారు?

5 యెహోవా ఇశ్రాయేలీయుల దగ్గరికి వేర్వేరు ప్రవక్తల్ని పంపి, న్యాయంగా నడుచుకోవడం ఎంత ప్రాముఖ్యమో తెలియజేశాడు. (యెషయా 1:17; 10:1, 2; యిర్మీయా 7:5-7; యెహెజ్కేలు 45:9) ఆయన ఆ 12 మంది ప్రవక్తలను పంపినప్పుడు కూడా అదే చేశాడు. (ఆమోసు 5:7, 12; మీకా 3:9; జెకర్యా 8:16, 17) రోజువారీ వ్యవహారాల్లో న్యాయంగా నడుచుకోవడం చాలా ప్రాముఖ్యమని ఆ ప్రవక్తలు నొక్కిచెప్పారు. ఆ పుస్తకాలు చదివిన వాళ్లెవరికైనా ఆ విషయం అర్థమౌతుంది. ఆ 12 పుస్తకాల్లోని న్యాయానికి సంబంధించిన పాఠాలు ఎన్నో రంగాల్లో మనకు ఉపయోగపడతాయి. అయితే ఇప్పుడు మనం రెండు రంగాల్ని పరిశీలిద్దాం. ఆ తర్వాత, నేర్చుకున్నవి ఎలా ఆచరణలో పెట్టవచ్చో చూద్దాం.

వ్యాపార లావాదేవీల్లో, డబ్బు వ్యవహారాల్లో . . .

6, 7. వ్యాపార లావాదేవీల్లో, డబ్బు వ్యవహారాల్లో న్యాయంగా ఉండడం గురించి మనం ఎందుకు ఆలోచించాలి?

6 “మనుష్యుడు రొట్టెవలన మాత్రమే జీవించడు” అని యేసు అన్నాడు. (లూకా 4:4; ద్వితీయోపదేశకాండము 8:3) మనం ఆహారం తినకూడదని యేసు ఉద్దేశం కాదు. మనకు ఆహారం అవసరమే. అయితే దాన్ని సంపాదించడానికి మనం పనిచేయాలి లేదా కుటుంబంలో ఎవరో ఒకరు పనిచేయాలి. పూర్వం సత్య దేవుని సేవకుల విషయంలో కూడా అంతే. కొందరు జీవనాధారం కోసం వ్యవసాయం చేసుకునేవాళ్లు, కొందరు వస్త్రాల్ని ఉత్పత్తి చేసేవాళ్లు, కొందరు చెక్కసామగ్రి లేదా వంట పాత్రలు తయారుచేసి అమ్మేవాళ్లు. ఇంకొందరు ఇతరులకు ఉపాధి కల్పించేవాళ్లు. వాళ్లు కోతకు, పిండి తయారీకి, ఓలీవ నూనె తీయడానికి లేదా ద్రాక్షారసం తయారు చేయడానికి పనివాళ్లను పెట్టుకునేవాళ్లు. వేరేవాళ్లేమో అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తూ వ్యాపారం చేసేవాళ్లు. మరితరులు కొన్నిరకాల సేవలను అందించేవాళ్లు అంటే ఇంటి పైకప్పు మరమ్మతు చేయడం, వాయిద్యాలు వాయించడం వంటివి చేసేవాళ్లు.—నిర్గమకాండము 35:35; ద్వితీయోపదేశకాండము 24:14, 15; 2 రాజులు 3:15; 22:6; మత్తయి 20:1-8; లూకా 15:25.

7 మీరైనా లేదా మీ బంధుమిత్రుల్లో ఎవరైనా పైన పేర్కొన్న వృత్తుల్లో ఉండేవుంటారు. పని చేసే పద్ధతుల్లో నేడు ఎన్నో మార్పులు వచ్చాయి. కానీ అలాంటివాటిలో న్యాయంగా ఉండడానికి సంబంధించి యెహోవా అభిప్రాయం మారలేదు. వాటిలో తన ప్రజలు న్యాయంగా ఉండాలని తాను ఆశిస్తున్నట్టు యెహోవా ఆ 12 మంది ప్రవక్తల ద్వారా తెలియజేశాడు. మనం ఇప్పుడు కొన్ని ఉదాహరణలు పరిశీలిద్దాం. వాటిని పరిశీలిస్తుండగా, దేవుడు కోరే న్యాయాన్ని మీరెలా చూపించవచ్చో ఆలోచించండి.—కీర్తన 25:4, 5.

8, 9. (ఎ) మలాకీ 3:5లో దేవుడు ఖండించిన తప్పు పెద్ద తప్పేనని ఎందుకు చెప్పవచ్చు? (బి) పనికి సంబంధించి ఎలాంటి వైఖరిని అలవర్చుకోవాలని లేఖనాలు ప్రోత్సహిస్తున్నాయి?

8 మలాకీ ద్వారా దేవుడు ఇలా చెప్పాడు: ‘తీర్పు తీర్చుటకై నేను మీయొద్దకు రాగా, చిల్లంగివాండ్ర మీదను వ్యభిచారులమీదను అప్రమాణికులమీదను, నాకు భయపడక వారి కూలి విషయములో కూలివారికి అన్యాయము చేయువారిమీదను దృఢముగా సాక్ష్యము పలుకుదును.’ (మలాకీ 3:5) అవును, కూలీలకు అన్యాయం చేసినవాళ్లను యెహోవా ఖండించాడు. యెహోవా దృష్టిలో అది ఎంత పెద్ద తప్పు? పనివాళ్ల కష్టాన్ని దోచుకోవడం అనేదాన్ని ఆయన మంత్రతంత్రాలు, వ్యభిచారం, అబద్ధమాడడం వంటివాటితో కలిపి పేర్కొన్నాడని గమనించండి. ‘వ్యభిచారులకు, మాంత్రికులకు, అబద్ధికులకు’ దేవుడు ఎలాంటి శిక్ష విధిస్తాడో మనకు తెలుసు.—ప్రకటన 21:8.

9 యజమానులు కూలీలకు అన్యాయం చేసి కేవలం మనుషుల న్యాయ ప్రమాణాన్ని కాదుగానీ, యెహోవా న్యాయ ప్రమాణాన్ని మీరారు! ‘కూలి విషయములో కూలివారికి అన్యాయము చేసిన’ వాళ్ల మోసాన్ని చూసి ‘తీర్పు తీర్చుటకై వాళ్ల యొద్దకు’ వస్తానని యెహోవా అన్నాడు. అయితే, పనివాళ్లు అడిగినదానికల్లా యజమాని తలాడించాలని దేవుడు చెప్పలేదు. తన ద్రాక్షతోటలో పనివాళ్లను కూలికి పెట్టుకున్న ఓ యజమాని గురించి యేసు చెప్పిన ఉపమానాన్నే తీసుకోండి. దాన్ని పరిశీలిస్తే, కూలివాళ్లకు కూలి ఎంత ఇవ్వాలో, ఏ షరతులు విధించాలో నిర్ణయించే అధికారం యజమానికి ఉండేదని అర్థమౌతుంది. (మత్తయి 20:1-7, 13-15) ఆ ఉపమానంలోని యజమాని తన తోటలో రోజంతా పనిచేసిన వాళ్లకు, కొన్ని గంటలే పనిచేసిన వాళ్లకు అందరికీ సమానంగా ఓ రోజు కూలిని అంటే ఓ దేనారాన్ని ఇచ్చాడన్నది గమనార్హం. ఆ యజమాని అధిక లాభార్జన కోసం కూలివాళ్లను దగా చేసి వాళ్ల జీతం ఎగ్గొట్టలేదని కూడా గమనించండి.—యిర్మీయా 22:13.

10. మన కింద పనిచేసేవాళ్లతో మన వ్యవహారాల గురించి ఎందుకు ఆలోచించుకోవాలి?

10 మీ చేతి కింద పనివాళ్లు ఉంటే లేదా ఒక పనికోసం ఎవరినైనా కుదుర్చుకొని ఉంటే వాళ్లకు మీరు ఇచ్చే వేతనం, మీరు పెట్టే షరతులు, వాళ్లతో మీ డబ్బు వ్యవహారాలు ఎలా ఉన్నాయని మీకు అనిపిస్తోంది? అవి మలాకీ 3:5⁠లోని సూత్రానికి అనుగుణంగా ఉన్నాయా? ఆ విషయం గురించి ఓసారి ఆలోచిస్తే బాగుంటుంది. ఎందుకంటే, పనివాళ్లతో అన్యాయంగా వ్యవహరించడం గురించి క్రైస్తవ గ్రీకు లేఖనాల్లో కూడా ఉంది. అలాంటివాళ్ల గురించి శిష్యుడైన యాకోబు ఇలా అడిగాడు: “ఆయన [యెహోవా] మిమ్మల్ని వ్యతిరేకించడం లేదా?” (యాకోబు 5:1, 4, 6, NW) ‘కూలి విషయంలో కూలివాళ్లకు అన్యాయం చేసేవాళ్లు’ యెహోవా న్యాయాన్ని అనుకరించలేదు కాబట్టి, వాళ్లు ఆయనను అసలు తెలుసుకోనేలేదు అన్న నిర్ధారణకు రావడం సబబే.

11, 12. (ఎ) హోషేయ 5:10 ఏ అన్యాయం గురించి మాట్లాడుతోంది? (బి) ఆ లేఖన సూత్రాన్ని మీరు ఎలా అన్వయించుకోవచ్చు?

11 హోషేయ కాలంలో కొందరు ప్రముఖులను యెహోవా ఎందుకు ఖండించాడో గమనించండి: “యూదావారి అధిపతులు సరిహద్దు రాళ్లను తీసివేయు [“జరిపే,” NW] వారివలె నున్నారు; నీళ్లు ప్రవహించినట్లు నేను వారిమీద నా ఉగ్రతను కుమ్మరింతును.” (హోషేయ 5:10) ఇక్కడ హోషేయ ఏ అన్యాయం గురించి మాట్లాడుతున్నాడు? యూదాలోని రైతుకు జీవనాధారం అతనికున్న సాగు భూమే, దానికి సరిహద్దు రాళ్లు లేదా గుర్తులు ఉండేవి. ఎవరైనా ‘సరిహద్దు రాయిని జరిపారంటే’ వాళ్లు ఆ పొలం విస్తీర్ణాన్ని తగ్గించి, ఆ రైతు ఆదాయానికి గండి కొట్టి అతణ్ణి దోచుకున్నట్లే. న్యాయాన్ని సమర్థించాల్సిన యూదా అధిపతుల్ని హోషేయ ‘సరిహద్దు రాయిని జరిపేవాళ్లతో’ పోల్చాడు.—ద్వితీయోపదేశకాండము 19:14; 27:17; యోబు 24:2; సామెతలు 22:28.

76వ పేజీలోని చిత్రం

మీ పనిస్థలంలో, మీ వ్యాపార వ్యవహారాల్లో మీరు ఎప్పుడూ న్యాయంగా ఉంటారా?

12 నేడు కొందరు రియల్‌ ఎస్టేట్‌ (స్థిరాస్తుల) వ్యాపారస్థులు కొనుగోలుదారుల్ని మోసం చేయడానికి ‘సరిహద్దు రాయిని జరపాలనే’ శోధనకు గురికావచ్చు. అయితే కాంట్రాక్టులు గానీ, ఒప్పందాలు గానీ కుదుర్చుకునే వ్యాపారులు, ఉద్యోగులు, యజమానులు, క్లయింట్లు అలా ఎవ్వరికైనా ఆ లేఖన సూత్రం వర్తిస్తుంది. వ్యాపార ప్రపంచంలో కొందరు, ఒప్పందం చేసుకున్న దానికన్నా తక్కువ పనిచేయడానికి లేదా కొత్త డిమాండ్లు చేయడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో రాతపూర్వక ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇష్టపడరు. ఇంకొందరేమో ఒప్పందాల్ని లిఖిత రూపంలో పెట్టడానికి అంగీకరిస్తారు కానీ, తమ వ్యక్తిగత లబ్ధి కోసం ఆ పత్రాల్లో కొన్ని వివరాల్ని వక్రీకరించగలిగేలా వాటిని కావాలనే చాలా చిన్న అక్షరాలతో లేదా అర్థమయ్యీకానట్టు రాస్తారు, దానివల్ల ఎదుటివాళ్లు అన్యాయమైపోయినా ఫర్వాలేదనుకుంటారు. ఒకసారి ఆలోచించండి, అలా ప్రవర్తించే వ్యాపారికైనా, వినియోగదారునికైనా లేదా యజమానికైనా, ఉద్యోగికైనా న్యాయవంతుడైన దేవుడు నిజంగా తెలుసంటారా? యెహోవాయే స్వయంగా ఇలా చెప్పాడు: ‘[తలిదండ్రులు లేనివారి పొలములోని] పురాతనమైన పొలిమేర రాతిని తీసివేయకుము [“జరపకు,” NW]. వారి విమోచకుడు బలవంతుడు, ఆయనే వారి పక్షమున నీతో వ్యాజ్యెమాడును.’—సామెతలు 23:10, 11; హబక్కూకు 2:9.

13. మీకా 6:10-12 ప్రకారం, పూర్వం దేవుని ప్రజల మధ్య ఎలాంటి అన్యాయాలు జరిగేవి?

13 న్యాయం గురించి మీకా 6:10-12 మరింత సమాచారాన్నిస్తోంది: “అన్యాయము చేయువారి యిండ్లలో అన్యాయముచేత సంపాదించిన సొత్తులును చిన్నదిగా చేయబడిన హేయమైన కొలయు ఉన్నవిగదా. తప్పు త్రాసును తప్పు రాళ్లుగల సంచియు ఉంచుకొని నేను పవిత్రుడను అగుదునా? . . . పట్టణస్థులు అబద్ధమాడుదురు, వారి నోటిలోని నాలుక కపటముగా మాటలాడును.” ఈ రోజుల్లో మనం ఆహారాన్ని, ఇతర పదార్థాలను కిలోలు, లీటర్ల లెక్కల్లో కొలుస్తున్నాం. అయినా మీకా చెబుతున్న విషయం స్పష్టం. ఆయన కాలంలోని వ్యాపారులు ప్రజల్ని మోసం చేశారు, తప్పుడు తూనికరాళ్లను, తప్పుడు కొలపాత్రలను వాడుతూ ప్రజలకు అన్యాయం చేశారు. మాటల్లో, వ్యాపార లావాదేవీల్లో “కపటముగా” వ్యవహరించిన వాళ్లను ‘అన్యాయం చేయువారు’ అని దేవుడు సంబోధించాడు.—ద్వితీయోపదేశకాండము 25:13-16; సామెతలు 20:10; ఆమోసు 8:5.

74వ పేజీలోని చిత్రం

14. మీకా హెచ్చరికను లక్ష్యపెడితే, ఈ రోజుల్లో ప్రజలు చేస్తున్న ఎలాంటి అన్యాయాలకు మనం పాల్పడం?

14 తప్పుడు తూనికరాళ్లు, తప్పుడు కొలపాత్రల గురించి మీకా చెప్పిన మాటలు మీ వ్యాపారానికి లేదా ఉద్యోగానికి వర్తిస్తాయా? వినియోగదారులు, క్లయింట్లు ఎన్నో రకాల మోసాలకు గురౌతుంటారు కాబట్టి మనం ఆ మాటల గురించి ఆలోచించాలి. ఉదాహరణకు, కొందరు అవినీతిపరులైన కాంట్రాక్టర్లు సిమెంటును తగిన పాళ్లలో కలపరు. కొందరు ముట్టజెప్పిన డబ్బుకు న్యాయం చేయకుండా, పైకి కనిపించని చోట్ల నాసి రకం సామగ్రి వాడి పని కానిచ్చేస్తారు. కొందరు వ్యాపారస్థులు, వాడేసిన వస్తువుల్ని సరికొత్త వస్తువుల్లా అమ్మేస్తారు. అధిక లాభాల కోసం వ్యాపారస్థులు ప్రజల్ని ఎంత తెలివిగా మోసం చేస్తారో మీకు తెలిసేవుంటుంది. మీకు కూడా అలా చేయాలనిపిస్తుందా? ఏకాంతతకు సంబంధించి ఇటీవల వెలువడిన ఓ పుస్తకం యెహోవాసాక్షుల గురించి ఇలా వ్యాఖ్యానించింది: “వాళ్లు తమ సృష్టికర్త తమను చూస్తున్నాడని నమ్ముతారు, వాళ్లలో చాలామంది చావనైనా చస్తారు కానీ దొంగతనం జోలికి వెళ్లరు.” అందులో ఇంకా ఇలా ఉంది: “పెద్ద మొత్తంలో డబ్బు వ్యవహారాలు చూసుకునే పనుల్లో యెహోవాసాక్షుల్నే పెట్టుకోవాలని ఎంతోమంది వ్యాపారస్థులు కోరుకుంటున్నారు.” ఎందుకు? ఎందుకంటే వ్యాపార లావాదేవీలు, డబ్బు వ్యవహారాలతో సహా ప్రతీ విషయంలో ‘న్యాయంగా నడుచుకోమని యెహోవా అడుగుతున్నాడు’ అన్న విషయం సాక్షులకు తెలుసు.—మీకా 6:8.

‘న్యాయాన్ని బట్టి ఏలే అధికారులు’

15, 16. మీకా కాలంలోని అధిపతులు ప్రజలతో ఎలా వ్యవహరించారు?

15 ఆయా కాలాల్లో అన్యాయం రాజ్యమేలిందని ఆ 12 పుస్తకాల్లో చూస్తాం. న్యాయం విషయంలో ఆదర్శంగా ఉండాల్సిన అధికారులే అన్యాయాలకు పాల్పడ్డారు. (నిర్గమకాండము 18:21; 23:6-8; ద్వితీయోపదేశకాండము 1:17; 16:18) మీకా తన వ్యథను వ్యక్తం చేస్తూ ఇలా అన్నాడు: “యాకోబు సంతతియొక్క ప్రధానులారా, ఇశ్రాయేలీయుల అధిపతులారా, ఆలకించుడి; న్యాయము ఎరిగియుండుట మీ ధర్మమే గదా. అయినను మేలునసహ్యించుకొని కీడుచేయనిష్టపడుదురు, నా జనుల చర్మము ఊడదీసి వారి యెముకలమీది మాంసము చీల్చుచుందురు.”—మీకా 3:1-3; యెషయా 1:17.

16 నాటి పల్లె ప్రజలు ఆ మాటలకు అవాక్కయ్యుంటారు. తన గొర్రెల్ని ఎంతో శ్రద్ధగా కాపాడుకునే ఓ కాపరి అప్పుడప్పుడు వాటి బొచ్చును కత్తిరిస్తుంటాడు. (ఆదికాండము 38:12, 13; 1 సమూయేలు 25:4) కానీ, ‘న్యాయం ఎరిగి’ ఉండాల్సిన “ఇశ్రాయేలీయుల అధిపతులు” గొర్రెల ‘చర్మాన్ని ఒలిచినంతగా, మాంసాన్ని చీల్చినంతగా, ఎముకలను విరిచినంతగా’ దేవుని మందను మోసం చేశారు. (కీర్తన 95:6) మీకా ఆ తర్వాత మరో ఉపమానం చెబుతూ, ‘లంచం పుచ్చుకొని’ తీర్పు తీరుస్తున్న “న్యాయాధిపతులు” ముళ్లకంపల్లా ఉన్నారని అన్నాడు. (మీకా 7:3, 4) ముళ్లకంపలతో నిండిన దారిలో మీరు నడుస్తున్నట్టు ఊహించుకోండి. ఆ ముళ్లు మీకు గీరుకోవచ్చు, వాటికి చిక్కుకొని మీ బట్టలు చిరగనూవచ్చు. ఇశ్రాయేలీయుల అధిపతుల వల్ల ప్రజలకు జరిగిన దానికి ఆ ఉదాహరణ సరిగ్గా సరిపోతుంది. వాళ్లు తమ సహోదరులతో న్యాయంగా వ్యవహరించాల్సిందిపోయి మోసపూరితంగా, అక్రమంగా వ్యవహరించారు.—మీకా 3:9, 11.

17. నాటి అధిపతులు ఎలా ప్రవర్తించారని జెఫన్యా 3:3 చెబుతోంది?

17 జెఫన్యా కూడా అలాంటి విషయాన్ని చెప్పాడు: “దానిమధ్య దాని అధిపతులు గర్జనచేయు సింహములు, దాని న్యాయాధిపతులు రాత్రియందు తిరుగులాడుచు తెల్లవారువరకు ఎరలో ఏమియు మిగులకుండ భక్షించు తోడేళ్లు.” (జెఫన్యా 3:3) ఒక్కసారి ఊహించుకోండి, దేవుని ప్రజల మధ్య ఉన్న అధిపతులు క్రూరమైన అడవి జంతువుల్లా నీతిమాలి ప్రవర్తిస్తున్నారు. వాళ్ల న్యాయాధిపతులు విపరీతమైన ఆకలితో, అత్యాశతో దొరికినదంతా భక్షించి, తెల్లవారేసరికి ఎముకలు తప్ప ఏమీ మిగల్చని తోడేళ్లలా ప్రవర్తిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో న్యాయం ఎలా మనగలదు? ప్రజల్ని శ్రద్ధగా చూసుకోవాల్సిన అధిపతులే క్రూరమృగాల్లా వాళ్ల మీద విరుచుకుపడ్డారు, ముళ్లకంపల్లా న్యాయాన్ని చింపేశారు.

79వ పేజీలోని చిత్రం

మీకా, జెఫన్యా ప్రవక్తల కాలంలోని అధిపతులు యెహోవాను తెలుసుకోలేదు

18. ఇశ్రాయేలులోని న్యాయాధిపతులు దేవుని ప్రజలతో ఎలా వ్యవహరించి ఉండాల్సింది?

18 దేవుని సమర్పిత జనాంగంలోని ఆ అధిపతులు దేవుణ్ణి తెలుసుకోలేదని స్పష్టమౌతోంది. ఒకవేళ వాళ్లు తెలుసుకొని ఉంటే, జెకర్యా 8:16లోని ఈ మాటలకు తగ్గట్లు ప్రవర్తించివుండేవాళ్లు: “మీరు చేయవలసిన కార్యము లేవనగా, ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాటలాడవలెను, సత్యమునుబట్టి సమాధానకరమైన న్యాయమునుబట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను.” న్యాయాన్యాయాలు నిర్ణయించడానికి ఇశ్రాయేలులోని పెద్దలు ఊరి గుమ్మం దగ్గర కలుసుకునేవాళ్లు. పైపై విషయాలను బట్టో, వ్యక్తిగత అభిప్రాయాల్ని బట్టో తొందరపడి ఓ నిర్ణయానికి వచ్చేయకుండా యెహోవా ఆలోచనకు అనుగుణంగా వాళ్లు నిర్ణయాలు తీసుకోవాలి. (ద్వితీయోపదేశకాండము 22:15) సంపన్నులకు లేదా ప్రముఖులకు పెద్దపీఠ వేస్తూ పక్షపాతం చూపించకూడదని దేవుడు వాళ్లను హెచ్చరించాడు. (లేవీయకాండము 19:15; ద్వితీయోపదేశకాండము 1:16, 17) న్యాయాధిపతులు “సమాధానకరమైన” తీర్పు తీరుస్తూ ఇరు పక్షాల మధ్య శాంతిని తిరిగి నెలకొల్పడానికి ప్రయత్నించాలి.

19, 20. (ఎ) ఆ 12 మంది ప్రవక్తల నుండి క్రైస్తవ పెద్దలు చాలా విషయాలు నేర్చుకోవచ్చని ఎందుకు చెప్పవచ్చు? (బి) పెద్దలు తమకు యెహోవా తెలుసని, ఆయన న్యాయం తెలుసని ఎలా చూపించవచ్చు?

19 అపొస్తలుడైన పౌలు క్రైస్తవులకు రాసిన ఒక పత్రికలో జెకర్యా 8:16 లోని కొంత భాగాన్ని ఉల్లేఖించాడు. (ఎఫెసీయులు 4:15, 25) దాన్నిబట్టి, న్యాయానికి సంబంధించి ఆ 12 మంది ప్రవక్తలు ఇచ్చిన హెచ్చరికలు, ఉపదేశాలు నేటి క్రైస్తవ సంఘానికి కూడా ఖచ్చితంగా వర్తిస్తాయని మనం నమ్మవచ్చు. పెద్దలు లేదా పర్యవేక్షకులు యెహోవాను తెలుసుకునే విషయంలో, ఆయన న్యాయాన్ని ప్రతిబింబించే విషయంలో తప్పకుండా ఆదర్శంగా ఉండాలి. “అధికారులు న్యాయమునుబట్టి యేలుదురు” అని వాళ్ల గురించి యెషయా 32:1 చక్కగా వర్ణిస్తోంది. అలాంటి పెద్దలకు సంబంధించిన ఏ ఆచరణాత్మక విషయాలు ఆ 12 పుస్తకాల్లోని హెచ్చరికల్లో, ఉపదేశాల్లో తెలుసుకోవచ్చు?

20 క్రైస్తవ పెద్దలు లేఖన సత్యాన్ని, యెహోవా ఆలోచనా తీరును మనసులో ఉంచుకోవాలి. వాళ్లు వ్యక్తిగత అభిప్రాయాన్ని బట్టో భావావేశాల్ని బట్టో కాదుగానీ లేఖనాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. కొన్నిసార్లు క్లిష్టమైన సమస్యలు పరిష్కరించాల్సి ఉంటుందని కూడా బైబిలు చూపిస్తోంది. అలాంటప్పుడు కాస్త ఎక్కువ సమయం కేటాయించి, నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు ప్రచురించిన బైబిలు ఆధారిత ప్రచురణల్లోని జ్ఞానయుక్తమైన ఉపదేశాల కోసం వ్యక్తిగత పరిశోధన చేయాల్సి ఉంటుంది. (నిర్గమకాండము 18:26; మత్తయి 24:45) పెద్దలు అలా కృషి చేస్తే, చెడ్డదాన్ని అసహ్యించుకొని, దేవుని దృష్టిలో ఏది మంచిదో దాన్ని ప్రేమించగలుగుతారు. అప్పుడు వాళ్లు ‘గుమ్మములలో న్యాయము స్థిరపర్చి,’ ‘సత్యాన్ని అనుసరించి తీర్పు తీర్చగలుగుతారు.’—ఆమోసు 5:15; జెకర్యా 7:9.

21. పెద్దలు ఎందుకు పక్షపాతం చూపించకూడదు? కానీ, వాళ్లు దేనివల్ల పక్షపాతం చూపించే ప్రమాదం ఉంది?

21 తీర్పు తీర్చాల్సిన బాధ్యత ఉన్న వ్యక్తికి బైబిలు పరిజ్ఞానం ఉన్నా, ఆయన కొంతమేర పక్షపాతం చూపించే ప్రమాదం ఉంది. జ్ఞానాన్ని బోధించాల్సిన యాజకులే ‘ధర్మశాస్త్రాన్ని బట్టి విమర్శించడంలో పక్షపాతం’ చూపిస్తున్నందుకు మలాకీ తీవ్రమైన విచారాన్ని వ్యక్తం చేశాడు. (మలాకీ 2:7-9) అసలు వాళ్లు ఎందుకు పక్షపాతం చూపించారు? నిజానికి, కొందరు ప్రధానులు కేవలం ‘లంచానికి తీర్పు తీర్చారని, యాజకులు కూలికి బోధించారని’ మీకా చెప్పాడు. (మీకా 3:11) ఓ సంఘపెద్ద ఆలోచన అలా కలుషితం అయ్యే ప్రమాదం ఉంది, అదెలా? ఆ పెద్ద ఎవరికైతే తీర్పుతీర్చాలో ఆ వ్యక్తి గతంలో ఆయన పట్ల చాలా ఔదార్యం చూపించి ఉండవచ్చు. లేదా భవిష్యత్తులో ఆ వ్యక్తి వల్ల తనకు ప్రయోజనాలు కలిగే అవకాశం ఉందని ఆ పెద్దకు అనిపించవచ్చు. లేదా ఆ వ్యక్తి తన రక్త సంబంధో, భార్యో అయ్యుండవచ్చు. అప్పుడు ఆ పెద్ద దేనికి ప్రాధాన్యమిస్తాడు? కుటుంబ బంధాలకా? ఆధ్యాత్మిక సూత్రాలకా? తప్పు చేసిన వ్యక్తికి తీర్పు తీర్చేటప్పుడు గానీ, సంఘంలో అదనపు సేవావకాశాలకు ఎవరైనా లేఖనాల ప్రకారం అర్హులా కాదా అని నిర్ణయించేటప్పుడు గానీ ఓ పెద్ద చూపించాల్సిన నిష్పక్షపాత వైఖరి కలుషితమయ్యే ప్రమాదం ఉంది.—1 సమూయేలు 2:22-25, 33; అపొస్తలుల కార్యములు 8:18-20; 1 పేతురు 5:2.

81వ పేజీలోని చిత్రం

‘గుమ్మముల్లో న్యాయాన్ని స్థిరపరుస్తూ’ పెద్దలు తమ వ్యవహారాలన్నిటిలో న్యాయంగా ఉంటారు

22. (ఎ) న్యాయం విషయంలో పెద్దలకు ఏ బాధ్యత ఉంది? (బి) తప్పిదస్థులతో వ్యవహరిస్తున్నప్పుడు పెద్దలు ఇంకా ఏ దైవిక లక్షణాలు చూపించాలి?

22 ఓ వ్యక్తి ఘోరమైన పాపం చేసినప్పుడు సంఘం ప్రమాదంలో పడకుండా, కలుషితం కాకుండా కాపాడేందుకు ఆధ్యాత్మిక కాపరులు చర్య తీసుకుంటారు. (అపొస్తలుల కార్యములు 20:28-30; తీతు 3:10, 11) అయితే, తప్పిదస్థుడు నిజంగా పశ్చాత్తాపపడితే, పెద్దలు “సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచి దారికి తీసుకొని రావలెను.” (గలతీయులు 6:1) పెద్దలు అలాంటి వ్యక్తితో కఠినంగా వ్యవహరించకుండా ఈ నిర్దేశాన్ని పాటిస్తారు: “సత్యము ననుసరించి తీర్పు తీర్చుడి, ఒకరియందొకరు కరుణావాత్సల్యములు కనుపరచుకొనుడి.” (జెకర్యా 7:9) ప్రాచీన ఇశ్రాయేలులోని న్యాయపరమైన వ్యాజ్యెముల గురించి యెహోవా ఇచ్చిన నియమాల్లో ఆయన న్యాయం, కనికరం కనిపిస్తాయి. నియమిత న్యాయాధిపతులకు చాలా విషయాల్లో నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ కొంతవరకు ఉండేది. పరిస్థితులను బట్టి, తప్పిదస్థుని వైఖరిని బట్టి కనికరం చూపించే అవకాశం వాళ్లకు ఉండేది. అదేవిధంగా, “సత్యముననుసరించి” తీర్పు తీర్చడానికి, “కరుణావాత్సల్యములు” చూపించడానికి క్రైస్తవ పర్యవేక్షకులు కృషి చేయాలి. అలా పెద్దలు తాము యెహోవాను తెలుసుకున్నామని చూపిస్తారు.

23, 24. (ఎ) “సమాధానకరమైన న్యాయము” నెలకొనడానికి పెద్దలు ఎలా తోడ్పడవచ్చు? (బి) న్యాయానికి సంబంధించి ఏ విషయాన్ని అర్థంచేసుకోవడానికి ఆ 12 పుస్తకాలు సహాయం చేశాయి?

23 జెకర్యా 8:16లోని మాటల్ని గుర్తుచేసుకోండి: “సత్యమునుబట్టి సమాధానకరమైన న్యాయమునుబట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలెను.” ఏ లక్ష్యంతో తీర్పు తీర్చాలి? ‘సమాధానాన్ని’ నెలకొల్పే లక్ష్యంతో తీర్పుతీర్చాలి. అపొస్తలుల కాలంలో కూడా కొందరు క్రైస్తవుల మధ్య అభిప్రాయభేదాలు, తగాదాలు ఉండేవి. యువొదియ, సుంటుకేలకు పౌలు సహాయం చేసినట్లు, నేటి పెద్దలు కూడా సంఘంలోని సహోదరసహోదరీలకు సహాయం చేయాల్సిరావచ్చు. (ఫిలిప్పీయులు 4:2, 3) ఇరు పక్షాల మధ్య మళ్లీ శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తూ పెద్దలు “సమాధానకరమైన న్యాయము” తీర్చడానికి పట్టుదలగా కృషి చేయాలి. వాళ్లు ఇచ్చే లేఖన ఉపదేశం, అది ఇస్తున్నప్పుడు వాళ్లు చూపించే వైఖరి సంఘంలో శాంతి నెలకొనేందుకు, దేవునితో సమాధానపడేందుకు తోడ్పడాలి. అలా వాళ్లు తమకు నిజంగా యెహోవా తెలుసని, ఆయన న్యాయం కూడా తెలుసని చూపిస్తారు.

24 ఈ అధ్యాయంలో మనం పరిశీలించిన రెండు రంగాలను బట్టి చూస్తే, న్యాయం గురించి ఆ 12 మంది ప్రవక్తలు ఇచ్చిన సలహాల్ని మన రోజువారీ జీవితంలో పాటించడం ప్రాముఖ్యమని తెలుస్తోంది. మనమూ, మన చుట్టూ ఉన్నవాళ్లూ న్యాయంగా నడుచుకోవడం నిజంగా ఓ ఆశీర్వాదం!

మీరు ఏమి నేర్చుకున్నారు?

  • న్యాయానికి సంబంధించి మీ వ్యవహారాలు ఎలా ఉన్నాయి?—కీర్తన 37:28; హోషేయ 2:19, 20.

  • మీరు ఎందుకు న్యాయాన్ని అలవర్చుకోవాలి? ఎందుకు న్యాయంగా నడుచుకుంటూ ఉండాలి?—ఆమోసు 5:6, 7; జెఫన్యా 2:3.

  • వ్యాపార లావాదేవీల్లో, డబ్బు వ్యవహారాల్లో మీరు న్యాయంగా ఎలా ఉండవచ్చు?—హోషేయ 5:10; 12:6, 7; ఆమోసు 8:5; మీకా 2:1, 2; మలాకీ 3:5.

నేడు ఎలా వర్తిస్తాయి?

  • క్రైస్తవ పెద్దలు ఎందుకు పట్టుదలగా న్యాయాన్ని కనబరుస్తూ ఉండాలి?—మీకా 3:9.

  • పెద్దలకు, మరితరులకు జెకర్యా 8:16 ఏ నిర్దేశాన్నిస్తోంది?

  • పక్షపాతంతో కూడిన ఎలాంటి పనులకు మనం దూరంగా ఉండాలి? ఎందుకు?—మలాకీ 2:7-9; 1 తిమోతి 5:21, 22.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి