అధ్యాయం 3
“యెహోవా పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు”
1, 2. దర్శనంలో యెషయా ప్రవక్తకు ఏం కనిపించింది? యెహోవా గురించి అది మనకు ఏం నేర్పిస్తుంది?
యెహోవా యెషయాకు ఒక దర్శనం చూపించినప్పుడు ఆయన భయంలో, ఆశ్చర్యంలో మునిగిపోయాడు. అది తన కళ్ల ముందే నిజంగా జరుగుతున్నట్లు అనిపించింది! అందుకే, ఉన్నతమైన సింహాసనం మీద యెహోవా కూర్చొని ఉండడం “నేను చూశాను” అని ఆయన చెప్పాడు. యెహోవా చొక్కా అంచులతో యెరూషలేములోని పెద్ద ఆలయం నిండిపోయింది.—యెషయా 6:1, 2.
2 యెషయా ఇంకో విషయాన్ని బట్టి కూడా ఎంతో ఆశ్చర్యపోయాడు. సెరాపులు పాడుతున్న పాటను ఆయన విన్నాడు. సెరాపులు అంటే దేవదూతల్లో చాలా ముఖ్యమైనవాళ్లు. వాళ్లు ఆ పాటను ఎంత గట్టిగా పాడుతున్నారంటే, ఆ శబ్దానికి ఆలయ పునాదులు కూడా దద్దరిల్లిపోయాయి. వాళ్లు తేలికైన పదాలే వాడినా, వాటి వెనక గొప్ప అర్థం ఉంది. వాళ్లు, “సైన్యాలకు అధిపతైన యెహోవా పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. భూమంతా ఆయన మహిమతో నిండిపోయింది” అని పాడుతున్నారు. (యెషయా 6:3, 4) అలా మూడుసార్లు “పవిత్రుడు” అని చెప్పడం వల్ల, ఆ పదం ఎంత ముఖ్యమైనదో తెలుస్తుంది. అది యెహోవాకు సరిగ్గా సరిపోతుంది కూడా. ఎందుకంటే, యెహోవా అత్యున్నత స్థాయిలో పవిత్రుడు. (ప్రకటన 4:8) బైబిలు మొత్తంలో, యెహోవా పవిత్రత గురించి చాలాసార్లు చదువుతాం. వందలకొద్ది లేఖనాలు “పవిత్రుడు,” “పవిత్రమైన” అనే పదాల్ని ఆయన పేరుతో కలిపి చెప్పాయి.
3. చాలామంది దేవునికి దగ్గరయ్యే బదులు ఎందుకు దూరమౌతున్నారు?
3 దాన్నిబట్టి మనకు ఒక ముఖ్యమైన విషయం అర్థమౌతుంది. అదేంటంటే, యెహోవా పవిత్రుడు అని మనం తెలుసుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ, ఈ రోజుల్లో చాలామంది ఆ మాట వినగానే ఆమడ దూరం పారిపోతున్నారు. ఎందుకంటే, పవిత్రులు అనగానే అతి నీతిమంతులు, భక్తి ఉన్నట్టు నటిస్తూ అన్నీ నిష్ఠగా చేసేవాళ్లు అని కొంతమంది అపార్థం చేసుకుంటున్నారు. ఇంకొంతమంది వాళ్లను వాళ్లు తక్కువ అనుకుంటూ, దేవుడు ఎంతో పవిత్రుడు కాబట్టి ఆయనకు దగ్గర కాలేమని, ఆ అర్హత కూడా తమకు లేదని వెనక్కి జరుగుతున్నారు. అలా చాలామంది, దేవునికున్న పవిత్రతను బట్టి ఆయనకు దగ్గరయ్యే బదులు దూరమౌతున్నారు. అది చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఎందుకంటే, యెహోవా పవిత్రత ఒక అయస్కాంతంలా మనల్ని ఆయనవైపు లాగుతుందే గానీ, వెనక్కి నెట్టేయదు. ఎందుకు? అది తెలుసుకునే ముందు, అసలు పవిత్రత అంటే ఏంటో చూద్దాం.
పవిత్రత అంటే ఏంటి?
4, 5. (ఎ) “పవిత్రత” అంటే ఏంటి, ఏం కాదు? (బి) ఏ రెండు ముఖ్యమైన విధాల్లో యెహోవా “వేరుగా” ఉన్నాడు?
4 దేవుడు పవిత్రుడంటే ఆయన అతిశుభ్రంగా, గర్వంగా, అంటీముట్టనట్టు, అందర్నీ చులకనగా చూస్తాడు అని కాదు. నిజానికి యెహోవాకు అలాంటి లక్షణాలంటేనే కంపరం. (సామెతలు 16:5; యాకోబు 4:6) మరి “పవిత్రత” అనే పదానికి అర్థం ఏంటి? హీబ్రూలో ఆ పదానికి, “వేరుగా పెట్టడం” లేదా “ప్రత్యేకించడం” అని అర్థం. దేవుని సేవ కోసం దేన్నైనా లేదా ఎవరినైనా వేరుగా పెట్టడాన్ని అది సూచిస్తుంది. పవిత్రతలో శుభ్రంగా, స్వచ్ఛంగా ఉండడం కూడా ఉంది. యెహోవా పవిత్రుడు అన్నప్పుడు దాని అర్థమేంటి? ఆయన అపరిపూర్ణ మనుషులకు దూరంగా, “వేరుగా” ఉంటాడనా?
5 కానే కాదు. “ఇశ్రాయేలు పవిత్ర దేవుడు” అయిన యెహోవా, పాపులైన తన ప్రజల మధ్య నివసిస్తానని చెప్పాడు. (యెషయా 12:6; హోషేయ 11:9) కాబట్టి, ఆయన పవిత్రుడైనంత మాత్రాన మనుషులకు దూరంగా ఉంటాడని కాదు. మరి ఆయన “వేరుగా” ఎలా ఉంటాడు? రెండు ముఖ్యమైన విధాలుగా అలా ఉంటాడు. ఒకటి, ఈ సృష్టి అంతటిలో ఆయనే మహోన్నతుడు కాబట్టి ఆయన వేరుగా లేదా ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయన పూర్తిస్థాయిలో, వందకు వంద శాతం శుభ్రంగా, స్వచ్ఛంగా ఉంటాడు. (కీర్తన 40:5; 83:18) రెండు, యెహోవాలో ఏ మూలా పాపం అనేదే లేదు. అది నిజంగా చాలా మంచి విషయం. ఎందుకు?
6. యెహోవాలో రవ్వంత కూడా పాపం లేదని తెలుసుకోవడం మనకు ఎందుకు ధైర్యాన్ని ఇస్తుంది?
6 ఈ లోకంలో, నిజమైన పవిత్రత కోసం భూతద్దం పెట్టి వెతికినా అది దొరకడం కష్టమే. ఎందుకంటే మనుషులందరూ పాపం వల్ల, అపరిపూర్ణత వల్ల కలుషితమైపోయారు. అందరం మనలో ఉన్న పాపంతో ఎప్పుడూ పోరాడుతూనే ఉండాలి. కాస్త ఏమరుపాటుగా ఉన్నా, మనం పాపంలో పడిపోయే అవకాశం ఉంది. (రోమీయులు 7:15-25; 1 కొరింథీయులు 10:12) కానీ యెహోవాకు అలా పోరాడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయనలో రవ్వంత కూడా పాపం లేదు, ఆయన కలలో కూడా పాపం చేయడు. యెహోవా ఒక మంచి తండ్రి అని, ఆయన మీద పూర్తి నమ్మకం ఉంచవచ్చని ఇది మనకు భరోసా ఇస్తుంది. పాపులైన మనుషుల్లో చాలామంది తండ్రులు అవినీతిగా మారవచ్చు, తప్పుడు పనులు చేయవచ్చు, లేదా పిల్లల్ని హింసించవచ్చు. కానీ యెహోవా ఎప్పుడూ అలా మారడు. ఆయన పవిత్రత వల్ల, ఆయన అలా ప్రవర్తించడం అసంభవం. కొన్ని సందర్భాల్లో యెహోవా తన పవిత్రత మీదే ఒట్టేసి ప్రమాణాలు చేశాడు. ఆయన్ని నమ్మడానికి ఇంక అంతకన్నా ఏ కారణం కావాలి? (ఆమోసు 4:2) అది నిజంగా మనలో ఎంత ధైర్యాన్ని కలిగిస్తుందో కదా!
7. పవిత్రత అనేది యెహోవా స్వభావంలో సహజంగానే ఉంటుందని ఎందుకు చెప్పవచ్చు?
7 పవిత్రత అనేది యెహోవా స్వభావంలో సహజంగానే ఉంటుంది. దాని అర్థమేంటి? ఉదాహరణకు “మనిషి,” “అపరిపూర్ణత” అనే రెండు పదాల్ని తీసుకుందాం. ఒకదాని గురించి చెప్పకుండా ఇంకోదాని గురించి వివరించలేం. ఎందుకంటే, అపరిపూర్ణత మనిషి నరనరాల్లో ఇంకిపోయింది, అతను చేసే ప్రతీ పనిలో అది కనిపిస్తుంది. ఇప్పుడు “యెహోవా,” “పవిత్రత” అనే రెండు పదాల్ని తీసుకుందాం. యెహోవాలో అణువణువూ పవిత్రత ఉంటుంది. ఆయన చేసే ప్రతీ పనిలో స్వచ్ఛత, శుభ్రత, నీతి కనిపిస్తాయి. “పవిత్రత” అనే ముఖ్యమైన లక్షణం గురించి తెలుసుకోకుండా, యెహోవా గురించి తెలుసుకోవడం అసాధ్యం.
“పవిత్రత యెహోవాకు చెందుతుంది”
8, 9. యెహోవా సహాయంతో అపరిపూర్ణులైన మనుషులు కొంతవరకు పవిత్రంగా ఉండగలరని ఎలా చెప్పవచ్చు?
8 యెహోవా పవిత్రతకు మారు పేరు, కాబట్టి పవిత్రతకు ఆయనే మూలం అని చెప్పవచ్చు. ఈ అమూల్యమైన లక్షణాన్ని యెహోవా స్వార్థంగా తన దగ్గరే దాచుకోడు గానీ అందరికీ ఇస్తాడు. అది కూడా ఎంత కావాలంటే అంత! మండుతున్న పొద దగ్గర యెహోవా ఒక దేవదూత ద్వారా మోషేతో మాట్లాడినప్పుడు, ఆ స్థలం కూడా పవిత్రంగా మారిపోయింది! యెహోవా పవిత్రతే దానికి కారణం.—నిర్గమకాండం 3:5.
9 యెహోవా సహాయంతో అపరిపూర్ణులైన మనుషులు పవిత్రంగా ఉండగలరా? మరీ యెహోవా అంత కాకపోయినా కొంతవరకు ఉండవచ్చు. యెహోవా తన ప్రజలైన ఇశ్రాయేలీయులకు, “పవిత్ర జనంగా” తయారయ్యే అవకాశాన్ని ఇచ్చాడు. (నిర్గమకాండం 19:6) పవిత్రంగా, శుభ్రంగా, స్వచ్ఛంగా తనను ఎలా ఆరాధించవచ్చో ఆయన వాళ్లకు నేర్పించాడు. అందుకే ధర్మశాస్త్రం పవిత్రత గురించి చాలాసార్లు చెప్పడం మనం చూస్తాం. నిజానికి, ప్రధానయాజకుడు కూడా తన తలపాగా ముందు భాగంలో ఒక బంగారు రేకును పెట్టుకునేవాడు. అది వెలుతురులో ధగధగా మెరుస్తూ అందరికీ కనిపించేది. దానిమీద, “పవిత్రత యెహోవాకు చెందుతుంది” అనే మాటలు చెక్కి ఉండేవి. (నిర్గమకాండం 28:36) కాబట్టి ఇశ్రాయేలీయులు యెహోవాను ఆరాధించే విధానంలో, వాళ్ల జీవన విధానంలో పరిశుభ్రత, స్వచ్ఛత కొట్టొచ్చినట్టు కనిపించేవి. యెహోవా వాళ్లకు ఇలా చెప్పాడు: “మీరు పవిత్రులుగా ఉండాలి, ఎందుకంటే మీ దేవుడైన యెహోవానైన నేను పవిత్రుణ్ణి.” (లేవీయకాండం 19:2) ఇశ్రాయేలీయులు దేవుని నిర్దేశాన్ని పాటించడానికి గట్టిగా ప్రయత్నించినంత కాలం, వాళ్లు అపరిపూర్ణులైనా సరే యెహోవా దృష్టిలో పవిత్రులే.
10. పవిత్రత విషయానికొస్తే ఇశ్రాయేలీయులకు, వాళ్ల చుట్టుపక్కల దేశాలకు ఏ తేడా ఉండేది?
10 పవిత్రంగా ఉండమని యెహోవా నొక్కిచెప్పడం వల్లే ఇశ్రాయేలీయుల ఆరాధన, జీవన విధానం చుట్టుపక్కల దేశాలకు వేరుగా ఉండేది. ఎందుకంటే, ఆ ప్రజలు పూజించే దేవుళ్లు ఒక పచ్చి అబద్ధం, వాళ్లు అసలు ఉనికిలోనే లేరు. ఆ దేవుళ్ల రూపాలు కూడా చాలా భయంకరంగా, అత్యాశతో, విచ్చలవిడిగా ఉన్నట్టు కనిపిస్తాయి. ప్రతీ విషయంలో వాళ్లు అపవిత్రంగా ఉండేవాళ్లు. అలాంటి దేవుళ్లను పూజించే ప్రజలు కూడా అపవిత్రంగానే తయారయ్యేవాళ్లు. అందుకే ఆ ప్రజలకు, కలుషితమైన వాళ్ల అపవిత్ర ఆచారాలకు దూరంగా ఉండమని యెహోవా ఇశ్రాయేలీయుల్ని హెచ్చరించాడు.—లేవీయకాండం 18:24-28; 1 రాజులు 11:1, 2.
11. యెహోవా సంస్థలోని పరలోక భాగానికి ఉన్న పవిత్రతను (ఎ) దేవదూతలు, (బి) సెరాపులు, (సి) యేసు ఎలా ప్రతిబింబిస్తున్నారు?
11 ఇశ్రాయేలీయులు యెహోవా పవిత్రతను చూపించడానికి గట్టిగా ప్రయత్నించారు. కానీ వాళ్లు ఎంత ప్రయత్నించినా, యెహోవా సంస్థలోని పరలోక భాగానికి ఉన్న పవిత్రతను మసకమసకగా మాత్రమే ప్రతిబింబించగలరు. దేవుణ్ణి నమ్మకంగా సేవిస్తున్న లక్షలమంది పరలోక ప్రాణుల్ని “పవిత్ర దూతలు” అని బైబిలు పిలుస్తుంది. (ద్వితీయోపదేశకాండం 33:2; యూదా 14) వాళ్లు దేవుని పవిత్రతను పూర్తిస్థాయిలో ప్రతిబింబిస్తారు. దర్శనంలో యెషయా చూసిన సెరాపులు గుర్తున్నారా? వాళ్లు పాడే పాట, తాము చేస్తున్న ముఖ్యమైన పని గురించి చెప్తుంది. వాళ్లు దేవుని పవిత్రతను విశ్వమంతటా చాటి చెప్తున్నారు. అయితే, ఒక పరలోక ప్రాణి అందరికన్నా ఉన్నతమైన స్థాయిలో యెహోవాకున్న పవిత్రతను ప్రతిబింబించాడు. ఆయనే, దేవుని ఒక్కగానొక్క కుమారుడైన యేసుక్రీస్తు. ఆయన అంత చక్కగా దేవుని పవిత్రతను ప్రతిబింబించాడు కాబట్టే, బైబిలు ఆయన్ని “దేవుని పవిత్రుడు” అని పిలుస్తుంది.—యోహాను 6:68, 69.
పవిత్రమైన పేరు, పవిత్రశక్తి
12, 13. (ఎ) దేవుని పేరు పవిత్రమైనదని చెప్పడం ఎందుకు సరైంది? (బి) దేవుని పేరు మీద పడిన బురద అంతటిని కడిగేయడం ఎందుకు అవసరం?
12 మరి దేవుని పేరు సంగతేంటి? మనం 1వ అధ్యాయంలో చూసినట్లు, ఆయన పేరు వట్టి బిరుదు లాంటిది కాదు. అది యెహోవాను, ఆయనకున్న లక్షణాలన్నిటినీ కలిపి సూచిస్తుంది. అందుకే, దేవునిది “పవిత్రమైన పేరు” అని బైబిలు చెప్తుంది. (యెషయా 57:15) దేవుని పేరును దూషిస్తే మరణశిక్ష పడుతుందని ధర్మశాస్త్రం చెప్పింది. (లేవీయకాండం 24:16) అలాగే, యేసు ప్రార్థనలో అడగాల్సిన ముఖ్యమైన విషయం గురించి చెప్తూ ఇలా అన్నాడు: “పరలోకంలో ఉన్న మా తండ్రీ, నీ పేరు పవిత్రపర్చబడాలి.” (మత్తయి 6:9) దేన్నైనా పవిత్రపర్చడం అంటే దాన్ని ప్రత్యేకపర్చడం, గౌరవించడం, ఉన్నతంగా చూడడం. దేవుని పేరు ఇప్పటికే పవిత్రమైనది, మళ్లీ అది పవిత్రపర్చబడడం ఏంటి?
13 దేవుని శత్రువులు ఎన్నో అబద్ధాలు, అభాండాలు వేసి ఆయన పేరు మీద బురద చల్లారు. ఏదెను తోటలో సాతాను యెహోవా మీద లేనిపోనివి చెప్పి, ఆయన చెడ్డ పరిపాలకుడు అన్నట్టు మాట్లాడాడు. (ఆదికాండం 3:1-5) అప్పటి నుండి, ఈ అపవిత్రమైన లోకానికి పరిపాలకుడైన సాతాను దేవుని గురించి అడ్డు-అదుపు లేకుండా అబద్ధాలు పుట్టిస్తూనే ఉన్నాడు. (యోహాను 8:44; 12:31; ప్రకటన 12:9) మతాలు కూడా దేవుడు క్రూరుడని, ఒక నియంత అని, మనల్ని పట్టించుకోడని చెప్తున్నాయి. రక్తం చిందించే యుద్ధాలకు కూడా దేవుని మద్దతు ఉందని వాళ్లు అంటున్నారు. అలాగే, దేవుడు అద్భుతంగా తయారుచేసిన సృష్టంతా, పరిణామం వల్ల దానంతట అదే వచ్చిందని చెప్తున్నారు. నిజమే, యెహోవా పేరు మీద చాలా దారుణంగా బురద చల్లుతున్నారు. అది పవిత్రపర్చబడాలి, దానికున్న మహిమ తిరిగి రావాలి. తన కుమారుడైన యేసు పరిపాలించే రాజ్యం ద్వారా, యెహోవా త్వరలోనే ఆ బురద అంతటినీ శాశ్వతంగా కడిగేయబోతున్నాడు. ఆ రోజు కోసం మనం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం! దాని కోసం మనం ఏం చేయాలన్నా సంతోషంగా చేస్తాం.
14. దేవుని శక్తిని పవిత్రమైనది అని చెప్పడం ఎందుకు సరైనది? పవిత్రశక్తిని దూషించడం ఎందుకు ఒక క్షమించరాని పాపం?
14 యెహోవాలాగే ఎప్పుడూ పవిత్రంగా ఉండేది, ఆయన చురుకైన శక్తి. దాన్ని పవిత్రశక్తి అంటారు. అది యెహోవా నుండి వస్తుంది. (ఆదికాండం 1:2) ఆ శక్తికి మించింది ఏదీ లేదు, యెహోవా దాన్ని ఉపయోగించే ఏ పనైనా చేస్తాడు. ఆయన చేసే ప్రతీ పని పవిత్రంగా, శుభ్రంగా, స్వచ్ఛంగా ఉంటుంది కాబట్టి ఆ శక్తిని పవిత్రశక్తి అనడం సరైనదే. (లూకా 11:13; రోమీయులు 1:4) పవిత్రశక్తిని దూషించడం ఒక క్షమించరాని పాపం. ఎందుకంటే, అది కావాలని యెహోవా ఇష్టానికి వ్యతిరేకంగా పని చేస్తున్నట్టు అవుతుంది.—మార్కు 3:29.
యెహోవా పవిత్రత మనల్ని ఆకట్టుకుంటుంది
15. యెహోవా పవిత్రుడు అని తెలుసుకున్నప్పుడు మనకు ఎలా అనిపించాలి?
15 యెహోవా పవిత్రత గురించి ఆలోచించినప్పుడు మనలో ఆశ్చర్యం, భయం కలుగుతాయని బైబిలు ఎందుకు చెప్తుందో ఈపాటికే మనకు అర్థమై ఉంటుంది. ఉదాహరణకు, కీర్తన 99:3 ఇలా చెప్తుంది: “వాళ్లు నీ గొప్ప పేరును స్తుతించాలి, ఎందుకంటే అది సంభ్రమాశ్చర్యాలు పుట్టిస్తుంది, పవిత్రమైనది.” ఇక్కడున్న సంభ్రమాశ్చర్యాలు అంటే దేవుని మీద, ఆయన పేరు మీద మనకున్న ప్రగాఢ భక్తితో, గౌరవంతో వచ్చే భయం. అలా అనిపించడం సరైనదే. ఎందుకంటే, మనందరి కన్నా యెహోవా చాలా ఉన్నతుడు, అలాగే పూర్తిస్థాయిలో పవిత్రంగా, శుభ్రంగా ఉంటాడు. దానివల్ల మనం ఆయనకు దూరంగా జరిగిపోం కానీ, ఇంకా ముందుకొచ్చి ఆయనకు దగ్గరౌతాం. ఎందుకు?
16. (ఎ) పవిత్రంగా ఉండేవి అందంగా కూడా ఉంటాయని ఎలా చెప్పవచ్చు? ఉదాహరణ చెప్పండి. (బి) మన పవిత్ర దేవుని మహిమను లేదా అందాన్ని బైబిలు ఎలా వర్ణిస్తుంది?
16 పవిత్రంగా ఉండేవి అందంగా కూడా ఉంటాయని బైబిలు చెప్తుంది. యెషయా 63:15 పరలోకాన్ని “పవిత్రమైన, మహిమాన్వితమైన [లేదా, “సుందరమైన,” అధస్సూచి] ఉన్నత నివాసం” అని వర్ణిస్తుంది. మహిమాన్వితమైన వాటిని లేదా సుందరమైన వాటిని మనం చాలా ఇష్టపడతాం. ఉదాహరణకు 33వ పేజీలో ఉన్న చిత్రాన్ని చూడండి. అది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఎందుకు నచ్చిందంటే మీరేం చెప్తారు? అక్కడున్న నీళ్లు తెల్లగా, స్వచ్ఛంగా ఉన్నాయి. ఇంకా ఆకాశం నీలి రంగులో మెరుస్తూ కనిపిస్తుందంటే, గాలి కూడా శుభ్రంగానే ఉండి ఉంటుంది. ఇప్పుడు అదే చిత్రంలో ఆ నీళ్ల దగ్గర చెత్తాచెదారం పేరుకుపోయి, చెట్లు-రాళ్ల మీద పిచ్చిపిచ్చి గీతలు-బొమ్మలు ఉండి, గాలి కూడా పొగతో కలుషితమైపోతే ఎలా ఉంటుంది? మనకు చూడబుద్ధి అవ్వదు, వెంటనే చూపు తిప్పేసుకుంటాం కదా. శుభ్రంగా, స్వచ్ఛంగా, మెరుస్తూ ఉన్నవి మన కళ్లకు అందంగా కనిపిస్తాయి. యెహోవా పవిత్రతను వర్ణించడానికి అవే పదాల్ని ఉపయోగించవచ్చు. దర్శనాల్లో యెహోవాను ఎలా వర్ణిస్తున్నారో చదివినప్పుడు నిజంగా మన కళ్లు చెదిరిపోతాయి! ఆయన కాంతితో ప్రకాశిస్తూ, రత్నాల్లా తళుక్కుమంటూ, అగ్నిలా వెలిగిపోతూ, స్వచ్ఛమైన వెండి-బంగారాల్లా మెరుస్తున్నట్టు మన పవిత్ర దేవుని మహిమను లేదా అందాన్ని బైబిలు వర్ణిస్తుంది.—యెహెజ్కేలు 1:25-28; ప్రకటన 4:2, 3.
అందం మనల్ని ఆకట్టుకున్నట్టే, పవిత్రత కూడా ఆకట్టుకుంటుంది
17, 18. (ఎ) దర్శనం చూసినప్పుడు మొదట యెషయాకు ఎలా అనిపించింది? (బి) యెహోవా సెరాపు ద్వారా యెషయాను ఎలా ఓదార్చాడు? సెరాపు చేసిన పని వెనక అర్థం ఏంటి?
17 అంత పవిత్రుడైన యెహోవాతో పోల్చుకుని మనం తక్కువ అని అనుకోవాలా? అవును, అనుకోవాలి. ఎందుకంటే, యెహోవా కన్నా మనం ఎంతో తక్కువ. ఆయనెక్కడ? మనమెక్కడ? మరి దీన్నిబట్టి మనం ఆయనకు దూరమవ్వాలా? సెరాపులు యెహోవా పవిత్రత గురించి పాడుతున్నప్పుడు యెషయా విని ఏమన్నాడో గమనించండి: “అయ్యో, నాకు శ్రమ! నేను చచ్చినవాడితో సమానం. ఎందుకంటే, అపవిత్రమైన పెదాలుగల నేను, అపవిత్రమైన పెదాలుగల ప్రజల మధ్య నివసిస్తున్న నేను రాజూ సైన్యాలకు అధిపతీ అయిన యెహోవాను కళ్లారా చూశాను!” (యెషయా 6:5) అవును, యెహోవాకున్న అపారమైన పవిత్రతను చూసి పాపంలో, అపరిపూర్ణతలో పుట్టిన తాను ఎంత తక్కువవాడో యెషయా గుర్తుచేసుకున్నాడు. ఆయన బాధలో మునిగిపోయాడు, కానీ యెహోవా ఆయన్ని అలాగే వదిలేయలేదు.
18 వెంటనే ఒక సెరాపు యెషయాను ఓదార్చాడు. ఎలా? ఆ దూత బలిపీఠం దగ్గరికి వెళ్లి, ఒక నిప్పుకణిక తీసుకుని, దాన్ని యెషయా పెదాలకు అంటించాడు. ‘ఆయనకు చాలా నొప్పి వచ్చివుంటుంది కదా, అది ఓదార్చినట్టు ఎలా అవుతుంది?’ అని మనకు అనిపించవచ్చు. కానీ గుర్తుంచుకోండి, అది ఒక దర్శనం మాత్రమే. దాని వెనక చాలా అర్థం దాగివుంది. యెషయా ఒక నమ్మకమైన యూదుడు కాబట్టి, ఆలయంలో పాపాల్ని ప్రాయశ్చిత్తం చేయడానికి బలిపీఠం మీద రోజూ బలులు అర్పిస్తారని ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఆయన అపరిపూర్ణుడైనా, “అపవిత్రమైన పెదాలు” గల వాడైనా, యెహోవా ముందు పవిత్రంగా నిలబడగలడు అని ఆ సెరాపు చేసిన పని గుర్తుచేసింది.a మనం అపరిపూర్ణులం, పాపులమే అయినా యెహోవా మనల్ని పవిత్రులుగా చూడాలని కోరుకుంటున్నాడు.—యెషయా 6:6, 7.
19. మనం అపరిపూర్ణులమే అయినా పవిత్రులుగా ఉండడం ఎలా సాధ్యం?
19 ఇప్పుడు కూడా యెహోవా మనకు అదే చేస్తున్నాడు. యెరూషలేములోని బలిపీఠం మీద అర్పించిన బలులన్నీ, భవిష్యత్తులో అర్పించబోయే ఒక పెద్ద బలికి నీడగా ఉన్నాయి. అదే, క్రీస్తు శకం 33 లో యేసుక్రీస్తు అర్పించిన పరిపూర్ణ బలి. (హెబ్రీయులు 9:11-14) మనం నిజంగా మన పాపాల విషయంలో పశ్చాత్తాపపడి, తప్పు దిద్దుకుని, ఆ బలి మీద విశ్వాసం ఉంచితే మన పాపాలు క్షమించబడతాయి. (1 యోహాను 2:2) మనం కూడా యెహోవా ముందు పవిత్రంగా ఉండగలుగుతాం. అందుకే అపొస్తలుడైన పేతురు మనకు ఇలా గుర్తుచేస్తున్నాడు: “లేఖనాల్లో ఇలా రాసివుంది: ‘మీరు పవిత్రులుగా ఉండాలి, ఎందుకంటే నేను పవిత్రుణ్ణి.’” (1 పేతురు 1:16) గమనించండి, అక్కడ ‘మీరు నా అంత పవిత్రంగా ఉండాలి’ అని యెహోవా చెప్పట్లేదు. మనం చేయలేనిది ఆయన ఎప్పుడూ అడగడు. (కీర్తన 103:13, 14) దానికి బదులు, ఆయన పవిత్రుడు కాబట్టి మనల్ని కూడా పవిత్రంగా ఉండమంటున్నాడు. మనం అపరిపూర్ణులమైనా, “దేవునికి ప్రియమైన పిల్లల్లా” ఆయన్ని అనుకరించడానికి చేయగలిగినదంతా చేస్తాం. (ఎఫెసీయులు 5:1) మనం రాత్రికిరాత్రే పవిత్రంగా మారిపోలేం. బదులుగా “పూర్తిస్థాయిలో పవిత్రులమవ్వడానికి” ప్రతీరోజు కృషిచేస్తాం.—2 కొరింథీయులు 7:1.
20. (ఎ) దేవుని ముందు మనం పవిత్రంగా ఉండవచ్చని అర్థం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? (బి) తన పాపం ప్రాయశ్చిత్తం అయిందని తెలుసుకున్నప్పుడు యెషయాకు ఎలా అనిపించింది?
20 నీతి, స్వచ్ఛత అంటే యెహోవాకు ఇష్టం. పాపాన్ని ఆయన అసహ్యించుకుంటాడు. (హబక్కూకు 1:13) కానీ ఆయన మనల్ని అసహ్యించుకోడు. మనం పాపాన్ని యెహోవా చూసినట్టే చూస్తే, అంటే చెడును ద్వేషిస్తూ, మంచిని ప్రేమిస్తూ, పరిపూర్ణుడైన యేసు అడుగుజాడల్లో నడిస్తే ఆయన మన పాపాల్ని క్షమిస్తాడు. (ఆమోసు 5:15; 1 పేతురు 2:21) పవిత్రుడైన దేవుని దృష్టిలో మనం కూడా పవిత్రంగా ఉండవచ్చు అని అర్థం చేసుకున్నప్పుడు, ఎంతో ఊరటను పొందుతాం. యెషయా యెహోవా పవిత్రత గురించి విన్నప్పుడు తను ఎంత అపవిత్రుడో గుర్తొచ్చి, “అయ్యో, నాకు శ్రమ!” అని బాధపడ్డాడు. కానీ, తన పాపం ప్రాయశ్చిత్తం అయిందని అర్థం చేసుకున్నప్పుడు ఆయన ఆలోచనా విధానం మారిపోయింది. యెహోవా ఒక పని కోసం ఎవర్ని పంపాలి అని అడిగినప్పుడు, అదేంటో తెలియకపోయినా, “నేనున్నాను! నన్ను పంపు!” అని యెషయా ముందుకొచ్చాడు.—యెషయా 6:5-8.
21. పవిత్రత అనే లక్షణాన్ని మనం కూడా పెంచుకోగలం అని ఎందుకు చెప్పవచ్చు?
21 మనం పవిత్ర దేవుని స్వరూపంలో తయారు చేయబడ్డాం కాబట్టి ఆయనకున్న లక్షణాల్ని మనం పెంచుకోగలం, ఆయనకు దగ్గరవ్వగలం. (ఆదికాండం 1:26) పవిత్రంగా ఉండే సామర్థ్యం మన అందరిలోనూ ఉంది. పవిత్రంగా ఉండడానికి మనం కృషి చేస్తున్నప్పుడు, యెహోవా కూడా మనకు సహాయం చేస్తాడు. అలా మన పవిత్ర దేవునికి ఇంకా దగ్గరౌతాం. తర్వాతి అధ్యాయాల్లో యెహోవాకున్న లక్షణాల్ని పరిశీలిస్తుండగా, ఆయనకు దగ్గరవ్వడానికి మనకు బోలెడన్ని కారణాలు దొరుకుతాయి!
a “అపవిత్రమైన పెదాలు” అనే మాటను ఉపయోగించడం సరైనదే. ఎందుకంటే, బైబిల్లో చాలాసార్లు పెదాలు మాటల్ని గానీ, భాషను గానీ సూచిస్తాయి. అపరిపూర్ణ మనుషులందరూ ఎక్కువగా పాపం చేసేది నోటితోనే.—సామెతలు 10:19; యాకోబు 3:2, 6.