51
ఖచ్చితమైన సమయపాలన, ఆయా భాగాలకు సరిపడేంత సమయం ఇవ్వడం
మీ బోధనలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సినప్పటికీ మీ ప్రసంగాల్లో సమయానికి కూడా అవధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మన కూటాలు నిర్ధారిత సమయాల్లో ప్రారంభమై ముగిసేలా ఏర్పాటు చేయబడ్డాయి. దీన్ని సాధించడానికి కార్యక్రమంలో భాగం వహిస్తున్న అందరి సహకారము అవసరం.
బైబిలు కాలాల్లో ప్రజలు జీవితాన్ని దృష్టించే విధానం నేడు అనేక ప్రాంతాల్లో ఉన్నట్లుగా కాక చాలా వేరుగా ఉండేది. అప్పట్లో సమయం ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము వంటి మాటల్లో దాదాపుగా మాత్రమే వ్యక్తం చేయబడేది. (ఆది. 24:10; 43:16; 1 రాజు. 18:26) దైనందిన కార్యకలాపాల్లో ఖచ్చితమైన సమయపాలన అనేది అంత పట్టించుకునే విషయంగా ఉండేది కాదు. నేడు కూడా ప్రపంచంలోని కొన్ని ప్రాంతాల్లో సమయంపట్ల అలాంటి దృక్కోణమే ఉంది.
అయితే ప్రాంతీయ సంప్రదాయం మూలంగా లేదా వ్యక్తిగత అభిప్రాయాల మూలంగా ప్రజలకు సమయం విషయంలో అంత పట్టింపు లేకపోయినప్పటికీ మనం దానికి తగిన అవధానాన్ని ఇవ్వడం నేర్చుకుంటే ప్రయోజనం పొందుతాము. ఒక కార్యక్రమంలో వివిధ భాగాలను నిర్వహించేందుకు కొందరు వ్యక్తులు నియమించబడితే ఒక్కొక్క భాగానికి కేటాయించబడిన సమయం విషయంలో శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంటుంది. ‘సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరుగనివ్వాలి’ అనే సూత్రం మన కూటాల్లోని నియామకాల సమయానికి కూడా వర్తింపజేయడం సబబే.—1 కొరిం. 14:39, 40.
సమయాన్ని ఎలా పాటించాలి? సిద్ధపాటు కీలకం. కొందరు ప్రసంగీకులు సమయాన్ని పాటించడంలో సమస్యను ఎదుర్కోవడానికి కారణం, సాధారణంగా వారు సిద్ధపడడంలో విఫలం కావడమే అయివుంటుంది. వారికి ఆత్మవిశ్వాసం అతిగా ఉండవచ్చు. లేదా చివరి నిమిషం వరకు సిద్ధపడడాన్ని వాయిదా వేస్తుండవచ్చు. మంచి సమయపాలనకు మౌళిక ఆధారం మీ నియామకాన్ని విలువైనదిగా ఎంచడం, మంచిగా సిద్ధపడడానికి సుముఖత చూపడం.
మీకు చదివే నియామకం ఉందా? మొదట, 4 నుండి 7 అధ్యయనాలు సమీక్షించండి, వాటిలో అనర్గళత, సముచితమైన చోట ఆగడం, భావాన్ని నొక్కిచెప్పడం, ప్రధాన తలంపులను నొక్కిచెప్పడం వంటివి తెలియజేయబడ్డాయి. ఆ తర్వాత, మీకు నియమించబడిన సమాచారాన్ని గట్టిగా చదువుతూ ఆ సలహాలను అన్వయించుకోండి. సమయం ఎంతవుతుందో చూసుకోండి. కేటాయించబడిన సమయంలో ముగించాలంటే మీరింకా వేగంగా చదవాలా? తక్కువ ప్రాముఖ్యం ఉన్న భాగాలను త్వరగా చదవండి, కానీ అదే సమయంలో ముఖ్యమైన తలంపులను నొక్కిచెప్పడానికి ఆగడం, నెమ్మదిగా చదవడం వంటివి చేయండి. మళ్ళీ మళ్ళీ అభ్యాసం చేయండి. మీరు ధారాళంగా చదవడంలో మెరుగుపడితే మీ సమయాన్ని పాటించడం కూడా సులభంగా ఉంటుంది.
మీరు సంక్షిప్త ప్రతిని చూస్తూ మాట్లాడతారా? సరైన సమయాన్ని పాటించాలంటే మీ సంక్షిప్త ప్రతిని మరీ విస్తృతంగా చేసుకొని, చివరికి దాదాపు వ్రాతప్రతి ప్రసంగంలా చేసుకోవలసిన అవసరం లేదు. మీరు అధ్యయనం 25పై పనిచేస్తున్నప్పుడు దానికన్నా శ్రేష్ఠమైన విధానాన్ని నేర్చుకున్నారు. ఈ ఐదు విషయాలను మనస్సులో ఉంచుకోండి: (1) మంచి సమాచారాన్ని సిద్ధం చేసుకోండి, కానీ మరీ ఎక్కువగా కాదు. (2) ప్రధాన తలంపులు మీ మనస్సులో ఉంచుకోండి, కానీ వాక్యాలకు వాక్యాలనే బట్టీపట్టేయకండి. (3) మీ ప్రసంగంలోని ఒక్కొక్క భాగానికి ఎంతెంత సమయాన్ని వెచ్చిస్తారో, లేదా ఆ భాగానికి వచ్చేసరికి ఎంత సమయం గడిచివుండాలో మీ సంక్షిప్తప్రతిపై మార్కు చేసుకోండి. (4) సమయం ఎక్కువవుతుందని మీకనిపిస్తే ఏయే వివరణలను విడిచిపెట్టవచ్చో సిద్ధపడేటప్పుడే ఆలోచించుకోండి. (5) ప్రసంగం ఇవ్వడాన్ని అభ్యాసం చేయండి.
రిహార్సల్ చేసుకోవడం చాలా ప్రాముఖ్యం. మీరు రిహార్సల్ చేస్తుండగా ప్రసంగంలోని ఒక్కొక్క భాగానికి ఎంత సమయం పడుతోందో గమనించండి. ప్రసంగం అంతా నిర్ధారిత సమయంలో ముగిసేంత వరకు మళ్ళీ మళ్ళీ రిహార్సల్ చేయండి. మరీ ఎక్కువ సమాచారాన్ని కుదించడానికి ప్రయత్నించవద్దు. కొంత సమయాన్ని అసలు వినియోగించకుండా విడిచిపెట్టేయండి, ఎందుకంటే వ్యక్తిగతంగా అభ్యాసం చేసుకునేటప్పుడు కన్నా ప్రేక్షకుల ఎదుట ప్రసంగం వెలువరించడానికి ఎక్కువ సమయం పడుతుంది.
ఆయా భాగాలకు సరిపడేంత సమయం ఇవ్వడం. మంచి సమయపాలన అనేది, ఒక ప్రసంగంలోని వేర్వేరు భాగాలకు సమయాన్ని సరిగ్గా విభాగించడంతో సంబంధం కలిగివుంది. సమయంలో అత్యధిక భాగం ప్రసంగ ప్రధాన భాగానికి వెచ్చించాలి. ఉపదేశంలోని ముఖ్యాంశాలు అందులోనే ఉంటాయి. ఉపోద్ఘాతానికి, అధ్యయనం 38లో చర్చించబడిన మూడు లక్ష్యాలను సాధించడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం చాలు. అధ్యయనం 39కి పొందికగా సమర్థమైన ముగింపును ఇవ్వడానికి సరిపడేంత సమయం లేనంతగా ప్రసంగం ప్రధాన భాగం కొనసాగకూడదు.
మంచి సమయపాలన కోసం మీరు చేసే కృషి ఫలితంగా మరింత శ్రేష్ఠమైన ప్రసంగం వెలువడుతుంది, కార్యక్రమంలో ఇతర భాగాలను నిర్వహిస్తున్న ఇతరుల పట్ల, అలాగే పూర్తి సంఘం పట్ల గౌరవాన్ని చూపిస్తుంది.