50
హృదయాన్ని స్పృశించేందుకు కృషి
ప్రజలకు సాక్ష్యం ఇవ్వడంతోపాటు మీరు వారి హృదయాలను చేరుకోవడానికి కృషిచేయాల్సిన అవసరం ఉంది. బైబిలులో, హృదయం అనేది ఒక వ్యక్తి బయటికి ఎలా కనబడతాడన్న దానికి భిన్నమైనదిగా తరచూ అభివర్ణించబడింది. సూచనార్థక హృదయం ఒక వ్యక్తి అంతరంగం లోపల ఏమైవున్నాడనేదాన్ని—ఆయన ఎలా భావిస్తున్నాడనేదాన్ని, ఆయన ఆలోచించే విషయాలన్నింటిని, అలా ఎందుకు ఆలోచిస్తాడనేదాన్ని, ఆ ఆలోచనలు ఆయన చర్యలను ఎలా ప్రభావితం చేస్తాయనేదాన్ని—సూచిస్తోంది. ఈ సూచనార్థక హృదయంలోనే సత్యపు విత్తనం విత్తబడుతుంది. (మత్త. 13:19) దేవునికి విధేయత ఉద్భవించాల్సినది కూడా హృదయం నుండే.—సామె. 3:1; రోమా. 6:17.
మీ బోధన హృదయంలోకి వెళ్ళగలగాలంటే ఈ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించండి: (1) మీ శ్రోతల హృదయాన్ని ఇప్పటికే ఏమి ప్రభావితం చేసిందో వివేచించండి. (2) ప్రేమ, దైవిక భయము వంటి ప్రయోజనకరమైన లక్షణాలను బలపరచండి. (3) మీ శ్రోతలు యెహోవాను పూర్తిగా ప్రీతిపరిచేందుకు తమ అంతర్గత ఉద్దేశాలను విశ్లేషించుకోమని ప్రోత్సహించండి.
వివేచన ప్రదర్శించడం. ప్రజలు సత్యాన్ని ఇంకా స్వీకరించకపోవడానికి కారణాలు వేర్వేరుగా ఉంటాయి. మీరు గృహ బైబిలు అధ్యయనాన్ని నిర్వహించేటప్పుడు దురభిమానాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉండవచ్చు, విద్యార్థిలో ఉన్న అనుచితమైన తలంపులను త్రుంచివేయడానికి వాస్తవాలను చెప్పాల్సిరావచ్చు, లేదా కేవలం రుజువులను మాత్రం అందించాల్సిన అవసరం ఉండవచ్చు. మిమ్మల్ని మీరు ఇలా ప్రశ్నించుకోండి: ‘ఈ వ్యక్తి ఒక మనిషిగా తనకు ఆధ్యాత్మిక అవసరాలున్నాయని గ్రహిస్తున్నాడా? ఆయన ఏ విషయాలను నమ్మడం ప్రారంభించాడు? ఆయన ఏమి నమ్మడం లేదు? ఆయన ఆయా నిర్ధారణలకు ఎందుకు చేరుకున్నాడు? సత్యాన్ని తెలుసుకోవడం వల్ల వచ్చే బాధ్యతలను స్వీకరించడం నుండి ఆయనను అడ్డుకోగల కోరికలను అధిగమించడానికి ఆయనకు సహాయం అవసరమా?’
ప్రజలు కొన్నింటిని ఎందుకు నమ్ముతారో అర్థం చేసుకోవడం ఎల్లప్పుడు అంత సులభం కాదు. “నరుని హృదయములోని ఆలోచన లోతు నీళ్లవంటిది” అంటోంది సామెతలు 20:5, కానీ “వివేకము [“వివేచన,” NW] గలవాడు దానిని పైకి చేదుకొనును” అని కూడా అది చెబుతోంది. స్పష్టంగా కనిపించనిదాన్ని గ్రహించే సామర్థ్యమే వివేచన. ఇందుకు నిశితంగా గమనించడం, అవతలివ్యక్తిపై శ్రద్ధతోకూడిన వైఖరి కలిగివుండడం అవసరమవుతుంది.
భావప్రకటన అనేది కేవలం మౌఖికంగా మాత్రమే జరగదు. ఒక విషయం వినగానే విద్యార్థి ముఖకవళికల్లో లేదా స్వరంలో మార్పులు వస్తాయి. మీరు తల్లి లేదా తండ్రి అయితే మీ పిల్లవాడి ప్రవర్తనలో వచ్చిన మార్పు, వాడు జీవితంలో ఒక క్రొత్త ప్రభావానికి ప్రతిస్పందిస్తున్నాడని సూచించవచ్చని మీరు గ్రహిస్తారనడంలో సందేహం లేదు. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి. అవి ఒక వ్యక్తి హృదయంలో ఏముందన్నదానికి సూచనలు.
అవతలివ్యక్తి హృదయంలో ఏముందో వెలికితీయడానికి చక్కగా ఎంపిక చేసుకున్న ప్రశ్నలు దోహదం చేయగలవు. మీరిలా ప్రశ్నించవచ్చు: “[ఏదైనా విషయాన్ని చెప్పి . . .] గురించి మీరెలా భావిస్తున్నారు?” “. . . అని మిమ్మల్ని ఏది ఒప్పించింది?” “. . . అయినట్లైతే మీరెలా ప్రతిస్పందిస్తారు?” అయితే, ప్రజల్ని ప్రశ్నల పరంపరలో ముంచెత్తకుండా జాగ్రత్తపడండి. మీరు ప్రశ్నించే ముందు ఔచిత్యంతో, “నేనొక ప్రశ్న అడగవచ్చా . . . ?” అనండి. హృదయంలో ఏముందో తెలుసుకోవడం చాలా కష్టతరమైన విషయం, దానికి తొందర పనికిరాదు. అత్యధిక సందర్భాల్లో, కొంతకాలంపాటు మీపై నమ్మకాన్ని పెంచుకున్న తర్వాతనే అవతలి వ్యక్తి తన అంతర్గత భావాలను వెల్లడిచేయడానికి ఇష్టపడతాడు. ఆ తర్వాత కూడా, మీరు తెలుసుకోవలసిన అవసరం లేని వ్యక్తిగత విషయాలు అడుగుతున్నట్లు ఆయన భావించకుండా మీరు జాగ్రత్తపడాలి.—1 పేతు. 4:15, 16.
మీరు వింటున్నదానికి ప్రతిస్పందించే విధానంలో కూడా వివేచన కనబరచాల్సిన అవసరం ఉంది. ఎలాంటి బైబిలు ఆధారిత సమాచారం ప్రజలను ప్రేరేపిస్తుందో నిర్ధారించుకునేందుకు వారిని అర్థం చేసుకోవడమే మీ లక్ష్యం అని గుర్తుంచుకోండి. వారి దృక్కోణాల్లో ఏమైనా తప్పులుంటే వాటిని బహిర్గతం చేయాలన్న కోరికను వెంటనే అణచుకోండి. బదులుగా, వారి మాటల వెనుకనున్న భావాలను వివేచించడానికి సిద్ధంగా ఉండండి. అప్పుడు ఎలా ప్రతిస్పందించాలో మీరు తెలుసుకుంటారు; అప్పుడు ఆ విషయాలకు మీ విద్యార్థి, మీరు తనను అర్థం చేసుకున్నారన్న భావనతో మీరు చెప్పేదాని గురించి మరింత గంభీరంగా ఆలోచించే సాధ్యత ఎక్కువ ఉంది.—సామె. 16:23.
ఒక పెద్ద సమూహాన్ని సంబోధించి మాట్లాడుతున్నప్పుడు కూడా మీరు కొంతమేరకు వారిలోని ఒక్కొక్క వ్యక్తిని పురికొల్పవచ్చు. ప్రేక్షకులవైపు చూస్తూ మాట్లాడుతున్నట్లైతే, వారి ముఖకవళికలు గమనిస్తున్నట్లైతే, ఆలోచింపజేసే ప్రశ్నలు జవాబు స్పష్టంగా ఉండే ప్రశ్నలు అడుగుతున్నట్లైతే, మీరు చెప్పేదాని గురించి మీ శ్రోతలు ఎలా భావిస్తున్నారనేది పసిగట్టగలుగుతారు. మీ ప్రేక్షకులు మీకు బాగా తెలిసినవారైతే వారి పరిస్థితులను పరిగణలోకి తీసుకోండి. సంఘం ఎదుట దేవుని వాక్యం నుండి తర్కిస్తుండగా వారి సాధారణ వైఖరిని పరిగణలోకి తీసుకోండి.—గల. 6:18.
ప్రయోజనకరమైన భావాలను ప్రేరేపించడం: ఒక వ్యక్తి ఏమి నమ్ముతాడో, ఏమి నమ్మడో, అందుకు కారణాలేమిటో కొంతవరకు అర్థం చేసుకున్న తర్వాత దాని ఆధారంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు. యేసు పునరుత్థానం తర్వాత, తన శిష్యులకు అప్పుడే సంభవించిన సంఘటనల వెలుగులో ‘లేఖనములను బోధపరచడం’ ద్వారా వారి హృదయాలను చేరాడు. (లూకా 24:32) మీరు కూడా ఒక వ్యక్తి అనుభవాలేమిటి, ఆయన దేనికోసం పరితపిస్తున్నాడు అన్నవాటికీ ఆయన దేవుని వాక్యంలో ఏమి చూస్తున్నాడు అన్నదానికీ సంబంధాన్ని ఏర్పరచడానికి కృషిచేయాలి. “ఇదే సత్యము!” అని ఆ విద్యార్థి స్పష్టంగా గ్రహించినప్పుడు మీరు హృదయాన్ని స్పృశించడంలో సఫలమైనట్లే.
యెహోవా మంచితనాన్ని, ఆయన ప్రేమను, ఆయన అపాత్ర కృపను, ఆయన మార్గాల ఖచ్చితత్వాన్ని మీరు నొక్కిచెప్పినప్పుడు మీ బోధన వింటున్నవారు దేవునిపట్ల ప్రేమను పెంపొందించుకోవడానికి మీరు సహాయం చేస్తారు. దేవుడు వారిలోని చక్కని లక్షణాలను చూస్తున్నాడని మీ శ్రోతలకు చూపించడానికి మీరు సమయం తీసుకుంటే, ఆయనతో వ్యక్తిగత అనుబంధం సాధ్యమేనని నమ్మేందుకు వారికొక కారణాన్నిచ్చిన వారవుతారు. దీన్ని, కీర్తన 139:1-3, లూకా 21:1-4, మరియు యోహాను 6:44 వంటి లేఖనాల గురించి ధ్యానించడం ద్వారా సాధించవచ్చు; అలాగే విశ్వసనీయులైన తన సేవకులను యెహోవా ప్రేమతో ఎంత ప్రగాఢంగా అంటిపెట్టుకొని ఉంటాడో మీ శ్రోతలు గ్రహించేలా సహాయం చేయడం ద్వారా కూడా సాధించగలరు. (రోమా. 8:38, 39) యెహోవా మన తప్పులను మాత్రమే చూడడని, మన పూర్తి జీవన విధానాన్ని, స్వచ్ఛారాధనపట్ల మనకున్న ఆసక్తిని, తన నామంపట్ల మనకున్న ప్రేమను చూస్తాడని వివరించండి. (2 దిన. 19:2, 3; హెబ్రీ. 6:10) మన వ్యక్తిత్వంలో అతి చిన్న వివరాన్ని కూడా ఆయన గుర్తుంచుకుంటాడు, గమనార్హమైన విధంగా ఆయన ‘సమాధులలో నున్నవారందరిని’ జీవానికి పునరుద్ధరిస్తాడు. (యోహా. 5:28, 29; లూకా 12:6, 7) మానవులు దేవుని స్వరూపంలో ఆయన పోలికచొప్పున సృష్టించబడ్డారు కాబట్టి ఆయన లక్షణాల గురించి చర్చించడం తరచూ అవతలి వ్యక్తిలో అనుకూల ప్రతిస్పందనను పురికొల్పుతుంది.—ఆది. 1:27.
మీరు ఇతర ప్రజలను యెహోవా దృష్టిస్తున్న రీతిలో దృష్టించడం నేర్చుకున్నప్పుడు కూడా హృదయాన్ని చేరడం సాధ్యమవుతుంది. దేవుడు మన పట్ల కోమలమైన రీతిలో శ్రద్ధ చూపిస్తుంటే ఆయన ఇతరుల పట్ల కూడా, వారి నేపథ్యం ఏమైనా, దేశం ఏదైనా, జాతి ఏదైనా అదే విధంగా శ్రద్ధ చూపిస్తాడన్నది సహేతుకం. (అపొ. 10:34, 35) ఒక వ్యక్తి ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే, తన హృదయంలో నుండి ద్వేషాన్ని, దురభిమానాన్ని నిర్మూలించడానికి ఆయనకు స్థిరమైన లేఖనాధారం ఉంటుంది. అలా ఆయన దేవుని చిత్తాన్ని నెరవేర్చడాన్ని నేర్చుకొంటాడు, అలాగే ఇతరులతో శాంతియుతంగా వ్యవహరించడం ఆయనకు సాధ్యమవుతుంది.
ఇతరులు అలవరుచుకోవడానికి సహాయం చేయాల్సిన మరొక భావన దైవిక భయము. (కీర్త. 111:10; ప్రక. 14:6, 7) దేవునిపట్ల ఉండే ప్రగాఢమైన పూజ్యభావము, లేదా భయము ఒక వ్యక్తి తన స్వశక్తితో సాధ్యంకానిదాన్ని సాధించేందుకు ఆయనను పురికొల్పగలదు. యెహోవా ప్రదర్శించిన అసాధారణమైన కృపను, ఆయన చేసిన అత్యద్భుతమైన కార్యాలను చర్చించడం ద్వారా, ఇతరులు ఆయనను అప్రీతిపరచడానికి ఆరోగ్యకరమైన రీతిలో భయపడడం అలవాటు చేసుకునేందుకు మీరు సహాయం చేయగలరు.—కీర్త. 66:5; యిర్మీ. 32:40.
తమ ప్రవర్తన యెహోవాకు ప్రాముఖ్యమైన విషయమని మీ శ్రోతలు అర్థంచేసుకున్నారని రూఢిపరచుకోండి. దేవునికి భావాలున్నాయి, ఆయన నిర్దేశకాలకు మనం చూపే ప్రతిస్పందన ద్వారా మనం ఆయనను దుఃఖపరచగలము లేదా ఆనందపరచగలము. (కీర్త. 78:40-42) సాతాను దేవునితో చేసిన సవాలుకు జవాబును, ప్రజల వ్యక్తిగత ప్రవర్తన ఎలా ప్రభావితం చేస్తుందో వారికి చూపించండి.—సామె. 27:11.
దేవుడు కోరేవాటిని నెరవేర్చడం తమకు ప్రయోజనకరమని గ్రహించేలా వారికి సహాయపడండి. (యెష. 48:17) దేవుని జ్ఞానాన్ని క్షణమైనా తృణీకరించడం ద్వారా శారీరకంగా, భావోద్వేగపరంగా అనుభవించవలసివచ్చే పరిణామాలు ఏమిటో ఎత్తిచూపించడం ద్వారా మీరలా సహాయపడవచ్చు. పాపము మనల్ని దేవుని నుండి ఎలా దూరం చేస్తుందో, ఇతరులు మన నుండి సత్యాన్ని తెలుసుకునే అవకాశం లేకుండా ఎలా చేస్తుందో, వేరే విధాలుగా వారి హక్కులను ఎలా ఉపేక్షిస్తుందో వివరించండి. (1 థెస్స. 4:6) దేవుని నియమాలు పాటిస్తున్నందున మీ ప్రేక్షకులు తామప్పటికే అనుభవిస్తున్న ఆశీర్వాదాలను అపురూపంగా ఎంచేందుకు వారికి సహాయం చేయండి. యెహోవా నీతియుక్త మార్గాల్లో నడుచుకోవడం ఎంతో మనఃక్లేశాన్ని తప్పిస్తుందన్న వాస్తవాన్ని గ్రహించి, ఆ విషయంలో కలిగివుండే కృతజ్ఞతాభావాన్ని బలపరచండి. ఒకసారి దేవుని మార్గాల్లోని జ్ఞానంపై విశ్వాసం ఏర్పడిందంటే ఆ వ్యక్తి వాటికి విరుద్ధమైన ప్రతి మార్గం పట్ల విముఖతను కనబరుస్తాడు. (కీర్త. 119:104) విధేయత చూపడాన్ని ఒక భారంగా కాక, ఒక వ్యక్తిగా యెహోవాకు ప్రేమపూర్వక భక్తిని ప్రదర్శించడానికి ఒక మార్గంగా దృష్టిస్తాడు.
ఇతరులు పరీక్ష చేసుకోవడానికి సహాయం చేయడం. ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉండడానికి ప్రజలు తమ హృదయాల్లో ఉన్నదానికి ప్రతిస్పందించాల్సిన అవసరం ఉంది. అలా చేయడానికి బైబిలు ఎలా సహాయం చేయగలదో వివరించండి.
బైబిలు కేవలం ఆజ్ఞలు, సలహాలు, చారిత్రక సంఘటనలు, ప్రవచనాలు వంటివి నమోదు చేయబడిన ఒక గ్రంథం మాత్రమే కాదని గ్రహించేందుకు మీ శ్రోతలకు సహాయపడండి. బైబిలు దేవుని ఆలోచనలను వెల్లడిచేస్తుంది. యాకోబు 1:22-25 వచనాల్లో దేవుని వాక్యము అద్దంతో పోల్చబడింది. అది చెప్పేదానికీ, యెహోవా తన సంకల్పాన్ని నెరవేర్చే విధానానికీ మనం చూపే ప్రతిస్పందన ద్వారా బైబిలు సందేశం మన హృదయ స్థితిని వెల్లడిచేస్తుంది. తద్వారా, “హృదయ పరిశోధకుడు” అయిన యెహోవా మనల్ని ఎలా దృష్టిస్తున్నాడో అది వెల్లడిచేస్తుంది. (సామె. 17:3) ఈ విషయాన్ని మనస్సులో ఉంచుకొమ్మని మీ శ్రోతలను ప్రోత్సహించండి. దేవుడు వారి కోసం బైబిలు నివేదికలో ఏమి పొందుపరిచాడో, ఆయనకు మరింత ప్రీతిపాత్రులుగా ఉండేలా వారు తమ జీవితాల్లో ఎలాంటి మార్పులు చేసుకోవలసిన అవసరం ఉందో ధ్యానించమని వారిని ఉద్బోధించండి. “హృదయముయొక్క తలంపులను ఆలోచనలను” యెహోవా ఎలా అంచనావేస్తున్నాడో గ్రహించేందుకు బైబిలు చదవడాన్ని ఒక సహాయకంగా దృష్టించేలా వారికి సహాయపడండి; ఆ విధంగా వారు అవసరమైన మార్పులు చేసుకునేందుకు దేవునితో సహకరించగలుగుతారు.—హెబ్రీ. 4:12; రోమా. 15:4.
కొందరు బైబిలు విద్యార్థులు తాము నేర్చుకునే వాటికి అనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటారు; కానీ ఇతర ప్రజలు ఏమనుకుంటారోనని వారు భయపడుతుంటారు. వారు కొన్ని బలమైన శరీర కోరికలతో పోరాడుతుండవచ్చు లేదా ఈ లోకపు అలవాట్లను కొనసాగిస్తూనే దేవుణ్ణి సేవించే మార్గమేదైనా ఉందేమో చూద్దామని తర్కిస్తుండవచ్చు. అలా నిర్ణయం తీసుకోలేకపోవడంలో ఎలాంటి ప్రమాదముందో చూపించండి. (1 రాజు. 18:21) తమ హృదయాలను పరిశీలించి, వాటిని శుద్ధిచేయమని దేవునికి ప్రార్థించమని వారిని ఉద్బోధించండి.—కీర్త. 26:2; 139:23, 24.
యెహోవా వారి పోరాటాన్ని అర్థం చేసుకుంటాడనీ, అసలు జరుగుతున్నదేమిటో బైబిలు వివరిస్తోందనీ వారికి చూపించండి. (రోమా. 7:22, 23) అపరిపూర్ణ హృదయంలోని కోరికలు తమపై ఆధిపత్యం సాధించేందుకు అనుమతించకుండా జాగ్రత్తపడేందుకు వారికి సహాయం చేయండి.—సామె. 3:5, 6; 28:26; యిర్మీ. 17:9, 10.
తాము ఏమి చేసినా దాని వెనుకున్న ఉద్దేశాలేమిటో విశ్లేషించుకోమని ప్రతి ఒక్కరినీ ప్రోత్సహించండి. తనను తాను ఇలా ప్రశ్నించుకోవడం నేర్పించండి: ‘నేనిలా ఎందుకు చేయాలనుకుంటున్నాను? యెహోవా నా పట్ల చేసిన సమస్తాన్ని నేను నిజంగా కృతజ్ఞతతో దృష్టిస్తున్నానని ఇది చూపిస్తోందా?’ యెహోవాతో అంగీకృత అనుబంధమే ఎవరికైనా ఉండగల అత్యంత విలువైన ధనం అన్న నిశ్చయతను బలపరచడానికి కృషిచేయండి.
యెహోవాను తమ “పూర్ణహృదయముతో” సేవించడం ఎంత ప్రాముఖ్యమో గ్రహించేందుకు మీ ప్రేక్షకులకు సహాయం చేయండి. (లూకా 10:27) అంటే వారి భావాలు, కోరికలు, ఉద్దేశాలు అన్నీ యెహోవా మార్గాలకు పొందికగా తీసుకురావలసిన అవసరం ఉందన్నమాట. వారు చేస్తున్న పనులనే కాక, దేవుడు కోరుతున్న వాటి గురించి వారు ఎలా భావిస్తున్నారనేదాన్నీ, ఆయన సేవచేయడంలో వారి ఉద్దేశాలేమిటన్నదాన్నీ విశ్లేషించుకోవడం మీ శ్రోతలకు నేర్పించండి. (కీర్త. 37:4) మీ విద్యార్థులు తాము మెరుగుపడాల్సిన అంశాలేమిటో గుర్తిస్తుండగా, యెహోవాకు ఇలా ప్రార్థించమని వారిని ప్రోత్సహించండి: “నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము.”—కీర్త. 86:11.
ఒక విద్యార్థి యెహోవాతో వ్యక్తిగత అనుబంధాన్ని పెంపొందించుకుంటున్నప్పుడు ఆయన దేవునికి విధేయతను కేవలం మీరు పురికొల్పడం మూలంగా కాక విశ్వాసం మూలంగా చూపిస్తాడు. ఆ తర్వాత ఆయన తను స్వయంగా “ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు” ముందుకు కొనసాగుతాడు. (ఎఫె. 5:10; ఫిలి. 2:12) హృదయంలో నుండి వచ్చే అలాంటి విధేయత యెహోవాకు ఆహ్లాదకర భావాన్నిస్తుంది.—సామె. 23:15.
హృదయాలను పరిశీలించేది, తనతో ఒక అనుబంధంలోకి ప్రజలను ఆకర్షించేది యెహోవాయేనని గుర్తుంచుకోండి. (సామె. 21:2; యోహా. 6:44) మన పాత్రలో దేవునికి సహకరించడం మాత్రమే ఉంది. (1 కొరిం. 3:9) ఇది ‘దేవుడు మన ద్వారా వేడుకొనినట్టు’ ఉంది. (2 కొరిం. 5:20; అపొ. 16:14) సత్యాన్ని స్వీకరించమని యెహోవా ఎవరినీ బలవంతం చేయడు, కానీ మనం లేఖనాలను ఉపయోగిస్తుండగా, మన శ్రోతలు వింటున్నది తమ ప్రశ్నలకు—లేదా తమ ప్రార్థనలకు జవాబులేనని వారు గ్రహించేలా ఆయన చేయగలడు. బోధించే ప్రతి అవకాశాన్ని ఈ గ్రహింపుతో స్వీకరించండి, అలాగే నడిపింపు కోసం, సహాయం కోసం యెహోవాను హృదయపూర్వకంగా అర్థించండి.—1 దిన. 29:18, 19; ఎఫె. 1:16-19.