31
ఇతరులను గౌరవించడం
‘అందరిని గౌరవించాలి’ అనీ, ‘ఎవ్వరి గురించీ చెడుగా మాటలాడకూడదు’ అనీ మనకు లేఖనాలు చెబుతున్నాయి. (1 పేతు. 2:17; తీతు 3:2) నిజానికి మనం కలిసే ప్రతి ఒక్కరూ “దేవుని పోలికెగా పుట్టిన”వారే. (యాకో. 3:9) యేసు మరణించినది ప్రతి ఒక్కరి కోసం. (యోహా. 3:16) సువార్తను వినడానికీ దాని ప్రకారం తగిన చర్యలు తీసుకొని రక్షించబడడానికీ ప్రతి ఒక్కరూ యోగ్యులే. (2 పేతు. 3:9) కొందరైతే వారికున్న గుణాలను బట్టి గానీ అధికారాన్ని బట్టి గానీ ప్రత్యేక గౌరవానికి అర్హులు.
బైబిలు ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవాన్ని చూపించకుండా తప్పించుకోవాలని కొంతమంది ఎందుకు ప్రయత్నిస్తుండవచ్చు? స్థానిక సంస్కృతిలో ఎవరికి గౌరవమివ్వాలన్నది కులం, వర్ణం, ఆడా మగా, ఆరోగ్యం, వయస్సు, సంపద లేదా సమాజంలో ఉన్న హోదాను బట్టి నిర్ణయించబడుతుండవచ్చు. ప్రజాధికారుల మధ్య విస్తృతంగా వ్యాపించివున్న అవినీతి, అధికారులంటే గౌరవం లేకుండా చేసింది. కొన్ని దేశాల్లో, ప్రజలు తమ పరిస్థితులను బట్టి ఎంతో అసంతృప్తితో ఉన్నారు. బహుశా ప్రాథమిక అవసరాలను తీర్చుకోవడానికే వాళ్ళు ఎన్నో గంటలు కష్టించి పని చేస్తుండవచ్చు, అంతేకాక వాళ్ళ చుట్టూవున్నది గౌరవం చూపించని ప్రజలైవుండవచ్చు. ఆదరణ లేని ఉపాధ్యాయుల మీదా, అధికారస్థానంలో ఉన్న ఇతరుల మీదా చేసే తిరుగుబాటులో చేరమనే తోటివాళ్ళ ఒత్తిడిని యౌవనస్థులు అనుభవిస్తుండవచ్చు. అతితెలివిగా ప్రవర్తిస్తూ తమ తల్లిదండ్రుల మీదే పెత్తనం చెలాయించే పిల్లలను చిత్రించే టీవీ కార్యక్రమాల ప్రభావం చాలామంది మీద ఉంది. ఇలాంటి లౌకిక భావనలు, ఇతరుల మీద గౌరవం లేకుండా చేయకుండా ఎంతో కృషి చేయాలి. అయితే మనం ప్రజలకు మర్యాద ఇచ్చినప్పుడు, ఒకరి ఆలోచనలు మరొకరితో పంచుకోవడం సులభసాధ్యమయ్యేటువంటి వాతావరణం నెలకొంటుంది.
గౌరవపూర్వకంగా సమీపించడం. మతసంబంధమైన పనిలో నిమగ్నమయ్యే వ్యక్తి తన సరైన వస్త్రధారణ ద్వారా సముచితమైన ప్రవర్తన ద్వారా గౌరవం చూపించాలని నిరీక్షించబడుతుంది. సముచితంగా దృష్టించబడే ప్రవర్తన ఏదన్నది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క విధంగా ఉంటుంది. టోపీ పెట్టుకునో ఒక చెయ్యి పాకెట్‌లో పెట్టుకునో ఒక వ్యక్తి దగ్గరకు సమీపించడం అమర్యాద అని కొందరు పరిగణిస్తారు. వేరే కొన్ని ప్రాంతాల్లో ప్రజలు అలాంటి ప్రవర్తనను అంగీకరించవచ్చు. ఎవ్వరికీ అభ్యంతరం కలిగించకుండా ఉండేందుకు స్థానికుల భావాలను పరిగణలోకి తీసుకోండి. అలా చేయడం, ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు సువార్తను సమర్థవంతంగా ప్రకటించడానికి సహాయపడగలదు.
అది మనం ఇతరులను, ప్రత్యేకించి వయస్సులో పెద్దవాళ్ళను సంబోధించే విధానానికి కూడా వర్తిస్తుంది. సాధారణంగా అనుమతి లేకుండా పిల్లలు వయోధికులను పేరుపెట్టి పిలిస్తే అది అమర్యాదకరంగా దృష్టించబడుతుంది. కొన్ని ప్రాంతాల్లో వయోజనులు సహితం అపరిచితులను వాళ్ళ పేర్లతో సంబోధించకూడదనే భావిస్తారు. అనేక భాషల్లో పెద్దవాళ్ళకూ, అధికార స్థానంలో ఉన్నవాళ్ళకూ గౌరవం చూపించడానికి “మీరు” అని బహువచనాన్ని ఉపయోగించడం గానీ సాంప్రదాయం ప్రకారం వేరే ఏదైనా పద్ధతిని అనుసరించడం గానీ చేస్తారు.
గౌరవపూర్వక అభివాదం. మీకు ఎవరైనా దారిలో ఎదురైతే మీరు వారిని చూశారనే విషయాన్ని వ్యక్తం చేయాలని కొన్ని చిన్న సమాజాల్లో ఎదురుచూస్తారు. అది రోడ్డు మీద నడుస్తున్నప్పుడే కావచ్చు, ఒక గదిలోకి ప్రవేశిస్తున్నప్పుడే కావచ్చు. మీరు వారిని చూశారనే విషయాన్ని, పలకరింపు ద్వారా చిరునవ్వు ద్వారా తలూపడం ద్వారా కనుబొమ్మల్ని పైకెత్తడం ద్వారా కూడా తెలియజేయవచ్చు. ఎదుటి వ్యక్తిని పట్టించుకోకపోవడం గౌరవంలేనితనంగా దృష్టించబడుతుంది.
అయితే తమ ఉనికిని గుర్తించినట్లు మీరు సూచించినప్పటికీ మీరు తమను నిర్లక్ష్యం చేసినట్లు కొంతమంది భావిస్తుండవచ్చు. అలా ఎలా భావిస్తారు? మీరు వారిని వ్యక్తిగతంగా గుర్తించలేకపోతున్నారన్నది వాళ్ళు గ్రహించడమే అందుకు కారణం. ఆయా వ్యక్తులను వాళ్ళ శారీరక ఆకృతులను బట్టి ఒక్కొక్క కోవకు చెందినవారిగా వర్గీకరించడం అసాధారణమేమీ కాదు. అశక్తతలూ ఆరోగ్య సమస్యలూ ఉన్న ప్రజలను చూసీచూడనట్లు తప్పుకోవడం తరచూ జరుగుతుంటుంది. అయితే అలాంటి వ్యక్తులతో కూడా ప్రేమగా గౌరవమిస్తూ వ్యవహరించడమెలాగో దేవుని వాక్యం మనకు చూపిస్తోంది. (మత్త. 8:2,3) ఆదాము చేసిన పాపాన్ని వారసత్వంగా పొందినందుకు దాని చెడ్డ ప్రభావం మనందరి మీదా ఏదో ఒకవిధంగా ఉంది. ఇతరులు మీలోని లోపాలనే మీకు ఎల్లప్పుడూ గుర్తింపుగా చెబుతున్నట్లయితే, మీరు గౌరవించబడుతున్నట్లు భావిస్తారా? ఇతరులు మిమ్మల్ని మీకున్న మంచి లక్షణాలను బట్టి గుర్తించాలని మీరు కోరుకోరా?
గౌరవించడంలో శిరస్సత్వాన్ని గుర్తించడం కూడా ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఒక ఇంట్లోని మిగతావాళ్ళకు సాక్ష్యమిచ్చే ముందు ఇంటి పెద్దతో మాట్లాడడం అవసరం. ప్రకటించండి బోధించండి అన్న ఆదేశం మనకు యెహోవా నుండే వచ్చినప్పటికీ పిల్లలకు శిక్షణనివ్వడానికీ క్రమశిక్షణనివ్వడానికీ మార్గనిర్దేశాలివ్వడానికీ దేవుడు తల్లిదండ్రులకే అధికారమిచ్చాడన్నది మనం అంగీకరిస్తాం. (ఎఫె. 6:1-4) కనుక మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, పిల్లలతో ఏదైనా విస్తృతంగా చర్చించే ముందు తల్లిదండ్రులతో మొదట మాట్లాడడమే సాధారణంగా సముచితమైనది.
వయస్సుతో జీవితానుభవం వస్తుంది, దానికి తప్పకుండా గౌరవమివ్వాలి. (యోబు 32:6,7) దీన్ని గుర్తించడం, శ్రీలంకలోని ఒక పెద్దవయస్కుడిని కలిసిన ఒక యువ పయినీరు సహోదరికి ఎంతో సహాయపడింది. ఆమె ఆయనను సందర్శించినప్పుడు ఆయన మొదట అభ్యంతరం తెలిపాడు. “నాకన్నా చిన్నదానివైన నీలాంటి వాళ్ళు నాకు బైబిలు బోధించడమేమిటి?” అని ఆయన అన్నాడు. “నిజానికి నేను వచ్చింది బోధించడానికి కాదండీ, నేను తెలుసుకున్న ఒక విషయం నన్నెంతో సంతోషపరిచింది, దాన్ని అందరితోను పంచుకోవాలనుకుంటున్నాను. మీతో కూడా పంచుకోవాలని వచ్చానండీ” అని ఆమె సమాధానమిచ్చింది. ఆ పయినీరు గౌరవపూర్వకంగా ప్రతిస్పందించడం వల్ల ఆ వ్యక్తి ఆసక్తి రేకెత్తించబడింది. “అయితే చెప్పు. నువ్వేమి తెలుసుకున్నావు?” అని ఆయన అడిగాడు. “నిరంతరం జీవించివుండడమెలాగో తెలుసుకున్నాను” అని ఆమె జవాబిచ్చింది. ఆ పెద్దవయస్కుడు అలా యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం మొదలుపెట్టాడు. తాము గౌరవించబడాలన్న కోరికను వృద్ధులందరూ బయటికి చెప్పరు కానీ వారిలో చాలామంది వారిని గౌరవిస్తే ఎంతో సంతోషిస్తారు.
అయితే మర్యాద అతిగా ప్రదర్శించడం కూడా సాధ్యమే. పసిఫిక్ దీవుల్లోనూ అలాగే మరితర ప్రాంతాల్లోనూ యెహోవాసాక్షులు గ్రామ పెద్దలను గానీ తెగ పెద్దలను గానీ సమీపించేటప్పుడు సాంప్రదాయికంగా సంబోధించడానికి ఉపయోగించే పదాలను గౌరవపూర్వకంగా ఉపయోగించడం వల్ల ప్రజలు వినడానికి సిద్ధపడతారు, పెద్దలతోనూ వాళ్ళ అధికారం క్రిందవున్న ప్రజలతోనూ మాట్లాడే అవకాశం సాక్షులకు దొరుకుతుంది. అయితే పొగడ్తలు అనవసరం, అనుచితం కూడా. (సామె. 29:5) అదేవిధంగా ఒక భాషలో గౌరవార్థక పదాలు వ్యాకరణంలో భాగంగా ఉండవచ్చు, కానీ క్రైస్తవ గౌరవం చూపించేందుకు, అటువంటి పదాలను మరీ ఎక్కువగా ఉపయోగించవలసిన అవసరం లేదు.
గౌరవపూర్వకంగా మాట్లాడడం. మన నిరీక్షణకు గల కారణాన్ని “సాత్వికముతోను భయముతోను [“ప్రగాఢమైన గౌరవముతోను,” NW]” వివరించాలని బైబిలు మనకు ఉద్బోధిస్తోంది. (1 పేతు. 3:15,16) కాబట్టి మనం ఒకవేళ ఎదుటి వ్యక్తి దృక్కోణంలోని లోపాలను వెంటనే బయటపెట్టగలిగినప్పటికీ ఆయన గౌరవానికి భంగం కలిగే విధంగా అలా చేయడం జ్ఞానయుక్తమేనా? వాళ్ళు చెప్పేది ఓపికగా విని ఆయన ఎందుకు అలా భావిస్తున్నాడో అడిగి, ఆ తర్వాత ఆయన భావాలను పరిగణలోకి తీసుకుంటూ లేఖనాల ఆధారంగా ఆయనతో తర్కించడమే కదా మంచిది?
ఒక్కో వ్యక్తితో మాట్లాడేటప్పుడు చూపించేటువంటి గౌరవం, వేదిక మీద నిలబడి ప్రేక్షకులను సంబోధించేటప్పుడు కూడా స్పష్టం కావాలి. తన ప్రేక్షకులను గౌరవించే ఒక ప్రసంగీకుడు వాళ్ళను పరుషంగా విమర్శించడం గానీ, “మీరు నిజంగా కావాలనుకుంటే ఈ ఉపదేశాన్ని అన్వయించుకోగలుగుతారు” అనే అర్థాన్నిచ్చే ధోరణిని కనబరచడం గానీ చేయడు. ఆ విధంగా మాట్లాడితే వాళ్ళను నిరుత్సాహపరచడమే అవుతుంది. యెహోవాను ప్రేమిస్తూ ఆయనను సేవించాలని కోరుకుంటున్నటువంటి ప్రజల సభగా ప్రేక్షకులను దృష్టించడం ఎంత మేలు! ఆధ్యాత్మికంగా బలహీనంగా ఉన్నవారితోనైనా ఎక్కువ అనుభవం లేనివారితోనైనా బైబిలు ఉపదేశాన్ని కాస్త నెమ్మదిగా అన్వయించుకునే వారితోనైనా మనం వ్యవహరించేటప్పుడు యేసును అనుకరిస్తూ వాళ్ళను అర్థం చేసుకొని మెలగాలి.
ప్రసంగీకుడు దేవుని వాక్యాన్ని ఇంకా సంపూర్ణంగా అన్వయించుకోవలసిన అవసరమున్నవారిలో తనను కూడా కలుపుకుంటూ మాట్లాడితే, ప్రసంగీకుడికి తమ మీదవున్న గౌరవాన్ని ప్రేక్షకులు గ్రహిస్తారు. కాబట్టి లేఖనాలను అన్వయించేటప్పుడు, “మీరు” అన్న పదాన్ని తరచూ ఉపయోగించకుండా జాగ్రత్తపడడం జ్ఞానయుక్తమైన పని. ఉదాహరణకు “మీరు చేయగలిగినదంతా చేస్తున్నారా?” అన్న ప్రశ్నకూ, “‘నేను చేయగలిగినదంతా చేస్తున్నానా?’ అని మనలో ప్రతి ఒక్కరమూ ప్రశ్నించుకోవాలి” అని చెప్పడానికీ ఉన్న తేడాను గమనించండి. ఈ రెండు ప్రశ్నల ఉద్దేశం ఒకటే. కానీ మొదటి ప్రశ్న, ప్రసంగీకుడు తననూ ప్రేక్షకులనూ ఒకే స్థాయిలో చూడడంలేదన్న భావాన్నిస్తుంది. రెండవ ప్రశ్న, తానున్న పరిస్థితినీ తన సొంత ఉద్దేశాలనూ విశ్లేషించుకొమ్మని ప్రసంగీకుడితో సహా ప్రతీ వ్యక్తినీ ప్రోత్సహిస్తుంది.
ప్రేక్షకులను కేవలం నవ్వించాలన్న ఉద్దేశంతో హాస్యభరితమైన మాటలు చెప్పాలని మీలో బలంగా కలుగుతున్న కోరికను నిరోధించండి. అది బైబిలు సందేశానికున్న గౌరవాన్ని తగ్గిస్తుంది. మనం దేవునికి చేసే సేవలో ఆనందించాలన్నది నిజమే. మనకు నియమించబడిన సమాచారంలోని కొన్ని విషయాలు కొంత హాస్యభరితంగానే ఉండవచ్చు. అయితే గంభీరమైన విషయాలను నవ్వుకునే విషయాలుగా చేయడం, ప్రేక్షకుల మీదా దేవుని మీదా గౌరవం కొరవడిందని సూచిస్తుంది.
మనం ఇతరులను ఎలా దృష్టించాలని యెహోవా మనకు నేర్పించాడో అదే విధంగా వారిని మనం దృష్టిస్తున్నామన్నది, మనం ఇతరులను సమీపించే విధానంలోనూ వారితో మెలిగే విధానంలోనూ మన మాటతీరులోనూ ఎల్లప్పుడూ చూపించుదాం.