కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • be అధ్యాయం 30 పేజీ 186-పేజీ 189 పేరా 4
  • ఎదుటి వ్యక్తి మీద ఆసక్తి చూపించడం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ఎదుటి వ్యక్తి మీద ఆసక్తి చూపించడం
  • దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఇతరులయందు వ్యక్తిగత శ్రద్ధను చూపుట
    మన రాజ్య పరిచర్య—1991
  • సంభాషణా సామర్థ్యాలను ఎలా మెరుగుపరుచుకోవచ్చు?
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • హృదయాన్ని స్పృశించేందుకు కృషి
    దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
  • సమాచారం ఎలా ఉపయోగపడుతుందో చెప్పడం
    చక్కగా చదువుదాం, బోధిద్దాం
మరిన్ని
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల విద్య నుండి ప్రయోజనం పొందండి
be అధ్యాయం 30 పేజీ 186-పేజీ 189 పేరా 4

30

ఎదుటి వ్యక్తి మీద ఆసక్తి చూపించడం

మీరు ఏమి చెయ్యాలి?

మీరు ఎదుటివారి ఆలోచనలకు విలువ ఇస్తారనీ మీరు వాళ్ళ క్షేమం గురించి ఆలోచిస్తున్నారనీ చూపించండి.

ఎందుకు ప్రాముఖ్యం?

యెహోవా చూపించిన ప్రేమను అనుకరించే ఒక విధానమిది. మనం ఇలా చేయడం ఒక వ్యక్తి హృదయాన్ని మనం చేరుకునేలా చేయవచ్చు.

ఇతరులతో బైబిలు సత్యాలను పంచుకునేటప్పుడు, మనం వాటిని కేవలం వాళ్ళ మెదడుకు చేరవేయడం మాత్రమే సరిపోదు. మనం వాళ్ళ హృదయాలను ఆకట్టుకోవాలి. దానికి ఒక మార్గం, మన శ్రోతల మీద మనం స్వయంగా హృదయపూర్వక ఆసక్తిని చూపించడమే. అలాంటి ఆసక్తిని మనం వివిధ మార్గాల్లో చూపించవచ్చు.

మీ శ్రోతల దృక్కోణాన్ని పరిగణలోకి తీసుకోండి. అపొస్తలుడైన పౌలు తన శ్రోతల నేపథ్యాన్నీ వారి మనస్తత్త్వాన్నీ పరిగణలోకి తీసుకున్నాడు. “యూదులను సంపాదించికొనుటకు యూదులకు యూదునివలె ఉంటిని. ధర్మశాస్త్రమునకు లోబడినవారిని సంపాదించికొనుటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడినవాడను కాకపోయినను, ధర్మశాస్త్రమునకు లోబడినవానివలె ఉంటిని. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేనివాడను కాను గాని క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినవాడను. అయినను ధర్మశాస్త్రము లేనివారిని సంపాదించికొనుటకు ధర్మశాస్త్రము లేనివారికి ధర్మశాస్త్రము లేనివానివలె ఉంటిని. బలహీనులను సంపాదించికొనుటకు బలహీనులకు బలహీనుడనైతిని. ఏ విధముచేతనైనను కొందరిని రక్షింపవలెనని అందరికి అన్నివిధముల వాడనైయున్నాను. మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దానికొరకే సమస్తమును చేయుచున్నాను” అని ఆయన వివరించాడు. (1 కొరిం. 9:20-23) నేడు మనమెలా ‘అందరికి అన్నివిధముల వారమై’ ఉండగలము?

మీరు ఇతరులతో మాట్లాడడం ప్రారంభించే ముందు, వారిని గమనించే అవకాశం కొద్ది క్షణాలైనా ఉంటే వారి అభిరుచులను పరిస్థితులను సూచించగల విషయాలను గమనించవచ్చు. వాళ్ళ వృత్తి ఏమిటో మీరు చెప్పగలరా? వాళ్ళ మతనమ్మకాలను స్పష్టం చేసేవేమైనా మీకు కనిపిస్తున్నాయా? వాళ్ళ కుటుంబ పరిస్థితిని గురించిన సూచన ఏదైనా ఉందా? మీరు గమనించిన విషయాలను బట్టి మీ శ్రోతలను మరింత ఆకట్టుకునేలా మీ అందింపులో కొన్ని సవరింపులు చేసుకోగలరా?

మీ అందింపు మరింత ఆకట్టుకునేదిగా ఉండేందుకు మీ సేవాప్రాంతంలోని ప్రజలతో సంభాషణ ఎలా ప్రారంభించాలి అన్నదాని గురించి కొంచెం ముందుగా ఆలోచించుకోవడం అవసరం. కొన్ని ప్రాంతాల్లో అయితే, విదేశాల నుండి వలస వచ్చినవారు కూడా ఉంటారు. మీ సేవాప్రాంతాల్లో అలాంటివాళ్ళుంటే వాళ్ళకు సాక్ష్యమివ్వగల సమర్థవంతమైన విధానాన్ని మీరు తెలుసుకున్నారా? “మనుష్యులందరు రక్షణపొంది సత్యమునుగూర్చిన అనుభవజ్ఞానముగలవారై యుండవలె”నన్నదే దేవుని చిత్తము గనుక, మీరు కలిసేవారికందరికీ రాజ్య సందేశాన్ని ఆకర్షణీయమైన విధానంలో తెలియజేయాలన్నదే మీ లక్ష్యంగా చేసుకోండి.—1 తిమో. 2:4.

శ్రద్ధగా వినండి. యెహోవాకు అన్నీ తెలిసినా ఇతరులు మాట్లాడేటప్పుడు వింటాడు. ప్రవక్తయైన మీకాయా చూసిన దర్శనంలో, ఒక సమస్యను ఎలా పరిష్కరించవచ్చో తమ తమ ఆలోచనలను తెలియజేయమని యెహోవా దేవదూతలను ప్రోత్సహిస్తూ కనిపించాడు. తర్వాత ఆ దేవదూతల్లో ఒకరిచ్చిన సూచన ప్రకారం చేసేందుకు దేవుడు ఆ దూతనే అనుమతించాడు. (1 రాజు. 22:19-22) సొదొమ మీద విధించబడనున్న తీర్పు గురించి అబ్రాహాము ఎంతో కలత చెంది దాన్ని వ్యక్తం చేసినప్పుడు యెహోవా ఎంతో దయతో విన్నాడు. (ఆది. 18:23-33) వినడం విషయంలో యెహోవా ఉంచిన మాదిరిని మనం పరిచర్యలో ఎలా అనుకరించవచ్చు?

తమ అభిప్రాయాలను వ్యక్తం చేయమని ఇతరులను ప్రోత్సహించండి. సముచితమైన ప్రశ్న అడగండి, వాళ్ళు జవాబిచ్చేందుకు తగినంత వ్యవధినివ్వండి. వారు చెప్పేది నిజంగా వినండి. మీరు వాళ్ళ మాటలను సాలోచనగా వినడం, వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడేందుకు ప్రోత్సాహాన్నిస్తుంది. వాళ్ళ ప్రతిస్పందన వాళ్ళ అభిరుచుల గురించి వెల్లడిచేస్తున్నట్లయితే, ఔచిత్యముతో మాట్లాడుతూ ఇంకొంచెం వాకబు చేయండి. మీ సంభాషణ ప్రశ్నలవర్షంగా మారిపోకుండానే, వాళ్ళ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. వాళ్ళ ఆలోచనలను మీరు హృదయపూర్వకంగా ప్రశంసించగలిగితే ప్రశంసించండి. మీరు వారి దృక్కోణంతో ఏకీభవించకపోయినప్పటికీ వాళ్ళు వ్యక్తం చేసిన అభిప్రాయాలను ప్రేమపూర్వకంగా గుర్తించండి.—కొలొ. 4:6.

అయితే మనం ప్రజల మీద చూపించే ఆసక్తి హద్దు మీరకుండా జాగ్రత్తపడడం అవసరం. మనకు ఇతరుల మీద శ్రద్ధ ఉన్నంత మాత్రాన వారి సొంత విషయాల్లో జోక్యం చేసుకునే అధికారం మనకు లేదు. (1 పేతు. 4:15) మనం ప్రేమపూర్వకంగా చూపించే ఆసక్తిని వ్యతిరేక లింగ వ్యక్తులు అపార్థం చేసుకోకుండా జాగ్రత్తపడడం అవసరం. ఇతరుల మీద ఎంత మేరకు ఆసక్తి చూపించడం సబబన్నది ఒక్కొక్క దేశాన్ని బట్టి ఉంటుంది, ఒక్కొక్క వ్యక్తిని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి వివేచనను ఉపయోగించాలి.—లూకా 6:31.

మంచి శ్రోతగా ఉండేందుకు సిద్ధపాటు మంచి సహాయకము. మనం చెప్పవలసిన సందేశం మన మనస్సులో స్పష్టంగా ఉన్నప్పుడు, ఇతరులు మాట్లాడుతున్నప్పుడు మనం ప్రశాంతంగా ఉండేందుకు, సహజంగా శ్రద్ధగా వినేందుకూ అది మనకు దోహదపడుతుంది. మనం అలా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు, మనతో సంభాషించేందుకు మరింత మొగ్గు చూపుతారు.

ఇతరులు మాట్లాడుతున్నప్పుడు వినడం ద్వారా మనం వారికి గౌరవం చూపిస్తాం. (రోమా. 12:10) మనం వాళ్ళ ఆలోచనలకు, భావాలకు విలువిస్తామని అది రుజువునిస్తుంది. మనం చెప్పాలనుకుంటున్నదాన్ని వాళ్ళు ఇంకా శ్రద్ధగా వినేలా కూడా చేస్తుంది. అందుకే మంచి కారణంతోనే, ‘వినుటకు వేగిరపడాలనీ మాటలాడుటకు నిదానించాలనీ’ దేవుని వాక్యం మనకు సలహా ఇస్తోంది.—యాకో. 1:19.

ఇతరులు ప్రగతి సాధించేందుకు సహాయపడండి. ఇతరుల మీద ఉండే శ్రద్ధ, ఆసక్తి చూపించినవారి గురించి ఆలోచిస్తూ ఉండేలా చేస్తుంది; వాళ్ళ అవసరాలను సూటిగా తీర్చే బైబిలు సత్యాలను వాళ్ళతో పంచుకోవడానికి వాళ్ళను మళ్ళీ సందర్శించేలా చేస్తుంది. తర్వాతి సందర్శనం గురించి ఆలోచించేటప్పుడు, మునుపటి సందర్శనాల్లో వాళ్ళ గురించి మీరు తెలుసుకున్న విషయాలను ఆలోచించండి. వాళ్ళను కలతపరుస్తున్న విషయానికి సంబంధించిన సమాచారాన్ని సిద్ధం చేసుకోండి. వాళ్ళు తెలుసుకుంటున్న విషయాల నుండి ఎలా ప్రయోజనం పొందవచ్చో గ్రహించేందుకు వాళ్ళకు సహాయపడుతూ ఆ సమాచారపు ఆచరణాత్మక విలువను నొక్కిచెప్పండి.—యెష. 48:17.

మీ శ్రోత తన మనస్సును కృంగదీస్తున్న ఒక పరిస్థితిని గానీ సమస్యను గానీ మీకు వెల్లడిచేస్తే, ఆయనకు సువార్తను తెలిపేందుకు దాన్ని ఒక చక్కని అవకాశంగా దృష్టించండి. యేసు మాదిరిని అనుకరించండి. బాధల్లో ఉన్నవారిని ఓదార్చడానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు. (మార్కు 6:31-34) వెంటనే పరిష్కార మార్గాన్ని తెలపాలన్న ఆలోచన గానీ పైపైకి ఏదో సలహాలిచ్చి వదిలి పెడదామన్న ఆలోచన గానీ మీలో బలంగా కలుగుతున్నట్లయితే దాన్ని ప్రక్కకు పెట్టండి. లేదంటే మీకు తన మీద నిజమైన ఆసక్తి లేదని ఆయనకు అనిపించవచ్చు. కాబట్టి సహానుభూతిని చూపించండి. (1 పేతు. 3:8) బైబిలు ఆధారిత ప్రచురణల్లో పరిశోధన చెయ్యండి, ఆ వ్యక్తి తన పరిస్థితిలో సరైన విధంగా వ్యవహరించేందుకు సహాయపడే నిర్మాణాత్మకమైన సమాచారాన్ని ఆయనతో పంచుకోండి. మీ శ్రోత మీకు తెలిపిన వ్యక్తిగత విషయాలను మీరు ఇతరులకు చెప్పేందుకు తగిన కారణం లేనంత వరకు, ఎవ్వరికీ చెప్పకుండా ఆయన మంచి గురించి మీకున్న ప్రేమపూర్వకమైన శ్రద్ధ మిమ్మల్ని అడ్డుకుంటుంది.—సామె. 25:9.

ముఖ్యంగా మనం ఎవరికైతే బైబిలు అధ్యయనాలను నిర్వహిస్తున్నామో వారి మీద మనం వ్యక్తిగతంగా శ్రద్ధ చూపించాలి. ఒక్కొక్క విద్యార్థి అవసరాల గురించి ప్రార్థనాపూర్వకంగా ఆలోచించండి, ఆ అవసరాలను మనస్సులో పెట్టుకొని అధ్యయనం కోసం సిద్ధపడండి. ‘ఆమె గానీ ఆయన గానీ ఆధ్యాత్మిక ప్రగతి సాధిస్తూనే ఉండేందుకు తర్వాత ఏమి చెయ్యాలి?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఆ విషయం గురించి బైబిలూ, ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అందజేసే ప్రచురణలూ ఏమి చెబుతున్నాయో గ్రహించేందుకు విద్యార్థికి ప్రేమపూర్వకంగా సహాయపడండి. (మత్త. 24:45) కొన్ని సందర్భాల్లో కేవలం ఒక వివరణను ఇవ్వడమే సరిపోకపోవచ్చు. నిర్దిష్ట బైబిలు సూత్రాన్ని ఎలా అన్వయించుకోవాలన్నది మీ విద్యార్థికి చూపించడం, నిజానికి ఆ అన్వయింపును చూపించే దేన్నైనా కలిసిచేస్తూ చూపించడం అవసరం కావచ్చు.—యోహా. 13:1-15.

తమ జీవితాలను యెహోవా ప్రమాణాలకు అనుగుణంగా మార్చుకునేందుకు ఇతరులకు సహాయపడుతున్నప్పుడు సమతుల్యతా వివేచనా అవసరం. ఆయా వ్యక్తుల నేపథ్యాలూ సామర్థ్యాలూ భిన్నంగా ఉంటాయి కాబట్టి, వాళ్ళు ప్రగతి సాధించే వేగం కూడా భిన్నంగానే ఉంటుంది. కాబట్టి ఇతరుల నుండి ఆశించేవాటి విషయంలో సహేతుకంగా ఉండండి. (ఫిలి. 4:5) వాళ్ళు తమ జీవితాల్లో మార్పులు చేసుకోవాలని వారిని ఒత్తిడి చేయకండి. వాళ్ళను ప్రేరేపించేందుకు దేవుని వాక్యాన్నీ ఆయన ఆత్మనూ అనుమతించండి. ప్రజలు తనను ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా సేవించాలనే తప్ప, బలవంతం మీద సేవించాలని యెహోవా కోరుకోవడం లేదు. (కీర్త. 110:3) వాళ్ళు స్వయంగా తీసుకోవలసిన నిర్ణయాలకు సంబంధించి మీరు మీ సొంత అభిప్రాయాలను చెప్పకండి, మీ అభిప్రాయం చెప్పమని ఇతరులు మిమ్మల్ని అడిగినా వాళ్ళ కోసం మీరు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తపడండి.—గల. 6:5.

అవసరమైన చేయూతనివ్వండి. యేసు ముఖ్యంగా తన శ్రోతల ఆధ్యాత్మిక క్షేమం మీద మనస్సు నిలుపుతున్నప్పటికీ వాళ్ళ ఇతర అవసరాలను కూడా ఆయన గుర్తించేవాడు. (మత్త. 15:32) మనకు ఆదాయం అంత ఎక్కువేమీ లేకపోయినప్పటికీ వాళ్ళకు నిజంగా సహాయపడగల ఆచరణాత్మక మార్గాలు అనేకమున్నాయి.

ఇతరుల మీద మనకున్న ఆసక్తి, మనం వాళ్ళ క్షేమాన్ని పరిగణలోకి తీసుకునేలా మనల్ని పురికొల్పుతుంది. ఉదాహరణకు వాతావరణ పరిస్థితులు మీ శ్రోతకు ఇబ్బంది కలిగిస్తున్నట్లయితే ఇంకొంచెం సౌకర్యంగా ఉండే చోటుకి మార్చండి, లేదా మరొక సమయంలో చర్చ కొనసాగించేందుకు ఏర్పాట్లు చేసుకోండి. మీరు వాళ్ళకు వీలుకాని సమయంలో వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్లయితే, మరొకసారి వస్తామని చెప్పండి. మీ పొరుగువాళ్ళు గానీ ఆసక్తి చూపించిన వ్యక్తి గానీ అనారోగ్యంగా ఉన్నా ఆసుపత్రిలో ఉన్నా ఆయనకు ఒక కార్డు పంపించడం ద్వారా లేదా చిన్న ఉత్తరం వ్రాయడం ద్వారా వాళ్ళను వెళ్ళి చూసిరావడం ద్వారా మీకు వారిపై ఉన్న ఆసక్తిని వ్యక్తం చేయండి. సముచితమైతే మీరు వాళ్ళకు భోజనం తీసుకువెళ్ళవచ్చు లేదా వేరే ఏదైనా విధంగా సహాయం చెయ్యవచ్చు.

బైబిలు విద్యార్థులు ప్రగతి సాధిస్తున్న కొద్దీ వాళ్ళు తమ మునుపటి సహవాసులతో సమయాన్ని అంతగా వెచ్చించనందువల్ల భావోద్వేగపరంగా ఏదో శూన్యతాభావాన్ని అనుభవిస్తుండవచ్చు. వాళ్ళతో స్నేహం చేయండి. వాళ్ళతో బైబిలు అధ్యయనం చేసిన తర్వాతా ఇతర సమయాల్లోనూ వాళ్ళతో మాట్లాడడానికి సమయం వెచ్చించండి. మంచి సహవాసాలను పెంచుకొమ్మని ప్రోత్సహించండి. (సామె. 13:20) క్రైస్తవ కూటాలకు హాజరవ్వడానికి వారికి సహాయం చెయ్యండి. అలాంటి కూటాల్లో వారితోపాటు కూర్చోండి. అందరూ ఆ కార్యక్రమం నుండి పూర్తిగా ప్రయోజనం పొందేందుకు వాళ్ళ పిల్లలను చూసుకోవడంలో సహాయపడండి.

ఆసక్తిని హృదయంలో నుండి చూపించండి. వ్యక్తుల మీద ఆసక్తి చూపించడమనేది, పట్టు సాధించవలసిన ఒక పద్ధతి కాదు. అది హృదయానికి ఉండే గుణం. ఇతరుల మీద మనకు ఎంత ఆసక్తి ఉందన్నది అనేక విధాల్లో కనిపిస్తుంది. అది మనం ఎలా వింటున్నాం ఏమి చెబుతున్నాం అన్న వాటిలో కనిపిస్తుంది. అది మనం ఇతరులకు ప్రేమ చూపించడంలో వారిని పరిగణలోకి తీసుకోవడంలో వెల్లడవుతుంది. మనం ఏమీ చెప్పకపోయినా చెయ్యకపోయినా మన దృక్పథాన్ని బట్టీ మన ముఖ కవళికలను బట్టీ అది వెల్లడవుతుంది. మనకు ఇతరుల మీద నిజంగా శ్రద్ధ ఉంటే వాళ్ళు అది తప్పకుండా చెప్పగలుగుతారు.

ఇతరుల మీద నిజమైన ఆసక్తి చూపించడానికి గల అత్యంత ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే, మనమలా చూపించడం ద్వారా మన పరలోక తండ్రియైన దేవుని ప్రేమనూ కరుణనూ అనుకరిస్తాము. మనం మన శ్రోతలను యెహోవా వైపుకూ, ప్రకటించమని మనకు అప్పగించబడిన సందేశం వైపుకూ మళ్ళించేందుకు అది సహాయపడుతుంది. కాబట్టి మీరు సువార్తను పంచుకుంటున్నప్పుడు మీ “సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ” చూసేందుకు శాయశక్తులా ప్రయత్నించండి.—ఫిలి. 2:4.

హృదయపూర్వకమైన ఆసక్తిని ఎలా చూపించాలి?

  • ఎదుటి వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వినండి. ఆయన తన ఆలోచనలను భావాలను వ్యక్తం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేయండి. ఆయన ఆలోచనా సరళిని ఇంకా స్పష్టంగా అర్థం చేసుకునేందుకు ప్రశ్నలు అడగండి.

  • మీరు ఒక వ్యక్తిని కలిసి మాట్లాడిన తర్వాత ఆ వ్యక్తి గురించి ఆలోచించండి. ఆ వ్యక్తిని త్వరలోనే మళ్ళీ కలవండి.

  • ఆ వ్యక్తి అవసరాలను సూటిగా తీర్చే బైబిలు సత్యాలను పంచుకోండి.

  • ఆయనకు సహాయపడే పనులు చేయండి. వెంటనే తీరవలసిన అవసరాలనూ దీర్ఘకాలిక అవసరాలనూ రెండు రకాల అవసరాలనూ పరిగణలోకి తీసుకోండి.

అభ్యాసాలు: (1) ఒక సంఘ కూటం ప్రారంభంకాక ముందు, హాజరైనవారిలో ఎవరి మీదైనా మీరే స్వయంగా ఆసక్తి చూపించండి. బాగున్నారా అని పలకరించడంతో సరిపెట్టుకోకండి. ఆ వ్యక్తి గురించి ఇంకొంచెం ఎక్కువగా తెలుసుకునేందుకు ప్రయత్నించండి. మీకు ఆ వ్యక్తి మీద శ్రద్ధ ఉందని చూపించండి. ఇలా చేయడాన్ని అలవాటుగా చేసుకోండి. (2) క్షేత్రసేవలో మీరు కలిసే వ్యక్తి మీద వ్యక్తిగతంగా ఆసక్తి చూపించండి. సాక్ష్యమివ్వడంతో ఆగిపోకండి. ఆ వ్యక్తి గురించి తెలుసుకోండి. మీకు ఆ వ్యక్తి గురించి తెలిసినదాన్ని బట్టి ఆయనతో మాట్లాడండి, మెలగండి. ఈ విధంగా చేసే అవకాశాల కోసం చూస్తుండండి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి