22
లేఖనాలను సరిగ్గా అన్వయించడం
ఇతరులకు బోధించేటప్పుడు బైబిలు నుండి వచనాలను చదివి వినిపించడం మాత్రమే సరిపోదు. “దేవునియెదుట యోగ్యునిగాను, సిగ్గుపడనక్కరలేని పనివానిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగాను నిన్ను నీవే దేవునికి కనుపరచుకొనుటకు జాగ్రత్తపడుము” అని అపొస్తలుడైన పౌలు తన సహచరుడైన తిమోతికి వ్రాశాడు. (ఇటాలిక్కులు మావి.)—2 తిమో. 2:15.
సత్యవాక్యాన్ని సరిగా ఉపదేశించాలంటే మనం లేఖనాలకిచ్చే వివరణ బైబిలు బోధిస్తున్నదానితో పొందికగా ఉండాలి. అంటే మనకు ఆకర్షణీయంగా అనిపించే మాటలను ఎంపిక చేసుకొని వాటికి మన సొంత ఆలోచనలను జోడించే బదులు, ఆ లేఖన సందర్భాన్ని పరిగణలోకి తీసుకోవడం అవసరం. యెహోవా నోటి నుండి వచ్చిన మాటలను చెబుతామంటూ, నిజానికి “తమకు తోచిన దర్శనమునుబట్టి పలుకు”తున్న ప్రవక్తల గురించి యెహోవా యిర్మీయా ప్రవక్త ద్వారా హెచ్చరించాడు. (యిర్మీ. 23:17) అపొస్తలుడైన పౌలు “కుయుక్తిగా నడుచుకొనకయు, దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు, . . . అవమానకరమైన రహస్యకార్యములను విసర్జించియున్నాము” అని వ్రాసినప్పుడు, దేవుని వాక్యాన్ని మానవ తత్త్వశాస్త్రాలతో కలుషితం చేయవద్దని క్రైస్తవులను హెచ్చరించాడు. ఆ రోజుల్లో నిజాయితీ లేని ద్రాక్షారస వ్యాపారులు, ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలని ద్రాక్షారసంలో నీళ్ళు కలిపి అమ్మేవారు. మనం దేవుని వాక్యాన్ని మానవ తత్త్వశాస్త్రాలతో మిళితం చేసి కలుషితం చేయము. “మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకులవలె ఉండక, నిష్కాపట్యముగలవారమును దేవునివలన నియమింపబడిన వారమునైయుండి, క్రీస్తునందు దేవునియెదుట బోధించుచున్నాము” అని పౌలు ప్రకటించాడు.—2 కొరిం. 2:17; 4:2.
కొన్నిసార్లు మీరు ఒక సూత్రాన్ని నొక్కి చెప్పేందుకు ఒక లేఖనాన్ని ఉటంకించవచ్చు. వివిధ పరిస్థితుల్లో వ్యవహరించవలసిన విధానాలకు సంబంధించి సరైన మార్గదర్శనాన్నిచ్చే అనేక సూత్రాలతో బైబిలు నిండివుంది. (2 తిమో. 3:16,17) మీరు చేసే అన్వయము సరిగ్గా ఉందా, మీరు చెప్పాలనుకుంటున్నదే లేఖనాలు చెబుతున్నట్లు అనిపించేలా ఒక లేఖనాన్ని తప్పుగా ఏమైనా ఉపయోగిస్తున్నారా అన్నది చూసుకోండి. (కీర్త. 91:11,12; మత్త. 4:5,6) మనం చేసే అన్వయము తప్పకుండా యెహోవా సంకల్పంతో పొందిక గలదిగా, దేవుని వాక్యమంతటితోను ఏకీభావము గలదిగా ఉండాలి.
‘సత్యవాక్యమును సరిగా ఉపదేశించడం’లో బైబిలు చెబుతున్న దాని భావాన్నీ ఉద్దేశాన్నీ గ్రహించడం కూడా ఉంది. అది ఇతరులను గదమాయించేందుకు ఉపయోగించే “దుడ్డుకఱ్ఱ” కాదు. యేసుక్రీస్తును వ్యతిరేకించిన మత నాయకులు లేఖనాలను ఉటంకించారు, కానీ వాళ్ళు దేవుడు కోరిన న్యాయము, కనికరము, విశ్వాసము వంటి ప్రధాన విషయాలకు వచ్చేసరికి చూసీ చూడనట్లు వ్యవహరించారు. (మత్త. 22:23,24; 23:23,24) తన తండ్రియైన దేవుని వాక్యాన్ని బోధించేటప్పుడు యేసు ఆయన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించాడు. యేసుకు సత్యం మీదున్న ఆసక్తికి, తాను బోధిస్తున్న ప్రజల మీదున్న ప్రగాఢమైన ప్రేమ తోడైంది. మనం ఆయన మాదిరిని అనుసరించడానికి శాయశక్తులా ప్రయత్నించాలి.—మత్త. 11:28.
మనం లేఖనాలను సరిగ్గా అన్వయిస్తున్నామా లేదా అన్నది ఎలా నిర్ధారించుకోవచ్చు? మనం అలా ఒక నిర్ధారణకు రావడానికి క్రమంగా బైబిలు చదవడం సహాయపడుతుంది. యెహోవా ఏర్పాటు చేసిన ‘నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన దాసుడు’ అయిన ఆత్మాభిషిక్త క్రైస్తవుల సభపట్ల మనకు కృతజ్ఞత ఉండడం కూడా అవసరం; యెహోవా ఆ సభ ద్వారానే విశ్వాస గృహానికి ఆధ్యాత్మిక ఆహారాన్ని అందిస్తున్నాడు. (మత్త. 24:45) నమ్మకమైనవాడును బుద్ధిమంతుడునైన ఆ దాసుని తరగతి ద్వారా ఇవ్వబడుతున్న ఉపదేశం నుండి ప్రయోజనం పొందడానికి వ్యక్తిగత అధ్యయనమూ అలాగే సంఘ కూటాలకు క్రమంగా హాజరవ్వడమూ వాటిలో పాల్గొనడమూ మనకు సహాయపడతాయి.
లేఖనముల నుండి తర్కించడం (ఆంగ్లం) అనే పుస్తకం మీకు అర్థమయ్యే భాషలో లభ్యమైతే, మీరు దాన్ని చక్కగా ఉపయోగించడం నేర్చుకుంటే, మన పరిచర్యలో తరచూ ఉపయోగించబడే వందలాది లేఖనాల సరైన అన్వయం కోసం మీకు కావలసిన సరైన మార్గదర్శనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ పుస్తకంలో సులభంగా దొరుకుతుంది. మీకు పరిచయంలేని ఒక లేఖనాన్ని మీరు ఉపయోగించాలని అనుకుంటున్నట్లయితే, అందుకు అవసరమైన పరిశోధన చేసేందుకు వినయం మిమ్మల్ని కదిలిస్తుంది. అలా చేస్తే మీరు ఆ లేఖనాన్ని చర్చిస్తున్నప్పుడు సత్యవాక్యాన్ని సరైన విధంగా ఉపదేశిస్తారు.—సామె. 11:2.
స్పష్టంగా అన్వయించండి. ఇతరులకు బోధించేటప్పుడు మీరు చర్చిస్తున్న విషయానికీ మీరు ఉపయోగించే లేఖనాలకూ గల సంబంధాన్ని వారు స్పష్టంగా అర్థం చేసుకునేలా బోధించండి. మీరు ఒక ప్రశ్న వేసి లేఖనాన్ని చెబుతున్నట్లయితే, ఆ లేఖనం మీరు అడిగిన ప్రశ్నకు ఎలా జవాబిస్తుందో మీ శ్రోతలు గ్రహించగలగాలి. మీరు ఒక విషయం చెప్పి దాన్ని బలపరచడానికి ఒక లేఖనాన్ని ఉపయోగిస్తున్నట్లయితే ఆ లేఖనం ఆ విషయం సత్యమని ఎలా నిరూపిస్తుందో మీ విద్యార్థి స్పష్టంగా గ్రహించేలా చూడండి.
సాధారణంగా లేఖనాన్ని కేవలం చదవడం మాత్రమే సరిపోదు, నొక్కి పలికినా కూడా సరిపోదు. సగటు వ్యక్తికి బైబిలుతో పరిచయం ఉండదనీ లేఖనాన్ని ఒకసారి చదవగానే ఆ వ్యక్తి మీరు చెప్పే విషయాన్ని గ్రహించలేకపోవచ్చనీ గుర్తుంచుకోండి. ఆ లేఖనంలో మీరు చర్చిస్తున్నదానికి నేరుగా వర్తించే భాగాన్ని గురించి ఆలోచించేలా చెయ్యండి.
సాధారణంగా అలా చెయ్యడానికి అవసరమైనది ఏమిటంటే, మీరు చర్చిస్తున్న విషయంతో నేరుగా సంబంధమున్న కీలకమైన పదాలను ప్రత్యేకంగా పేర్కొనడమే. ఆ విషయాన్ని తెలియజేసే పదాలను మళ్ళీ చెప్పడం అత్యంత సరళమైన పద్ధతి. మీరు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నట్లయితే, కీలకమైన పదాలను ఆయన గుర్తించేందుకు సహాయపడే ప్రశ్నలను మీరు అడగవచ్చు. కొందరు ప్రసంగీకులు, ఒక గుంపుతో మాట్లాడేటప్పుడు పర్యాయపదాలను వాడడం ద్వారా గానీ ఆ విషయాన్ని మళ్ళీ చెప్పడం ద్వారా గానీ తమ లక్ష్యాన్ని సాధించడానికి ఇష్టపడతారు. అయితే మీరు అలా చేయాలని నిర్ణయించుకుంటే, చర్చిస్తున్న విషయానికీ లేఖనంలోని పదాలకీ గల సంబంధం మీది నుండి మీ ప్రేక్షకుల అవధానం మళ్ళకుండా జాగ్రత్తపడండి.
మీరు కీలకమైన పదాలను ప్రత్యేకంగా పేర్కొంటే మంచి పునాదిని వేశారన్నమాటే. ఇక తర్వాతి పని కొనసాగించండి. మీరు ఆ వచనాన్ని ఉపయోగించడానికి గల కారణాన్ని స్పష్టంగా సూచించే ఉపోద్ఘాతంతో మొదలుపెట్టారా? అలాగైతే ప్రేక్షకులు దేని కోసం ఎదురు చూసేలా మీరు చేశారో దానికీ మీరు నొక్కి పలికిన మాటలకూ ఎలాంటి సంబంధముందో చూపించండి. ఆ సంబంధమేమిటో స్పష్టంగా పేర్కొనండి. మీరు ఆ వాక్యానికి సవివరమైన ఉపోద్ఘాతమివ్వకపోయినా దాన్ని చదివిన తర్వాత తప్పకుండా అన్వయించాలి.
“ఏ హేతువుచేతనైనను పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా?” అని పరిసయ్యులు యేసును అడిగారు. అది చాలా చిక్కు ప్రశ్న అని వాళ్ళనుకున్నారు. యేసు ఆదికాండము 2:24 ఆధారంగా వారికి సమాధానమిచ్చాడు. ఆయన ఆ వాక్యంలోని కేవలం ఒక్క భాగం మీదే శ్రద్ధ నిలిపి, ఆ తర్వాత దానిని అవసరానికి తగ్గట్లు అన్వయించాడు. పురుషుడూ స్త్రీ “ఏకశరీరముగా” అవుతారని సూచించిన తర్వాత, “దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచకూడదని” చెప్పి ముగించాడు.—మత్త. 19:3-6.
ఒక లేఖన అన్వయము స్పష్టంగా ఉండేందుకు మీరు ఎంత మేరకు వివరించాలి? అది మీ ప్రేక్షకుల నేపథ్యాన్ని బట్టీ మీరు చర్చిస్తున్న విషయం ప్రాముఖ్యతను బట్టీ ఉంటుంది. సరళంగా సూటిగా చెప్పాలన్నది మీ లక్ష్యమై ఉండాలి.
లేఖనాల నుండి తర్కించండి. అపొస్తలుల కార్యములు 17:2,3 వచనాలు థెస్సలొనీకలో అపొస్తలుడైన పౌలు చేసిన పరిచర్య గురించి మాట్లాడుతూ, ఆయన “లేఖనములలోనుండి . . . తర్కించుచుండెను” అని చెబుతోంది. తర్కించే సామర్థ్యం, యెహోవా దేవుని సేవకుల్లో ప్రతి ఒక్కరూ అలవరుచుకోవడానికి ప్రయత్నించవలసిన సామర్థ్యం. ఉదాహరణకు పౌలు, యేసు జీవితానికీ ఆయన పరిచర్యకూ సంబంధించిన వాస్తవాలను చెప్పి వాటి గురించి హీబ్రూ లేఖనాల్లో ముందుగా ప్రవచించబడిందని చూపించాడు, ఆ తర్వాత ‘నేను మీకు ప్రచురముచేయు యేసే క్రీస్తయియున్నాడు’ అనే శక్తివంతమైన మాటలతో ముగించాడు.
పౌలు హెబ్రీయులకు వ్రాసేటప్పుడు హీబ్రూ లేఖనాల నుండి మళ్ళీ మళ్ళీ ఉల్లేఖించాడు. ఒక విషయాన్ని నొక్కి చెప్పేందుకు లేదా స్పష్టం చేసేందుకు, ఆయన తరచూ ఏదో ఒక పదాన్ని గానీ చిన్న పదబంధాన్ని గానీ ప్రత్యేకంగా చెబుతూ దాని ప్రాముఖ్యతను తెలియజేశాడు. (హెబ్రీ. 12:26,27) హెబ్రీయులు 3వ అధ్యాయంలో కనిపిస్తున్న వృత్తాంతంలో పౌలు కీర్తన 95:7-11 వచనాలను ఉల్లేఖించాడు. ఆ తర్వాత ఆయన అందులోని మూడు భాగాలను విపులీకరించాడన్నది గమనించండి: (1) హృదయాన్ని గురించిన ప్రస్తావన (హెబ్రీ. 3:8-12), (2) “నేడు” అనే మాటకున్న ప్రాముఖ్యత (హెబ్రీ 3:8, 13-15; 4:6-11), (3) “వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు” అన్న మాటల భావం (హెబ్రీ 3:11, 18,19; 4:1-11). మీరు ఒక్కో లేఖనాన్ని అన్వయిస్తున్నప్పుడు ఆయన మాదిరిని అనుకరించడానికి కృషి చేయండి.
లూకా 10:25-37 వచనాలలోని వృత్తాంతంలో, లేఖనాల నుండి యేసు ఎంత సమర్థవంతంగా తర్కించాడో పరిశీలించండి. ధర్మశాస్త్ర ప్రవీణుడైన ఒక పురుషుడు వచ్చి, ‘బోధకుడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను?’ అని అడిగాడు. దానికి సమాధానంగా యేసు, మొదట ఆ వ్యక్తినే తన అభిప్రాయాన్ని తెలపమని కోరి ఆ తర్వాత దేవుని వాక్యం చెబుతున్నట్లు చేయడంలోని ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. ఆ వ్యక్తి అసలు భావాన్ని గ్రహించలేదన్న విషయం స్పష్టమైనప్పుడు లేఖనంలోని కేవలం ఒక్క పదాన్ని, ‘పొరుగువాడు’ అన్న పదాన్ని మాత్రమే తీసుకుని సవివరంగా చర్చించాడు. ఆ పదాన్ని క్లుప్తంగా నిర్వచించే బదులు ఆ వ్యక్తే సరైన నిర్ధారణకు వచ్చేలా సహాయపడేందుకు ఆయన ఒక ఉపమానాన్ని ఉపయోగించాడు.
యేసు ప్రశ్నలకు జవాబిచ్చేటప్పుడు సూటైన స్పష్టమైన జవాబునిచ్చే వాక్యాలను కేవలం ఉటంకించలేదన్నది స్పష్టం. ఆ వాక్యాలు ఏమి చెబుతున్నాయో విశ్లేషించి ఆ తర్వాత వేయబడిన ప్రశ్నకు వాటిని అన్వయించాడు.
సద్దూకయ్యులు పునరుత్థాన నిరీక్షణను సవాలు చేసినప్పుడు యేసు, నిర్గమకాండము 3:6 లోని నిర్దిష్ట భాగంపై శ్రద్ధ కేంద్రీకరించాడు. అయితే ఆయన లేఖనాన్ని ఉటంకించిన తర్వాత అంతటితో ఆపేయలేదు. పునరుత్థానం దేవుని సంకల్పంలో భాగమని స్పష్టంగా చూపించేందుకు ఆ వచనాన్ని ఆధారం చేసుకొని తర్కించాడు.—మార్కు 12:24-27.
లేఖనాల నుండి సరైన విధంగా సమర్థవంతంగా తర్కించే సామర్థ్యాన్ని అలవరుచుకోవడం మీరు నిపుణులైన బోధకులయ్యేందుకు ప్రముఖ కారణం కాగలదు.