23
ఆచరణాత్మక విలువను స్పష్టం చేయడం
మీరు ఒక వ్యక్తితో మాట్లాడుతున్నా పెద్ద సభ ఎదుట ప్రసంగిస్తున్నా మీరు చెబుతున్న విషయం మీద మీకు ఆసక్తి ఉంది కాబట్టి, వాళ్ళకు కూడా ఆసక్తి ఉంటుందని అనుకోవడం జ్ఞానయుక్తం కాదు. మీ సందేశం ప్రాముఖ్యమైనదే కావచ్చు, అయినా దాన్ని ఆచరణలో పెట్టడంలోని విలువను మీరు స్పష్టంగా చెప్పకపోతే మీరు మీ ప్రేక్షకుల ఆసక్తిని ఎక్కువ సేపు నిలబెట్టలేకపోవచ్చు.
రాజ్యమందిరంలోని ప్రేక్షకులకు కూడా ఇది వర్తిస్తుంది. వాళ్ళు ముందెన్నడూ వినని ఉపమానాన్ని గానీ అనుభవాన్ని గానీ మీరు చెబుతుంటే వాళ్ళు మనస్సు పెట్టి వింటుండవచ్చు. కానీ వాళ్ళకు ఇదివరకే తెలిసిన విషయాలను చెబుతున్నప్పుడు, ముఖ్యంగా మీరు వాటిని ఇంకా విపులీకరించి చెప్పనప్పుడు మనస్సుపెట్టి వినకపోవచ్చు. మీరు చెబుతున్న విషయాలు వాళ్ళకు నిజమైన ప్రయోజనం ఎందుకు చేకూర్చుతాయో ఎలా చేకూర్చుతాయో వాళ్ళు గ్రహించేందుకు మీరు వాళ్ళకు సహాయపడడం అవసరం.
ఆచరణాత్మకమైన మార్గాల గురించి ఆలోచించాలని బైబిలు మనలను ప్రోత్సహిస్తోంది. (సామె. 3:21) ప్రజలు “నీతిమంతుల ఆచరణాత్మక జ్ఞానమును” అనుసరించేలా వారికి మార్గనిర్దేశమిచ్చేందుకు బాప్తిస్మమిచ్చే యోహానును యెహోవా ఉపయోగించుకున్నాడు. (లూకా 1:17, NW) అటువంటి జ్ఞానానికి యెహోవాను గురించిన ఆరోగ్యకరమైన భయమే మూలము. (కీర్త. 111:10) ఈ జ్ఞానాన్ని అమూల్యమైనదిగా ఎంచేవారు, ప్రస్తుత జీవిత విధానపు ఒత్తిళ్ళను విజయవంతంగా అధిగమించేందుకూ రాబోయే జీవితమైన నిత్యజీవానికి మంచి పునాది వేసుకునేందుకూ సహాయం పొందుతారు.—1 తిమో. 4:8; 6:18,19.
ప్రసంగాన్ని ఆచరణాత్మకమైనదిగా చేయడం. మీ ప్రసంగం ఆచరణాత్మకమైనదిగా ఉండాలంటే, మీరు సమాచారం గురించి మాత్రమే కాక ప్రేక్షకుల గురించి కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. మీరు మీ ప్రేక్షకులను కేవలం ఒక గుంపుగా దృష్టించకండి. ఆ గుంపులో విభిన్న వ్యక్తులున్నారు, కుటుంబాలున్నాయి. వాళ్ళలో చాలా చిన్న పిల్లలూ కౌమారప్రాయంలోనివారూ వయోజనులూ కొందరు వృద్ధులు కూడా ఉండవచ్చు. క్రొత్తగా ఆసక్తి చూపిస్తున్నవారూ మీరు పుట్టక ముందే యెహోవాను సేవించడం మొదలుపెట్టినవారూ ఉండవచ్చు. కొందరు ఆధ్యాత్మిక పరిణతిగలవారై ఉండవచ్చు; ఇతరులు ఇప్పటికీ లోక సంబంధమైన కొన్ని దృక్పథాల, అలవాట్ల ప్రభావంలో ఉండి ఉండవచ్చు. ‘నేను చర్చించబోతున్న సమాచారం, ప్రేక్షకులకు ఎలా ప్రయోజనం చేకూర్చవచ్చు? ఈ ప్రసంగంలోని విషయాన్ని అర్థం చేసుకోవడానికి నేను వారికి ఎలా సహాయపడగలను?’ అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. పైన పేర్కొనబడిన వారిలో కేవలం ఒక గుంపునో లేక రెండు గుంపులనో ఎక్కువగా మనస్సులో పెట్టుకోవాలని నిర్ణయించుకోవచ్చు. అలాగని మిగతావాళ్ళ విషయం పూర్తిగా వదిలేయకండి.
మీరు ప్రాథమిక బైబిలు బోధనను చర్చించడానికి నియమించబడితే అప్పుడేమి చెయ్యాలి? ఆ బోధనను ఇప్పటికే నమ్ముతున్న వారికి కూడా ప్రయోజనకరంగా ఉండేలా ఎలా చర్చించవచ్చు? ఆ బోధన మీద వారికున్న దృఢ నమ్మకాన్ని మరింత బలపరచడానికి కృషి చేయండి. ఎలా? దానిని బలపరిచే లేఖనానుసారమైన రుజువుల ఆధారంగా తర్కించండి. ఆ బైబిలు బోధన ఇతర బైబిలు సత్యాలతోనూ యెహోవా సొంత వ్యక్తిత్వంతోనూ ఎలా పొందికగావుందో చూపించడం ద్వారా మీరు ఆ బోధన గురించి వారికున్న అవగాహనను మరింత ప్రగాఢం చేయవచ్చు. ఆ బోధనను అర్థం చేసుకోవడం ద్వారా ప్రజలు ఎలా ప్రయోజనం పొందారో, భవిష్యత్తును గురించిన వారి దృక్కోణంపై అది ఎలా ప్రభావం చూపించిందో తెలియజేసే ఉదాహరణలను, సాధ్యమైతే నిజ జీవితానుభవాలను ఉపయోగించండి.
ఆచరణాత్మక అన్వయాన్ని ప్రసంగ ముగింపులో కొన్ని క్లుప్తమైన వ్యాఖ్యానాలకు పరిమితం చేయకండి. ప్రారంభం నుండే మీ ప్రేక్షకుల్లో ప్రతి ఒక్కరు, “ఇది నాకు వర్తిస్తుంది” అని భావించేలా చేయండి. అలాంటి పునాదిని వేసిన తర్వాత, మీ ప్రసంగ ముఖ్యభాగంలో ఒక్కో ముఖ్యాంశాన్ని విపులీకరిస్తున్నప్పుడూ ప్రసంగం ముగింపులోనూ ఆచరణాత్మకంగా అన్వయిస్తూనే ఉండండి.
ఒక అంశాన్ని అన్వయిస్తున్నప్పుడు, దాన్ని బైబిలు సూత్రాలకు పొందికగా అన్వయించండి. దాని భావమేమిటి? అంటే ప్రేమపూర్వకంగానూ తదనుభూతిని చూపిస్తూ అన్వయించాలని అర్థం. (1 పేతు. 3:8; 1 యోహా. 4:8) థెస్సలొనీకలో ఉన్న పెద్ద సమస్యల గురించి చర్చిస్తున్నప్పుడు కూడా పౌలు అక్కడ ఉన్న తన క్రైస్తవ సహోదర సహోదరీల ఆధ్యాత్మిక ప్రగతికి సంబంధించిన అనుకూల పార్శ్వాల గురించి మెచ్చుకోలుగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాడు. తాను అప్పుడు చర్చిస్తున్న విషయంలో కూడా వాళ్ళు సరైనది చేయాలని కోరుకుంటారు అన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. (1 థెస్స. 4:1-12) అనుకరించడానికి ఎంత చక్కని పద్ధతి!
మీ ప్రసంగ ఉద్దేశం ఇతరులకు సువార్తను ప్రకటించడంలోనూ బోధించడంలోనూ పాలుపంచుకోమని పురికొల్పాలన్నదేనా? మనకున్న ఈ ఆధిక్యత విషయమై ఉత్సాహాన్నీ మెప్పుదలనూ పెంపొందించండి. అయితే అలా చేసేటప్పుడు వీటిలో ప్రతి ఒక్కరూ ఒకే స్థాయిలో పాల్గొనలేరన్నది గుర్తుంచుకోండి, ఈ విషయాన్ని బైబిలు కూడా పరిగణలోకి తీసుకుంటుంది. (మత్త. 13:23) మీ సహోదరులు అపరాధ భావాలతో కృంగిపోయేలా చేయకండి. “ప్రేమచూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలెనని” హెబ్రీయులు 10:24,25 మనకు ఉద్బోధిస్తోంది. ప్రేమ చూపడానికి మనం పురికొల్పితే అది సదుద్దేశంతో కూడిన పనులకు దారితీస్తుంది. అందరూ ఒకేలా ఉండాలని శాసించే బదులు, అందరూ ‘విశ్వాసమునకు విధేయులయ్యేలా’ మనం ప్రోత్సహించాలనే యెహోవా మనలను కోరుతున్నాడని గుర్తుంచుకోండి. (రోమా. 16:25-27) ఈ విషయాన్ని మనస్సులో ఉంచుకొని మనం మన సొంత విశ్వాసాన్నీ మన సహోదరుల విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ప్రయత్నిస్తాము.
ఇతరులు ఆచరణాత్మక విలువను గ్రహించేందుకు సహాయపడడం. మీరు ఇతరులకు సాక్ష్యమిస్తున్నప్పుడు, సువార్తకున్న ఆచరణాత్మక విలువను తప్పకుండా నొక్కిచెప్పండి. అలా చెప్పేందుకు మీ సేవా ప్రాంతంలోని ప్రజల మనస్సుల్లో ఏముందో పరిగణలోకి తీసుకోవడం అవసరం. వాళ్ళ మనస్సులో ఏముందో మీరు ఎలా తెలుసుకోగలరు? రేడియోలో గానీ టీవీలో గానీ వార్తలు వినండి. వార్తాపత్రిక మొదటి పేజీ చూడండి. ప్రజలను సంభాషణలోకి దించడానికి ప్రయత్నించండి, వాళ్ళు మాట్లాడేటప్పుడు వినండి. వెంటనే పరిష్కరించబడవలసిన సమస్యలతో వారు పోరాడుతున్నారని మీరు గ్రహించవచ్చు. ఉద్యోగం కోల్పోవడం, అద్దె కట్టలేకపోవడం, అనారోగ్యం, కుటుంబ సభ్యుడి మరణం, నేరాలకు బలయ్యే ప్రమాదం, అధికార స్థానంలో ఉన్నవారి చేతుల్లో అన్యాయానికి గురవ్వడం, వివాహం విచ్ఛిన్నం కావడం, చిన్నపిల్లలను అదుపులో పెట్టడం మొదలైనవే ఆ సమస్యలు కావచ్చు. మరైతే బైబిలు వారికి సహాయపడగలదా? నిస్సంశయంగా.
మీరు సంభాషణ మొదలుపెడుతున్నప్పుడు మీ మనస్సులో ఒక విషయం ఉండవచ్చు. అయితే తన మనస్సు ఇప్పుడు మరొక సమస్య మీద ఉందని ఆ వ్యక్తి సూచిస్తే సాధ్యమైతే ఆ విషయాన్ని చర్చించడానికి సంకోచించకండి, లేదా ఈ సారి వచ్చినప్పుడు ఈ విషయానికి సంబంధించిన సహాయకరమైన సమాచారాన్ని తీసుకొస్తానని చెప్పండి. ‘మనం పరులజోలికి పోకుండా’ జాగ్రత్తపడతాము, అయితే బైబిలు ఇచ్చే ఆచరణాత్మకమైన సలహాలను ఇతరులతో ఆనందంగా పంచుకుంటాము. (2 థెస్స. 3:11) తమ సొంత జీవితాలకు వర్తించే బైబిలు సలహాలే ఇతర ప్రజల మనస్సుల్లో కూడా బాగా ముద్రించుకుపోతాయన్నది స్పష్టం.
మన సందేశం వ్యక్తిగతంగా తమ మీద ఎలా ప్రభావం చూపుతుందో ప్రజలు గ్రహించలేనప్పుడు, వారు మన సంభాషణను త్వరగా తుంచేయవచ్చు. వాళ్ళు మనలను మాట్లాడనిచ్చినా, మనం మాట్లాడుతున్న విషయానికున్న ఆచరణాత్మక విలువను తెలియజేయకపోతే, మనం అందించే సందేశం వారి జీవితాలపై ఏమంత ప్రభావం చూపించదు. బదులుగా, మనం మన సందేశానికున్న ఆచరణాత్మకమైన విలువను స్పష్టం చేస్తే, మనం చర్చించిన విషయం ప్రజల జీవితానికి ఒక మలుపురాయి కాగలదు.
బైబిలు అధ్యయనాలను నిర్వహించేటప్పుడు కూడా ఆచరణాత్మక విలువను నొక్కిచెబుతూనే ఉండండి. (సామె. 4:7) యెహోవా మార్గాల్లో నడవడమెలాగో చూపించే లేఖనానుసారమైన సలహాలను, సూత్రాలను, ఉదాహరణలను అర్థం చేసుకోవడానికి విద్యార్థికి సహాయపడండి. ఆ విధంగా నడవడం వల్ల వచ్చే ప్రయోజనాలను నొక్కిచెప్పండి. (యెష. 48:17,18) అలా నొక్కిచెప్పడం వల్ల, విద్యార్థులు తమ జీవితాల్లో అవసరమైన మార్పులు చేసుకునేలా కదిలించబడతారు. యెహోవా మీద ప్రేమనూ ఆయనను ప్రీతిపరచాలన్న కోరికనూ వారిలో కలిగించండి, దేవుని వాక్యంలోవున్న సలహాను తమ జీవితంలో అన్వయించుకోవాలన్న ప్రేరణ వారి అంతరంగంలోనే జనించేలా చేయండి.