సంభాషణా సామర్థ్యాలను ఎలా మెరుగుపరుచుకోవచ్చు?
ఇతరులతో సంభాషించడం సులభమని సాధారణంగా మీకు అనిపిస్తుందా? ఎవరితోనైనా సంభాషణ జరపాలంటే, ప్రత్యేకించి తమకు తెలియని వ్యక్తితో సంభాషణ జరపడమంటే చాలామందికి భయమేస్తుంది. అలాంటి వ్యక్తులు బిడియస్థులై ఉండవచ్చు. ‘నేను దేని గురించి మాట్లాడాలి? నేను చర్చను ఎలా మొదలుపెట్టగలను? దానిని ఎలా కొనసాగించగలను?’ అని వారు ఆలోచిస్తుండవచ్చు. ఆత్మవిశ్వాసంతో, ఇతరులతో కలివిడిగా ఉండేవారు, సంభాషణలో తామే ఎక్కువగా మాట్లాడడానికి మొగ్గు చూపుతుండవచ్చు. అలాంటివారికి ఇతరుల మనస్సులోని మాటలను రాబట్టడం, చెబుతున్నదానిని వినడం నేర్చుకోవడం సవాలు కావచ్చు. కనుక మనమందరమూ, బిడియస్థులమైనా కలివిడిగా ఉండేవాళ్ళమే అయినా సరే, సంభాషణా కళను అలవరుచుకోవలసిన అవసరం ఉంది.
ఇంట్లోనే మొదలుపెట్టండి
మీరు సంభాషణా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడం మీ ఇంట్లోనే ఎందుకు మొదలుపెట్టకూడదు? నిర్మాణాత్మకమైన సంభాషణ, కుటుంబ సంతోషానికి ఎంతగానో తోడ్పడగలదు.
ఒకరి మీద ఒకరు ఎంతో శ్రద్ధతీసుకోవడం, అలాంటి సంభాషణకు మొట్టమొదటిగా ఉండవలసిన కీలకమైన లక్షణం. (ద్వితీ. 6:6,7; సామె. 4:1-4) మనం అలా శ్రద్ధ చూపిస్తున్నప్పుడు మన భావాలను వ్యక్తంచేస్తాం, ఎదుటి వ్యక్తి ఏమైనా చెప్పాలనుకుంటున్నప్పుడు వింటాం. చెప్పదగిన అంశాలు ఉండడం మరొక ప్రాముఖ్యమైన విషయం. క్రమంగా బైబిలు చదువుతూ, అధ్యయనం చేస్తున్నట్లైతే మనం పంచుకోగల విషయాలు చాలా ఉంటాయి. ప్రతిదినం లేఖనాలను పరిశోధించడం అనే చిన్న పుస్తకాన్ని సముచితంగా ఉపయోగించడం చర్చకు ప్రేరణనిస్తుంది. పగలు, బహుశా క్షేత్ర సేవలో ఆనందకరమైన అనుభవం మనకు ఎదురై ఉండవచ్చు. ఉపదేశాత్మకమైనది గానీ హాస్యభరితమైనది గానీ ఏదైనా మనం చదవవచ్చు. ఆరోగ్యకరమైన కుటుంబ సంభాషణా వేళల్లో, వీటిని పంచుకోవడాన్ని అలవాటు చేసుకోవాలి. ఇది కుటుంబ సభ్యులుకాని వారితో సంభాషించేందుకు కూడా సహాయపడగలదు.
అపరిచితులతో సంభాషించడం
చాలామంది తమకు తెలియనివారితో సంభాషణ మొదలుపెట్టడానికి సంకోచిస్తారు. కానీ, యెహోవాసాక్షులు, దేవుని మీదా తమ పొరుగువారి మీదా తమకున్న ప్రేమను బట్టి ఇతరులతో బైబిలు సత్యాలు పంచుకునేందుకూ సంభాషించడం ఎలాగో నేర్చుకోవడానికీ హృదయపూర్వకంగా కృషి చేస్తారు. ఈ రంగంలో మెరుగుపడడానికి మీకు ఏది సహాయపడగలదు?
ఫిలిప్పీయులు 2:4 లో పేర్కొనబడిన సూత్రం చాలా విలువైనది. “సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ” చూడాలని మనం ప్రోత్సహించబడుతున్నాం. ఈ విధంగా ఆలోచించండి: మీరు ఒక వ్యక్తిని మునుపెన్నడూ కలవనట్లయితే, ఆయన మిమ్మల్ని అపరిచితుడిగా దృష్టిస్తాడు. ఆయనకు ఇబ్బంది అనిపించకుండా ఉండేందుకు మీరు ఏమి చేయగలరు? స్నేహపూర్వకమైన చిరునవ్వూ మైత్రీభావంతో కూడిన పలకరింపూ ఆయనకు ఇబ్బందిగా అనిపించకుండా ఉండేందుకు తోడ్పడతాయి. అయితే మీరు పరిగణలోకి తీసుకోవలసిన విషయాలు ఇంకా ఉన్నాయి.
మీరు ఆయన ఆలోచనలకు భంగం కలిగించివుండవచ్చు. ఆయన మనస్సులో ఏముందో పట్టించుకోకుండా, మీ మనస్సులో ఉన్న దాని గురించి చర్చించేందుకు ప్రయత్నిస్తే ఆయన మీకు అనుకూలంగా ప్రతిస్పందిస్తాడా? సమరయలోని ఒక బావి దగ్గర యేసు ఒక స్త్రీని కలిసినప్పుడు, ఆయన ఏమి చేశాడు? ఆమె మనస్సు నీళ్ళు తోడుకోవడంపై ఉంది. యేసు దాని ఆధారంగా సంభాషణను ప్రారంభించి, ఆ సంభాషణను త్వరగానే ఉత్సాహభరితమైన ఆధ్యాత్మిక చర్చగా మలిచాడు.—యోహా. 4:7-26.
మీరు పరిశీలనా దృష్టిగలవారైతే, అవతలి వ్యక్తి దేని గురించి ఆలోచిస్తున్నాడన్నది గ్రహించగలుగుతారు. ఆ వ్యక్తి సంతోషంగా ఉన్నాడా విచారంగా ఉన్నాడా? ఆయన వయస్సు మళ్ళిన వ్యక్తా, అలా అయితే బలహీనంగా ఏమైనా ఉన్నాడా? ఇంట్లో పిల్లలున్నారనే దానికి సూచనలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఆ వ్యక్తి బాగా ఉన్నవాడనిపిస్తోందా లేక జీవితావసరాలను తీర్చుకోవడానికి చాలా కష్టాలు పడుతున్నట్లు అనిపిస్తోందా? గృహాలంకరణలు లేదా ఆ వ్యక్తి ధరించిన ఆభరణాలు మత ప్రభావాన్ని సూచిస్తున్నాయా? మీరు వారిని పలకరించేటప్పుడు వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే, ఆయనకూ మీకూ ఒకేవిధమైన విషయాల్లో ఆసక్తి ఉన్నట్లు ఆయన దృష్టించవచ్చు.
మీరు గృహస్థుడిని ముఖాముఖి కలవలేకపోతే, తలుపు తెరవకుండా అవతలి నుండి ఆయన గొంతు మాత్రమే వినిపిస్తుంటే, మీరు ఏ నిర్ధారణకు రావచ్చు? ఆ వ్యక్తి భయంతో బ్రతుకుతుండవచ్చు. దాన్ని ఆధారంగా చేసుకొని, తలుపు మూసివున్నా ఆయనతో సంభాషణ ప్రారంభించగలరా?
కొన్ని ప్రాంతాల్లో, మీరు మీ గురించి మాట్లాడడం ద్వారా ఒక వ్యక్తిని సంభాషణలోకి దించవచ్చు. మీ నేపథ్యం ఏమిటో, మీరు వాళ్ళింటికి ఎందుకు వచ్చారో, మీరు దేవుణ్ణి ఎందుకు నమ్ముతారో, మీరు బైబిలు అధ్యయనం చేయడం ఎందుకు మొదలుపెట్టారో, బైబిలు మీకు ఎలా సహాయపడిందో మీరు చెప్పవచ్చు. (అపొ. 26:4-23) అయితే మీరు అలా చెప్పేటప్పుడు మనస్సులో స్పష్టమైన లక్ష్యం పెట్టుకొని వివేచనతో చెప్పాలి. అప్పుడు ఆ వ్యక్తి తన గురించీ తన అభిప్రాయాల గురించీ మీకు చెప్పడానికి కదిలించబడవచ్చు.
కొన్ని సంస్కృతుల్లో, అపరిచితులకు ఆతిథ్యమివ్వడం సాంప్రదాయం. ప్రజలు మిమ్మల్ని వెంటనే తమ ఇంట్లోకి ఆహ్వానించి కూర్చోమని చెబుతుండవచ్చు. మీరు కూర్చున్న తర్వాత, ఆ కుటుంబ సంక్షేమాన్ని గురించి మీరు మర్యాదగా నమ్రతగా అడిగితే, వారి ప్రతిస్పందనను హృదయపూర్వకంగా వింటే, ఆ ఇంటి యజమాని కూడా మీరు చెప్పేదాన్ని అంతే శ్రద్ధగా వింటాడు. మరి కొందరు, సందర్శకులపై ఇంకా ఎక్కువ ఆసక్తిని కనబరుస్తారు, కాబట్టి ప్రారంభ సంభాషణకు కొంచెం ఎక్కువ సమయాన్ని ఉపయోగించవలసి వస్తుంది. అలా సంభాషణను కొనసాగిస్తుండగా మీ తలంపులు కొన్ని తమ తలంపుల్లానే ఉన్నాయని వారు గ్రహిస్తారు. అది ప్రయోజనకరమైన ఆధ్యాత్మిక చర్చకు దారితీయగలదు.
మీ ప్రాంతంలో, వేరే భాషలను మాట్లాడే ప్రజలు చాలామంది ఉంటే అప్పుడు ఏమిటి? మీరు ఆ ప్రజలతో ఎలా సంభాషించగలరు? మీరు అటువంటి కొన్ని భాషల్లో కనీసం సరళమైన పలకరింపులను నేర్చుకున్నా, మీకు తమపై ఆసక్తి ఉందని ఆ ప్రజలు గ్రహిస్తారు. వాళ్ళు అలా గ్రహించడం ఆ తర్వాత వాళ్ళు తమ భావాలను వ్యక్తం చేయడానికి దారితీయవచ్చు.
ఒక సంభాషణను కొనసాగించడమెలా?
సంభాషణను కొనసాగించేందుకు ఎదుటి వ్యక్తి ఆలోచనలపై ఆసక్తి చూపించండి. ఆయన తన ఆలోచనలను వ్యక్తం చేయడానికి ఇష్టపడుతున్నట్లయితే, అలా వ్యక్తం చేసేలా ఆయనను ప్రోత్సహించండి. అందుకు చక్కగా ఎంపిక చేయబడిన ప్రశ్నలు చాలా సహాయపడగలవు. దృక్పథాలను రాబట్టే ప్రశ్నలు వేయడం శ్రేష్ఠం, ఎందుకంటే, అవి తరచూ అవును, కాదు అని చెప్పడం కన్నా ఎక్కువగా ప్రతిస్పందించేలా చేస్తాయి. ఉదాహరణకు, స్థానిక ప్రజలందరినీ కలతపెడుతున్న ఒక సమస్యను పేర్కొన్న తర్వాత, “ఈ పరిస్థితికి కారణమేమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు?” అని గానీ “ఈ సమస్యకు పరిష్కారమేమిటని మీరు అనుకుంటున్నారు?” అని గానీ అడగవచ్చు.
మీరు ఒక ప్రశ్న వేసినప్పుడు, వారి జవాబును శ్రద్ధగా వినండి. మీరు ఒక మాట ద్వారా తలూపడం ద్వారా సంజ్ఞ ద్వారా మీకు నిజంగా ఆసక్తి ఉందని సూచించండి. మధ్యలో ఆపకండి. విశాలమనస్సుతో, వాళ్ళు చెప్పిన దాన్ని పరిగణలోకి తీసుకోండి. ‘వినుటకు వేగిరపడువారును, మాటలాడుటకు నిదానించువారునై’ ఉండండి. (యాకో. 1:19) మీరు ప్రతిస్పందించేటప్పుడు, వాళ్ళు చెప్పిన దానిని మీరు నిజంగా విన్నారని చూపించండి.
అయితే, మీ ప్రశ్నలకు ప్రతి ఒక్కరూ జవాబివ్వరన్నది కూడా గ్రహించండి. కొంతమంది నుండి వచ్చే ప్రతిస్పందన కేవలం కనుబొమ్మలు కదిలించడం లేదా చిరునవ్వు చిందించడమే కావచ్చు. మరికొందరు కేవలం అవును అని గానీ, కాదు అని గానీ చెప్పవచ్చు. అంత మాత్రాన నిరాశ చెందకండి, ఓపికపట్టండి. బలవంతంగా సంభాషణను కొనసాగించడానికి ప్రయత్నించకండి. వినడానికి ఆ వ్యక్తి సిద్ధపడితే, నిర్మాణాత్మకమైన లేఖనాధారిత తలంపులను పంచుకునేందుకు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోండి. కొద్ది సేపటికి ఆ వ్యక్తి, మిమ్మల్ని ఒక నేస్తంగా దృష్టించవచ్చు. బహుశా అప్పుడు, ఆయన తన ఆలోచనలను మీతో మరింత స్వేచ్ఛగా పంచుకోవడానికి సుముఖత చూపించవచ్చు.
మీరు ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు భవిష్యత్తును కూడా దృష్టిలో ఉంచుకోండి. ఆ వ్యక్తి అనేక ప్రశ్నలు వేస్తే కొన్నింటికే జవాబిచ్చి, మీరు ఈ సారి కలుసుకునేటప్పుడు మాట్లాడేందుకు ఒకటి రెండు ప్రశ్నలు వదిలేయండి. పరిశోధన చేసి, తర్వాత ఆ ఫలితాలను పంచుకుంటానని చెప్పండి. ఆయన ప్రశ్నలు వేయకపోతే, ఆయనకు ఆసక్తికరంగా ఉండవచ్చని మీరు అనుకుంటున్న ప్రశ్నతో మీరు సంభాషణను ముగించవచ్చు. ఈ సారి వచ్చినప్పుడు దాని గురించి చర్చించుకుందామని చెప్పండి. లేఖనముల నుండి తర్కించడం (ఆంగ్లం) అనే పుస్తకంలోనూ దేవుడు మన నుండి ఏమి కోరుతున్నాడు? అనే బ్రోషూర్‌లోనూ ఇటీవలి కావలికోట, తేజరిల్లు! సంచికల్లోనూ కావలసినన్ని తలంపులు కనిపిస్తాయి.
తోటి విశ్వాసులతో ఉన్నప్పుడు
యెహోవాసాక్షుల్లో మరొకరిని మీరు మొదటిసారిగా కలిసినప్పుడు, వారిని పరిచయం చేసుకోవడానికి మీరు చొరవ తీసుకుంటారా? లేక మౌనంగా నిలబడిపోతారా? మన సహోదరుల మీద మనకుండే ప్రేమ మనం వారి గురించి తెలుసుకోవాలని కోరుకునేలా మనలను కదిలించాలి. (యోహా. 13:35) మీరు వారితో మాట్లాడడం ఎలా మొదలుపెట్టగలరు? మీరు మీ పేరు చెప్పి, ఎదుటి వ్యక్తి పేరు అడగవచ్చు. మీరు సత్యం ఎలా నేర్చుకున్నారు అని అడగడం, సాధారణంగా ఆసక్తికరమైన సంభాషణకు దారితీసి ఒకరినొకరు తెలుసుకునేందుకు సహాయపడుతుంది. మీరు అనర్గళంగా మాట్లాడలేకపోయినప్పటికీ మీరు చేసే ప్రయత్నం, మీరు ఎదుటి వ్యక్తి మీద శ్రద్ధ చూపిస్తున్నారని సూచిస్తుంది, అదే ముఖ్యం.
మీ సంఘ సభ్యుడితో అర్థవంతమైన సంభాషణను జరిపేందుకు ఏమి తోడ్పడగలదు? ఆ వ్యక్తిపైనా ఆయన కుటుంబంపైనా నిజమైన ఆసక్తిని కనబరచడం. కూటం ఇప్పుడే ముగిసిందా? అలాగైతే సహాయకరంగా ఉన్నట్లు మీకనిపించిన అంశాలను గురించి వ్యాఖ్యానించండి. అలా చేయడం మీకిద్దరికీ ప్రయోజనకరంగా ఉండగలదు. ఇటీవలి కావలికోట, తేజరిల్లు! సంచికలలోవున్న ఆసక్తికరమైన విషయాన్ని మీరు పేర్కొనవచ్చు. అయితే అలా పేర్కొంటున్నప్పుడు అది మీ పరిజ్ఞానాన్ని చూపించుకొంటున్నట్లు గానీ ఎదుటి వ్యక్తి పరిజ్ఞానాన్ని పరీక్షిస్తున్నట్లు గానీ ఉండకూడదు. మీకు ప్రత్యేకంగా ఆనందకరంగా అనిపించిన విషయాన్ని పంచుకోవాలనే ఉద్దేశంతో వ్యాఖ్యానించండి. మీ ఇద్దరిలో ఎవరికైనా దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో నియామకం ఉంటే, దానిని ఎలా నిర్వహించవచ్చన్న దానిపై మీకు గల తలంపులను పంచుకోవచ్చు. మీకు క్షేత్ర పరిచర్యలో కలిగిన అనుభవాలను కూడా పంచుకోవచ్చు.
నిజమే, ప్రజలపై మనకున్న ఆసక్తి తరచూ ప్రజల గురించీ వారు చెప్పిన మాటల గురించీ చేసిన కార్యాల గురించీ సంభాషించడానికి దారితీస్తుంది. హాస్యం కూడా మన మాటల్లో భాగంగా ఉండవచ్చు. మనం చెప్పేవి నిర్మాణాత్మకంగా ఉంటాయా? మనం దేవుని వాక్యపు ఉపదేశాన్ని హృదయంలోకి తీసుకుంటే, దైవిక ప్రేమచేత మనం పురికొల్పబడితే, మన మాటలు తప్పకుండా నిర్మాణాత్మకంగా ఉంటాయి.—సామె. 16:27,28; ఎఫె. 4:25,29; 5:3,4; యాకో. 1:26.
మనం క్షేత్ర పరిచర్యలో పాల్గొనే ముందు సిద్ధపడతాం. స్నేహితులతో సంభాషించేందుకు ఆసక్తికరమైన చిన్న సమాచారాన్ని ఎందుకు సిద్ధపడకూడదు? మీరు ఆసక్తికరమైన విషయాలను చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు మీరు ఇతరులతో పంచుకోవాలనుకున్నవాటిని మనస్సులో ఉంచుకోండి. కొంత కాలానికి, మీరు ఎంపిక చేసుకోవడానికి కావలసినన్ని విషయాలు ఉంటాయి. ఈ విధంగా చేయడం వల్ల, మీరు ఎల్లప్పుడూ దైనందిన జీవితానికి సంబంధించిన వ్యాఖ్యలనే చెయ్యకుండా, ఇతర అనేక విషయాల గురించి మాట్లాడగలుగుతారు. అన్నింటికన్నా ముఖ్యంగా మీ మాటలు, దేవుని వాక్యం మీకు ఎంత ప్రియమైనదన్న దానికి రుజువునిస్తాయి!—కీర్త. 139:17.