పత్రిక ముఖ్యాంశం
విపత్తు విరుచుకుపడినప్పుడు—ప్రాణాల్ని కాపాడే జాగ్రత్తలు
“చెవులు చిల్లులు పడేలా, ఏదో పేలినట్టు ఒక పెద్ద శబ్దం వినబడింది, ఆ శబ్దానికి నేను దాదాపు కింద పడిపోయాను. మా రూమ్ అంతా పొగతో నిండిపోయింది, చాలా ఎత్తయిన మా ఆఫీస్ బిల్డింగ్ మొత్తం మంటలు చెలరేగాయి.”—జాషువ.
భూకంపం! తుఫాను! ఉగ్రవాదుల దాడి! స్కూల్లో కాల్పులు! వీటి గురించి న్యూస్‌లో వినీవినీ చెవులు తూట్లు పడ్డాయి. ఇవన్నీ వినడం ఒక ఎత్తయితే, కళ్ల ముందు జరగడం ఇంకో ఎత్తు. మరి ప్రాణాలతో బయటపడాలంటే విపత్తు రాకముందు, వచ్చాక, వచ్చిన తర్వాత మనం ఏమేం చేయవచ్చు?
విపత్తు రాకముందు—సిద్ధంగా ఉండండి!
మనలో ఎవరైనా, ఎప్పుడైనా విపత్తు బారిన పడవచ్చు. ప్రాణాలతో బయటపడాలంటే ముందుగానే సిద్ధపడడం చాలా ప్రాముఖ్యం. మరి మనం ఏం చేయాలి?
మీ మనసును సిద్ధం చేసుకోండి. మీరు, మీవాళ్లు ఎప్పుడైనా విపత్తులు ఎదుర్కోవచ్చని గుర్తుంచుకోండి. మనం విపత్తు వచ్చాక సిద్ధపడితే చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అవుతుంది, పెద్దగా లాభం ఉండదు.
మీ ప్రాంతంలో ఎలాంటి విపత్తులు వచ్చే అవకాశం ఉందో ముందే తెలుసుకోండి. అవి వచ్చినప్పుడు ఎక్కడ తల దాచుకోవాలో ఓ కంట కనిపెట్టుకుని ఉండండి. మీ ఇల్లు, మీరు ఉంటున్న ప్రాంతం సురక్షితమేనా కాదా చూసుకోండి. అగ్ని ప్రమాదాలకు దారి తీసేవి ఏమైనా ఉంటే వాటిని తీసేయండి. మంటల్ని పసిగట్టే అలారంలు (స్మోక్ డిటెక్టర్స్) పెట్టుకోండి. వాటి బ్యాటరీస్‌ని అవసరాన్ని బట్టి లేదా కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా మార్చుకోండి, అవి సరైన స్థితిలో ఉన్నాయో లేవో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోండి.
అత్యవసర పరిస్థితుల్లో కావాల్సినవి రెడీగా పెట్టుకోండి. ఆ సమయంలో కరెంట్, నీటి సరఫరా, ఫోన్ నెట్వర్క్, రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉండకపోవచ్చు. మీకు బండి ఉంటే ట్యాంక్‌లో కనీసం సగం వరకు పెట్రోల్ లేదా డీజిల్ ఉండేలా చూసుకోండి. ఇంట్లో ఎప్పుడూ కొన్ని రోజులకు సరిపోయే ఆహారం, నీళ్లు, అవసరమయ్యే వేరే వస్తువులు ఉండేలా చూసుకోండి.—“మీకు కావాల్సినవన్నీ ఉన్నాయా?” బాక్స్ చూడండి.
ప్రాణాలతో బయటపడాలంటే ముందుగానే సిద్ధపడడం చాలా ప్రాముఖ్యం.
మీకు దగ్గర్లో అలాగే వేరే ప్రాంతాల్లో ఉన్న బంధువుల, స్నేహితుల ఫోన్ నంబర్లు రెడీగా పెట్టుకోండి.
విపత్తు వచ్చినప్పుడు సురక్షితమైన చోటు ఏదో ఆలోచించి, అక్కడికి ఎలా వెళ్లాలో ముందుగానే ప్రాక్టీస్ చేయండి. మీరు ఉంటున్న బిల్డింగ్‌లో, మీ పిల్లల స్కూల్లో బయటికి వెళ్లడానికి ఎన్ని ద్వారాలు ఉన్నాయో, అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకోండి. విపత్తు సమయంలో మీ కుటుంబమంతా ఎక్కడ కలుసుకోవాలో ముందే అనుకోండి (బహుశా స్కూల్ లేదా పార్క్ లాంటివి). ఒకటి మీ ఇంటికి దగ్గర్లో ఉండేలా, ఇంకొకటి కాస్త దూరంలో ఉండేలా ప్లాన్ చేసుకోండి. మీరు అనుకున్న ఆ చోట్లకు మీ కుటుంబంతో కలిసి నడుచుకుంటూ వెళ్లడం ముందుగానే ప్రాక్టీస్ చేస్తే మంచిదని అధికారులు చెప్తున్నారు.
ఇతరులకు అంటే పెద్ద వయసు వాళ్లకు, చూడలేని-నడవలేని వాళ్లకు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న వాళ్లకు ఎలా సహాయం చేయవచ్చో ఆలోచించండి.
విపత్తు వచ్చాక—వెంటనే చర్య తీసుకోండి
అంతకుముందు చెప్పిన జాషువ ఇలా అంటున్నాడు: “మంటలు వచ్చినప్పుడు చాలామంది కంగారుపడలేదు కానీ బాగా ఆలస్యం చేశారు. కొంతమంది కంప్యూటర్లు ఆఫ్ చేసుకున్నారు, ఇంకొంతమంది బాటిల్లో నీళ్లు నింపుకున్నారు. ఒక వ్యక్తి అయితే ‘ఇంకొంచెం సేపు ఆగితే మంచిదేమో’ అని అన్నాడు.” వాళ్లు అలా ఆలస్యం చేస్తున్నా సరే జాషువ మాత్రం “మనం ఇప్పుడే ఇక్కడ నుండి బయటికి వెళ్లాలి!” అని గట్టిగా అరిచాడు. వాళ్లు అది విని, ఇక ఆలస్యం చేయకుండా మెట్లమీద నుండి కిందికి వెళ్లడానికి తనని ఫాలో అయ్యారు. “ఎవరైనా కింద పడితే వాళ్లను పైకి లేపి ముందుకు వెళ్తూ ఉండండి. మనం తప్పకుండా బయట పడతాం!” అని జాషువ వాళ్లతో అంటూ ఉన్నాడు.
మంటలు చెలరేగినప్పుడు. మీకు దగ్గర్లో బయటకు వెళ్లే దారి ఎక్కడుందో చూసుకుని, మోకాళ్ల మీద పాకుతూ అక్కడికి వెళ్లండి. అసలే పొగ వల్ల ఏదీ సరిగ్గా కనిపించదు, అంతేకాదు ఇలాంటి సందర్భాల్లో ఊపిరాడక చాలామంది ప్రాణాలు కోల్పోయారు. మీ వస్తువులు ఏమైనా ఉంటే అక్కడే వదిలేయండి, క్షణం కూడా ఆలస్యం చేయకండి. ఎందుకంటే చిటికెలోనే ప్రాణాలు పోవచ్చు.
భూకంపం వచ్చినప్పుడు. గట్టిగా ఉన్న ఏదైనా టేబుల్ లేదా మంచం కిందకు వెళ్లండి. లేదా ఇంటి లోపల ఉండే ఏదైనా ఒక గోడ మూలన కూర్చోండి. పెద్ద భూకంపం తర్వాత కూడా కొంత సమయం వరకు భూమి చిన్నచిన్నగా కంపిస్తూ ఉంటుందని గుర్తుంచుకోండి. వీలైనంత త్వరగా ఇంట్లో నుండి బయటకు వచ్చేసి, బిల్డింగ్‌ల నుండి దూరంగా వెళ్లిపోండి. విపత్తు సహాయక సిబ్బంది రావడానికి కొన్ని గంటలు పట్టొచ్చు కాబట్టి వీలైతే వేరే వాళ్లకు హెల్ప్ చేయండి.
సునామీ వచ్చినప్పుడు. తీరం నుండి నీళ్లు సడన్‌గా వెనక్కి వెళ్తే, వెంటనే ఎత్తయిన ప్రాంతానికి వెళ్లండి. ఎందుకంటే తర్వాత పెద్దపెద్ద అలలు వస్తాయి.
పెద్ద సుడిగాలి లేదా భయంకరమైన తుఫాను వచ్చినప్పుడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా సురక్షితమైన చోటుకు వెళ్లిపోండి.
వరద వచ్చినప్పుడు. వరద నీళ్లతో నిండిన బిల్డింగ్‌లకు దూరంగా ఉండండి. ఆ నీళ్లలో నడవడం గానీ, బండి నడపడం గానీ చేయకండి. ఎందుకంటే వరద నీళ్లలో చాలా ప్రమాదాలు పొంచి ఉంటాయి. ఆ నీళ్లలో చెత్త-చెదారం, తెరిచి ఉన్న మ్యాన్‌హోల్స్, తెగి పడిన కరెంటు తీగలు ఉంటాయి కాబట్టి జాగ్రత్త!
మీకు తెలుసా? రెండు అడుగుల వరద నీళ్లలో ఒక కారు కూడా కొట్టుకుపోతుంది. అలా వరద నీళ్లలో బండ్లు నడపడానికి ప్రయత్నించినప్పుడే చాలామంది ప్రజలు తమ ప్రాణాల్ని కోల్పోయారు.
అధికారులు ఖాళీ చేయమని చెప్తే, వెంటనే బయల్దేరండి! మీరు ఎక్కడ ఉన్నారో మీ కుటుంబానికి, ఫ్రెండ్స్‌కి చెప్పండి. అలా చెప్పకపోతే మీకోసం వెతుకుతూ-వెతుకుతూ వాళ్ల ప్రాణాలు ప్రమాదంలో పడొచ్చు.
అధికారులు ఖాళీ చేయమని చెప్తే, వెంటనే బయల్దేరండి!
మీకు తెలుసా? నెట్వర్క్ సరిగ్గా లేనప్పుడు ఫోన్ కలవకపోయినా, మెసేజ్‌లు మాత్రం వెళ్లే అవకాశాలు ఉన్నాయి.
అధికారులు ఇంట్లోనే లేదా ఒకే చోట ఉండమని చెప్తే, అలాగే చేయండి. విషపూరిత కెమికల్స్, గ్యాస్ లాంటివి లీక్ అయినా, పొరపాటున అణుబాంబు పేలినా లేదా అణుబాంబులతో దాడులు జరిగినా బయటికి రాకుండా లోపలే ఉండండి. బయటి గాలి లోపలికి రాకుండా కిటికీలు, తలుపులు, అన్నీ మూసేయండి. అణుబాంబు పేలినప్పుడు ఆ ప్రమాదకరమైన కిరణాలు లేదా రేడియేషన్ పడకుండా మీ ఇంట్లోనే కింద నేల మీద పడుకుని ఉండండి. రేడియో లేదా టీవీ ద్వారా వార్తలు వినండి. ఇక అంతా సురక్షితంగా ఉంది అని అధికారులు చెప్పే వరకు ఇంట్లోనే ఉండండి.
విపత్తు తర్వాత—జాగ్రత్తగా ఉండండి!
ప్రమాదాల్ని, జబ్బుల్ని తప్పించుకోవాలంటే ఈ కింది సలహాల్ని పాటించండి:
వీలైతే క్యాంపుల్లో కాకుండా తెలిసిన వాళ్ల ఇళ్లలో ఉండండి.
మీరు ఎక్కడైతే ఉంటున్నారో, అక్కడంతా శుభ్రంగా ఉండేలా చూసుకోండి.
చెత్తను తీసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించండి. అంటే వీలైనప్పుడు చేతికి గ్లౌస్, కాళ్లు జారకుండా మంచి షూస్, తలకు గట్టి క్యాప్ (హెల్మెట్ లాంటిది), అలాగే ముఖానికి మాస్క్ లాంటివి వేసుకోండి. ఎక్కడైనా కరెంటు తీగలు, నిప్పురవ్వలు ఉన్నాయేమో చూసుకోండి.
మీ రోజువారీ పనుల్ని యథావిధిగా చేసుకోవడానికి ప్రయత్నించండి. మీరు ప్రశాంతంగా ఉన్నారని, ఆశ వదులుకోలేదని మీ పిల్లలు తెలుసుకోవడం ప్రాముఖ్యం. వాళ్లకు స్కూల్ పాఠాలు చెప్పండి, కుటుంబ ఆరాధన చేసుకోండి, వాళ్లతో ఆడుకోండి. జరిగిన ప్రమాదం లేదా విపత్తు గురించిన న్యూస్ ఎక్కువ చూడకండి, కంగారు-కోపంతో మీ చిరాకును ఇంట్లోవాళ్ల మీద చూపించకండి. సహాయం తీసుకోండి, సహాయం చేయండి.
విపత్తు తర్వాత, మీ రోజువారీ పనుల్ని యథావిధిగా చేసుకోవడానికి ప్రయత్నించండి
విపత్తు వల్ల నష్టం జరుగుతుందని గుర్తించండి. సహాయక చర్యల్లో భాగంగా ప్రభుత్వమైనా, వేరే సంస్థలైనా మనం కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వరు గానీ, మనం బ్రతికి ఉండడానికి కావాల్సింది మాత్రమే ఇస్తారు. అంటే శుభ్రమైన నీళ్లు, ఆహారం, బట్టలు, తలదాచుకోవడానికి ఒక చోటు లాంటివి ఇవ్వడానికి ప్రయత్నిస్తారు.—1 తిమోతి 6:7, 8.
మనసుకు అయిన గాయాన్ని గుర్తించండి, సహాయం తీసుకోండి. విపత్తు సమయంలో మనం షాక్‌కి గురౌతాం, అది తగ్గిపోయాక వేరే సమస్యలు తలెత్తవచ్చు. ఉదాహరణకు, ఆందోళన, విపరీతమైన బాధ (డిప్రెషన్) అలాగే సడన్‌గా మన ఫీలింగ్స్ మారడం, అంటే ఒక క్షణం సంతోషంగా వెంటనే బాధగా-కోపంగా అనిపించడం. అంతేకాదు సరిగ్గా ఆలోచించలేం, ఏ పనీ చేయబుద్ధి కాదు, నిద్రపట్టదు. ఇలాంటప్పుడు మీకేం అనిపిస్తుందో మీ ఫ్రెండ్స్‌కి చెప్పుకోండి.
ఆఫీస్‌లో జరిగిన అగ్ని ప్రమాదం నుండి జాషువ తప్పించుకున్నా, తనకు తెలిసిన చాలామంది చనిపోయారు. బాధలో మునిగిపోకుండా, సంఘ పెద్దలు అలాగే డాక్టర్లు ఆయనకు సహాయం చేశారు. దాని గురించి ఆయన ఇలా అంటున్నాడు: “ఏదైనా విషాదం నుండి బయటపడేటప్పుడు ఇలా బాధపడడం మామూలే అని, అదే మెల్లగా తగ్గిపోతుందని వాళ్లు ధైర్యం ఇచ్చారు, ఆరు నెలల తర్వాత పీడకలలు తగ్గాయి. వేరే సమస్యలు తగ్గడానికి ఇంకొంచెం టైం పట్టింది.”
విపత్తులు వచ్చినప్పుడు ‘ఏంటీ అన్యాయం’ అని నిరాశతో మనసు విరిగిపోతుంది. దాంతో కొంతమంది తప్పుగా దేవున్ని నిందిస్తారు. జాషువలా చాలామంది ప్రాణాలతో బయటపడినా రకరకాల ఆలోచనలతో బాధపడుతుంటారు. ఇలా చేస్తే బాగుండేది, అలా చేస్తే బాగుండేది అని తమను తాము నిందించుకుంటారు. జాషువ ఇలా అంటున్నాడు: “నేను ఇంకా కొంతమందిని కాపాడి ఉంటే బాగుండు అని అనిపిస్తుంటుంది. దేవుడు త్వరలో అందరికీ న్యాయం చేస్తాడని, జరిగిన నష్టాన్ని పూరిస్తాడని నేను నమ్ముతున్నాను, ఆ నమ్మకమే నాకు ఊరటను ఇస్తుంది. అప్పటివరకు నా జీవితంలోని ఒక్కో రోజును విలువైనదిగా చూస్తూ, నా ప్రాణాన్ని కాపాడుకోవడానికి చేయగలిగినదంతా చేయాలని అనుకుంటున్నాను.”—ప్రకటన 21:4, 5.a
a రాబోయే రోజుల్లో దేవుడు ఏం చేస్తానని మాటిచ్చాడో, ఆయన బాధల్ని ఎందుకు అనుమతిస్తున్నాడో తెలుసుకోవడానికి ఎల్లప్పుడూ సంతోషంగా జీవించండి! పుస్తకం చూడండి. దాన్ని www.jw.org వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.