“విశ్వంలో అతి శక్తివంతమైన నేర్చుకునే యంత్రం”
చంటిపిల్లల మెదడు గురించి కొంతమంది అలా అన్నారు, దానికి కారణం లేకపోలేదు. పసివాడు పుట్టుకతోనే తను చూసేవాటిని, వినేవాటిని, స్పర్శలను అర్థంచేసుకుంటాడు.a
అంతేకాదు, పసివాడు కొత్తవాళ్లను చూసినప్పుడు, వాళ్ల స్వరాలను విన్నప్పుడు, వాళ్లు ముట్టుకున్నప్పుడు వెంటనే స్పందిస్తాడు. బేబీహుడ్ అనే తన పుస్తకంలో పెనెలోప్ లీచ్ ఇలా రాసింది: “పసిబిడ్డలు వేటిని చూడడానికి, వినడానికి ఎక్కువగా ఇష్టపడతారో, ఏ స్పర్శలను కోరుకుంటారో తెలుసుకోవడానికి చాలా అధ్యయనాలు జరిగాయి. పిల్లల దగ్గరే ఉంటూ వాళ్ల ఆలనాపాలనా చూసుకునే పెద్దవాళ్ల దగ్గరే ఇవన్నీ దొరుకుతాయి.” అందుకే, పిల్లల వికాసానికి తల్లిదండ్రులు ఎంతో దోహదపడతారని చెప్పవచ్చు.
‘నేను పసివానిలా మాట్లాడాను’
నవజాత శిశువులు ఏ పాఠశాలకూ వెళ్లకుండానే కేవలం విని ఒక భాషను నేర్చుకోగలుగుతారు. దాన్ని చూసి తల్లిదండ్రులు, పిల్లల డాక్టర్లు ఎంతో ముగ్ధులౌతారు. కొన్ని రోజుల్లో శిశువు, తల్లి గొంతుకు అలవాటు పడుతుందనీ, కొత్తవాళ్ల స్వరం కన్నా తల్లి స్వరాన్నే ఇష్టపడుతుందనీ, కొన్ని వారాల్లో తల్లిదండ్రుల మాతృభాషా శబ్దాలకు, పరభాషా శబ్దాలకు మధ్య ఉన్న తేడాను గుర్తిస్తుందనీ, కొన్ని నెలల్లో పదాల మధ్యవున్న తేడాను గ్రహించి, స్పష్టంగా పలికిన మాటలకు, అస్పష్టంగా పలికిన మాటలకు మధ్య ఉన్న తేడాను గుర్తుపడుతుందనీ పరిశోధకులు తెలుసుకున్నారు.
‘నేను పసివానిలా ఉన్నప్పుడు పసివానిలా మాట్లాడాను’ అని అపొస్తలుడైన పౌలు రాశాడు. (1 కొరింథీయులు 13:11, పరిశుద్ధ బైబల్: తెలుగు ఈజీ-టు-రీడ్ వర్షన్) పసివాళ్లు ఎలా మాట్లాడతారు? వాళ్లు ఏవేవో అర్థంకాని ఊసులు చెబుతారు. అవి ఒట్టి ఊసులేనా? కానేకాదు! మాట్లాడడమనేది “చాలా సంశ్లిష్టమైన చర్య. మాట్లాడాలంటే పెదాలను, నాలుకను, అంగిలిని, స్వరపేటికను నియంత్రించే ఎన్నో కండరాలను సమన్వయంతో వేగంగా కదిలించాలి” అని వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ దేర్?—హౌ ద బ్రెయిన్ అండ్ మైండ్ డెవలప్ ఇన్ ద ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ లైఫ్ అనే తన పుస్తకంలో డాక్టర్ లీజ్ ఎలియట్ అంది. అంతేకాదు, “పిల్లలు వేరేవాళ్ల దృష్టిని ఆకర్షించడానికి ఊసులు చెబుతారని అనిపించినా, దీనివల్ల భవిష్యత్తులో వాళ్లు మాట్లాడేటప్పుడు చక్కని సమన్వయంతో కండరాలను కదిలించగలుగుతారు” అని కూడా ఆమె అంది.
తల్లిదండ్రులు కూడా పిల్లల భాషలో మాట్లాడతారు, దీనిలో కూడా ఒక లాభం ఉంది. తల్లిదండ్రులు అలా లాలనగా మాట్లాడినప్పుడు పిల్లలు దానికి స్పందించగలుగుతారు. ఆ విధంగా పిల్లలు, మెల్లమెల్లగా మాట్లాడడం నేర్చుకుంటారు. ఆ నైపుణ్యం వాళ్లకు జీవితాంతం ఉపయోగపడుతుంది.
తల్లిదండ్రుల పాత్ర మారుతుంది
తల్లిదండ్రులు తమ చంటిపిల్లల రోజువారీ అవసరాలు తీర్చడంలో మునిగిపోతారు. పిల్లవాడు ఏడ్చిన వెంటనే ఎవరో ఒకరు పాలు పట్టడమో, డైపర్ మార్చడమో లేదా వాడిని ఎత్తుకుని ఊరడించడమో చేస్తారు. పిల్లలను అలా గారాబంగా చూసుకోవడం అవసరమే. తల్లిదండ్రులు సంరక్షకులుగా తమ పాత్రను పోషించడానికి ఇలాగే చేయాలి.—1 థెస్సలొనీకయులు 2:7.
అందరూ తనను అలా చూసుకుంటారు కాబట్టే తనొక రాజునని, పెద్దవాళ్లు ముఖ్యంగా తల్లిదండ్రులు తనకు సేవచేయడానికే ఉన్నారని పిల్లవాడు అనుకుంటాడు. అలాంటి ఆలోచన తప్పే అయినా అది సహజం. ఎందుకంటే, పిల్లవాణ్ణి ఏడాదికి పైగా తల్లిదండ్రులు అలాగే చూసుకున్నారు. అందుకే, కేకేస్తే చిత్తమంటూ పరుగెత్తుకొచ్చి సేవచేసే సేవకులున్నారని, తనొక రారాజునని పిల్లవాడు అనుకుంటాడు. కుటుంబ సలహాదారుడు జాన్ రోజ్మాండ్ ఇలా రాశాడు: “పిల్లల్లో ఈ భ్రమను కలిగించడానికి తల్లిదండ్రులకు రెండేళ్లు కూడా పట్టదు, కానీ దాన్ని పోగొట్టడానికి మాత్రం 16 కన్నా ఎక్కువ సంవత్సరాలే పడుతుంది! ఆ భ్రమను ప్రేమతో పోగొట్టాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులదే.”
పిల్లవాడికి రెండేళ్లు వచ్చేసరికి, అప్పటివరకు సంరక్షకులుగా ఉన్న తల్లిదండ్రులు ఉపదేశకులుగా మారడంతో ఆ భ్రమ తొలగిపోతుంది. తల్లిదండ్రులు ఇప్పుడు తను చెప్పినట్టు చేయడం లేదని, ఇక వాళ్లు చెప్పిందే తను చేయాలని పిల్లవాడికి అర్థమౌతుంది. ఇప్పుడు తను రారాజు కాడు. ఈ మార్పును వాడు ఇష్టపడకపోవచ్చు. దాంతో వాడికి చిర్రెత్తి తన ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఎలా?
పిల్లవాడు పేచీ పెడితే . . .
దాదాపు రెండేళ్ల వయసులో చాలామంది పిల్లల ప్రవర్తనలో పెనుమార్పులు వస్తాయి, వాళ్లు చీటికిమాటికి పేచీ పెడతారు. అది చూసి తల్లిదండ్రులు ఎంతో విసిగిపోతారు. తప్పటడుగులు వేసే బుడతడు ఉన్నట్టుండి ప్రతీదానికి, “ఊహుఁ!” “నాకొద్దు!” అంటుంటాడు. పరిస్థితి అర్థంకాక తనమీద, తల్లిదండ్రులమీద వాడికి కోపమొచ్చేస్తుంది. మీకు దూరంగా వెళ్లాలనుకుంటాడు, కానీ మిమ్మల్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేడు. పిల్లవాడు ఎందుకిలా చేస్తున్నాడో తల్లిదండ్రులకు అంతుబట్టదు. వాణ్ణి అదుపులో పెట్టడం తమవల్ల కాదనిపిస్తుంది. అసలేం జరుగుతోంది?
తప్పటడుగులు వేసే బుడతడి జీవితంలో వచ్చే ఈ పెనుమార్పుల గురించి కాసేపు ఆలోచించండి. నిన్నటివరకు, తను ఏడిస్తే చాలు పెద్దవాళ్లు పరిగెత్తుకుంటూ వచ్చి వాడిముందు వాలేవారు. కానీ తన పెత్తనం ఇప్పుడిక సాగదని, కొన్ని పనులు తనే చేసుకోవాలని మెల్లమెల్లగా గ్రహిస్తాడు. ఒకరు చెప్పినట్లు నడుచుకోవాలని వాడికి రానురాను అర్థమౌతుంది. ఆ విషయమే బైబిలు కూడా చెబుతోంది: ‘పిల్లలారా, అన్ని విషయాల్లో మీ తల్లిదండ్రుల మాట వినండి.’—కొలొస్సయులు 3:20.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా తల్లిదండ్రులు వాణ్ణి అదుపులో ఉంచడానికి ప్రయత్నించాలి. ఈ విషయంలో రాజీపడకుండా, ప్రేమతో వాణ్ణి సరిదిద్దాలి. అలాచేస్తే, వాడు మార్పుకు అలవాటు పడతాడు. అప్పుడు వాడి బంగారు భవిష్యత్తుకు మీరు బాట వేసినవాళ్లవుతారు.
నైతిక విలువలు
జంతువులు, ఆఖరికి యంత్రాలు కూడా పదాలను గుర్తుపట్టి, అప్పజెప్పగలుగుతాయి. కానీ మనుషులు మాత్రమే తామన్న మాటల గురించి ఆలోచించగలుగుతారు. పిల్లవాడికి రెండుమూడేళ్లు వచ్చేసరికి వాడిలో అహం, సిగ్గు, అపరాధభావం, అవమానం వంటి భావాలు కలుగుతాయి. చుట్టూవున్న వాళ్లు తప్పు చేస్తున్నా తను మాత్రం సరైనదే చేసే నైతిక విలువలున్న యువకునిగా ఎదగడానికి ఇవన్నీ తొలిమెట్లు.
ఈ సమయంలో తల్లిదండ్రులు పిల్లల్లో వచ్చే మరో మార్పును చూసి ఆశ్చర్యపోతారు. తమ పిల్లవాడు వేరేవాళ్ల భావాలను అర్థంచేసుకోవడం మొదలుపెడతాడు. రెండేళ్ల వయసులో ఒక్కడే ఆడుకున్న పిల్లవాడు ఇప్పుడు ఇతరులతో కలిసి ఆడుకుంటాడు. అంతేకాదు, ఏమి చేస్తే తల్లిదండ్రులు సంతోషపడతారో అర్థంచేసుకుని అలా చేయాలనుకుంటాడు. అలా వాడు మెల్లమెల్లగా కొత్త విషయాలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు.
మూడేళ్లు వచ్చేసరికి పిల్లవాడికి మంచిచెడులు, తప్పొప్పులు మునుపటికన్నా ఎక్కువగా అర్థమౌతాయి. అందుకే, తల్లిదండ్రులు తమ పిల్లలను బాధ్యతగల వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు అప్పటి నుండి చక్కని శిక్షణను ఇవ్వాలి.
[అధస్సూచి]
a ఈ పత్రిక అంతట్లో మగపిల్లవాడి గురించి ప్రస్తావించాం. అయితే ఈ సూత్రాలు ఆడపిల్లలకూ వర్తిస్తాయి.
[5వ పేజీలోని క్యాప్షన్]
కొన్ని రోజుల్లో శిశువు తల్లి గొంతుకు అలవాటు పడుతుంది, కొత్తవాళ్ల స్వరం కన్నా తల్లి స్వరాన్నే ఇష్టపడుతుంది
[6వ పేజీలోని క్యాప్షన్]
మూడేళ్లు వచ్చేసరికి పిల్లవాడికి మంచిచెడులు, తప్పొప్పులు మునుపటికన్నా ఎక్కువగా అర్థమౌతాయి
[6వ పేజీలోని క్యాప్షన్]
పిల్లలు చీటికిమాటికి ఎందుకు పేచీ పెడతారు?
న్యూ పేరెంట్ పవర్ అనే తన పుస్తకంలో జాన్ రోజ్మాండ్ ఇలా రాశాడు: “పిల్లవాడు అడిగింది ఇవ్వకుండా తప్పుచేశాం కాబట్టే వాడు పేచీ పెడుతూ కోపంతో చిందులేస్తున్నాడని కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు. తమ తప్పును వీలైనంత త్వరగా సరిదిద్దుకుంటే వాడు ఊరుకుంటాడని వాళ్లు అనుకుంటారు. అందుకే, ముందు ఇవ్వం అని చెప్పినదాన్ని ఇస్తారు. ఒకవేళ ముందు రెండు తగిలించివుంటే, తప్పుచేశామనే భావన తమలో కలగకూడదన్న ఉద్దేశంతో వాడు అడిగినదానికన్నా ఎక్కువ ఇస్తారు. దాంతో పరిస్థితి సద్దుమణుగుతుంది. వాడు పేచీ పెట్టడం మానేస్తాడు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకుంటారు. తను అడిగింది సంపాదించుకోవడానికి ఈ పద్ధతేదో బాగుందని వాడు ఇంకా అతి చేస్తాడు.”