నా లక్ష్యాన్ని సాధించాలని నిశ్చయించుకున్నాను
మార్తా చావెస్ సెర్నా చెప్పినది
నా పదహారవ ఏట, ఒకరోజు నేను ఇంట్లో పనిచేస్తూ చేస్తూ స్పృహతప్పి పడిపోయాను. మళ్ళీ కళ్ళు తెరిచేసరికి మంచం మీద ఉన్నాను. తీవ్రమైన తలనొప్పితో కొద్దిసేపటి వరకు నాకేమీ కనబడకుండా, వినబడకుండా అయ్యేసరికి కంగారుపడిపోయాను. నేను భయపడ్డాను. నాకేమయ్యింది?
భయకంపితులైన నా తల్లిదండ్రులు నన్ను డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్లారు, ఆమె విటమిన్లు వ్రాసిచ్చింది. నేనలా స్పృహతప్పి పడిపోవడానికి కారణం నిద్రలేమి అని ఆ డాక్టర్ చెప్పింది. ఓ రెండు నెలల తర్వాత నేను మళ్ళీ స్పృహ కోల్పోయాను, మూడోసారి కూడా అలాగే జరిగింది. మేము మరో డాక్టరును కలిశాం, నాకు నరాలకు సంబంధించిన సమస్య ఉందని చెప్పి ఆయన ఉపశమనం కలిగించే మందులిచ్చాడు.
అయితే స్పృహతప్పి పడిపోవడం చాలా తరచుగా జరిగేది. నేను స్పృహతప్పి పడిపోవడంవల్ల దెబ్బలు తగిలేవి. కొన్నిసార్లు నేను నా నాలుకను, నోటి లోపలి భాగాన్ని కొరుక్కునేదాన్ని. మళ్ళీ స్పృహలోకి వచ్చాక తీవ్రమైన తలనొప్పి ఉండేది, వికారంగా ఉండేది. ఒళ్ళంతా నొప్పిగా ఉండేది, స్పృహ కోల్పోవడానికి ముందు ఏమి జరిగిందో సరిగ్గా జ్ఞాపకం వచ్చేది కాదు. తరచూ ఒకటి, రెండు రోజులు విశ్రాంతి తీసుకుంటే నేను కోలుకోగలిగేదాన్ని. అయినప్పటికీ, ఈ సమస్య తాత్కాలికమైనదేననీ, త్వరలోనే నేను బాగవుతాననే అనుకున్నాను.
నా లక్ష్యాలపై ప్రభావం
నా చిన్నతనంలోనే, మా కుటుంబం యెహోవాసాక్షులతో బైబిలు అధ్యయనం చేయడం ఆరంభించింది. మాకు బోధించేవారు ఇద్దరు ప్రత్యేక పయినీర్లు, అంటే బైబిలు సత్యాలను ఇతరులకు బోధించడంలో ఎక్కువ గంటలు గడిపే పూర్తికాల పరిచారకులు. ఆ పయినీర్లు చేస్తున్న పరిచర్య వారికి ఎంతో ఆనందాన్ని ఇస్తోందని నేను గ్రహించగలిగాను. నేను మా టీచరుతో, నా తోటి విద్యార్థులతో బైబిలు వాగ్దానాల గురించి మాట్లాడడం ద్వారా నేను కూడా ఆ ఆనందాన్ని పొందాను.
కొంతకాలానికి, మా కుటుంబంలో చాలామంది యెహోవాసాక్షులు అయ్యారు. సువార్తను ప్రకటిస్తూ నేను ఎంతో సంతోషించాను. నాకు ఏడేండ్లు వచ్చేసరికి, నేను కూడా ప్రత్యేక పయినీరును కావాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నాను. నా 16వ ఏట బాప్తిస్మం తీసుకోవడంతో ఆ లక్ష్యం వైపు ముందుకుసాగాను. అదే సమయంలో స్పృహతప్పి పడిపోవడం మొదలైంది.
పయినీరు సేవ
శారీరకంగా నాకు సమస్యలు ఉన్నప్పటికీ, నేను యెహోవాసాక్షుల పూర్తికాల సేవకురాలిని కావచ్చనే భావించాను. అయితే నేను వారంలో దాదాపు రెండుసార్లు స్పృహతప్పి పడిపోతుండడంతో, నేను అలాంటి పెద్ద బాధ్యతను చేపట్టడం మంచిది కాదని సంఘంలోని కొందరు భావించారు. నాకు బాధా నిరుత్సాహం కలిగాయి. అయితే కొంతకాలానికి, మెక్సికోలోని యెహోవాసాక్షుల బ్రాంచి కార్యాలయంలో సేవ చేస్తున్న ఒక జంట మా సంఘానికి వచ్చింది. నేను పయినీరును కావాలన్న నా కోరిక గురించి తెలుసుకున్న ఆ దంపతులు నన్ను చాలా ప్రోత్సహించారు. పయినీరు సేవ చేయకుండా నా అనారోగ్యం నాకు ఆటంకం కానవసరం లేదని వారు నన్ను ఒప్పించారు.
సెప్టెంబరు 1, 1988లో నేను మెక్సికోలోని మా స్వగ్రామమైన శాన్ ఆండ్రెస్ చివట్లాలో క్రమ పయినీరుగా సేవ చేసే నియామకాన్ని పొందాను. నేను సువార్త ప్రకటించడంలో ప్రతి నెలా చాలా గంటలు గడిపేదాన్ని. మూర్ఛ కారణంగా నేను బయటకు వెళ్ళి ప్రకటించలేని సమయాల్లో, నేను మా ప్రాంతంలోని ప్రజలకు లేఖనాధారిత అంశాలను చేర్చి ఉత్తరాలు వ్రాసేదాన్ని, ఆ విధంగా నేను వారిని బైబిలు అధ్యయనం చేయమని వ్రాతపూర్వకంగా ప్రోత్సహించేదాన్ని.
నా వ్యాధిని గుర్తించారు
ఈ సారి మా తల్లిదండ్రులు చాలా ఖర్చును భరించి, నన్ను ఒక న్యూరాలజిస్టు వద్దకు తీసుకువెళ్ళారు. ఆ డాక్టరు నా పరిస్థితిని మూర్ఛ రోగంగా గుర్తించారు. నేను అప్పుడు పొందిన చికిత్సవల్ల, నా ఆరోగ్యం దాదాపు నాలుగు సంవత్సరాల వరకూ బాగానే ఉంది. ఆ మధ్యకాలంలో నేను పయినీరు పరిచర్య పాఠశాలకు హాజరుకాగలిగాను, అక్కడ నేను పొందిన ప్రోత్సాహం సువార్తికుల అవసరం ఎక్కువగా ఉన్నచోట సేవ చేయాలనే నా కోరికను అధికం చేసింది.
నేను నా పరిచర్యను విస్తృతపరచుకోవాలని ఎంతగా కోరుకుంటున్నానో నా తల్లిదండ్రులకు తెలుసు. నా ఆరోగ్యం ఓ మోస్తరు బాగానే ఉంటోంది కాబట్టి, నేను మా ఇంటి నుండి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న మిచావ్కన్ రాష్ట్రంలోని సిటాక్వారోకు వెళ్ళేందుకు వారు అనుమతించారు. ఆ నియామకంలో ఉన్న ఇతర పయినీర్ల సహవాసం నేను పూర్తికాల సేవను మరింత అమూల్యమైనదిగా ఎంచేందుకు దోహదపడింది.
సిటాక్వారోలో రెండు సంవత్సరాలు గడిపిన తర్వాత, నాకు మళ్ళీ మూర్ఛరావడం మొదలయ్యింది. ఆశాభంగంతో, విచారంతో, చికిత్స చేయించుకోవడానికి నేను నా తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాను. మేము న్యూరాలజిస్టు దగ్గరకు వెళ్ళాము, ఆయన నేను తీసుకుంటున్న మందులు నా కాలేయానికి హాని కలిగిస్తున్నాయని చెప్పాడు. నేను వేరే చికిత్సా విధానాల కోసం వెదకడం ఆరంభించాను, ఎందుకంటే మాకిక స్పెషలిస్టులకు చూపించుకునే స్తోమత లేదు. నా పరిస్థితి రోజురోజుకూ విషమిస్తోంది, దాంతో నేను పయినీరు సేవను వదులుకోవాల్సి వచ్చింది. నాకు మూర్ఛ వచ్చినప్పుడల్లా అది నన్ను మరింతగా కృంగదీసేది. కానీ నేను కీర్తనల గ్రంథం చదువుకొని యెహోవాకు ప్రార్థించినప్పుడు, నేను ఆయన నుండి ఓదార్పునూ శక్తినీ పొందేదాన్ని.—కీర్తన 94:17-19.
నా లక్ష్యాన్ని చేరుకున్నాను
నా పరిస్థితి విషమించిన దశలో నేను రోజుకు రెండుసార్లు మూర్ఛపోయేదాన్ని. అలాంటి సమయంలో నా జీవితం ఒక మలుపు తిరిగింది. ఒక డాక్టరు నా వ్యాధికి ఒక ప్రత్యేకమైన చికిత్స చేశాడు, ఆ తర్వాత అలా మూర్ఛపోవడం తగ్గింది. దాంతో నేను సెప్టెంబరు 1, 1995లో మళ్ళీ పయినీరు సేవను చేపట్టాను. ఆ తర్వాతి రెండు సంవత్సరాల్లో నేను ఒక్కసారి కూడా మూర్ఛపోకుండా ఆరోగ్యంగా బాగుండడంతో, నేను ప్రత్యేక పయినీరు సేవ చేయడానికి దరఖాస్తు చేశాను. అంటే పరిచర్యలో ఇంకా ఎక్కువ సమయం గడపడం, ఎక్కడ అవసరం ఉంటే అక్కడకు వెళ్ళి సేవ చేయడం. నాకు ఆ నియామకం దొరికినప్పుడు ఎంత ఆనందించానో ఊహించండి! నేను చిన్నప్పుడు పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాను.
ఏప్రిల్ 1, 2001లో నేను నా కొత్త నియామకాన్ని ఈడాల్గో రాష్ట్రంలోని కొండల్లో ఉన్న ఒక చిన్న గ్రామంలో ఆరంభించాను. ఇప్పుడు నేను గౌనజువాటో రాష్ట్రంలోని ఒక చిన్న పట్టణంలో సేవ చేస్తున్నాను. నేను మందులు వేసుకోవడం విషయంలో, సరైన విశ్రాంతి తీసుకోవడం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను తినే ఆహారం విషయంలో ప్రత్యేకంగా కొవ్వు పదార్థాలు, టీ కాఫీలు, డబ్బాల్లో సీలు చేసిన ఆహారం వంటి వాటికి దూరంగా ఉంటాను. కోపం, అధిక చింత వంటి భావోద్రేకాలు కలుగకుండా ఉండేందుకు కూడా నేను ప్రయత్నిస్తాను. అయితే ఇలాంటి ఖచ్చితమైన విధానం ద్వారా నాకు ప్రయోజనాలు కలిగాయి. నేను ప్రత్యేక పయినీరుగా సేవ చేస్తున్న కాలంలో, కేవలం ఒక్కసారే మూర్ఛపోయాను.
నేను అవివాహితగా కుటుంబ బాధ్యతలేమీ లేకుండా ఉన్నాను కాబట్టి, ప్రత్యేక పయినీరు సేవలో కొనసాగడంలో ఎంతో ఆనందిస్తున్నాను. ‘మనం చేసే పనిని, యెహోవా నామమునుబట్టి చూపే ప్రేమను మరవడానికి ఆయన అన్యాయస్థుడు కాడు’ అని తెలుసుకొని నేను ఓదార్పు పొందుతుంటాను. ఆయన ఎంత ప్రేమగల దేవుడో కదా, ఎందుకంటే మనం ఇవ్వలేనిదానిని ఆయన ఖచ్చితంగా కావాలని అడగడు! ఆ సత్యాన్ని గ్రహించడం నేను నా ఆలోచనను సమతుల్యంగా ఉంచుకోవడానికి తోడ్పడింది. బలహీనమైన నా ఆరోగ్యం కారణంగా పయినీరు సేవను ఆపాల్సిన పరిస్థితి నాకు మళ్ళీ వచ్చినా, నేను నా సంపూర్ణ హృదయంతో చేసే సేవకు యెహోవా సంతోషిస్తాడని నాకు తెలుసు.—హెబ్రీయులు 6:10; కొలొస్సయులు 3:23.
నేను నా విశ్వాసాన్ని ప్రతిరోజూ ఇతరులతో పంచుకోవడం నాకు శక్తినిస్తుంది అనడంలో సందేహం లేదు. అది నా మనసులో భవిష్యత్తులో దేవుడు ఇచ్చే ఆశీర్వాదాలను స్పష్టంగా ఉంచుతుంది కూడా. నూతనలోకంలో అనారోగ్యం ఉండదనీ “దుఃఖమైనను ఏడ్పైనను వేదనయైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించి [పోవును]” అనీ బైబిలు వాగ్దానం చేస్తోంది.—ప్రకటన 21:3, 4; యెషయా 33:24; 2 పేతురు 3:13. (g05 6/22)
[26వ పేజీలోని చిత్రాలు]
దాదాపు 7 ఏండ్ల వయసులో (పైన); దాదాపు 16 ఏండ్ల వయసులో, నేను బాప్తిస్మం తీసుకున్న కొద్దికాలం తర్వాత
[27వ పేజీలోని చిత్రం]
ప్రకటనా పనిలో ఒక స్నేహితురాలితో