కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g05 4/8 పేజీలు 16-19
  • వెనీస్‌–‘సాగరంలోని నగరం’

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వెనీస్‌–‘సాగరంలోని నగరం’
  • తేజరిల్లు!—2005
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ఆవాసయోగ్యం కాని ప్రాంతం
  • గణతంత్ర రాజ్య ఆవిర్భావం, దాని ఉత్థానం
  • “మధ్యధరా అధికారిణి”
  • స్వప్నంలాంటి నగరం
  • ఉనికిలో ఉండడానికి ఇంకా పోరాడుతూనే ఉంది
  • ప్రపంచ పరిశీలన
    తేజరిల్లు!—1993
  • సువార్తను ప్రకటించడానికి వెనుదీయకండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1998
తేజరిల్లు!—2005
g05 4/8 పేజీలు 16-19

వెనీస్‌-‘సాగరంలోని నగరం’

ఇటలీలోని తేజరిల్లు! రచయిత

“సాగరంలో ఒక అద్భుతమైన నగరం ఉంది. ఆ నగరంలోని విశాలమైన వీధుల్లో ఇరుకు వీధుల్లో సముద్రపు నీరు పొంగి పొర్లుతుంటుంది; సముద్రపు నాచు, భవంతుల చలవరాతి గోడలకు పేరుకుని ఉంటుంది.”​—సామ్యెల్‌ రోజర్స్‌, ఆంగ్ల కవి, 1822.

ఆ ‘అద్భుత నగరమే’ వెనీస్‌. ప్రముఖ గణతంత్ర రాజ్యానికి ఒకప్పుడు రాజధానిగా ఉన్న వెనీస్‌, ఇటు భూమిపై అటు సముద్రంపై విస్తరించిన సామ్రాజ్యంపై శతాబ్దాలపాటు ఆధిపత్యం చెలాయించింది. అయితే ఈ నగరం “సాగరంలో” ఎలా నిర్మించబడింది, ఎందుకు నిర్మించబడింది? దాని ఘనతకు కారణమేమిటి? దాని సామ్రాజ్యం ఎలా కూలిపోయింది, వెనీస్‌ పూర్వపు మహిమను తెలిపే ఏ విశేషాలు నేడు మిగిలివున్నాయి?

ఆవాసయోగ్యం కాని ప్రాంతం

ఏడ్రియాటిక్‌ సముద్రపు వాయవ్య చివరన ఒక ఉప్పునీటి చెరువు మధ్యన ఉన్న వెనీస్‌, 118 ద్వీపాలతో రూపొందింది. సమీపాన ఉన్న సముద్రంలోకి ప్రవహించే నదులు, లోతు తక్కువగావున్న తీరప్రాంత జలాల్లోకి పెద్ద మొత్తంలో ఒండ్రుమట్టిని తీసుకొస్తాయి. అలల ఆటుపోట్లవల్లా ప్రవాహవేగంవల్లా, ఇంచుమించు 51 కిలోమీటర్ల పొడవు దాదాపు 14 కిలోమీటర్ల వెడల్పుగల ప్రశాంతమైన ఉప్పునీటి చెరువును చుడుతూ పొడవైన ఇసుక తిన్నెలు గొలుసుకట్టులా ఏర్పడ్డాయి. సముద్రంవైపు వెళ్తున్న మూడు ఇరుకైన కాలువలగుండా ఆ చెరువులోకి మూడు అడుగుల ఎత్తులో సముద్రపు అలలు వస్తాయి, వాణిజ్య పడవలు కూడా ఆ కాలవల ద్వారానే చెరువు లోపలకు వస్తాయి. “ఎన్నో శతాబ్దాలపాటు, ఏడ్రియాటిక్‌ సముద్రం ద్వారా, మధ్య ఐరోపా లేదా ఉత్తర ఐరోపా నుండి నదుల ద్వారా వచ్చే వాణిజ్య నావలకు, రహదారి మార్గాల ద్వారా వచ్చే వర్తక బిడారులకు ఆ ఉప్పునీటి చెరువే కేంద్రబిందువుగా ఉంది” అని ఒక గ్రంథం తెలియజేస్తోంది.

వెనీస్‌ నగరం సా.శ. ఐదవ శతాబ్దం నుండి ఏడవ శతాబ్దం మధ్య కాలంలో నిర్మించబడిందని విద్వాంసులు విశ్వసిస్తున్నారు. ఆ సమయంలో అనాగరిక ఆక్రమణదారులు పదేపదే ఉత్తరదిశ నుండి దండెత్తి వచ్చి ఇటలీ ప్రజలను దోచుకొని వారి నగరాలను కాల్చివేసేవారు. కాబట్టి ప్రజలు ఆ ఆక్రమణదారులు వస్తున్నారని తెలుసుకోగానే వారికంటే ముందుగా పారిపోయి చేరడానికి సులభం కాని ఉప్పునీటి చెరువులోని సురక్షితమైన ద్వీపాలను ఆశ్రయించేవారు.

ఆ ద్వీపాల్లో నిర్మించబడిన మొదటి కట్టడాలు, బురదలో దిగగొట్టబడిన గుంజలను సన్నని కొమ్మలతో లేదా జమ్ము మొక్కలతో గట్టిగా కట్టి వాటిపై నిర్మించబడేవని ప్రాచీన గ్రంథాలు సూచిస్తున్నాయి. తర్వాతి కాలాల్లో వెనీస్‌ వాసులు వేలాది గుంజలను మట్టిలోకి దిగగొట్టి, వాటిపై రాళ్ళుపేర్చి ఇళ్ళు కట్టుకునేవారు. అయితే ఆ తర్వాత నగర కేంద్రంగా మారిన రియాల్టో ద్వీపాలు చాలామట్టుకు నీటిలో మునిగి ఉండేవి, ఆ ద్వీపాలు అక్కడ నివసించడానికి ప్రవాహంలా వస్తున్న ప్రజలు ఉండేగలిగేంత స్థిరంగానూ, తగినంత పెద్దగానూ లేవు. ఆ ద్వీపాలనుండి అధికంగావున్న నీటిని తొలగించి, పాత పద్ధతులను ఉపయోగించి, ఉన్న స్థలాన్ని పెద్దదిగా చేసుకోవలసి వచ్చింది. కాబట్టి నివాసులు ఆ ద్వీపాల మధ్యనుండి తమ పడవలు ప్రయాణించడానికి వీలుగా కాలువలు తవ్వారు, దాంతో నేలలో అధికంగావున్న నీరంతా ఆ కాలువల్లోకి చేరింది, అలా వారు నేలను మరింత దృఢంగా తయారుచేసి ఆ ద్వీపాలను భవంతులు నిర్మించడానికి మెరుగైన స్థలాలుగా తయారు చేశారు. ఆ కాలువలు, వాటిపై నిర్మించబడిన వంతెనలు ఒక ద్వీపంనుండి మరో ద్వీపానికి నడిచి వెళ్ళడానికి ఉపయోగపడుతూ వారికి వీధుల్లా మారిపోయాయి.

గణతంత్ర రాజ్య ఆవిర్భావం, దాని ఉత్థానం

పశ్చిమాన రోమా సామ్రాజ్యం కూలిపోయినప్పుడు, ఉప్పునీటి చెరువులోని ద్వీపాలు అప్పట్లో కాన్‌స్టాంటినోపుల్‌ (ఇప్పుడు ఇస్తాన్‌బుల్‌) రాజధానిగా ఉన్న బైజాంటైన్‌ సామ్రాజ్యపు అధికారం క్రిందికి వచ్చాయి. కానీ ఉప్పునీటి చెరువు నివాసులు తిరుగుబాటు చేసి స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నారు. దాని ఫలితంగా వెనీస్‌ “రెండు గొప్ప సామ్రాజ్యాల మధ్య” అంటే ఫ్రాంక్‌ల సామ్రాజ్యానికి, బైజాంటైన్‌ల సామ్రాజ్యానికి మధ్య “క్షేత్రపరంగా వేరుగా ఉన్న [ఒక] చిన్న స్వతంత్ర రాజ్యంగా” అసాధారణమైన పరిస్థితిలో నిలిచింది అని వర్ణించబడింది. ఆ అసాధారణమైన పరిస్థితి కారణంగానే ఆ నగరం ఒక గొప్ప “వర్తక మాధ్యమంగా” అభివృద్ధి చెంది వర్ధిల్లింది.

ఆ తర్వాతి శతాబ్దాల్లో వెనీస్‌ మధ్యధరా సముద్రంలో తనతో పోటీపడుతున్న సరాసేన్‌లతో, నార్మాన్‌లతో, బైజాంటైన్‌లతోనే కాక అనేక దేశాలతో యుద్ధం చేసింది. చివరకు అది 1204లో నాల్గవ మతయుద్ధాన్ని తన ప్రత్యర్థ రాజ్యాల్లో అత్యంత శక్తిమంతమైన కాన్‌స్టాంటినోపుల్‌వైపుకు మళ్ళించింది, ఆ యుద్ధంలో కాన్‌స్టాంటినోపుల్‌ నాశనం కావడంతో వెనీస్‌ మిగతా వాటన్నింటికంటే శక్తిమంతమైనదిగా నిలిచింది. వెనీస్‌ అప్పటికే నల్ల సముద్రపు తీరంపై, ఏజియన్‌ సముద్ర తీరంపైనే కాక, గ్రీస్‌, కాన్‌స్టాంటినోపుల్‌, సిరియా, పాలస్టైన్‌, సైప్రస్‌, క్రీట్‌లలో ఎన్నో వ్యాపార కేంద్రాలను స్థాపించుకుంది. కాబట్టి బైజాంటైన్‌ సామ్రాజ్యపు పతనాన్ని వెంటనే తన ప్రయోజనార్థం ఉపయోగించుకొని తన వ్యాపార కేంద్రాల్లో చాలావాటిని తన వలస ప్రాంతాలుగా మార్చుకుంది.

“మధ్యధరా అధికారిణి”

12వ శతాబ్దానికల్లా వెనీస్‌కు చెందిన విస్తృతమైన ఓడరేవులు కొన్ని గంటలకు ఒకటి చొప్పున, కావలసినవాటితో పూర్తిగా సమకూర్చబడిన పొడవైన ఓడలను తయారు చేయడం ప్రారంభించాయి. స్థానిక పరిశ్రమలు గాజు సామాన్లను, అల్లికపనులు చేసిన, బంగారు వెండి జరీ పనులు చేసిన, బుటెదారి పని చేసిన పట్టు వస్త్రాలు, ముఖ్మలు వస్త్రాలు వంటి విలువైన వస్త్రాలను ఉత్పత్తి చేసేవి. వెనీస్‌ వర్తకులు, విదేశీ వర్తకులు పశ్చిమ దేశాలనుండి ఆయుధాలు, గుర్రాలు, తృణమణి జిగురు, బొచ్చుతో ఉన్న జంతుచర్మాలు, కలప, ఉన్ని, తేనె, మైనం వంటివాటితోపాటు బానిసలను కూడా తెచ్చేవారు. మరోవైపున మధ్యధరా సముద్రానికి తూర్పువైపున ఉన్న ముస్లిమ్‌ దేశాలనుండి బంగారం, వెండి, పట్టు వస్త్రాలు, మసాలా దినుసులు, దూది, అద్దకపు రంగులు, ఏనుగు దంతాలు, పరిమళ ద్రవ్యాలు, ఇంకా ఎన్నో ఇతర సరుకులు దిగుమతి చేసుకోబడేవి. ఆ నగర అధికారులు తమ నగరపు మార్కెట్లలోకి వచ్చి వెళ్ళే సరుకులన్నింటిపై నిర్బంధంగా పన్నులు వసూలు చేసేవారు.

పల్లాడియో, టిటియన్‌, టిన్టోరెట్టో వంటి ప్రఖ్యాత నిర్మాణశిల్పుల చేత, కళాకారుల చేత అందంగా తీర్చిదిద్దబడిన వెనీస్‌ లా సెరెనిస్సిమా అని, అంటే “అత్యంత ప్రశాంతమైన” లేదా “అత్యంత సుందరమైన” నగరమని వర్ణించబడింది. కాబట్టి ఆ నగరాన్ని “మధ్యధరా అధికారిణి, . . . నాగరిక ప్రపంచంలోకెల్లా అత్యంత ఐశ్వర్యవంతమైన, అత్యంత విజయవంతమైన వాణిజ్య కేంద్రం” వంటి పేర్లతో పిలవడం తగినదే. శతాబ్దాలపాటు దాని స్థానం చెక్కుచెదర లేదు, అయితే 16వ శతాబ్దంలో ముఖ్య వ్యాపార మార్గాలు అట్లాంటిక్‌ సముద్రంవైపు, పశ్చిమ దేశాలవైపు మారడంతో దాని శక్తి మెల్లగా క్షీణించడం ప్రారంభించింది.

మధ్యధరా సముద్రపు తీరప్రాంతాలలో నెలకొల్పబడిన వెనీస్‌ వలస ప్రాంతాలు ఎన్నడూ క్షేత్రపరమైన ఐక్యతను, ప్రభుత్వపరమైన ఐక్యతను లేదా ఒకే జట్టుగా కలిసి పనిచేయడాన్ని చవిచూడలేదు. కాబట్టి వెనీస్‌ ఆ వలస ప్రాంతాలను వదులుకోక తప్పలేదు. అంతేకాక చుట్టుప్రక్కల దేశాలు వెనీస్‌కు చెందిన ప్రాంతాలను ఒకదాని తర్వాత మరొకటి ఆక్రమించుకోవడం ప్రారంభించాయి, చివరకు 1797లో నెపోలియన్‌ I ఆ నగరాన్ని ఆక్రమించుకొని దానిని ఆస్ట్రియా అధికారానికి అప్పగించాడు. చివరకు 1866లో వెనీస్‌ ఇటలీలో భాగమయ్యింది.

స్వప్నంలాంటి నగరం

చాలామందికి వెనీస్‌ను సందర్శించడం కాలప్రవాహంలో రెండు మూడు వందల సంవత్సరాలు వెనక్కి వెళ్ళడంలా ఉంటుంది. ఆ నగర వాతావరణమే వేరు.

ఆ నగరపు విశేషాల్లో ఒకటి దాని ప్రశాంతత. చాలామట్టుకు కాలిబాటన నడుచుకుంటూ వెళ్ళడానికి చిన్న సందులు, పడవలో వెళ్ళడానికి కాలువలు విడివిడిగానే ఉంటాయి. కాలువల పక్కనే నడవడానికి దారి ఉన్నప్పుడు లేదా కాలువలపై వంతెనలు ఉన్నప్పుడు మాత్రమే మనం రెండు రకాల మార్గాలను ఒకేసారి చూడవచ్చు. అక్కడ ఉండే వాహనాలు కేవలం పడవలు మాత్రమే ఎందుకంటే అక్కడి వీధులు నీటితో నిండిన కాలువలే. ఆ నగరంలో ఆకర్షణీయమైన చిత్రాలవంటి దృశ్యాలు ఎన్నెన్నో. బెసిలికా, బెల్‌ టవర్‌, మనోహరమైన నీటితీరం, చెరువు నీటిపై మిలమిలలాడే సూర్య కిరణాలతో అందంగా కనిపించే సెయింట్‌ మార్క్స్‌ కూడలి కళాకారులకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.

ఆ కూడలిలో రద్దీగా ఉండే ఆరుబయటి కాఫీ హోటళ్ళు సందర్శకులను, అక్కడి నివాసులను కూడా ఆకర్షిస్తాయి. అక్కడ కూర్చొని మీరు చిన్న ప్రామాణిక వాద్యబృందాలు వాయించే సంగీతాన్ని వింటూ ఏదైనా పానీయాన్ని లేదా ఐస్‌క్రీమ్‌ను ఆస్వాదించవచ్చు. మీరు అక్కడ కూర్చొని దారిలో వెళ్ళేవాళ్ళని చూస్తూ మీ చుట్టూ ఉన్న అద్భుతమైన భవనాలను ఆశ్చర్యంగా తిలకిస్తుండగా కనుచూపుమేరలో ఒక్క కారు కూడా కనిపించకపోతే, మీరు నిజంగానే కాలంలో వెనక్కి వెళ్ళిపోయారేమో అనిపిస్తుంది.

కళాకృతుల అన్వేషణలో ఉన్నవారికి వెనీస్‌ ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఆ నగరంలో ఉన్న అనేక రాజభవనాల్లో, వస్తు ప్రదర్శనశాలల్లో, చర్చీల్లో ఎంతోమంది ప్రఖ్యాత కళాకారుల చిత్రాలు ఉన్నాయి. అయితే కొంతమంది సందర్శకులు మాత్రం చిన్న చిన్న సందుల్లో తీరిగ్గా తిరుగుతూ తమకు పరిచయంలేని దృశ్యాలను చూడడానికే ఇష్టపడతారు. యాత్రికుల సరుకులకు ప్రఖ్యాతిగాంచిన ఆ నగరంలో అనేక దుకాణాల్లో మీకు ఉప్పునీటి చెరువు ద్వీపమైన బురానో నుండి వచ్చిన అల్లికపనుల వస్త్రాలు, మురానో ద్వీపం నుండి వచ్చిన అద్భుతమైన క్రిస్టల్‌ సామాన్లు, గాజు సామాన్లు లభిస్తాయి. ఒక వాపొరెట్టోలో లేదా మోటర్‌బోట్‌లో చుట్టూ తిరిగి రావడం కూడా ఒక అద్భుతమైన అనుభూతే, మీరు ఆ ద్వీపాల్లో దేనికో ఒకదానికి వెళ్ళి ఆ సరుకులు ఎలా తయారు చేయబడుతున్నాయో చూడవచ్చు.

పొడవైన సన్నని కమానులతో అలంకరించబడిన బృహత్తరమైన రాజభవనాలు ప్రాచీన కాలానికి చెందిన ప్రాచ్య నాగరికతా ప్రభావాలకు నిదర్శనాలుగా కనిపిస్తాయి. ఆ నగరపు ముఖ్య మార్గమైన గ్రాండ్‌ కెనాల్‌ అనే పెద్ద కాలువపై నిర్మించబడిన ప్రసిద్ధ రియాల్టో వంతెన, దాని క్రిందనుండి మెల్లగా సాగిపోయే నల్లని గొండోలా పడవలు సందర్శకులను ఎంతో ఆకర్షిస్తాయి.

ఉనికిలో ఉండడానికి ఇంకా పోరాడుతూనే ఉంది

“అందమైన గణతంత్ర రాజ్యం” కూలిపోయి రెండు శతాబ్దాలు గడిచినా వెనీస్‌ ఉనికిలో ఉండడానికి ఇంకా పోరాడుతూనే ఉంది, అయితే ఇప్పుడది పోరాడేది మరో రకమైన పోరాటం. అక్కడి స్థలాల రేట్లు విపరీతంగా పెరిగిపోవడం వల్ల, ఉద్యోగాలు లేకపోవడం వల్ల, ఆధునిక సౌకర్యాలు అంతగా లేకపోవడం వల్ల ఆ చారిత్రక కేంద్ర జనాభా 1951లో 1, 75,000 నుండి 2003కల్లా 64,000కు పడిపోయింది. క్లిష్టమైన సామాజిక, ఆర్థిక సమస్యలు పరిష్కరించబడాలి. క్షీణించిపోతున్న ఆ నగరాన్ని ఎలా పునరుజ్జీవింపజేయాలి, అసలు దానిని పునరుజ్జీవింజేయాలా వద్దా అనేవే సమస్యలు.

స్థానిక ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందనే ఆశతో 1920లలో ఇటలీలో ఒక క్రొత్త పారిశ్రామిక ప్రాంతం వృద్ధి చేయబడింది, ఆ పరిశ్రమలకు ఆయిల్‌ ట్యాంకర్లు చేరడానికి వీలుగా ఉప్పునీటి చెరువు గుండా ఒక లోతైన కాలువ త్రవ్వబడింది. అక్కడ తెరవబడిన పరిశ్రమలవల్ల ఉద్యోగావకాశాలు పెరిగాయి, అయితే కాలుష్యం ఎక్కువ కావడానికి, ఆక్వా ఆల్టా అనే నాశనకరమైన ఎత్తైన కెరటాలు అతి తరచుగా ఆ నగరపు చారిత్రాత్మక కేంద్రంపై విరుచుకుపడడానికి కూడా అవే కారణమనే విమర్శ ఉంది.

ఉప్పునీటి చెరువు పరిసరాలు, దానిలోని నీటి కదలికలు, నీటి ప్రవాహం ఇవన్నీ ఆ నగరం ఉనికిలో ఉండడానికి ఆవశ్యకమైన ప్రకృతి సిద్ధమైన సున్నిత ప్రక్రియగా రూపొందుతాయనే విషయం క్రొత్తదేమీ కాదు. 1324 నాటి నుండే వెనీస్‌ నివాసులు, నదులు ఒండ్రుమట్టిని తీసుకొస్తూ ఆ ఉప్పునీటి చెరువును పూర్తిగా నింపివేయకుండా ఉండేందుకు నదులను పక్కకు మళ్ళించడానికి బృహత్తరమైన ఇంజనీరింగు పనులను చేపట్టారు. 18వ శతాబ్దంలో వాళ్ళు ఏడ్రియాట్రిక్‌ సముద్రం ఉప్పునీటి చెరువును ముంచెత్తుతూ దానిని నాశనం చేయకుండా ఉండడానికి సముద్రంలో గోడలు నిర్మించారు.

ఇప్పుడు పరిస్థితి మునుపటికంటే క్లిష్టంగా తయారయ్యింది. పారిశ్రామిక వినియోగం కోసం భూగర్భ జలాలను తీసుకోవడాన్ని నిలిపివేసినందుకు, భూగర్భ నీటి వనరులు తగ్గిపోయి నేల మునిగిపోయే ప్రమాదం ఉండదు అని ఆశించబడుతున్నా, ప్రపంచవ్యాప్తంగా సముద్ర మట్టం పెరుగుతూనే ఉంది. అంతేకాకుండా స్థలాన్ని అధికం చేసుకోవడానికి చేసిన ప్రయత్నాలవల్ల ఆ ఉప్పునీటి చెరువు విస్తీర్ణం తగ్గిపోయింది, దానితో నేలకూ నీటికీ మధ్య ఉన్న సమతుల్యత దెబ్బతిన్నది. వరదలు వచ్చే ప్రమాదం మునుపెన్నటికన్నా ఇప్పుడు ఎక్కువగా ఉంది. 20వ శతాబ్దపు ఆరంభంలో సెయింట్‌ మార్క్స్‌ కూడలిని ప్రతి సంవత్సరం దాదాపు ఐదు నుండి ఏడుసార్లు వరదలు ముంచెత్తేవి. అయితే ఒక శతాబ్దం తర్వాత అది ఒక్క సంవత్సరంలోనే 80 సార్లు ముంపుకు గురయ్యింది.

వెనీస్‌కున్న అసాధారణమైన చారిత్రాత్మక మరియు కళాత్మక వారసత్వ సంపదతోపాటు దానికి ఎదురవుతున్న సమస్యలు అంతర్జాతీయ చింతకు కారణమయ్యాయి. ఆ నగరపు ఓడరేవు కార్యకలాపాలకు లేదా దాని నివాసుల అనుదిన జీవితానికి భంగం కలిగించకుండా, పర్యావరణానికి హాని చేయకుండా వరదలనుండి ఆ నగరాన్ని కాపాడాలనే లక్ష్యంతో ఒక ప్రత్యేకమైన శాసనం జారీ చేయబడింది. అయితే దానిని సాధించడానికి అత్యుత్తమమైన మార్గమేమిటి అనేది ఇంకా చిక్కు ప్రశ్నగానే ఉంది.

కాలువ గట్లను పెద్దగా చేయడానికి, రాళ్ళు పరచిన కాలిబాటలలోకి క్రిందనుండి నీళ్ళు ఊరకుండా చేయడానికి, ఆక్వా ఆల్టా అనే ఎత్తైన కెరటాలు వచ్చినప్పుడు మురుగునీరు మళ్ళీ వెనక్కి నగరపు కాలవలలోకి రాకుండా చేయడానికి పనులు జరుగుతున్నాయి. అయితే వారు చేపట్టిన అత్యంత వివాదాస్పదమైన పని, వరదలు వచ్చే ప్రమాదం ఉన్నప్పుడు ఉప్పునీటి చెరువు ప్రవేశద్వారాల దగ్గర పైకి లేపడానికి అనువుగా ఉండే ప్రతిబంధకాల వ్యవస్థను ఒక ప్రణాళిక ప్రకారం నిర్మించడమే.

ఆ పనిని సాధించడానికి ఎంతో సమయం, అవధానం, శక్తి, వనరులు అవసరం. ‘సాగరంలోని ఈ అద్భుతమైన నగరం’ ఆకర్షణీయమైన చరిత్రకు అద్దం పడుతోంది, అయితే వివిధ రచయితలు వ్యాఖ్యానించినట్లుగా “వెనీస్‌ నివాసులు కానివారు స్థానిక ప్రజల అవసరాలను పక్కన పెట్టి లేదా వారు ఆ నగరాన్ని విడిచి వెళ్ళేలా బలవంతపెట్టి వెనీస్‌ను ఒక వస్తు ప్రదర్శనశాలగా మార్చే” ప్రమాదం ఉంది. వెనీస్‌ కష్టమైన సహజ పరిస్థితులతో ఎంతోకాలంగా పోరాడుతూ వస్తోంది, అయితే ఇప్పుడు “దానిని తిరిగి సామాజికంగా, ఆర్థికంగా బలపరిచి, ప్రజలతో, పనులతో కళకళలాడేలా చేయకుండా కేవలం దానిని నీటితాకిడి నుండి భౌతికంగా రక్షించడం వ్యర్థమే.” (g05 3/22)

[16వ పేజీలోని మ్యాపు]

(పూర్తిగా ఫార్మా చేయబడిన టెస్ట్‌ కోసం ప్రచురణ చూడండి)

వెనీస్‌

[16వ పేజీలోని చిత్రం]

గ్రాండ్‌ కెనాల్‌పై ఉన్న రియాల్టో వంతెన

[16, 17వ పేజీలోని చిత్రం]

సాన్‌ జార్జో మెజోర్‌

[17వ పేజీలోని చిత్రం]

సాంటా మారియా డెల్లా సల్యూట్‌

[18వ పేజీలోని చిత్రం]

గ్రాండ్‌ కెనాల్‌పై ఉన్న హోటళ్ళు

[19వ పేజీలోని చిత్రం]

సెయింట్‌ మార్క్స్‌ కూడలిలో వరదనీరు

[చిత్రసౌజన్యం]

Lepetit Christophe/ GAMMA

[16వ పేజీలోని చిత్రసౌజన్యం]

మ్యాపు: Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.; పూర్వరంగంలోవున్న ఫోటో: © Medioimages

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి