కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g05 4/8 పేజీలు 14-15
  • జంతు ప్రపంచంలో పోషణ, శిక్షణ

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • జంతు ప్రపంచంలో పోషణ, శిక్షణ
  • తేజరిల్లు!—2005
  • ఇలాంటి మరితర సమాచారం
  • జిరాఫీల్లో జరిగే రక్తప్రసరణ
    సృష్టిలో అద్భుతాలు
  • తల్లిదండ్రులారా, మీ కుటుంబాన్ని సంరక్షించండి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • చీతా—శరవేగంతో పరిగెత్తే పిల్లి
    తేజరిల్లు!—1997
తేజరిల్లు!—2005
g05 4/8 పేజీలు 14-15

జంతు ప్రపంచంలో పోషణ, శిక్షణ

స్పెయిన్‌లోని తేజరిల్లు! రచయిత

సాధారణంగా మానవ తల్లిదండ్రులు పిల్లల పెంపకానికి దాదాపు రెండు దశాబ్దాలు వెచ్చిస్తారు. అయితే మరోవైపున చాలా జంతువులు తమ పసికూనల పూర్తి పోషణ, శిక్షణ కార్యక్రమాన్ని వేసవికాలపు కొద్ది నెలల్లోనే ముగించాలి. తల్లిదండ్రులైన జంతువులు ప్రతి సంవత్సరం ఎదుర్కొనే కష్టతరమైన పనిని వివరించడానికి కొన్ని ఉదాహరణలు సరిపోతాయి.

1.తెల్ల కొంగ ఈ ప్రక్కనున్న చిత్రంలోని కొంగకు వేసవి సెలవులంటూ ఏమీ ఉండవు. ఆకలిగొన్న ఎదుగుతున్న పసికూనలకు ఆహారం పెట్టడానికి అది దగ్గర్లోవున్న చెరువు నుండి కప్పలు, చిన్న చేపలు, బల్లులు, లేదా మిడతలు తీసుకు రావడానికి తరచూ వెళ్ళివస్తుండాలి, అంతేగాక అప్పుడప్పుడూ గూటిని బాగు చేసుకోవాలి. తల్లి పక్షి, తండ్రి పక్షి రెండూ దినమంతా అలా వచ్చి వెళ్తూనే ఉంటాయి. పక్షికూనలు అధిక మొత్తంలో ఆహారం తింటాయి. మొదటి కొద్ది వారాల్లో, అవి ప్రతీరోజు తమ శరీర బరువులో సగం బరువుకు సరిసమానమైన ఆహారం స్వాహా చేయగలవు! చిన్న కొంగలు ఎగరడం నేర్చుకున్న తర్వాత కూడా కొన్ని వారాలపాటు తమ తల్లిదండ్రుల మీదే ఆధారపడతాయి.

2.చిరుతపులి చిరుతపులుల కుటుంబాల్లో సాధారణంగా కేవలం తల్లి లేక తండ్రి మాత్రమే ఉంటాయి, తల్లే పిల్లల గురించి శ్రద్ధ తీసుకుంటుంది. అది సాధారణంగా మూడు నుండి ఐదు వరకుండే తన పిల్లలకు పాలిచ్చే కాలంలో తాను మంచి ఆహారం తీసుకోవడానికి దాదాపు ప్రతీరోజు వేటాడాల్సి వస్తుంది. అలా వేటాడడం కూడా అంత సుళువైన పనేమీ కాదు, ఎందుకంటే వేటాడడానికి అది చేసే ప్రయత్నాలు సాధారణంగా విఫలం అవుతుంటాయి. అంతేగాక, ప్రతి కొద్ది రోజులకు అది కుటుంబాన్ని మరో గుహకు మార్చాలి, ఎందుకంటే సింహాలు బలహీనంగా ఉండే పులిపిల్లలను పట్టుకోవడానికి చూస్తుంటాయి. పులిపిల్లలు ఏడు నెలల వయస్సుకు చేరుకునే సరికి, అది వాటికి వేటాడడం నేర్పిస్తుంది, దానికి చాలా సమయం అంటే దాదాపు ఒక సంవత్సరం పడుతుంది. పులిపిల్లలు సాధారణంగా సంవత్సరం, సంవత్సరంన్నర వరకు తమ తల్లితోనే ఉంటాయి.

3.చిన్న గ్రీబ్‌ గ్రీబ్‌లని పిలువబడే ఒక రకమైన బాతులకు వాటి పిల్లలకు మధ్య విడదీయలేని బంధం ఉంటుంది. పిల్లలు గుడ్లనుండి బయటకు వచ్చిన వెంటనే, నీళ్ళలో తేలియాడే తమ గూటిని విడిచిపెట్టి తమ తల్లిదండ్రుల వీపు మీదకు ఎక్కి తమ తల్లిదండ్రుల రెక్కలకూ డార్సల్‌ ఈకలకూ మధ్యన కూర్చుంటాయి. తల్లి లేదా తండ్రి ఈదుతున్నప్పుడు, అక్కడ వాటికి వెచ్చదనం, భద్రత లభిస్తాయి. తల్లి, తండ్రి పక్షులు ఆహారం కోసం నీళ్ళలోకి వెళ్ళడాన్ని, పక్షికూనలను మోయడాన్ని వంతులుగా తీసుకుంటాయి. చిన్న పక్షులు నీళ్ళలోకి వెళ్ళడం, ఆహారం సంపాదించుకోవడం త్వరగానే నేర్చుకున్నా, తల్లిదండ్రులతో వాటి బంధం కొంతకాలం వరకు కొనసాగుతుంది.

4.జిరాఫీ జిరాఫీలకు ఒకసారికి ఒకటికంటే ఎక్కువ పిల్లలు పుట్టడం అరుదు, దానికి కారణమేమిటో అర్థం చేసుకోవడం కష్టమేమీ కాదు. ప్రక్కనున్న ఫోటోలో ఉన్నటువంటి, అప్పుడే జన్మించిన జిరాఫీ సుమారు 60 కిలోల బరువుండి రెండు మీటర్ల ఎత్తు ఉంటుంది! పుట్టిన ఒక గంట తర్వాత, ఆ పసికూన చక్కగా నిలబడి తన తల్లి దగ్గర పాలు త్రాగడం మొదలుపెడుతుంది. అది పుట్టిన కొద్దిసేపటి తర్వాత గడ్డి మేయడం మొదలుపెట్టినా తొమ్మిది నెలలపాటు పాలు త్రాగుతుంది. పసికూనకు ప్రమాదం వాటిల్లినప్పుడు అది వెళ్ళి తల్లి కాళ్ళమధ్యన నిలబడుతుంది, ఎందుకంటే తల్లి శక్తివంతమైన తన్నులు దానికి ఇతర జంతువుల నుండి రక్షణ కల్పిస్తాయి.

5.సాధారణ కింగ్‌ఫిషర్‌ కింగ్‌ఫిషర్‌లు తమ పిల్లల కోసం చేపలు పట్టేటప్పుడు ఎంతో సమర్థవంతంగా, ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే జన్మించిన పక్షి కూనలకు తల్లి పక్షి, తండ్రి పక్షి ఒకటి రెండు అంగుళాల పొడవుండే చిన్న చేపలను మాత్రమే ఆహారంగా అందిస్తాయని పక్షుల నిపుణులు కనుగొన్నారు. తల్లి పక్షి లేదా తండ్రి పక్షి, చేపలను తీసుకెళ్ళేటప్పుడు వాటి తల బయటికి ఉండేలా జాగ్రత్తపడతాయి. దానివల్ల, ఆకలితో ఉండే పక్షి కూనలకు ఆహారం మింగడం మరింత సులభమవుతుంది. పక్షి కూనలు ఎదుగుతుండగా, తల్లి లేదా తండ్రి పక్షులు వాటి కోసం కాస్త పెద్ద చేపలను తెస్తాయి. అంతేగాక అవి ఎక్కువసార్లు ఆహారం అందివ్వడం మొదలుపెడతాయి. మొదట్లో, ప్రతి పక్షి పిల్లకు దాదాపు ప్రతి 45 నిమిషాలకు ఒకసారి ఆహారం ఇస్తాయి. కానీ అవి 18 రోజుల పిల్లలయ్యే సరికి వాటికి ఆకలి ఎక్కువవుతుంది, దానితో ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఆహారం అవసరమవుతుంది! ఈ చిత్రంలోని చిన్న పక్షి ఇప్పటికే గూడు వదిలి వచ్చేసింది, త్వరలోనే అది స్వయంగా చేపలు పట్టడం మొదలుపెడుతుంది. ఈ సమయంలో తల్లి పక్షి, తండ్రి పక్షి పిల్లల పెంపకం నుండి కాస్త విశ్రాంతి తీసుకోవాలని కోరుకుంటాయని మీరు అనుకుంటుండవచ్చు. కానీ కింగ్‌ఫిషర్‌లు అలా చేయవు! అవి తరచూ అదే వేసవిలో మళ్ళీ గుడ్లు పెట్టి మొత్తం కార్యక్రమమంతా మళ్ళీ మొదలుపెడతాయి.

అయితే, వివిధ జంతువులు తమ పిల్లలను ఎలా పెంచుతాయి అనే విషయానికి సంబంధించిన అనేక వివరాలు ఇప్పటికీ మనకు తెలియవు. అయితే జంతు, వృక్ష ప్రకృతిని అధ్యయనం చేసేవారు ఎంత ఎక్కువగా ఆ వివరాలు తెలుసుకుంటే, జంతు ప్రపంచంలో తల్లిదండ్రులుగా జంతువుల సహజ ప్రవృత్తి ఎంత శక్తివంతమైనదో అంత ఎక్కువగా స్పష్టమవుతుంది. దేవుడు తన జంతు సృష్టికే తల్లిదండ్రులకు సంబంధించి సహజ ప్రవృత్తిని అంతగా ఇచ్చాడంటే, మానవ తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు అవసరమైన పోషణ, శిక్షణ ఇవ్వాలని ఆయన తప్పకుండా కోరుకుంటాడు. (g05 3/22)

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి