ఆధునిక వైద్యం—ఎంత ఎత్తుకి చేరుకోగలదు?
చేతికందని జామపండును కోయడానికి స్నేహితుడి భుజాల మీదికి ఎక్కాలనే చిట్కాను పిల్లలు చాలా తొందరగానే నేర్చుకుంటారు. వైద్య రంగంలో ఇలాంటిదే జరిగింది. వైద్య రంగ పరిశోధకులు తమకంటే ముందరి తరాల్లోని ప్రఖ్యాత వైద్యుల భుజాలపైకి ఎక్కడం ద్వారానే మరింత ఎత్తుకి చేరుకున్నారు.
ఆ ముందటి తరాల వైద్యుల్లో హిపోక్రటీస్, పాశ్చర్‌లాంటి ప్రసిద్ధులు, అలాగే వెసాలియస్, విలియమ్ మోర్టన్‌లాంటి ప్రజలకంతగా తెలియనివారూ ఉన్నారు. ఆధునిక వైద్యం వీరికెలా ఋణపడి ఉంది?
ప్రాచీన కాలాల్లో వ్యాధులను బాగుచేసే వృత్తిలో శాస్త్రీయ దృక్పథం కన్నా ఎక్కువగా మూఢనమ్మకాలు మతాచారాలు ఇమిడివుండేవి. డా. ఫెలిక్స్ మార్టీ-ఇబాన్యేస్ సంపాదకుడిగా ఉన్న ది ఎపిక్ ఆఫ్ మెడిసిన్ అనే పుస్తకం ఇలా చెబుతోంది: “వ్యాధిని జయించడానికి . . . మెసొపొటేమియన్లు వైద్యాన్ని మతంతో సమ్మిళితం చేశారు, ఎందుకంటే వ్యాధి అనేది దేవుళ్ళు విధించిన శిక్ష అని వారు నమ్మేవారు.” వారి తర్వాత ఉనికిలోకి వచ్చిన ఈజిప్ట్ వైద్యం కూడా అలాగే మతంలో వేళ్ళూనుకొని ఉంది. ఆ విధంగా వైద్యుణ్ణి మతపరమైన భావంతో మెప్పుదలతో దృష్టించడం తొలి కాలాల నుండే ప్రారంభమైంది.
డా. థామస్ ఎ. ప్రెస్టన్ ద క్లే పెడస్టల్ అనే తన పుస్తకంలో తన అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చాడు: “ప్రాచీనుల అనేక నమ్మకాల నీడలు నేటి వైద్యంలో కూడా కనిపిస్తాయి. వ్యాధి అనేది తన నియంత్రణలో లేనిదని, వైద్యుని అద్భుత శక్తి మాత్రమే స్వస్థతను చేకూర్చగలదనే రోగి నమ్మకం వాటిలో ఒకటి.”
పునాదులు వేయడం
అయితే కాలం గడిచే కొద్దీ వైద్య వృత్తి శాస్త్రీయ విధానంగా మారుతూ వచ్చింది. ప్రాచీనుల్లో అత్యంత ప్రముఖ శాస్త్రీయ వైద్యుల్లో ఆద్యుడు హిపోక్రటీస్. ఆయన గ్రీకు ద్వీపమైన కోస్‌లో సా.శ.పూ. 460వ సంవత్సరం మధ్యకాలంలో జన్మించాడు, ఎంతోమంది ఆయనను పాశ్చాత్య వైద్య పితామహుడిగా దృష్టిస్తారు. వైద్యాన్ని తర్కబద్ధంగా దృష్టించాలన్న అభిప్రాయానికి హిపోక్రటీస్ పునాది వేశాడు. వ్యాధి అనేది ఎవరో దేవత విధించిన శిక్ష అన్న నమ్మకాన్ని ఆయన తిరస్కరిస్తూ దానికి సహజ కారణాలున్నాయని వాదించాడు. ఉదాహరణకు, మూర్ఛరోగం అప్పటికి చాలా కాలంగా పవిత్రమైన రోగమని పిలువబడింది, ఎందుకంటే దానికి దేవతలు మాత్రమే చికిత్స చేయగలరని ప్రజలు నమ్మేవారు. కానీ హిపోక్రటీస్ ఇలా వ్రాశాడు: “పవిత్ర రోగం అని పిలువబడే వ్యాధి వేరే వ్యాధుల్లానే ఎంతమాత్రమూ దైవికమైనది కాదు, పవిత్రమైనదీ కాదు, దానికి సహజ కారణాలున్నాయి.” అనేక వ్యాధుల లక్షణాలను గమనిస్తూ వాటిని భవిష్యత్తులో ఉపయోగించడానికి వ్రాసిపెట్టుకున్న వ్యక్తుల్లో హిపోక్రటీసే మొదటి వాడని కూడా తెలుస్తుంది.
శతాబ్దాల తర్వాత గాలెన్ అనే గ్రీకు వైద్యుడు సా.శ. 129లో జన్మించాడు, ఈయన కూడా అదే విధంగా వినూత్నమైన శాస్త్రీయ పరిశోధనలు చేశాడు. మానవుల, జంతువుల కళేబరాలను కోసి అధ్యయనం చేసి, శరీర నిర్మాణశాస్త్రంపై ఒక పాఠ్యగ్రంథాన్ని రచించాడు. వైద్యులు దాన్ని శతాబ్దాలపాటు ఉపయోగించారు! బ్రస్సెల్స్‌లో 1514లో జన్మించిన ఆంద్రియాస్ వెసాలియస్ ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ (మానవ శరీర నిర్మాణం) అనే పుస్తకాన్ని రచించాడు. ఇది గాలెన్ నిర్ధారణలెన్నింటికో విరుద్ధంగా ఉండడంతో దీనికి వ్యతిరేకత ఎదురైంది, కానీ ఆధునిక శరీరనిర్మాణశాస్త్రానికి ఇది పునాది వేసింది. డీ గ్రోసెన్ (మహనీయులు) అనే పుస్తకం ప్రకారం, ఆ విధంగా వెసాలియస్ “చరిత్రలో అత్యంత ప్రముఖులైన వైద్య పరిశోధకుల్లో ఒకడయ్యాడు.”
గుండె గురించి, రక్త ప్రసరణ గురించి గాలెన్ సిద్ధాంతాలు చివరికి తప్పులని తేలిపోయాయి.a ఆంగ్ల వైద్యుడైన విలియమ్ హార్వే ఎన్నో సంవత్సరాలపాటు జంతువుల పక్షుల కళేబరాలను కోసి పరీక్షించాడు. ఆయన గుండె కవాటాల పనితీరును గమనించాడు, ఒక్కొక్క గుండె కోష్ఠములో ఎంతెంత రక్తం ఉందో కొలిచాడు, శరీరంలోని రక్తం ఎంతుందో అంచనా వేశాడు. తాను కనుగొన్న విషయాలను హార్వే 1628లో జంతువుల్లో గుండె మరియు రక్తముల ధర్మం అనే పుస్తకంలో గ్రంథస్థం చేశాడు. ఇందుకు ఆయనను విమర్శించారు, వ్యతిరేకించారు, ఆయనపై దాడిచేశారు, ఆయనను అవమానించారు. కానీ ఆయన గ్రంథం వైద్య చరిత్రలోనే మలుపురాయిగా ఉంది—శరీర రక్త ప్రసరణ వ్యవస్థ చివరికి కనిపెట్టబడింది మరి!
క్షురకర్మల నుండి శస్త్రచికిత్సకు
శస్త్రచికిత్సలో కూడా పెను మార్పులు చోటు చేసుకుంటూ వచ్చాయి. మధ్య యుగాల్లో శస్త్రచికిత్సను తరచు క్షురకులే చేసేవారు. 16వ శతాబ్దానికి చెందిన ఫ్రెంచి వ్యక్తి ఆంబ్రాజ్ పారే ఆధునిక శస్త్రచికిత్సకు పితామహుడని కొందరంటారు. క్షుర-శస్త్రచికిత్సకు ఆద్యుడైన ఈయన నలుగురు ఫ్రెంచి రాజులకు తన సేవలనందించాడు. పారే అనేక శస్త్రచికిత్సా ఉపకరణాలను కనిపెట్టాడు కూడా.
19వ శతాబ్దపు శస్త్రవైద్యుడు ఎదుర్కొన్న అతి పెద్ద సమస్యల్లో ఒకటేమిటంటే శస్త్రచికిత్స జరుగుతున్నప్పుడు కలిగే నొప్పిని నివారించలేకపోవడమే. కానీ 1846లో విలియమ్ మోర్టన్ అనే దంతవైద్యుడు శస్త్రచికిత్సలో మత్తిచ్చే ప్రక్రియను విస్తృతం చేసేందుకు మార్గాన్ని తెరిచాడు.b
1895లో జర్మనీ భౌతికశాస్త్రజ్ఞుడు విల్‌హెల్మ్ రాంట్‌జెన్ విద్యుచ్ఛక్తితో ప్రయోగాలు చేస్తూ ఎముకల గుండా కాక శరీరం గుండా పయనిస్తున్న కిరణాలను గమనించాడు. ఆ కిరణాలు ఎక్కడి నుండి ఉద్భవిస్తున్నాయో ఆయనకు తెలీలేదు అందుకని ఆయన వాటిని ఎక్స్-కిరణాలని పిలిచాడు, ఇక ఆంగ్లభాష మాట్లాడే ప్రాంతాల్లో వాటికి అదే పేరు స్థిరపడిపోయింది. (జర్మన్లు వాటిని రాంట్‌జెన్‌స్ట్రాలెన్ అని పిలుస్తారు.) డీ గ్రోసెన్ డోయిషెన్ (జర్మన్ మహనీయులు) అనే పుస్తకం ప్రకారం రాంట్‌జెన్ తన భార్యతో ఇలా అన్నాడు: “రాంట్‌జెన్‌కి పిచ్చి పట్టిందని ప్రజలనుకుంటారు.” కొందరు నిజంగానే అనుకున్నారు. కానీ ఆయన కనిపెట్టిన కిరణాలు శస్త్రచికిత్సలో విప్లవాత్మకమైన మార్పులను తెచ్చిపెట్టాయి. ఇప్పుడు శస్త్రవైద్యులు శరీరంపై గాటు పెట్టకుండానే శరీర అంతర్భాగంలోకి చూడగలరు.
వ్యాధులపై విజయాలు
మశూచిలాంటి అంటు వ్యాధులు అన్ని కాలాల్లోను ఎడతెగని మహామారులను, భయోత్పాతాన్ని, మరణాలను తీసుకువచ్చాయి. తొమ్మిదవ శతాబ్దపు పర్షియావాడైన ఆర్-రజీ ఆ కాలంలోని ముస్లిమ్ ప్రపంచంలో అతి గొప్ప వైద్యుడని అంటారు, మశూచి గురించి వైద్యపరంగా ఖచ్చితమైన వివరణను మొట్టమొదటిగా వ్రాసిన వ్యక్తి ఆయనే. కానీ ఆ పిమ్మట శతాబ్దాల తర్వాత గాని, బ్రిటీష్ వైద్యుడు ఎడ్వర్డ్ జెన్నర్ దానికి చికిత్సా విధానాన్ని కనుగొనలేదు. నిరపాయకరమైన కౌ-పాక్స్ (పశు-మశూచి) వచ్చిన వ్యక్తి మశూచి (చికెన్-పాక్స్‌కు) నిరోధకశక్తిని పెంపొందించుకొంటున్నట్లు జెన్నర్ గమనించాడు. ఈ విషయంపై ఆధారపడి జెన్నర్, మనుష్యుల మశూచికి ఒక టీకాను తయారుచేయడానికి, పశువులకు మశూచి వచ్చినప్పుడు వాటి దద్దుర్ల నుండి పదార్థాన్ని సేకరించి దాన్ని ఉపయోగించాడు. అది 1796లోని సంగతి. ఆయన ముందు తరాల్లోని ఔత్సాహికులను విమర్శించినట్లే ప్రజలు జెన్నర్‌ను కూడా విమర్శించారు, వ్యతిరేకించారు. కానీ ఆయన కనుగొన్న టీకాలిచ్చే ప్రక్రియ చివరికి ఆ వ్యాధిని నిర్మూలించేందుకు నడిపించింది, అలాగే వైద్యశాస్త్రానికి ఒక శక్తిమంతమైన క్రొత్త విధానాన్ని ప్రసాదించింది.
ఫ్రెంచి దేశస్థుడైన లూయీ పాశ్చర్ రేబీస్, ఆంత్రాక్స్, చికిత్స కొరకు టీకాలను ఉపయోగించాడు. ఆయన కూడా వ్యాధులను కలుగజేయడంలో సూక్ష్మక్రిములు చాలా ప్రధానమైన పాత్రను వహిస్తాయని రుజువు చేశాడు. రాబర్ట్ కోఖ్ క్షయను కలుగజేసే సూక్ష్మక్రిమిని 1882లో గుర్తించాడు, ఒక చరిత్రకారుడు క్షయ వ్యాధిని “పందొమ్మిదవ శతాబ్దపు అతి గొప్ప హంతకి” అని పిలిచాడు. దాదాపు ఒక సంవత్సరం తరువాత కలరాను కలుగజేసే సూక్ష్మక్రిమిని కూడా కోఖ్ కనిపెట్టాడు. లైఫ్ పత్రిక ఇలా అంటోంది: “పాశ్చర్, కోఖ్‌ల కృషి మూలంగా సూక్ష్మజీవశాస్త్రం ఉనికిలోకి వచ్చింది, వారి కృషి మూలంగానే రోగనిరోధక, పారిశుద్ధ్య, ఆరోగ్య శాస్త్రాల్లో గొప్ప పురోభివృద్ధి జరిగాయి. మానవుల జీవితకాలాన్ని పెంచడానికి అంతకు ముందటి 1,000 సంవత్సరాల కాలంలో ఏ విజ్ఞానశాస్త్ర పురోభివృద్ధీ అంతగా దోహదం చేయలేదు.”
ఇరవయ్యవ శతాబ్దపు వైద్యశాస్త్రం
20వ శతాబ్దం ప్రారంభంలో వైద్యశాస్త్రం పైన పేర్కొన్న మహామహుల భుజాలపైన మరితర వైద్య శిఖామణుల భుజాలపైన నిలబడి ఉంది. అప్పటి నుండి వైద్య పురోభివృద్ధిలు తీవ్రగతిన జరగడం ప్రారంభమైంది—డయబెటిస్‌కు ఇన్సులిన్, క్యాన్సరుకు రసాయనచికిత్స, గ్రంథిసంబంధిత వ్యాధులకు హార్మోన్ చికిత్స, క్షయకు యాంటీబయోటిక్‌లు, కొన్నిరకాల మలేరియాలకు క్లోరోక్విన్, మూత్రపిండాల వ్యాధులకు డయాలసిస్, అలాగే ఓపెన్-హార్ట్ సర్జరీలు, అవయవ మార్పిడిలు మచ్చుకి కొన్ని మాత్రమే.
అయితే మనమిప్పుడు 21వ శతాబ్దం ప్రారంభంలో ఉన్నాము, “ఆమోదయోగ్య స్థాయిలో ప్రపంచ ప్రజలందరికీ ఆరోగ్యం” సాధించాలన్న లక్ష్యాన్ని అందుకోవడానికి వైద్యశాస్త్రం ఎంత దూరంలో ఉంది?
లక్ష్యం అందుబాటులో లేదా?
తన తోటివాడి భుజాల మీదికి ఎక్కినంత మాత్రాన జామపండ్లన్నీ చేతికి అందవని పిల్లలు గ్రహిస్తారు. నోరూరించే జామపండ్లు చేతికందనంత ఎత్తులో చిటారు కొమ్మన ఇంకా ఉన్నాయి. అలాగే, వైద్యశాస్త్రం కూడా ఒకదాని తర్వాత మరొకటిగా పురోభివృద్ధి సాధించింది, ఎంతో ఎత్తుకి ఎదిగింది. కానీ అత్యంత గొప్ప లక్ష్యం—అందరికీ మంచి ఆరోగ్యం—మాత్రం చిటారు కొమ్మనే అందకుండా ఉంది.
అందుకే, “యూరోపియన్లు ఇంత సుదీర్ఘమైన ఆరోగ్యకరమైన జీవితాలను మున్నెన్నడూ అనుభవించలేదు” అని ఒకప్రక్క నివేదిస్తూనే యూరోపియన్ కమీషన్ 1998లో ఇలా కూడా అన్నది: “ప్రతి ఐదుగురిలో ఒక వ్యక్తి 65 ఏండ్ల లోపలే అకాల మరణానికి గురౌతాడు. అందుకు క్యాన్సర్ 40% గుండె జబ్బులు 30% కారణమౌతాయి . . . క్రొత్త క్రొత్త ఆరోగ్య ప్రమాదాలకు విరుద్ధంగా ఇంకా రక్షణ కాపుదల అవసరం.”
గెజూన్ట్‌హైట్ అనే జర్మన్ ఆరోగ్య పత్రిక కలరా, క్షయ వంటి అంటువ్యాధులు ప్రస్తుతం చాలా ముప్పు తీసుకువస్తున్నాయని 1998 నవంబరులో నివేదించింది. ఎందుకని? ఎందుకంటే, యాంటీబయోటిక్‌లు వాటి “ప్రభావాన్ని కోల్పోతున్నాయి. చాలా రకాల సూక్ష్మక్రిములు కనీసం ఒక సాధారణ మందుని నిరోధించే శక్తిని పెంపొందించుకుంటున్నాయి, నిజానికి చాలామట్టుకు అనేక రకాల మందులకు కూడా లొంగడం లేదు.” పాత వ్యాధులు మళ్ళీ పునరాగమనం చేయడమే కాక, ఎయిడ్స్ వంటి క్రొత్త వ్యాధులు కూడా ప్రత్యక్షమౌతున్నాయి. మందులకు సంబంధించిన జర్మన్ పత్రిక స్టాటిస్టిక్స్ ’97 మనకిలా గుర్తుచేస్తోంది: “మనకు తెలిసిన వ్యాధుల్లో మూడింట రెండు వంతులు, అంటే దాదాపు 20,000 వ్యాధులకు ఇప్పటి వరకు చికిత్స చేయడానికి మార్గం లేదు.”
జన్యు చికిత్స దగ్గరేమైనా జవాబుందా?
వినూత్న చికిత్సలను అభివృద్ధి చేస్తూనే ఉంటారన్నది ఒప్పుకోవల్సిందే. ఉదాహరణకు, జెనెటిక్ ఇంజినీరింగ్ మంచి ఆరోగ్యాన్ని తీసుకువస్తుందని చాలామంది భావిస్తారు. అమెరికాలో 1990లలో డా. డబ్ల్యు. ఫ్రెంచ్ ఆండర్సన్‌వంటి వైద్యులు జరిపిన పరిశోధనల పర్యంతం జన్యు చికిత్స “అత్యంత ప్రజాదరణ పొందిన, ఉత్తేజకరమైన క్రొత్త వైద్య పరిశోధనా రంగం” అని వర్ణించబడింది. హైలెన్ మిట్ జెనెన్ (జన్యువులతో స్వస్థత) అనే పుస్తకం ప్రకారం “జన్యు చికిత్స మూలంగా వైద్యశాస్త్రం గొప్ప పురోభివృద్ధి అంచున ఉన్నట్లు చెప్పవచ్చును. ప్రాముఖ్యంగా ఇప్పటివరకు నయంకాని వ్యాధుల చికిత్స విషయంలో ఇది వాస్తవం.”
రోగి శరీరాల్లోకి సరిదిద్దే జన్యువులను పంపించడం ద్వారా జన్మసిద్ధమైన జన్యు సంబంధిత వ్యాధులను అనతికాలంలోనే నయం చేయగలమని శాస్త్రజ్ఞులు ఎదురు చూస్తున్నారు. చివరికి క్యాన్సర్ కణాల్లాంటి హానికరమైన కణాలను కూడా బహుశ స్వయంనాశక కణాలుగా మార్చగలరేమో. జెనెటిక్ స్క్రీనింగ్ ద్వారా ఒక వ్యక్తి కొన్ని వ్యాధులకు ఎంతవరకు లోనయ్యే అవకాశముందో చెప్పగల్గడం ఇప్పటికే సాధ్యమవుతోంది. ఫార్మకోజెనోమిక్స్—మందులను రోగి జన్యు నిర్మాణానికి అనుగుణంగా మార్చే పద్ధతి తర్వాత రాబోయే పురోభివృద్ధి అని కొందరంటున్నారు. వైద్యులు ఒకరోజు “తమ రోగుల అస్వస్థతలను నిర్ధారించి వారిని నయం చేయడానికి పరమాణు పరిమాణంలోని దారాల్లాంటి ఖచ్చితమైన మందులను ఇస్తారేమోనని” ఒక ప్రముఖ పరిశోధకుడు సూచిస్తున్నాడు.
అయితే, జన్యు చికిత్స భవిష్యత్తులో “మాయా గుళిక” వైద్యంగా ఉంటుందని అందరికీ నమ్మకం కుదరడం లేదు. నిజానికి కొన్ని సర్వేల ప్రకారం చూస్తే ప్రజలు తమ జన్యు నిర్మాణాన్ని విశ్లేషించేందుకు ఇష్టపడకపోవచ్చేమో కూడా. జన్యు చికిత్స ప్రకృతితో ప్రమాదకరమైన రీతిలో జోక్యం చేసుకుంటుందేమోనని కూడా చాలామంది భయపడుతున్నారు.
వైద్యశాస్త్రంలో జన్యు ఇంజినీరింగ్ లేదా హైటెక్ పద్ధతులు పెట్టుకున్న గొప్ప ఆశలను తీరుస్తుందా లేదా అన్నది కాలమే నిర్ధారిస్తుంది. అయితే, అసాధారణ ఆశావాదాన్ని విసర్జించడానికి మంచి కారణం ఉంది. ద క్లే పెడస్టల్ అనే పుస్తకం కొత్తొక వింత పాతొక రోత అన్నట్టుగా విషయాన్నిలా వర్ణిస్తోంది: “క్రొత్త చికిత్సలు వైద్య సమావేశాల్లో వైద్య పత్రికల్లో గొప్ప సంరంభంతో రంగ ప్రవేశం చేస్తాయి. వాటి సృష్టికర్తలు తమ తమ వృత్తుల్లో రాత్రికి రాత్రే తారలైపోతారు, సమాచార సంస్థలు ఆ పురోభివృద్ధికి జేజేలు కొడతాయి. ఈ ఉత్తేజం సద్దుమణిగిన తర్వాత ఆ అద్భుత చికిత్సకు మద్దతుగా ఉన్న సాక్ష్యాధారాల ప్రదర్శన తర్వాత నెమ్మదిగా భ్రమలు తొలగిపోవడం ప్రారంభమవుతుంది, కొన్ని సందర్భాల్లో ఈ వలయం కొన్ని నెలలు మొదలుకొని కొన్ని దశకాలపాటు సాగుతుంది. తర్వాత మరో క్రొత్త చికిత్సను కనుగొంటారు, మళ్ళీ రాత్రికి రాత్రే ఇది పాతదాని స్థానాన్ని ఆక్రమించి దాన్ని కొంతకాలంపాటు పనికిరానిదిగా చేసేస్తుంది.” నిజానికి, చాలామంది వైద్యులు నిష్ఫలమని విసర్జించిన చాలా రకాల చికిత్సలు కొద్దికాలం క్రిందటి వరకు ప్రామాణిక చికిత్సలుగా ఉండేవి.
ప్రాచీనకాలాల్లో ఇచ్చినట్లు నేడు వైద్యులకు మతపరమైన స్థానాన్ని ఇవ్వకపోయినా, వైద్య వృత్తిలో ఉన్నవారికి దాదాపు దైవ శక్తుల్నే ఆపాదించే వైఖరి, మానవజాతి ఎదుర్కొంటున్న ప్రతి వ్యాధిని విజ్ఞానశాస్త్రం తప్పక నయం చేస్తుందనే వైఖరి కొందరిలో కనబడుతుంది. అయితే, వాస్తవాలు ఈ ఆదర్శాలకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మనం ఎందుకు, ఎలా వృద్ధులమవుతాము అనే తన పుస్తకంలో డా. లియోనార్డ్ హేఫ్లిక్ ఇలా వ్యాఖ్యానిస్తున్నాడు: “1900లో అమెరికా ప్రజల్లో 75 శాతంమంది 65 ఏండ్లు నిండక ముందే మరణించారు. నేడు ఈ గణాంకం పూర్తి భిన్నంగా ఉంది: దాదాపు 70 శాతంమంది 65వ ఏడు దాటిన తర్వాతే మరణిస్తున్నారు.” జీవితకాలంలో ఇంత గొప్ప పెరుగుదలకు కారణమేమిటి? “నవజాత శిశువుల్లో మరణరేటు తగ్గడమే ఇందుకు అతి పెద్ద కారణం” అని హేఫ్లిక్ వివరిస్తున్నాడు. ఇప్పుడు వృద్ధుల్లో మరణానికి కారణమవుతున్న వాటినన్నింటినీ, అంటే గుండె జబ్బులను, క్యాన్సరుని, పక్షవాతాన్ని వైద్య శాస్త్రం నిర్మూలించిందని ఊహించుకోండి. దాని మూలంగా అమర్త్యత లభించినట్లేనా? ఎంతమాత్రం కాదు. అప్పుడు కూడా “ప్రజల్లో అత్యధికులు దాదాపు వంద సంవత్సరాలు జీవిస్తుండవచ్చు” అని డా. హెఫ్లిక్ వ్యాఖ్యానిస్తున్నాడు. ఆయనింకా ఇలా అంటున్నాడు: “నూరేళ్ళాయుష్షు గల వీరంతా అమర్త్యత సాధించేసినట్లు కాదు. అయితే వారు ఏ కారణాల మూలంగా చనిపోతారు? వారు నెమ్మదిగా బలహీనమైపోయి చివరికి మరణిస్తారు.”
వైద్యశాస్త్రం ఎంతగా కృషి చేసినప్పటికీ మరణాన్ని నిర్మూలించడం దాని తరం కాదు. కారణమేమిటి? మరో ప్రశ్న, అందరికీ మంచి ఆరోగ్యం అనే లక్ష్యం, కేవలం కల మాత్రమే కాదని ఎలా చెప్పవచ్చు?(g01 6/8)
[అధస్సూచీలు]
a ద వరల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా ప్రకారం, జీర్ణించుకున్న ఆహారాన్ని కాలేయం రక్తంగా మారుస్తుందని, ఆ రక్తం తర్వాత శరీరంలోని మిగతా భాగాలకు ప్రవహిస్తుందని గాలెన్ అనుకున్నాడు.
b జనవరి 8, 2001, తేజరిల్లు! సంచికలోని “వేదన నుండి అనస్థీషియాకు” అనే ఆర్టికల్ చూడండి.
[4వ పేజీలోని బ్లర్బ్]
“ప్రాచీనుల అనేక నమ్మకాల నీడలు నేటి వైద్యంలో కూడా కనిపిస్తాయి.”—ద క్లే పెడస్టల్
[5వ పేజీలోని చిత్రాలు]
హిపోక్రటీస్, గాలెన్, వెసాలియస్‌లు ఆధునిక వైద్యానికి పునాది వేశారు
[చిత్రసౌజన్యం]
Kos Island, Greece
Courtesy National Library of Medicine
Woodcut by Jan Steven von Kalkar of A. Vesalius, taken from Meyer’s Encyclopedic Lexicon
[6వ పేజీలోని చిత్రాలు]
నలుగురు ఫ్రెంచి రాజులకు తన సేవలందించిన ఆంబ్రాజ్ పారే క్షుర-శస్త్రచికిత్సకు ఆద్యుడు
పర్షియా వైద్యుడు ఆర్-రజీ (ఎడమ), బ్రిటీష్ వైద్యుడు ఎడ్వర్డ్ జెన్నర్ (కుడి)
[చిత్రసౌజన్యం]
పారే మరియు ఆర్-రజీ: Courtesy National Library of Medicine
From the book Great Men and Famous Women
[7వ పేజీలోని చిత్రం]
ఫ్రెంచి దేశస్థుడైన లూయీ పాశ్చర్ వ్యాధులను కలుగజేసేది సూక్ష్మక్రిములని రుజువు చేశాడు
[చిత్రసౌజన్యం]
© Institut Pasteur
[8వ పేజీలోని చిత్రాలు]
మరణాన్ని కలుగజేసే అతి పెద్ద కారకాలను నిర్మూలించినప్పటికీ, వృద్ధాప్యం చివరికి మరణానికి నడిపిస్తుంది