కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 11/8 పేజీలు 10-13
  • వాస్తవం నా నిరీక్షణలను మించిపోయింది

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • వాస్తవం నా నిరీక్షణలను మించిపోయింది
  • తేజరిల్లు!—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పరిశోధనకు ప్రతిఫలం లభించింది
  • నెదర్‌ల్యాండ్స్‌లో మా పరిచర్య
  • క్రొత్త దేశంలో మా పరిచర్య
  • నేను నేర్చుకున్న పాఠాలు
  • మేము ముందుకు సాగేందుకు మాకు సహాయపడినది ఏమిటంటే
  • “నేను యెహోవా కోసం పనిచేయాలి అనుకున్నాను”
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2022
  • అత్యవసర భావంతో సేవచేయుట
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1993
  • యెహోవా నాకు తన చిత్తం చేయడం నేర్పించాడు
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2012
  • నిశ్చయంగా యెహోవా నాకు తోడైయుండెను
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
మరిన్ని
తేజరిల్లు!—1999
g99 11/8 పేజీలు 10-13

వాస్తవం నా నిరీక్షణలను మించిపోయింది

విలమ్‌ వాన్‌ సేల్‌ చెప్పినది

అది 1942వ సంవత్సరం. మా దేశం రెండవ ప్రపంచ యుద్ధం మధ్యలో ఉంది. నెదర్‌ల్యాండ్స్‌లోని, గ్రోనింగెన్‌ నగరంలో నాజీలకు దొరక్కుండా దాక్కున్న ఐదుగురు యువకుల్లో నేను ఒకడ్ని. చిన్న గదిలో కూర్చుని, మేము బ్రతికి బయటపడే అవకాశాల గురించి మాట్లాడుకోనారంభించాం.

మేము తప్పించుకునే అవకాశాలు అంతగా లేవన్నది స్పష్టంగా తెలుస్తూనే ఉంది. చివరికి, మా గుంపులోని ముగ్గురు దారుణంగా చంపబడ్డారు. వాస్తవానికి, వాళ్ళలో నేను ఒక్కడ్ని మాత్రమే వృద్ధాప్యం వరకూ జీవించి ఉన్నాను. అయితే, నా నిరీక్షణలను మించిపోయిన వాస్తవాల్లో ఇది కేవలం ఒక్కటి మాత్రమే.

పైన పేర్కొన్న సంఘటన జరిగిన సమయంలో, నాకు కేవలం 19 సంవత్సరాలు. నాకు అప్పుడు బైబిలు గురించి గానీ, మతాన్ని గురించి గానీ అంతగా ఏమీ తెలియదు. వాస్తవానికి, మా నాన్నగారు అన్ని మతాలను వ్యతిరేకించేవారు. మతం కొరకైన అన్వేషణలో అమ్మ చివరికి అభిచారాన్ని స్వీకరించింది. నాకైతే ఎటువంటి ఆశా లేదు. బాంబు పడిగానీ, మరే విధంగానైనా గానీ నేను చనిపోతే, దేవుడు ఇక నన్ను గుర్తుంచుకోవడానికి ఏ కారణమూ లేదని నేను భావించాను. నేను ఆయన గురించి నేర్చుకోవడానికి కూడా ప్రయత్నం చేయలేదు.

పరిశోధనకు ప్రతిఫలం లభించింది

ఆ నలుగురు యౌవనస్థులతో మాట్లాడిన తర్వాత, నాజీలు నన్ను పట్టుకుని, జర్మనీలో, ఎమరిక్‌ సమీపాన ఉన్న కార్మిక క్యాంపుకు తీసుకువెళ్ళారు. కట్టడపు శిథిలాలను ఊడ్చివేయడమూ, మిత్ర రాజ్యాలు బాంబు దాడి చేయగా నాశనమైనవాటిని మరమ్మతు చేయడమూ మా పనిలో భాగం. 1943వ సంవత్సరం చివరిలో నేను అక్కడి నుండి తప్పించుకున్నాను, అప్పట్లో యుద్ధం జరుగుతున్నప్పటికీ, నేను నెదర్‌ల్యాండ్‌కు తిరిగి చేరుకోగల్గాను.

ప్రశ్నలూ, బైబిలు భాగాలూ ఉన్న ఒక చిన్న పుస్తకాన్ని ఎలాగో సంపాదించుకున్నాను. యెహోవాసాక్షులు ప్రచురించిన సాల్వేషన్‌ (రక్షణ) అనే పుస్తక పఠనంలో ఆ చిన్న పుస్తకం ఉపయోగించబడేది. ప్రశ్నలను చదివి, లేఖనాలను చూడడం ద్వారా, బైబిలు ప్రవచన నెరవేర్పులో నాకు తీవ్రమైన ఆసక్తి కలిగింది.

నేను చదువుతున్న దాన్ని గురించి నా కాబోయే భార్యయైన క్రేకు చెప్పాను. కానీ, మొదట్లో ఆమె పెద్ద ఆసక్తి చూపించేది కాదు. కానీ, మా అమ్మ ఆ చిన్న పుస్తకాన్ని చదవడంలో లీనమైంది. “నేను జీవితమంతా వెదుకుతూ వచ్చినది ఈ సత్యం కోసమే !” అని అంటూ ఆమె ఆశ్చర్యాన్ని వెలిబుచ్చింది. నేను దీన్ని గురించి స్నేహితులతో కూడా మాట్లాడాను, కొందరు మరెక్కువగా తెలుసుకోవాలని కోరుకున్నారు. వాస్తవానికి, వారిలో ఒకరు సాక్షి అయ్యారు. ఆయన 1996లో మరణించేంత వరకూ, మేము ఉత్తరాల ద్వారా, రాకపోకల ద్వారా మా సంబంధాన్ని అలాగే కొనసాగించుకున్నాం.

ఈ లోపు, క్రే బైబిలు పఠించడం ప్రారంభించింది. 1945 ఫిబ్రవరిలో మేమిరువురమూ బాప్తిస్మం తీసుకున్నాం. కొన్ని నెలల తర్వాత యుద్ధం ముగిసింది. మేము పెళ్ళి చేసుకున్న తర్వాత, పయినీర్లమవ్వాలనుకున్నాం. పూర్తికాల పరిచారకులైన యెహోవాసాక్షులను అలా పిలుస్తారు. అయితే మేము అవాంతరాలను—అనారోగ్యాన్ని, ఆర్థిక సమస్యలను—ఎదుర్కున్నాం. అలాగే, మరింత డబ్బును సంపాదించే అవకాశాలు కూడా మాకు వచ్చాయి. మేము, మొదట కాస్త ఆర్ధిక భద్రత కోసం పనిచేయాలా? లేక ఇప్పుడే పయినీరింగ్‌ మొదలుపెట్టాలా?

నెదర్‌ల్యాండ్స్‌లో మా పరిచర్య

నేరుగా పయినీరింగ్‌లోకే అడుగుపెడదాం అని మేము నిర్ణయించుకున్నాం. మేము, 1945 సెప్టెంబరు 1న పయినీరింగ్‌లోకి అడుగుపెట్టాము. అదే రోజు రాత్రి చాలా పొద్దు పోయిన తర్వాత, నేను ఇంటికి వెళ్తుండగా, ఏమైన త్రాగాలనుకుని ఒక రెస్టారెంట్‌కు వెళ్ళాను. నేను వెయిటర్‌కి ఒక నోటు ఇచ్చాను, అది ఒక గల్డన్‌ నోటు అని అనుకున్నాను. “మిగతాది నువ్వే ఉంచుకో” అని ఆ వెయిటర్‌తో అన్నాను. నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, నేను ఇచ్చింది 100 గల్డన్‌ల నోట్‌ అని నాకు అర్థమయ్యింది ! మేము పయినీరింగ్‌ చేయడానికి మాకిక మిగిలింది కేవలం ఒక గల్డనే!

నేను 1946లో, బహిరంగ బైబిలు ప్రసంగాలను ఇవ్వడం మొదలుపెట్టినప్పుడు, నాకు లెదర్‌ జాకెట్‌ కేవలం ఒక్కటే ఉండేది. నా అంతే ఉండే నా స్నేహితుడు అధ్యక్షుడుగా సేవ చేస్తున్నాడు. ఆయన, నా ప్రసంగ అంశాన్ని ప్రేక్షకులకు తెలియజేసి, వెంటనే స్టేజి వెనుక వైపుకు వచ్చి, తన జాకెట్‌ను నాకు ఇచ్చేవాడు. ఆ తర్వాత నేను ప్రసంగం ఇచ్చేవాడ్ని. ప్రసంగానంతరం, నేను స్టేజి వెనక్కువెళ్ళి ఆయనకు జాకెట్‌ను తిరిగి ఇచ్చేవాడ్ని!

1949 మార్చి నెలలో, యెహోవాసాక్షుల సంఘాలను సందర్శిస్తూ వాళ్ళను ఆధ్యాత్మికంగా బలపరిచేందుకు, ప్రాంతీయ ప్రయాణ పనిలో సేవ చేయమని నాకూ, క్రేకూ ఆహ్వానం వచ్చింది. యుద్ధానికి ముందూ, యుద్ధం జరుగుతున్నప్పుడూ నమ్మకమైన పరిచారకుడుగా సేవ చేసిన ఫ్రిట్స్‌ హార్ట్‌ స్టాంగ్‌, ప్రాంతీయ ప్రయాణ పనిలో నాకు తర్ఫీదునిచ్చారు. ఆయన నాకు మంచి సలహా ఇచ్చారు. “విమ్‌, యెహోవా సంస్థ ద్వారా మీకు అందిన ఏ నిర్దేశాలనైనా అనుసరించండి, అవి మేలైనవని మొదట్లో మీకు అనిపించకపోయినా కూడా. మీరు అలా చేస్తే పశ్చాత్తాపపడవలసిన అవసరం రాదు” అన్నదే ఆ సలహా. ఆయన చెప్పినది నిజం.

1951లో, నాతాన్‌ హెచ్‌. నార్‌ నెదర్‌ల్యాండ్‌ను సందర్శించారు. అప్పట్లో ఆయనే వాచ్‌టవర్‌ బైబిల్‌ ఆండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ప్రెసిడెంట్‌. నేనూ, క్రే అమెరికాలో మిషనరీ ట్రెయినింగ్‌ కోసం దరఖాస్తు పెట్టుకున్నది ఆ సమయంలోనే. 21వ తరగతి వాచ్‌టవర్‌ బైబిల్‌ స్కూల్‌ ఆఫ్‌ గిలియడ్‌కు హాజరవ్వమన్న ఆహ్వానం మాకు త్వరలోనే అందింది. మేము, 1945లో, పయినీరింగ్‌ ప్రారంభించినప్పుడు, నెదర్‌ల్యాండ్‌లో దాదాపు 2,000 మంది సాక్షులు ఉండేవారు, అయితే, 1953 నాటికి, అక్కడ 7,000 కన్నా ఎక్కువ మంది సాక్షులు ఉన్నారు. ఆ పెరుగుదల మా నిరీక్షణలను మించిపోయిన మరొక వాస్తవం!

క్రొత్త దేశంలో మా పరిచర్య

మేము డచ్‌ న్యూ గినియాకు నియమించబడ్డాం. న్యూ గినియా ఇప్పుడు ఇండోనేషియాలోని ఒక ప్రాంతం. అయితే, మాకు ఆ ప్రాంతంలోకి వెళ్ళేందుకు అనుమతి లభించకపోయేసరికి, మా నియామకం సూరినామ్‌కు మారింది. అది దక్షిణ అమెరికాలో, ఉష్ణమండల దేశం. మేము 1955లో డిసెంబర్‌లో అక్కడికి చేరుకున్నాం. అప్పట్లో సూరినామ్‌లో దాదాపు వంద మంది సాక్షులు మాత్రమే ఉండేవారు. కానీ వాళ్ళు మాకు చాలా సహాయపడేవారు. సొంత ఇంట్లో ఉంటున్నటువంటి భావం మాకు త్వరలోనే కలిగింది.

నిజమే, మేము చాలా భిన్నమైన పరిస్థితులను ఎదుర్కున్నాం. కొన్నిసార్లు చాలా కష్టంగా ఉండేది. ఉదాహరణకు, కాళ్ళు, రెక్కలు ఉన్న దేన్ని చూసినా క్రే భయపడేది. నెదర్‌ల్యాండ్స్‌లో, మా పడక గదిలో, ఒక చిన్న సాలెపురుగు కనిపించినప్పుడు, నేను దాన్ని అక్కడి నుండి తరిమేసే వరకూ ఆమె నిద్రపోయేది కాదు. అయితే, సూరినామ్‌లో సాలెపురుగులు పదిరెట్లు పెద్దగా ఉంటాయి, కొన్ని విషపూరితమైనవి ! మా మిషనరీ హోమ్‌లో బొద్దింకలూ, ఎలుకలూ, చీమలూ, దోమలూ, గొల్లభామలూ కూడా ఉండేవి. పాములు కూడా మా దగ్గరికి వచ్చేవి. ఇలాంటి ప్రాణులను చూడడం క్రేకు ఇప్పుడు బాగా అలవాటైంది, వాటిని విదిలించుకునే ప్రయత్నం చేయడం ఇప్పుడు ఆమె దైనందిన జీవితంలో భాగమైంది.

మేము ఇక్కడికి వచ్చి 43 సంవత్సరాల కన్నా ఎక్కువే అయ్యింది. ఇప్పుడు, ఇక్కడ పుట్టిన వాళ్లలో చాలామంది కన్నా ఎక్కువగా మాకే ఈ దేశాన్ని గురించి తెలుసు. మేము ఇక్కడి నదులను, వర్షపాతపు అడవులను, తీరానికి సమీపాన ఉన్న చిత్తడి నేలను చూసి ఆనందిస్తాం. అనేకానేక రకాల జంతువులు—ముళ్ళపంది, అడవి కోతులు, చిరుతలు, అందమైన వర్ణాల్లో ఉండే వివిధ రకాల పాములు కూడా బాగా పరిచయమయ్యాయి. ముఖ్యంగా, ఇక్కడ ఉన్న వివిధ రకాల ప్రజలను గురించి కూడా మాకు మంచి అవగాహన ఉంది. ఇక్కడివారి పూర్వీకులు కొందరు ఆఫ్రికా నుండి, ఇండియా నుండి, ఇండోనేషియా నుండి, చైనా నుండి మరితర దేశాల నుండి వచ్చినవారే. కొందరు అమెరికన్‌ ఇండియన్‌లు, అక్కడి అసలు నివాసుల సంతానం.

క్రైస్తవ పరిచర్యలో, మేము ఇంటింటికీ వెళ్తుండగా, అన్ని నేపథ్యాల్లోని ప్రజలను మేము కలుస్తుంటాం. అలాగే, మన రాజ్య మందిరాల్లో, మన క్రైస్తవ సహోదర సహోదరీల మధ్యన కూడా ఇలాగే చక్కని వైవిధ్యం కనిపిస్తుంది. 1953లో ఇక్కడ ఒకే ఒక రాజ్యమందిరం ఉండేది, ఇప్పుడు చాలా పెరుగుదల ఉంది. 30 కన్నా ఎక్కువ ఆకర్షణీయమైన రాజ్య మందిరాలూ, ఒక అందమైన అసెంబ్లీ హాలూ, 1995 ఫిబ్రవరిలో ప్రతిష్ఠించబడిన చాలా చక్కని బ్రాంచ్‌ సౌకర్యమూ ఉన్నాయి.

నేను నేర్చుకున్న పాఠాలు

సూరినామ్‌ యొక్క అంతర్భాగాల్లో, బుష్‌ నీగ్రోలు అని పిలువబడుతున్నవారి సంఘాలు అనేకం ఉన్నాయి. తోటల నుండి పారిపోయి, నదుల ఎగువ దిశగా తమకు చేతనైనంత మట్టుకు పారిపోయి వచ్చిన ఆఫ్రికా బానిసల సంతతివారే బుష్‌ నీగ్రోలు. నేను వాళ్ల సాహసికతను చూసిన ప్రతిసారీ ఆశ్చర్యపోతుంటాను. ఉదాహరణకు, వాళ్లు నదిని రవాణా మార్గంగా చేసుకోవడాన్నీ, వర్షపాతపు అడవిని తమ నివాసస్థలంగా చేసుకోవడాన్నీ చూసి ఆశ్చర్యపోతుంటాను. వాళ్లు చెట్లను కొట్టివేసి, పడవలను నిర్మించి, జలపాతాల గుండా, ప్రవాహపు వేగాల గుండా పోనిస్తారు. వాళ్ళు వేటాడడం ద్వారా, చేపలు పట్టడం ద్వారా ఆహారాన్ని కనుగొంటారు. ఆధునిక సౌకర్యాలు ఏమీ లేకుండానే వంట చేసుకుంటారు. మనకు చాలా కష్టంగా అనిపించే మరనేక పనులు వాళ్ళు చేస్తారు.

అనేక సంవత్సరాలుగా, ఇక్కడ సూరినామ్‌లో నివసిస్తున్న ఇతర ప్రజల గురించి, వాళ్ళ ఆచారాల గురించీ, వాళ్ళ ఆలోచనా విధానాల గురించీ, వాళ్ళ జీవన పద్ధతుల గురించీ కూడా మేము తెలుసుకోగల్గాం. 1950లలో, అమెరికన్‌ ఇండియన్‌ల ఒక గ్రామాన్ని మేము సందర్శించిన విషయం నాకు గుర్తుకొస్తుంది. ఆ వర్షపాతపు అడవిలో, నిర్మానుష్యంగా ఉన్న ఒక క్యాంపుకు నేను అర్ధరాత్రి చేరుకున్నాను. నేనూ అమెరికన్‌ ఇండియన్‌ అయిన నా గైడూ పడవ ప్రయాణం అక్కడి నుండే మొదలుపెట్టవలసి ఉంది. ఆయన నిప్పు రాజేసి వంట చేసాడు, రెండు చెట్లకు కలిపి ఒక ఉయ్యాల కట్టాడు. నా కోసం ప్రతి పనీ చేసి పెట్టడం ఆయనకు మామూలే. ఎందుకంటే, ఈ పనులు ఎలా చేసుకోవాలో నాకు తెలియదని ఆయనకు తెలుసు.

అర్ధరాత్రి, నేను ఊయల నుండి క్రింద పడినప్పుడు ఆయన నవ్వలేదు. బదులుగా, ఆయన నా బట్టలకంటిన దుమ్ము దులిపేసి, ఆ ఊయలను మళ్ళీ కట్టాడు. మేము ఒక సన్న నది మీదుగా ప్రయాణం చేస్తున్నప్పుడు, చాలా చీకటిగా ఉంది, కనీసం నేను ఎదురుగా పెట్టుకున్న నా చేతులు కూడా నా కంటికి కనిపించలేదు. కానీ నా గైడ్‌ మా పడవను అనేక వంపుల్లో గుండా, అనేక ఆటంకాల మీదుగా నడపగలిగాడు. ఎలా నడపగలిగారు అని నేను ఆయనను అడిగినప్పుడు, “మీరు పొరపాటుగా చూస్తున్నారు. చెట్లపై భాగాన్ని, ఆకాశాన్ని చూడండి, ఎంత తేడా ఉందో గమనించండి. నదిలోని వంపులను అది చూపిస్తుంది. క్రిందికి చూస్తూ, చిన్న అలలను గమనించండి. ఎక్కడైనా, బండలుగానీ, ఎదురుగా అడ్డంకులుగానీ ఏమైనా ఉన్నాయా అన్నది తెలుసుకునేందుకు అది మీకు సహాయపడుతుంది. వినండి. శబ్దాలు కూడా, ఎదుట ఏమున్నాయో చెబుతాయి” అని ఆయన అన్నారు.

పడవల్లో ప్రయాణం చేస్తూ, వంపులను, జలపాతాలను దాటడం చాలా ప్రమాదకరంగాను అలసట కలిగించేదిగాను ఉంటుంది. అయితే, ప్రయాణం ముగిసినప్పుడు, మాకు స్వాగతమిస్తూ, మాకు ఆర్ద్రమైన ఆతిథ్యాన్ని ఇవ్వడానికి వేచివున్న మా క్రైస్తవ సహోదర సహోదరీలను కలిసినప్పుడు చాలా నవోత్తేజితులమయ్యాం. అతిథులకు ఎల్లప్పుడూ ఆహారం సిద్ధంగా ఉంటుంది. బహుశా ఒక బోల్‌ నిండా సూప్‌ ఉంటుంది. మిషనరీ జీవితం తరచూ పరీక్షించేదిగా, దుష్కరమైనదిగా ఉండేది, కానీ అది ఎన్నడూ నిరుత్సాహపరిచేది కాదు.

మేము ముందుకు సాగేందుకు మాకు సహాయపడినది ఏమిటంటే

మేము అంత ఆరోగ్యవంతులమేమీ కాదు. మా బంధువుల్లో అమ్మ తప్ప సాక్షులు మరెవరూ లేరు కనుక, కుటుంబ సభ్యుల నుండి అంతగా ప్రోత్సాహమూ లేదు. అయినప్పటికీ, మా ప్రియ స్నేహితులు మా అవసరాల్లో మమ్మల్ని ఆదుకోవడానికి వచ్చేవారు, మమ్మల్ని ప్రోత్సహించేవారు, మేము మా నియామకంలో కొనసాగేలా సహాయపడేవారు. ముఖ్యంగా అమ్మ చాలా ప్రోత్సహించేది.

దాదాపు ఆరు సంవత్సరాలు మేము మా నియామకాన్ని చేసిన తర్వాత, అమ్మ ఆరోగ్యం బాగా దెబ్బ తింది. చివరిసారిగా మేము అమ్మను వెళ్ళి చూడాలని స్నేహితులు కోరారు. కానీ అమ్మ మాత్రం, “దయచేసి, మీరు మీ నియామకంలోనే ఉండండి. నా ఆరోగ్యం పాడు కాకముందు ఎలా ఉండేదాన్నో, అలాగే నన్ను గుర్తుంచుకోండి. పునరుత్థానంలో నేను మిమ్మల్ని కలుస్తానని ఆశిస్తున్నాను” అని అమ్మ వ్రాసింది. ఆమె, దృఢమైన విశ్వాసం గల స్త్రీ.

1966 వరకూ, మేము సెలవుల మీద నెదర్‌ల్యాండ్‌కు తిరిగి వెళ్ళలేకపోయాం. మేము మా పాత స్నేహితులను కలవడంలో చాలా ఆనందించాం. కాని మేము ఇప్పుడు సూరినామ్‌నే మా ఇల్లుగా భావిస్తున్నాం. మిషనరీలు తమ నియామకంలో కనీసం మూడు సంవత్సరాలైనా సేవ చేయక ముందు, సెలవుల మీద తమ స్వదేశానికి తిరిగివెళ్ళవద్దని సంస్థ ఇచ్చిన ఉపదేశంలో ఉన్న వివేకాన్ని మేము చూడగల్గాం.

మా నియామకాలను మేము ఆస్వాదించగల్గేలా చేసేందుకు నాకు సహాయపడిన మరొక విషయం, హాస్య భావాన్ని కాపాడుకోవడమే—విషయాలను చూసి నవ్వగల్గడం, మాపై మేమే నవ్వుకోగల్గడం. ప్రకృతిలోని కొన్ని సృష్టుల్లో కూడా యెహోవా హాస్యాన్ని ఉంచాడు. చింపాంజీల, ఓటర్‌ల (నీటి ముంగీసలు) చేష్టలు చూసినప్పుడు, ముఖ్యంగా వాటి పిల్లలను చూసినప్పుడు మీ ముఖంపై చిరునవ్వు పరుచుకుంటుంది. విషయాల అనుకూల కోణాన్ని చూడడమూ, మనకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండడమూ ముఖ్యం అన్నది, మేము అనేక సంవత్సరాల్లో నేర్చుకున్న విషయం.

ముఖ్యంగా, పరిచర్యలో మా పని ప్రతిఫలదాయకంగా ఉండడం మేము మా నియామకంలో కొనసాగేందుకు మాకు సహాయపడింది. పరమరిబోలో వృద్ధాశ్రమంలో ఉన్న తొమ్మిది మంది మగవాళ్ళతో క్రే ఒక బైబిలు పఠనాన్ని ప్రారంభించింది. వాళ్ళకందరికీ 80 కన్నా ఎక్కువ ఏళ్ళు ఉన్నాయి. వాళ్ళలో ప్రతి ఒక్కరూ బాలాటాబ్లీడర్‌ (రబ్బర్‌ చెట్టు టాప్‌ చేసే వ్యక్తి) గానో, లేదా బంగారు గనుల్లో పనిచేసే వ్యక్తిగానో పని చేశారు. వాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా తాము నేర్చుకున్నవాటి మీద మక్కువను పెంచుకుని, బాప్తిస్మం తీసుకున్నారు, తమ మరణం వరకూ, ప్రకటనా పనిలో నమ్మకంగా పాల్గొన్నారు.

న్యూ చర్చ్‌ ఆఫ్‌ స్వీడన్‌బర్గ్‌కు చెందిన, రివర్స్‌ అనే పేరు గల ఒక వృద్ధ ప్రసంగీకుడు ఒక పఠనంలో కూర్చుని విని, పరిహాసంగా మాట్లాడాడు. కానీ ఒక్కోవారం గడుస్తున్న కొలది, ఆయన సన్నిహితుడయ్యాడు, ఆయన పరిహాసం తగ్గుముఖం పట్టింది. చివరికి ఆయన ఇతరులతోపాటు పఠనానికి కూర్చోవడమూ, పాల్గొనడమూ మొదలుపెట్టాడు. ఆయనకు 92 సంవత్సరాలు. ఆయనకు కంటిచూపు గానీ, శ్రవణశక్తి గానీ సరిగా లేదు. ఆయన లేఖనాలను చదువుతున్నాడా అన్నట్లుగా చూడకుండా చెప్పగలడు. చివరికి, ఆయన మాతో పాటు పరిచర్యలో పాల్గొనడం మొదలుపెట్టాడు. వినే ప్రతి ఒక్కరికీ ప్రకటించేవాడు. తను చనిపోవడానికి కొంచెం ముందు, మమ్మల్ని రమ్మని కబురు చేశాడు. మేము వెళ్ళేటప్పటికి, ఆయన చనిపోయాడు. కానీ, ఆ నెల తాను పరిచర్యలో ఎంత సమయం గడిపాడన్నది చూపించే రిపోర్ట్‌ ఆయన దిండు క్రింద మాకు కనిపించింది.

1970లో, పూర్తికాల పరిచర్యలో 25 కన్నా ఎక్కువ సంవత్సరాల తర్వాత, సూరినామ్‌ బ్రాంచ్‌ ఆఫీసు పర్యవేక్షణ చేయడానికి నన్ను నియమించారు. ఆఫీసులో టేబుల్‌ ముందు కూర్చొని ఉండడం చాలా కష్టంగా అనిపించింది. నాకు క్రే మీద అసూయ కలిగింది. ఆమె అప్పటికీ ప్రతి రోజూ క్షేత్రసేవకు వెళ్తోంది. ఇప్పుడు క్రే కూడా బ్రాంచ్‌లో పని చేస్తోంది. మేము వృద్ధులమౌతుండగా, మేమిరువురమూ చేయడానికి చాలా అర్థవంతమైన పని ఉంది.

1945లో, ప్రపంచమంతటిలో క్రియాశీలంగా ఉన్న రాజ్య ప్రచారకుల సంఖ్య 1,60,000 కన్నా తక్కువగా ఉండేది. దానితో పోల్చి చూస్తే, నేడు 60,00,000 మంది ఉన్నారు. వాస్తవం నేను నిరీక్షించిన దాన్ని మించిపోయిందని చూడగల్గుతున్నాను. సూరినామ్‌లో పరిచర్యలో పాల్గొనేవారి సంఖ్య మేము 1955లో వచ్చినప్పటి కన్నా, 19 రెట్లు ఎక్కువగా పెరిగింది. అప్పట్లో దాదాపు 100 మంది ఉండేవారు, నేడు 1,900 మంది కన్నా ఎక్కువగా ఉన్నారు!

మనం యెహోవా ఎడల నమ్మకంగా ఉంటే, యెహోవా ఉద్దేశాలు నెరవేరడంలో మరి గొప్ప వికాసాలను చూడగల్గుతాం అని నాకు నమ్మకం ఉంది. మేము చేయాలనుకుంటున్నది కూడా అదే.

[11వ పేజీలోని చిత్రం]

1955లో మేము సూరినామ్‌కు వచ్చినప్పుడు

[13వ పేజీలోని చిత్రం]

మా పరిచర్యలో పడవలను ఉపయోగించడం

[13వ పేజీలోని చిత్రం]

నా శ్రీమతితో

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి