విధి విలాసమా లేక కేవలం యాదృచ్ఛికమా?
“చాలామంది తమ ప్రాణాలు కోల్పోయారు, కొంతమంది మాత్రం బ్రతికి బయటపడ్డారు, అంతా విధి విలాసం” అని ఇంటర్నేషనల్ హెరాల్డ్ ట్రైబ్యూన్ ప్రకటించింది. గత సంవత్సరం, కెన్యా టాంజానియాలలో ఉన్న అమెరికా దౌత్య కార్యాలయాలపై ఉగ్రవాదులు చేసిన దాడులలో దాదాపు 200 మంది మరణించారు, వందలాది మంది గాయపడ్డారు. అయితే, “దౌత్య కార్యాలయంలోని సీనియర్ డిప్లొమాట్‌లు కాలవశాత్తు తప్పించుకున్నారు” అని ఆ వార్తాపత్రిక వ్యాఖ్యానించింది.
వీళ్లు, అదే భవనంలో విస్ఫోటనం జరిగిన ప్రాంతానికి దూరంగా ఒక మీటింగ్‌లో ఉన్నారు గనుక తప్పించుకోగల్గారు. కానీ ఆ మీటింగ్‌కు హాజరు కావలసిన ఒక ఉన్నత దౌత్యాధికారి మాత్రం దానికి హాజరుకాకుండా, విస్ఫోటనం జరిగిన ప్రాంతానికి దగ్గర్లో ఉండటంతో చనిపోయాడు.
“ఆర్లీన్ కిర్క్‌తో కూడా విధి క్రూరంగా వ్యవహరించింది” అని వార్తాపత్రిక పేర్కొంది. సెలవులు ముగించుకుని కెన్యాకు తిరిగివస్తున్నప్పుడు ఆర్లీన్ తాను ప్రయాణించాల్సిన విమానంలో చాలామంది ఇతరులు ప్రయాణించాలని కోరుకుంటుండటంతో తన సీటు మరొకరికి ఇవ్వటానికి సిద్ధపడింది. అయితే, ఆమెకంటే ముందే మరితర ప్రయాణీకులు తమ సీట్లను ఇచ్చివేయటంతో, ఆమె విమానంలో ప్రయాణించవలసి వచ్చింది. ఫలితంగా, ఆమె విస్ఫోటనం జరిగిన దినాన్నే కార్యాలయానికి తిరిగి రావటంతో ఆమె ఆ దుర్ఘటనలో మరణించింది.
విపత్తులు మానవునికి క్రొత్తేమీ కాదు. అయినప్పటికీ, దుర్ఘటనను వర్ణించటం ఎన్నడూ అంత సులభం కాదు. ప్రపంచవ్యాప్తంగా జరిగే దుర్ఘటనల్లోనూ విపత్తుల్లోనూ కొందరు చనిపోతారు, కొందరు తప్పించుకుని బ్రతుకుతారు. అయితే, ‘నాకే ఎందుకిలా జరిగింది?’ అని కొంతమంది తలంచేది కేవలం విపత్తుల సమయంలోనే కాదు. జీవితంలో మంచి విషయాలకు సంబంధించి కూడా, కొంతమందికి ఇతరులకంటే మంచి అవకాశాలు ఉన్నట్లు అనిపిస్తుంది. కొంతమందికి జీవితం నిరంతర పోరాటమైతే, మరితరులకు జీవితం సాఫీగా సాగిపోతున్నట్లు అనిపిస్తుంది. కాబట్టి, ‘ఇదంతా పథకం ప్రకారం జరుగుతుందా? విధి నా జీవితాన్ని అదుపు చేస్తుందా?’ అని మీరు అడగవచ్చు.
వివరణల కోసం విచారణ
దాదాపు 3,000 సంవత్సరాల క్రితం, జ్ఞానవంతుడైన ఒక రాజు తన చుట్టూ జరుగుతున్న అనుకోని సంఘటనలను గమనించాడు. ఆ సంఘటనలకు ఆయన ఈ వివరణనిచ్చాడు: ‘అవన్నీ కాలవశము చేతనూ, అనూహ్యంగానూ జరుగుతున్నాయి.’ (ప్రసంగి 9:11, NW) కొన్ని అనూహ్యంగా జరుగుతాయి. వాటిని ముందే ఊహించే అవకాశం ఎంతమాత్రం ఉండదు. విశేషమైన సంఘటనలు, అవి మంచివైనా చెడ్డవైనా, తరచూ కాలాన్ని బట్టి నిర్ణయించబడతాయి.
అయితే కొంతమంది, అన్నీ కేవలం యాదృచ్ఛికంగా జరుగుతాయని తలంచే బదులు మరో శక్తి ప్రమేయం ఉందని అంటే విధి ప్రమేయం ఉందని భావిస్తారు, బహుశా మీరు కూడా అదే దృక్కోణాన్ని కల్గివుండవచ్చు. మానవుని మత నమ్మకాల్లోకెల్లా అత్యంత పురాతనమైనదీ, అత్యధికంగా వ్యాప్తి చెందినదీ విధిని నమ్మటం లేక నిర్ణీత భవితవ్యాన్ని నమ్మటం.a యూనివర్సిటీ ఆఫ్ పారిస్‌లోని సెంటర్ ఫర్ మిథలాజికల్ రీసెర్చ్ డైరెక్టరైన ప్రొఫెసర్ ఫ్రాన్స్‌వా జూన్ ఇలా అన్నాడు: “మన ఉనికిలో ఉన్న వివరించనశక్యమైన దానినంతటినీ వివరించటానికి, . . . విధిని అదుపు చేసే దైవం ఉన్నట్లు నమ్మని యుగం గానీ నాగరికత గానీ లేదు.” అందుకే ప్రజలు “ఇంకా అతని గడియ రాలేదు” లేదా, “అది అలా జరగాలని వ్రాసి పెట్టి ఉంది” అనటం మనం సాధారణంగా వింటుంటాము. కానీ విధి అంటే ఏమిటి?
విధిని నిర్వచించటం
“విధి” అనేదానికైన ఆంగ్ల పదమైన ఫేట్, “ఒక ప్రవచనాత్మక ప్రకటన, జోస్యం, దైవిక నిశ్చయత” అనే భావాలుగల ఫాటమ్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. కొన్నిసార్లు ఏదైనా క్రమరహితమైన శక్తి భవిష్యత్తును నివారించలేని విధంగా, వివరించలేని విధంగా నిశ్చయపరుస్తుందని తలంచబడినప్పటికీ, చాలా తరచుగా, ఈ శక్తి ఒక దేవుడని తలంచబడుతుంది.
మత చరిత్రకారుడైన హెల్మర్ రింగ్‌గ్రాన్ ఇలా వివరిస్తున్నాడు: “మత దృక్పథంలోని ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే మానవ విధి అన్నది అర్థవిహీనమైనదీ లేక యాదృచ్ఛికమైనదీ కాదుగానీ దానికి కారణం చిత్తమూ ఉద్దేశమూ ఆపాదించబడగల శక్తి అన్న భావన.” పరిస్థితులను కొంతమేరకు సరిచేయటం సాధ్యమేనని తలంచబడుతున్నప్పటికీ, మానవులు విధిచేతిలో కీలుబొమ్మలు అన్నట్లు చాలామంది ప్రజలు పరిగణిస్తారు. అందుకే వాళ్లు ‘తమ విధిని తప్పించుకోలేరు.’
వేదాంతులూ, తత్త్వవేత్తలూ విధిని వివరించాలని ఎంతో ప్రయాసపడ్డారు. ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ రెలీజియన్ ఇలా చెప్తుంది: “విధి అనే తలంపు కొన్ని భేదాలు ఉన్నప్పటికీ, ఏ భాషలోనైనా లేక ఏ భావంలోనైనా అది ప్రాథమికంగా మర్మం అన్నట్లుగానే ఉంది.” అయితే ఈ చిక్కు తలంపులన్నిటిలో అంతర్లీనంగా కొనసాగే ఒక సూత్రం ఏమిటంటే మానవుని విషయాలను అదుపు చేసే, నడిపించే ఉన్నతమైన ఒక శక్తి ఉందన్న తలంపు. ఈ శక్తి, వ్యక్తుల జీవితాలనూ దేశాలనూ ముందుగానే రూపిస్తూ భవిష్యత్తును గతమంత అనివార్యమైనదిగా చేస్తుందని తలంచబడుతుంది.
నిర్ణయించే ఒక అంశం
మీరు విధిని నమ్మినా నమ్మకపోయినా తేడా ఏమైనా ఉందా? “మానవుల తత్త్వాన్ని నిర్ణయించటంలో వారి జీవిత పరిస్థితులు ప్రముఖ పాత్ర వహిస్తాయి, అయితే దానికి భిన్నంగా, వారి పరిస్థితులను నిర్ణయించటంలో తత్త్వం కూడా ప్రధాన పాత్ర నిర్వహిస్తుంది” అని ఆంగ్ల తత్త్వవేత్త అయిన బెర్‌ట్రాండ్ రస్సెల్ వ్రాశాడు.
వాస్తవానికి, విధిని నమ్మటం—అసలు అలాంటిదేదైనా ఉన్నా లేకపోయినా—మనం ఎలా ప్రవర్తిస్తామనేదాన్ని నిర్ణయించగలదు. అది దైవచిత్తమని నమ్ముతూ చాలామంది తమ పరిస్థితి ఎలా ఉంటే అలాగే, అంటే అది ఎంత అన్యాయమైనదైనా లేక అణచివేసేదైనా అది ఇక ఇంతేనని సరి పెట్టుకుంటారు. జీవితంలో తమ ప్రాప్తం ఇంతేననీ, దాన్నిక ఎంతమాత్రం మార్చలేమని భావిస్తారు. అలా, విధి పై నమ్మకం వ్యక్తిగత కర్తవ్యాన్ని వెనక్కి నెడుతుంది.
మరో వైపున, విధిని నమ్మటం ఇతరులను వ్యతిరేక దిశలో నడిపించింది. ఉదాహరణకు, పెట్టుబడిదారీ వ్యవస్థ పెరగటానికీ, పారిశ్రామిక విప్లవానికీ అనేక కారణాలున్నట్లు చరిత్రకారులు గుర్తిస్తారు. వాటిలో ఒకటి పూర్వనిర్ణీతవాదంలో నమ్మకం. ఎవరు రక్షణ పొందుతారనే దాన్ని దేవుడు ముందే నిర్ణయిస్తాడని కొన్ని ప్రొటస్టెంటు మతాలు బోధించాయి. జర్మను సామాజికవేత్త అయిన మాక్స్ వెబర్ ఇలా అంటున్నాడు: “నేను ఎన్నుకోబడిన వారిలో ఒకరినా? అన్న ప్రశ్న ప్రతి విశ్వాసి మనస్సులోనూ ఎప్పుడో ఒకసారి తలెత్తి ఉండవచ్చు.” తమకు దేవుని ఆశీర్వాదం ఉందో లేదో, తాము రక్షణ కోసం ఎంపిక చేయబడ్డామో లేదో అనేది తెలుసుకోవాలని మానవులు ప్రయత్నించారు. వాళ్లు తమ “ఐహిక కార్యకలాపాల” ద్వారా అలా చేశారని వెబర్ వాదించాడు. వ్యాపారంలో విజయం, ధనసంపాదన దేవుని అనుగ్రహానికి సూచనలుగా పరిగణించబడుతున్నాయి.
విధిని నమ్మటం కొందరు విపరీతమైన చర్యలు తీసుకునేలా చేస్తుంది. రెండవ ప్రపంచయుద్ధ సమయంలో, జపాను ఆత్మాహుతి దళం “కామికాజె”ను అంటే “దైవిక వాయువు”ను నమ్మింది. దేవుళ్లకు ఒక సంకల్పం ఉందనీ, దానిలో తాము ఒక పాత్ర నిర్వహించే అవకాశం ఉందనీ తలంచటం భయంకరమైన మరణానికి మతసంబంధమైన తలంపులను జత చేసింది. గత దశాబ్దంలో, మధ్య ప్రాచ్యంలోని ఆత్మాహుతి బాంబర్లు తమ భయంకరమైన దాడులతో తరచూ వార్తా శీర్షికల్లోకి ఎక్కారు. ఈ “మతసంబంధంగా ప్రేరేపించబడిన ఆత్మాహుతి దాడులలో” విధి ముఖ్యమైన పాత్ర నిర్వహిస్తుందని ఒక సర్వసంగ్రహ నిఘంటువు పేర్కొంది.
కాని విధిని అంత బహుళవ్యాప్తంగా ఎందుకు నమ్మటం జరుగుతుంది? దాని మూలాన్ని క్లుప్తంగా పరిశీలించటం దానికి సమాధానమిస్తుంది.
[అధస్సూచీలు]
a విధిని గురించిన తలంపు ఎంత బలంగా పాతుకుపోయిందంటే, తరచూ చాలా భాషల్లో మరణాన్ని సూచించటానికి “విధి” లేక “విధి లిఖితం” అనే పదాలు ఉపయోగించబడతాయి.