కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g99 8/8 పేజీలు 25-27
  • నా కుక్క నా కోసం వింటుంది!

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నా కుక్క నా కోసం వింటుంది!
  • తేజరిల్లు!—1999
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • ట్వింకీ పాత్ర
  • నైపుణ్యంతో శిక్షణనివ్వటం
  • ఒక సంతోషకరమైన భాగస్వామ్యం
  • ఐడిటరాడ్‌—స్థాపించబడడానికి పది శతాబ్దాలు
    తేజరిల్లు!—1995
  • ‘నా హృదయవాంఛలు’ తీరాయి
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2005
  • దృష్టిని హృదయాన్ని ప్రతిఫలంపై కేంద్రీకరించడం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1996
  • బధిరులైన సహోదర సహోదరీలను శ్రద్ధగా చూసుకుందాం
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2009
తేజరిల్లు!—1999
g99 8/8 పేజీలు 25-27

నా కుక్క నా కోసం వింటుంది!

బ్రిటన్‌లోని తేజరిల్లు! ప్రతినిధి

తన కుర్చీ క్రింద సంతృప్తిగా కూర్చుని ఉన్న తెలుపు గోధుమవర్ణంలోవున్న సంకరజాతి జాక్‌ రసెల్‌ కుక్కను డోరతి ప్రేమపూర్వకంగా చూస్తూ “నా చిన్న కుక్క లేకపోతే నేనేం చేసేదాన్నో నాకు తెలియదు! ట్వింకీ వచ్చి కొన్ని నెలలు మాత్రమే అయ్యింది కానీ, అది నా జీవితాన్ని చిగురింపజేసింది !” అని అంది.

దగ్గరకు వెళ్ళి చూసినప్పుడు ట్వింకీకి బిగుతుగా కట్టివున్న పసుపు రంగు జీను నాకు కన్పించింది, దానిపై “హియరింగ్‌ డాగ్‌ ఫర్‌ ద డెఫ్‌” (చెవిటి వారి కోసం వినే కుక్క) అని స్పష్టంగా నల్ల అక్షరాల్లో ముద్రించబడివుంది. ‘ఎంతటి అసాధారణమైన జంతువు! అది ఏమి చేయగలదు?’ అని నాలో నేను ఆలోచించుకోవడం నాకు గుర్తుంది.

క్రిందటి జూలైలో ఇంగ్లాండ్‌లోని, లండన్‌లో, జరిగిన “దైవిక జీవిత మార్గము” అనే యెహోవాసాక్షుల అంతర్జాతీయ సమావేశంలో హాజరైన 44,000 మంది ప్రజల మధ్య మేము యాదృచ్ఛికంగా కలిశాము. డోరతి, లౌడ్‌ స్పీకర్‌కి దగ్గరే కూర్చుంటే కార్యక్రమాన్ని వినగలదు కదా, ఆమెకు హియరింగ్‌ డాగ్‌ ఎందుకు? మేము లంచ్‌ బ్రేక్‌లో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు డోరతి తన కథను వివరించింది.

ట్వింకీ పాత్ర

డోరతికి మూడు సంవత్సరాల వయసున్నప్పుడు కీళ్ళవాతంతో కూడిన జ్వరం రావడంతో పూర్తిగా చెవుడు వచ్చేసింది. 23 సంవత్సరాల క్రితం తన భర్త మరణించినప్పటి నుండి డోరతి ఒంటరిగా జీవిస్తోంది, కానీ ఆమె వివరించినట్లు, ఆమె వృద్ధురాలవుతున్న కొద్దీ, సాహచర్యం కన్నా ఎక్కువగా మరేదో అవసరమైంది. “నా వయస్సులో ఉన్న చెవిటి వారు చాలా అభద్రతగా ఫీలవుతారు” అని ఆమె చెప్పింది. “నాకు 74 సంవత్సరాలు, నేను వార్డెన్‌ సేవలుండే అపార్ట్‌మెంటులో ఉంటున్నాను. కానీ నన్ను చూసేందుకు నా కేర్‌టేకర్‌ వచ్చినప్పుడు నేను నా డోర్‌బెల్‌ వినలేకపోయేదాన్ని. నాకు బాగోలేదేమో అనుకుని ఆయన తనంతట తానే లోపలికి వచ్చేవాడు, నాకు తెలిసేది కాదు; అలా జరగడం నాకు చాలా భయాన్ని కలిగించింది. కానీ ఇప్పుడు ట్వింకీ బెల్‌ మ్రోగడం విని వచ్చి నా కాళ్ళపై మెల్లగా తట్టి నన్ను ఇంటి వాకిలి దగ్గరికి తీసుకువెళ్తుంది. అలాగే, నా ఒవెన్‌ టైమర్‌ మ్రోగగానే ట్వింకీ నా దగ్గరికి వస్తుంది నేను దాన్ని వెంబడిస్తాను. స్కోక్‌ ఆర్‌ ఫైర్‌ అలార్మ్‌ మ్రోగినా, నా అవధానాన్ని ఆకర్షించి, రాగల ప్రమాదాన్ని సూచించేందుకు, నన్ను అక్కడికి తీసుకువెళ్ళి అక్కడ పడుకునేలా ట్వింకీకి శిక్షణనివ్వబడింది. అది నాకు సహాయం చేసిన ప్రతిసారీ, ప్రత్యేకమైన రుచిగల ఆహారాన్ని పెట్టి సత్కరిస్తాను.”

నైపుణ్యంతో శిక్షణనివ్వటం

నాలో జిజ్ఞాస రేకెత్తింది. “మీరు ఈ కుక్కను ఎలా సంపాదించారు, దీనికి శిక్షణ ఎవరు ఇచ్చారు?” అని నేను అడిగాను. చెవిటి వారి కోసం వినే కుక్కల గురించీ, బ్రిటన్‌లోని చెవిటివారు తమంతట తాము జీవిస్తూ తమ జీవిత నాణ్యతను పెంపొందించుకొనేందుకు సహాయం చేయాలన్న ఉద్దేశంగల ఒక చారిటీ గురించీ డోరతి నాకు కొంత చెప్పాలన్న సూచన అది. 1982 నుండి అది బ్రిటన్‌లోని చెవిటి వారికి వందలాది కుక్కలను ఇచ్చింది. ఒకసారి పూర్తిగా శిక్షణ పొందిన తర్వాత ఆ కుక్క దత్తత తీసుకునే క్రొత్త యజమాని దగ్గరకు ఉచితంగా పంపించబడుతుంది.

కొన్ని కుక్కలను పెంపకందారులు దానం చేస్తున్నప్పటికీ, సాధారణంగా, తప్పిపోయిన కుక్కలనుండి, తరచుగా దేశవ్యాప్త సంరక్షణ కేంద్రాలలోని కుక్కల నుండి ఎంపిక చేసుకుంటారు. అయినప్పటికీ, ఒక కుక్కకు శిక్షణనిచ్చేందుకు 12 నెలల వరకు పడుతుంది. దానికయ్యే ఖర్చులను తరచూ వహించేది ఒక స్పాన్సరే. ఆ స్పాన్సర్‌ ఒక కంపెనీ కావచ్చు లేదా ఒక గుంపు ప్రజలు కావచ్చు—గుంపులోని వాళ్ళందరు కలిసి చిన్న చిన్న విరాళాలు వేసుకొని ఖర్చు భరిస్తారు. స్లిమ్మింగ్‌ క్లబ్‌ వాళ్ళు దయతో ట్వింకీని స్పాన్సర్‌ చేశారు.

7 వారాల నుండి 3 సంవత్సరాలలోపు కుక్కల నుండి, వినే కుక్కలు కాగల వాటిని ఎంపిక చేసిన తర్వాత, నిర్దిష్టమైన కొన్ని కొన్ని శబ్దాలకు ప్రతిచర్య చూపించేలా ప్రతి కుక్కకు శిక్షణనిస్తారు. మొదట, ఒక్కొక్క కుక్కను ఒక్కొక్క సోష్యలైజర్‌కు నియమిస్తారు. సోష్యలైజర్‌ ఒక స్వచ్ఛంద సేవకుడు. ఆయన కుక్కను తన ఇంటికి తీసుకువెళ్ళి దాని వయసును బట్టి అనుభవాన్ని బట్టి 2 నుండి 8 నెలల వరకు శిక్షణనిస్తాడు. సోష్యలైజింగ్‌లో [సమాజంలో కలిసిపోగల్గేలా చేయడంలో] బహుశా ఇంటిని మురికి చేయకుండా పాడుచేయకుండా ఉండటం నేర్పిస్తారు, కానీ ముఖ్య లక్ష్యమేమంటే బహిరంగ ప్రదేశాలనూ, రవాణానూ, చిన్న పిల్లలతో సహా—అన్ని వయస్సుల వారితో వివిధ రకాల అనుభవాలు కలిగేలా చేయడమే. ఈ కుక్కలను ఎక్కడికి తీసుకువెళ్ళినా అందరూ అంగీకరించేలా ప్రవర్తించేలా వీటికి శిక్షణనివ్వాలన్నదే లక్ష్యం.

అంతేకాక, ప్రత్యేక అవసరాలు ఉన్నవారికి సహాయం చేసేందుకు ఇతర సంస్థలు కుక్కలను ఉపయోగిస్తున్నాయని నేను తెలుసుకున్నాను. ఆజ్ఞలను అనుసరించే శిక్షణనివ్వబడగా అలాగే నిర్దిష్టమైన దృశ్యాలను, వాసనలను కూడా వాటికి చూపించడం జరిగింది. వీల్‌చెయిర్‌కే పరిమితమైన ఒక స్త్రీకి సేవ చేసేందుకు ఒక కుక్కకు, ఫోన్‌ ఎత్తి ఇవ్వటం, ఉత్తరాలను అందివ్వటం మెయిల్‌ కోసం ఉత్తరాలపై స్టాంపులను అంటించడం నేర్పించబడుతుంది ! మరొక కుక్క సూపర్‌ మార్కెట్‌ షెల్ఫ్‌లనుండి క్యాన్‌లను, ప్యాకెట్‌లను తీసుకురావటంతో సహా 120 ఆజ్ఞలకు లోబడుతుంది. అశక్తత కలిగిన ఆ యజమాని తను ఎన్నుకున్న వస్తువును కుక్క గుర్తించేందుకు లేజర్‌ డాట్‌ ఉపయోగిస్తాడు, అప్పుడు ఆయన కుక్క వాటిని ఆయనకు తెచ్చి ఇస్తుంది.

ఒక సంతోషకరమైన భాగస్వామ్యం

“ట్వింకీ విలువను అందరూ ప్రశంసిస్తారా” అని నేను అడిగాను. “ఒక దుకాణదారుడు నా కుక్క లోపలికి ప్రవేశించడాన్ని తిరస్కరించాడు. కొన్ని ఆహారపదార్థాలను ప్రదర్శించి పెట్టి ఉంచాడు గనుకనే బహుశా అలా చేసుంటాడనుకుంటున్నాను, నాకు ట్వింకీ ఎందుకు అవసరమో ఆయనకు అర్థం కాలేదు కాబట్టి ఆయన వైఖరిని మినహాయించవచ్చు” అని డోరతి జవాబిచ్చింది.

వినే కుక్క ఇంట్లో ఉండడంలోని విలువ ఇప్పుడు నాకు అర్థమయ్యింది, కానీ నాకు మరో ప్రశ్న ఉంది. డోరతి చాలామంది తోటి క్రైస్తవులతో సంతోషంగా సహవసిస్తున్నప్పుడు ట్వింకీ విలువ ఏమిటి? “నేను పెదవుల కదలికలను బాగా చదవగలను, నా హియరింగ్‌ ఎయిడ్‌ కూడా సంభాషణను కొనసాగించేందుకు నాకు సహాయపడుతుంది,” అని డోరతి వివరించింది. “ట్వింకీ వేసుకున్న పసుపు రంగులోని జాకెట్‌ చూసినప్పుడు నాకు వినపడదని ప్రజలు త్వరగానే తెలుసుకుంటారు. వాళ్ళెంత స్పష్టంగా మాట్లాడగలరో అంత స్పష్టంగా నాతో నేరుగా మాట్లాడతారు. అలా నేను నా అశక్తతను చెప్పనవసరం లేదు, అది నా జీవితాన్ని మరింత సులభతరం చేస్తుంది.”

సమావేశ కార్యక్రమం ఇంక పునరారంభం కాబోతుందనగా, మధ్యాహ్న కార్యక్రమం కోసం కూర్చొనే ముందు ట్వింకీకి కాస్త నడక అవసరం. నేను అక్కడి నుండి వచ్చేసేముందు కాస్త వంగి దాన్ని చిన్నగా తట్టాను. ట్వింకీ తన తేజోవంతమైన కళ్ళు పెద్దగా చేసి డోరతివైపు చూసి దాని తోకను ఆడించింది. ఎంతటి విధేయురాలైన ఉపయోగకరమైన చిన్ని స్నేహితురాలు—వారి మధ్య ఉన్నది పూర్ణతగల అనుబంధం !

[26వ పేజీలోని చిత్రం]

సమావేశాల్లో ట్వింకీ సహాయం చాలా అమూల్యమైనది

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి