కోస్టారికాలో మర్మంగా ఉన్న గోళాకార బండలు
కోస్టారికాలోని తేజరిల్లు! విలేఖరి
పదహారు శతాబ్దాల క్రితం, కోస్టారికాలోని నైరుతి ప్రాంతపు ప్రజలు గట్టి బండలను వివిధ పరిమాణాల్లో గుండ్రంగా మలిచారు. కొన్ని ఎంత చిన్నగా ఉన్నాయంటే, మరీ నాలుగు అంగుళాల వ్యాసమే. మరి కొన్ని ఎనిమిది అడుగుల వ్యాసం వరకూ ఉన్నాయి. అవి చాలా చక్కగా గుండ్రంగా తీర్చిదిద్దబడ్డాయి గనుక, వాటిని చూసిన వాళ్ళెవరైనా సరే, ‘అవి ఎలా తీర్చిదిద్దబడ్డాయి? అసలు అవి దేనికి ఉపయోగించబడ్డాయి?’ అని తప్పకుండా ప్రశ్నిస్తారు.
చిలీ, మెక్సికో, మరియు అమెరికాలతో సహా ఇతర అనేక దేశాల్లో కూడా గుండ్రని బండలు కనిపించాయి. కానీ కోస్టారికాలో కనిపించే గుండ్రని గ్రానైట్లు సాటిలేనివి. వాటి నాణ్యత అమోఘంగా ఉంటుంది. కొన్ని బాగా గుండ్రంగా నున్నగా ఉంటాయి. అక్కడ గుండ్రంగా ఉండే 20 లేదా అంత కన్నా ఎక్కువ బండలు దగ్గర దగ్గరగా ఉండడం తరచూ కనిపిస్తుంది. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, రేఖాగణితం తరహాలో, అంటే త్రిభుజాకారంలో, దీర్ఘచతురస్రాకారంలో, సమాంతర రేఖల ఆకారంలో అమర్చబడి ఉన్నాయి. ఈ అమరికలు తరచూ భూమి అయస్కాంత క్షేత్రంలోని ఉత్తరం వైపుగా ఉన్నాయి.
డీకీస్ రివర్ డెల్టాలో అనేక గోళాకార బండలు కనుగొనబడ్డాయి. దక్షిణాది నగరాలైన పాలమార్ సూర్, బూనోస్ ఏర్స్, గోల్ఫీటోల్లోనూ, అలాగే, గ్వానాకాస్‌ట్ అనే రాష్ట్రంలో ఉత్తర దిశ వరకూ, మధ్య పల్లపు ప్రాంతంలోను ఇతర గోళాకార బండలను కనుగొన్నారు. ఈ గోళాకార బండలతోపాటు లభించిన కళావస్తువులు ఈ బండలు ఏనాటివనేదాని గురించిన విలువైన సంకేతాలను ఇచ్చాయి. మర్మంగా కనిపించే ఈ బండల్లో కొన్ని సా.శ. 400 నాటికి చెందినవని కొందరు పురావస్తు శాస్త్రజ్ఞులు అంచనావేస్తున్నారు. అనేక బండలు సా.శ. 800 నుండి 1200 వరకూ ఉన్న కాలం నాటికి చెందినట్లున్నాయి. కొన్ని ఒకప్పుడు నివాసస్థలాలుగా అనిపిస్తున్న చోట్లలోను, మరి కొన్ని సమాధులకు దగ్గర్లోను కనిపించాయి. ఈ గోళాకార బండల్లోపల నిధి నిక్షేపాలు ఏమన్నా ఉన్నాయేమోనన్న ఆశతో అనేక సంవత్సరాలుగా, ప్రజలు వాటిని పగలగొట్టి పాడుచేశారు. అయినప్పటికీ, నేషనల్ మ్యూజియమ్ ఆఫ్ కోస్టారికాలో 130 గోళాకార బండలున్నట్లు లిస్టు ఉంది. అయితే ఇప్పటికీ లిస్టులో చేరని గోళాకృత బండలు ఉన్నాయి. ఈ పురాతన గోళాకృత బండలను లెక్కబెట్టడం కష్టం. ఎందుకంటే, గోళాకార బండల్లో అనేకం అవి ఉన్న చోట నుండి తరలించబడ్డాయి. ప్రైవెట్ లొకేషన్‌లలోనూ, అంటే తోటల్లోనూ, చర్చీల్లోనూ వీటిని అలంకారంగా పెట్టుకున్నారు. ఇంకా అనేక బండలను కనుగొనవలసి ఉంది—కొన్ని భూమి అంతర్భాగంలో ఉన్నాయి, మరి కొన్ని దట్టమైన అడవుల్లో ఉండవచ్చు అనేదానికి సందేహంలేదు.
ఆ బండలు ఎలా తయారుచేయబడ్డాయి? అది ఒక మర్మం. అవి అంత ఖచ్చితంగా గుండ్రంగా రావాలంటే, కొన్ని యాంత్రిక పద్ధతులను ఉపయోగించి ఉండవచ్చని అనిపిస్తుంది. ఆ కాలం నాటి అనేక ప్రతిమల్లో కనిపించిన నైపుణ్యాన్ని మదింపుచేయడం ద్వారా ఈ గోళాకార బండల్ని తీర్చిదిద్దినవారు నిపుణులైన శిల్పులని మనం గ్రహించగలం. అంతేకాక, సా.శ. 800 అంత పూర్వకాలం నాటి బంగారపు కళా వస్తువులు, ఎక్కువ ఉష్ణోగ్రతను ఉపయోగిస్తూ పని చేయడంలో వారు అనుభవజ్ఞులు అని ఋజువునిస్తున్నాయి. బండను గోళాకృతిలో చెక్కడంలో, ఎక్కువ ఉష్ణోగ్రతను ఉపయోగించి, ఆ తర్వాత, ఆ బండ యొక్క పై పొరను తొలగించేందుకు దాన్ని చల్లబరచడం ఇమిడి ఉంటుందని ఒక థియరీ చెబుతుంది. ఈ గోళాకృత బండలను ఇసుకతోగానీ తోలుతోగానీ పాలిషింగ్ చేయడంతో గోళాకార బండలను తీర్చిదిద్దే పని పూర్తయ్యుంటుంది.
పెద్ద గోళాకృతబండలు “మంచి శిల్పకళాకారుల చేతిపని. ఈ [గోళాకృతులు] చాలావరకు ఖచ్చితంగా వృత్తాకారంగా ఉండేవి, టేప్‌లతోను, తాపీపని వాళ్ళు ఉపయోగించేటువంటి పరికరంతో వృత్తవ్యాసం లెక్కన చూస్తే అవి పరిపూర్ణ వృత్తాకారంలో ఉన్నాయి” అని ఒక శాస్త్రజ్ఞురాలు ఒప్పుకుంటుంది. ఈ బండలు ఇంత ఖచ్చితంగా గుండ్రంగా ఉండడం ఆ దేశస్థుల లెక్కల సామర్థ్యాన్నీ, శిల్పాలను చెక్కడంలోని మెరుగైన పరిజ్ఞానాన్నీ, వాళ్ళు ఉపయోగించిన పరికరాలనూ సూచిస్తుంది. అయినప్పటికీ, ఈ ప్రజల భాషకు లిపి లేదన్నది స్పష్టం గనుక, వాళ్ళు ఈ ఖచ్చితమైన గోళాకృతులను ఎలా చేశారనేదానికి దాఖలాలేమీ లేవు.
ఈ గోళాకృతుల్లో అధికం గ్రానైట్ వంటి రాళ్ళతో నిర్మించబడ్డాయి. డీక్వీస్ రివర్ డెల్టాలనుండి 40 నుండి 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న పర్వతాల్లో ఉన్న క్వారీయే అతి దగ్గర్లో ఉన్న గ్రానైట్ క్వారీ. శిల్పులు అంత బరువైన బండలను అక్కడి నుండి ఎలా తరలించేవాళ్ళు? క్వారీలోనే బండలను గోళాకారంగా చేశారనుకుంటే, శిల్పులు చాలా జాగ్రత్తగా వాటిని క్రిందికి తరలించవలసి ఉండేది. ఆధునిక పరికరాలేమీ లేకుండా అంత బరువైన వాటిని క్రిందికి తీసుకురావడం ఎంత సవాలుగా ఉండేదో మీరు ఊహించగలరా? ఖచ్చితంగా అవి ఎంత బరువుండేవి? కొన్ని దాదాపు 16 టన్నుల బరువుంటాయి!
గ్రానైట్ బండను త్రవ్వి తీసి, దాన్ని చెక్కే ముందు అక్కడి నుండి తరలించారనే అనుకుందాం. అలా అయితే ఎనిమిది అడుగుల వ్యాసం ఉండే ఒక గోళాన్ని తయారు చేసేందుకు తొమ్మిది అడుగుల ఘనపరిమాణంలోని బండ కావాలి. అంత పరిమాణంలో ఉన్న బండ 24 టన్నుల కన్నా ఎక్కువ బరువు ఉంటుంది! వీటిని తరలించడానికి, ఒక వెడల్పైన, సుగమమైన రోడ్డు అవసరం. అలాంటి రోడ్డును వేసేందుకు అక్కడి ప్రజలు అడవి గుండా మార్గాన్ని ఏర్పరచుకుంటూ వచ్చి ఉండవచ్చు. అదంత చిన్నవిషయం కాదు! ఇతర గోళాకార బండలు కాక్వినా బండలే. కాక్వినా అనేది చాలా మట్టుకు సున్నపురాయిలా ఉంటుంది. అది సాధారణంగా డీక్వీస్ రివర్ ముఖద్వారానికి సమీపాన ఉండే సముద్రతీరాల్లో కనిపిస్తుంది. ఈ రాళ్ళను 50 కిలోమీటర్ల దూరం నదీ ప్రవాహానికి ఎదురు ప్రయాణిస్తూ, బల్ల కట్టులపై తెచ్చి ఉంటారని ఇది సూచించవచ్చు. కానో దీవిలో, అంటే, పసిఫిక్ సముద్ర తీరం నుండి 20 కిలో మీటర్ల దూరంలో కొన్ని గోళాకార బండలు కనిపించాయి.
ఈ గోళాకార బండల అసలు ఉద్దేశమేమిటో ఎవరూ ఖచ్చితంగా వివరించలేరు. అవి బహుశా తెగ నాయకుని హోదాకు లేదా ఒక గ్రామ పేరు ప్రఖ్యాతులకు చిహ్నమై ఉండి ఉండవచ్చు. అవి మతపరమైన చిహ్నాలైనా అయ్యుండవచ్చు లేదా ఆచారకర్మల చిహ్నాలైనా అయ్యుండవచ్చు. పురావస్తుశాస్త్ర భావి అధ్యయనాలు కోస్టారికాలోని గోళాకృత బండల మర్మాన్ని ఏదో ఒక రోజున వెల్లడిచేయవచ్చు.
[22, 23వ పేజీలోని చిత్రం]
కోస్టారికా
[క్రెడిట్ లైను]
Mountain High Maps® Copyright © 1997 Digital Wisdom, Inc.
[23వ పేజీలోని చిత్రం]
గోళాకార బండ వెనుక ఉన్న ఇంజన్ దాని పరిమాణాన్ని సూచిస్తుంది
[క్రెడిట్ లైను]
Courtesy of National Museum of Costa Rica
[24వ పేజీలోని చిత్రాలు]
నాషనల్ మ్యూజియమ్ ఆఫ్ కోస్టారికా ఆవరణంలో గోళాలు
ఇంతవరకు కనిపించిన గోళాకార బండల్లోకెల్లా అతి పెద్దది. దీని వ్యాసం 8.5 అడుగులు ఉంది
[క్రెడిట్ లైను]
Courtesy of National Museum of Costa Rica