ఆయిల్ పామ్—బహుళ ప్రయోజనాలుగల చెట్టు
సాలమన్ దీవుల్లోని తేజరిల్లు! విలేఖరి
గ్వాడల్‌కెనాల్—చాలా మంది ప్రజలకు, ఈ దీవి పేరు రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన భయంకరమైన పోరాటంలో దేనితోనో సంబంధమున్నట్లు అనిపిస్తుంది. అయితే, సాలమన్ దీవిలోని ఈ మునుపటి యుద్ధ భూమికి నేడు ఏ వ్యక్తి అయినా, తిరిగివస్తే పూర్తిగా భిన్నమైన సన్నివేశాన్ని చూస్తాడు—లెక్కలేనన్ని సైనిక దళాలను కాక, పెద్ద ఆయిల్ పామ్ చెట్లు బారులు తీరి ఉండడాన్ని చూస్తారు.
ఏపుగా పెరిగిన, రాచఠీవిగా నిలబడివున్న ఈ ఆయిల్ పామ్ చెట్ల క్రింద ఉన్న మట్టిలో ఒకప్పుడు టన్నుల కొలది మిగిలిపోయిన ప్రేలుడు పదార్థాలూ, మరితర ప్రాణాంతక యుద్ధ సామగ్రీ ఉండేవి. కానీ ఈ ఆయిల్ పామ్ చెట్ల వ్యవసాయం కోసం, ఈ యుద్ధ పరికరాలు తొలగించబడ్డాయి. ఈ చెట్ల వ్యవసాయం ఎలా ప్రారంభమైంది? ఏపుగా పెరిగే అందమైన ఈ చెట్టు వల్ల బహుళ ప్రయోజనాలున్నాయని మనమెలా చెప్పగలం?
పెద్ద చరిత్రే
ఆయిల్ పామ్ చెట్టుకు సాదృశ్యమైన మరో చెట్టును గురించిన ఆధునికమైన మొదటి వివరణ, ఆఫ్రికా యొక్క పశ్చిమ తీరాన్నంతటినీ తిరిగివచ్చిన వెనిస్ నగరవాసియైన ఆల్వీజే కాడామోస్టో 15వ శతాబ్దపు మధ్యభాగంలో ఇచ్చిన లిఖితపూర్వక నివేదికలో ఉంది. అయితే, దాదాపు 500 సంవత్సరాల క్రితం, ఆఫ్రికాదేశస్థులైన బానిసలు ఈ పండ్లను అట్లాంటిక్ మీదుగా తమతోపాటు ఇతర దేశాలకు తీసుకువెళ్ళారు. అలా పామ్ ఆయిల్ లోకంలో ఎక్కువగా వాడుతున్న వెజిటబుల్ ఆయిల్లలో ఒకటిగా రంగప్రవేశం చేసింది. ఆయిల్ పామ్ చెట్లు ఒక ఎకరం భూమి లెక్కన చూస్తే, మరే ఇతర నూనె చెట్లకన్నా ఎక్కువ దిగుబడినిస్తుంది. అంతేకాక, ఆయిల్ పామ్ అన్ని ఋతువుల్లోనూ పండుతుంది, 25 నుండి 30 సంవత్సరాల వరకూ నూనె ఉత్పత్తి చేయవచ్చు.
పామ్ ఆయిల్ ఉత్పత్తిలోని ప్రాముఖ్యమైన కారకం, ముఖ్యంగా దూర ప్రాచ్యంలోని కొన్ని దేశాల్లో, 1970ల చివరి భాగంలోనే కనిపెట్టబడింది. ఆయిల్ పామ్ చెట్లలో పరాగ సంపర్కం ముఖ్యంగా గాలి ద్వారా జరుగుతుందని మునుపు తలంచబడేది. కనుక, పంట సరిగా రాకపోతే, వాతావరణం సరిగా లేకపోవడమే కారణమని చెప్పబడేది. కానీ వీటిలో పరాగ సంపర్కం ముఖ్యంగా కీటకాల ద్వారే జరుగుతుందని ఇటీవలి పరిశోధన వెల్లడిచేసింది! కనుక, ఈ చెట్లలో పుష్పపరాగం చేయగల కీటకాలను పశ్చిమాఫ్రికా నుండి దూరప్రాచ్యానికి తీసుకువెళ్ళడం ప్రయోజనకరమైనదిగా రుజువైంది.
ఆయిల్ పామ్ పండు ఎరుపూ నారింజ వర్ణమూ కలగలిసిన రంగులో ఉంటుంది. అది రెండు రకాల నూనెను ఇస్తుంది. రెండింటినీ, వివిధ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. వాటిలో కొన్నింటిని మీరు ఉపయోగిస్తుండవచ్చు. మనం వాటిని గురించి చర్చించే ముందు, పామ్ ఆయిల్ మిల్లు సందర్శించి, నూనెను ఎలా తీస్తారో చూద్దాం.
స్వర్ణ వర్ణంలోని రసాన్ని ప్రక్రియకు లోనుచేయడం
మనం మిల్లు దగ్గరికి వెళ్ళినప్పుడు, టూర్ గైడ్ మనకు అభివాదం చేసి, లోపలికి తీసుకువెళ్తాడు. మన చుట్టూ పెద్ద పెద్ద యంత్రాలు పనిచేస్తున్నాయి. ఆయిల్ పామ్ పండ్లను నూనెను తయారుచేసే ప్రక్రియకు లోను చేయడంలో మొదటి పని, వాటిని పెద్ద స్థూపాకార స్టీమ్ అవన్‌లో వేయడమే. ఆయిల్ పామ్ పండ్లు ఖర్జూరపు సైజులో ఉంటాయి. ఒక్కో గెలలో 200 పండ్లు ఉంటాయి. అవి బాగా దగ్గరదగ్గరగా ఉంటాయి. స్టీమ్ అవన్ పండ్లను స్టెరిలైజ్ చేస్తుంది, అలాగే పండ్లను గెలలో నుండి వదులుగా అయ్యేందుకు సహాయపడుతుంది.
తర్వాతి పని, స్ట్రిప్పర్ అనే యంత్రం సహాయంతో పండ్లను గెలలో నుండి వేరు చేయడం. అలా వేరు చేసిన పండ్లను పెద్ద బ్లెండర్‌కు పంపిస్తారు. అక్కడ దాని గుజ్జూ, విత్తనమూ వేరు చేయబడతాయి. పీచుగా ఉండే ఈ గుజ్జును పెద్ద ఎక్స్‌ట్రూడర్ లేదా ప్రెస్ సహాయంతో పిండినప్పుడు ముడి పామ్ ఆయిల్ వస్తుంది. దాన్ని శుభ్రపరచి, రిఫైన్ చేసిన తర్వాత, పామ్ ఆయిల్ సిద్ధమౌతుంది. ఇక దాన్ని రవాణా చేయవచ్చు.
అయితే, మరో రకం ఆయిల్ కూడా ఉంది. ఇది విత్తనం నుండి వస్తుంది. మొదట ఈ ఆయిల్ పామ్ టెంకను పగలగొట్టి విత్తనాన్ని తీయాలి. ఆ తర్వాత, వాటిని ప్రెస్ చేసి, దానిలోని విలువైన ద్రవాన్ని వెలుపలికి తీస్తారు. దాన్నే పామ్-కెర్నెల్ ఆయిల్ అంటారు.
విత్తనంలో మిగిలిన దానిని పశువుల కోసం పోషక గుణంగల దాణాని తయారు చేయడంలో ఉపయోగిస్తారు. అలాగే, పండ్లను వేరు చేసిన తర్వాత ఖాళీ గెలలను పొలాలకు తిరిగి పంపుతారు. వాటిని పొలాల్లో క్రొత్తగా నాటిన మొక్కలపై కప్పేందుకు ఉపయోగిస్తారు. పండులోని పీచును, పెంకులను కూడా రిసైక్లింగ్ చేసి, మిల్లు బాయిలర్‌లకు ఇంధనంగా ఉపయోగిస్తారు. చాలా సమర్థవంతమైన పనే!
ఐస్‌క్రీమ్ మొదలుకొని ఫేస్‌క్రీమ్ వరకూ
ప్రపంచంలో విస్తృతంగా ఉపయోగించే వెజిటబుల్ ఆయిల్‌లలో పామ్ ఆయిల్ రెండవది. అంటే దీనికి సోయాబీన్ ఆయిల్ తర్వాతి స్థానమన్నమాట. “1700లలో ఆంగ్లేయులు పామ్ ఆయిల్‌ని మందుగానూ, చేతులకు రాసుకునే క్రీమ్‌గానూ ఉపయోగించేవారు” అని ద వాల్డ్ బుక్ ఎన్‌సైక్లోపీడియా అంటోంది. అయితే, నేడు దీనిని ఐస్‌క్రీమ్, డాల్డా, ఫలహారాల కోసం ఉపయోగించే క్రొవ్వుపదార్థాల, వంటనూనెల, అలాగే సబ్బులు సౌందర్యవర్థక వస్తువులు మొదలైన ఆహారేతర పదార్థాల తయారీల్లోనూ ఉపయోగిస్తున్నారు.
డాల్డాను, అలాగే చాక్లెట్‌ను, మరితర తీపి పదార్థాలను తయారు చేయడంలో కూడా పామ్-కెర్నెల్ ఆయిల్‌ను ఉపయోగిస్తారు. కానీ ఈ ఆయిల్ ఉపయోగం ఇంతటితో అయిపోలేదు. ఫార్మస్యూటికల్స్‌ను, సబ్బులను, డిటర్జెంట్లను, క్రొవ్వొత్తులను, అలాగే ప్రేలుడు పదార్థాలను తయారు చేసేందుకు పామ్ ఆయిల్‌లోని కొన్ని పదార్థాలను ఉపయోగిస్తున్నారు!
నిజానికి ఆయిల్ పామ్ చెట్టు సాలమన్ దీవుల్లో ప్రజాదరణ పొందిన చెట్టు. ఈ దేశం చేసే ఎగుమతుల్లో 13 శాతం ఆయిల్ పామ్ చెట్లనుండి వచ్చే ఉత్పత్తులేనన్న వాస్తవం ఆర్థిక పరిస్థితిపై ఈ చెట్లు చూపించే ప్రభావాన్ని ఎత్తిచూపిస్తుంది.
మనం ఆయిల్ పామ్ చెట్టును చూసినప్పుడు, కాంతివంతమైన నారింజ రంగులో ఉండే ఈ పండు యొక్క ఉత్పత్తి నవ్వుతున్న ఒక పిల్లవాడి నోటి నుండి కారుతున్న ఐస్‌క్రీమ్‌లో ఉందనీ, వాడి తల్లి మేకప్ చేసుకోగా ఆమె ముఖంలో ఉందనీ ఊహించుకుంటే చాలా తమాషాగా అనిపిస్తుంది. అవును ఆయిల్ పామ్ వల్ల వివిధ ఉపయోగాలు ఉన్నాయి. దాని సమృద్ధమైన ఫలాలను బట్టి మనం చాలా కృతజ్ఞులంగా ఉండాలి.
[27వ పేజీలోని బాక్సు/చిత్రం]
రోజుకు రెండు టన్నుల పండ్లు కోయడం
టప్... టప్. టప్... టప్! పనివాళ్ళు ఆయిల్ పామ్ తోటలో ఆయిల్‌పామ్ పండ్ల గెలలను కోస్తుండగా అవి పడిన శబ్దం ఆ పరిసరమంతా ప్రతిధ్వనిస్తుంది. ఆ పండ్లు చెట్ల మీద అంత ఎత్తున ఉండగా వాళ్ళు ఎలా అందుకోగల్గుతారు?
పనివాళ్ళు గడకర్ర చివరన చిన్న కొడవలి వంటి దానిని కట్టి ఈ చెట్ల నుండి పండ్లు కోయడానికి ఉపయోగిస్తారు. ఈ చెట్లు కొన్ని నాలుగు అంతస్థుల కట్టడమంత ఎత్తుగా ఉంటాయి. అవసరాన్ని బట్టి గడకర్రను పొడిగించవచ్చు. ప్రతిరోజు ఒక పనివాడు సరాసరి 80 నుండి 100 గెలల పండ్లను కోసి, తీసుకువెళ్లేందుకు రోడ్డు ప్రక్కన చేరుస్తాడు. ఒక్కో పండ్ల గెల దాదాపు 25 కిలోల బరువు ఉంటుంది, కాబట్టి చాలా బరువుగా ఉంటుంది! ఒక టన్ను పామ్ ఆయిల్‌ను తయారు చేసేందుకు నాలుగున్నర టన్నుల పండ్లు అవసరమౌతాయి.