సూర్యగ్రహణం మరియు ఖగోళశాస్త్రపు సమ్మోహనం
మే 10, 1994, ఉత్తర అమెరికాలోని కొందరికి ఒక ప్రత్యేక రోజుగా ఉంది. అది చంద్రునివల్ల కలిగిన సూర్య కంకణ గ్రహణ సమయం.a కొన్ని గంటల్లో ఖగోళ శాస్త్రంలోని అద్భుతమైన విజ్ఞానాన్ని గూర్చి అనేకులు తెలుసుకున్నారు. అయితే, అసలు గ్రహణం అంటే ఏమిటి?
“చూపరి దృష్టినుండి ఖగోళకూటమిలో ఒకటి మరొకదాన్ని పాక్షికంగాగాని, సంపూర్ణంగాగాని కప్పినప్పుడు” గ్రహణం సంభవిస్తుంది. (ది అమెరికన్ హెరిటేజ్ డిక్షనరీ ఆఫ్ ది ఇంగ్లీష్ లాంగ్వేజ్) సూర్య గ్రహణంగానీ లేక చంద్ర గ్రహణంగానీ, భూమి, సూర్యుడు మరియు చంద్రుడు ఇంచుమించు ఒకే సరళరేఖలో ఉన్నప్పుడు సంభవిస్తుంది. వచ్చేది సూర్యగ్రహణమా లేక చంద్రగ్రహణమా అన్నది ఖగోళ కూటమిలో ఏ గ్రహం కప్పబడినదన్న దానిపై ఆధారపడివుంటుంది. కొన్నిసార్లు భూమి ఛాయ చంద్రునిపై పడడంవల్ల చంద్ర గ్రహణం సంభవిస్తుంది. మరో వైపు గత సంవత్సరం, మేనెలలో చంద్రుని ఛాయ 230 నుండి 310 కిలోమీటర్ల వెడల్పైన పట్టీలా భూమిపై పడుతుంది. చంద్రుడు, భూమికి మరియు సూర్యునికి మధ్య పయనించినప్పుడు, అది సూర్యున్ని ఇంచుమించు పూర్తిగా కప్పివేస్తుంది. ఈ ఛాయా గమనం పసిఫిక్ మహాసముద్రంనుండి ఉత్తర అమెరికా వరకు అంటే వాయవ్యం నుండి ఈశాన్యం వరకూ పయనించింది. సూర్యుని ముందు చంద్రుడు మెల్లగా పయనిస్తున్నట్లు తోచింది. వాస్తవానికి, ఈ ఛాయ భూమిగుండా గంటకు 3,200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది.
గ్రహణాన్ని చూసేటప్పుడు, కళ్లకు హాని కల్గకుండా అన్ని రకాల పద్ధతులూ ఉపయోగించబడ్డాయి. కొందరు వెల్డింగ్ లెన్స్ సహాయంతో చూశారు. ఇతరులు శక్తివంతమైన రంగు తెరను (కలర్‌ఫిల్టర్) ఉపయోగించారు. మరితరులు సన్న రంధ్రం ద్వారా కాగితంపై దాని ప్రతిబింబాన్ని పట్టారు. ఒక ఫోటోగ్రాఫర్, జల్లెడ వంటి సాధనాన్ని ఒకరిచేత పైకెత్తిపట్టుకోనిచ్చింది, అప్పుడు దానిలోనుండి వెలుగు ప్రసరించి నేల మీద గ్రహణపు ప్రతిబింబాలెన్నింటినో అది సృష్టించింది. చెట్ల ఆకుల నుండి వెలుగు ప్రసరించినప్పుడు అలాంటి ప్రభావమే కనబడుతుంది. మరో పద్ధతి బైనాక్యులర్స్ ద్వారా వెలుగును ప్రసరింపజేసి, ముదురు రంగు ఉపరితలంపై రెండు రూపాలను పొందడమే.
ఒక్క సంవత్సరంలో అయిదు గ్రహణాలు (మూడు చంద్రగ్రహణాలవరకు) సంభవించే ఆస్కారముంది. “ప్రతి సంవత్సరం ఏదొక రకంలో కనీసం రెండు సూర్య గ్రహణాలైనా సంభవించాలి” అని ది ఇంటర్నేష్నల్ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఆస్ట్రానమీ అంటోంది. అయితే, ప్రతి ఒక్కటీ వేరు వేరు ప్రాంతాలనుండి చూడవచ్చు. అమెరికా సంయుక్త రాష్ట్రాలందు 1994లో గ్రహణాన్ని చూడనివారెవరైనా, అలాంటి మరో అవకాశం కొరకు 2012వ సంవత్సరం వరకు వేచివుండాలి లేదా ముందే చూడాలనుకునేవారు పెరూ, బ్రెజిల్, లేక సైబిరియాకు వెళ్లాల్సి ఉంటుంది.b
సంపూర్ణ గ్రహణంలో దాగివున్న మర్మము
సంపూర్ణ సూర్య గ్రహణం, అంటే చంద్రుడు సూర్యుని పూర్తిగా కప్పివేయడం గత శతాబ్దాల్లో భయాందోళనను కల్గించింది. ఎందుకు? ది ఇంటర్నేష్నల్ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఆస్ట్రానమీ ఇలా పేర్కొంది: “చంద్రుడు సూర్యుని సమీపించడం కనిపించదు గనుక, కనిపించబోయే దృశ్యాన్ని గూర్చి ఏమీ తెలియని వారికి ఏ హెచ్చరికా లేనందువల్ల, సంపూర్ణ గ్రహణపు మర్మము మరింత ఎక్కువయ్యింది.” ఆ దృశ్యంలో ఈ విషయాలు కూడా ఉన్నాయి: “తరచూ అవర్ణనీయ వింతైన లేతపచ్చని రంగుతో ఆకాశాన్ని చీకటి కమ్ముతుంది, మరి అది మేఘాలవల్ల కల్గే చీకటివంటిది కాదు. . . . అసంపూర్ణ గ్రహణపు చివరి కొద్ది క్షణాల్లో త్వరగా వెలుగులేకుండా పోతుంది, మరింత చల్లబడుతుంది, పక్షులు విశ్రమించేందుకు వాలుతాయి, కొన్ని పూరేకులు మూసుకుంటాయి, మరి గాలి హోరు తగ్గుతుంది. . . . పల్లెలను అంధకారం చుట్టు ముడుతుంది.”
ది స్టోరీ ఆఫ్ ఎక్లిప్‌సిస్ అనే తన పుస్తకంలో, జార్జి చాంబర్స్, ఆగస్టు 2, 1133 నందు, “మధ్య యుగాల్లోని అతి ప్రసిద్ధినొందిన గ్రహణాల్లో ఒకదాన్ని . . . , స్కాట్లాండ్‌నందు సంపూర్ణ గ్రహణంగా కనిపించిన” దాన్ని గూర్చి నివేదిస్తున్నాడు. మాల్మిస్బరీకి చెందిన విలియమ్ ఇలా రాశారు: “గ్రహణం ద్వారా ప్రజల హృదయాలను కంపింపజేస్తూ, . . . ఆ రోజు 6వ గడియలో సూర్యుడు వెలుగొందే తన ముఖాన్ని అనుకోని చీకటిలో దాచుకున్నాడు.” పురాతన ఆంగ్లో-సాక్స్‌న్ క్రానికల్, “ప్రజలు దీనివల్ల ఎంతో కలతచెందారనీ, భయపడ్డారనీ” చెప్పింది.
ఆఫ్రికానందలి ఇద్దరు ప్రయాణికులు నివేదించిన సెప్టెంబర్ 2, 1830 నాడు జరిగిన చంద్రగ్రహణాన్ని గూర్చి కూడా చాంబర్స్ నమోదు చేశాడు: “చంద్రుడు క్రమంగా కప్పబడినప్పుడు, భయం ప్రతి ఒక్కరినీ ఆవరించింది. గ్రహణం ఎక్కువవుతున్న కొలదీ వారు మరింత భయబ్రాంతులయ్యారు. అందరూ ఎంతో కలతచెంది ఈ పరిస్థితిని గూర్చి చెప్పేందుకు తమ ప్రభువు వద్దకు పరుగుతీశారు, ఎందుకంటే అంత చీకటి ఏర్పడేందుకు ఒక్క మేఘం కూడా లేదు, అంతేకాక గ్రహణం ఎలాంటిది లేక దాని భావమేమిటి అన్నదాన్ని వారు అర్థంచేసుకోలేకపోయారు.”
ఇటీవలి సమయాల్లో, ఖగోళశాస్త్ర పఠనం సూర్య గ్రహణాన్ని గూర్చి మానవజాతి భయాలను తగ్గించింది—సూర్యుడు మరలా కనిపిస్తాడని మనకు తెలుసు.
జెసూట్లు సూర్యగ్రహణాన్ని ఎలా ఉపయోగించుకున్నారు
చైనానందలి జెసూట్ మిషనరీలు, 1629 నందు, సూర్య గ్రహణం ద్వారా సామ్రాజ్యాధిపతి మెప్పునుపొందారు. వారు దాన్నెలా చేశారు?
“శతాబ్దాలనుండి కొనసాగుతున్నట్లుగా, చైనా వారి చాంద్రమాన క్యాలెండరు తప్పని” జెసూట్లు గమనించారు. “ఆస్థాన జ్యోతిష్యులు సూర్య గ్రహణాన్ని సూచించడంలో మరలా మరలా తప్పు చేస్తూనే ఉన్నారు. . . . జూన్ 21, 1629 ఉదయం గ్రహణం సంభవిస్తుందని ఎదురుచూసినప్పుడు జెసూట్లకు గొప్ప అవకాశం వచ్చింది. గ్రహణం 10:30లకు కలిగి, రెండు గంటల పాటు ఉంటుందని ఆస్థాన జ్యోతిష్యులు సూచించారు. జెసూట్లు, గ్రహణం 11:30 వరకూ రాదని మరి అది రెండు నిమిషాలు మాత్రమే ఉంటుందని సూచించారు.” ఏమైంది?
“ఆ ప్రాముఖ్యమైన దినం, 10:30 వచ్చి దాటిపోయినా, సూర్యుడు పూర్తిగా మండుతూనే ఉన్నాడు. ఆస్థాన జ్యోతిష్యులు చెప్పింది తప్పే, మరి జెసూట్లు చెప్పినది సరైనదేనా? తర్వాత, జెసూట్లు సూచించిన ప్రకారం సరిగ్గా 11:30న గ్రహణం ప్రారంభమై, రెండు నిమిషాలపాటు మాత్రమే నిలిచింది. ఇప్పుడు వారు చక్రవర్తి సంపూర్ణ విశ్వాసాన్ని చూరగొన్నారు.—డానియేల్. జే. బూర్సిటిన్ రాసిన ది డిస్కవరర్స్.
బైబిలునందలి ఖగోళశాస్త్రం
బైబిలులో కూడా ఖగోళశాస్త్ర సమాచారం ఉంది. యోబు పుస్తకంలో ఎన్నో నక్షత్రరాశులను పేర్కొనడం జరిగింది. అంతేకాకుండ, ఆకాశాన్ని పరిశీలించేందుకు తన సేవకులను యెహోవా ఆహ్వానించాడు, ఖగోళశాస్త్ర పఠనానికో లేక అబద్ధ ఆరాధనకో కాదుకానీ తన సృష్టి మహత్యాన్ని మెచ్చుకునేందుకే. యెషయా ఇలా రాసేందుకు ప్రేరేపించబడ్డాడు: “మీ కన్నులు పైకెత్తి చూడుడి వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్కచొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికిని పేరులు పెట్టి పిలుచువాడే గదా. తన అధికశక్తిచేతను తనకు కలిగియున్న బలాతిశయము చేతను ఆయన యొక్కటియైనను విడిచిపెట్టడు.”—యెషయా 40:26.
ఆయనను గూర్చి ఇలా చెప్పినప్పుడు, సృష్టికర్త సర్వాధికారాన్ని యోబు అంగీకరించాడు: “ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అనువాటిని దక్షిణ నక్షత్రరాసులను చేసినవాడు.”—యోబు 9:7-9.
విధేయులైన మానవజాతికి యెహోవా నిత్యజీవమును అనుగ్రహించినప్పుడు, ఖగోళశాస్త్ర అధ్యయనం ఎంత ఆకర్షణీయంగా ఉంటుందోకదా! అప్పుడు ఈ విస్తృతమైన విశ్వానికి సంబంధించి దేవుని సంకల్పాలను గూర్చి మనం తెలుసుకొంటుండగా విశ్వంలోని మర్మాలు క్రమంగా బయల్పర్చబడతాయి. ఆ విధంగా, మనం దావీదు మాటలను మరింత భావగర్భితంగా తిరిగి పలకగలము: “నీ చేతిపనియైన నీ ఆకాశములను నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసికొనుటకు వాడేపాటివాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు?”—కీర్తన 8:3, 4.
[అధస్సూచీలు]
a This footnote is missing in vernacular
b నవంబరు 3, 1994 నాడు సంపూర్ణ గ్రహణం సంభవించింది, అది దక్షిణమెరికాలోని కొన్ని భాగాల్లో కనిపించింది.
[Picture Credit Line on page 8]
Photo courtesy of NASA/Finley-Holiday Film Corporation