మా పాఠకుల నుండి
స్ట్రోక్స్ ‘‘స్ట్రోక్‌ను తాళుకోవడం’’ అనే పరంపర (మార్చి 8, 1998) నా ప్రార్థనలకు జవాబైవుంది. కొన్ని సంవత్సరాల క్రితం, నేనూ నా భర్త కలిసి క్రైస్తవ సమావేశానికి హాజరైనప్పుడు ఆయనకి స్ట్రోక్ వచ్చింది. తన భావాలను నాకు వ్యక్తంచేయాలని వ్రాసే ప్రయత్నం చేసేలోపు, ఆయన చెయ్యి కాగితం మీద నుంచి క్రిందకు జారి అతని కుడిభాగానికంతటికీ స్ట్రోక్ వచ్చింది. ఈ శీర్షిక నేను వ్యక్తం చేయలేనంత సహాయం చేసింది. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదన్న విషయం తెలుసుకోవడం చాలా అద్భుతంగా ఉంది.
ఎఫ్. యస్. హెచ్., అమెరికా
ఈ పత్రికను అందుకొనే కొన్ని గంటల ముందు, నేను ఎంతగా బాధ పడ్డానో నా భార్యకి వివరించాలన్న నా ప్రయత్నం విఫలమైంది, బహుశ నా స్ట్రోక్ మూలంగా నా గురించి చెప్పాలనుకున్నది చెప్పలేకపోయాను. ఇప్పటికి మూడు సార్లు నేను ఈ పత్రికను చదివేశాను. నా భార్య కూడా చదివింది.
ఆర్. జెడ్., ఇటలీ
అనేక సంవత్సరాలుగా యెహోవాకు నమ్మకమైన సేవచేసిన మా నాన్నగారు, గత సంవత్సరం స్ట్రోక్ మూలంగా చనిపోయారు. ఆయన చనిపోకముందటి ప్రవర్తనని అర్థంచేసుకోవడానికి ఈ శీర్షిక నాకు సహాయం చేసింది. భావాల్లో మార్పులకు సంబంధించి, దానికి తోడు స్ట్రోక్‌తో బాధపడే వ్యక్తికి సంభాషించడం ఎందుకు కష్టంగా అనిపిస్తుందో, మా నాన్నగారు ఎంతగా బాధపడ్డారో అర్థంచేసుకోవడానికి ఈ వివరణలు నాకు చాలా బాగా సహాయం చేశాయి.
వి. సి., అమెరికా
సంవత్సరం క్రితం నాకు స్ట్రోక్ వచ్చింది, ఎడమభాగంలో శక్తి క్షీణించడం వల్ల ఇప్పటికీ నేను బాధపడ్తున్నాను. స్ట్రోక్‌లో కొన్ని అర్థంకాని విషయాలు దానివల్ల కలిగే భయాల్ని ఈ శీర్షిక చెదరగొడుతుంది. వృద్ధులకే స్ట్రోక్ వస్తుంది అన్నది కేవలం కల్పితకథ మాత్రమే. కేవలం నాకు 47 సంవత్సరాల వయసులోనే స్ట్రోక్ వచ్చింది.
ఎ. ఎ., ఇంగ్లాండు
నా కుమార్తె లూసియాని అర్థం చేసుకోవడానికి ఈ శీర్షిక నాకెంతో సహాయం చేసింది, ఆమె రెణ్నెల్ల ప్రాయంలో ఉన్నప్పుడు కారు ప్రమాదంలో తలకి బలమైన గాయం అయ్యింది. ఆమె తన భావాల్ని చెప్పలేక పోయేది. అలా ఎందుచేతనో అర్థం చేసుకోవడానికి ఈ శీర్షిక నాకు సహాయపడింది.
యన్. కె., స్లొవేకియా
నేనొక రిజిస్టర్డ్ నర్స్‌ని, పునరావాస కార్యక్రమాల్లో పనిచేయడానికి అధికారిక అనుమతి ఉంది. అంతేకాదు స్ట్రోక్ బాధితులకు సేవ చేయడంలో ఎంతో అనుభవంవుంది. స్ట్రోక్ బాధితుల కుటుంబాలు ఏమి అనుభవిస్తారో దానిని తదనుభూతితో వర్ణించడం నాకు ఈ శీర్షికలో అత్యంత ఎక్కువగా నచ్చిన విషయం.
యల్. సి., అమెరికా
నా తల్లి తాత్కాలిక ఇస్కీమిక్ పోటుకు గురైంది. ఆమె ఆరోగ్యం విషయానికి వస్తే, ఇంచుమించు ఆమె పూర్తిగా కోలుకున్నట్టే. గానీ ఆమెకి మానసికంగా లోతైన గాయాలయ్యాయి. తన ఆరోగ్యం విషయంలో ఆత్మస్థైర్యం గలదే అయినా ఇప్పుడు మాత్రం అత్యంత బలహీనంగా ఉంది. ఈ జబ్బు మానసికంగా ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో నొక్కి చెప్పినందుకు కృతజ్ఞతలు.
ఆర్. సి., ఇటలీ
రెండు సంవత్సరాల క్రితం స్ట్రోక్‌తో మా అమ్మ రెండు సార్లు బాధపడింది. మొదటి స్ట్రోక్ వల్ల ఆమె జ్ఞాపకశక్తి పోయింది, రెండవదానివల్ల ఆమె కుడి భాగం అంతా పక్షవాతం వచ్చింది. నేను ఆమె విషయంలో సహనం కోల్పోయి కొన్ని సార్లు ఆమెను బాధపరచే మాటలు మాట్లాడేదాన్ని. అలాంటి వారిపట్ల మరింత సహనంతో వ్యవహరించాలని ఈ శీర్షిక నన్ను ప్రోత్సహించింది.
ఆర్. టి. యస్., బ్రెజిల్