పొరుగువారి మీద ప్రేమ ఏమైపోయింది?
లక్షలాది మంది ఏ దిక్కూ లేకుండా దౌర్భాగ్యపు స్థితిలో ఉంటూ దుఃఖంతో భయంతో జీవితాల్ని గడుపుతున్నారు. ఒకామె “నేను ఒక్కతినే తింటాను, ఒక్కదాన్నే నడుస్తాను, ఒక్కదాన్నే పడుకుంటాను, నాలో నేనే మాట్లాడుకుంటాను” అని దుఃఖంతో చెబుతుంది. అవసరాల్లో ఉన్నవారిపట్ల ఇష్టపూర్వకంగా ప్రేమ చూపించేవారు చాలా అరుదు.
రిటైరైన ఒక వ్యాపారస్తురాలు ఇలా అంటుంది: ‘నేనుండే అంతస్తులోనే నివసించే ఒక విధవరాలు ఒక సాయంకాలం మా తలుపుతట్టి, తను ఒంటరిగా ఉందని చెప్పింది. నేను బిజీగా ఉన్నానని మర్యాదగానే నిర్మొహమాటంగా ఆమెతో చెప్పాను. నాకు ఇబ్బంది కలిగించినందుకు తను నన్ను క్షమాపణకోరి వెళ్ళిపోయింది.’
ఆమె ఇంకా ఇలా చెప్పింది: ‘ఆమెను వదిలించుకోగలిగినందుకు నాలో నాకే గర్వంగా అనిపించింది. మరుసటి రోజు సాయంకాలం ఒక స్నేహితురాలు ఫోన్ చేసి, నీవుండే అంతస్తులోనే ఒక స్త్రీ నిన్నరాత్రి ఆత్మహత్య చేసుకుంది ఆమె నీకు తెలుసా అని అడిగింది. మీరు ఇంకా గ్రహించనట్లయితే, ఆమె ఎవరో కాదు నా తలుపును తట్టిన స్త్రీయే.’ ఆ సంఘటనతో “కఠినమైన గుణపాఠాన్ని” నేర్చుకున్నాను అని ఆ వ్యాపారస్తురాలు చెప్పింది.
చిన్నపిల్లలకు ప్రేమ కరువయితే చనిపోతారని తెలిసిందే. పెద్దలు సహితం ప్రేమను పొందకపోతే చనిపోగలరు. 15 ఏండ్ల అందమైన అమ్మాయి, తను చనిపోక ముందు వ్రాసిన నోట్‌లో ఇలా వ్రాసింది: “ప్రేమ అంటే అర్థం, ఇక ఎంతమాత్రం ఒంటరిగా ఉండకపోవడమే.”
ఆధునిక కాలంలోని విపత్తు
కొన్ని సంవత్సరాల క్రితం జాతి ద్వేషాన్ని గురించి వ్యాఖ్యానిస్తూ న్యూస్‌వీక్ ఇలా రిపోర్ట్ చేసింది: “‘నీ పొరుగువారిని ద్వేషించు’ అనేది ఈ సంవత్సరంలోని నినాదంలా ఉన్నదనిపిస్తుంది.” మునుపటి యుగోస్లేవియాలో భాగమై ఉన్న బోస్నియాలోను, హెర్జెగోవినాలోనూ వర్గ పోరాటాలు జరిగినప్పుడు పదిలక్షలకన్నా ఎక్కువ మంది తమ ఇళ్ళను విడిచిపెట్టవలసి వచ్చింది, వేలాదిమంది చంపబడ్డారు. ఎవరు చంపారు? “మా పొరుగువాళ్ళే,” “మాకు తెలిసినవాళ్ళే” అని తన సొంత ఊరు నుండి తరిమివేయబడ్డ ఒక అమ్మాయి విలపించింది.
3,000మంది హుటు, టుట్సీలు ఉన్న రువాండాలో “మేము శాంతిసామరస్యాలతో కలిసి జీవించేవాళ్లం,” అని ఒక స్త్రీ చెప్పింది. “ఈ ఊరి కథే రువాండా కథ: ఎవరు హుటు, ఎవరు టుట్సీ అని తేడా తెలియనంతగా హుటులు, టుట్సీలు కలిసి జీవించేవారు, కులాంతర వివాహాలను చేసుకున్నారు. అయితే, అకస్మాత్తుగా పరిస్థితి మారింది. హత్యలు మొదలయ్యాయి” అని ద న్యూయార్క్ టైమ్స్ నివేదించింది.
అలాగే, ఇజ్రాయేల్‌లో యూదులు అరబ్బులు ప్రక్కప్రక్కనే నివసిస్తారు, కానీ చాలామంది ఒకరినొకరు ద్వేషించుకుంటారు. ఈ 20వ శతాబ్దమంతటిలో, ఉత్తర ఐర్లాండ్‌లో, ఇండియా పాకిస్తాన్‌లలో, మలేషియా ఇండోనేషియాలలో, అమెరికాలో జాతి వర్గాల మధ్య—ఇలా ప్రపంచమంతటా మనం ఎక్కడ జీవించినప్పటికీ సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది.
జాతి, మత పోరాటాల గురించి చెప్పుకుంటూ పోతే దీనికి అంతే ఉండదు. చరిత్రలో ఎన్నడూ లోకంలో ఇంత ప్రేమరాహిత్యముండేది కాదు.
ఎవరు బాధ్యులు?
ప్రేమలాగానే ద్వేషం కూడా నేర్పించబడుతుంది. పిల్లలకు “మరీ ఆలస్యం కాకుండానే నేర్పించబడుతుంది/వయస్సు మీరకముందే ఆరు ఏడు ఎనిమిది లోపలే నేర్పించబడుతుంది/తమ బంధువులు ద్వేషించే ప్రజలందర్నీ ద్వేషించమని నేర్పించబడుతుంది” అని ప్రజాదరణ పొందిన పాట ఒకటి అంటుంది. ప్రత్యేకంగా నేడు ద్వేషం నేర్పబడుతుంది. ముఖ్యంగా చర్చీలు వారి సభ్యులకు ప్రేమించడాన్ని నేర్పించడానికి విఫలమయ్యాయి.
ఫ్రెంచ్ న్యూస్ పేపర్ ల మోండ ఇలా అడిగింది: “బురుండి రువాండాల్లో యుద్ధం చేస్తున్న టుట్సీలు హుటులు, ఒకే క్రైస్తవ మిషనరీల వద్ద శిక్షణ పొందారనీ ఒకే చర్చీకి హాజరయ్యేవారనీ తలంచకుండా ఎలా ఉండగలము?” నిజానికి ద నేషనల్ క్యాథలిక్ రిపోర్టర్ ప్రకారం రువాండా “70 శాతం క్యాథలిక్ దేశం.”
ఈ శతాబ్దారంభంలో, తూర్పు యూరప్ దేశాలు నాస్తిక కమ్యూనిజం వైపుకు తిరిగాయి. ఎందుకు? 1960లో జెకస్లోవేకియాలోని ప్రాగ్‌లో మతవిభాగానికి ప్రొఫెసర్ అయిన వ్యక్తి ఇలా గమనించాడు: “మనమే, అంటే క్రైస్తవులమే కమ్యూనిజానికి బాధ్యులం. . . . కమ్యూనిస్టులు ఒకప్పుడు క్రైస్తవులేనని గుర్తుంచుకోండి. న్యాయమైన దేవుణ్ని వారు నమ్మకపోతే, అది ఎవరి తప్పు?”
మొదటి ప్రపంచ యుద్ధకాలంలో చర్చీలు ఏమి చేశాయో చూడండి. బ్రిటీష్ బ్రిగేడియర్ జనరల్ ఫ్రాంక్ క్రోజియర్ ఆ యుద్ధం గురించి ఇలా చెప్పాడు: “రక్తం చిందించడాన్ని ఎక్కువగా ప్రేరేపించే వాటిలో క్రైస్తవ చర్చీలే ముందున్నాయి. వాటిని మనం మితి లేకుండా ఉపయోగించుకున్నాము.” దాని తర్వాత, రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ద న్యూయార్క్ టైమ్స్ ఇలా చెప్పింది: “గతంలో ఆయా ప్రాంతాల బిషప్పులు వారి దేశాలు చేసే యుద్ధానికి అన్ని సందర్భాల్లోనూ మద్దతునిచ్చారు, ఈ దేశం వారు ఈ సైన్యం జయించాలని ప్రార్థనలు చేస్తే అవతలి దేశం వారు తమ విజయం కోసం ప్రార్థనలు చేశారు.”
అయితే, యేసుక్రీస్తు ప్రేమను అన్ని సందర్భాల్లోనూ కనపర్చాడు, అపొస్తలుడైన పౌలు వ్రాసినట్లు: “మీరు ఒకని నొకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితిరి.” (ఇటాలిక్కులు మావి.) (1 థెస్సలొనీకయులు 4:9) “యేసుక్రీస్తునందు నిజక్రైస్తవులందరూ సహోదర సహోదరీలే,” అని వాంకూవర్‌లోని సన్ అనే పత్రికా రచయిత గమనించాడు. “వారు ఎన్నడూ కావాలని ఒకరినొకరు నొప్పించుకోరు.”
స్పష్టంగా, ఈ రోజుల్లోని ప్రేమరాహిత్యానికి చర్చీలు చాలా బాధ్యతను వహించాలి. ఇండియా టుడే పత్రికలో ఒక శీర్షిక ఇలా తేల్చి చెప్పింది: “మతం పేరిటనే అత్యంత నీచమైన నేరాలు జరిగాయి.” అయితే, మన తరం ఈ విధంగా ఇతరులపట్ల కఠోరంగా ఉంటూ ఇలా తయారైందన్నదానికి ఒక ప్రాథమిక కారణం ఒకటి ఉంది.
ప్రేమ ఎందుకు చల్లారిపోయింది
మన సృష్టికర్త జవాబిస్తున్నాడు. మనం జీవిస్తున్న ఈ కాలాన్ని ఆయన వాక్యమైన బైబిలు “అంత్యదినముల”ని పిలుస్తుంది. ప్రజలు “అనురాగ రహితులు”గా ఉంటారని బైబిలు ప్రవచనం ఏ కాలాన్ని గురించైతే చెబుతుందో ఆ కాలం ఇదే. “యుగసమాప్తి” అని కూడా లేఖనాల్లో పిలువబడిన ఈ “అపాయకరమైన కాలములను” గురించి చెబుతూ “అనేకుల ప్రేమ చల్లారును” అని యేసుక్రీస్తు ముందే చెప్పాడు.—2 తిమోతి 3:1-5; మత్తయి 24:3,12.
కాబట్టి మనం ఈ లోకపు అంత్యదినాలలో జీవిస్తున్నాము అనడానికి ఉన్న రుజువులో నేటి ప్రేమరాహిత్యం ఓ భాగం. సంతోషకరంగా, ఈ దైవభక్తిలేని ప్రజల లోకం స్థానంలో త్వరలో ప్రేమ ఏలే నీతియుక్తమైన నూతన లోకం వస్తుందనే భావం కూడా ఈ రుజువుకు ఉంది.—మత్తయి 24:3-14; 2 పేతురు 3:7, 13.
కాని అలాంటి మార్పు సాధ్యమౌతుందని—మానవులందరూ ఒకరినొకరు ప్రేమిస్తూ, శాంతిసామరస్యాలతో జీవిస్తారు అని నమ్మేందుకు మనకు నిజంగా కారణముందా?