చాలామంది ఎందుకు రక్తం ఎక్కించుకోవడంలేదంటే
ఒకే దాత నుండి కలుషితమైన రక్తాన్ని ఎక్కించుకున్న ఇద్దరు వ్యక్తులకు హెచ్. ఐ. వి. సోకిందనీ, దీనికి బాధ్యురాలు కెనడాకు చెందిన రెడ్ క్రాస్ సంస్థేననీ ఓంటారియె కోర్టు ఆరోపించింది, అది ఆ తర్వాత ఒక మహత్తరమైన నిర్ణయంగా చెప్పబడింది. “రక్తం ఎక్కించుకున్నవారి జీవితాలకు కలుషిత రక్తం మూలంగా ముప్పువాటిల్లే ప్రమాదం ఉన్నప్పుడు దానికి వెంటనే ప్రతిస్పందించవలసిన అవసరం ఉంది” అని న్యాయమూర్తి స్టెఫెన్ బురన్స్ అన్నారు.
1980లలో, దాదాపు 1,200 మంది కెనడా దేశస్థులకు హెచ్. ఐ. వి. సోకింది, మరో 12,000 మందికి హెపటైటస్ సి సోకింది—వీళ్ళందరికీ కూడా కలుషితమైన రక్తం మరియు రక్త ఉత్పత్తుల మూలంగానే సోకింది. రోగాలు సోకే ప్రమాదాన్ని తగ్గించడానికి, దాతలను ఎంతో జాగ్రత్తగా పరీక్షించడం జరుగుతోంది. కాని దాతలందరూ కూడా తమ లైంగిక చరిత్రను యథార్థంగా వెల్లడి చేయరు. ఉదాహరణకు, ప్రతి 50 మందిలో ఒకరు స్వలింగ సంయోగం లేక వేశ్యలతో సంయోగం వంటి ప్రమాదకారకాల గురించి వెల్లడి చేయలేదని అమెరికాలో జరిగిన ఒక సర్వే తెలియజేసింది.
ఈ సందిగ్దావస్థకు తోడు, రక్త పరీక్ష లోపరహితమైనది కాదన్నది ఒక వాస్తవం. న్యూ సైంటిస్ట్ పత్రిక ప్రకారం, “ఒక వ్యక్తి హెచ్. ఐ. వి. సోకడానికి మూడు వారాలకు ముందు గనుక రక్తాన్ని దానం చేస్తే, ప్రస్తుతం చేయబడే రక్త పరీక్షలు ఆ వైరస్ను కనిపెట్టలేవు. హెపటైటస్ సి విషయంలోనైతే ఈ ‘విండో పీరియడ్’ (ఈ నిడివి కాలం) రెండు నెల్లకంటే ఎక్కువ ఉండవచ్చు.”
ఇటీవలి సంవత్సరాల్లో, కెనడా దేశస్థుల్లో రక్తం ఎక్కించుకోవడానికి గానీ రక్తం ఇవ్వడానికి గానీ సుముఖంగావున్న వారి సంఖ్య విశేషంగా తగ్గిపోయింది. “రక్తం ఇవ్వడానికి ఇష్టపడేవారి సంఖ్య తగ్గుతూ ఉండడం మూలంగానూ, రక్తం ఇవ్వలేని వారి సంఖ్య పెరుగుతూ ఉండడం మూలంగానూ, యెహోవాసాక్షులు రక్త ప్రత్యామ్నాయాల పరిశోధనలో అగ్రగాములుగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞతలు” అని పత్రికా రచయితయైన పాల్ షార్టస్ వ్రాశాడు.
ఇటీవలి సంవత్సరంలో, దాదాపు 40 మంది ప్రజలు “రక్తం ఎక్కించుకోవడం ఇష్టంలేక, కెనడా దేశ ఆసుపత్రుల్లోకి వచ్చి తాము యెహోవాసాక్షులమని అబద్ధం చెప్పుకున్నట్లు” ది టోరంటో స్టార్ నివేదించడం ఆసక్తికరమైన విషయం. దాదాపు 90 శాతంమంది కెనడా వాసులు ఇతరుల రక్తాన్ని ఎక్కించుకోవడం కంటే రక్త ప్రత్యామ్నాయాలనే ఇష్టపడుతున్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. కాబట్టి, రక్తం ఎక్కించుకోకపోవడమన్నది ఇక ఎంతమాత్రం కేవలం మతసంబంధమైన వివాదం మాత్రమే కాదు.