మా పాఠకుల నుండి
ప్రపంచ పరిశీలన నేనొక వార్తాపత్రిక సంస్థలో పనిచేస్తున్నాను. నాతోపాటు పనిచేసే వాళ్లలో చాలామంది తమ పనికి సంబంధించిన ఐడియాలను పొందడానికి “ప్రపంచ పరిశీలన” అనే కాలమ్‌ను చదవడానికి ఇష్టపడతారు. కొన్ని శీర్షికల్నిబట్టి నేను కూడా స్ఫూర్తి పొందానని ఒప్పుకుంటున్నాను. మీ అనువాదకులనూ, ఫ్రూప్‌రీడర్లనూ నేను విశేషంగా మెచ్చుకుంటాను. అలాంటి ఉన్నత ప్రమాణాలతో కూడిన భాష, వార్తా మాధ్యమాల్లో కన్పించడం అరుదు.
జె. బి., జెకియా
కొన్ని సంవత్సరాల క్రిందట నేను తేజరిల్లు! పత్రికను చదవడం ఆరంభించినప్పుడు, “ప్రపంచ పరిశీలన” అనే భాగాన్ని నేను అంతగా చదివి ఆనందించేవాడిని కాదు. దాన్ని నేనిప్పుడు ఎంతో సమాచారాన్ని అందించేదిగా పరిగణిస్తాను. నిజానికి, టీవీ వార్తా ప్రసారాల్లో నాకు కన్పించని ప్రపంచ సంఘటనలు అనేకం “ప్రపంచ పరిశీలన”లో చూశాను. మీరు చేస్తున్న మంచి పనిలో కొనసాగండి!
ఐ. కె. ఎమ్. సి., బ్రెజిల్
సలింగసంయోగం “బైబిలు ఉద్దేశము: సలింగసంయోగులను క్రైస్తవులు ద్వేషించాలా?” అనే శీర్షికవున్న తేజరిల్లు! జనవరి 8, 1998 సంచికను పొందినప్పుడు నేను ఎంతో థ్రిల్‌ను పొందాను. ఎంతో సున్నితమైన అంశం చక్కగానూ, సమతూకంగానూ నివేదించబడింది.
ఎల్. డబ్ల్యు., అమెరికా
విసుగు “మీకు పనంటే విసుగ్గా ఉందా?” అనే శీర్షిక ఉన్న ప్రతినొకదాన్ని మా సూపర్‌వైజర్‌కి ఇచ్చాను. (జనవరి 8, 1998) ఆ మరుసటి రోజు పని స్థలంలో, ఆ శీర్షిక చాలా బాగుందని ఆమె నాతో చెప్పింది. ఆమె ఆ పత్రికను మా తోటి పనివారిలో కొందరికి పంపించింది, మా లాంజ్‌లో ఆ శీర్షికవున్న ఒక ప్రతిని ఉంచింది. మీ శీర్షిక సరియైన సమయంలోనే ప్రచురించబడింది!
వి. ఎల్., అమెరికా
ఆసక్తికరమైన సమాచారాన్ని ప్రచురించినందుకు మీకు కృతజ్ఞతలు. నాకు 17 ఏళ్లు, నేను పూర్తికాల ఉద్యోగస్థురాల్ని. ఆ శీర్షిక నా పనిని మరింత ఆహ్లాదకరంగా ఎలా చేసుకోవాలో అనే విషయంపై చక్కటి సలహాల్ని ఇచ్చింది. థాంక్స్!
ఇ. ఎ., ఇటలీ
ఆ శీర్షికను ప్రచురించినందుకు చాలా థాంక్స్. అప్రెంటిస్ రెండవ సంవత్సరంలో నేను ఉన్నాను, నాలో నిరాసక్తత పేరుకుపోయివుంది. నా పనిని నేనిక ఆనందించేదాన్నికాను. నేను చేసే పనిలో మరలా ఆనందాన్ని కనుగొనేలా నాకు ఆ శీర్షిక సహాయపడింది.
ఐ. ఎఫ్., జర్మనీ
రేవ్స్ నాకు 19 ఏళ్లు, టెక్నో సంగీతాన్ని వినడంలో నేను నిజంగా ఆనందించేదాన్ని. “యౌవనస్థులు ఇట్లు అడుగుదురు . . . రేవ్స్ హానిరహితమైన సరదానా?” అనే శీర్షికను చదివి నేను ఎంతో ఆనందించాను. (జనవరి 8, 1998) నేను చూసినంతమట్టుకు, ఈ రకమైన సంగీతాన్ని గురించి ఉన్నదున్నట్టుగా వర్ణించిన మొట్ట మొదటి శీర్షిక ఇదే. “రేవ్స్ నిజంగా మీకు తగినవేనా?” అనే సెక్షన్ విషయంలో ముఖ్యంగా నేనెంతో కృతజ్ఞురాల్ని. ప్రశ్నల ద్వారా, లేఖనాల ద్వారా, సరళమైన, సహేతుకమైన నిర్ధారణకు వచ్చేలా నాకు సహాయం చేసింది.
ఎ. పి., స్లావెనియా