మొక్కల్లో వైవిధ్యాలు అంతరించిపోతున్నాయి—ఎందుకు?
చైనాలో, 1949లో దాదాపు 10,000 రకాలైన గోధుమల్ని సాగుచేసేవాళ్లు. అయితే, 1970ల నాటికి కేవలం 1,000 మాత్రమే ఉపయోగంలో ఉండేవి. అమెరికాలో, 1804 నుండి 1904ల మధ్య కాలంలో 7,098 రకాల ఆపిల్లను సాగుచేశారు, అందులో దాదాపు 86 శాతం ఉనికిలోలేకుండా పోయాయి. అంతేగాక, రిపోర్ట్ ఆన్ ది స్టేట్ ఆఫ్ ది వరల్డ్స్ ప్లాంట్ జెనిటిక్ రిసోర్సస్ ఫర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ప్రకారంగా, “కాబేజీల్లో 95 శాతం, మొక్కజొన్నల్లో 91 శాతం, బటాణీల్లో 94 శాతం, టొమోటాల్లో 81 శాతం ఉనికిలో లేకుండా పోయినట్టు కనబడుతోంది.” ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక దేశాల్లో ఇలాంటి గణాంకాలే నివేదించబడ్డాయి. ఎందుకింత అకస్మాత్తుగా కనుమరుగైపోతున్నాయి? ఆధునిక వాణిజ్యపరమైన సేద్యం వ్యాప్తి చెంది, తత్ఫలితంగా చిన్న చిన్న కమతాలు అంతరించిపోవడమే ముఖ్య కారణమని కొందరు చెబుతారు. చిన్న కమతాలు అంతరించిపోవడం మూలంగా సాంప్రదాయకమైన విభిన్నమైన పంటల్నీ, విభిన్నమైన మార్పిడి పంటల్నీ కోల్పోవాల్సి వచ్చింది.
విభిన్నమైన రకాల మొక్కలను కోల్పోవడం పంటల్ని అంతకంతకూ కోల్పోయేలా చేస్తుంది. ఉదాహరణకు, 1845-49లలో ఐర్లాండులో వచ్చిన గొప్ప బంగాళాదుంప క్షామాన్ని పరిశీలించండి. ఆ కాలంలో ఓ రకమైన మొక్క తెగులువచ్చి అనేకమైన బంగాళాదుంప పంటలు తుడిచిపెట్టుకుపోగా దాదాపు 7,50,000 మంది ప్రజలు క్షుద్బాధచే మరణించారు. ఈ విషాదకర సంఘటనకు దారితీసిన జీవశాస్త్రసంబంధమైన కారణం? “జెనిటిక్ యూనిఫార్మిటీ” అని ఐక్యరాజ్య సమితి నివేదిక చెబుతోంది.
మొక్కలకు సంబంధించిన జన్యు మూలాల్ని సేకరించి, భద్రపర్చేందుకు 1970లలో, 1980లలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1,000 జీన్ బ్యాంకులు నెలకొల్పబడ్డాయి. కానీ ఈ జీన్ బ్యాంకుల్లో అనేకం త్వరత్వరగా అంతరించిపోతున్నాయి, వాటిలో కొన్ని ఇప్పటికే మూసివేయబడ్డాయి. విత్తనాల్ని ఎక్కువ కాలం భద్రపర్చి, సంరక్షించడానికి అనువైన సౌకర్యాలున్న దేశాలు ఇప్పుడు దాదాపు 30 మాత్రమే ఉన్నాయని ఒక నివేదిక తెలియజేస్తోంది.
క్రీస్తు రాజ్యపాలనలో యెహోవా “సమస్తజనముల నిమిత్తము క్రొవ్వినవాటితో విందు చేయును. . . . మూలుగుగల క్రొవ్వినవాటితో విందుచేయును. మడ్డిమీది నిర్మలమైన ద్రాక్షారసముతో విందుచేయును.” (యెషయా 25:6) “సమస్త జీవులకు . . . ఆహారమిచ్చుచు”న్నవాడూ, జన్యుపరమైన వైవిధ్యతకు సృష్టికర్తా అయిన యెహోవా దేవుడు మానవుని ప్రతివిధమైన ఆహారావసరతల్ని తీరుస్తాడని మనమెంతగా కృతజ్ఞతలను కల్గివుండగలం!—కీర్తన 136:25; ఆదికాండము 1:29.