ప్రపంచ పరిశీలన
ఆస్ట్రేలియా అడవి ఒంటెలు
అనేక సంవత్సరాల క్రితం ఆస్ట్రేలియాలోని దుష్కరమైన మారుమూల ప్రాంతంలో టెలిగ్రాఫ్ లైన్‌నూ, రైల్వేనూ నిర్మించే పని కోసం ఒంటెలు దిగుమతి చేయబడ్డాయి. సహిష్ణుతగల ఈ జంతువుల స్థానంలో లారీలు వచ్చేసరికి, వాటి ఆఫ్ఘాన్ దేశస్థులైన యజమానులు వాటిని చంపకుండా అడవుల్లోకి వదిలేశారు. ఒంటెలు మరుభూమిగా ఉండే మధ్య ఆస్ట్రేలియాలో వర్థిల్లాయి. నేడు అక్కడ 2,00,000 ఒంటెలు దాకా కనిపిస్తాయి. ఒంటెలు విలువైన జాతీయ ఆస్తి కాగలవని కొందరు ప్రజలు ఇప్పుడు నమ్ముతున్నారని ద ఆస్ట్రేలియన్ అనే వార్తాపత్రిక నివేదిస్తుంది. ఒంటె మాంసాన్ని ఇప్పటికే మార్కెట్లో ప్రయోగించి చూశారు. అది బీఫ్‌లాగే మెత్తగా ఉంటుందనీ, క్రొవ్వు శాతం తక్కువనీ చెప్పబడుతుంది. ఇతర ఒంటె ఉత్పత్తుల్లో వాటి చర్మమూ, పాలూ, బొచ్చూ, వాటి క్రొవ్వూ ఇమిడివున్నాయి. వాటి క్రొవ్వు సబ్బు, మరితర సౌందర్యవర్ధక వస్తువుల తయారీలో ఉపయోగించబడుతుంది. సజీవ ఒంటెలకు కూడా డిమాండ్ ఉంది. మధ్య ఆస్ట్రేలియా ఒంటె పరిశ్రమకు చెందిన పీటర్ సైడల్, “మా దగ్గర రోగాల్లేని ఒంటెల మంద ఉన్నందువల్ల అనేక అంతర్జాతీయ జూలూ, పర్యాటకుల కొరకైన పార్కులూ ఆస్ట్రేలియా ఒంటెలను కావాలంటున్నాయి” అని అంటున్నాడు.
పాషాణ విషం
“దాదాపు 1.5 కోట్లమంది బంగ్లాదేశీయులు, కలకత్తాతో సహా మూడు కోట్ల మంది పశ్చిమ బెంగాల్ వాసులూ పాషాణ విషానికి గురౌతున్నారు” అని ద టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిస్తుంది. ఈ సమస్య హరిత విప్లవం యొక్క అనుకోని ఉప ఉత్పన్నం. పంట కాలువల కోసం లోతైన బావులను త్రవ్వినప్పుడు, భూమి అంతర్భాగంలో సహజంగా పేరుకునివున్న పాషాణం పైకి నీటిలోకి వచ్చింది. చివరికి అది మంచినీళ్ళ కోసం ఉపయోగించబడే బావుల్లోకి ప్రవేశించింది. అమెరికాలోని కొలొరాడో యూనివర్సిటీలోని పర్యావరణ నిపుణుడైన విల్లార్డ్ చాపల్ ఈ మధ్యే ఇలా బాధించబడిన ప్రదేశాలను సందర్శించి, ఈ సమస్యను “ప్రపంచంలో ఇంతవరకున్న వాటన్నింటిలోకెల్లా అత్యధిక విషపూరితమైన కేసు” అని వర్ణించాడు. 2,00,000 కన్నా ఎక్కువ మంది ఇప్పటికే, పాషాణ విషానికి సూచనగా చర్మంలో మార్పులను చూస్తున్నారు. “మనం (హరిత విప్లవం ద్వారా) ఆకలి సమస్యను పరిష్కరించి, ఆ పరిష్కార ప్రక్రియలో మరింత విషాదాన్ని సృష్టించినట్లు అనిపిస్తుంది” అని బంగ్లాదేశ్‌లోని ప్రభుత్వ అధికారియైన ఈషాక్ అలీ అన్నాడు.
దివాలా తీయడం సర్వసాధారణమైపోతోంది
1996లో, “12 లక్షల మంది అమెరికన్లు దివాలా తీసినట్లు ప్రకటించమని పెటిషన్ పెట్టుకున్నట్లు రికార్డు చేయబడింది, 1994 నుండి చూస్తే అలాంటి కేసుల్లో 44 శాతం పెరుగుదల కనిపిస్తోంది” అని న్యూస్‌వీక్ పత్రిక పేర్కొంటోంది. “దివాలాతీయడం ఎంత సాధారణమైపోయిందంటే, అది సిగ్గుచేటు విషయంగా భావించబడడమేలేదు” అని అది చెబుతుంది. దివాలాతీసే వైనం పెరగడానికి ఏమిటి కారణం? ఒక కారణమేమిటంటే, “దివాలా తీయడం మరో జీవన విధానంగా ఎంచుకోవచ్చన్న తలంపు మరింత అధికంగా అంగీకరించబడుతుందన్నదే” అని న్యూస్‌వీక్ చెబుతుంది. “దృక్పథంలో జరుగుతున్న ఈ మార్పు దురుపయోగానికి దారి తీస్తుందని ఋణదాతలు చెబుతున్నారు: దివాలా తీసినట్లు ప్రకటించబడాలని పెటిషన్ పెట్టుకునేవారిలో 45 శాతం మంది వారి అప్పులో చాలా భాగం తీర్చే స్తోమతగలవారేనని” ఆ పత్రిక చెబుతుంది. తాము ఋణపడివున్న అప్పు తీర్చాలన్న అభిలాషను ప్రదర్శించే బదులు, సిగ్గుపడే బదులు, ‘నాకు క్రొత్త ప్రారంభం అవసరం’ అని చాలా మంది అంటున్నారు. మరెంతో మంది వ్యక్తులూ, కార్పొరేషన్‌లూ దివాలాతీసే మార్గాన్ని ఎన్నుకుంటున్నారు, “మీ ఋణ బాధ్యతలను సాధ్యమైనంత త్వరగా, సులభంగా పరిష్కరించుకోండి!!” అని లాయర్లు చెప్పేవాటిపై శ్రద్ధ చూపుతున్నారు. ఆర్థిక అభివృద్ధి కలుగుతున్న కాలంలో దివాలాతీస్తున్నవారి సంఖ్య పెరుగుతుండగా, స్టాక్ మార్కెట్‌లో ధర పడిపోయివుంటే లేదా వాణిజ్య మాంద్యం కలిగివుంటే ఏమి జరిగేదో తలంచుకోవాలన్నా నిపుణులు భయపడుతున్నారు.
పనిచేస్తున్న తల్లులు
1991లో నేషనల్ అసోషియేషన్ ఆఫ్ వర్కింగ్ విమెన్ “1990ల మధ్య కాలానికి వచ్చేసరికి, స్కూల్‌కు వెళ్ళే వయస్సులేని పిల్లలుగల 65% మంది [అమెరికా] స్త్రీలూ, స్కూల్‌కు వెళ్ళే పిల్లలుగల 77% మంది స్త్రీలు పనికి చేరి ఉంటారు” అని అంచనా వేసింది. వాళ్ళ ప్రవచనం ఎంత కచ్చితమైనది? 1996 వచ్చేసరికి, అమెరికాలోని సెన్సస్ బ్యూరో ప్రకారం, ఐదేండ్ల కన్నా తక్కువ ప్రాయంగల పిల్లలున్న 63 శాతం మంది స్త్రీలు పనికి చేరారు అని ద వాషింగ్‌టన్ పోస్ట్ నివేదిస్తుంది. స్కూల్‌కెళ్ళే ప్రాయంగల పిల్లలున్న 78 శాతం మంది స్త్రీలూ పనిచేస్తున్న తల్లులే. యూరప్ విషయమేమిటి? యూరోపియన్ యూనియన్‌వారి స్టాటిస్టికల్ ఆఫీస్ సేకరించిన సమాచారం ప్రకారం, యూరప్ దేశాల్లో 1995వ సంవత్సరంలో, “5 నుండి 16 ఏండ్ల ప్రాయంగల పిల్లలుండీ పనిచేస్తున్న స్త్రీల అనుపాతం” పోర్చుగల్‌లో 69 శాతం, ఆస్ట్రియాలో 67 శాతం, ఫ్రాన్స్‌లో 63 శాతం, ఫిన్‌ల్యాండ్‌లో 63 శాతం, బెల్జియమ్‌లో 62 శాతం, బ్రిటన్‌లో 59 శాతం, జర్మనీలో 57 శాతం, నెదర్‌ల్యాండ్స్‌లో 51 శాతం, గ్రీస్‌లో 47 శాతం, లక్సమ్‌బర్గ్‌లో 45 శాతం, ఇటలీలో 43 శాతం, ఐర్లండ్‌లో 39 శాతం, స్పెయిన్‌లో 36 శాతం.
వినాశకరమైనటువంటి చేపలుపట్టే పద్ధతులు
చేపలు నిత్యమూ సంఖ్యలో తగ్గిపోతుండగా, వాణిజ్యపరంగా చేపలుపట్టే కంపెనీలు చేపలను సముద్ర అడుగుభాగాన వెదికే ఉపకరణంపై మూలధనాన్ని వెచ్చిస్తున్నాయి. సముద్ర అడుగుభాగానికి వెళ్ళే ఉపకరణం మొబైల్ గెయర్ అని పిలువబడుతుంది, అది సముద్ర నేల అడుగుభాగం వరకూ, 1,200 మీటర్ల దూరం మేరకు వెళ్ళి, మునుపు వదిలిపెట్టిన జాతుల ప్రాణులను పైకి తీసుకువస్తుంది. సమస్య ఏమిటంటే, ఆ ప్రక్రియలో అసంఖ్యాక “ట్యూబ్ వార్మ్‌లూ, స్పాంజీలు, ఆనీమోన్‌లూ, హైడ్రోజోన్‌లూ, అర్చిన్‌లూ, మరియు ఇతర సముద్ర జీవులూ” పట్టబడి, “వ్యర్థపదార్థాలుగా పారవేయబడుతున్నాయి” అని సైన్స్ న్యూస్ నివేదిస్తుంది. ఈ జంతువులను నాశనం చేయడం చేపలు తగ్గిపోవడానికి మరింత దోహదమౌతుంది. చిన్న చేపలకు ఆహారాన్నీ, ఆశ్రయాన్నీ ఇచ్చేది ఆ జంతువులే మరి. చేపలుపట్టే ఈ పద్ధతిలో సముద్ర జీవులను నాశనం చేయడాన్ని “దేశంలోవున్న అడవిలోని సమస్త వృక్షాలను నరికివేయడం”తో పోల్చవచ్చని అమెరికాలోని, వాషింగ్‌టన్‌లో, రెడ్‌మంట్ నగరంలో ఉన్న మరైన్ కన్సర్వేషన్ బయోలజీ ఇన్‌స్టిట్యూట్ డైరక్టరైన ఎలియట్ నొర్స్ చెబుతున్నారు.
జాగ్రత్తగల నకలువ్రాసేవారు
బైబిలులోని గ్రీక్ లేఖనాలలోని పాఠ్యభాగాలను అతీవ శ్రద్ధతో నకలుచేసి, గొప్ప జాగ్రత్తతో అందజేయడం జరిగిందని జర్మనీలోని మూన్‌స్టర్‌లో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఫర్ న్యూ టెస్టమెంట్ రిసెర్చ్ అధ్యక్షురాలైన డా. బార్బరా ఆలాండ్ అంటున్నారు. “తప్పులు లేదా దైవశాస్త్ర సంబంధంగా పురికొల్పబడిన మార్పులు అన్నవి చాలా అరుదుగా ఉన్నాయి” అని వెస్ట్‌ఫాలిషే నాక్రిక్‌టన్ నివేదిస్తుంది. 1959 మొదలుకొని, ఈ ఇన్‌స్టిట్యూట్ మధ్యయుగంనాటివి మొదలుకొని, ప్రామాణిక ప్రాచీన ప్రతుల వరకూ 5,000 కన్నా ఎక్కువ వ్రాతప్రతులను పరిశీలించింది. దాదాపు 90 శాతం వ్రాతప్రతులు మైక్రోఫిలిమ్‌పై రికార్డు చేయబడుతున్నాయి. తప్పులు జరగకుండా ఉండేందుకు బైబిలు నకలు వ్రాసినవాళ్ళు ఎందుకంత గొప్ప శ్రద్ధ తీసుకున్నారు? ఎందుకంటే, వాళ్ళు “తమను ‘నకలు వ్రాసేవారిగా’ ఎంచుకున్నారే తప్ప, రచయితలుగా ఎంచుకోలేదు” అని ఆ వార్తాపత్రిక చెబుతుంది.
పిల్లల కోసం పసితనంలోనే ఐ.క్యూ. పరీక్షలు
శిశువు మెదడు యొక్క అతి ప్రాముఖ్యమైన ఎదుగుదల ఘట్టం జననానికి ముందుటి నుండి మొదలుకొని, మూడు ఏండ్ల వయస్సు వరకని మానవుల మేధాశక్తిని అధ్యయనం చేస్తున్న శాస్త్రజ్ఞులు ఇప్పుడు నమ్ముతున్నారు. మానసిక ప్రేరణకు ప్రతిస్పందనగా, ఈ దశలోనే నరాల అనుబంధాలు శాశ్వతంగా స్థాపించబడతాయని కూడా తలంచబడుతుంది. అలా, కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు పోటీల్లో జయించేందుకు సహాయపడే ఉద్దేశంతో, కిండర్ గార్డన్‌లో చేరడానికి చాలా ముందే వారికి ఐ. క్యూ. పరీక్షలను ఇస్తున్నారు అని మోడర్న్ మెచూరిటీ నివేదిస్తుంది. అయినప్పటికీ, బోస్టన్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లోని పెడియాట్రిక్స్ విభాగం చైర్మన్ అయిన డా. బారీ సుకర్మన్ “సూపర్ బేబిగా” చేయాలనే ప్రయత్నంలో “తమ బిడ్డకు ప్రతి నిమిషం ‘ప్రేరేపణ కలిగించాలన్న’ ఒత్తిడికి గురవుతున్నట్లు” ఫీలయ్యే తల్లిదండ్రుల విషయంలో చింతను వ్యక్తం చేస్తున్నారు. పిల్లల మనశ్శాస్త్ర ప్రొఫెసర్ అయిన రిచార్డ్ వెయిన్‌బర్గ్ దానికి ఇలా జతచేస్తున్నాడు: “పోటీపడేందుకు పిల్లలను బలవంతం చేయడంవల్ల మొదటికే మోసమౌతుంది. మీ చిన్నారులు తమ బాల్యాన్ని ఆస్వాదించడానికి అనుమతించండి.”
ప్రపంచవ్యాప్త వననశీకరణ
“ఈ గ్రహం యొక్క మూడింట రెండవ వంతు అడవి ఇప్పటికే నిర్మూలమైపోయింది” అని జర్నల్ డా టార్డె నివేదిస్తుంది. భూమిమీది ఎనిమిది కోట్ల చదరపు కిలోమీటర్ల మేరకు ఉండిన అడవి ప్రదేశాల్లో కేవలం మూడు కోట్ల చదరపు కిలోమీటర్ల అడవి మాత్రమే ఇప్పుడు మిగిలి ఉంది. అడవులు ఎక్కువగా నిర్మూలమైంది ఆసియా ఖండంలోనేననీ, అక్కడ తొలుత ఉన్న పచ్చికబయళ్ళలో 88 శాతం నిర్మూలించబడిందనీ ప్రపంచ వన్యప్రాణుల నిధి (WWF) కనుగొనింది. అలా, యూరప్‌లో 62 శాతం, ఆఫ్రికాలో 45 శాతం, లాటిన్ అమెరికాలో 41 శాతం, ఉత్తర అమెరికాలో 39 శాతం అడవి నిర్మూలించబడింది. ప్రపంచంలోని అతిపెద్ద ఉష్ణమండల వర్షపాత అడవికి పుట్టినిల్లైన ఆమజోనియాలో ఇప్పటికీ దాని 85 కన్నా ఎక్కువ శాతం అడవి మిగిలి ఉంది. “మిగతా అడవుల్లో జరిగిన పొరపాట్లను పునరావృతం చేయకుండా ఉండే అవకాశం బ్రెజీల్‌కుంది” అని WWFలోని గ్యారో బ్యాట్‌మాన్యన్ చెబుతున్న విషయాన్ని ఒ ఎస్టాడొ డ సావున్ పావులూ ఉటంకిస్తోంది.
నిధులు దొంగిలించబడ్డాయి
“1991 పర్షియన్ గల్ఫ్ యుద్ధం మూలంగా, దోచుకోవడానికి అనువైన స్థితిలో విడిచిపెట్టబడిన మెసపటోమియా నిధులపై అంతర్జాతీయ నేరస్థుల గుంపులు కన్నువేశాయి” అని కెనడాలో ఇటీవల వెలువడిన వార్త ప్రకటించిందని వరల్డ్ ప్రెస్ రివ్యూ పత్రిక నివేదిస్తుంది. 1996లో, దొంగలు పట్టపగలే బాబిలోన్ మ్యూజియమ్‌లో జొరబడి, కూనిఫార్మ్ లిపిలో అక్షరాలు లిఖించబడిన స్తూపాకార మట్టిదిమ్మలను, శిలాఫలకాలను కైవశం చేసుకున్నారు. ఆ అరుదైన ప్రాచీన అవశేషాల్లో కొన్ని నెబుకద్‌నెజర్ II పరిపాలనకాలంనాటివి. అంతర్జాతీయ ఆర్ట్ మార్కెట్లలో వాటికి 7,35,000 డాలర్లకుపైగా విలువ ఉంటుందని అంచనావేయబడుతుంది. దొంగలు కన్నువేసిన మరో పురాతన నగరం ఆల్‌హాదర్. మిగిలిన నిధులను కాపాడే ప్రయత్నంలో ప్రభుత్వం ఆ నగరంలోని అన్ని ద్వారాలకూ, ప్రయాణ మార్గాలకూ ఇటికలతోనూ కల్వంతోనూ ముద్రవేసిందని ఆ పత్రిక చెబుతుంది.