కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • g98 4/8 పేజీలు 15-17
  • నేను స్కూల్లో మరింత సఫలీకృతుడనై ఉండగలనా?

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • నేను స్కూల్లో మరింత సఫలీకృతుడనై ఉండగలనా?
  • తేజరిల్లు!—1998
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • కొందరెందుకు అంచనాలను చేరుకోలేరు
  • ప్రేరణ పొందండి
  • మంచి పఠన అలవాట్లు
  • అనుకూల దృక్పథాన్ని కాపాడుకోండి
  • సమస్యలున్నా అభివృద్ధిచెందుతూ ఉండడం
  • తల్లిదండ్రులారా—మీ పిల్లలకు సలహాదారులై యుండండి
    తేజరిల్లు!—1994
  • స్కూలు అంటేనే నచ్చకపోతే?
    యువత అడిగే ప్రశ్నలు
తేజరిల్లు!—1998
g98 4/8 పేజీలు 15-17

యౌవనస్థులు ఇట్లడుగుదురు

నేను స్కూల్లో మరింత సఫలీకృతుడనై ఉండగలనా?

“మా అమ్మానాన్నలకు ర్యాంకులే సమస్తం. ‘నీకు లెక్కల పరీక్షలో ఎన్ని మార్కులొచ్చాయ్‌? ఇంగ్లీష్‌లో నువ్వెన్ని మార్కుల్ని తెచ్చుకున్నావ్‌?’ అలా అడగడం నాకస్సలు ఇష్టముండదు!”—13 ఏళ్ల సామ్‌.

సామ్‌ మాత్రమేగాక ఆ స్థితిలో ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారు. నిజానికి, “బాగా చేయగలరు” (ఆంగ్లం) అనే పుస్తక రచయితలు ఇలా రాశారు: “స్కూల్లో మా బాబు/పాప తన సామర్థ్యానికి తగ్గట్టుగా చేస్తున్నాడని/చేస్తోందని తమ బిడ్డను గురించి తలంచే తండ్రిని/తల్లిని మేమింతవరకూ కలుసుకోలేదు.” సామ్‌లాంటి అనేకమంది పిల్లలు, తమ తల్లిదండ్రులు తమను స్కూలువర్క్‌లో ప్రగతిసాధించమనీ, బహుశా అత్యుత్తమ ప్రతిభను కనపర్చమనీ భరించలేనంత ఒత్తిడిని తమపై పెడుతున్నారని భావిస్తారు. వాళ్లు క్లాస్‌రూమ్‌లో అధిక ఒత్తిడిని ఎదుర్కొంటుండవచ్చు. “టీచర్లకు తగినంత ఓపికలేదు” అని ఒక టీనేజర్‌ ఫిర్యాదు చేస్తున్నాడు. “చెప్పిన వెంటనే విషయాల్ని గుర్తుంచుకోవాలని వాళ్లనుకుంటారు, అలా గుర్తుంచుకోలేకపోతే, మిమ్మల్ని మీరు ఒట్టి శుంఠలా భావించుకునేలా చేస్తారు. కాబట్టి నేను గుర్తుంచుకోడానికి కూడా ప్రయత్నించను.”

తల్లిదండ్రుల, టీచర్ల అంచనాలకు తగ్గట్టుగా ఉండలేకపోయిన పిల్లలు, తరచూ అలా పిలువబడతారు. ఏదో ఒక స్థాయిలో దాదాపుగా విద్యార్థులంతా వాళ్లపై పెట్టుకొన్న అంచనాలను చేరుకోలేనివారిగానే ఉంటారు. ఎందుకు? సోమరితనమో లేక నేర్చుకొనే సామర్థ్యం లేకపోవడమో మాత్రమే అన్నివేళలా కారణం కాదనే విషయం ఆసక్తికరమైంది.a

కొందరెందుకు అంచనాలను చేరుకోలేరు

నిజమే, స్కూలువర్క్‌ విషయానికి వచ్చేటప్పుడు, బొటాబొటి మార్కులతోనే సంతృప్తిపడడానికి మొగ్గుచూపించే పిల్లలు కొంతమంది ఉన్నారు. “పెద్దగా ప్రయత్నించకుండా సఫలీకృతుడ్నికాగలిగితే, నేనలాగే చేస్తాను” అని పదిహేనేళ్ల హెర్మన్‌ ఒప్పుకుంటున్నాడు. నిజాయితీగా చెప్పాలంటే, ఈ పిల్లలంతా నేర్చుకోవడం విషయంలో ఉదాసీనవైఖరిని కల్గివున్నవాళ్లు కారు. బహుశా వారిని ఏదైనా ఒక సబ్జెక్టు ఆకట్టుకొని ఉండకపోవచ్చు. అయితే, తాము నేర్చుకుంటున్న వాటి ఆచరణాత్మక విలువను గ్రహించడం కష్టంగావున్న విద్యార్థులు కొందరున్నారు. 17 ఏళ్ల వాడైన రూబేన్‌ ఇలా వ్యక్తపర్చాడు: “స్కూలు చదువు పూర్తైపోయిన తర్వాత నేను మరలా ఎన్నడూ ఉపయోగించబోని సబ్జెక్టులు ఉన్నాయని నాకు రూఢిగా తెలుసు.” శ్రద్ధలేకపోవడంగానీ లేక ప్రేరణలేకపోవడంగానీ అంచనాల్ని చేరుకోకుండా చేయగలవు.

ఇతర కారకాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు, మీరు గ్రహించలేనంత వేగంగా టీచరు చెప్పుకుంటూ పోతే, మీరు నిస్పృహకు గురౌతారు. మరదే గనుక నత్తనడకలా సాగితే, మీకు బోరెత్తుతుంది. మీరు స్కూల్లో ఎంత బాగా చదువుకుంటారనే విషయాన్ని స్నేహితుల ఒత్తిడి కూడా ప్రభావితం చేస్తుంది. కిడ్స్‌ హు అండర్‌ అచీవ్‌ పుస్తకం ఇలా వివరిస్తోంది: “తెలివైనవాడూ, విద్యార్జనా సామర్థ్యంగలవాడూ అయిన కుర్రవాడు విద్యనార్జించాలనే తపనలేని జతగాళ్లగుంపుచే అంగీకరించబడాలని కోరుకుంటుంటే, బహుశా అతడు తనపై ఉన్న అంచనాల్ని చేరుకోకుండా ఉండేలా ఒత్తిడి చేయబడతాడు.” అందుకే, ఒక టీనేజర్‌ తాను స్కూల్లో చేరిన తొలి సంవత్సరాల్లో బాగా కష్టపడి చదువుకొన్నప్పుడు, ఇతరులు కుళ్లుకొని, తనని గేలీ చేసేవారని ఫిర్యాదు చేశాడు. అవును, సామెతలు 14:17, NWలో ఉన్న సూత్రం యొక్క వాస్తవికతను ఒక పిల్లవాడు ఎదుర్కోవాల్సి రావచ్చు: “ఆలోచనా సామర్థ్యాలుగల వ్యక్తి ద్వేషించబడతాడు.”

కొన్నిసార్లు, అంచనాల్ని చేరుకోకపోవడానికి మూల కారణాలు మరింత సంక్లిష్టమైనవి. కొంతమంది పిల్లలు తమపట్ల తాము ఓ ప్రతికూలమైన ఇమేజ్‌ను పెంచుకుంటూ ఎదగడం విచారకరమైన విషయం. పిల్లవాడ్ని అదేపనిగా ముద్దపప్పు, మూర్ఖశిఖామణి లేక, సోమరిపోతు అనేటువంటి నిర్దయతోకూడిన మారుపేర్లని పెట్టి పిలువడమనేది దీనికి దారితీయవచ్చు. అలాంటి బిరుదులే ఎదురుచూడని రీతిలో వాస్తవాలై కూర్చునే అవకాశం ఉంది. ఒక డాక్టరుగారు చెప్పినట్లుగా, “మిమ్మల్నెవరైనా శుద్దమొద్దని పిలిస్తే, మరి మీరు నిజమేనేమోనని దాన్ని నమ్మితే, మీరు అలాగే ప్రవర్తిస్తారు.”

చాలాసార్లు తల్లిదండ్రులూ టీచర్లూ చేసే ఎత్తిపొడుపులు సదుద్దేశంతో కూడినవే. అయినప్పటికీ, తమ నుండి మరీ ఎక్కువగా అపేక్షించబడుతుందని పిల్లలు తలంచవచ్చు. మీ విషయంలో అదే గనుక నిజమైతే, మీ అమ్మానాన్నలూ, టీచర్లూ మిమ్మల్ని అప్‌సెట్‌ చేయడానికి ప్రయత్నించడంలేదని నమ్మికను ఉంచండి. వాళ్లు మీ శక్తి సామర్థ్యాల్ని పూర్తి స్థాయిలో ఉపయోగించే స్థాయికి ఎదగాలని బహుశా కోరుకుంటుండవచ్చు. అయినా, యోగ్యతల్ని చూపించుకోవాలనే చింత, ఎందుకొచ్చిన చదువులే అని మీరు భావించేలా చేయవచ్చు. అయితే ధైర్యం వహించండి: మీరు స్కూల్లో సఫలీకృతులు కాగలరు.

ప్రేరణ పొందండి

మొదటి చర్య ఏమిటంటే ప్రేరణ పొందడమే! ప్రేరణ పొందడానికి, మీరు ఎందుకు నేర్చుకొంటున్నారనే విషయాన్ని గ్రహించడం అవసరం. బైబిలు ఇలా చెబుతోంది: “దున్నువాడు ఆశతో దున్నవలెను, కళ్లము త్రొక్కించువాడు పంటలో పాలుపొందుదునను ఆశతో త్రొక్కింపవలెను.” (1 కొరింథీయులు 9:10) కొన్ని సబ్జెక్టుల్ని ‘దున్నడం’లో ఉన్న విలువను గ్రహించడం, అన్నివేళలా సులభమైన విషయం కాదు. ఉదాహరణకు, ‘నేను కంప్యూటర్‌ ప్రోగ్రామర్ని కావాలనుకుంటున్నాను గనుక, చరిత్రను నేనెందుకు చదవాలి?’ అని మీరు అనవచ్చు.

నిజమే, మీ స్కూలు విద్యాప్రణాళికలో ఉన్న ప్రతీదీ అవసరమైనదిగా—కనీసమిప్పట్లో కన్పించకపోవచ్చు. కానీ దూరదృష్టి కల్గివుండడానికి ప్రయత్నించండి. రకరకాల సబ్జెక్టులతో కూడిన మామూలు విద్యాభ్యాసం, మీ చుట్టూ ఉన్న లోకం విషయంలో మీకున్న అవగాహనను పెంచుతుంది. యెహోవాసాక్షుల్లో ఉన్న అనేకమంది పిల్లలు తమను వేర్వేరు జీవనగతులకు చెందిన ప్రజలకు రాజ్యసందేశాన్ని అందించడంలో బహుముఖ ప్రజ్ఞావంతుల్ని చేస్తూ ‘అందరికి అన్నివిధముల వారిగా’ తయారయ్యేలా సమగ్ర విద్యాభ్యాసం సహాయపడిందని వాళ్లు కనుగొన్నారు. (1 కొరింథీయులు 9:22) ఒక సబ్జెక్టు ఆచరణాత్మక విలువలేనిదిగా కన్పించినప్పటికీ, దానిపై మీరు అదుపు సాధించడం మూలంగా ప్రయోజనాన్ని పొందుతారు. కొంతలో కొంతైనా, మీరు మీ ‘ఆలోచనా సామర్థ్యాన్ని’ అంటే భవిష్యత్తులో మీకెంతగానో ఉపయోగపడబోయే ఆలోచనా సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు.—సామెతలు 1:1-4, NW.

స్కూలు, మీలో మరుగునపడి ఉన్న టాలెంట్లను వెలికితీయడానికి కూడా తోడ్పడగలదు. అపొస్తలుడైన పౌలు తిమోతికి ఇలా రాశాడు: “నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలె[ను].” (2 తిమోతి 1:6) తిమోతి క్రైస్తవ సంఘంలో ప్రత్యేకమైన సేవ నిమిత్తం నియమించబడ్డాడు. కానీ ఆయన దాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది, లేకపోతే దేవుడు ఆయనకు అనుగ్రహించిన సామర్థ్యం అంటే ‘కృపావరం’ నిద్రాణంగా ఉండి వృథా అయిపోతుండవచ్చు. తిమోతికిచ్చిన కృపావరంలా, మీ స్కూల్‌ సామర్థ్యాలు దేవుడు ప్రత్యక్షంగా ఇచ్చినవి కావనుకోండి. అయినా, మీకున్న సామర్థ్యాలు కళకు సంబంధించినవైనా, సంగీతానికి సంబంధించినవైనా, లెక్కలకు సంబంధించినవైనా, సైన్సుకు సంబంధించినవైనా లేకపోతే మరితర రంగాలకు సంబంధించినవైనా సరే, అవి మీకు ప్రత్యేకమైనవి. మరి అలాంటి కృపావరాల్ని కనుగొని, వాటిని పెంపొందించుకొనే విషయంలో స్కూలు మీకు సహాయపడగలదు.

మంచి పఠన అలవాట్లు

అయితే, స్కూలు నుండి వీలైనంత ఎక్కువగా ప్రయోజనాన్ని పొందేందుకు, మీకు మంచి పఠన కార్యక్రమం అవసరమౌతుంది. (పోల్చండి ఫిలిప్పీయులు 3:16, NW.) తగినంత మోతాదులో ఉన్న సమాచారాన్ని కవర్‌ చేయడానికి సరిపడేంత సమయాన్ని షెడ్యూల్‌ వేసుకోండి, కానీ మీలో పునరుత్సాహం కల్గేలా అప్పుడప్పుడూ బ్రేక్‌ ఇస్తూండండి. మీ పఠనంలో చదవడం చేరివుంటే, మీరు చదవబోయే సమాచారాన్ని సంగ్రహంగా తెలుసుకోగల్గేలా మొదట మీ సమాచారాన్ని సర్వే చేయండి. తర్వాత, అధ్యాయం పేర్లపైనో లేక మెయిన్‌ హెడ్డింగ్‌లపైనో ఆధారపడిన ప్రశ్నల్ని తయారు చేసుకోండి. ఆపై, మీరు తయారు చేసుకొన్న ప్రశ్నలకు జవాబుల కోసం చూస్తూ చదవండి. చివరగా, మీరు నేర్చుకొన్నదాన్ని గుర్తుకు తెచ్చుకొని అప్పజెప్పగలరేమో చూడండి.

మీకు అప్పటికే తెలిసివున్న సమాచారంతో మీరు నేర్చుకొన్నదాన్ని ముడిపెట్టండి. ఉదాహరణకు, ఏదైనా సైన్సు కోర్సు దేవుని ‘అదృశ్యలక్షణాల్ని . . . తేట’గా చూసే ఒక గవాక్షంగా కాగలదు. (రోమీయులు 1:20) “యెహోవా, తమ మార్గము నేర్పరచుకొనుట నరులవశములో లేదనియు, మనుష్యులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదనియు నేనెరుగుదును” అనే వ్యాఖ్యానంలో ఉన్న సత్యసంధతను మీకుగా మీరు రుజువుపర్చుకునేలా హిస్టరీ (చరిత్ర) సహాయపడగలదు. (యిర్మీయా 10:23) పఠించడంలో మీరు శ్రద్ధాసక్తుల్ని చూపిస్తుండగా, నేర్చుకోవడమనేది సులభతరమైనట్టూ—మరింత ఆహ్లాదకరమైనదైనట్టూ మీరు కనుగొంటారు! సొలొమోను ఇలా గమనించాడు: “తెలివిగలవానికి జ్ఞానము సులభము.”—సామెతలు 14:6.

అనుకూల దృక్పథాన్ని కాపాడుకోండి

అయితే, కొన్నిసార్లు మనపై ఉన్న అంచనాల్ని చేరుకోలేకపోవడమనేది స్నేహితుల ఎంపికకు సంబంధించినదై ఉంది. మీ స్నేహితులు లక్ష్యసిద్ధిని ప్రోత్సహిస్తారా, లేకపోతే వాళ్లు తమపై ఉన్న అంచనాల్ని నీరుగార్చేసే వ్యక్తులా? ఒక బైబిలు సామెత ఇలా అంటోంది: “జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.” (సామెతలు 13:20) కాబట్టి మీ సహవాసుల్ని జ్ఞానయుక్తంగా ఎంపికచేసుకోండి. స్కూలు విషయంలో అనుకూల దృక్పథాన్ని కల్గివున్న వాళ్ల సహవాసాన్ని భద్రపర్చుకోండి. మీ ర్యాంకులను మెరుగుపర్చుకోవాలనే మీ లక్ష్యం గురించి మీ టీచరుతో స్వయంగా మాట్లాడడానికి సంశయించకండి. మీరలా మెరుగుపర్చుకొనేలా మీకు సహాయం చేయడానికి మీ టీచరు నిస్సందేహంగా అదనపు కృషిచేస్తారు.

మీ సామర్థ్యాల్ని గూర్చిన ప్రతికూల అభిప్రాయాలు చుట్టుముట్టినప్పుడు, అపొస్తలుడైన పౌలు మాదిరిని పరిశీలించండి. ఆయన మాట్లాడే సామర్థ్యాన్ని ప్రజలు విమర్శించినప్పుడు, ఇలా ప్రత్యుత్తరమిచ్చాడు: “మాటల యందు నేను నేర్పులేనివాడనైనను జ్ఞానమందు నేర్పులేని వాడను కాను.” (2 కొరింథీయులు 10:10; 11:6) అవును, పౌలు తన బలహీనతలపైగాక (అసమర్థతలపైగాక) బలీయమైనవాటిపై (సామర్థ్యాలపై) కేంద్రీకరించాడు. మీ సామర్థ్యాలేవి? మీరు వాటిని గుర్తించలేకపోతే, మీకు మద్దతునిచ్చే వ్యక్తితో మీరెందుకు మాట్లాడకూడదు? అలాంటి స్నేహితుడు మీ సామర్థ్యాల్ని గుర్తించేలా మరి వాటి నుండి పూర్తి ప్రయోజనాన్ని పొందేలా మీకు సహాయపడగలడు.

సమస్యలున్నా అభివృద్ధిచెందుతూ ఉండడం

“నీ అభివృద్ధి అందరికి తేటగా కనబడేలా నీ పూర్తి అవధానాన్నీ, శక్తియుక్తుల్నీ వీటిపై ఉంచు.” (1 తిమోతి 4:15, ఫిలిప్స్‌) తండ్రి తన కొడుకుతో మాట్లాడుతున్నట్టుగా పౌలు అప్పటికే తన పరిచర్యలో సఫలీకృతుడైన తిమోతీని మరింత పురోభివృద్ధి చెందాలని ప్రోత్సహించాడు. బైబిలు కాలాల్లో “అభివృద్ధి” అనే గ్రీకు క్రియాపదానికి అక్షరార్థంగా “ఛేదించుకుంటూ సాగమని” అర్థం. ఇది ఎవరో తమ దారికి అడ్డువచ్చిన తుప్పల్ని నరుక్కుంటూ పోతున్నారనే తలంపును గుర్తుకు తెస్తుంది. కొన్నిసార్లు, స్కూల్లో ఒక్కో తరగతిని దాటుకుంటూ రావడం దాన్ని పోలి ఉన్నట్టు అనిపిస్తుంది. తుది ఫలితం యోగ్యమైనదని మీరు భావిస్తే, స్కూలు చదువుకైన మార్గాన్ని సుగమం చేసుకోవడం మరింత సులభమౌతుంది.

కృషీ, ప్రేరణా, అలాగే నేర్చుకోవడం అనేవి చేయీ చేయీ కలుపుకొని వెళతాయి. ఉదాహరణకు: సంగీత వాయిద్యాన్ని వాయిస్తున్న ఒక వ్యక్తిని గురించి ఆలోచించండి. తాను వాయించడంలో ఆనందాన్ని అనుభవిస్తే, మరింత ఎక్కువగా వాయిస్తాడు. ఎంత బాగా వాయిస్తే, అంత బాగా పరిచయాన్ని కల్గివుంటాడు, తిరిగది అతని ఆనందాన్ని అధికం చేస్తుంది. మనమెంత నేర్చుకుంటే, నేర్చుకోవడం అంత సులభమౌతుంది. కాబట్టి మీ స్కూలువర్క్‌ని చూసి నిరుత్సాహపడకండి. అవసరమైన కృషి చేయండి, పెంపొందించుకునేందుకు సహాయపడే వారితో సహవసించండి, ప్రాచీనకాల రాజైన ఆసాకు అజర్యా చెప్పిన మాటల్ని హృదయంలోకి తీసుకోండి: “మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును.”—2 దినవృత్తాంతములు 15:7.

[అధస్సూచి]

a ఈ విషయంలో, నేర్చుకోవడానికి సంబంధించిన అశక్తతలు ఉన్న పిల్లలు ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కోవచ్చు. మరింత సమాచారం కొరకు తేజరిల్లు! జూలై 8, 1996, 26-28 పేజీలను చూడండి.

[16వ పేజీలోని చిత్రం]

మీ ర్యాంకులను మెరుగుపర్చుకోవాలనే మీ లక్ష్యం గురించి మీ టీచరుతో స్వయంగా మాట్లాడడానికి సంశయించకండి

[17వ పేజీలోని చిత్రం]

ఒక సబ్జెక్టు ఆచరణాత్మక విలువలేనిదిగా కన్పించినప్పటికీ, దానిపై మీరు అదుపు సాధించడం మూలంగా ప్రయోజనాన్ని పొందుతారు

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి